నిప్పులేనిదే పొగరాదని సామెత. పొగరావాలంటే కనీసం కొంచెం అయినా నిప్పుకావాలి. పొగ ఏ దిశలో ప్రయాణం చేస్తుందో గమనించారా? సాధారణంగా క్రింది నుండి పైకి, లేదా ప్రక్కలకు ప్రయాణం చేస్తుంది. అంతేకదా. పొగలో గాలి కాస్త వేడిగా వుంటుంది. అందువల్ల తేలిక అవుతుంది. కనుక పైకి పోతుంది. గాలివీస్తూ వుంటే ఆ తాకిడికి పొగ ప్రక్కలకు కూడా పోతుంది. అంతే గాని భూమ్యాకర్షణకు లోబడి క్రిందకు పోతుందా! పోదుకదా. అది అసాధ్యం కదా! కాని మనం . ఎవరం? అసాధ్యాన్ని సుసాధ్యం చేసే చిచ్చరపిడుగులం కదా. అసలే వేసవికాలం సెలవులలో ఇంట్లోనే వుంటూ ఏమి చేయాలన్నా తయారుగా వున్నాం కదా. కాబట్టి పొగను పైకి రప్పిస్తాం. ఎలాగంటారా రండి చేసిచూద్దాం.
కావలసిన పరికరాలు: చెప్పుల డబ్బా, కొవ్వొత్తి, 2 దీపపు చిమ్నీలు (గాజువి), అగరబత్తులు, అగ్గిపెట్టె.
తయారు చేయు విధానం: అట్ట చెప్పుల డబ్బా తీసుకొని దాని మూతకు, దీపపు చిమ్నీ క్రింది వైపు వ్యాసం కంటే కాస్త తక్కువ గాజు చిమ్నీలను బిగుతుగా అమర్చండి. చిమ్నీలు కదలి పడిపోకుండా వీలేతై గం టేపుతో అతికించండి. ఈ చిమ్నీలు'A' మరియు 'B' అనుకుందాం. ఓ కొవ్వొత్తిని సగం కత్తిరించి, చెప్పుల డబ్బాలో 'A' చిమ్నీ క్రిందకు అమరేటట్లు అతికించండి. క్రొవ్వొత్తిని వెలిగించినా ఆ వేడి డబ్బా మూతకు తగలకుండా వుండేటట్లు క్రొవ్వొత్తి ఎత్తు వుండాలి సుమా. కొవ్వొత్తిని వెలిగించి డబ్బా మూతను మూయండి. రెండు మూడు అగరబత్తులను వెలిగించి డబ్బా మూత ను మూయండి. రెండుమూడు అగరబత్తీలను వెలిగించి పొగ వెలువడుతున్నప్పుడు 'B' చిమ్నీ కంఠం వద్ద వుంచండి. అంటే పొగ 'B' చిమ్నీ గుండా చెప్పుల డబ్బాలోనికి వెళుతుంది. కాసేపటికి ఆశ్చర్యంగా 'A' చిమ్నీ గుండా వెలువడుతుంది. అంతే మనం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామన్న మాట. ఇది ఎలా సాధ్యం? అసలు ఏమి జరిగింది.
బాక్స్ లో క్రొవ్వొత్తి వెలుగుతున్నప్పుడు దాని చుట్టు వున్న గాలి వేడెక్కుతుంది. గాలి వేడి ఎక్కువ అయినప్పుడు దాని ఉష్ణోగ్రత పెరిగి వ్యాకోచిస్తుంది. అపుడు దాని ఘనపరిమాణము పెరుగుతుంది. అందువల్ల సాంద్రత తగ్గి తేలిక అవుతుంది. (సాంద్రత = ద్రవ్యరాశి/ ఘనపరిమాణము). తేలిక అయినగాలి. 'A' చిమ్నీ గుండా బయటకు వెలువడుతుంది. బాక్స్ లోపల ఏర్పడిన ఖాళీలను పూరించడానికి వెలుపలిగాలి 'B' చిమ్నీ గుండా లోనికి ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించేటప్పుడు దారిలోని అగరబత్తుల పొగను తనతో తీసుకొని లోనికి పోతుంది. అక్కడ మళ్ళీ కొవ్వొత్తి వేడికి వ్యాకోచం చెంది, గాలి, అగరబత్తి పొగ, రెండూ 'A' చిమ్నీ గుండా బయటకు వస్తుంది. ఇలా నిరంతరంగా పొగ లోపలికి పోయి బయటకు వస్తూ ఉంటుంది. కొవ్వొత్తి వెలుగుతున్నంత సేపూ.. అదన్నమాట.
ఆధారం: యుగంధర్ బాబు
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020