“మేక్ ఇన్ ఇండియా” (భారతదేశం లో తయారుచేయండి ) భారతదేశం లో సంస్థలను వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించటానికి భారతదేశం ప్రభుత్వం యొక్క నూతన పథకం/చొరవ. దీనిని 25 సెప్టెంబర్ 2014 న ప్రధాన మంత్రి, నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు.
ఈ చొరవ ప్రధానంగా దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారులకు 125 కోట్ల జనాభాతో బలమైన భారతదేశం - ఒక తయారీ కేంద్రంగా నిర్మించడానికి మరియు ఉద్యోగావకాశాలు సృష్టించడానికి హామీ పూర్వక అనుకూలమైన వాతావరణం కల్పిస్తుంది.
ఈ చొరవ వెనుక ప్రధాన లక్ష్యం నూతన ఉద్యోగ సృష్టి మరియు నైపుణ్యం అభివృద్ధికి తోడ్పడటం. ఆర్ధిక వ్యవస్థలోని 25 రంగాల మీద ఇది దృష్టి సారిస్తుంది.
ఈ రంగాల్లో కొన్ని: ఆటోమొబైల్స్, రసాయనాలు, ఐటి, ఫార్మాస్యూటికల్స్, వస్త్రాలు, పోర్టులు, ఏవియేషన్, లెదర్, పర్యాటక మరియు ఆతిధ్యం, వెల్నెస్, రైల్వేలు, ఆటో భాగాలు, డిజైన్ తయారీ, పునరుత్పాదక శక్తి, మైనింగ్, బయో-టెక్నాలజీ, మరియు ఎలక్ట్రానిక్స్ మొదలగునవి. ఇది జి.డి.పి. ( GDP ) పెరుగుదల మరియు పన్ను ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అధిక నాణ్యత ప్రమాణాల లక్ష్యంతో పర్యావరణం పై ప్రభావంని తగ్గించడం. ఈ చొరవ భారతదేశానికి సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది.
మేక్ ఇన్ ఇండియా వాస్తవానికి ఆర్థిక వినయం, పరిపాలనా సంస్కరణలు గల ఒక న్యాయపరమైన సమ్మేళనంగా ఉంటుంది. తద్వారా ప్రజల పిలుపు అనువుగా మారనుంది - ఒక ఔత్సాహిక భారతదేశం (An aspiring India).
అధికారిక వెబ్ సైట్ www.makeinindia.gov.inలో విజన్ స్టేట్మెంట్ మధ్యేమార్గంలో ఏడాదికి 12-14% తయారీ రంగం వృద్ధి పెరుగుదల సాధించడానికి కట్టుబడి ఉంది. 2022 నాటికి దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తిలో తయారీ రంగం వాటా 16% నుండి 25% కి పెంచడం. ముఖ్యంగా కేవలం తయారీ రంగం లోనే 2022 నాటికి 100 మిలియన్ అదనపు ఉద్యోగాలు సృష్టించగలదు. దేశం మొత్తం ఉత్పత్తిలో ఐదింట నాలుగవ వంతు వాటాను కలిగిన తయారీ రంగం జనవరి 2010 లో కొద్దిగా 3.3 శాతం పెరిగి చాలా ఎక్కువగా ప్రతిష్టాత్మక లక్ష్యాలు గల మేక్ ఇన్ ఇండియా కు ఒక నేపథ్యంను ఇచ్చింది.
2020 సం. కల్లా మన దేశం ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మరియు తయారీ రంగంలో మొదటి మూడు గమ్యస్థానాలలో ఒకటిగా ఉండాలన్నది ఉద్దేశ్యం. ఇది బ్రిక్స్ స్థాయిలో 2050 సం.లో భారతదేశం యొక్క పాత్రను గురించి వాగ్దానం చేసినదానికంటే చాలా ప్రతిష్టాత్మక విషయం. భారత తయారీ రంగం తదుపరి 2-3 దశాబ్దాల వరకూ "అనుకూలమైన జనసంఖ్య డివిడెండ్" వంటి సానుకూల అంశాలను కలిగి ఉంది. నాణ్యమైన శ్రామిక బలం మన దేశంలో నిరంతరాయంగా లభించటం మరొక ప్రయోజనం చేకూరే అంశం. ఉద్యోగుల నిర్వహణ వ్యయం కూడా ఇతర దేశాలతో పోలిస్తే సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. మన దేశంలో విశ్వసనీయత మరియు నైపుణ్యాలతో పనిచేస్తున్న బాధ్యతాయుత వ్యాపార సంస్థలు చాలా ఉన్నాయి. మన దేశంలో చట్టాల నియమాలతో పాటు దేశీయ మార్కెట్ లో ఒక బలమైన వినియోగదారులను పొందే సామర్థ్యం గల ఒక ప్రజాస్వామిక రాజ్యాంగము ఉంది.
సాంకేతిక సముపార్జన మరియు అభివృద్ధి నిధి తగిన సాంకేతికను కొనుగోలు చేయడం కొరకు ప్రతిపాదించబడింది. ఒక పేటెంట్ పూల్ ను సృష్టించి పరికరాలు దేశీయ తయారీని అభివృద్ధి చేసి కాలుష్య నియంత్రణ మరియు శక్తి వినియోగం తగ్గించడం కోసం ఉపయోగిస్తారు. ఈ ఫండ్ ఒక స్వాధికార పేటెంట్ పూల్ గా కూడా మరియు లైసెన్సుల జారీ సంస్థగా పని చేస్తుంది. ఇది పేటెంట్ కలిగినవారి నుండి మేధో సంపత్తి హక్కులు కొనుగోలు చేస్తుంది.
తయారీ రంగం నైపుణ్యం కలిగిన కార్మికులు లేకుండా సొంతంగా అభివృద్ధి అవలేదు మరియు ఈ సందర్భంలో నైపుణ్య అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇతర నైపుణ్య అభివృద్ధి పథకాలు తీసుకురావటం గమనించదగ్గ విషయం. తగిన నైపుణ్యత సృష్టించటం ఖచ్చితంగా పట్టణ ప్రాంత పేదలను కలుపుకొని గ్రామీణ ప్రవాసీయులను అభివృద్ధి దిశగా పయనించేలా చేస్తుంది. ఇది తయారీ మెరుగుపరచుకునే దిశగా ఒక కీలకమైన అడుగు అవుతుంది.
నైపుణ్యతా అభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ అనే నూతన మంత్రిత్వశాఖ నైపుణ్యతా అభివృద్ధిపై జాతీయ విధాన పునర్నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం మరొక కొత్త చొరవ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద, ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన అనే నైపుణ్య అభివృద్ధి పథకం చేపట్టినది - ఆర్థిక స్థితి మెరుగుదల కోసం నైపుణ్యతా అభివృద్ధి.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
పారిశ్రామిక వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులు పెంచినప్పుడు మాత్రమే భారతదేశ గ్రామీణ జనాభాలో గణనీయ భాగాన్ని అధికాదాయం ఇచ్చే, అధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఆర్థిక కార్యకలాపాలకు తరలించడం సాధ్యమవుతుంది. దీనివల్ల భారత్ మళ్ళీ అధిక వృద్ధిరేటు నమోదు చేసుకోగలుగుతుంది. గడచిన ముప్ఫై సంవత్సరాలుగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో పారిశ్రామిక ఉత్పత్తి వాటా ఎదుగు బొదుగూ లేకుండా 16శాతం వద్దే నిలిచిపోయింది. 2011లో వెలువరించిన జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి విధానం(ఎన్‌ఎంపీ), 2022నాటికి ఈ వాటాను 25శాతానికి పెంచి పది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని లక్షించింది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తూ, ఉత్పాదక వస్తువులు తయారుచేస్తూ, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న పరిశ్రమలను ఎన్‌ఎంపీ ప్రోత్సహిస్తుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ప్రభుత్వరంగ పరిశ్రమలపైనా దృష్టి కేంద్రీకరిస్తుంది. జాతీయ పెట్టుబడులు, పారిశ్రామిక ఉత్పత్తి మండలాలు(ఎన్‌ఐఎంజడ్‌లు) సృష్టించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి వూతమివ్వాలని ఎన్‌ఎంపీ ఆశిస్తోంది.
ఎన్‌ఎంపీ అమలు వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా (భారత్‌లో తయారు చేయడం) విధానాన్ని ముందుకు తెచ్చారు. భారతదేశాన్ని అంతర్జాతీయ పారిశ్రామిక వస్తుతయారీ కేంద్రంగా మార్చడానికి మోదీ కంకణం కట్టుకున్నారు. ఈ విధానం మీద పెట్టుబడిదారులు, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలూ ఆసక్తి చూపుతున్నాయి. దీర్ఘకాలంలో భారత్ దశ దిశ మార్చే సత్తా మేక్ ఇన్ ఇండియాకు ఉంది. హరిత విప్లవం, క్షీర విప్లవం ద్వారా భారత్ అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూసింది. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా కూడా పారిశ్రామిక వస్తూత్పత్తి రంగాన్ని రూపాంతరం చెందించగలదు. కొత్త ఉద్యోగాలు సృష్టించి, స్వదేశంలో వస్తుసేవలకు గిరాకీ పెంచగలదు. తక్కువ స్థాయి నైపుణ్యాలు కలిగిన కార్మికులకూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. యువతలో వ్యవస్థాపక సామర్థ్యాలు పెంపొందిస్తుంది.
ఈ విధానం విజయవంతం కావాలంటే మొదట వ్యాపారానికి విధానపరంగా, నియంత్రణపరంగా ఎదురవుతున్న అడ్డంకులు తొలగించాలి. వ్యాపార సౌలభ్యపరంగా దేశాలకు ర్యాంకులిస్తూ ప్రపంచ బ్యాంకు రూపొందించిన జాబితాలో భారత్ ఎక్కడో 134వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితిని తక్షణమే మార్చాలి. భారత్‌లో శీఘ్రంగా వ్యాపారం ప్రారంభించడానికి వీలుగా కేంద్ర, రాష్ట్రాలు ఏక గవాక్ష విధానాన్ని చేపట్టాలి. ఇలాంటి విధానం ఉన్నప్పుడు వ్యాపార సంస్థలు ప్రభుత్వ నిబంధనల్ని సక్రమంగా పాటిస్తాయి. తనిఖీ ప్రక్రియలకు సహకరిస్తాయి. పారిశ్రామిక వివాదాల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా పరోక్ష పన్నుల క్రమబద్ధీకరణకు వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) ఎంతో తోడ్పడుతుంది. కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)నూ తగ్గిస్తే, పరిశ్రమలపై పన్ను భారం తగ్గుతుంది. మోదీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడం స్వాగతించాల్సిన పరిణామం. ముడిసరకులు, విడిభాగాలపై పన్నుల్నీ తగ్గిస్తే, ఉత్పత్తులు చౌకగా లభ్యమవుతాయి. స్వదేశంలో విలువ జోడించిన పారిశ్రామిక వస్తూత్పత్తి వూపందుకొంటుంది. కార్మిక చట్టాలు, నిబంధనల్లో పట్టువిడుపులు ఉంటే ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయి. దీనికోసం 44 కేంద్ర, 160 పైచిలుకు రాష్ట్ర కార్మిక చట్టాలను నాలుగు విభాగాలుగా- పారిశ్రామిక సంబంధాలు, వేతనాలు, ఉపాధి ప్రమాణాలు, సామాజిక భద్రతల కింద వర్గీకరించాలి. కార్మిక చట్టాలు లోపభూయిష్టంగా రూపొందిస్తే కార్మిక మార్కెట్ చీలిక పేలికలవుతుంది. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి సాధించడం వీలుపడదు. అంతర్జాతీయ అనుభవాలు నేర్పుతున్న పాఠాలివి. కార్మిక చట్టాల్లో పట్టువిడుపులు ఉంటే కార్మిక శక్తికి, పరిశ్రమల ప్రయోజనాలకు మధ్య సమతూకం ఏర్పడుతుంది. ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పెరుగుతాయి.
భూమి, విద్యుత్, మౌలిక వసతులు పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలుస్తాయి. కనుక పరిశ్రమల స్థాపన కోసం ప్రతి రాష్ట్రంలో భూ బ్యాంకులు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూములను పరిశ్రమలకు ఉపయోగించుకునే విధంగా నిబంధనలు సడలిస్తే, భూ సేకరణ ప్రక్రియ సులువవుతుంది. భూ సేకరణ చట్టానికి కేంద్రం ఇటీవల సవరణలు చేయడం పారిశ్రామికవేత్తల్లో ఉత్సాహం నింపుతోంది. విద్యుత్ గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు బొగ్గు, ఇనుము, ఉక్కు, విద్యుత్ ప్లాంట్ సామగ్రి ఉత్పత్తినీ పెంచాలంటే స్తంభించిపోయిన విద్యుత్ ప్రాజెక్టులను వెంటనే పునరుద్ధరించాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సొంత విద్యుత్ ప్లాంట్లు స్థాపించుకునే సామర్థ్యం ఉండదు. వీటికి గ్రిడ్ నుంచే కరెంటు సరఫరా చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా రైలు, రోడ్డు, రేవు సౌకర్యాలను పెంపొందించవచ్చు. దీనివల్ల మౌలిక వసతుల కల్పనకు లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ఎన్‌ఐఎంజడ్ విధానం కూడా పారిశ్రామిక వస్తూత్పత్తికి ఆధునిక మౌలిక వసతులను సమకూరుస్తుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విధానమూ భారతదేశ పారిశ్రామిక వస్తూత్పత్తిని వృద్ధి చేస్తుంది. అధిక విలువ జోడించడానికి ఆస్కారమున్న జౌళి, విద్యుత్‌వస్తు ఉత్పత్తి వంటి రంగాలకు వూపు ఇవ్వడానికి వీలుగా మేక్ ఇన్ ఇండియా విధానంతో విదేశీ వాణిజ్య విధానాన్ని సమన్వయం చేయాలి. అంతర్జాతీయ విపణుల్లో పోటీపడగలిగే విధంగా భారతీయ ఉత్పత్తుల నాణ్యత పెంచాలి. కేంద్రం స్థాపించబోతున్న 3పీ (పీపీపీ) ఇండియా సంస్థ మేక్ ఇన్ ఇండియా విధానంలో ప్రైవేటు రంగం పాలుపంచుకునేలా చేయాలి.
కార్మిక ఉత్పాదకత పెంచి, పెట్టుబడులు ఆకర్షించడానికి మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడం అవసరం. ఐటీఐ శిక్షణకు పారిశ్రామిక అప్రెంటిస్‌షిప్‌ను కూడా జత కలిపితే నిపుణులైన శ్రామికులు లభ్యమవుతారు. పరిశ్రమలు, విద్యారంగ నిపుణులు చేతులు కలిపితే దేశంలో పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలు వూపందుకొంటాయి. భారతదేశంలో పకడ్బందీ న్యాయవ్యవస్థ ఉండటంతో విదేశాలు మనకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి సుముఖంగా ఉన్నాయి. విధానపరంగా విస్తృత మార్పులు చేయడానికితోడు, భారత్‌కు ఆధిక్యం ఉన్న నిర్దిష్ట రంగాలపై శ్రద్ధాసక్తులు కేంద్రీకరించాలి. ఉదాహరణకు వ్యవసాయం తరవాత అత్యధికులకు ఉపాధి కల్పించే జౌళి రంగం నుంచి ఎగుమతులకూ అపార అవకాశాలు ఉన్నాయి. వడ్డీరేట్లు తగ్గించి, వలస కార్మికులకు బస ఏర్పాటు చేసి, క్లస్టర్ పద్ధతి అనుసరిస్తే జౌళి పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది. సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల సామగ్రిని భారత్ సొంతగా తయారు చేసుకోవాలి. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ఐటీ, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమలకు సానుకూల సుంకాల వ్యవస్థను వర్తింపజేయాలి. పన్ను రాయితీలు ఇవ్వాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి క్లస్టర్ పద్ధతి చేపట్టాలి. ఈ విషయంలో భారత్, తూర్పు ఆసియా దేశాలకన్నా వెనకబడి ఉంది. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో భారత్ స్వావలంబన పెంపొందించుకోవాలి. ఇందుకు ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.
భారతదేశానికి వయోజనాధిక్య ప్రయోజనం ఉంది. ఇక్కడ విద్యావంతుల సంఖ్యా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. వీరందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా పారిశ్రామిక వస్తూత్పత్తి రంగానికి ఉంది. ఈ సత్తాను ఆచరణలోకి తెస్తే భారతదేశం చరిత్రలో కనీవినీ ఎరుగనంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.
ఆధారము: ఈనాడు
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/9/2020
ఎంఎస్ఎంఈ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా'కు ఊతమిచ్చేందుకు...