పిండిపదార్థాలు మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకం. ఇవి మానవుని శరీరంలోని అనేక జీవక్రియలకు తోడ్పడతాయి, ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడంలో ఎన్నో రకాలుగా సహాయపడతాయి. శరీరానికి అవసరమైన శక్తిలో 60% ఆహారంలోని పిండిపదార్థాల ద్వారా వస్తుంది.
పిండి పదార్థాలను వాటిలోని చక్కెరల అణువులను బట్టి మూడు రకాలుగా వర్గీకరించారు- మోనో (ఒక అణువు కలిగినవి), డై (రెండు అణువు కలిగినవి), పాలీ (ఎక్కువ అణువు కలిగినవి) శాకరైడ్లు. మొనో, డై శాకరైడ్లు సరళ పిండిపదార్థాలు, పాలీ శాకరైడ్లు సంక్లిష్ఠ పిండిపదార్థాలు. గ్లూకోజ్ , ఫ్రక్టోజ్, గెలాక్టోజ్ మొదలైనవి సరళ పిండిపదార్థాలు. మాల్టోజ్, రాఫినోజ్, సెల్యులోజ్ వంటి వాటిని సంక్లిష్ట పిండిపదార్థాలు అంటారు. సంక్లిష్ఠ పిండిపదార్థాలలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ గుండె వ్యాధులను, ఊబకాయాన్ని, మధుమేహాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. కాని సాధారణంగా ఎక్కువమంది సరళ పిండి పదార్థాలున్న ఆహారపదార్థాలను అతిగా తింటుంటారు. ఈ రకమైన ఆహార అలవాటు వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు గురై దేహదారుడ్యపరంగా ఎంతో నష్టపోతున్నారు. కాబట్టి మనం తీసుకొనే ఆహారంపై అప్రమత్తంగా ఉండి సరైన విధంగా తీసుకొంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
పిండిపదార్థాల జీవ ప్రాముఖ్యం
పోషక సామర్థ్యం
పిండి పదార్థాలు జీవికి శక్తినిస్తాయి. వీటిని తక్కువ నీటితో జీర్ణం చేసుకోవచ్చు. ప్రోటిన్ లను, కొవ్వు లను జీర్ణించుకునేందుకు ఎక్కువ నీరు కావాలి. శరీరంలో జీవకణాల, కణజాల నిర్మాణానికి ప్రోటీనులు, కొవ్వులు; శక్తిని ఇవ్వటానికి పిండిపదార్థాలు అవసరం. ఒక రోజుకి 275-300 గ్రాముల పిండిపదార్థాలు తీసుకోవాలి. అందులో 10 శాతం మాత్రం సాధారణ పిండిపదార్థాలు అంటే చక్కెర, గ్లూకోజు, మిగిలినవి సంక్లిష్ట పిండిపదార్థాలు అంటే ధాన్యాలు, పండ్లు, రొట్టెలు, మొదలైన పిండి పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే సాధారణ పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు త్వరగా జీర్ణం అయ్యి రక్తంలోకి గ్రహించబడతాయి. దీని వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంటాయి. పెరిగిన చక్కెర మోతాదులు క్రొవ్వుగా మారి నిల్వ చేయబడతాయి. దీని వల్ల ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు మొదలైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అలా కాకుండా సంక్లిష్ఠ పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు అవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. మెల్లగా రక్తంలోకి గ్లూకోజ్ లు గ్రహింపబడతాయి. కొంచెం తిన్నప్పటికీ కడుపు నిండుగా అనిపించి ఆకలి వేయదు. అంతేకాకుండా సంక్లిష్ఠ పిండిపదార్థాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ చెడు క్రొవ్వును పట్టి ఉంచి మలం ద్వారా తొలగిస్తుంది. జీర్ణకోశాన్ని ఇన్ ఫెక్షన్ల బారి నుండి రక్షిస్తుంది. దీనివల్ల మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు, జీర్ణకోశ సమస్యల వంటి వాటిని నివారించుకోవచ్చు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో సరళ పిండి పదార్థాలు తక్కువగా (10%) సంక్లిష్ఠ పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
సరళ పిండి పదార్థాలున్న ఆహారపదార్థాలు |
సంక్లిష్ఠ పిండి పదార్థాలున్న ఆహారపదార్థాలు |
కేకులు బన్నులు బర్గర్లు జాము జెల్లి శీతల పానీయాలు చక్కెర తేనె చాక్లెట్లు అన్నం మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలు పండ్లరసాలు |
పొట్టుతో ఉన్న తృణధాన్యాలు కూరగాయలు పండ్లు ఆకుకూరలు చిక్కుడు చిలకడదుంప గుమ్మడికాయ వీటన్నింటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తొక్కలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. |
ఫైబర్ ఎక్కువగా ధాన్యాల పొట్టులలో, తొక్కతీయని పండ్లలో ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలలో ఇతర పోషకాలైన ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఉదాహరణకు సరళ, సంక్లిష్ట భోజన పట్టికలను చూద్దాం.
సరళ పిండి పదార్థాలు గల భోజన పట్టిక |
సంక్లిష్ఠ పిండిపదార్థాలు గల భోజన పట్టిక |
ఉదయం అల్పాహారం - 4 బ్రెడ్ముక్కలు, జాం |
ఉదయం అల్పాహారం - ఇడ్లి, పల్లీల చట్నీ, పాలు 11 గంటలకు - జామపండు లేదా అరటిపండు మధ్యాహ్న భోజనం - అన్నం, పాలకూర పప్పు, బీట్ రూట్ కూర, పెరుగు స్నాక్స్ - మరమరాల చుడువ, మిల్లెట్ కేకు రాత్రి భోజనం - జొన్నరొట్టె, లేదా జొన్న కిచిడి,నారింజ పండు. పడుకునే ముందు- ఒక గ్లాసు పాలు |
సరళ పిండిపదార్థాలు జీర్ణం అయినపుడు ఎక్కువ కేలరీల శక్తి విడుదలయ్యి, ఇతర పోషకాలు తక్కువ లభిస్తాయి. అంతే కాకుండా ఇవి త్వరగా జీర్ణం అయ్యి గ్లూకోజ్ మోతాదులను రక్తంలో పెరిగేలా చేయడం వల్ల క్రొవ్వుగా మారి నిల్వ ఉంటాయి. చివరికి మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు. సంక్లిష్ఠ పిండిపదార్థాలు గల ఆహారం తీసుకొంటే తక్కువ శక్తి, ఎక్కువ ఫైబర్, మోతాదుగా ఇతర పోషకాలు ఉంటాయి కనుక శరీరంలో కొవ్వులు ఎక్కువగా నిల్వ ఉండవు.
జంక్ ఫుడ్స్ మరియు ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలలో ఉండే కేలరీలు
జంక్ ఫుడ్స్ - కిలో కేలరీలు |
ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు - కిలో కేలరీలు |
వెజ్ పిజ్జా(2 స్లైసులు) - 213 చికెన్ పిజ్జా(1స్లైసు) - 128 వెజ్ బర్గర్ - 300 చికెన్ బర్గర్ - 324 ఫ్రైడ్ చికెన్(1 పీస్) - 145 సమోసా - 246 వడా పావ్ - 286.4 పానీ పూరి(6 పూరీలు)- 166.5 ఆలూ చిప్స్(20) - 163 ఫ్రెంచ్ ప్రైస్(1 సెర్వింగ్) - 216 ఐస్ క్రీం - 176 |
ప్రూట్ సలాడ్(200 గ్రా.) - 102 అరటి పండు లస్సి(100 మి.లీ.) - 98 ఉడికించిన బీన్స్(60 గ్రా.) - 51 మొక్కజొన్న పాప్ కార్న్(20 గ్రా) - 89 స్ప్రౌట్ సలాడ్(100 గ్రా) - 59 వెజిటబుల్ సలాడ్(207 గ్రా) - 33 వెజ్ శాండ్ విచ్(100 గ్రా) - 204 పాలు(100 మి.లీ.) - 65 |
ఉదాహరణకు యుక్త వయస్సులో ఉండే విద్యార్థికి రోజుకు 1800 కేలరీల శక్తిని పొందే విధంగా ఆహారం తీసుకోవాలంటే, అందులో 60% శక్తి పిండిపదార్థాల నుండి లభించేలా, మిగిలిన 40% లో 15% ప్రోటీన్ల నుండి, 25% ఇతర ఆహారపదార్థాల నుండి వచ్చేలా ఆహార పట్టిక ఉండాలని ఆహారనిపుణులు సూచిస్తున్నారు. ఆ 60% పిండిపదార్థాలలో కూడా 10% సరళ, 50% సంక్లిష్ఠ పదార్థాలు ఉండాలి. అందుకే ఎక్కువ కేలరీలను ఇచ్చే పిజ్జాలు, బర్గర్లు, చాకెట్లు, కేకు, చిప్స్, వేపుడ్లు వంటి వాటికి దూరంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్న చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పండ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.
|
ఫైబర్ వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు
జీర్ణకోశ సమస్యల నివారణకు సహాయపడుతుంది
పీచు పదార్థం క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మలబద్ధకం, పిత్తాశయంలో రాళ్ళు, కొలాన్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ. పీచు జీర్ణకోశంలో ఉండే మంచి బ్యాక్టీరియాకు సహాయపడి ఇన్ ఫెక్షన్ల బారి నుండి రక్షిస్తుంది. పీచు పదార్థం తిన్నప్పుడు అది కడుపులో ఎక్కువ నీటిని గ్రహించి మలం యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. అందువల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
పీచు తక్కువగా తినే వారిలో అపోలైపో ప్రోటీన్ B పెరుగుతుంది. ఇది పెరిగినప్పుడు చెడు కొలెస్ట్రాల్(LDL) శాతం పెరిగిపోతుంది. సిరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండెవ్యాధులు, ఊబకాయం, మధుమేహం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తాయి. ఆహారంలో ఉండే పీచు సిరం ఫైబ్రినోజన్ స్థాయిలను తగ్గించి గుండె రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది, గుండెపోటు రాకుండా చేస్తుంది.
మధుమేహ వ్యాధిలో పీచుపదార్థం పాత్ర
మధుమేహులు పీచుపదార్థం తిన్నప్పుడు అది మెల్లగా జీర్ణం అయ్యి రక్తంలోకి గ్లూకోజ్ లను కొద్ది కొద్దిగా విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. కొంత మోతాదుకే కడుపు నిండినట్లుగా అనిపించే గుణం పీచుకు ఉండడం వల్ల మధుమేహులు అధిక బరువును, గుండె వ్యాధులను కూడా నియంత్రించుకోవచ్చు.
ఆహారపదార్థం జీర్ణం అయిన తర్వాత గ్లూకోజ్ ను విడుదల చేసే ప్రక్రియను "గ్లైసిమిక్ ఎఫెక్ట్" అంటారు. కొన్ని ఆహారపదార్థాలు గ్లూకోజ్ ను త్వరగా విడుదల చేస్తాయి. వీటిని హైగ్లైసిమిక్ ఫుడ్స్ అంటారు. మరికొన్ని తిన్నప్పుడు అవి ఆలస్యంగా జీర్ణం అయ్యి గ్లూకోజ్ ని రక్తంలోకి మెల్లగా విడుదల చేస్తాయి. వీటిని లోగ్లైసిమిక్ ఫుడ్స్ అంటాము. ఈ రక్తం ఆహారపదార్థాల వల్ల మధుమేహులకు, ఊబకాయులకు మేలు జరుగుతుంది. పీచు పదార్థానికి ఈ లక్షణాలుంటాయి.
లోగ్లైసిమిక్ ఫుడ్స్(GI)
ఒక రోజుకి 40 గ్రాముల పీచుపదార్థం మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
పిండిపదార్థాల లోపం వల్ల వచ్చే వ్యాధులు
మన ఆహారంలో పిండిపదార్థాలు లోపించినప్పుడు శరీరం తన జీవక్రియలకు కావలసిన శక్తిని ఇతర ఆహారపదార్థాల ద్వారా పొందుతుంది అనగా మాంసకృత్తులను, క్రొవ్వుపదార్థాలను విచ్చినం చేసి శక్తిని పొందుతుంది. అందువల్ల శరీరంపై చాలా చెడు ప్రభావలను చూడవచ్చు. ముఖ్యంగా ఈ సమస్యలు డైటింగ్ చేసేవారు పూర్తిగా పిండిపదార్థాలను దీర్ఘకాలంగా తీసుకోకపోవడం వల్ల వస్తుంది.
అసిడోసిస్: మన ఆహారంలో పిండిపదార్థాలు లోపించినప్పుడు శరీరంలో క్రొవ్వు పదార్థాలను విచ్చినం చేసి శక్తిని పొందుతుంది. దీని వల్ల రక్తంలో యాసిడ్ల మోతాదు పెరిగిపోయి pH 7.35- 7.45 గా మారడం వల్ల కణాల శాశ్వతంగా దెబ్బతింటాయి.
కీటోసిస్: పిండిపదార్థాలు లోపించినప్పుడు, శరీరం గ్లైకోలైసిన్, లైపోలైసిన్లను జరిపి శక్తిని పొందుతుంది. అప్పుడు కీటోన్స్ అనే పదార్థాలు ఏర్పడి రక్తంలో, కణజాలలో పేరుకుపొయి, శరీరాన్ని అపస్మారక స్థితికి తీసుకువస్తాయి.
హైపోగ్లైసిమియా: శరీరంలో చెక్కర స్థాయి పడిపోవడాన్ని 70mg/dl కంటే తక్కువ శాతం చక్కెర రక్తంలో ఉంటే దాన్ని హైపోగ్లైసిమియా అంటాము. కళ్ళుతిరగటం, నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇతర దుష్ప్రభావాలు
పిండిపదార్థాలు అధికంగా తినడం వల్ల వచ్చే వ్యాధులు
ఊబకాయం
క్రొవ్వు పదార్థాలు మరియు సరళ పిండిపదార్థాలు అతిగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. పిండిపదార్థాలు తిన్నప్పుడు అవి త్వరగా జీర్ణం అవుతాయి. గ్లూకోజ్ త్వరత్వరగా రక్తంలోకి విడుదలవుతుంది. మన శరిరానికి అవసరం ఉన్న గ్లూకోజ్ ను ఉపయోగించుకున్న తర్వాత మిగిలింది క్రొవ్వుగా మారి నిల్వ ఉంటుంది. త్వరగా జీర్ణం అవ్వగానే మళ్ళీ ఆకలి వేస్తుంటుంది. అందువల్ల ఊబకాయం పెరిగిపోతుంటుంది. ఊబకాయం వచ్చిన వారికి ఇతర వ్యాధులైన పిత్తాశయ రాళ్ళు, మధుమేహం, గుండెపోటు వంటి సమస్యలు ఎక్కువైపోతాయి.
దంతాల సమస్యలు
చక్కెర్లు, స్వీట్లు, కేకులు వంటి పిండిపదార్థాల ఆహారపదార్థాలు తిన్నప్పుడు అవి జీర్ణమయ్యే సమయంలో నోటిలోని బ్యాక్టీరియా ప్రక్రియ అధికంగా అవ్వడం వల్ల దంతాలు పుచ్చిపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే ఇవి తిన్నవెంటనే నోరు పుక్కలించుకోవడం చేయాలి.
ఆధారం: కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/010.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020