অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పరిశుభ్రత

పరిశుభ్రత

పరిశుభ్రత అనే అంశంపై సమాచారం తెలుసుకొని, పాటించటం ఎందుకు ముఖ్యమంటే-- చిన్నపిల్లలకు వచ్చే అనారోగ్యాలు, మరణాల్లో సగానికి పైగా వారు క్రిమి కీటకాలను మింగటం వల్లనే వస్తున్నాయి. ఈ క్రిమి కీటకాలు వారి నోటి నుంచి ఆహారం లేదా నీరు లేదా మురికి చేతుల ద్వారా వారి కడుపులోకి వెళతాయి. ఈ క్రిమికీటకాల్లో ఎక్కువ శాతం మానవ, జంతు మలం నుంచి వస్తాయి. చాలా అనారోగ్యానికి, ముఖ్యంగా డయేరియా (నీళ్ల విరేచనాలు) ను చక్కని పరిశుభ్రమైన అలవాట్లతో నివారించవచ్చు. మలాన్ని మరుగుదొడ్డి (టాయిలెట్ / ల్యాట్రిన్) లోనే వేయటం, మల విసర్జన తర్వాత లేదా పిల్లల మలాన్ని తాకిన తర్వాత తర్వాత చేతులను సబ్బుగానీ బూడిదతో గానీ బాగా రుద్ది నీటితో శుభ్రంగా కడుక్కోవటం. పిల్లలకు ఆహారం తినిపించే ముందు లేదా ఆహారాన్ని ముట్టుకునే ముందు కూడా ఇదే విధంగా చేతులను బాగా కడుక్కోవటం. జంతువుల మలాన్ని ఇంటికి దూరంగా నడిచే బాటకు, బావులు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలకు దూరంగా తొలగించాలి. ఊరు, వాడలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసే మరుగుదొడ్లు నిర్మించి , ఉపయోగించాలి. నీటి వనరులను కాపాడుకోవాలి. వృధా నీటిని, చెత్తా చెదారాన్ని సురక్షితంగా తొలగించాలి. ప్రజలు తక్కువ ఖర్చుతో మరుగుదొడ్లు నిర్మించుకొనే సౌకర్యాల గురించి తెలియజెప్పటం ప్రభుత్వ బాధ్యత. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, మెరుగైన మంచి నీటి సరఫరా, చెత్తను పోగుచేయటం లాంటి పనులకు ప్రభుత్వ సహాయం అవసరం.

ముఖ్య సందేశాలు :

పరిశుభ్రత గురించి ప్రతి కుటుంబము, సమాజం ఏమేం తెలుసుకునే హక్కు కలిగి ఉన్నాయి.

  1. మలాన్ని సురక్షితంగా తొలగించాలి. మరుగు దొడ్డిని ఉపయోగించటం ఇందుకు శ్రేయస్కరం.
  2. కుటుంబంలో పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ మలాన్ని తాకిన తర్వాత లేదా ఆహారాన్ని ముట్టుకునే ముందర పిల్లలకు ఆహారం తినిపించే ముందు తమ చేతులను సబ్బు, నీటితో గానీ లేదా బూడిద, నీటితో గానీ బాగా శుభ్రంగా కడుక్కోవాలి.
  3. ప్రతి రోజూ ముఖాన్ని సబ్బుతో కడుక్కోవటం వల్ల కంటికి సంక్రమణ జబ్బు (ఇన్ ఫెక్షన్) రాకుండా నివారించటానికి సహాయపడుతుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో, కంటికయ్యే ఇన్ ఫెక్షను అంధత్వాన్ని కలిగించే “ట్రకోమా” అనే వ్యాధికి దారి తీస్తుంది.
  4. సురక్షితమైన వనరు నుంచి తీసిన లేదా పరిశుద్ధం చేసిన నీటిని మాత్రమే ఉపయోగించండి. నీటిని నిల్వ చేసిన బిందెలు, ఇతర పాత్రలను మూతతో కప్పిపెట్టడం ద్వారా ఆ నీటి శుభ్రతను కాపాడండి.
  5. పచ్చివి లేదా వదిలేసిన ఆహారం ప్రమాదకరం. పచ్చి కూరలు, ఇతర మూల పదార్థాలను బాగా కడగాలి. లేదా ఉడకబెట్టాలి. వండిన ఆహారాన్ని జాప్యం చేయకుండా వెంటనే తినాలి లేదా దాన్ని మళ్లీ వేడి చేసి తినాలి.
  6. ఆహారం, వంటపాత్రలు, వంట తయారు చేసే నేలను పరిశుభ్రంగా ఉంచాలి. మూతలు పెట్టిన పాత్రల్లోనే ఆహారాన్ని నిల్వ చేయాలి.
  7. ఇంట్లోని నిరర్థకాలన్నీ సురక్షితంగా తొలగించి వేయటం ద్వారా అస్వస్థతను నివారించవచ్చు.

ముఖ్య సందేశాలు - 1

మలాన్ని సురక్షితంగా తొలగించాలి. (నిర్మూలించాలి). ఇందుకు మరుగుదొడ్డిని ఉపయోగించటం ఉత్తమం. అనేక రకాల జబ్బులు, ముఖ్యంగా డయేరియా , మానవ మలంలో కనిపించే కీటకాల కారణంగా వస్తాయి. ఈ కీటకాలు (క్రిములు) ఒకవేళ నీటిలోకి గానీ ఆహారంలోకి గానీ, చేతుల పై, వంటపాత్రలు లేదా వంట తయారీ నేలపైకు చేరితే వాటిని మింగి వేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా డయేరియా కలుగుతుంది. ఈ క్రిములు వ్యాప్తి చెందకుండా నివారించే ఏకైక ముఖ్యమైన కార్యచరణ సూత్రం ఏమిటంటే - మానవ మరియు జంతు మలాలను సురక్షితంగా నిర్మూలించటం. మానవ మలాన్ని మరుగుదొడ్డి ద్వారా తొలగించాలి. ఈ మరుగు దొడ్డిని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలి. జంతువుల మలాన్ని ఇళ్లు, బాటలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, నీటి వనరులకు దూరంగా నిర్మూలించాలి. మరుగుదొడ్డిని ఉపయోగించే సౌలభ్యం లేకపోతే, ప్రతి ఒక్కరూ మల విసర్జన కోసం ఇళ్లు, బాటలు, నీటి వనరులు, పిల్లలు ఆడుకునే స్థలాలకు దూరంగా వెళ్లాలి. విసర్జన తర్వాత వెంటనే మలంపై ఒక పొర మందం మట్టిని కప్పి పూడ్చివేయాలి. శిశువులవైనా సరై, అన్ని మలాలు క్రిములు కలిగి ఉంటాయి. కనుక అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఒకవేళ పిల్లలు మరుగుదొడ్డిని ఉపయోగించకపోతే, వారు బయట విసర్జించిన మలాన్ని వెంటనే ఎత్తి మరుగు దొడ్డిలో వేయాలి లేదా పూడ్చి వేయాలి. మరుగు దొడ్లను తరచూ శుభ్రపరచాలి. మరుగు దొడ్డి (ల్యాట్రిన్) పైన కప్పి పెట్టాలి. టాయిలెట్ (మూత్రశాల) ను నీటి ఉధృతి (ఫ్లష్) తో శుభ్రపరచాలి. స్థానిక (సంస్థలు) ప్రభుత్వాలు, స్వస్ఛంద సంస్థలు ఊరు, వాడల్లో ప్రజలు మరుగు దొడ్లు నిర్మించుకోవటానికి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డిజైన్లు ఇచ్చి సహాయపడాలి.

ముఖ్య సందేశాలు - 2

కుటుంబంలో పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ మలాన్ని తాకిన తర్వాత లేదా ఆహారాన్ని ముట్టుకునే ముందర, పిల్లలకు ఆహారం తినిపించే ముందు తమ చేతులను సబ్బు, నీటితో గానీ లేదా బూడిద, నీటితో గానీ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. చేతులను సబ్బు, నీటితో లేదా బూడిద, నీటితో కడుక్కోవటం వల్ల క్రిములు తొలగిపోతాయి. కేవలం నీటిలో మాత్రమే చేతి వేళ్లను అడిస్తే సరిపోదు. సబ్బు లేదా బూడిదతో రెండు చేతులను కలిసి రుద్దాలి. అప్పుడే క్రిములు గానీ, మురికి గానీ ఆహారంలోకి లేదా నోట్లోకి వెళ్లకుండా ఆపుతుంది. చేతులను కడుక్కోవటం వల్ల పురుగుల నుంచి వచ్చే ఇన్ ఫెక్షన్లను నిరోధించవచ్చు. సబ్బు లేదా బూడిద, నీటిని మరుగు దొడ్డి వద్ద అందుబాటులో ఉంచాలి.

  • ముఖ్యంగా పెద్దలు మల విసర్జన తర్వాత మరియు మల విసర్జన ముందు మరియు పిల్లలకు తినిపించటానికి ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు ఎల్లప్పుడూ చేతులు కడుక్కోవాల్సిందిగా పిల్లలకు బోధించాలి, నేర్పించాలి. తద్వారా వారికి జబ్బులు రాకుండా కాపాడాలి.
  • పిల్లలు తరచూ తమ చేతులను నోట్లో పెట్టుకుంటారు. కనుక, వారి చేతులను ఎల్లప్పుడూ, ముఖ్యంగా వారు మురికిలో ఆడినప్పుడు లేదా జంతువులతో ఆడినప్పుడు శుభ్రంగా కడగాలి.
  • పిల్లలకు పురుగులు (క్రిములు) నుంచి త్వరగా ఇన్ ఫెక్షన్ కలుగుతుంది. దీనివల్ల వారి శరీరంలోని పోషకాలు తగ్గిపోతాయి. పురుగులు, వాటి గుడ్లు మానవ, జంతు మలం, మూత్రంలో ఉంటా.యి

ఉపరితలనీరు, మట్టి, సరిగా ఉడకని మాంసంలో కూడా ఈ పురుగులు వాటి గుడ్లు కనిపిస్తాయి, మరుగు దొడ్లు, మూత్రశాలల వద్ద, మల విసర్జన ప్రదేశాల్లో చిన్న పిల్లలు ఆడుకోరాదు. మరుగు దొడ్డి వద్ద పిల్లలకు షూస్ తొడిగించాలి. తద్వారా క్రిములు కాలి ద్వారా చర్మం లోపలికి ప్రవేశించకుండా నిరోధించవచ్చు.

  • పురుగులు, క్రిములు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నివసించే పిల్లలకు ఏడాదికి రెండు-మూడు సార్లు యాంటీ-హెల్మెంతిక్ ఔషధంతో చికిత్స చేయాలి.

ముఖ్య సందేశాలు - 3

ప్రతి రోజూ సబ్బుతో ముఖాన్ని కడుక్కోవటం వల్ల కంటికి ఇన్ ఫెక్షన్ రాకుండా తోడ్పడవచ్చు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో, కంటి కొచ్చే ఇన్ ఫెక్షను అంధత్వాన్ని కలిగించే “ట్రకోమా” అనే వ్యాధికి దారి తీస్తుంది. మురికిగా ఉన్న ముఖం ఈగలను ఆకర్షించి, అవి మోసే క్రిములను ఒకరి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యాప్తి చెందేలా చేస్తుంది. శుభ్రంగా లేకపోతే కళ్లు పులిసి పోవటం గానీ ఇన్ ఫెక్షను రావటం గానీ జరుగుతుంది. ఫలితంగా చూపు మందగించటం లేదా కోల్పోవటం జరుగుతుంది. కళ్లు ఆరోగ్యకరంగా ఉంటే, కంటి తెలుపు భాగం స్పష్టంగా ఉండి కళ్లు తేమతో మెరుస్తూ చూపు చురుకుగా ఉంటుంది. ఒకవేళ కళ్లు పూర్తిగా ఎండిపోయి, బాగా ఎర్రబారి పులిసినట్లు ఉంటే లేదా చూపు కష్టమైతే, వెంటనే పిల్లలను ఆరోగ్య కార్యకర్త చేత పరీక్ష చేయించాలి.

ముఖ్య సందేశాలు - 4

సురక్షితమైన వనరు నుండి తీసిన లేదా పరిశుద్ధం చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. నీరు ఉన్న బిందెలను, ఇతర పాత్రలను కప్పి పెట్టడం ద్వారా ఆ నీటిని పరిశుభ్రంగా ఉంచవచ్చు. పరిశుభ్రమైన నీరు తగినంతగా లభించి, వాటిని క్రిముల నుంచి దూరంగా ఎలా పెట్టాలో తెలిసిన కుటుంబ జబ్బులు తక్కువగా ఉంటాయి. నీరు శుభ్రంగా లేకపోతే, దాన్ని ఫిల్టర్ (వడపోత) చేసిగానీ, మరగబెట్టి గానీ పరిశుద్ధం చేయాలి. పరిశుభ్రమైన నీటి వనరులంటే, చక్కగా నిర్మించి, నిర్వహిస్తున్న నీటి పైపుల వ్యవస్థ, బోరుబావులు, సురక్షితమైన చేద బావులు. అసురక్షిత నీటి వనరుంటే :- నీటి మడుగులు , నదులు, ఓపెన్ చెరువులు, మెట్లుగల బావులు. వీటి నుండి తెచ్చిన నీటిని మరగబెట్టడం ద్వారా సురక్షితం చేయవచ్చు. నీటిని శుభ్రంగా నిల్వ చేయటానికి అవి ఉన్న పాత్రలను, బిందెలను మూతలలో కప్పిపెట్టాలి. కుటుంబాలు, సమాజం తమ నీటి సరఫరాను సురక్షితంగా కాపాడుకోవాలంటే.

  • చేద బావుల పైన కప్పి ఉంచి, హ్యాండ్ పంపు బిగించాలి.
  • త్రాగటానికి, వంటకు లేదా కడుక్కోవటానికి ఉద్దేశించిన నీటి వనరులకు దూరంగా మలాన్ని ఇతర విసర్జకాలను (నిరర్దకాలు) విసిరేయాలి.
  • నీటి వనరులకు దిగువన కనీసం 15 మీటర్ల దూరంలో మాత్రమే మరుగుదొడ్డి నిర్మించాలి.
  • నీటిని తోడటానికి బక్కెట్లు, తాడు లేదా జాడీలను ఉపయోగించాలి, పరిశుభ్రమైన ప్రదేశంలో నిల్వచేయాలి.
  • జంతువులను ఎల్లప్పుడూ త్రాగునీటి వనరులకు, ఆవాల ప్రాంతాలకు దూరంగా ఉంచాలి.
  • నీటి వనరుల సమీపంలో క్రిమి సంహారక మందులు, రసాయనాలను వాడరాదు.

ఇంట్లో నీటిని శుభ్రంగా ఉంచటానికి కుటుంబ సభ్యులు :

  • పరిశుభ్రమైన బిందెలు, పాత్రల్లోనే నీటిని నిల్వచేసి మూత పెట్టాలి.
  • మురికి చేతులతో మంచి నీటిని తాకరాదు.
  • బిందె నుంచి నీరు తీయటానికి శుభ్రమైన కప్పును గానీ లోటా గానీ ఉపయోగించాలి.
  • నీరు ఉన్న కంటెయినర్ కు (నల్లా లేదా బిరడా) ఉండాలి.
  • పాత్ర / బిందె లోని త్రాగు నీటిలో చేతులు పెట్టడానికి గానీ నేరుగా త్రాగటానికి గానీ ఎవరనీ అనుమతించరాదు.
  • నిల్వ చేసిన నీటి నుంచి జంతువులను దూరంగా ఉంచాలి.

ఒకవేళ మంచి నీటి పరిశుభ్రత, సురక్షిత అంశాలపై ఏవైనా సందిగ్ధాలు ఉంటే, స్థానిక సంస్థల అధికారులను సంప్రదించండి.

ముఖ్య సందేశాలు - 5

పచ్చివి లేదా వదిలేసిన ఆహారం ప్రమాదకరం. పచ్చి కూరలు, ఇతర మూల పదార్థాలను బాగా కడగాలి లేదా ఉడకబెట్టాలి. వండిన ఆహారాన్ని జాప్యం చేయకుండా చల్లారక ముందే తినాలి లేదా దాన్ని మళ్లీ వేడి చేసి తినాలి. ఆహారాన్ని వండటం వల్ల అందులోని క్రిములు చచ్చిపోతాయి. ముఖ్యంగా, మాంసము, పౌల్ట్రీ ఉత్పత్తులను (కోడి మాంసం, కోడి గుడ్లు మొదలైనవి బాగా ఉడక బెట్టి వండాలి. వెచ్చగా ఉన్న ఆహారంలో క్రిములు త్వరగా పెరుగుతాయి. ఆహారాన్ని వండిన వెంటనే తినేయటం వల్ల క్రిములు పోగయ్యే అవకాశం ఉండదు.

  • ఒకవేళ ఆహారాన్ని రెండు గంటలకన్నా ఎక్కువ సేపు ఉంచాలనుకుంటే, దాన్ని అతి చల్ల (శీతల)గా (ఉదా. ఫ్రిజ్ లో పెట్టటం మె. ) గానీ అతి వేడిగా గానీ నిల్వ చేయాలి (ఉదా. వేడిని బైటికి పోనియకుండా ఉంచే పాత్ర – హాట్ బాక్సు ) .
  • వండిన ఆహారాన్ని తర్వాత పూట వరకూ నిల్వ చేయాలనుకుంటే, వాటిపైన ఈగలు , కీటకాలు వాలకుండా కప్పి ఉంచి తినే ముందు తిరిగి వేడి చేసి తినాలి.
  • పెరుగు, పులియబెట్టిన రసాలు భోజనంలో ఉపయోగించటం మంచిది. ఎందుకంటే, వాటి ద్రావకం (యాసిడ్) ఆహారంలో క్రిములు పెరగకుండా నిరోధిస్తుంది.
  • పచ్చి ఆహారం, ముఖ్యంగా పౌల్ట్రీ (చికెన్ లాంటివి) మరియు చేపల లాంటి సముద్ర పదార్థాలు సాధారణంగా క్రిములు కలిగి ఉంటాయి. వండిన ఆహారం ఒకవేళ పచ్చి ఆహారాన్ని తాకితే, క్రిములు చేరతాయి. కనుక, పచ్చివి- వండిన ఆహారాన్ని ఎల్లప్పుడు దూరంగా (వేర్వేరుగా) పెట్టాలి. పచ్చి ఆహారాన్ని వంటకు సిద్దం చేశాక, అక్కడ ప్రదేశాన్ని, చాకును, ఇతర వస్తువులను పరిశుభ్రం చేయాలి.
  • శిశువులు, చిన్న పిల్లలకు రొమ్ముపాలు చాలా సురక్షితమైనవి. గేదెపాలు లాంటి జంతువుల పాలను అలాగే ఇవ్వటం కన్నా బాగా మరిగించి లేదా వెన్న తీసి ఇవ్వటం శ్రేయస్కరం.
  • రొమ్ము పిండి తీసిన పాలను గది ఉష్ణోగ్రతలో ఎనిమిది గంటల పాటు నిల్వ చేయవచ్చు. అయితే, వాటిని పరిశుభ్రమైన పాత్రలో పోసి, మూతపెట్టి ఉంచాలి.
  • శిశువులకు, చిన్న పిల్లలకు ఆహారాన్ని తయారు చేసేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వారికోసం ఏ పూటకు ఆ పూటనే తాజాగా ఆహారం తయారుచేయాలి. సాధ్యమైనంత వరకు ఆహారాన్ని ఇంకో పూట వరకూ నిల్వ చేయరాదు.
  • పండ్లు, కూరగాయల తొక్క (పొట్టు) తీసి లేదా శుభ్రమైన నీటిలో బాగా కడిగి వాడాలి. ముఖ్యంగా పచ్చి వాటిని శిశువులకు, చిన్న పిల్లలకు తినిపించాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. పండ్లు, కూరగాయలను పండించేటప్పుడు స్ప్రే చేసిన క్రిమిసంహారక మందులు, ఇతర రసాయనాలు కంటికి కనిపించవు. కానీ, వాటిని కడగకుండా తింటే, ప్రమాదకరంగా మారుతాయి.

ముఖ్య సందేశాలు - 6

ఆహారం, వంట పాత్రలు, వంటివి తయారు చేసే నేలను పరిశుభ్రంగా ఉంచాలి. మూతలు పెట్టిన పాత్రల్లోనే ఆహారాన్ని నిల్వ చేయాలి. ఆహారం పైన చేరే క్రిములను మింగటం జరిగితే అనారోగ్యం కలుగుతుంది. ఆహారాన్ని క్రిముల నుంచి రక్షించాలంటే

  • ఆహారాన్ని తయారు చేసే నేలను, పరిశుభ్రంగా ఉంచాలి.
  • కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లను శుభ్రం చేసి, మూత పెట్టి ఉంచాలి.
  • వంట పాత్రలను తుడిచేందుకు ఉపయోగించే గుడ్డను ప్రతిరోజు ఉతికి, ఎండలో ఆరేయాలి. ప్లేట్లు, వంట తయారీ సామాగ్రిని ఎప్పటికప్పుడు వెంటనే కడిగి, అవి ఆరటానికి ర్యాక్ పై పెట్టాలి.
  • ఆహారాన్ని మూత పెట్టిన గిన్నెల్లోనే నిల్వ చేయటం ద్వారా క్రిములు, జంతువులు వాటిని తాకటాన్ని నివారించవచ్చు.
  • పాల సీసాను, నిప్పల్ (టీట్) ను అలాగే ఉపయోగిస్తే, వాటికి డయేరియా కలిగించే క్రిములు ఉండే అవకాశం ఉంది. వీటిని ప్రతిసారి వేడి నీటిలో మరిగించి శుభ్రం చేయాలి. చిన్న పిల్లలకు రొమ్ముపాలు ఇవ్వాలి. లేదా శుభ్రమైన కప్పు ద్వారా ఆ పాలను తాగించాలి.

ముఖ్య సందేశాలు - 7

ఇంట్లోని నిరర్థకాలన్నింటినీ సురక్షితంగా తొలగించటం ద్వారా అస్వస్థతను నివారించవచ్చు. ఈగలు, బొద్దింకలు, ఎలుకల ద్వారా క్రిములు వ్యాప్తి చెందుతాయి. ఇవి ఎక్కువగా పండ్లు, కూరగాయాల తొక్కలు, ఆహార విసర్జకాల పై ఆధార పడతాయి. ఊరు / వాడకు కలిపి చెత్తను పోగు చేసే వ్యవస్థ లేకపోతే, ఎవరికి వారు తమ ఇంటివద్ద చెత్తకుండీ ఏర్పాటు చేసుకొని, అక్కడ వంటింటి నిరర్థకాలను పూడ్చి వేయటం లేదా కాల్చి వేయటం జరగాలి. ఇల్లు, పరిసరాలను మలం, నిరర్థకాలు, వృథానీరు పోగు కాకుండా పరిశుభ్రంగా మారిస్తే వ్యాధులు రాకుండా నివారించవచ్చును. ఇంట్లోని వృథా నీటిని పెరటి చెట్లకు మళ్లించటం గానీ గంతలో ఇంకిపోవటానికి గానీ ఏర్పాటు చేయాలి. క్రిమి సంహారక మందులు, రసాయనాలు స్వల్ప మొత్తంలో సైతం నీటి సరఫరాలో లేదా ఆహారంలో కలిసినా, చేతులు, గోళ్లకు అంటినా ప్రమాదకరంగా పరిణమించవచ్చు. నీటి సరఫరా వనరుల వద్ద రసాయన పాత్రలను గానీ, వాటికి సంబంధించిన బట్టలను గానీ ఉతకరాదు. క్రిమి సంహారక మందులను, రసాయనాలను ఇంటి పరిసరాల్లో గానీ, నీటి వనరుల వద్ద గానీ ఉపయోగించరాదు. మంచి నీటి బిందెల వద్ద, ఆహారం సమీపంలో రసాయనాలను నిల్వ చేయరాదు. క్రిమి సంహారక మందులు , ఎరువులకు సంబంధించిన పాత్రలు, గిన్నెలు, డబ్బాల్లో ఆహారాన్ని గానీ, నీటిని గానీ నిల్వ చేయరాదు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate