గర్భిణీ స్త్రీలకు సలహాలు
ఇప్పుడు -గర్భిణీ స్త్రీలకు సలహాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
గర్భం అనేది సృష్టి రహస్యం. ఇది మహిళలకు దేవుడిచ్చిన ఓ అపురూపమైన కానుక. కొన్ని సూచనలు పాటిస్తే ప్రసవం సులభతరమౌతుంది . గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు పౌష్ఠిక ఆహారం: పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలి .
గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి అనిపించవచ్చును. దీనిని తేదీ(నెల) తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రం రోజుకు ఒక వారం కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ సమయం లెక్కించవచ్చును. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele's rule) అంటారు.EDD = LMP +9 months ,7 days.
గర్భ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరాయువు(placenta) నుండి తయారయ్యే హార్మోన్లు ఆధారంగా పనిచేస్తాయి. వీటిని రక్తంలో గాని, మూత్రంలో గాని కొద్ది రోజులలోనే గుర్తించవచ్చును. గర్భాశయంలో స్థాపించబడిన తరువాత, జరాయువు చే స్రవించబడిన కోరియానిక్ గొనడోట్రోఫిన్ స్త్రీ అండాశయంలొని కార్పస్ లుటియమ్ నుండి ప్రొజెస్టిరోన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. దీని మూలంగా ఎండోమెట్రియమ్ మెత్తగా వాచి, రక్తనాళాలు వృద్ధిచెందుతాయి. దీని మూలంగా పిండాభివృద్ధికి కావలసిన ఆహార పదార్షాలు సరఫరా చెందుతాయి.
ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్ష గర్భధారణ మరియు పిండం యొక్క వయస్సును కూడా తెలియజేస్తుంది. దీని ద్వారా పురుడు జరిగే సమయం కూడా నేగలీ సూత్రం కన్నా సరిగ్గా అంచనా వేయవచ్చును. శాస్త్రబద్ధంగా పురుడు ప్రారంభమైన సమయం ఋతుచక్రం యొక్క తేదీల ప్రకారం 3.6 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. అయితే స్కానింగ్ ద్వారా అంచనా కూడా 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా తెలిసినది.
స్త్రీ, పురుష ప్రాకృతిక సంభోగంలో, పురుషుని వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన పిండం స్త్రీ గర్భాశయంలో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని గర్భం (Pregnancy) అంటారు. గర్భం ధరించిన స్త్రీని గర్భవతి అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మింస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు. గర్భావధి కాలం తరువాత శిశువు జననం సాధారణంగా 38 - 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది.(9 lunar month * 30 days = 270 days).
ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను 'పిండం'(Embryo) అంటారు. 'శిశువు'(Foetus) అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు. చాలా దేశాల్లో మానవుల గర్భావథి కాలాన్ని మూడు ట్రైమిస్టర్(3*3 months) కాలాలుగా విభజిస్తారు. మొదటి ట్రైమిస్టర్ కాలంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు , పండ్లు , ఆకుకూరలు , పప్పు , మాంసము , చేపలు వగైరా తీసుకోవాలి .
- మొదటి ఆరునెలలు .... నెలకొకసారి , ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు , తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము .
- సొంతముగా మందులు వాడడము , ఎక్షురేలు తీయించుకోవడము చేయకండి.
- ఎత్తుమడమల చెప్పులు వాడకంది ,
- గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
- మొదటి మూడునెలలు , చివరి నెలలో దూరప్రయాణాలు , కారు స్కూటరు నడపడము , చేయరాదు .
- రాత్రులు 8-10 గంటలు , పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి .
- స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.
- ధనుర్వాతం బారినుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్ లు తీసుకోవాలి .
- రక్తస్రావము , ఉమ్మనీరు పోవడము , శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు , కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి .
గర్భవతులకు - పోషకాహారం-- గర్భస్త సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు -
భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్ర్రీ గర్భవతిగా లేని సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఓకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది. బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది.
గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్ధితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి. రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి.
సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవాలి. (పగలు కనీసం 2 గంటలు, రాత్రి 8 గంటలు)
గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష ) , నువ్వులు, చెఱకురసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున ఐరన్ మాత్రలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుని ఆరోగ్యం గా ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరుగుతుంది.
తీసుకోకూడని పదార్ధము :
- బాగా ఉడకని మాంసము ముఖ్యము గా పందిమాంసము తినకూడదు .. దీనివల "toxoplasmosis"అనే ఇంఫెక్షన్ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీయును లేదా పుట్టే బిడ్డ గుడ్దిదిగా పుట్తును .
- కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు (smoked seafoods)తినకూడదు . దీనివల " Listeriosis " అనే ఇంఫెక్షన్ వచ్చే అవకాశము ఉన్నది . దీనివల అబోర్షన్లు జరిగే అవకాశము ఉన్నది .
- అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.
- పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్ధములు తినకూడదు . పచ్చి గుడ్డు లో " Solmonella " అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ.
- పాచ్యురైజేషన్ చేయని పాలతో తయారుఛేసిన జున్ను వంటి పదార్ధము లు తినకూడదు . పాచ్యురైజేషన్ చేయని పాలలో " Listeria " , Bovine T.B అనే బాక్టీరియా ఉంటుంది . దానివలన miscarriage అయ్యే ప్రమాధము ఉండును.
- కాఫీ లోని కెఫిన్ మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది . కెఫిన్ డైయూరిటిక్ గా పనిచేయును . వంటిలోని నీరును బయటికి పంపివేయడం వలన డీహైడ్రేషన్ వచ్చే అవకాశము వలన గర్భస్రావము జరిగే చాన్స్ ఎక్కువ.
- సారా (Alcohol) మరియు సారా సంబంధిత పదార్ధములు తీసుకోకూడదు . బేబీ పెరుగుదలను , ఆరోగ్యాన్ని దెబ్బతీయును. "foetal alcohol syndrome "కి దారితీయును . కాలేయసంబంధిత రుగ్మతలు బేబీకి కలుగును,
- కాయకూరలు బాగా కడిగి తినాలి . కడగని ఆకుకూరలు , కాయలు , పండ్లు పైన " Toxoplasmosis" కలుగజేసే బాక్టీరియా ఉండును . ఇది చాలా ప్రమాదకరము .
- విటమిన్ ' ఎ ' ఎక్కువగా ఉన్న మాంసాహారము అనగా లివర్ తో వండిన కూర తినకూడదు - దీనివలన బేబీ పుట్టికతో కూడుకున్న డిఫెక్ట్స్ తో పుట్టే అవకాశమున్నది. బీటా కెరటీన్ తో కూడుకొని ఉన్న విటమిన్ ' ఎ ' (కేరెట్స్ ) తినవచ్చును .
అపోహలు:
కొన్ని రకాల పండ్లు తినడం మూలంగా మనకు సమస్యలు వస్తాయని, ముఖ్యంగా మహిళల విషయంలో ఎక్కువగా ఉంటాయనే అపొహ వుంది. వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకుంటే ఈ ప్రశ్నలు తిరిగి ఉత్పన్నం కావనే విషయాన్ని గుర్తించాలి.
కొన్ని రకాల అపోహలుబొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందనడం ఎంత మాత్రం నిజం కాదు. ఇందు లో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే తొందరగా జీర్ణం కాదు. అందువల్ల విరేచనాలు, బహిష్టు స్రావం కల్గవచ్చు. ఇది చాలా బలహీనంగా ఉన్న వారి లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.
కొబ్బరి నీళ్లు తాగడం అందరికీ మంచిది. ఇందు లో ఎక్కువ మోతాదులో పొటాషియం+ లవణాలు ఉంటా యి. అందుకే ఎక్కువ తాగితే జలుబు చేసి కఫం రావచ్చు.అంతే కానీ కొబ్బరి నీళ్లు తాగితే జలుబురాదు.
మాంసాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి. మాంసం తినడం వల్ల శరీరం దృడంగానూ, బలంగానూ తయారవుతుంది. శాకాహారం కన్నా మాంసాహారం కొంతవరకూ మేలే.
గుడ్లు తినడం వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు.కానీ ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి గను త్వరగా జీర్ణం కాదు. అందు వల్ల అధికంగా తినకపోవడమే మంచిది. గర్భిణీలు మొత్తం ఉడక బెట్టినవితినాలి.
నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. అవి శీతాకాలంలోనో, చల్లగా ఉన్నప్పుడో తింటే జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇందులో ఉండే సోడియం, పొటాషియం లవణాలు సాధారణ స్థాయి నుండి అధికమయినట్లయితే ఊపిరితిత్తుల్లో కఫం చేరి జలుబు రావచ్చు. రోగ నిరోదక శక్తి తక్కువ ఉన్న వారికి వచ్చే ఆస్కారం ఉంది.
నెలసరి సమయంలో నువ్వులు తినడం వల్ల బలంగా ఉంటారు. అలాగే నువ్వుల కేలరీల రేటు ఎక్కువగా ఉంటుంది గనక హార్మోన్లు సులువుగా విడుదల అవుతాయి. అందువల్ల రుతుస్రావం ఫ్రీగా అవుతుంది. దీన్నే ఎక్కువగా రక్తస్రావం అవుతుందను కొని భయపడి నువ్వులు తినొద్దు అంటారు.
బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు... క్యారెట్ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బీట్‌రూట్ కన్నా క్యారెట్ కొంత వరకూ మంచిదే.
కాకరకాయ రసం నేరుగా తాగకూడదు. దీనివల్ల మధుమేహం తగ్గదు. కానీ కాకరకాయ కన్నా కాకరకాయ గింజలు మధుమేహం తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. వాటిని పొడిచేసి తింటే మంచిది.
అరటిపండు తినడం వల్ల పిల్లలు నల్లగా పుట్టరు. కానీ కొంత మందికి కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారు.
జున్ను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఎక్కువగా కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువ తింటే అజీర్ణం చేయవచ్చు. అందుకే మిరియాలను కలుపుకొని తినాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
నష్టాలు
- గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం - ఇది - తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది.
- శిశువు బరువు వృధ్ది చెందడంలోను, తల్లికికూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం చాలా దోహద పడుతుంది.
- పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది.
గర్భవతికి కావలసిన ఆహారం
- గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది.
- గర్బవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వుపదార్దాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తిసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది.
- గర్భవతులు , బాలింతులు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అ వసరం.
- గర్భ స్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పుసమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువు తో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.
గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి
- గర్భవతులు, బాలింతలు, అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి.
- రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది.
- ముడిధాన్యాలు, మొలకెత్తినధాన్యాలు,పులిసిన ఆహారం(పెరుగు ) అదనంగా తీసుకొవాలి.
- పాలు/మాంసము/కోడిగుడ్లు తీసుకోవాలి.
- ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి .
- మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి.
- ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను (ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి.
- గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ బరువుపనులు చెయ్యరాదు, అదీ నెలలునిండిన సమయంలో ప్రత్యేకంగా.
- పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు.
- టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు.
- అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది,గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
- భార్యా భర్తలు నిత్యమూ సంభోగము చేయవచ్చును . అతిగా సంభోగము చేయరాదు . 8-9 వ నెలలో పొట్టపైన ఒత్తిడి పడకుండా రతిలో పాల్గొనాలి .
- గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .
గర్భము ధరించిన స్త్రీ ఏవిధముగా ఉండాలి?
- గర్భము ధరించిన స్త్రీ ముఖ్యముగా ఎల్లవేలలూ ప్రసంతముగా వుండాలి.
- ప్రతిపనిలోను నీజాయితిగా వుండాలి.
- అనునిత్యము దేవనామస్మరణ చేయవలెను.
- దర్మప్రవుత్తి కల్గివుండాలి.
- సత్యమునే పలకవలెను.
- మీకుటుంబమందు ఆప్యాయత అనురాగము కలిగి వుండాలి .
- నీతి కధలను చదువుతు వుండాలి.
- గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
గర్భిణులు నిద్రలో కొన్ని సమస్యలు-జాగ్రత్తలు
గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
- గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
- పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీయును. .
- కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--చాతిలోమంట నిద్రరానివ్వదు ..
- పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు.
- పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.
- నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.
ఇంటిలో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు మానసికం గా తీసుకోవలసిన జాగ్రత్తలు
ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, ఆ గృహస్తులు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్స్ వంటి వాటివి కొనుగోలు చేయడం, కట్టడం వంటివి కూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. గృహ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు అక్కడ వాతావరణము దుమ్ము, ధూళి వంటి వాటివలన కాలుష్యమౌతుంది కనుక కచ్చితముగా గర్భిణీ స్త్రీలను, పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. శిశువు పుట్టిన తర్వాతే కట్టడాల నిర్మాణాలు, ఫ్లాట్స్ కొనడం వంటివి చేయాలని వాస్తునిపుణులు సలహా ఇస్తున్నారు.
అలాగే నిద్రలేచిన వెంటనే గర్భిణీ స్త్రీలు పచ్చటి ప్రకృతి, జలపాతాలు వంటి దృశ్య పటాలను ప్రొద్దునే నిద్రలేస్తూనే చూడటం మంచిది. నిద్రలేచిన వెంటనే దేవుడు పటాల్ని చూడటం ద్వారా రోజంతా శుభదాయకంగా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు ఉండే ఇళ్లలో గృహస్థలం యొక్క దక్షిణము వైపున ఖాళీస్థలాన్ని వదిలిపెట్టి ఉత్తరము వైపున ఇల్లు ఉండకుండా చూడాలి. ఇటువంటి స్థలం గర్భిణీ స్త్రీలనే మాత్రమే గాకుండా స్త్రీలకు బాధలను కలిగిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారము దక్షిణమున విశాలప్రదేశమున్నట్లైతె రాత్రులు యమకింకరులు తిరుగుతారని నమ్మకము .
మరోవైపు గర్భవతికి ఆరు మాసములు నిండిన తర్వాత గృహారంభం, గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. క్రొత్త వతావరణము కడుపులో బిడ్డ మానసిక స్థితి పై ప్రభావము ఉంటుంది . దీంతో పాటు సముద్ర ప్రయాణము, భర్త దూరముగా వలస వెళ్ళుట , గర్భవతి శ్రాద్ధాన్న భోజనం చేయుట వంటివి కూడదు అని అంటారు .
ఇంకా గర్భిణీ స్త్రీ భర్త పుణ్యతీర్థములు సేవించుట, శవమును మోయుట, శవము వెంట నడుచుట వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలైతే.. నదీ స్నానము, శవం వద్ద దీపమెలిగించడం, రక్తాన్ని చూడటం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు. అంటువ్యాధు వచ్చే ప్రమాదము మరియు బిడ్డ మానసిక పెరుగుదల పై ప్రభావము చూపుతాయి .
అలాగే గర్భిణీ స్త్రీలుండే ఇంటి నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయడం శ్రేయస్కరం కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ సమయము లో గర్భిణీలకు ప్రశాంతత కరువవుతుందనే వాదన ఉంది .
గర్భిణి స్త్రీలలో మానసిక ఒత్తిడి ప్రభావము
గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తే ఆ ప్రభావం కడుపులోని బిడ్డ పైనా పడుతుందా? దీనిపై వైద్యరంగం ఎప్పటి నుంచో రకరకాల అధ్యయనాలు చేస్తోంది. తాజాగా వెల్లడైన అంశమేమంటే- గర్భం దాల్చిన తర్వాత తొలి మూడు మాసాల్లో తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైతే ఆమెకు పుట్టే బిడ్డకు రక్తహీనత, ముఖ్యంగా ఇనుము లోపం బారినపడే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదల ప్రభావితమవుతుందని ఇజ్రాయెల్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇనుము బిడ్డ శారీరక అవయవాల ఎదుగుదలకు, ముఖ్యంగా మెదడు వికాసానికి చాలా కీలకం. తల్లుల్లో ఇనుము లోపం, మధుమేహం, గర్భం దాల్చిన తర్వాత పొగ తాగటం వంటివి పిల్లల్లో ఇనుము లోపాన్ని పెంచుతాయి. అలాగే నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డల్లో కూడా ఇనుము లోపించే అవకాశాలు ఎక్కువ. వీటన్నింటికి తోడు- గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనా కూడా పిల్లల్లో ఇనుము లోపం తలెత్తవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడవటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో గర్భిణులంతా 'చక్కటి పోషకాహారం, మానసిక ప్రశాంతత'.. ఈ రెండు అంశాల మీదా ప్రత్యేక శ్రద్ధ పెట్టటం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్
ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్