অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కంప్లయింట్

కంప్లయింట్

తిరుగుదామా, వద్దా అనుకుంటూ బద్ధకంగా కాలాన్ని చూపిస్తున్న రిస్టు వాచీకేసి చిరాగా చూశాడు మూర్తి. చేతినుంచి కసిగా లాగి, దాన్ని గట్టిగా నాలుగుసార్లు విదిలించాడు. ఇంక బాగుండదన్నట్లు మొహమాటంగా అడుగులేయసాగింది సెకన్ల ముల్లు. ఇంక ఆ వాచీని నమ్ముకోవడం అనవసరమనే నిర్ణయానికొచ్చి విచారణాలయానికి చేరి "ఎక్స్యూజ్ మీ" అన్నాడు. కునుకుపాట్లు పడుతున్న ఆమె ఉలిక్కిపడి "యస్" అని వెంటనే "కాకినాడకు పోయే సెమి లగ్జరి ఎక్స్‌ప్రెస్ ఒంటి గంటకు ఒకటో నంబరు ప్లాట్‌ఫాం మీదకి వస్తుంది" అని వెంటనే కళ్ళు మూసేసుకుంది. ఏమీ అడక్కుండానే ఠక్కున సమాధానం చెప్పేసి చప్పున నిద్రలోకి జారుకున్న ఆమెకేసి ఓ క్షణం అయోమయంగా చూశాడు మూర్తి. మళ్ళీ "ఎక్స్యూజ్ మీ మేడం" అన్నాడు.

అలవాటు ప్రకారం ఆమె " కాకినాడ వెళ్ళే...." అనబోగా మూర్తి వెంటనే కల్పించుకోని "నాకు కావలసింది మచిలీపట్నం పోయే బస్సు" అన్నాడు గట్టిగా. మూర్తి అంత పెద్ద గొంతుతో అడగడంతో చిరాకుపడ్డ ఆమె "టైమెంతయిందిప్పుడు? అంది సీరియస్‌గా. ఆమె అలా ఎందుకడిగిందో అర్ధం కాకపోయినా ఒకసారి తన వాచీ వంక చూసుకుని ఒక అరగంట అటూ ఇటూగా ఊహించి చెప్పాడు. "అయితే మరో అరగంటలో రావచ్చు" అనేసి గట్టిగా ఆవులించి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. మూర్తి మరి చేసేదిలేక దగ్గర్లో ఉన్న కిళ్ళీ బంకు దగ్గరకెళ్ళి సిగరెట్టు ముట్టించి గబగబ రెండు దమ్ములు లాగాడు. "అసలు సీతకు బుద్ధి లేదు. చీటికిమాటికి పుట్టింటి మీద దిగులుపడ్డం, దిగులుపడ్డప్పుడల్లా, ఇంటికి ఉత్తరం రాసెయ్యడం, రాసినప్పుడల్లా బామ్మర్ది వచ్చి తీసుకెళ్ళడం, వారానికో, పది రోజులకో ఆఫీసుకి సెలవుపెట్టి తనే స్వయంగా అత్తారింటికెళ్ళి తీసుకురావలసిరావడంతో ఆమె మీద కోపం ముంచుకొచ్చింది.

ఆ సీటుని నేను ఆపుకున్నాను. ఇందాక బయట నుంచి నా కర్చీఫ్ కూడా వేశాను. కావాలంటే లేచి చూడు" అన్నాడు. కాస్త పక్కకి జరిగి చూసిన మూర్తి తన పక్కనే కర్చీఫ్ ఉండడంతో లేవక తప్పింది కాదు. మరో సీటు ప్రయత్నంలో పడ్డ అతనికి చివరి సీటు ఖాళీగా కనబడ్డంతో గబగబ వెళ్ళి కూర్చున్నాడు. అంతలో ఓ ఆజానుబాహువు వచ్చి అతని చేతిని విసురుగా పట్టుకుని లాగడంతో ఒక్కసారిగా ఇవతలకి వచ్చిపడ్డాడు. "అక్కడ నా సంచీ పెట్టాను, కనబడ్డంలా?....." అంటూ ఆ సీట్లో సెటిలయ్యాడతను.

అందరికంటే ముందొచ్చి కూర్చున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఏడుపొచ్చినంత పనైంది మూర్తికి. విజయవాడ నుంచి మచిలీ పట్నానికి నిలబడి ప్రయాణం చెయ్యడం అసాధ్యమని భావించి ఆ జనాన్ని నెట్టుకుంటూనే కిందికి దిగిపోయాడు విసుగ్గా. కిందికి దిగిన వెంటనే ఆ బస్సునీ, కిటికీల్లోనుంచి అవీ ఇవీ లోపలకి విసిరి సీట్లు ఆపుకుంటున్న వాళ్ళనీ మరీ మరీ తిట్టుకున్నాడు. వచ్చీ పోయే బస్సుల్ని చూస్తూ కూర్చుండి పోయిన అతను దాదాపు ప్రతి బస్సులోకీ జనం కిటికీలగుండా ఏదో ఒకటి విసిరి సీట్లు ఆపుకోవడం గమనించాడు. వాళ్ళని ఎవరూ అడ్డుకోకపోవడమే అతన్ని మరింత ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలా లాభం లేదని వెంటనే బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి లెటర్ ప్యాడ్ తీసి, అలా రౌడీ పద్ధతిలో సీట్లు రిజర్వు చేసుకోవడంవల్ల ప్రయాణీకులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బాధ్యతగల పౌరుడిగా ఒక కంప్లైంట్ రాసి కంప్లెయింట్ బాక్స్‌లో పడేశాడు.

ఆ తరువాత మరో గంట సేపు ఎంతో అసహనంగా ఎదురుచూడగా అతనికి ఎంటర్టైన్‌మెంట్ కలిగిస్తూ మరో బస్సు రావడంతో దానివైపు పరిగెత్తాడు. తను అక్కడికి ఎంత వేగంగా పరిగెత్తినప్పటికీ అప్పటికే డోర్ దగ్గర గుమిగూడిన ప్రయాణీకులతో గందరగోళంగా ఉండడంతో తను కూడా అందరి లాగే లోపలకి వెళ్ళడంకోసం ఎగబడసాగాడు. కుమ్ములాటలతో ఒళ్ళు హూనం అవుతున్నప్పటికీ అతనికి లోపలకి వెళ్ళడం అసాధ్యం కాసాగింది. అప్పటికే కిటికీల్లోంచి ఆ వస్తువులూ, ఈ వస్తువులూ లోపలికి విసురుతూ సీట్లు ఆపుకుంటున్న వారు కూడా పోటీపడుతుండడంతో అదే ఉత్తమమైన మార్గమనిపించింది అతనికి. తను కంప్లెయింట్ చేసిన విషయం గురించి కూడా మరిచి పోయి గబ గబ ఒక కిటికీ దగ్గరకొచ్చి లోపల సీటు మీద పడేట్లుగా బ్రీఫ్‌కేస్‌ని జారవిడిచాడు.

"ఇంక భయం లేదు.లోపలకి నెమ్మదిగా ఎక్కొచ్చు" అనుకొంటూ డోర్ దగ్గర ఇంకా కుమ్ముకులాడుకుంటున్న వాళ్ళని చూస్తూ తాపీగా సిగరెట్టు వెలిగించాడు. అయితే మరీ ఎక్కువమందిని ఎక్కించుకోవడం ఇష్టం లేని కండక్టరు ఇంకా ఎక్కబోతున్న వారిని కిందికి నెట్టేస్తూ గట్టిగా "రైట్...రైట్" అనడంతో డ్రైవర్ ఒక్కసారిగా బస్సుని ముందుకి దూకించాడు. సడన్‌గా బస్సు కదలడంతో కంగారుపడిన మూర్తి సిగరెట్టును పడేసి గబగబ డోర్ దగ్గరకి పరిగెత్తాడు. లోపలకి ఎక్కబోతున్న వాళ్ళని కిందికి నెట్టేస్తూ కండక్టర్ డోర్‌ని గట్టిగా వేసెయ్యడంతో బస్సు ఒక్కసారిగా స్పీడందుకుంది. దాంతో వెర్రెత్తి పోయిన మూర్తి గట్టిగా కేక వేస్తూ బస్సు మీద చేత్తో బాదుతూ వెంటబడసాగాడు. అతని అరుపులు అన్ని బస్సుల మధ్య అరణ్య రోదన అయిపోతుండగా బస్సు కనుమరుగైపోవడంతో మూర్చవచ్చినంత పనైంది మూర్తికి. గబ గబ కంట్రోల్ రూంకి పరిగెత్తి తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు.

"అసలైనా కిటికీలో నుంచి సీట్లాపుకోవచ్చని ఎవరయ్యా చెప్పింది నీకు? క్యూ పద్ధతిని పాటించాలని తెలీదూ?" అన్న కంట్రోలర్ మందలింపుకి "తప్పై పోయింది మహా ప్రభో! నా బ్రీఫ్‌కేస్ సంగతి చూడండి" అంటూ దాని వివరాలు చెప్పాడు. "అది నాన్‌స్టాప్ బస్సయ్యా. దార్లో ఎక్కడా ఆగదు. మచిలీపట్నం బస్టాండుకి ఫోన్ చేసి చెబుతాను. నెక్స్ట్ బస్‌లో వెళ్ళి అక్కడి కంట్రోలర్‌ని కలుసుకో. నీ బ్రీఫ్‌కేస్‌ని బస్సులో ఎవరూ కాజేయకుండా ఉంటే వాళ్ళు జాగ్రత్త చేస్తారు. మరోసారి మాత్రం ఇటువంటి తెలివితక్కువ పనులు చెయ్యకు" అంటూ ఫోన్ చెయ్యడంలో నిమగ్నమయ్యాడు. తను చేసిన పనికి చాలా సిగ్గనిపించిన మూర్తి అక్కడే ఉన్న బల్ల మీద నిస్సత్తువగా కూలబడ్డాడు. "ఈ విషయం భార్యకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అత్తగారింట్లో పరువు పోవడమంటే ఎంత నామర్దా?..."

ఆ బ్రీఫ్‌కేస్‌లో భార్య కోసం కొన్న పట్టు చీర ఉందన్న విషయం గుర్తుకొచ్చేసరికి మరింత ఏడుపొచ్చింది. "అసలు బ్రీఫ్‌కేస్ దొరుకుతుందో, లేదో! వెధవ సీటు కోసం అడ్డ దారి తొక్కి విలువైన వస్తువుని పోగొట్టుకున్నాను" అనుకుంటుండగా ఎదురుగా ఉన్న కంప్లెయింట్ బాక్స్ దృష్టిలో పడి వెక్కిరించడంతో గబుక్కున మొహానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకున్నాడు.

ఆదారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate