అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక్కటే బ్రాహ్మణుని ఇల్లు. ఆ ఇంటాయన చాలా మంచివాడు. భార్య మాత్రం చాలా కఠినురాలు. ఒకరోజు మిట్టమధ్యాహ్నం వేళ ముసలి బ్రాహ్మణుడొకడు బాటసారియైపోతూ ఎండదెబ్బకు భయపడి ఇంటివారు బోజనమేమైనా పెడతారేమో? అని ఆశగా అరుగుపై చతికిలపడ్డాడు. బయటకు వచ్చిన ఆ ఇంటాయన 'అయ్యో! పాపం! ముసలి బ్రాహ్మణుడు. ఎండకు భయపడుతున్నాడని జాలిపడి " అయ్యా మీరు బోజనం చేసి విశ్రాంతి తీసుకుని తరువాత ప్రయాణం చేద్దురు గాని. స్నానానికి రండి అంటూ లోపలకు పిలిచాడు అతనిని.
"ఏమేయ్! సుబ్బాయమ్మ! పెద్దాయన బోజనం చేస్తాడు.స్నానానికి ఏర్పాట్లు చూడు. నేను బజారుకు వెళ్ళి వస్తాను ". అని బయటకు నడిచాడు. ముసలి బ్రాహ్మణ్ణి చూస్తూనే "వీడి శ్రాద్ధం పిల్లులకు పెట్టా " బోజన సమయానికి తయారయ్యాడే! అని మనసులో తిట్టుకొని,బయటకు మాత్రం " రండి! స్నానానికి, బావి అటు ఉంది' అని చూపించింది. స్నానం చేసి వచ్చిన బ్రాహ్మణుడు ఆమె చేస్తున్న వింత పనిని చూసి ఆశ్చర్యపోయాడు. " ఏవమ్మా! రుబ్బుగుండుకు పసుపు, కుంకుమలు పూసి, పూవులు జల్లి పూజ చేస్తున్నావు ఇదేమయినా వ్రతమా! " అన్నాడు.
''అయ్యో! తాతగారు! వ్రతమా! తపమా! ఏమీకాదు. ఏం చెప్పమంటారూ! మా ఇంటాయన చాలా కఠినుడు. ఎపూడూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. మీలాంటి వాళ్ళను రోజూ భోజనానికి పిలుస్తుంటాడు. వాళ్ళు బోజనానికి కూర్చోగానే ఈ రుబ్బురాయి తీసుకొని తల పగలగొడతాడు. ఇదిగో నన్నేమో రుబ్బురాయిని శుభ్రం చేసి పూజ చేసి సిద్ధం చేయమంటాడు. పెద్ద బ్రాహ్మణుడివి నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. ఈరోజు నీ తల కాస్త ఈ రుబ్బురాయికి బలి కాబోతున్నది. " అని నమ్మపలికింది. అంతే! పాపం! ముసలి బ్రాహ్మణుడు! గడగడ వణకిపోయాడు. ''వీడమ్మా కడుపుకాల! మర్యదగా బోజనం పెడతాననీ తలపగలగొడతాడా వీడు. అమ్మబాబోయ్ స్నానం చేశాను బోజనం లేకపోతే లేదు బ్రతికుంటె ఎవరో ఒకరు బోజనం పెడ్తారు అని'' త్వరగా గుమ్మం దాటాడు బ్రాహ్మణుడు.
ఇంతలో ఇంటాయన వచ్చి " ఏమేయ్! సుబ్బాయమ్మా! బోజనానికి సిద్ధం చేయి. ఏడీ! బ్రాహ్మణుడెక్కడా! కనపడడు. ఏమయినాడే? " ప్రశ్నించగా "ఏం చెప్పమంటారండీ! నేను పప్పు రుబ్బుతుంటే వచ్చి ఏమండీ! ఈ రుబ్బురాయి చాలాబాగుంది. ఇది నాకు ఇస్తారా? అన్నాడు. నేను కుదరదన్నాను.అయితే బోజనం చేయను అన్నాడు. నీవు బోజనం చేయకపోయినా ఇష్టమే కాని బంగారం లాంటి రుబ్బుగుండు మాత్రం నేను ఇవ్వనని గట్టిగా చెప్పాను. అంతే ఆ ముసలి బ్రాహ్మణుడు అలిగి వెళ్ళి పోయాడండీ! బోజనమైతే పెడతాం కానీ ఇంట్లో వస్తువులు కూడా ఇచేద్దామా ఏమీ!" అని సాగదీసింది.
'ఒసే! చాదస్తురాలా! పోనీలేవే. ముసలి బ్రాహ్మణుడు ముచ్చటపడితే రుబ్బురాయి ఇవ్వక అతనని బాధ పెట్టావా! అసలే ఆకలితో వున్నాడు. ఏదీ ఆ రుబ్బుగుండు. అతనికిచ్చి పిలుచుకు వస్తాను." అని రుబ్బుగుండు తీసుకొని దూరంగా కనబడుతున్న ముసలి బ్రాహ్మణ్ణి కేక వేసి పిలిచి "ఓ తాతగారూ! ఇదిగో రుబ్బుగుండు. మీకిస్తాం తీసుకోండి" అని రుబ్బుగుండు చూపిస్తూ తొందరగా నడిచాడు. రుబ్బుగుండుతో వస్తున్న అతడ్ని చూడగానే ముసలి బ్రహ్మడికి ఎక్కడలేని భయం వేసి, సత్తువంతా కూడదీసుకొని పిక్కబలం చూపించి పరుగెత్తడం మొదలుపెట్టాడు. ''అయ్యో! పెద్దాయనా! ఎందుకా పరుగు నిలువు! '' అంటూ ఈ బ్రాహ్మణుడు కూడా పరుగు పెట్టాడు. ఆ మాటలే వినని ముసలి బ్రహ్మణుడు ' వీడి సిగదరగా!... వీడింట్లో కోడిని కాల్చా!... వదలకుండా గుండు తీసుకొని వెంటబడ్డాడే! ఓర్నాయనోయ్." అని ఇంకా అందకుండా పరుగు పెట్టాడు. ముందు ముసలాయనా? వెనుక ఇంటాయన పరుగు పెడుతూనే ఉన్నారు.
అబద్ధాన్ని నిజమని నమ్మడం చేత ఈకథలో అద్భుత హాస్యం జనించింది. సన్నివేశ కల్పన చమత్కార జనకమై ఉన్నారు.
ఆదారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/12/2020