పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను, రసాయనిక ఎరువుతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకొంటూ 20-25 శాతం వరకు నత్రజనిని ఆదాచేయవచ్చు. వరి పోలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్ల పెసర లాంటి పచ్చిరోట్ట పైరును పెంచి ముందే కలియదున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక సుమారు 20-25 శాతం నత్రజనిని ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చనాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టిరియా మొదలగు జవన ఎరువులను వాడి నాత్రజని, భాస్వర మోతాదును 10-20 శాతం తగ్గించవచ్చు.
అజోల్లా వాడడం కోసం వరి పొలం దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పలుచగా నీరు నిలువగట్టి 100-150 కిలోల అజోల్లా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజనిని నెలకు అందిస్తోంది. అజటోబ్యాక్టర్ వాడుటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400గ్రా. కల్చరును పట్టించాలి. లేదా 1 కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేల పై చల్లాలి. దీని వలన ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఎరోబిక్ వారిలో మాత్రమే ఇది అవసరం. ఫాస్పోబ్యాక్టీరియా భాస్వరపు జీవన ఎరువులలో ముఖ్యం. భూమిలో లభ్యంకాని స్ధితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఫాస్ఫోబ్యాక్టరియా లేదా అజోస్పైరిల్లంను అజటోబ్యాక్టర్ లాగే వినియోగించాలి.
స్వల్పకాలిక రకాలకు నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటడానికి ముందు దమ్ములోను, బాగా దుబ్బుచేసే దశలోను, అంకురం తొడిగే దశలోను, చొరవ పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి, 36-48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. మధ్య దీర్ఘకాలిక రకాలకు 4 దఫాలుగా 15-20 రోజులకు ఒకసారి నత్రజనిని వేయాలి. నత్రజనిని చివర్ దఫా అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత వేయకూడదు.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక
చివరిసారిగా మార్పు చేయబడిన : 12/18/2023