অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మహిళా స్వయం సహాయక బృందాలు

మహిళా స్వయం సహాయక బృందాలు

ముందు మాట

కవ్వం కదురాడే ఇంట కరువే ఉండదు అన్నారు పెద్దలు. ఒక మంచి పాడి పశువు ఒక ఎకరం భూమితో సమానం.

పాడి పశువుల పోషణ లాభసాటిగా ఉండాలంటే పది సూత్రాలను తప్పక పాటించాలి.

  1. మేలు జాతి పశువులనే ఎంపిక చేసుకోవాలి.
  2. పాడిపశువులు సకాలంలో సక్రమంగా ఎదకు వచ్చి, చూలుకట్టేటట్టుచూసుకోవాలి.
  3. చూడి పశువుల పోషణలో శ్రద్ధ చూపాలి.
  4. పాడిపశువులు ప్రతి సంవత్సరం ఈనేటట్టుపునరుత్పత్తియాజమాన్యంలో తగు మెళకువలు పాటించాలి.
  5. లేగదూడల పోషణలో శాస్త్రీయ పద్ధతులు పాటించి త్వరగా ఆరోగ్యం పెరిగేటట్టు చూసుకోవాలి.
  6. పెయ్యలు సకాలంలో ఎదకు వస్తున్నాయా లేదా గమనించాలి.
  7. పాడి పశువులకు ఉత్పత్తికి తగినట్లుగా మేపును అందించాలి.
  8. పుష్టికరమైన పచ్చి మేతలు సాగు చేసుకొని పశువులకు మేపుకోవాలి.
  9. మేతవృధాకాకుండా ముక్కలుగా నరికి మేపుకోవాలి.
  10. పాల ఉత్పత్తి ఖర్చులు తగ్గించి గిట్టుబాటు ధరలోపాలనుఅమ్ముకోవాలి.

పాడిపశువుల ఎంపిక

  1. పాడి పరిశ్రమ నిర్వహణలోపశువుల ఎంపిక ముఖ్యమైనది. నాశిరకం పశువులకు మరియు ఎక్కువ పాల దిగుబడి ఇచ్చేపశువులకుపోషణఖర్చులుదాదాపుసరిసమానం.కాబట్టిలాభసాటిగాపాలఉత్పత్తిసాధించాలంటేమేలుజాతిపశువులనేఎంపికచేసుకోవాలి.
  2. పాడిపశువుల ఎంపిక,పశువు శరీర లక్షణాలు, దానిసంతతి,ఉత్పత్తిసామర్ధ్యాలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది.
  3. పశువు సంతతి వివరాలు ప్రభుత్వ ఫారాలలో లేదా పెద్ద పెద్ద ఫారాలలో దొరుకుతుంది కాబట్టి సంతలో కొనుగోలు చేసేటప్పుడు పశువు శరీర లక్షణాలు, దానిపాల ఉత్పత్తిసామర్ధ్యాన్నిబట్టి కొనుగోలు చేయాలి.
  4. పాడిపశువులుమొదటి5ఈతలలోనేగరిష్టస్థాయిలోపాలదిగుబడియివ్వగలవుకాబట్టిమొదటిఈతలేదారెండవఈతలోఉండిఈనిననెల లోపు పశువులనేఎంపికచేసుకోవాలి.
  5. పశువును వరుసగా మూడు సార్లు పాలు పితికి దాని పాల ఉత్పత్తి సామర్ధ్యాన్నిబట్టి కొనుగోలు చేసుకోవాలి.
  6. దురలవాట్లు లేని ఆరోగ్యమైన పశువులను, మచ్చికగా ఉండి మన వాతావరణానికిఅలవాటుపడే పశువులనే పోషించుకోవాలి.
  7. అక్టోబర్, నవంబర్ మాసాలు పాడిపశువులను కొనడానికి అనుకూలమైనవి. పశువు ఈనిన 90 రోజుల వరకు అత్యధికంగా పాల దిగుబడిని యిస్తుంది. కాబట్టి ఈనిన నెలలోపుపశువులనే ఖరీదు చేసుకోవాలి.

మేపులో మెళకువలు

అధికోత్పత్తి సాధించాలంటే పశువులకు మంచి పోషక విలువలున్న ఆహారం మేపాలి.

  • పాడి పశువుల పోషణ ఖర్చులో 60-70 శాతం మేపు కొరకు ఖర్చవుతుంది.
  • మేపు గురించి శాస్త్రీయ పరిజ్ఞానం వుంటే, అందుబాటులో వున్నా దాణా దినుసులతో సమీకృత దాణా మిశ్రమాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని లాభదాయకంగా పశువులను పోషించుకోవచ్చు.
  • పశువులకు ప్రతి 100 కిలో గ్రాముల శరీర బరువుకు 2 కిలోల పొడి పోషక పదార్ధములు కావాలి. ప్రతి కిలో పాల ఉత్పత్తికి 50 గ్రాముల జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు కావాలి. రోజుకు 7-9 లీటర్ల పాలిచ్చే పశువులు 7 కిలోల జీర్ణయోగ్యమైన పాడిపోషక పదార్ధములు, యిందులో 0.75 కిలోల జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు కావాలి.
  • పచ్చిమేత స్వంత భూమిలో సాగు చేసుకొని పాడి పశువులకు మేపుకోవడం లాభదాయకం. పుష్పలంగా పచ్చిమేత మేపగల్గితే మామూలుగా కావలిసిన దాణాలో మూడవ వంతు తగ్గించుకోవచ్చు. 6-7 లీటర్ల పాలిచ్చే పశువులకు 1:3 నిష్పత్తిలో కాయజాతి, ధాన్యపుజాతి పచ్చిమేతలు కలిపి మేపగల్గితే ఎలాంటి దాణా ఖర్చులు లేకుండా పాల ఉత్పత్తిని తీయవచ్చు.
  • పాడి పశువులకు అన్నిటికి ఒకే విధంగా మేపకుండా, వాటి పాల ఉత్పత్తిని అందుకు కావలిసిన పోషక పదార్ధాల అవసరాన్ని దృష్టిలో వుంచుకొని మేపు అందివ్వాలి.
  • పాడి పశువులకు పుష్కలంగా పరిశుభ్రమైన నీరు త్రాగడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. ప్రతి పాడి పశువుకు రోజు 35-45 లీటర్ల నీరు త్రాగడానికి యింతే మోతాదులో దానిని కడగడానికి శుభ్రతకు కావాలి. సుమారు ప్రతి పశువుకు రోజుకు 100 లీటర్ల నీరు కావలసి వస్తుంది.

లభించే దాణా దినుసుల అందుబాటుని బట్టి ఈ క్రింద సూచించిన దాణా మిశ్రమాలలో ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాలలో ఏదైనా తయారుచేసుకోవచ్చు. ఈ మిశ్రమాలలో 68-70 శాతం జీర్ణయోగ్యమైన పోషక పదార్ధములు మరియు14 నుండి 16 శాతం జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు లభించును.

దాణా దినుసులు

1

2

3

4

5

6

1. జొన్నలు, మొక్కజోన్నవంటి ధాన్యము

30

20

20

30

40

30

2. గోధుమ పొట్టు, తవుడు

32

50

40

50

10

3. గానుగపిండి

25

20

20

20

20

25

4. శనగ పొట్టు లేదా పెసర, మినుప పొట్టు

-

-

20

-

30

25

5. ప్రత్తి గింజల చెక్క

-

-

-

-

-

20

6. బెల్లపు మడ్డి

10

7

-

-

-

-

7. లవణ మిశ్రమాలు

3

3

3

3

3

3

మేపు మోతాదు నిర్ణయించడంలో సాధారణ సూత్రాలు

  1. పాడి పశువులు ఎండుమేత పచ్చిమేత కలిపిమేపేటప్పుడు ప్రతి 100 కిలోల శరీర బరువుకు 1 కిలో ఎండుమేత, 4-5 కిలోల పచ్చిమేత మేపవచ్చు. ఎండు గడ్డి, పచ్చి గడ్డి కలిపిమేపితే రోజుకు ఒక పశువుకు 5-6 కిలోల ఎండు గడ్డి 15 కిలోల పచ్చిమేత కావాలి.
  2. దాణా మోతాదును పశువు పాల ఉత్పత్తిని బట్టి యివ్వాలి. అది యిచ్చు పాలలో రెండు కిలోల పాల తర్వాత అదనంగా యిచ్చే ప్రతి 3 లీటర్ల పాలకు, గేదెలకు ప్రతి 2.5 లీటర్ల పాలకు ఒక కిలో చొప్పున దాణా యివ్వాలి. దాణా రెండు సమాన భాగాలు చేసి ఉదయం, సాయంత్రం, పాలు పితికే ముందు మేపాలి.

పాడి పశువులకు యివ్వవలసిన పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా మోతాదుల పట్టిక

పశువుల పాల ఉత్పత్తి

పచ్చిమేత

(కిలోలు)

ఎండు మేత (కిలోలు)

దాణా (కిలోలలో)

గేదెకు

ఆవుకు

పుష్కలంగా పచ్చిమేత లభించే సమయంలో

5 కిలోల వరకు

30

4

-

-

5-8 కిలోల వరకు

30

4

1.5

1.0

8-11 కిలోల వరకు

30

4

2.00

1.5

11-15 కిలోల వరకు

30

4

3.00

2.5

పచ్చిమేత కొరత సమయంలో

5 కిలోల వరకు

4

8

2.0

1.5

5-8 కిలోల వరకు.....

4

8

3.0

2.5

8-11 కిలోల వరకు...

4

8

4.5

3.0

11-15 కిలోల వరకు..

4

8

5.0

3.5

పశువులలో ప్రధమ చికిత్స

పశువులకు గాయాలు కలగడం, కొమ్మలు విరగడం సర్వ సాధారణం. అంతేకాకుండా సామాన్యంగా మేత ఎక్కువగా తిన్నప్పుడు, కుప్ప నూర్పుడు చేసేటప్పుడు గింజలు తినడం వల్ల కడుపు కుట్టు, కడుపు ఉబ్బడం జరుగుతుంది. ఈ వ్యాధులకు వెంటనే చికిత్స చేయించడం మంచిది లేదా ప్రమాదం. మనకు పశువైద్యం అందుబాటులో లేనప్పుడు మరింకే పరిస్థితులలో వైద్య సహాయం అందలేని స్థితిలో వ్యాధి తీవ్రతరం కాకుండా కొన్ని ప్రధమ చికిత్స చర్యలు పాటించాలి.

గాయాలు

  1. గాయాలను పొటాషియం పర్మంగానేటు కాని, ఫినాయల్ ద్రావకంతో కాని, శుభ్రం చేయాలి. మరగబెట్టి ఉప్పు నీటితో చీము పట్టిన పుండ్లను శుభ్రం చేయవచ్చు.
  2. రక్తం కారుతున్నప్పుడు గాయానికి పైగా బిగ్గరగా కట్టుకడితే రక్తం ఆగుతుంది. శుభ్రమైన దూది అందులో దూర్చి రక్తం కారకుండా చూడాలి. కొంచెం సల్ఫనిలమైడ్ పౌడరు వేసి కట్టుకట్టాలి.
  3. పురుగులు పట్టిన గాయాలకు పురుగులు తీసివేసి కర్పూర తైలం పోయాలి. లేదా సీతాఫలము ఆకు, పసుపు నూరి పురుగుపట్టిన పుండ్లకు రాసినట్లైతే పురుగులు చనిపోయి త్వరగా మానును. ఈగలు వ్రాలకుండ వేపనూనె రాయాలి.


కాడి పుండు

బండ్లు, నాగలి లాగే పశువులలో సరియైన జోడు లేకపోయినప్పుడు, రాపిడి వల్ల కాడి పుండు కలుగుతుంది.

  1. కాడి మోపిన చోట వెంట్రుకలు రాలిపోయి, కమిలి నొప్పి పెడుతుంది. ఈ ప్రదేశంలో రోజు కొంతసేపు చల్లనీటి ధారపోయాలి.
  2. కొబ్బరి నూనెలో హారతి కర్పూరం కలిపి దాని మీద పోయాలి.
  3. కమిలిన భాగం పెద్దగా వాచినట్లైతే అయోడిన్ ఆయింటుమెంటు పూయాలి. లేదా ఆవపిండి పలస్త్రీని వాపుమీద వేయాలి. అది పగిలి కారుతుంది. తరువాత మాములుగా గాయాలకు చేసినట్లు చికిత్స చేయాలి. వాపు తగ్గే వరకు పని చేయించకూడదు.

కొమ్ములు విరగడం

  1. వ్రేలాడుతున్న కొమ్మును కోసివేయాలి.
  2. రక్తం కారకుండా తెల్లని గుడ్డను తడిపి గట్టిగా కట్టుకట్టాలి. కట్టు కట్టక ముందు గాయం మీద కొంచెం పాటిక పొడి చల్లాలి.
  3. కొమ్ము తుడుగు ఊడితే తెల్లని గుడ్డ పీలికలు, తడిపి మందంగా గట్టిగా కట్టు కట్టాలి. కట్టు మీద పటిక నీరు పోయాలి. తర్వాత డాక్టరుతో చికిత్స చేయించుకోవాలి.

బెణుకులు

  1. బెణికినచోట వేడినీళ్ళతో రోజుకు రెండు మూడు సార్లు కాపాలి.
  2. ఆ తర్వాత నూనెలో హారతి కర్పూరము కలిపి మర్దన చేయాలి. చింతాకు కషాయంతో కూడా కాపవచ్చు.
  3. కట్టుకట్టుటకు వీలుగా వుంటే చింతాకు నూరి కట్టుకట్టాలి. బెణుకు పాతబడితే ఆవపిండి జిగురు పూయవచ్చు, పని మాన్పించాలి.

కీళ్ళు తొలగుట

  1. కీలు తొలగిన వైపు కాక రెండవ వైపు పశువును పడవేసి, కీలు తొలగిన వైపుకు తాడుకట్టి జాగ్రత్తగా లాగుతూ, మరొకరు అరచేతిలో తొలగిన కీలును యధాస్థానమందు పడేటట్లు చూడాలి.
  2. కీలు సర్దుకున్న తర్వాత మూడు భాగాలు ఆవపిండి ఒక భాగం కారంపొడి కలిపి నూరి బాగా ఎర్రబడేటట్లు రుద్దాలి. పశువులకు విశ్రాంతి నివ్వాలి. యింకా నయం కాకపోతే డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి.

కడుపు కుట్టు

పశువులు మేత బాగా తిని తగినన్ని నీరు త్రాగకపోవడంవల్ల లేదా గింజలు ఎక్కువగా తినడంవల్ల జీర్ణకోశం సరిగా పని చేయక కడుపు కుట్టు వస్తుంది.

పశువు నెమరు వేయటం మానుకుంటుంది. పేడ పెంటికలుగా వేస్తుంది. పశువులు మందకొడిగా వుంటాయి. ఎడమ డొక్కలో సొట్టపడుతుంది. కడుపునొప్పితో బాధపడతాయి.

  1. రెండు లీటర్ల నీళ్ళలో 50 గ్రాములు ఉప్పు 50 గ్రాములు సొంఠి పొడి కలిపి త్రాగించాలి.
  2. ఒక రోజులో తగ్గకపోతే పావుశేరు ఆముదము పట్టించాలి. దాణా పెట్టకూడదు.
  3. కొంచెం నెమరు వేసి పేడవేయగానే 20 గ్రాములు ముష్టి గింజలపొడి 30 గ్రాములు సొంటిపొడి 20 గ్రాముల సోడా ఉప్పు బెల్లంలో కలిపి 3 - 4 రోజులు వరుసగా తినిపించాలి. కడుపు కుట్టు రెండు రోజులలో నయం కానట్లయితే డాక్టరు గారిచే వైద్యం చేయించాలి.

కడుపు ఉబ్బు

  1. 50 గ్రాముల కర్పూర తైలము అర్ధ లీటరు నూనెలో కలిపి త్రాగించాలి.
  2. ఇంకా తగ్గకపోతే 25 గ్రాముల మిరియాపొడి 25 గ్రాముల సొంఠి పొడి 150 గ్రాముల నాటుసారా, 1 లీటరు నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  3. కడుపు ఉబ్బు తగ్గే వరకు మేత వేయకూడదు. జావగాని, గంజికాని త్రాగించాలి.
  4. ఆ తర్వాత 20 గ్రాముల సో౦పు పొడి 20 గ్రాముల సొంఠి పొడి 20 గ్రాముల ముష్టి విత్తుల పొడి 20 గ్రాముల వాముపొడి 40 గ్రాముల సోడా ఉప్పు బెల్లంలో కలిపి ముద్ద చేసి తినిపించాలి.

సామాన్య పారుడు

  1. పశువుకు అర్ధ లీటరు నూనెగాని, ఆముదముగాని త్రాగించాలి.
  2. ఆ తర్వాత 20 గ్రాముల కాచు 20 గ్రాముల సీమ సున్నము 20 గ్రాముల సొంఠి పొడి జావలో కలిపి త్రాగించాలి. ఇంకా పారుడు కట్టకపోతే డాక్టరు చేత వైద్యం చేయించాలి.

పునరుత్పత్తిలోమెలకువలు

పాడి పశువు లాభసాటి పునరుత్పత్తి లక్ష్యాలు:

  • పాడి పశువులు సకాలములో ఎదకు వచ్చి చూలు కట్టి ఈనితేనే లాభసాటిగా వుంటుంది.
  • సంకర జాతి పశువులు 15 మాసాలు, గ్రేడేడ్ ముర్రా గేదెలు 2-3 సంవత్సరములు, దేసవాళి గేదెలు ఆవులు 3-4 సంవత్సరముల వయస్సులో మొదటి సారి ఎదకు రావాలి
  • ఆవు అయితే 2-3 సంవత్సరముల లోపు మొదటి ఈత ఈనాలి. గేదె అయితే 3-4 సంవత్సరముల లోపు మొదటి ఈత ఈనాలి. ఈతకు ఈతకు మధ్యకాలం 12-14 మాసాలకు మించకూడదు. 10 సంవత్సరముల వయస్సులో 5-6 ఈతలు ఈనాలి.
  • పాడికాలములో అనగా 10 నెలల లో 1800-2000 లీటర్లకు తక్కువ కాకుండ పాల దిగుబడి ఇవ్వగలగాలి.

ఈ లక్ష్యాలు సాధించాలంటే:

  • ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పశువులను ఒకసారి పరిశీలించి ఎదను గమనించాలి. ఎదకు వచ్చిన తర్వాత సకాలములో గర్భధారణ చేయించాలి. ఒక ఎద తప్పితే, 500 రూ.ల విలువ గల ఉత్పత్తి నష్ట పోవలసి వస్తుంది.
  • మొదటిసారి గర్భధారణ చేసే పశువు బరువు కనీసము 200 కిలోలుండాలి. పశువు యొక్క పొడవు (భుజము నుండి మక్కెల వరకు) దాని భుజము వెనుక శరీరం చుట్టు కొలత (అడుగులో) తో గుణించి బరువును తెలుసుకోవచ్చు.
  • గర్భధారణ జరిగిన 90 రోజుల లోపుల చూడి నిర్ధారణ పరీక్ష చేయించాలి.
  • ఈనిన తర్వాత వచ్చే రెండవ ఎదలో తిరిగి గర్భధారణ చేయించాలి.

పాడి పశువుల పునరుత్పత్తి క్రమము

పునరుత్పత్తిక్రమము

దేశవాళి ఆవు

సంకరజాతి ఆవు

గేదెలు

మొదటి సారి ఎదకు వచ్చే వయస్సు

3-4 సం.లు.

14-18 మాసాలు

3-4 సం.లు

ఎదకు, ఎదకు మధ్యకాలం

21 రోజులు

21 రోజులు

21-23 రోజులు

ఎదకాలం

18-24 గంటలు

18-24 గంటలు

18-36 గంటలు

చూలు కాలం

280 రోజులు

280 రోజులు

310 రోజులు

మొదటి ఈత వయస్సు

4-5 సం.లు.

2-3 సం.లు.

4-5 సం.లు.

ఈతకు ఈతకు మద్య కాలం

2 సం. పైగా

12-14 మాసాలు

16-20 మాసాలు

ఈతలో పాడి కాలం

200 రోజులు

300 రోజులు

250-300 రోజులు

సరాసరి పాల ఉత్పత్తి

1-2 లీటర్లు

8-10 లీటర్లు

6-8 లీటర్లు

మొత్తం మీద దేశవాళిపశువుకన్నాసంకరజాతి పశువు వల్ల 5-6 రెట్లు ఎక్కువ లాభం కలుగుతుంది.

త్వరిత గతిన మన దగ్గర వున్న తక్కువ దిగుబడిని దేశవాళి పశువులను అధిక దిగుబడినిచ్చేసంకర జాతి పశువులుగా వృద్ది చేసుకోవాలంటే కృత్రిమ గర్భధారణ ఏకైక మార్గం

కృత్రిమ గర్భధారణ వల్ల లాభాలు:

  • మేలు జాతి ఆబోతు ప్రపంచంలో ఎక్కడ వున్నా దాని మేలు జాతి గుణాలను ఉపయోగించుకోవచ్చు. దాని వీర్యాన్ని సేకరించి ఘనీభవింపచేసి నిల్వ ఉంచితే ఆబోతు చనిపోయిన తరువాత కూడా 10-15 సం.రాలు దాని మేలు జాతి లక్షణాలు ఉపయోగించుకోవచ్చు.
  • సహజ సంపర్కంలో ఒక ఆబోతు సంవత్సరానికి 100-150 ఆడపశువులకు మాత్రమే గర్భధారణ చేయగలుగుతుంది. అదే కృత్రిమ గర్భధారణ ద్వారా 5-10 వేల పశువులకు ఉపయోగపడుతుంది. ఆబోతుల కొరతను నివారించవచ్చును.
  • రైతులకు విత్తనపు ఆబోతుల పోషణ ఖర్చులు భరించవలసిన అవసరము లేదు.
  • గొడ్డు పోతు సమస్యలను సులభంగా అరికట్టవచ్చు.

పశువులలో పిండం మార్పిడి విధానం

  • మన దేశవాళి పశువులను ఇంకా త్వరిత గతిన అభివృద్ధి పరచి అధిక పాల దిగుబడి కొరకు అత్యాధునికమైన పిండం మార్పిడి విధానం కూడా ఉన్నది.
  • ఒక ఆడపశువు గర్భకోశంలో శాస్త్రీయ పద్దతిలో పిండాన్ని ప్రవేశం పెట్టే విధానాన్ని పిండం మార్పిడి అంటారు. సాధారణంగా ఒక ఆడ పశువు 9-10 మాసాల కొకసారి ఒక దూడ నిస్తుంది. ఈ పద్దతి ద్వారా యిదే సమయంలో పది పిండాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ అధిక పాలసార గల పిండాలను తక్కువ పాలచార గల పశువుల గర్బకోశంలో ప్రవేశ పెట్టి తద్వారా అధిక పాలచార గల పది దూడలను పొందవచ్చు.

పశుగ్రాసాల సాగు

పాడికి ఆధారం పచ్చి మేత " పచ్చి మేత లేనిది పాడి లాభసాటి కాదు.

  • పచ్చి మేత లేనిది పాడి లాభసాటి కాదు. కేవలం వరిగడ్డి, చొప్ప మీద ఆధారపడి పాదిపశువులను పోషించితే ప్రయోజనం లేదు.
  • పాడి నిర్వహించే ప్రతి రైతు తనకున్న భూమిలో పదవ వంతు పచ్చి మేతల సాగుకు వినియోగించాలి. పచ్చిమేతలను, యితర పంటల సాళ్ళ మధ్య పండ్ల తోటల లోను సాగు చేసుకోవాలి.
  • పచ్చిమేత మేపిన పశువులు, సకాలంలో ఎదకు సకాలంలో ఎదకు వచ్చి చూలు కట్టి ఈనుతాయి. పాల ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి ఖర్చులు తగ్గి పాడి పంట లాభసాటిగా వుంటుంది.
  • ఒక ఎకరంలో పండించే పచ్చిమేతలో5-6 మంచి పాడి పశువులను పోషించుకొని సుమారు 30వేల రూపాయల ఆదాయం పొందవచ్చు. అదే ఎకరంలో యితర పంటలు పండిస్తే 13-15 వేల రూపాయల ఆదాయం లభిస్తుంది.
  • రోజుకు ఒక పశువుకు పూర్తిగా పచ్చిమేత మేపితే 30-40 కిలోలు కావాలి. అంటే సం.రానికి 11-14 టన్నుల మేత కావాలి. నీటి వసతి గల భూమిలో ఎకరానికి 5-6 పశువులను పోషించవచ్చు. వర్షాధార భూమిలో 2-3 పశువులను పోషించవచ్చు.

పశుగ్రాసాల రకాలు

  1. ధాన్యపు జాతి రకములు : ఏకవార్షికములు : యం. పి. చారి, స్వీట్ సూడాన్ గడ్డి, జొన్న, పూసాచెరి, మొక్కజొన్న, యవ్వలు మొ||నవి. బహువార్షికములు: నేపియర్, యన్.బి.21, పారాగడ్డి, గినీ గడ్డి మొదలగునవి.
  2. కాయ జాతి రకములు: ఏకవార్షికములు : అలసంద, లూసర్ను, బర్సీము, గోరు చిక్కుడు, జనుము, పిల్లి పెసర మొదలగునవి. బహువార్షికములు : స్టైలోహెమట, స్టైలో స్కాబ్రా మొదలగునవి.

మిశ్రమ పద్దతిలో పశుగ్రాసాల సాగు

రైతులు తమకున్న భూమిలో, పచ్చిమేత అవసరాలను దృష్టిలో వుంచుకొని కొంత భూమిని ప్రత్యేకంగా పచ్చిమేతలు సాగుచేసుకొని పాడి పశువులను మేపుకొన్నట్లయితే లాభదాయకంగా వుంటుంది. నీటి పారుదల క్రింద భూమిని పశుగ్రాసాల సాగుకు వినియోగించినప్పుడు ఈ క్రింద పట్టికలో చూపిన విధంగా పశు గ్రాసాలను, పంటల మార్పిడి లేదా మిశ్రమ పంటలుగా రైతులు ఆయా కాలానుసారంగా వనరులను బట్టి సాగు చేసుకొన్నట్లయితే సంవత్సరము పొడుగునా పశువులకు పచ్చిమేత మేపుకోవచ్చు.

ఖరీఫ్

రబీ

వేసవి

1.హైబ్రిడ్ నేపియర్

అలసంద (చాళ్ళ మధ్య)

లూసర్ను (చాళ్ళ మధ్య)

2.సజ్జ + అలసంద

లూసర్ను

లూసర్ను

3.మొక్కజొన్న + అలసంద

లూసర్ను

లూసర్ను

4. జొన్న+ అలసంద

మొక్కజొన్న + అలసంద

జొన్న+ అలసంద

5. మొక్కజొన్న + అలసంద

యవ్వలు + బర్సీము + లూసర్ను

లూసర్ను

పచ్చిక బీళ్ళలో మేలు జాతి గడ్డి రకాలు

పచ్చిక బీళ్ళలో, మేలుజాతి రకాలు గురించి తెలుసుకుందాం. సాధారణంగా పచ్చి బీళ్ళలో, చెంగలి గడ్డి, మొలవ గడ్డి, సేంద్ర గడ్డి ఎక్కువగా ఉన్నాయి. ఈ రకాలు నెమ్మదిగా పెరుగుతాయి. దిగుబడి తక్కువ, ఒకసారి పశువులు మేస్తే తిరిగి పెరగడానికి చాలా కాలం పడుతుంది. పచ్చిక బీళ్ళకు పనికి వచ్చే గడ్డి ఈ క్రింది లక్షణాలు కలిగి వుండాలి.

  1. తక్కువ వర్షపాతానికి త్వరగా ఎదిగి ఎక్కువ దిగుబడి నివ్వాలి.
  2. ఎండాకాలంలో కూడా చనిపోకుండా తేమ తగలగానే తిరిగి త్వరగా పెరగాలి.
  3. పశువులు మేసినందువల్ల గడ్డి దెబ్బ తినకుండా త్వరగా పెరగాలి.
  4. మంచి ఆహారపు విలువ కలిగి రుచికరంగా వుండాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని పచ్చిక బయళ్ళకు ఉపయోగపడు కొన్ని మంచి రకాలు వృద్ధి చేయబడ్డాయి. వీటిలో
    • అంజనగడ్డి
    • చిన్న గినిగడ్డి,
    • రోడ్స్ గడ్డి,
    • కూసా గడ్డి,
    • దీనా నాధ్ గడ్డి,
    • సిరాట్రా,
    • గ్లైసీడియా,
    • లోసాంథెస్ మొదలగునవి మేలుజాతి రకాలు.

ఈ మేలు జాతి రకాలు విత్తనాలు చల్లి పచ్చిక బీళ్ళను అభివృద్ది చేసుకోవచ్చు. విత్తనాలు చల్లి సంవత్సరము మేపకుండా పూర్తిగా వదిలి వేయాలి.

పశుగ్రాసనికి ఉపయోగపడు చెట్లు

సుబాబుల్, అవిశ, నల్లతుమ్మ, దిరిశెన, రావి వంటి చెట్ల ఆకులు, పశుగ్రాసానికి బాగా ఉపయోగపడును. మేత కొరత సమయాల్లో వీటి ఆకులను పచ్చి మేతగా ఉపయోగించుకోవచ్చును.

పచ్చిమేత కొరత వున్నా సమయాలల్లో వరిగడ్డి చొప్ప మొదలగు ఎండుమేతలలో ఈ చెట్ల ఆకులు 20 - 30 శాతం వరకు కలిపి మేపితే పాల దిగుబడి తగ్గదు, పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
ఇలాంటి చెట్లను పెరట్లోనూ, తోటల చుట్టూ పొలంగట్లపైన సేద్యమునకు ఉపయోగపడని ఎట్టు పల్లాలలోను, ఖాళీ ప్రదేశంలోను వర్షాకాలములో నాటుకొని అభివృద్ధి పరచుకోవాలి.

పచ్చి మేత గడ్డి రకాల సాగు వివరములు

సాగు వివరములు

నేపియర్

పారగడ్డి

గినీగడ్డి

రకములు

యన్. బి. 21
బి.యన్.2
కో-1 , కొ2

ఇ.జి.యఫ్.ఆర్.ఐ-6, 10

హమిల్, మాకుని, రివర్స్ డేల్, గ్రీన్ పానిక్, గాటన్ పానిక్, పి.పి. జి. 14

విత్తు సమయము

ఫిబ్రవరి - ఆగష్టు నెలల మధ్యలో, చలికాలంలో తప్ప

జూన్ - జూలై దక్షిణ భారతంలో ఎప్పుడైనా

ఫిబ్రవరి - ఆగష్టు మధ్యలో, చలికాలంలో తప్ప

హెక్టారుకు కావలసిన నారు మొక్కలు

22 -30 వేల కాండపు మొక్కలు, ఒకసారి నాటితే 3 -4 సం.లుంటుంది

8 -10 క్వింటాళ్ళ బరువు గల కాండపు ముక్కలు, లేదా 30,000 నారు మొక్కలు

30 - 40 వేల నారు మొక్కలు

నాటు పద్ధతి

వరుసలలో, వరుసల మధ్య అంతరము 50 -75 సెం. మీ.

వరుసలలో, వరుసల మధ్య అంతరము 45 -60 సెం. మీ.

వరుసలలో, చాళ్ళ మధ్య అంతరము 45 -60 సెం. మీ.

ధాన్యపు రకము పచ్చి మేతల సాగు వివరములు


మేత జొన్న


మొక్క జొన్న


తీపి సుడాన్ గడ్డి

సాగువివరములు

మేత జొన్న

మొక్కజొన్న

స్వీట్సూడాన్ గడ్డి

రకములు

PC-6, PC-23, S-194

M;P. CHARI

IS-4776 HC-136

ఆఫ్రికన్ టాల్, గంగ, HGT-3, జవార్, మోతి కాంపోజిట్

S.S.G.59-3

విత్తు సమయము

వర్షాధారంగా జూన్ - ఆగష్టు, నీటి పారుదల క్రింద జనవరి - మే

వర్షాధారంగా జూన్ - ఆగష్టు, నీటి పారుదల క్రింద జనవరి - మే

వర్షాధారంగా జూన్ - ఆగష్టు, నీటి పారుదల క్రింద జనవరి - మే

విత్తనాలు హెక్టారుకు

25-40 కిలోలు

50-60 కిలోలు

15 కిలోలు

విత్తు పద్ధతి

సాళ్లలో, సాళ్ల మధ్య 30 సెం.మీ. అంతరము

సాళ్లలో, సాళ్ల మధ్య 30 సెం.మీ. అంతరము

సాళ్లలో, సాళ్ల మధ్య 30సెం.మీ. అంతరము

ఎరువులు హెక్టారుకు

80కిలోల నత్రజని
30 కిలోల పొటాష్

120 కిలోల నత్రజని
120 కిలోల పొటాష్

80 కిలోల నత్రజని
30 కిలోల పొటాష్

నీటి తడుపు

10-15 రోజుల కొకసారి

7-10 రోజుల కొకసారి

15-20 రోజుల కొకసారి

మొదటి కోత సమయము

50-55 రోజు లకు

(50 శాతం పూతలో)

60-70 రోజులలో

కంకి వేసే సమయంలో

55-60 రోజులు

కోతలు

3 కోతలు - ప్రతి 35-40 రోజులకొక కోత ఒక కోత

ఒకే కోత 60-70 రోజులకు

4-5 కోతలు, ప్రతి 30-35 రోజులకొకటి

దిగుబడి హెక్టారుకు

పచ్చిమేత 40-50 టన్నులు

పచ్చిమేత 40-50 టన్నులు

పచ్చిమేత 40-50 టన్నులు

కాయజాతిపచ్చి మేతల సాగు వివరములు


అలసంద


లూసెర్న్


స్టీలో

సాగువివరములు

అలసందలు

లూసర్ను

స్టైలో

రకములు

UPC 287, EC 4216

NP3 UPC, 5286, UPC

రష్యన్ జెయింట్

T-9, ఆనంద్ -2

S-244, Comp-3

CO-I

స్టైలో హమట స్టైలో హామిలిస్ స్టైలో స్కాబ్రా

విత్తు కాలము

జూన్ - జూలై ఫిబ్రవరి - జూన్ (నీటి పారుదల క్రింద)

అక్టోబర్ - నవంబర్

జూన్ - ఆగష్టు, (నీటి పారుదల క్రింద)

కావలసిన విత్తనాలు హెక్టారుకు

30-40 కిలోలు


స్టైలో హమట 20-25 కిలోలు

స్టైలో స్కాబ్రా మరియు యితర రకాలు

10-15 కిలోలు

విత్తు పద్ధతి

వరుసలలో, వరుసల మధ్య ఎడం 45 సెం.మీ

సాళ్లలో, సాళ్ల మధ్య 20-25 సెం.మీ. అంతరము

చల్లాలి

ఎరువులు హెక్టారుకు

20 కిలోల నత్రజని
60 కిలోల పొటాష్

30 కిలోల నత్రజని
100 కిలోల పొటాష్

35 కిలోల నత్రజని
60 కిలోల పొటాష్

 

నీటి తడుపు

12-15 రోజు లకు

2-3 తడుపులు, వారానికొకసారి ఆ తర్వాత 10-12 రోజులకు

20-30 రోజు లకు

మొదటి కోత సమయము

55-60 రోజు లకు

పూత దశలో

70 రోజు లకు

75-80 రోజు లకు

కోతలు

ఒకటే కోత

ప్రతి 25-30 రోజులకొకసారి 6-7 కోతలు

2 కోతలు, ప్రతి 35-40 రోజులకొకటి

దిగుబడి హెక్టారుకు

పచ్చిమేత 30-35 టన్నులు

పచ్చిమేత 60-70 టన్నులు

పచ్చిమేత 30-35 టన్నులు

స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి సూచనలు

పాలు అనారోగ్య పద్ధతులలో, కలుషిత వాతావరణంలో పిండడం వల్ల పాలు చెడిపోవడమే కాకుండా అంటువ్యాధులు సోకే ప్రమాదం వుంది. కావున పాల ఉత్పత్తి దారులు స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కొరకు ఈ సూచనలు పాటించాలి.

పశుశాలల పరిశుభ్రత

  • పశువుల పాకలు, కురవకుండ, లోపల ఎత్తు పల్లాలు లేకుండా శుభ్రం చేయడానికి వీలుగా వుండాలి. పాక గోడలు, మల ముత్రాల కాల్వను తరుచుగా శుభ్రం చేస్తుండాలి. పాలు పితికే ముందు పశువుల శాలలను శుభ్రం చేసి నీళ్ళు చల్లాలి.

పశువుల పరిశుభ్రత

  • పాడి పశువుల ఆరోగ్య పరిస్థితి క్రమంగా తనిఖీ చేసుకోవాలి. రోజు తప్పని సరిగా పశువును పరిశీలించాలి. ఆరోగ్యమైన పశువును పిండిన తర్వాతనే వ్యాధి పశువును పితకాలి..
  • పాలు పితకడానికి 15 నిముషాల ముందు పశువు డొక్కలు, వెనక భాగము పొదుగు కడగాలి. పొదుగును కడిగిన తర్వాత తెల్లని గుడ్డతో తుడవాలి.
  • డొక్కల యందు పొదుగు దగ్గర వున్న వెంట్రుకలు ఎప్పటికప్పుడు కత్తిరించాలి.

పాలు పితికే మనుష్యులు, పాత్రల పరిశుభ్రత :

  • పాలు పితికే మనిషి ఆరోగ్యంగా వుండాలి. అంటు వ్యాధులు గల వారు పాలు పితకకూడదు. చేతులకు కురుపులు, పుండ్లు, గజ్జి వున్నవారు పాలు పితకరాదు.
  • పాలు పితికే ముందు చేతులను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. తడి చేతులతో పాలు పితక కూడదు. చేతివేళ్ళ గోళ్ళు పెరగకుండ కత్తిరించుకోవాలి.
  • పాలు పితికే మనిషికి ఓపిక, శ్రద్ధ చాలా అవసరము,
  • సాధ్యమైనంతవరకు త్వరగా పితికే సామర్ధ్యం వుండాలి. పాలు పితికేటప్పుడు పశువులు బెదరకుండ చూడాలి.
  • పాల పాత్రలు పరిశుభ్రంగా వుండాలి. మొదట పాత్రలను చల్లని నీటితో శుభ్రం చేసిన తర్వాత సోడా కలిపినా వేడి నీటిలో శుభ్రం చేసి ఆ తర్వాత మళ్ళీ నీటిలో కడగాలి.
  • చనుకట్లు పిడికిలి నిండుగా పట్టుకొని పితకాలి. బొటన వేలితో చనుకట్లను నొక్కి పితిక కూడదు. దీని వల్ల చనుకట్లు దెబ్బ తినే ప్రమాదం వుంది.
  • పాలు పితికే ముందు మొదటి రెండు చారలు నల్లని గుడ్డ మీద పితకాలి అందులో కుదపలు గాని రక్తపు జీరలు గాని వుంటే పొదుగు వ్యాధిగా గుర్తించాలి.
  • పాలు పితికిన తర్వాత పరిశుభ్రమైన గుడ్డతో వడపోసి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. పాలపాత్ర చుట్టూ తడి గుడ్డ కప్పాలి.

పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి పాటించవలసిన చర్యలు

పాలు పితికే ముందు ప్రతిరోజు పాకలను పాడి పశువు శరీరాన్ని శుభ్రంగా కడగాలి

పితికే ముందు పొదుగును శుభ్రంగా కడగాలి

పాలు పితికే పాత్రలు పరిశుభ్రంగా వుండాలి

మొదటి రెండు మూడు చారలు యిలా నల్లని గుడ్డ మీద పిండి చూడాలి. రక్తపు జీరలు గాని కుదపలు గాని వుంటే పోడగు వ్యాధిగా గుర్తించాలి

పితికే ముందు పొదుగును తప్పని సరిగా కడిగిన తర్వాత పొడిగుడ్డతో తుడవాలి

చన్నులను పిడికిలి నిండుగా పట్టుకొని పిండాలి. బొటన వ్రేళ్ళతో నొక్కి పితక కూడదు

లేగ దూడల పోషణ

  • నేటి పెయ్య దూడ రేపటి పాడి పశువు, అది పాల ఉత్పత్తికి పునాది. పెయ్య దూడల పోషణలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా శాశ్వతంగా దాని యొక్క పాల ఉత్పత్తి సామర్ధ్యాన్ని నష్టపోవలసి వస్తుంది.
  • దూడల మొదటి మూడు మాసాల వయస్సు అత్యంత కీలకమైనది, ఈ దశలో దానికిచ్చే మేపు పోషణ సక్రమంగా లేనట్లయితే పెరుగుదల లోపించి 25-30 శాతం వరకు దూడలు చనిపోయే ప్రమాదము వుంది.
  • చూడి పశువుకు 7 మాసాల చూడి నుండి అదనంగా మేపు, దాణా అందిస్తే బలమైన ఆరోగ్యమైన దూడను ఇవ్వగలదు. పుట్టిన దూడ బరువు సాధారణంగా 20-25 కిలోలు వుండాలి.
  • పుట్టిన తర్వాత మూడు రోజుల వరకు దానికి తగినన్ని జున్ను పాలు, 3 మాసాల వయస్సు వరకు, దాని శరీర బరువును బట్టి సరిపోయినన్ని పాలు త్రాగించాలి.
  • దూడకు పుష్టికరమైన దాణా మేపి, సకాలంలో నట్టల మందులు త్రాగించి తగిన రోగ నిరోధక చర్యలు పాటించినట్లయితే దూడ నెలకు 10-15 కిలోల బరువు పెరుగుతుంది. ఒకటిన్నర సంవత్సరములో 200 కిలోల బరువు పెరిగి ఎదకు వస్తుంది. 30-40 మాసాలలో మొదటి ఈత ఈనగలదు.
  • వ్యయ ప్రయాసలతో పాడి పశువులను కొనేదాని కన్నా పెయ్య దూడలను పోషించుకొని పాదిపశువులుగా అభివృద్ధి చేసుకోవడం లాభదాయకం. దూడలను శాస్త్రీయ పద్ధతిలో పోషించినట్లయితే వాటికి చేసిన ఖర్చు కంటే నాల్గు రెట్లు ఆదాయం పొందవచ్చు.

దూడల ఆహారం

  • రోజుకు 2 లీటర్ల చొప్పున మొదటి నెలలో, 2.5 లీటర్ల చొప్పున రెండవ నెలలో3 లీటర్ల చొప్పున మూడవ నెలలో పాలు త్రాగించాలి. మూడు నెలల తర్వాత పాలు త్రాగించవలసిన అవసరము లేదు. ఈ మూడు మాసాల వరకు దూడకు 240 లీటర్ల పాలు కావాలి.
  • దూడల దాణాను, జొన్నలు, మొక్కజొన్నలు వంటి ధాన్యము 40 శాతం, తవుడు 10 శాతం, వేరుశెనగ చెక్క లేదా ఏదైనా తెలగపిండి 30 శాతం, చేపలపొడి 7 శాతం, బెల్లపు మడ్డి 10 శాతం, విటమిన్లు లవణ మిశ్రమము 3 శాతం కలిపి తయారు చేసుకోవచ్చు.
  • దూడకు మొదటి రెండు నెలల్లో రోజుకు 150 గ్రాములు, మూడవ నెలలో 300 గ్రాములు 4వ నెలలో 500 గ్రాములు, 5-6 మాసాల్లో 750 గ్రాములు, 7వ మాసము నుండి సంవత్సరము వరకు కిలో చొప్పున దాణా ఇవ్వాలి. ఈ విధముగా సంవత్సరము వరకు 280 కిలోల దాణా కావాలి.
  • దూడకు 15 రోజుల వయస్సు నుండి లేత గడ్డి పరకలు, మేత తినడం అలవాటు చేయాలి. 3వ మాసం నుండి పచ్చి మేత 5 పాళ్ళు ఎండు మేత 2 పాళ్ళు మేపాలి.
  • దూడకు రోజుకు 10-12 లీటర్ల నీరు త్రాగడానికి కావాలి.

దూడలఆరోగ్య సంరక్షణ

  • పుట్టిన వెంటనే దూడబొడ్డు కత్తిరించి టించర్ అయోడిన్ పూయాలి.
  • ఈనిన గంటలలోపలె జున్నుపాలు త్రాగించాలి. దూడలను తల్లి నుండి వేరు చేసి పోత పాలతో పోషించాలి.
  • పుట్టిన మొదటి వారంలో దూడ త్రాగే పాలలో ఒక చెంచాడు ఆంటిబయోటిక్ మందు కలిపి తాగిస్తే పారుడు వ్యాధి నివారించవచ్చు.
  • దూడలకు కోడి గ్రుడ్డు సొన, ఇంగువ, బెల్లం పాలలో కలిపి రెండు రోజులు త్రాగించితే మలబద్ధకం పోతుంది. ఇంకా తగ్గకపోతే ఎనిమా ఇప్పించాలి.
  • దూడలు పాలు త్రాగిన తర్వాత, మూతిని తెల్లని బట్టతో తుడిచి నాలుక మీద కొంచెం ఉప్పు రాయాలి. దీనివల్ల నాకుడు వంటి దురలవాట్లను మాన్పించవచ్చు.
  • దూడలకు మొదటి వారం వయస్సులో కొమ్ములు రాకుండ చేయించాలి.
  • దూడలను పిడుదులు, గోమారీలు ఆశ్రయించకుండా మందులు స్ప్రే చేయించాలి.
  • దూడలకు వారం లోపల మొదటి సారి తర్వాత ప్రతినెల కొకసారి నట్టల మందులు త్రాగించాలి.
  • దూడలకు రెండవ నెలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 6-7 మాసాల వయస్సులో పెద్ద రోగము, గొంతు వాపు, జబ్బవాపు వ్యాధుల నివారణ టీకాలు వేయించాలి.

దూడవయస్సు

పాలు
(లీటర్లు)

దూడల దాణా
(కిలోలలో)

పచ్చిగడ్డి
(కిలోలలో)

రోగ నిరోధక టీకాలు

1వనెల

2

150 g

నట్టల నివారణ మందు మొదటి వారంలో

2వనెల

2.5

180 గ్రా

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

3వనెల

3

0.50

2

నట్టల నివారణ మందులు త్రాగించటం

4వనెల

-

0.50

3

నట్టల నివారణ మందులు త్రాగించటం

5వనెల

-

0.75

4

6వనెల

-

0.75

5

జబ్బ వాపు, గొంతువాపు నివారణటీకాలు

ఆ తర్వాత సం.ము.వరకు

తప్పనిసరిగా దూడకు పుట్టిన వెంటనే 3-4 రోజులు, రోజుకు రెండు మూడు సార్లు జున్ను పాలు తాగించాలి. తల్లి నుండి వేరు చేసి పోత పాలమీద పెంచాలి.

దూడ వయస్సు బట్టి పాలు తాగించాలి.

దూడలకు పుష్టికరమైన దాణా 15 రోజులనుండి తినిపించాలి. దూడ వయస్సు బట్టి దాణా వాడాలి.

దూడలకు వారం లోపల మొదటి సారి తర్వాత ప్రతినెల కొకసారి నట్టల మందులు త్రాగించాలి.

దూడలకు సకాలంలో అంటువ్యాధుల నిరోధక టీకాలు వేయించాలి.

పశుగ్రాసము వినియోగము, నిల్వ పద్ధతులు

మేత ముక్కలుగా నరికి మేపాలి

జొన్న, సజ్జ, మొక్కజొన్న లాంటి మేతల కాండములు పెద్దగా లావుగా ఉండుట వలన వాటిని చిన్న ముక్కలుగా నరికి మేపాలి లేని యెడల, మెత్తని భాగము ఆకులు మాత్రమే తిని మిగతాది తొక్కి మల మూత్రాలతో కలిసి 40 శాతం వరకు మేత వృధా అయిపోతుంది. ముక్కలుగా నరికిమేపడం వలన మేత పూర్తిగా సద్వినియోగం అవుతుంది. ముక్కలుగా నరికిన మేతలో, తవుడు, బెల్లపు మద్ది లవణ మిశ్రమము లాంటి అనుబంధ పదార్ధాలు కలిపి పశువులకు మేపుకోవచ్చు, సంచులలో వుంచి కూడా నిలువ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు తప్పని సరిగా పశుగ్రాసాన్ని ముక్కలు చేసి మేపాలి.

పశుగ్రాసము నిల్వ ఉంచే పద్ధతులు

పశుగ్రాసము పుష్కలంగా లభించే రోజులలో వృధా చేయకుండా నిల్వ చేసుకోవాలి. పశుగ్రాసము నిల్వ చేసుకోవడములో గమనించవలసిన విషయమేమిటంటే మేతలోని పోషక విలువలు సాధ్యమయినంతవరకు తగ్గకుండా చూసుకోవాలి.
నిల్వ చేసే పద్ధతులలో రెండు పద్ధతులు కలవు.

  1. పచ్చి మేతను పాతర వేసుకోవడం.
  2. పశుగ్రాసాన్ని ఎండుమేతగా తయారు చేసుకోవడం.

ఎండు మేత నిల్వ చేసుకొనే పద్ధతి

పశుగ్రాసము కోసిన తర్వాత అందులోని తేమ సాధ్యమయినంత తక్కువ సమయంలో 35 శాతం వరకు తగ్గేటట్లు చూడాలి. ఆ తర్వాత మేతను నీడలో ఆరబెట్టి అందులోని తేమ 15 శాతం వరకు తగ్గించాలి. 15 శాతం తేమ ఉన్న పశుగ్రాసము బూజు పట్టకుండా చెడిపోకుండా నిల్వ చేసుకోవచ్చు. పోషక పదార్దములుకూడ ఎక్కువగా నష్టపోవు.
ఎండు మేతగా నిల్వ చేసుకొనే పశుగ్రాసాన్ని, ఉదయం పూట సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు కోసి ఎండలో తల క్రిందులుగా నిలబెట్టాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు మరలివేస్తుండాలి. దీనివల్ల మేతలోని 70 శాతం తేమ 40 శాతం వరకు తగ్గుతుంది. ఆ తర్వాత నీడలో పరిచి ఆరబెట్టి తేమ శాతము 15 శాతం వరకు తగ్గించాలి. ఇలా ఆరపెట్టేటప్పుడు మేతలోని ఆకులు ఎక్కువగా రాలిపోకుండా చూడడం చాల ముఖ్యం.

పాతర గడ్డి లేదా సైలేజీ చేయు పద్ధతి

సైలేజీ అనగా పశు గ్రాసమును ఎక్కువగా లభించు సమయములలో, మిగులు మేతను గుంతలలో పాతర వేసి నిలువ చేయుట, మొక్కజొన్న, జొన్న రకాల మేతలు పాతరవేయుటకు ఉపయుక్తమయిన రకములు, చెరుకు ఆకు, ఎన్.బి.21 గడ్డి, బి.ఎన్-2 గడ్డి, పేరా గడ్డి కూడా పనికి వస్తాయి. కాయజాతి పచ్చిమేతలు సైలేజి పాతర వేసుకోవడానికి పనికిరావు. పచ్చిమేత దొరకని సమయములో పచ్చిమేతకు బదులుగా వాడుకోవచ్చు.

సైలేజి రోజుకు పాడి పశువుకు 20 కిలోల చొప్పున యివ్వవచ్చును. సుమారు 120 రోజులకు సరిపడీ పాతర గడ్డి చేతిలో వుంటే వేసవి కాలపు పచ్చిమేత కొరత చాలా వరకు తగ్గిన్చుకోనవచ్చును. 5 పాడి పశువులకు 120 రోజులకు రోజుకు 20 కిలోల చొప్పున (5x12x120) 12000 కిలోల సైలేజి కావాలి. ఈ సైలేజి తయారు చేయడానికి 12000x3/2=18000 కిలోక పచ్చిమేత కావాలి. సుమారు ఒక ఎకరా భూమి నుండి లభించే జొన్న గాని, మొక్కజొన్న గాని అవసరముంటుంది.

15 టన్నుల సైలేజి చేసికొనుటకు పాతర పరిమాణము :

ఒక ఘనపుటడుగు సైలేజి బరువు 15 కిలోలు వుంటుంది. అంటే 1000 ఘనపుటడుగల పాతర కావాలి. 8 అడుగుల వెడల్పు 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవు గల పాతర సరిపోతుంది. సైలేజి పాతర తెరచిన తర్వాత 30 రోజులలో వాడుకోవాలి. కనుక దీనిని 3 భాగాలుగా చేసుకోవాలి. గుంత అడుగు భాగంలో ఏ పరిస్థితిలోను నీరు రాని ప్రదేశంలో గుంత తవ్వాలి.

పాతర నింపే విధానము :

పచ్చిమేతలో 70 - 80 శారత్ము నీరు వుంటుంది. సైలేజి చేయడానికి 60 శాతము మించి వుండకూడదు. కనుక కోసిన పచ్చిమేతను పొలంలోనే ఆరబెట్టి తేమను తగ్గించవచ్చును. ముక్కలుగా నరికితే మరి కొంత తొందరగా ఆరుతుంది. మరీ లేతగా ఉన్న పచ్చిమేత సైలేజి చేయడానికి పనికి రాదు. మొక్కజొన్న, సజ్జ రకాలను కంకిలో పాలు పట్టి గింజ గట్టిపద్తున్న సమయంలో పాతర వేస్త్రే కమ్మటి సైలేజి తయారు అవుతుంది. కొంత తవుడు గాని జొన్నపిండి, లేదా బెల్లపు మడ్డి రెండు శాతం వరకు పచ్చిమేతతో కలిపినా సైలేజి పులిసిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. తేమ మరీ తక్కువుగా వుంది ఎండ బెట్టిన పచ్చిమేతను పాతర వేస్తే పాతరలోగాలి, ప్రాణవాయువు ఎక్కువగా ఉందిపోయి బూజు పట్టవచ్చు. విపరీతమైన వేడి వాళ్ళ పాతర గడ్డి నిప్పు అంటుకొనే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.

ఈ విషయాలు అన్ని గుర్తు వుంచుకొని పాతర వేయవలసిన గడ్డిని వరుసలలో నింపాలి. భూమిపైన కూడా 2 -3 అడుగులు వచ్చేలా నింపాలి. ప్రతి వరుసకు బాగా త్రొక్కి, గాలి ఏ మాత్రం లేకుండా చూడాలి. పశువులతోను లేదా ట్రాక్టరుతో కూడా త్రోక్కిన్చావచ్చును. మాలిన పదార్దములు గుంతలో పడకుండా చూడాలి. పాతరలలో పచ్చిమేత నింపుట పూర్తి అయిన తరువాత భూమి పైభాగాన ఎత్తుగా వచ్చేలా చూడాలి. దేనిపైన, పనికి రాని గడ్డి లేదా తాటి ఆకులు వేసి కప్పి మీద 4-5 అంగుళాల మందంగా బురద మట్టితో కప్పాలి. క్రమేణా ఇది 2-3 అడుగుల వరకు క్రుంగి పోతుంది. ఈ సమయంలో ఏర్పడే పగుళ్ళను చిక్కటి మట్టి పేడతో కలిపి అలకడం మంచిది.

సైలేజి వాడకం : పాతర వేసిన గడ్డి రెండు నెలలకు మాగి కమ్మటి వాసన గల సైలేజిగా మారుతుంది. తరువాత అవసరాన్ని బట్టి ఎప్పుడైనా తీయవచ్చు. అవసరం లేకుంటే 2 -3 సంవత్సరాల వరకు చెడిపోకుండా సైలేజిని నిల్వ వుంచుకోవచ్చును. అయితే సైలేజి గుంత తెరచిన తరువాత నెల రోజులలో వాడుకోవలసి వుంటుంది. లేకపోతీ ఆరిపోయి చెడిపోతుంది, బూజు పడుతుంది. మొత్తం కప్పునంతా ఒక్కసారి తీయగూడదు. అలవాటు పడేవరకు పశువులు సైలేజిని తినకపోవచ్చు. పాలు పితికిన తరువాత లేదా పాలు పితకడానికి నాలుగు గంటల ముందు సైలేజిని పశువులకు మేపాలి. లేని యెడల పాలకు సైలేజి వాసన వస్తుంది. పాలు పితికే సమయంలో దగ్గరలో సైలేజి లేకుండా చూడాలి.

వరిగడ్డిలో పశువుకు జీర్ణయోగ్యమైన పోషక పదార్ధాలు చాలా తక్కువ. పశువుకు కావలిసిన మాంసకృత్తులు అసలే లేవు. వరిగడ్డిలో పోషక పదార్ధాల లోపమే కాకుండా, పశువు శరీరంలోని కాల్షియం ధాతువును నష్టపరిచే గుణం కూడా వుంది. దీన్ని సుపోషకం చేసుకోవడం ఆవశ్యకత వుంది.

వరిగడ్డిని యూరియా కలిపిని నీళ్ళు చల్లి మాగవేసుకోవడం వల్ల లాభాలు : వరిగడ్డిని యూరియా కలిపిని నీళ్ళు చల్లి ఊరవేసుకొన్నట్లయితే, వరిగడ్డిలోని పీచు పదార్ధము తగ్గి పశువులు ఎక్కువ మేతను తిని జీర్ణం చేసుకోగలవు. ఊరవేసిన గడ్డిలో మాంసకృత్తులు లభించుటయే కాక పశువు ఆరోగ్యముగా వుంటుంది.
మామూలు వరిగడ్డిలో మాంసకృత్తులు అసలే లేవు. అదే యూరియా కలిపి ఊరవేసిన గడ్డిలో 5 శాతం వరకు మాంసకృత్తులు పెరుగును.

మామూలు గడ్డిలో జీర్ణయోగ్యమైన పోషక పదార్ధాలు 40 శాతంవరకు వుంటే, ఊరవేసిన గడ్డిలోఅవి 60 శాతం వరకు పెరుగును.

మామూలు వరిగడ్డిలో తేమ 5-10 శాతం వరకు ఉండుట వలన పశువులు తక్కువగా మేస్తాయి. ఊరవేసిన గడ్డిలోఅవి 45-55 శాతం వరకు తేమ పెరుగుట వలన పశువులు బాగా తింటాయి.
యూరియా గడ్డి వలన లభించు మాంసకృత్తులు, తెలకపిండి యితర పశువుల దాణాలకన్నా చౌకగా లభించును. ఊరవేసిన గడ్డి రుచికరంగా మెత్తగా ఉండుటవలన, ఎక్కువగా తిని బాగా జీర్ణము చేసుకొని పశువులు సద్వినియోగము చేసుకోగలవు.

విధానము:

  • ఒక రోజుకు ఒక పశువుకు 6 కేజీల యూరియాతో మాగ వేసిన గడ్డి కావలసి వస్తుంది. ఒక పశువుకు 7-8 రోజులకు 50 కేజీలు కావాలి. ఈ విధంగా పశువులకు కావలసిన ప్రకారము యూరియా మోతాదును నిర్ణయించుకోవాలి.
  • 15 లీటర్ల నీళ్ళు 1 కిలో యూరియా
  • 25 కిలోల వరిగడ్డి
  • ఒక పశువుకు 4-5 రోజులకు సరిపోతుంది

100 కేజీల వరిగడ్డికి 4 కిలోల యూరియా 60 లీటర్ల నీళ్ళు కావాలి. మొట్టమొదట యూరియాను నీళ్ళలో బాగా కరిగేటట్లు కలపాలి. ఆ తర్వాత గడ్డిని నేల మీద పరిచి, యూరియా కరిగిన నీళ్ళను పూర్తిగా గడ్డిపై చల్లాలి. యూరియా నీళ్ళు గడ్డిపై పూర్తిగా కలిసేటట్లు చూడాలి. కలిపినా గడ్డిని మొత్తము వామి వేయాలి. ఈ విధముగా వేసిన గడ్డి వామును గాలి చొరకుండా బాగా అదిమి వారి యెంట్లతో బిగించవలెను. ఇలా వామి వేసిన గడ్డిని పది, పదిహేను రోజుల తర్వాత పశువులకు మేపవచ్చును. ఈ పద్ధతిలో వేసిన వరిగడ్డి వామును 4 -5 నెలల వరకు వాడుకొనవచ్చును. యూరియా కలిపిన వరిగడ్డిని మట్టి గోలాలలో గాని, బస్తాలలోగాని నింపి గాలి చొరకుండా వారం రోజులు మాగనిచ్చి మేపుకోవచ్చు

పాల నాణ్యత పరీక్ష

పాలు మన ఆహారంలో అతి ముఖ్యమైన అంశము కావడం వల్ల, నాణ్యత విషయంలో ప్రజారోగ్య శాఖ వారు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను ప్రజారోగ్య చట్టంలో పొందుపరిచారు.దీని ప్రకారం గేదె పాలలో కనీసం 5 శాతం వెన్న, 9 శాతం ఎస్. ఎన్. ఎఫ్, ఆవు పాలలో కనీసం 3.5 శాతం వెన్న,8.5 శాతం ఎస్. ఎన్. ఎఫ్ ఉండాలి.

ఇంతకన్నా తక్కువగా ఉంటే అవి నాణ్యత లేని పాలుగా నిర్ణయించి జరిమానా విధించడం జరుగుతుంది.పాలనాణ్యతను పరీక్షించడానికి పాలసేకరణ కేంద్రాలలో ఈ క్రింది పరీక్షలు నిర్వహింపబడును.

రంగు, రుచి, వాసనల పరీక్ష

  • రంగు :పాలు కలుషితము కావడం వల్లనే పాల రంగుమారుతుంది. అసాధారణమైన రంగు ఉన్నట్లయితే ఆ పాలు తిరస్కరింపబడును.
  • రుచి:పాలు మామూలు రుచి ఉన్నట్లయితే అలాంటిపాలను సేకరించవచ్చు. పాలు పుల్లగాను చేదుగాను ఉన్నట్లయితేఆ పాలుతిరస్కరింపబడును.
  • వాసన:మూతను తీసి పాల వాసనను చూడడంజరుగుతుంది. ఎలాంటి చెడు వాసనగాని, అసాధారణమైన వాసనగాని ఉన్నట్లయితేఆ పాలు తిరస్కరింపబడును.

పాలలో వెన్న పరీక్ష

ఉత్పత్తిదారులనుండి పాలుసేకరించేటప్పుడు నిర్వహించే పరీక్షలలో యిది ముఖ్యమైనది. వెన్నశాతాన్నితెలుసుకోవడానికి గర్భర్ పద్ధతిని ఉపయోగిస్తారు.క్రొత్తగా మిల్క్ టెస్టర్అనే పరికరాన్నివాడుతున్నారు. పాల ఉత్పత్తిదారులు ఈ పద్ధతులుతెలుసుకోవాలి.

ఎస్. ఎన్. ఎఫ్.అనగా పాలలోవెన్న పోగా మిగిలిన ఘన పదార్ధమునుపరీక్షించడానికి లాక్టోమీటరు అనే పరికరాన్ని వాడతారు.పాలనాణ్యతను, ధరను నిర్ణయించడానికి వెన్న శాతముతోబాటు ఎస్. ఎన్. ఎఫ్.శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వెన్నశాతం మరియు ఎస్. ఎన్. ఎఫ్. హెచ్చు తగ్గులకు కారణాలు

  • పాడి పశువు జాతిని బట్టివెన్న శాతం, ఎస్. ఎన్. ఎఫ్. మారతాయి.
  • పశువు వయస్సు పెరిగినకొద్దీవెన్న శాతం, ఎస్. ఎన్. ఎఫ్. లలో తగ్గుదల ఉంటుంది.
  • పశువునుబెదిరించినప్పుడు, భయాందోళనతోఉన్నప్పుడు,అనారోగ్యస్థితిలోవెన్నశాతంతగ్గుతుంది.
  • ఈనిన 15 రోజులనుండి 9 నెలల వరకు, తర్వాతపశువుఆరోగ్యస్థాయిపెరిగినప్పుడు, వ్యాయామముతర్వాత వెన్నశాతం పెరుగుతుంది.

ఉత్పత్తిదారులకు సరియైన ధర రావాలంటే

  • పాలలో నీరు ఏమాత్రం కలపకూడదు.
  • దళారీలకు, కొలతలోమోస౦చేసేవారికి, పాలుసరఫరాచేసినష్టపొయకూడదు.
  • వెన్నశాతంచూసి ధరచెల్లించేపాలసేకరణకేంద్రాలలో పాలుపోయాలి.

చూడి పశువు పోషణలోజాగ్రత్తలు

  • గర్భధారణ చేయించిన 90 రోజుల తర్వాత చూడి నిర్ధారణ పరీక్షలు చేయించాలి.
  • ఆవులో చూడికాలం 9 మాసాలు గేదెలలో 10 మాసాలు.
  • చూడి పశువు చివరి రెండు మాసాల ముందు వట్టి పోనివ్వాలి. ఈ సమయంలో రోజుకు అదనంగా ఒక కిలో దాణా ఇస్తే, పాడికాలంలో 400 లీటర్లు ఎక్కువ పాల దిగుబడి పొందవచ్చు.
  • చూడి పశువులను ఎక్కువ దూరం నడిపించడం కాని, పరిగెత్తించడం కాని, బెదిరించడం కాని చేయకూడదు, పోట్లాడనివ్వకూడదు.

ఈనేటప్పుడు తీసుకోవలసినజాగ్రత్తలు

  • ఈనే లక్షణాలు కన్పించిన వెంటనే పశువును పరిశుభ్రమైన షెడ్డులో వరిగడ్డి పరచి ఉంచాలి. 2 గంటల లోపల పశువు ఈనుతుంది. ఆలస్యమైతే డాక్టరును సంప్రదించాలి.
  • ఈనిన వెంటనే పశువుకు ఒక బక్కెట్టు గోరు వెచ్చని నీరు త్రాగించాలి. ఆ తర్వాత తవుడు, గోధుమ లేదా సజ్జ బరపటము బెల్లం, ఉప్పు, అల్లం, లవణ మిశ్రమము కలిపిన మిశ్రమాన్ని తినిపించాలి.
  • సాధారణంగా ఈనిన తర్వాత 12 గంటల లోపల మాయ వేయాలి. 24 గంటలలోపల కూడా మాయ పడకపోతే డాక్టరును సంప్రదించాలి. మాయను పశువులు తినకుండా జాగ్రత్తపడాలి.
  • ఈనిన తర్వాత రెండవ ఎదలో పశువును తిరిగి చూడి కట్టించాలి.

చూడి పశువు పోషణలోపాటించ వలసిన విషయాలు

గర్భధారణ చేయించిన 60 - 90 రోజుల లోపల చూడి నిర్ధారణ పరీక్షలు చేయించాలి.

పాల జ్వరం రాకుండా ఈనడానికి వారం రోజుల ముందు కాల్షియం ఇంజెక్షన్సు ఇప్పించాలి.

పొదుగు వ్యాధి రాకుండా, ఈనడానికి15 రోజుల ముందు పొదుగులో ఆంటిబయోటిక్ మందులు ఎక్కించాలి

ఈనడానికి ముందు పశువును వేరు చేసి పరిశుభ్రమైన పాకలో ఈనడానికి ఏర్పాటు చేయాలి.

చివరి రెండు మాసాలలోపాలు పితకడం

మాని వేసి,రోజుకు అదనంగా ఒక కిలో దాణా పెట్టాలి.

3వ నెల నుండి 6వ నెల లోపల చూడి పశువుకు నట్టల మందులు తాగించాలి.

పశువుల ఆరోగ్య సంరక్షణే భాగ్యము

పశుపోషణలో వాటి ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యం. "ఆరోగ్యమే మహాభాగ్యము" అనే సూక్తి మనకే కాదు పశువులకు కూడా వర్తిస్తుంది. అవి ఆరోగ్యంగా ఉంటేనే వాటి వాళ్ళ మనకు భాగ్యము కలుగుతుంది. పశువుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తే వాటి ఉత్పత్తి తగ్గి, వ్యవసాయ పనులు కుంటు పడటం వల్ల మనకు ఎంతో నష్టం.
పశువులు ఆరోగ్యంగా వుండాలంటే

  1. పశువుల శాలలు, వాటి పరిసరాలు శుభ్రంగా వుండాలి.
  2. పుష్టికరమైన మేపు మేపాలి.
  3. పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడు అందుబాటులో వుండాలి.
  4. గోమార్లు, పిడుదులు, దోమలు నిర్మూలించాలి.

పశువుల ఆరోగ్య స్థితి పరిశీలన

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం, పాలు పితికేటప్పుడు మేత మేసేటప్పుడు, పశువుల పాకలో వాటి ప్రవర్తనను పరిశీలించాలి. వాటి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు గమనించి, వ్యాధులున్నట్లైతే ముందుగానే పసిగట్టి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.

ఆరోగ్యమైన పశువు లక్షణాలు

  1. తోక, చెవులు ఆడిస్తూ చురుకుగా వుంటుంది.
  2. మేత మేసి నెమరు వేస్తుంది, ముట్టె చెమ్మగా వుంటుంది.
  3. పాల ఉత్పత్తిలో మార్పు వుండదు.
  4. ఉష్ణోగ్రత ఆవులో 38.3oC నుండి 38.8oC, గేదెలో 37.8oC నుండి 39.3oC
  5. పేడ ఆకు పచ్చరంగులో వుండి అంత పలుచగాను లేదా మరి గట్టిగా వుండదు.
  6. మూత్రము వరిగడ్డి రంగులో వుంటుంది.

జబ్బు పశువు లక్షణాలు

  • మందలోకలవక మందకొడిగా వుంటుంది.
  • మేత నెమరు వేయదు.
  • జ్వరం వుంటుంది.
  • చర్మం మొద్దుబారి వెంట్రుకలు పైకి లేస్తాయి.
  • కళ్ళ నుండి పుసి, నీరు కారుతుంది. చెవులు క్రిందికి జారి అలసిపోయినట్టుగా కనబడుతుంది.
  • సాధారణంగా పాడి పశువు, పాలు పితికే ముందు దాని శరీరము, పొదుగును కడిగేటప్పుడు, మూత్ర విసర్జన చేసి సేపడానికి సిద్ధపడుతుంది. అలా కాకుండా, వెనుక కాళ్ళు జాడించి పొడుగు ముత్తగానే భయంతో ఆందోళన పడ్డట్లైతే కొద్ది సేపు దాన్ని వదిలివేయాలి. తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తే దానికి పొదుగు వాపు అని గుర్తించాలి.
  • పాలు పితికేటప్పుడు దాణా తినకుండా నిలబడితే దాని జ్వరము పరిశీలించాలి లేదా అజీర్తిగా అనుమానించాలి.
  • పశువు పేడ పెంటికలుగా వుంటే దానికి మలబద్ధకంగా గుర్తించాలి. మరీ పలుచగా వుంటే దానిని విరేచాలుగా గుర్తించాలి.
  • ఆరోగ్యమైన పశువు వేసిన పేడకడి మధ్యలో గుంత ఏర్పడి గుండ్రంగా వుంటుంది. పేడకడిలో అక్కడక్కడ గుంతలున్నట్లయితే దాని కడుపు పులిసి అజీర్తికి దారి తీస్తుందని గమనించాలి.
  • పేడలో జీర్ణము గాని మేత ముక్కలు కన్పిస్తే జీర్ణశక్తి లోపంగా గుర్తించాలి. పేడమీద చీము గాని,
  • తెల్లసొన గాని కన్పించినట్లయితే జీర్ణకోశ వ్యాధులున్నట్లు గమనించాలి.
  • పశువులో జబ్బు లక్షణాలు కన్పించిన వెంటనే డాక్టరును సంప్రదించి తగిన చికిత్స చేయించాలి.

పశువుల అంటువ్యాధులు

సూక్ష్మజీవులు ప్రవేశించడంవల్ల వ్యాధి కలిగి గాలి ద్వారా, నీటి ద్వారా,

మలమూత్రాల ద్వారా యితరత్రా ఒక పశువు నుండి యింకొక పశువుకు

సోకేవి అంటువ్యాధులు. కారణాలను బట్టి యివి మూడు రకాలు.

1.సూక్ష్మాతి సూక్ష్మజీవులు (వైరస్) వల్ల కలిగే వ్యాధులు i) గాలికుంటు ii) పెద్దరోగము

iii) మశూచి మొదలగునవి.

2.సూక్ష్మజీవులు (బాక్టీరియా) వల్ల కలిగే వ్యాధులు i) గురక రోగము లేదా గొంతువాపు

ii) జబ్బు వాపు, iii) దొమ్మ

3.పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు i) నర్రా ii) థైలీరియా iii) జలగవ్యాధి

iv) నట్టలు, గోమారీలు, పిడుదులు యితర క్రిమికీటకాల బెడద.

ముఖ్యమైన అంటువ్యాధులు

గొంతువాపు

  • జ్వరంతో కళ్ళు ఎర్రబడి నీరు కారును
  • ఆయాసంతో శ్వాస పీల్చడం వల్ల గుర్రుమని శబ్దం
  • దవడల మధ్య మెడ క్రింద వాపు
  • శ్వాస మరీ కష్టమై నాలుక బయటికి తీస్తుంది
  • వ్యాధి అతి తీవ్రంగా వున్నప్పుడు జ్వరం ఎక్కువై, శ్వాస కష్టమై హఠాత్తుగా పశువు చనిపోవచ్చు.
    మొదట్లో చికిత్స చేస్తే బ్రతికే అవకాశముంది.

జబ్బవాపు

  • బలిష్టంగా వుండి వయస్సు మీద పశువులకు వ్యాధి వస్తుంది.
  • జ్వరంతో కళ్ళు ఎర్రబడతాయి.
  • జబ్బ, తుంటి కండరాలలో వాపు
  • పశువు కుంటుతూ కూలబఢిపోతుంది.
  • వ్యాధి ముదిరితే 1-2 రోజులలో పశువు చనిపోతుంది.
  • ప్రారంభదశలోనే చికిత్స చేస్తే బ్రతుకుతుంది.

పెద్ద రోగము

  • జ్వరతీవ్రత 104-107o ఫారన్ హీటు
  • కళ్ళు ఎర్రబడి నీరు కారడం
  • నోటి నుండి దుర్వాసన
  • చిగుళ్ళ మీద నాలుక మీద పొక్కులు
  • జిగురు, రక్తంతో కూడిన విరేచనాలు
  • గొట్టం చిమ్మినట్లుగా పారుకొని నీరసించి చనిపోతుంది.

మొదట్లోఆంటిబయాటిక్మందులతో చికిత్స చేస్తే కొంతవరకు ఫలితం.

గాలికుంటు వ్యాధి

  • జ్వరతీవ్రత 104-105oఫారన్ హీటు
  • నోటిలో పొక్కులు, చొంగ
    కారుతుంది. మేత మేయదు.
  • గిత్తల మధ్య పొక్కులు ఏర్పడి కుంటుతుంది.
  • సంకర జాతి పశువులలో వ్యాధి తీవ్రత ఎక్కువ.

అపాయం అంతగా లేకపోయినా ఆర్ధికంగా నష్టదాయకం.
ఆంటిబయాటిక్ మందులతో చికిత్స, పుండ్లకుమలాం రాయాలి.

అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు

ప్రతిరోజు తనిఖీ చేసి వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి. అంటువ్యాధి సోకిన సమాచారం వెంటనే డాక్టరుకు తెలియజేయాలి

వ్యాధి పశువు యొక్క పాత్రలు, గొలుసులు క్రిమి సంహారక ద్రావకంతో కడగాలి

పశువుల శాలలు శుభ్రం చేసి క్రిమి సంహారక ద్రావకంతో కడగాలి

పశువుల శాలలను పరిశుభ్రంగా ఉంచాలి

వ్యాధి పశువు తినగా మిగిలిన గడ్డి గాదం తీసి కాల్చి వేయాలి

వ్యాధితో చనిపోయిన పశు కళేబరాన్ని గోతిలో సున్నము చల్లి పూడ్చాలి

అంటురోగ నిరోధక టీకాల కార్యక్రమము

అంటువ్యాధులు సోకిన తర్వాత చికిత్స వల్ల అంతగా ప్రయోజనం వుండదు. అవి కోలుకున్నా వాటి ఉత్పాదన శక్తి తగ్గిపోతుంది. వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడడం కన్నా, ముందుగానే సరియైన సమయంలో రోగ నిరోధక టీకాలు వేయించాలి.

చికిత్స కన్నా నివారణ మేలు

పశువులలో అంటు వ్యాధుల నిరోధక టీకాల కార్యక్రమము

వ్యాధి పేరు

మొట్టమొదట చేయించవలసిన వయస్సు

ఆతర్వాత టీకాలు వేయడం

చేయించవలసినసమయం

1. గాలికుంటు

రెండునెలల వయస్సులో

సం.రానికిరెండు సార్లు

మార్చి -ఏప్రిల్

ఆగస్టు -సెప్టెంబరు

2. పెద్ద రోగము

6వ నెల వయస్సు

ప్రతి సం.రానికిఒక సారి

జనవరి -ఫిబ్రవరి

3. గొంతు వాపు

5వ నెల

ప్రతి సం.రానికిఒక సారి

మే - జూన్

4. జబ్బ వాపు

7వ నెల

ప్రతి సం.రానికిఒక సారి

మే - జూన్

5. దొమ్మ రోగము

6వ నెల

ప్రతి సం.రానికిఒక సారి

ఆగస్టు -సెప్టెంబరు

6. ఈసుడురోగము

4-6 నెలలో

జీవితంలోఒకేసారి

ఎప్పుడైనా

7. థైలేరియాసిస్

నాలుగునెలల తర్వాత

ప్రతి సం.రానికిఒక సారి

ఎప్పుడైనా

పాడి పరిశ్రమ నిర్వహణకు చేయూత

గ్రామీణ ప్రాంతాలలోని పేదవారి ఆర్ధిక పరిస్థితి పాడి పశువుల పోషణ ద్వారా అభివృద్ధి పరచాలన్నధ్యేయంతో, పాడి పశువుల పోషణకు, ప్రభుత్వంతోపాటు, గ్రామీణాభివృద్ధి సంస్థలు, బ్యాంకులు, హరిజన గిరిజనాభివృద్ధి సంస్థలు, పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాలు అనేక పధకాలను అమలు చేస్తున్నాయి.

సబ్సిడీపై పాడి పశువుల యూనిట్ల పంపిణీ

గ్రామీణాభివృద్ధి సంస్థ, వెనుకబడిన కులాలు మరియు హరిజనాభివృద్ధి సంస్థల ద్వారా గ్రామాలలోని బలహీన వర్గాల వారికి, పేద రైతులకు సబ్సిడీపై పాడి పశువుల యూనిట్ల పంపిణీ చేస్తున్నారు. సంకర జాతి ఆవులను గాని రోజుకు 6 లీటర్ల పాలు యిచ్చే ఒక జత గేదెలను గాని ప్రతి లబ్ది దారుకు యివ్వడం జరుగుతుంది. ఒక గేదెల యూనిట్ ధర రూ. 14000 . యిందులో 25 శాతం సబ్సిడీ సన్నకారు చిన్నతరహా రైతులకు 33.3 శాతం సబ్సిడీ రైతు కూలీలకు మరియు హరిజనులకు 50 శాతం సబ్సిడీ యివ్వబడుచున్నది.

దూడల పెంపకానికి ప్రోత్సాహం

సంకరజాతి దూడల, గ్రేడెడ్ ముర్రా జాతి గేదె దూడల పోషణను ప్రోత్సహించడానికి ఈ సంస్థల ద్వారా దూడల కొరకు ప్రత్యేక దాణా సరఫరా చేయడం జరుగుచున్నది. ఈ దాణా మేపడం వల్ల దూడలు త్వరగా పెరిగి మంచి పాడి పశువులుగా వృద్ధి చెందుతాయి.

సంకరజాతి పెయ్య దూడల మేపు ఖర్చు కోసం అంటే 4 నెలల నుంచి అది ఈనే వరకు సుమారు 19-20 క్వింటాళ్ళ దాణా కావాలి. యిందుకొరకు 2400 రూపాయల ఖర్చవుతుంది. అదే గేదె దూడ మేపు కోసం 6 వ మాసం నుండి ఈనే వరకు రూ. 2100 ఖర్చవుతుంది.

యిందులో సన్నకారు చిన్న తరహా రైతుల కొరకు 50 శాతం, వ్యవసాయ కూలీలకు 66.3 శాతం సబ్సిడీ యివ్వడం జరుగుతుంది. స్వంత దూడలు వున్న వారికే సబ్సిడీని దాణా రూపంలో యివ్వడం జరుగుతుంది.

బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం

పాడి పశువుల కొనుగోలుకు కావలసిన మొత్తంలో సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించబడుతుంది. గ్రామీణాభివృద్ధి మరియు యితర సంస్థల నుంచి సబ్సిడీ బాగం బ్యాంకుకు చేరగానే, కొనుగోలుకు కావలసిన మొత్తాన్ని బ్యాంకులు అందజేస్తాయి. తీసుకున్న అప్పును 5 సంవత్సరాల కాలంలో నెలసరి వాయిదాలలో చెల్లించవలసి వుంటుంది.

పశు సంవర్ధక శాఖ ద్వారా సాంకేతిక వనరులు సమకూర్చడం

పాడి పశువుల ఆరోగ్య సంరక్షణతో పాటు వాటి ఉత్పత్తి శక్తిని పెంచడానికి అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. పశువుల చికిత్స, టీకా మందుల సరఫరా, నట్టల నివారణ, గొడ్డు మోతు పశువుల చికిత్స శిబిరాల ఏర్పాటు పశుగ్రాసాభివృద్ధి, విత్తనాల సరఫరా, కృత్రిమ గర్భోత్పత్తి, శిక్షణ వంటి సదుపాయాలూ పశు సంవర్ధక శాఖచే కల్పించబడుచున్నవి. ఈ సదుపాయాలు, పాల ఉత్పత్తి సహకార సంఘాల ద్వారా, ఆయా సంఘాల సభ్యులకు మాత్రమే కల్పించడం జరుగుచున్నది.

పశువులకు భీమా సౌకర్యము

పశువులు వ్యాధుల వల్ల గాని, ప్రమాదాల వల్ల గాని చనిపోయినట్లైతే వాటి స్థానే పశువులను కొనడానికి రైతులకు పశువుల భీమా పథకము ఉపయోగపడుతుంది. భీమా పథకము 2-10 సంవత్సరాలలోపు పాడి ఆవులకు, 3-12 సంవత్సరాలలోపు పాడి గేదెలకు, ఆబోతులకు, మరియు పని ఎద్దులకు వర్తిస్తుంది. ఈ పథకము పశువుల ఉత్పత్తి యోగ్యమైన జీవిత కాలము వరకు వర్తిస్తుంది.

సన్నకారు రైతులకు, చిన్న తరహా రైతులు, రైతు కూలీలు యితర బడుగు వర్గాల సంక్షేమ పథకాల క్రింద లబ్ధిదారులకు పశువుల భీమా సౌకర్యాలు కల్పించబడుచున్నవి. వీరికి, ప్రత్యేక ప్రీమియం రేటు 2.25 శాతం మాత్రమే. జాతీయ పాడి అభివృద్ధి సంస్థ మార్గదర్శకంలో నిర్వహిస్తున్న డైరీ ఫారాల పశువులకు కూడా ప్రీమియం రేటు 2.85 శాతం మాత్రమే. యితర రైతుల పశువులకు ప్రీమియం రేటు 4 శాతం వసూలు చేయబడును.

భీమా చెల్లింపు : పశువుల భీమా బహుళ జనాధరణ పొందిన దృష్ట్యా చెల్లింపు ఆలస్యం లేకుండా సకాలంలో లబ్దిదారులు చెల్లింపులు పొందడానికి చెల్లింపు విధానాన్ని సరళతరంగా రూపొందించడం జరిగినది. అన్ని కంపెనీలకు ఒకేమాదిరి చెల్లింపు పత్రము రూపొందించడం జరిగింది. పశువు మరణ సమాచారం రైతు ఋణము పొందిన బ్యాంకుకుగాని, ఇన్సూరెన్స్ కంపెనీకిగాని, గ్రామీణాభివృద్ధి సంస్థవారికి గాని, 30 రోజుల లోపల మరణ ధృవీకరణ పత్రము క్లెయిము పత్రముతో జతపరచి తెలియపరచాలి.
పశువు మరణాన్ని ధృవీకరిస్తూ ధృవీకరణ పత్రము ఈ క్రింద పేర్కొన్న వారి నుండి పొందవచ్చు.

1 . గ్రామ సర్పంచు, 2 . గ్రామ సహకార సంఘం అధ్యక్షులు, 3 . పాల సేకరణ కేంద్రం అధికారి, 4 . స్థానిక పశు వైద్య అధికారి, 5 . కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు సూపర్వైజర్ లేదా ఇన్ స్పెక్టర్ లేదా, 6 . గ్రామీణాభివృద్ధి సంస్థ చేత అధికారం పొందిన వ్యక్తి, 7 . స్థానిక పశువైద్య అధికారి.

ఉద్దేశ్య పూర్వకముగా చంపినపుడు, భీమా అమలులోకి రాక ముందే పశువు వ్యాధి గ్రస్తమైనపుడు పశువు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేసినపుడు భీమా సౌకర్యం వర్తించదు.

ఆధారము: ఎన్.ఎ.ఎ.ఆర్.ఎం.(నార్మ్)

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate