టేకు కలప వృక్షాలలో రారాజు. దీని టింబర్ విలువ అధికము. దీనితో తయారు చేసిన ఫర్నిచర్, తలపులు, కిటికీలు చాలా అందంగా మరియు నాణ్యతను కలిగి దీర్ఘకలము మన్నికగా ఉంటాయి.
మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పెంచవచ్చును. ఎర్రనేలలు, ఒండ్రు నేలలు అనువైనవి. మెట్ట భూముల్లో, చేల గట్ల మీద మరియు కంచెల చుట్టా పెంచవచ్చు. నీటి ముంపు ప్రదేశాలలో ఇవి పెరగవు.
జూలై మరియు నీటి సదుపాయం ఉన్నప్పుడు ఈ పంట ఏ కాలంలోనైన నాటవచ్చును.
విత్తనాలను వేడి నీటిలో 2-4 గంటల వరకు వుంచి తర్వాత చల్లబడ్డాక విత్తుకోవాలి లేదా విత్తనాలను ప్రతి రోజు రాత్రి నానబెట్టి పగలు ఎండబెట్టాలి. ఇలా 15 రోజులు చేసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి.
స్టంపు లేదా టిష్యుకల్చర్ మొక్కల ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు. ఎకరానికి 1000 మొక్కలు.
6 మీ. పొడవు, 1.2 మీ. వెడల్పు గల నారుమడుల్లో ఫెబ్రవరి-మే మధ్య విత్తుకోవాలి. ఇలా మొలచిన మొక్కలను ఒక సవత్సరము పాటు పెరగనివ్వాలి.
మొక్కల దూరము : 3 x 1.3 మీ.
ప్రతి పాదులో స్టంపు నాటే గుంతల్లో 4 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వర్మికంపోస్టుతో పాటు 50 గ్రా. 3 శాతం లిండెన్ పొడిని వేసి నాటుకోవాలి. ఆ తర్వాత క్రింది పట్టకి ప్రకారం ఎరువులు వాడాలి.
వయస్సు | ఎరువు | మోతాదు | దఫాలు | సమయము |
---|---|---|---|---|
మొదటి సం. | డి.ఏ.పి | 150 గ్రా. | 2 | జూలై-డిసెంబర్ |
రెండవ సం. | డి.ఏ.పి | 300 గ్రా. | 2 | జూలై-డిసెంబర్ |
మూడవ సం. | డి.ఏ.పి | 400 గ్రా. | 2 | జూలై (వర్షం పడిన తరువాత) |
స్టంపులు/మొక్కలు నాటగానే వారం వరకు రోజు విడిచి రోజు నీరు పోయాలి. ఆ పైన వర్షాలు లేనప్పుడు 15-20 రోజుల కొకసారి నీరు ఇవ్వాలి. వేసవి కాలంలో 10-15 రోజుల కొకసారి నీరు ఇవ్వాలి. ఇలా 2-3 సంవత్సరాల వరకు వేసవిలో నీరు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో కూడా నీరు పెట్టవచ్చు.
మొదటి సంవత్సరము చెట్ల మధ్య లోతుగా దున్నాలి. పాదుల్లో కలుపు మొక్కలు తీసివేసి పాదులను బాగు చేయాలి. చెట్ల క్రింద కొమ్మలను కొంత ఎత్తు వరకు కత్తిరించాలి. 5,6 సంవత్సరాలకి పెద్ద వాసం సైజు మొక్కలు అవుతాయి. 6 సంవత్సరాల తర్వాత మొక్కకు మొక్కకు మధ్య 2.6 మీ. ఎడం ఉంచి మధ్యనున్న మొక్కను తీసివేయాలి. 12 సంవత్సరాల తర్వాత మొక్కకు మొక్కకు 5.2 మీ. ఎడం ఉండేటట్లు మధ్యనున్న మొక్కను తీసివేయాలి. మిగిలిన మొక్కలు 15-18 సంవత్సరాలకు మంచి కలపనిస్తాయి.
25-30 సంవత్సరాల టేకు చెట్టు నుండి లభించే కలప సుమారు 20 ఘనపు అడుగులు. ఎకరం కలప దిగుబడి 3200 ఘనపు అడుగులు.
ఆధారం : వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021