অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పండగ అల్లుడు

పండగ అల్లుడు

పండక్కి అల్లుడుగారొస్తున్నారని ఉత్తరం రాంగానే గుండెల్లో గుఱ్ఱాలు పరుగెట్టాయి నాకు! బోలెడంత ఖర్చు! అష్టకష్టాలు పడి పిండివంటలు చేయటం, అవి తిని అరిగించుకోలేక నానా అవస్థా పడటం అంతా వేస్టనీ ఇప్పుడే రోజుకు ఒక రకం పిండివంట చేసుకుని, తీరిగ్గా తిని, తాపీగా అరిగించుకోవటమే బెస్టనీ నా అభిప్రాయం. దీనితో మా ఆవిడ ఏకీభవించదు. నూటికి తొంభై పాళ్ళు నాతో వక్రీభవించటమే ఆవిడ సహజ లక్షణం! మా ఇద్దరికీ ఘర్షణలు ఘనంగా మొదలయి మొదట నేనే ఓడిపోయి ద్రవీభవించి పోవటం నెగ్గిన సంతోషం కొద్దీ చివరకు ఆవిడా ద్రవించిపోవటం వల్ల సంసారం సామరస్యంగా, సాఫీగా నెట్టుకొస్తున్నాం! ఇలాంటి వాతావరణంలో, అల్లుడు మొదటిసారిగా పండగకి వస్తానని రాయటం మొదట కొంచెం సంతోషమే కలిగించినా, అతను ఎలాంటివాడో పండగ అల్లుళ్ళ జాబితాలో ఏ కోవకు చెందుతాడో అలకలూ గిలకలూ తీర్చి, మర్యాదా మన్ననా చేసి, అతన్ని సంతృప్తిగా సాగనంపటం ఎలాగో ఆలోచించిన కొద్దీ గుండెల్లో గుఱ్ఱప్పందాలు ఆగిపోయి, వెయ్యో రెండువేలో గుఱ్ఱపు శక్తి కల రైలింజన్లు రొదపెట్టడం మొదలెట్టాయి!

అనుకోకుండా సంబంధం కుదిరి హడావుడిగా పెళ్ళి చేసెయ్యటం, పెళ్ళి అయీ అవకుండానే అమ్మాయీ అల్లుడూ బొంబాయి వెళ్ళి చెరొక ఉద్యోగమూ చేసేసుకుంటూ ఒకరికి సెలవు దొరికితే మరొకరికి దొరకని కారణంగా ఇన్నాళ్ళూ రాకపోవటం ఇప్పుడు ఇద్దరికీ సెలవు దొరికిందనే 'పాయింటు ' మీద 'జాయింటు 'గా వస్తున్నామని 'అర్జంటు 'గా లెటర్ రాయటం ఇవన్నీ మంచి రన్ ఉన్న స్టంటు సినిమాలోని సంఘటనల్లాగ, ఒకదాని వెంట ఒకటి టకటకా జరిగిపోయాయి! కనుకనే, అల్లుడి అలవాట్ల గురించి హావభావల గురించీ నాకుగానీ, ఆవిడకుగానీ, మా అనుమతి పొందిన మరే శాల్తీకి గానీ తెలియనే తెలియదు. అల్లుడి గురించి తెలిసిన అమ్మాయికూడా అతనితోనే దిగుతుంది కనుక, అంతా సస్పెన్స్‌గానే ఉండిపోయింది.

ఇంక ఈ విషయం ఇంట్లో చెబితే చాలు, కలెక్టరు ఇన్స్పెక్షన్‌కు వస్తున్నాడని తెలిసిన తాసిల్దారులాగా, ఆవిడ కంగారు పడిపొయి నన్ను కంగారు పెట్టేస్తుంది మా ఆవిడ అరిసెలకూ, ఆట్లకూ బియ్యప్పిండీలాంటి నానావిధ ఫలహార జాతులకూ కావలసిన శతాధిక పిండి విశేషాలనూ మర పట్టించుకుని సిద్దంగా ఉంచాలంటుంది. దీనికోసం డబ్బాలూ, టిఫిన్లూ, గిన్నెలూ సంచులూ వగైరా గట్రా మోసుకుని, ఇంటినుంచి మరకూ మరనుంచి ఇంటికీ 'మగ్గంలో దారపుకండే లాగా అటూ ఇటూ కాళ్ళీడ్చుకుంటూ తిరగాల్సింది నేనే మరి!

ఎన్నిసార్లు మరకెళ్ళినా, ఆ మర మోతలో నా బుర్ర పని చేసి చావదు. ఏది బరకపిండో ఏది మెత్తపిండో ఏది ఎన్ని గొట్టాలో, కేజీలో శ్రద్ధగా పాఠం చెప్పించుకుని ఒకటి రెండుసార్లు ఆవిడకు పొల్లుపోకుండా అప్పజెప్పి మరీ బయల్ధేరతాను. తీరా మరకెళ్ళాక అక్కడ గుంపుగా జనమూ, సర్కస్‌లో బఫూన్ తెల్లరంగు పూసుకున్నట్లు ఆ మరవాడు మొహం నిండా పిండి దూళి అలంకరించుకుని ఎంతా? అరకేజియా? చాలా బరువుందిగా మెత్తటి పిండేనా? మీ ఆవిడని కరెక్ట్‌గా అడిగొచ్చారా? అని మర మోతలో నాకు వినపడదేమోనని, పొలం గట్ల మీద కేకలేసినట్లు అరచి, నా జ్ఞాపక శక్తినీ శీలాన్నీ కూడా శంకించినట్లు మొహం పెట్టేసరికి అప్పజెప్పొచ్చిన పాఠం కాస్తా తల్లక్రిందులయిపోతుంది నాకు. ఈ పిండి పర్వం తల్చుకుంటేనే వీనుల్లో విమానాల మోత వినిపిస్తుంది.

నా కష్టాల మాటెలా ఉన్నా అల్లుడొస్తున్నాడన్న కబురు ఆవిడకు చెప్పక తప్పదు కనుక చెప్పేశాను! ఆవిడ వెంటనే ఊదిన బెలూన్లాగా ఉబ్బిపోయి ఆ ఆనంద పారవశ్యంలో ఆ పూట కూరలో ఉప్పెయ్యటం మరిచిపొయింది..పప్పు మాడుతున్నా పట్టించుకోలేదు! అసలు పండగ అల్లుడంటే అత్తగారికి అంత సంతోషం ఎందుకో నాకు అంతు పట్టకపోగా ఆవిడ పరాకుతనానికి కాస్త చిరాకు వేసింది. అందుకనే కాబోలు అల్లుడికి అత్తాశ అన్నారు మన పూర్వీకులు. కట్నం ముక్కుపిండి వసూలు చేశాడనే కడుపు మంటతో మామగార్లు మూతి ముడుచుకుని ముభావంగా ఉన్నా అత్తలు మటుకు 'ఎంత ఎక్కువ 'ఆ ' కట్నం పిండిన అల్లుడికి 'అంత ఎక్కువ 'గా అడుగులకు మడుగులొత్తుతూ అవీ ఇవీ చేసి పెడతారు కాబట్టే 'అల్లుడికి అత్తాశ ' అని అంటారు. కానీ ఏ మామని కదిలించినా కళ్ళ నీళ్ళ పర్యంతంగా కధలూ గాధలూ వినిపించి తీరతారు!

మా ఆపీసులో పనిచేసే కోదండ రామయ్య గారికి కోపిష్టి అల్లుడట! పండక్కి వచ్చిన దగ్గరినుంచీ వెళ్ళేదాకా... చిర్రుబుర్రులాడుతూనే ఉంటాడట. పెళ్ళిలో తన ఫ్రెండ్‌కి... అప్పటికప్పుడూ స్పెషల్ గా వేడీవేడి పెసరట్లు వేసిపెట్టలేదనీ... అందరీతోపాటు ఇంత ఉండలు చుట్టుకుపోయిన చల్లటి ఉప్మాయే తగలేశారనీ...అవకాశమున్నప్పుడల్లా అమ్మాయినీ... పండక్కొచ్చినప్పుడల్లా అత్తమామల్నీ...సతాయిస్తూనే ఉంటాడట! పెళ్ళయి పదేళ్ళు అయినా... పిలిచినా పిలవక పోయినా ప్రతి పండగకీ రాకా మానడట. పెసరట్ల రికార్డు పెట్టకా మానడట!

ఇంకా కళ్యాణ రామయ్య గారికీ కవిత్వాల అల్లుడు పండకి వచ్చాడంటే ఆయనకి క్షణం ఊపిరి సలపనీయడట!వచ్చినప్పుడల్ల, తన కవిత్వాల కట్టని ఓ జోలె సంచిలో వేసుకుని... లాల్చీ పైజామాతో కాళ్ళీడ్చుకుంటు ఊరంతా తిరగటమే కాకుండా మామ గార్నికూడా తనతోపాటు తిరగమంటాడట! దారిలో తన అముద్రిత కవిత్వాలూ... వాటిలోని అందచందాలూ... ఆశువుగా వినిపిస్తూ ... 'ఆ సంస్ధ ప్రెసిడెంటు దగ్గరకు పోదాం'...'ఈ సంస్ధ సెక్రటరీని కలుసుకుందాం' అనీ వాళ్ళనీ వీళ్ళనీ ప్రాధేయపడి అర్ధిస్తూంటే...కళ్యాణ రామయ్య గారికి జాలీ, విసుగూ, కోపమూ... అన్నీ కలగలుపుగా వస్తాయట!... కానీ అల్లుడి కవిత్వాలని అమితంగా మెచ్చుకునే అమ్మాయి మనసు నొప్పించటం ఇష్టం లేక... కష్టమైనా... ఇష్టమేనని అంటకాగి తిరుగుతూనే ఉంటాడట! తిరిగినంతసేపూ తిరిగినా... ఇంటి దగ్గరన్నా కాస్త కవితా ధోరణి ఆపుతాడేమో అంటే అదీ అనుమానమేనట! బాత్ రూం లో ఉన్నా బాల్కనీలో ఉన్నా కవితలల్లుతూనే ఉంటాడట! ఏ పిండివంట విస్తట్లో వేసినా, అది తినటంకంటే దానిమీద ఓ మిని కవితో, గేయమో వినిపించి గానీ తినటానికి ఉపక్రమించడట. అల్లం పచ్చడి మీద కవితరాసి అత్తగారికీ... మాష చక్రాల మీద గేయం రాసి మామ గారికీ అంకితమిస్తాననీ అదేమంటే 'కాదేదీ కవితకి అనర్హం' అనీ కొటేషనిస్తాడట! 'అసలతనికి దమ్మిడీ కట్నం ఇవ్వకుండా,అతని కవిత్వాలన్నీ కట్ట కట్టీ అచ్చువేయించి దేశమంతా ఉచితంగా పంచి పెడితే చౌకలో పొయ్యేదయ్యా పొరపాటు చేశానూ!' అని కళ్యాణ రామయ్య గారు వాపోతూ ఉంటారు. అయినా ఆయనకు ఆయన మీదకంటే 'ఈ కవి పుంగవుడితో కాపురం ఎలా చెయ్యగలుగుతోందా?!' అని వాళ్ళమ్మాయి మీదే ఎక్కువ జాలేసేది!

ఆఫీసు వాళ్ళ పండగ అల్లుళ్ళ కధలు ఈ తీరుగా ఉంటే, అవతల వీధిలోని ఆనందరావు గారి 'అధర్టి అల్లుడీ గాధ అదో రకం! పండుకని వచ్చిన రెండు రోజులూకూడా ఇంగ్లీషు,తెలుగూ కలసిన సంకర భాషలో సణుగుతూ... సతాయిస్తూ ఉంటాడట! 'బూట్స్ ' పెట్టుకోవడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే రెండు 'గూడ్స్ ' ఉండాలనీ... బాత్రూమ్‌సూ వగైరా ఎటాచ్‌డ్‌గా లేకపోతే ఎట్లాగనీ...వీధిమీద 'పైప్స్ ' తో పందిరివేసి 'క్రీపర్స్ 'అల్లిస్తే 'నైస్ 'గా ఉంటుందనీ, తలుపు చెక్కలకూ... కిటికీ రెక్కలకూ డ్రస్సు తగిలించటం 'షేమ్ 'అనీ ... అవి తగిలించుకోవటానికి 'హేంగర్సూ ', వాటిని తగిలించుకోవటానికి 'వార్డ్ రోబూ 'లేకపోవటం 'డిస్‌గ్రేస 'నీ...నాన్సెన్సనీ...న్యూసెన్సనీ... ఇలా ఏదో ఒక వంకపెట్టి విసుక్కుంటూనే ఉంటాడట! ఇంత అసౌకర్యాలున్నాయనుకున్నవాడు పండగలకి రావటం మానెయ్యచ్చుకదా అంటే...'ఏదో మీ అమ్మాయి ఏడ్చిపోతోందని వస్తుంటాను ' అంటాడట. 'నిజానికి రాకపోతే అమ్మాయే ఏడిపిస్తుందని వస్తుంటాడ్లేవయ్యా ' అంటాడు ఆనందరావు గారు. అల్లుడు కోరిన అన్ని సౌకర్యాలూ ఆ ఇంటికి అమర్చాలంటే... ఆ ఇల్లు 'అమ్మితే 'గానీ డబ్బు చాలదనేది అందరికీ తెలిసిన సత్యమే!

ఇక జిల్లా అంతా పేరుమోసిన జమిందార్ కోటేశ్వరావుగారి 'కరాటే అల్లుడి ' కధ విననివారూ,కమామీషు కననివారూ ఉండరు. అతను వచ్చిన దగ్గరనుంచి తిరిగి వెళ్ళేకాక ఊళ్ళోవాళ్ళుకూడా ఊపిరి బిగ బట్టి మసులుకోవలసిందే! మొదటిసారిగా దీపావళికొచ్చి... హుషారెక్కువై .. తూటాలూ గట్రా ఊరిమీద విసిరేసి, కోటేశ్వరావుగారి కొంప మీదకి జనాన్ని రప్పించటంతో, 'దీపావళికి 'తప్ప మరే పండగకైనా నిరభ్యంతరంగా రావచ్చనీ... దీపావళికి మాత్రం టపాసులూ గట్రా బండికట్టి మీ ఊరికే పంపిస్తాననీ ప్రామిస్‌ చేసి, ప్రాధేయపడి మరీ అల్లుడు దగ్గర హామీ తీసుకున్నారట కోటేశ్వరావుగారు. మిగతా పండగలప్పుడు కూడా...' జీతగాడు కోస్తాడులెండి 'అన్న వినకుండా లుంగీ గోచీ పోసి ఎగగట్టి, కొబ్బరి చెట్టెక్కి గెలలుదించడం... బావమరిదితో పందెం కాసి, మేడమీదనుంచి కాళ్ళు విరక్కుండా కిందకి దూకుతాననటం... మొదలైన ఫీట్లు చేస్తాడట! పండక్కి వచ్చిన అల్లుడుకి ఏదయినా అయితే అప్రతిష్ఠ కదుటే? 'అని అత్తగారు మొత్తుకున్నా... అమ్మాయి నవ్వి ఊరుకుంటుందే తప్ప వాళ్ళాయనకి కుదురుగా కూర్చోమని నచ్చచెప్పదట! పైగా,తమ్ముడిని పిలిచీ ఒరేయ్...మీ బావగారిలాగా అరచెయ్యి నిలువుగాపెట్టి ఒకే ఒక్క వేటుతో పందిరిమంచం పట్టె విరగ్గొట్టగలవా 'అనో...'పోనీ ఇనుప బుంగకు సొట్ట పెట్టగలవా? ' అనో రెచ్చగొట్టిమరీ పందాలుకాయించి, తన పతిదేవుడి కరాటే ప్రతిభలకు పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతుందట! బుర్రమీసాలు మెలేస్తూ మామగారు 'మా కరాటే అల్లుడొస్తున్నాడోయ్ ' అని వాళ్ళు ఆయన మెహర్బానీ కోసం... ఎదురుగా సంతోషం వ్యక్తం చేసికూడా...చాటుకు పోయి జనాంతికంగా 'కరాటే అల్లుడు కాదండీ బాబూ... కోతి అల్లుడనండి ' అని నవ్వుకుంటూ ఉంటారు!

అన్నట్లు కోతి అల్లుడంటే జ్ఞాపకమొచ్చింది .. ముని మాణిక్యం వారు, వారి శ్రీమతి కాంతం బలవంతంమీద,అల్లుడికి ఆవిడ డిక్టేట్ చేస్తుండగా ఉత్తరం రాస్తూ...చివరలో అవిడేదో పనుండి వంటింట్లోకి పోంగానే... 'అల్లుడూ! మీ బావమారిదికి 'కోతి ' బొమ్మ కావాలిట... నువ్వు వచ్చేటప్పుడు తెస్తావా? లేక నువ్వేవస్తావా?' అన్న ఆఖరి వాక్యం వ్రాసి... ఆవిడకి చదివి వినిపించకుండానే పోస్టులో పడేశారట! ఆంటే 'అల్లుడే ' స్వయంగా వస్తున్నప్పుడు వేరే 'కోతి 'తో పని లేదనేగా వారి అభిప్రాయం!?

ఇలాంటి రకరకాలయిన ఇబ్బందికరమైన పండగ అల్లుళ్ళే కాక కాణీ కట్నం పుచ్చుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుని... మనసా వాచా కర్మణాకూడా... మామగార్నీ అత్తగార్నీ కలిపి జాయింటుగాకానీ... అత్తనీ మామనీ విడివిడీగా కానీ,ఏరకమైన ఇబ్బందీ పెట్టకుండా నవ్వుతూ... నవ్విస్తూ పండగ రెండ్రోజులూ గడిపేసే మంచివాళ్ళూ... మొహమాటస్తులూ అయిన అల్లుళ్ళుకూడా ఉంటారనటానికి సాక్షంగా, మా ముకుందావు గారి మూడో అల్లుడిని ఉదహరించవచ్చు! 'అల్లుని మంచితనంబును... తెల్లని కాకులను లేవు తెలియర సుమతీ 'అనే శతక పద్యానికి అతడొక ఎక్సప్షన్. ఆ మాటే ఆయనతో అంటే , దిష్టి తగులుతుందనో ఏమో... 'లేదయ్యా అతి మంచి అల్లుడితో కూడా అవస్థలు లేకపోలేదు ' అంటారు.

వాళ్ళ అల్లుడు పండక్కి వస్తున్నానని ముందుగా రాయడట! హఠాత్తుగా ఊడిపడతాడట! పండక్కి బట్టలు పెట్టడం.. ఒళ్ళు హూనం చేసుకుని పిండివంటలూ గట్రా చేసిపెట్టడం... ఇవన్ని అతనికి నచ్చవట! ఒకసారి పండక్కి, అతనికి చెబితే ఒప్పుకోడని... సుమారు అతని సైజే ఉండి ఎదురింట్లో అద్దేకుంటున్న ఓకాలేజీ కుర్రాడి కొలతలు తీసుకుని అల్లుడు వచ్చేసరికి బట్టలు కుట్టించి సిద్ధంగా ఉంచారట! పండగనాడు కట్టుకోవాలసిందేనని పట్టుబట్టి కూర్చున్నారట. అల్లుడు కాదనలేక కట్టుకుందామనుకునేసరికి, పాంటులో కాళ్ళు దూరకా... షర్టు లో.... ఇబ్బంది పడి 'సరే మీరింత మోజుపడి కుట్టించారు కనుక... మా తమ్ముడికి తీసుకెళ్తాలేండి... కానీ ఇంకెప్పుడైనా ఇలాగ బట్టల ప్రమేయం పెట్టుకుంటే నేను పండగలకే రాను ' అనేసాడట! పెళ్ళప్పుడు సన్నగా పీలగా ఉన్నాడు కాబట్టి, పెళ్ళయిన తరువాత కూడా అలానే ఉంటాడని ఊహించిన అత్తగారి అమాయకత్వానికి అందరూ కలసి నవ్వుకున్నారట !

అతనున్న ఒకటి రెండు పూటలు కూడా అమ్మాయితో పాటు అతనూ వంటింట్లోకొచ్చి, కూరలూ గీరలూ తరిగిస్తాననో... పిండి రుబ్బిపెడతాననో 'ఏదన్న నాక్కూడా పని చెప్పండీ ' అనో, అత్తగార్ని వేధిస్తూ ఉంటాడట. చూడండి అత్తయ్యగారూ... ఇలాంటి పనులన్నీ, మీ అమ్మాయి హైదరాబాదులో నాచేత చేయిస్తూనే ఉంటుంది. ఇక్కడకొచ్చేటప్పటికి ఆరింద లాగా ఫోజు పెట్టి 'ఆడపనులు మీకెందుకూ? ముందు వంటింట్లోనుంచి అవతలకి పొండి ' అంటోందీ ' అని అత్తగార్ని నవ్విస్తూ, అమ్మాయిని కవ్విస్తూ, అరమరికలు లేకుండా కలుపుగోలుగా ఉంటూ సరదాగా పండగ గడిపేస్తాడట ! 'మేమక్కడ ఎలాగూ కలిసే వుంటాం... కలిసే సినిమాలకు పోతాం... ఈ రెండ్రోజులన్నా పెద్దవాళ్ళు మీతో మమ్మల్ని సరదాగా గడపనియ్యకుండా గదుల్లో బంధించి వేరుగా చూస్తే ఎట్లా చెప్పండి? ' అంటాడట!

ముకుందరావుగారి మూడో అల్లుడి ముచ్చట విన్నవాళ్ళెవరైనా ఏమంటారో తెలుసా?... 'అవునయ్యా కాణీ కట్నం తీసుకోలేదుగనకనే కల్మషం లేకుండా నిర్మలంగా నవ్వగలుగుతున్నాడు... నవ్వించగలుగుతున్నాడు! ' అంటారు.

ఇక మా పండగ అల్లుడి సంగతంటారా అతడొకసారి వచ్చివెళ్తేగానీ, ఏకోవకు చెందుతాడో? ఏలాంటివాడో?తెలియదుగా మరి... అంతదాకా సెలవ్!

ఆదారము :పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate