గ్రామ మహిళా కేంద్రాల విస్తరణ
గ్రామంలోని మహిళలకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వైవిధ్యమైన సేవలందించే సౌలభ్య కేంద్రాలను (విలేజ్ ఫెసిలిటేషన్ మరియు కన్వర్జన్స్ సేవలు) గ్రామ మహిళా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాలను ఎక్కడయితే బాలల లింగ నిష్పత్తి తక్కువ అంటే 0-6 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలలో ప్రతి 1000 మంది బాలురకు తక్కువ బాలికలు ఉన్నట్లుయితే అక్కడ బాలల లింగ నిష్పత్తి తక్కువ ఉంది అని అర్థం . ఆ విధంగా చూస్తే మన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో వై.యస్.ఆర్. కడప జిల్లాలో బాలల లింగ నిష్పత్తి 918 ఉంది. అందుచేత ఈ జిల్లాలో బేటి బచావో బేటి పడావో ( బాలికలను కాపాడుదాం- బాలికలను చదివిద్దాం) అనే బృహత్తర కార్యక్రమం అమలు జరుగుతున్నది. అందుచేత ఇదే జిల్లాలో గ్రామ మహిళా కేంద్రాలను మొదట విడతగా 20 గ్రామ పంచాయితీలలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కేంద్రాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు, కార్యక్రమాల పట్ల ప్రజలను చైతన్యపరచి, ఆ కార్యక్రమాలను బాలికలు, మహిళలు అందిపుచ్చుకునేలా సమన్వయం చేస్తుంది. వచ్చే సంవత్సరం మరికొన్ని గ్రామాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 12 వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2012-17) ఈ కేంద్రాలను జిల్లాలో ఉన్న అన్ని పంచాయితీలలో ఏర్పాటు చేస్తారు.
ప్రతి గ్రామ పంచాయితీకి రూ. 82,000 లు పధక కార్యక్రమానికి కేటాయించడం జరిగింది. ఈ పధకాన్ని బేటి బచావో బేటీ పడావో పధక అమలు కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన జిల్లా టాస్క్ పోర్స్ మరియు జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో అమలు జరుగుతుంది. ఆయా గ్రామ పంచాయితీలు ఎక్కడయితే బాలల లింగ నిష్పత్తి తక్కువ ఉందో ఆ పంచాయితీలు ఎంపిక చేయబడతాయి.
గ్రామ పంచాయితీ స్థాయిలో వాలంటీర్ (కార్యకర్త) గా స్థానిక గ్రామం నుండి చదువుకున్న మహిళను ఎంపిక చేస్తారు. ఈ వాలంటీరు ప్రధాన బాథ్యత ఏమిటంటే గ్రామ స్థాయిలో అన్నిశాఖల మధ్య సత్సంబంధాలు పెంచడం పథకాలను సమన్వయ పరచడం, గ్రామ పంచాయితీతో మరియు ఉప-సంఘాల తో మంచి సంబంధాలు కలిగి ఉండి, తద్వారా విద్య, ఆరోగ్యం, పౌష్టికాహార అవసరాలు, న్యాయ హక్కులు, భద్రత మరియు రక్షణ మొదలగు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలి. విలేజ్ ఫెసిలిటేషన్ మరియు కన్వర్జన్స్ సేవలు పథకం కింద పనిచేస్తున్న ఈ వాలంటీర్లు బేటి బచావో బేటీ పడావో పధకానికి కేంద్ర బిందువులా పనిచేస్తారు.
గ్రామ మహిళా కేంద్రాల కార్యక్రమాలు
ఏ మహిళలకైతే వివిధ కేంద్ర, రాష్ట్ర పధకాలు, కార్యక్రమాలతో (బేటి బచావో, బేటీ పడావో, సబల, జన్ ధన్ యోజన, స్వఛ్చభారత్ మొ..) అవసరాలు ఉంటాయో వారికి గ్రామ మహిళా కేంద్రాలు సహాయ సహకారాలు అందించాలి. బేటి బచావో బేటి పడావో ఫథకం లో చెప్పబడిన వివిధ కార్యక్రమాలను గ్రామ పంచాయితీ స్థాయిలో అమలు చేయుటకు ఈ వాలంటీర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. బేటి బచావో, బేటీ పడావో పథకం ముఖ్యంగా మూడు ప్రభుత్వ శాఖల సమన్వయ కార్యక్రమం మరియు మూడు రంగలకు సంబంధించినది (విద్య, ఆరోగ్యం, బాలల పుట్టుక) ఇది బాలల లింగ నిష్పత్తి పెంచడానికి ప్రయత్నిస్తుంది. విలేజ్ ఫెసిలిటేషన్ మరియు కన్వర్జన్స్ సేవల పథకం (జాతీయ మహిళా సాధికారత మిషన్) గ్రామ స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల స్వరూపాలు మరియు ఆ శాఖల కార్యక్రమాలను ప్రత్యక్ష్యంగా, ఉమ్మడిగా కలపే పథకం. అంటే భేటి బచావో బేటి పడావో ఫథకం లోని వివిధ శాఖల సమన్వయం కోసం విలేజ్ ఫెసిలిటేషన్ మరియు కన్వర్జన్స్ సేవల పథకం దోహద పడుతుంది.
విలేజ్ ఫెసిలిటేషన్ మరియు కన్వర్జన్స్ సేవల పథకం లో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు
- గ్రామంలో లక్ష్యంగా పెట్టుకున్న మహిళల మరియు గ్రామ వనరుల సమాచారంకు సంబంధించిన వివిధ గణాంకాలను సేకరించడం, సంకలనం చేయడం
- మహిళలను చైతన్య పరచి వారు సమిష్టిగా సమాఖ్య లేదా సంఘంగా తయారు చేయడం, అంటే స్వయం సహాయక సంఘాలు మరియు గ్రామ సమాఖ్యలను నిర్మించడం, వాటిని బలోపేతం చేయడం
- పంచాయితీ రాజ్ సంస్థలు మరియు గ్రామ సభలలో ప్రజలు ప్రభావవంతంగా, ఉత్సాహవంతంగా పాల్గోనేటట్టు వారికి అవసరమైన సమాచారం మరియు ఇతర వనరులు అందిపుచ్చుకునేటట్టు ఏర్పాటు చేయడం
- గ్రామ స్థాయిలో ప్రజల సమావేశాలు ఏర్పాటు చేయడం, అందులో సామాజిక సమస్యలపై ప్రజలకు చైతన్య కల్పించడం, మహిళలకు సంబంధించిన సమస్యల పైన చర్చను నిర్వహించడం. గ్రామ సభ లేదా మహిళ సభ లేదా గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య, పౌష్టికాహార కమిటి లలో ఇదే విషయాలను నిర్వహించడం చేయాలి. గ్రామ సభ సమావేశాలలో మహిళలు పాల్గోనేటట్టు చైతన్య పరచాలి.
- గృహ సందర్శన చేసి, వివిధ ప్రభుత్వ పధకాలు, కార్యక్రమాలు, సేవలు గురించి తెలియజేసి, ఆ కార్యక్రమలు ఎవరికి ఉద్దేశించినవో వివరించి, వారిని చైతన్యపరచి ఆయా కార్యక్రమాలలో మహిళలు చేరేటట్టు ప్రేరేపించాలి. వారు ఆ కార్యక్రమాలలు అంది పుచ్చుకునేటట్టు చేయాలి.
- సమస్యల పరిష్కారాలకు పంచాయీతీలు, సఖీ – వన్ స్టాప్ సెంటర్లు, గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య, పౌష్టికాహార కమిటి లు సరియైన వేదికలు. అందులో వివిధ మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మహిళా సమస్యలను గ్రామ పంచాయితీలో ఒక ఎజండా అంశంగా తీసుకువచ్చి తద్వారా వాటికి సరియైన పరిష్కార మార్గం చూపించాలి.
- గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సిబ్బంది అంటే అంగన్ వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్త, ఎ.యన్.యం. వారితో మంచి సత్సంబధాలు కల్గి ఉండడం
- స్వయం సహాయక సంఘాలు ద్వారా మహిళ కార్యక్రమాలను వివిధ శాఖల సమన్వయంతో మహిళలు అందిపుచ్చుకునేటట్టు కార్యక్రమాలు రూపోందించడం
- స్థానిక సేవా సంస్థలు మరియు అదే గ్రామంలో పనిచేస్తున్న వారి సిబ్బందితో సత్సంబందాలు కల్గి ఉండడం, వారి సేవలను మహిళలకు అందేటట్టు చేయడం
వాలంటీర్లను ఎంపిక చేయడం
- స్థానిక వార్తా పత్రికలలో ప్రకటన ద్వారా దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులలో నుండి కొంతమందిని మెరిట్ మరియు అనుభవం ను బట్టి వ్యక్తిగత ఇంటర్వ్యూ పిలుస్తారు. అలా పిలువబడిన అభ్యర్థులు సెలక్షన్ కమిటి దగ్గర హాజరు కావాలి. ఈ సెలక్షన్ కమిటీని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ లేదా జిల్లా పరిపాలన వారు నియమిస్తారు.
- వాలంటీరు కు కావలసిన పరిజ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలు మరియు అర్హతలు
- బాలికలు లేదా మహిళలు కనీసం 12 వ తరగతి (ఇంటర్మీడియట్) పాసై ఉండాలి మరియు జెండర్ (స్త్రీ, పురుషుల సమానత్వం) కు సంబంధించిన సమస్యలపై అవగాహన ఉండాలి.
- అదే గ్రామ పంచాయితీలో నివాసితులై ఉండాలి
- మహిళా సమస్యలపై అవగాహన కల్గి ఉండి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభావ వంతంగా స్థానిక భాషలో సమాచారం అందించగల్గాలి.
- వయసు పరిమితి – 45 సంవత్సరాలు
- వాలంటీరు అనే ఈ హోదాకి మహిళా సాధికారత కోసం ఆరాట పడే అంకిత భావం కల్గి ఉండాలి. అదే విధంగా జెండర్ సమస్యల పట్ల ఎక్కువ స్పృహ, సున్నితత్వం కల్గి ఉండాలి. వీరికి ఎటువంటి నెలవారి జీతం ఉండదు. అయినప్పటికి వాలంటీర్ల అంకితభావంతో చేసే పనికి జిల్లా కలెక్టర్ గారి నిర్థేశంతో ప్రోత్సహాలు ఇవ్వబడతాయి.
నివేధకలు సమర్పన మరియు పర్యవేక్షణ యంత్రాంగం
- ఈ వాలంటీర్లు స్థానిక అంగన్ వాడీ కేంద్రంలో తమ హాజరు నమోదు చేస్తారు మరియు నెలవారీ నివేదికలు సమర్పిస్తారు. యం.ఐ.యస్ నివేధక ను ప్రతి మూడు నెలలకొకసారి (త్రైమాసిక) జిల్లా టాస్కు పోర్సు కమిటీకి సమర్పిస్తారు. ఈ నకలు కాపీని కార్యదర్శ, మహిళా శిశు సంక్షేమ శాఖకు పంపిస్తారు. సంబంధిత పంచాయితీ సమితి లేదా గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య, పౌష్టికాహార కమిటి (గ్రామ పంచాయితీ యొక్క ఉప-కమిటీ, అంగన్ వాడీ కార్యకర్త, సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమం, పంచాయితీ రాజ్ సంస్థలు సభ్యులుగా ఉన్న కమిటీ) వారు వాలంటీరుకు పూర్తి దిశా నిర్థేశకం చేస్తారు.
శిక్షణ
- శిక్షణ అనేది వాలంటీర్లకు చాలా ముఖ్యమైనది. ఈ శిక్షణ వలన వారు పూర్తిగా గ్రామంలోని ప్రజలకు సేవ చేయగలుగుతారు. ఈ శిక్షణ లో వారు మహిళా సాధికారత గురించి నేర్చుకుని, జెండర్ స్పృహా కల్గిన కల్గిన కార్యకర్తలుగా తయారవుతారు.
- వీరికోసం శిక్షణలు, సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిక్షణలు రాష్ట్ర స్థాయిలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలు మరియు స్వతంత్ర శిక్షణా సంస్థలతో అనుసంధానించబడతాయి. ఈ శిక్షణలో వాలంటీర్ల పాత్రలు, బాధ్యతలు గురించి చెప్పడం జరుగుతుంది.
- శిక్షణలో గ్రామ స్థాయీలో ఉత్తమ పద్ధతులు చూచి ఆచరించే విధంగా వారికి వివిధ సందర్శనా యాత్రలు ఏర్పాటు చేస్తారు.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్ ఉపయోగించడంపై శిక్షణ ఇస్తారు
- వాలంటీర్ల కోసం ఒక టూల్ కిట్ రూపోందించడం జరుగుతుంది. అందులో ఫథక సమాచారం, నెలవారీ సమాచార పత్రాలు, సమాచార, ప్రచార సామాగ్రి ఉంటాయి. ఇవి వాలంటీర్లకు ఒక ఉపయుక్తంగా ఉంటాయి.
నిధులు
- విలేజ్ ఫెసిలిటేషన్ మరియు కన్వర్జన్స్ సేవలు పథకం కు అయ్యే నిధులన్నీ 100 శాతం జాతీయ మహిళా సాధికారతా మిషన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం అందిస్తుంది.
ఆధారము: డా. నూనె శ్రీనివాసరావు యం.యస్.డబ్యూ., పి.హెచ్.డి