অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తులసి తీర్థం

తులసి తీర్థం

కోర్టు హాలు సాక్షుల బోనులో శ్రీజ. ముద్దాయిల బోనులో దాసప్ప, ఆదెమ్మలు నిల్చున్నారు. జడ్జిగారు రావడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నిల్చుని వందనం చేశారు. జడ్డి వారిని కూర్చోమని సైగచేస్తూ, తన ముందున్న కేస్ ఫైల్ ను రెండు నిమిషాలు పరిశీలించి.

జడ్జి యస్! ప్రొసీడ్! (అంటూ అనుమతిచ్చారు)

పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.పి యువరానర్! నా క్లయింట్ అయిన శ్రీమతి శ్రీజ తండ్రి గారైన దొన. రామప్పను, ముద్దాయిలైన దొన దాసప్ప, అతని భార్య ఆదెమ్మలు మెర్సీకిల్లింగ్ పేరుతో హత్య చేశారని, వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము సార్!

డిఫెన్స్ లాయర్ మైలార్డ్! తండ్రి పోయిన దు:ఖంలో, అపార్థాలకు పోయి తన సొంత అన్న అయిన, దాసప్పను దోషిగా చిత్రీకరించడానికి ఆమె ప్రయత్నిస్తోన్నది సార్!

జడ్జి ఇంతకు దొన రామప్పగారు ఎందువలన చనిపోయారు?

శ్రీజ కోమాలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే మానాన్నగారికి వైద్యం చేయించాల్సింది పోయి, తులసి తీర్థం గొంతులో పోసి చేజేతులా ఆయన్ని మా అన్నా, వదినెలే చంపారు సార్!

పబ్లిక్ ప్రాసిక్యూటర్: అవును సార్! ఆస్తి కోసం చేసిన ఒక ప్లాన్ కోల్డ్ బ్రదేడ్ మర్డర్ సార్ ఇది.

(బోనులోని దాసప్ప కన్నీళ్ళు ధారలవుతున్నాయి. ఆదెమ్మ భయంతో వణికిపోతుంది)

డిఫెన్స్:ప్రాసిక్యూటర్ గారు వాస్తవాలు నిరూపితం కాకుండానే, మర్డర్ లాంటి పదాలను వాడటాన్ని ఖండిస్తున్నాను మైలార్డ్!

జడ్జి: మరి జరిగిందేమిటో ముద్దాయినే చెప్పమనండి!

దాసప్ప: మా తండ్రి గారైన దొన రామప్పగారికి గత 5 సంవత్సరాలుగా కొలెన్ క్యాన్సర్ సార్. కెమోథెరపీ, రేడియో థెరపీ, రెండుసార్లు సర్జరీలు జరిగాయి. ఇంచుమించుగా పెద్దప్రేగు అంతా తీసేశారు. గత 6 నెలలుగా మంచంపైనే వున్నారు.

డిఫెన్స్: తండ్రి వైద్యానికి ఆస్థి మొత్తం పోయింది. ఇక ఆస్తి కోసం తండ్రిని చంపాడనటం, ఎంతవరకు నిజమో ఆలోచించండి!

పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగని! ఆపస్మారక స్థితిలో వున్న మనిషి నోటిలో తులసి తీర్థం పోసి చంపే అధికారం, వీళ్ళకు ఏ చట్టం ఇచ్చింది మైలార్డ్!

శ్రీజ ఆపరేషన్ సమయంలో లోకల్ అనస్థిషియా ఇస్తే చుక్క నీటిని తాగించం. అది శ్వాసకు అడ్డువచ్చే ప్రమాదమని! అలాంటిది...! (ఏడ్వసాగింది)

పబ్లిక్ ప్రాసిక్యూటర్మైలార్డ్! అందరికి నోటి తరువాత, గ్రసని వద్ద శ్వాసనాళం, అన్నవాహిక ప్రక్క ప్రక్కనే వుంటాయి. శ్వాసనాళంలోకి గాలి మాత్రమే పోయ్యేలా ఎపిగ్లెటిస్ అనే భాగం నియంత్రిస్తుంది. మెదడు అచేతనం అవడం వలన కోమాలోని వ్యక్తికి ఎపిగ్లాటిన్ పనిచేయదు.

శ్రీజ అలాంటి స్థితిలో కోమాలోని వ్యక్తి త్రాగిన ద్రవపదార్థం ఊపిరితిత్తుల్లోకి చేరడం వలన మరణం సంభవిస్తుంది సార్!

డిఫెన్స్ లాయర్ నోట్లో పోసింది నీరు కాదు మైలార్డ్! తులసితీర్థం.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైలార్డ్! తులసి గొప్పదనం గురించి కాదిక్కడి చర్చ.

డిఫెన్స్ లాయర్ యస్! ఐ ఆక్సెప్ట్ ఇట్ సార్! కానీ తులసినీళ్ళతో మరణం సంభవించిందన్నప్పుడు, తులసికున్న ప్రాశస్త్యం తెల్సుకోవాల్సిన అవసరం ఈ కేసుకు చాలా ఉంది. తులసి గురించి తెల్పడానికి మా ఆయుర్వేద వైద్యుడ్ని అనుమతించవల్సిందిగా కోరుతున్నాను సార్!

జడ్జి పర్మిషన్ గ్రాంటెడ్.

ఆయుర్వేద డాక్టర్ నమస్కారం సార్! తులసి కొన్ని వందల రోగాలను మటుమాయం చేస్తుంది. అందుకే అవసాన దశలో నోటిలో తులసి తీర్థం పోస్తారు. అది జీవి శరీరంలో వేడి రగిల్చి, శరీరం చల్లబడకుండా చేసి, మరింత కాలం బ్రతికేలా చేసే అవకాశం ఉందని, చరకసంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో చెప్పబడింది.

జడ్జిశాస్త్రీయంగా వివరణ ఇవ్వగలరా?

డాక్టర్ తులసి శాస్త్రీయ నామం "ఆసియం బాసిల్లికామ్”. ఇది “లాబియేటి” కుటుంబానికి చెందినది. తులసి మొక్కలో "తైమల్” అనే ఔషధ పదార్థం ఉంది. బాక్టీరియాలను, కఫంను (శ్లేప్మంను) హరించే యాంటిబయాటిక్ గుణం "తైమల్” కుందని నిరూపితమైనది.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరి శరీరపు వేడి పెంచడం, పోషకాలు అందించే గుణం ఎలా వచ్చింది.

డాక్టర్అక్కడికే వస్తున్నాను! లవంగ, తులసి ఆకుల రసంలో యూడినాల్, కారియో ఫల్లోన్, సిట్రాల్, కేంఫర్, థైమాల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ వుంటాయి. అవి అవసాన దశలోని వ్యక్తి శరీర వేడిని పెంచుతాయి. 100 గ్రాముల తులసి ఆకులలో పిండి పదార్థాలు 60.95, మాంసకృత్తులు 14,37, ఖనిజ లవణాలు 14, 27, నీరు 6.43, క్రొవ్వు పదార్థాలు 3.98 గ్రాములు వుంటాయి. ఇవిగాక పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజలవణాలు కూడా పుష్కలంగా వుంటాయి. కాబట్టి తులసి ఒక అధ్బుత ఔషధం. రోగి ఏ మాత్రం మింగగలిగినా, ఆరోగ్యం తప్పక మెరుగుపడుతుంది.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ దటీజ్ ద మైన్ పాయింట్ మైలార్డ్! రోగి మింగగల్గితే అది ఔషధమే! ఇక్కడ కోమాలోని వ్యక్తి శ్వాసించడమే కష్టంగా వున్నప్పుడు, వైద్యుల పర్యవేక్షణ లేకుండా, అశాస్త్రీయంగా రోగి నోటిలో తులసి నీరు పోశారు. అతని శ్వాస ఆగిపోవడానికి కారకులయ్యారు! కాబట్టి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను సార్.

దాసప్ప సార్! నా తండ్రి మరణంతో 5 సంవత్సరాలు పోరాడాడు, దురదృష్టం! వ్యాధి నయం కాకపోగా, మరింతగా ముదిరింది. పెద్ద డాక్టర్లు సైతం ఇక లాభం లేదని ఇంటికి తీసుకెళ్ళమన్నారు. రెండు నెలలుగా అన్నీ మంచంలోనే, పక్కపుండ్లుపడి ఆయన వీపంతా జల్లెడయ్యింది. బాధ తాళలేక మందులు మింగనని, వైద్యం ఆపేయమని మమ్మల్ని ప్రాధేయ పడేవాడు.

ఆదెమ్మమరణమే మేలని ఎన్ని రోజులు ఏడ్చాడో!

(పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైద్యులు రిపోర్టు కోర్టువారికి సమర్పించాడు)

డిఫెన్స్ లాయర్: సుప్రీం కోర్టు 2011 వ సంవత్సరంలో "ఆరు రామచంద్ర శాన్ బాగ్” అనే యువతి కేసులో తీర్పునిస్తూ, రోగికి చికిత్స చేసినా నయంకాదని వైద్యులు నిర్ధారించిన పక్షంలో, రోగి కారుణ్య మరణాన్ని కోరుకుంటే ఆ అవకాశం కల్పించవచ్చని, పాక్షిక చట్టబద్ధత కల్పించిందని తమ దృష్టికి తీసుకొని వస్తున్నాను మైలార్డ్.

పబ్లిక్ ప్రాసిక్యూటర్:“అరుణ రామచంద్ర శాస్ బాగ్" కేసు చాల అరుదైనది. దాన్ని ఆధారంగా తీసుకొంటే, మెర్సీకిల్లింగ్ ను అవకాశంగా తీసుకొని ఆస్థి కోసం, అవసరాల కోసం మరిన్ని హత్యలు జరిగేలా, అవకాశం కల్పించినట్లవుతుంది మైలార్డ్!

డిఫెన్స్ లాయర్: యువరానర్! కీ. శే. దొన రామప్పగారు తన రోగం గురించి, వైద్యపరంగా తను పడుతున్న నరకయాతన గురించి, ఆర్థికంగా తన కొడుకు దాసప్ప చితికిపోతున్న విధానం గురించి వివరంగా, ఉత్తరాల రూపంలో తన చిన్న నాటి స్నేహితుడు రఘురాం తాతగారికి ఉత్తరాలు రాశాడు. (ఉత్తరాలను జడ్జీకి అందించాడు!) ఆ ఉత్తరాలలోనే, తనకు గౌరవ ప్రదంగా మరణించే వీలు కల్పించమని రఘురాం తాత గారిని అర్థించడం కన్పిస్తుంది మైలార్డ్! తమరు ఆ ఉత్తరాలనే రామప్ప రాసుకొన్న కారుణ్య మరణ వీలునామాగా స్వీకరించి, నా క్లయింట్లను నిర్దోషులుగా విడుదల చేయాలని విన్నవించుకొంటున్నాను సార్! (ఉత్తరాలను జడ్జిగారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, శ్రీజాలు కూలంకషంగా చదివారు, చేతిరాత నిపుణుల ద్వారా, పోస్టల్ శాఖా సిబ్బంది ద్వారా అవి నిజమైన సాక్ష్యాలుగా నిర్ధారింపబడాయి.)

జడ్జి:(తన జడ్జిమెంటు చదువుతూ) ఈ కేసు పూర్వాపరాలను, వాద-ప్రతివాదనలను సాక్ష్యాలను పరిశీలించిన తరువాత దాసప్ప తన తండ్రి అయిన దొన రామప్ప మరణానికి ద్వేషం కాని, స్వార్థం కానీ, ఉద్దేశ పూర్వకంగా చేసిన హత్య కానీ కారణం కాదని ఈ కోర్టు నమ్ముతున్నది. కానీ వైద్య పర్యవేక్షణ లేకుండా, శాస్త్ర నిరూపితం కాని తులసి తీర్థం పోయడం వల్లనే దొన రామప్ప మరణం సంభవించిందని ఈ కోర్టు నిర్ధారించింది. కోమాలోకి వెళ్ళడం మరణానికి చేరువకావడమనే అనే అనాగరిక భావనను ఈ కోర్టు తప్పు పడుతున్నది. (అందరు నిశ్శబ్దంగా వింటున్నారు) కాని రామప్ప రాసిన లేఖల వల్ల, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అరుణా రామచంద్ర శాన్ బాగ్ కేసు తీర్పుకు, ఈ కేసుకు సారూప్యత దృష్ట్యా దోన దాసప్పను, అతని భార్య ఆదెమ్మను ఈ కోర్టు నిర్దోషులుగా విడుదల చేస్తున్నది. అవసానంలో తులసి తీర్థం లాంటివి సాంప్రదాయం కావచ్చేమో కానీ నిరూపించబడిన వైద్య విజ్ఞానం కాదు. ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రజలను చైతన్యపర్చడం వైద్యుల కర్తవ్యం. ప్రజలను చైతన్యపర్చే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖను ఆదేశిస్తున్నాం!

(జీవించాలనే తపన, జీవం ఉన్న ప్రతిజీవికి ఉండే ఓ జీవ లక్షణం! జీవించే హక్కును హరించడం ఏ చట్టం ఒప్పుకోదు! ఏ సాంప్రదాయం హర్షించదు!)

ఆధారం: జి. చంద్రశేఖర్

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate