অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పాల కల్తీ.. నియంత్రణ

పసిపిల్లల నుండి ముసలివాళ్ల వరకూ పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా భావిస్తున్నాం. కానీ, భారత ఆహారభద్రత, ప్రమాణాల అథారిటీ 2011లో జరిపిన సర్వేలో దాదాపు 70 శాతం పాల నమూనాల్లో కల్తీ జరిగిందని గుర్తించింది. ఏడు రాష్ట్రాల్లో నూరు శాతం, మరో తొమ్మిది రాష్ట్రాల్లో 80 శాతం పైగా నమూనాల్లో కల్తీ జరిగింది. మన రాష్ట్రంలో ఇది 6.7 శాతం మాత్రమే. ఒక్క గోవా, పాండిచ్ఛేరిల నమూనాల్లో కల్తీ గుర్తించబడలేదు. ఇంత పెద్దమొత్తంలో జరుగుతున్న పాల కల్తీ ఆందోళన కలిగిస్తోంది. కల్తీకి వాడే కొన్నిపదార్థాలు ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఇదీ ఆందోళన కలిగిస్తోంది. ఇదంతా కల్తీ నివారణకోసం ఏర్పర్చిన వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది.
మన దేశంలో ఆహారభద్రత ప్రమాణాలను 2006లో ఏర్పర్చిన ‘భారత ఆహారభద్రత, ప్రమాణాల చట్టం’ నిర్దేశిస్తుంది. ఈ చట్టం ద్వారా భారత ఆహారభద్రత, ప్రమాణాల అథారిటీ ఢిల్లీలో ఏర్పాటైంది. మనదేశ ఆహార ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా పెంచడం దీని లక్ష్యం.
పాలల్లో అత్యధికంగా (46.8 శాతం నమూనాలు) నీటితో కల్తీ అవుతున్నాయి. దీనివల్ల పాల పోషకవిలువలు తగ్గిపోతాయి. ఇలాంటి కల్తీలో పరిశుభ్రమైన నీటిని వాడకపోతే సూక్ష్మజీవులు, ఇతర కాలుష్యాలు చేరే అవకాశం ఉంది. ఇవి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. మరో 44.7 శాతం మేర వెన్నతీసిన పాలపొడిని (స్కిమ్‌ పాలపొడి) కలిపినట్లు గుర్తించబడింది. అంటే, కల్తీ పాలల్లో 91 శాతం పైగా నీరు, స్కిం పాలపొడి కలపడం ద్వారా అవుతుందన్న మాట!
నీరు కలిపినప్పుడు పాలు పలుచగా కనిపించకుండా గ్లూకోజ్‌ లేక యూరియా లేక పిండిపదార్థాలు (స్టార్చ్‌) ను కలుపుతున్నారు.
డిటర్జెంట్‌ పౌడర్‌తో కల్తీ 8.4 శాతం పాల నమూనాల్లో గుర్తించబడింది. పాల సేకరణలో వినియోగించిన పాత్రలు శుభ్రంగా కడగకపోవడం లేక కృత్రిమ పాలను అసలుపాలల్లో కలిపినందువల్ల ఈ కల్తీ కనిపిస్తుంది.

నాణ్యతా లోపం అవకాశాలు..

సామాన్యంగా చిన్న ఉత్పత్తిదారుల స్థాయిలో కల్తీ జరగదు. ఒకవేళ జరిగినా వీరు నీటినీ కలుపుతారు. దీనిని తేలికగా లాక్టోమీటరుతో గుర్తిస్తారు. ఇలాంటి కల్తీ ఆరోగ్యానికి అంతగా హానికరం కాదు. ఉత్పత్తిదారుని స్థాయిలో పాలు తీసేప్పుడు, తీసిన తర్వాత పశువుల పొదుగు సరిగ్గా కడగకపోయినా, దాని చర్మ ఆరోగ్యం బాగోకపోయినా, పాలుతీసే పరిసరాలు శుభ్రంగా లేకపోయినా, పాలు తీసి నిల్వ వుంచే పాత్రలు శుభ్రంగా ఉంచకపోయినా, పాలు తీసేవారు వ్యక్తిగతంగా శుభ్రంగా లేకపోయినా, దాణా నాణ్యత, క్రిమి కీటకాదులు పాలను కలుషితం చేస్తాయి. పాల సేకరణ కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత, పాలను సేకరించే పరికరాల పరిశుభ్రత, పాలు పితకడం, సేకరణ కేంద్రానికి సరఫరాచేసే మధ్య కాలం, పరీక్షించేటప్పుడు, ఇతర పదార్థాలు వున్నప్పుడు, రోగకారక పశువుల నుండి పాలను సేకరించినప్పుడు, కృత్రిమ పాలను సేకరించినప్పుడు, ఉదయం, సాయంత్రం పాలను వేర్వేరుగా ఉంచలేనప్పుడు పాల నాణ్యత లోపిస్తుంది. కలుషితమవుతాయి. పాల రవాణా సమయంలో వాహనం ట్యాంకు శుభ్రంగా లేకున్నా, ఉష్ణోగ్రత ఎక్కువగా వున్నా, పాలశుద్ధి పరిశ్రమ నిల్వ చేసే ట్యాంకు (సైలోలోకి) ల్లోకి సేకరించి తెచ్చిన పాలను పోసేటప్పుడు జాగ్రత్తలు పాటించకున్నా వీటి నాణ్యత లోపిస్తుంది.

నియంత్రణ..

వ్యవస్థీకరించిన పాల సరఫరాలో నాణ్యతా నియంత్రణకు పటిష్టమైన ఏర్పాట్లు ఉంటాయి. ఉదా: ‘విజయ’ సహకార పాల సరఫరా వ్యవస్థలో రోజుకు 4.65 లక్ష లీటర్లను సేకరించి, హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. వీటిలో కేవలం హైదరాబాద్‌-సికింద్రాబాద్‌లలో రోజుకు 3.8 లక్షల లీటర్లను అమ్ముతున్నారు. అయితే, మండల స్థాయిలో సేకరించిన పాలను నిల్వ వుంచి, రవాణా చేయడానికి 203 ‘బల్క్‌ కూలింగ్‌’ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇలాంటి ప్రతి కేంద్రానికి 25 గ్రామాలను అనుసంధానం చేశారు. ఇటువంటి అన్ని కేంద్రాల్లో ఆటోమాటిక్‌ ‘పాల పరీక్షా యంత్రం’ ఏర్పాటు చేశారు. వీటితో పాల నాణ్యతను అక్కడికక్కడే పరీక్షిస్తారు. గ్రామ పాలసేకరణ కేంద్రాల్లో కూడా ఇలాంటి యంత్రాలనే ఏర్పాటు చేశారు. వాటితో కూడా సేకరించే పాల నాణ్యతను అక్కడికక్కడే పరీక్ష చేస్తారు. ఇలాంటివి 1109 గ్రామ పాలసేకరణ కేంద్రాల్లో ఉన్నాయి. ఈ యంత్రం ఖరీదు సుమారు రూ.30 వేలు ఉంటుంది. అన్ని ప్రైవేటు పాల సరఫరా కంపెనీల్లో ఈ విధంగా పటిష్టమైన నాణ్యతా నియంత్రణ ఉంటుందని చెప్పలేం.

పరిశుభ్రమైన పాల ఉత్పత్తి..

నాణ్యతా నియంత్రణకు పరిశుభ్రమైన పాల ఉత్పత్తి కీలకం. దీనికోసం పాడి పశువులను శుభ్రమైన ప్రదేశాల్లోనే కట్టి ఉంచాలి. ఆరోగ్యవంతమైన పాడి పశువుల నుండి మాత్రమే పాలను సేకరించాలి. పొదుగు వాపు మొదలగు వ్యాధులు సోకిన పశువుల నుండి పాలను తీయరాదు. ఇట్టి పాలను ఇతర ఆరోగ్యవంతమైన పశువుల పాలతో కలపకూడదు. పాలు తీసేముందు పాడి పశువు పొదుగును ఒక్క శాతం పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణం (లీటరు నీటికి అరచెంచా పొటాషియం పర్మాంగనేట్‌ కలిపిన ద్రావణం) తో కడగాలి. తలవెంట్రుకలు పాలల్లో కలవకుండా జాగ్రత్త పడాలి. పరిశుభ్రంగా కడిగిన పాత్రలోనే పాలను పితకాలి. పాత్రలను క్లోరిన్‌ ద్రావణంతో (200 పిపిఎమ్‌) మొదట శుభ్రంగా కడగాలి. ఈ ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి ఒక చెంచా బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి, తయారుచేయవచ్చు. ఈ పాత్రలపై దుమ్మూ, ధూళి, క్రిమికీటకాలు పడకుండా ఎప్పుడూ మూతలు పెట్టి ఉంచాలి.
జున్ను పాలను మామూలు పాలతో కలపరాదు. ఈనిన 15 రోజుల తర్వాత మాత్రమే తీసినపాలను కేంద్రాల్లో పోయాలి. నిల్వ వున్న పాలను అప్పుడే తీసిన పాల తో కలపకూడదు. పాలు తీసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా కేంద్రాలకు చేర్చాలి.
(ఆంధ్రప్రదేశ్‌ సహకార డైరీ డెవలప్‌మెంటు సమాఖ్య మేనేజర్‌ మధుసూధనరావు, డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీమతి హెచ్‌.కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగా…)

కృత్రిమ పాలు..

పైకి చూడటానికి ఇవి అసలు పాలలాగానే కనిపిస్తాయి. కానీ, పాలల్లో వుండే ఏదీ దీనిలో వుండదు. చారెడు చక్కెర, దోసెడు యూరియా, పావులీటరు మంచినూనె, అరలీటరు అసలు పాలు, కొంత సర్ఫ్‌ మిశ్రమాన్ని 20 లీటర్ల మంచినీళ్లలో కలిపి కృత్రిమ పాలను తయారుచేస్తున్నారు. వీటికి ఏవిధమైన వాసనా వుండదు. వేరుగా ఉంటే, వీటిని గుర్తించడం తేలిక. అసలు పాలల్లో కలిపితే మాత్రం గుర్తించాలంటే పరీక్షల్లో తేలాల్సిందే. అయితే, కల్తీ పాలకు ‘ఈ పాలు’ భిన్నమైనవి. కల్తీ పాలల్లో అసలు పాలు ఎక్కువగా వుంటాయి. కల్తీ వస్తువులు తక్కువగా వుంటాయి. కానీ, కృత్రిమ పాలల్లో వుండే ఏ పదార్థమూ దీనిలో వుండదు. తాజాగా వున్నప్పుడు కృత్రిమ పాలు సబ్బు వాసనను కలిగి వుంటాయి. నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చల్లబరిస్తే ఏ వాసనా ఉండవు. రుచికి ఇవి చాలా ‘చేదు’గా వుంటాయి. వీటిని అసలు తాగలేం. సాంద్రత మామూలు పాలల్లాగానే వుంటుంది. నిల్వ వుంచితే పసుపురంగుకు మారతాయి. వేడిచేసినప్పుడు ఇవి సబ్బు వాసనతో పసుపురంగులోకి మారతాయి. గది ఉష్ణోగ్రతలో నిల్వ వుంచి నప్పుడు కూడా ఇవి పసుపురంగులోకి మారతాయి. వేళ్లను దీనిలో ముంచినప్పుడు సబ్బును తాకినట్లు అన్పిస్తుంది. ఉదజని సూచిక (పిహెచ్‌) అతిక్షార గుణం (10.5) తో ఉంటాయి. పంచదార, తటస్థీకరణ పరీక్షలకు స్పందిస్తాయి. వీటికి విరుద్ధంగా మామూలు పాలు ఆమ్లగుణం లేక తటస్థస్థాయిలో పిహెచ్‌ 6..4 నుండి 6.8గా వుంటూ పంచదార, తటస్థీకరణ పరీక్షలకు స్పందించవు.
కృత్రిమ పాలల్లోని కొవ్వు (కలిపే నూనె) క్యాన్సర్‌ను కలిగించగలదంట. డిటర్జెంట్‌ వల్ల కడుపులో తిప్పినట్లవుతుంది. విరోచనాలు అవుతాయి. దీనిలో కలిపే యూరియా, ఒక మోస్తరు విషపదార్థంగా పనిచేస్తుంది. తటస్థీకరణ పదార్థాల వల్ల (ఆమ్ల, క్షారాలు) కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఈ కల్తీ పాలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో బాగా తయారవుతున్నాయి. కానీ, ఇటీవల మన రాష్ట్రంలోనూ తయారుచేస్తున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి పాల సేకరణ కేంద్రాల ద్వారా ‘సరఫరా’ వ్యవస్థలోకి చేరుతున్నాయి. అందువల్ల, ఈ కల్తీ నివారణకు అన్ని సేకరణ కేంద్రాలలో కచ్ఛితమైన నిఘా ఏర్పాటుచేయాలి.

రాష్ట్రంలో..
మొత్తం 120.08 లక్షల టన్నుల పాల ఉత్ప త్తితో 2011-12లో జాతీయంగా మూడోస్థానంలో రాష్ట్రం కొనసాగుతుంది. ఇంతకుముందు 2008-09లో 95.7లక్షల టన్నుల పాల ఉత్పత్తిలో రెండోస్థానంలోనే ఉండేది. ఉత్పత్తవుతున్న పాలల్లో సుమారు మూడోవంతు గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా వినియోగ మవుతుంది. మిగతావి సుమారు 80 లక్షల టన్నులు వ్యవస్థీ కృతంగా చిన్న, పెద్ద పట్టణాల్లో అమ్ముతున్నారు. అయితే, దీనిలో కేవలం, 20 లక్షల టన్నుల పాలు మాత్రమే సహకారవ్యవస్థ ద్వారా అందుతున్నాయి. మిగతావి ప్రయివేటు శుద్ధి కంపెనీల నుండి, అమ్మకందార్ల (వెండర్ల) ద్వారా అమ్ముడుపోతున్నాయి. పాలను తేలికగా కల్తీ చేయగలగటంతో పాల కల్తీ నివారణకు రాష్ట్రంలో పటిష్టమైన నిఘా, పర్యవేక్షణ వ్యవస్థ అవసరం. ఇప్పుడున్న వ్యవస్థను పటిష్టపరచాలి. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంట్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ను రాష్ట్ర ఆహారభద్రత కమిషనర్‌గా ప్రకటించారు. ఏ కంపెనీ అమ్మే పాలల్లోనైనా కల్తీ జరుగుతుందని అనుమానం కలిగితే దాని గురించి ఆ కంపెనీ దృష్టికి తీసుకొచ్చినా నివారణ చర్యలు తీసుకోకపోతే, ఆహారభద్రతా కమిషనర్‌, నారాయణగూడ, హైదరాబాద్‌కు తెలియజేయాలి. వీరి టెలిఫోన్‌ నెంబర్ల (040-27560191, 27552203) కు ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రంలోని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను ఆహారభద్రతా అధికారులుగా ప్రభుత్వం ప్రకటిం చింది. పాలు కల్తీ అవుతున్నట్లు అనుమానం వచ్చినప్పుడు, సమీప ‘ఆహారభద్రతా అధికారి’ దృష్టికి తీసికెళ్లాలి.

  • గ్రామీణ ప్రాంతాల్లో విజయ డైరీ వారు పాలను మహిళా స్వయంసహాయక గ్రూపుల ద్వారా సేకరిస్తున్నారు.
  • హైదరాబాద్‌లోని విజయడైరీ వారు ‘ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం’ సహకారంతో డైరీ టెక్నాలజీలో ఒక డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నారు. ఈ డిప్లొమాను విశ్వవిద్యాలయం ఇస్తుంది.

జాగ్రత్తలు..

  • కాచిన తర్వాతే తాగాలి.
  • ప్యాకెట్‌ పాలు క్షేమం. వీటి పాల నాణ్యతపై నియంత్రణ ఉంటుంది.
  • విడిగా అమ్మే పాలను కొనకూడదు. వీటి నాణ్యతపై ఏ నియంత్రణా ఉండదు.
  • ప్యాకెట్‌పై సూచించిన గడువులోనే వాడాలి.
  • ఫ్రిజ్‌లో ఎక్కువకాలం నిల్వ వుంచకూడదు.
  • అనుమానం వచ్చినప్పుడు విజయ పాల విషయంలో 27019851- ఎక్స్‌టెన్షన్‌ – 224 / 260కు ఫిర్యాదు చేయాలి. మిగతా కంపెనీల పాలప్యాకెట్లపై కూడా ఇలాంటి నెంబరు వుంటుంది. ఆయా నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.

శుద్ధి కర్మాగారంలో పరీక్షలు..

  • ముడిపాలు రాగానే దాని వాసన, రుచిని చూస్తారు. పాలు సామాన్యంగా, రుచిగా వుండాలి. ఉష్ణోగ్రత 6 డిగ్రీల కన్నా తక్కువగా ఉండాలి. తటస్థీకరణ పదార్థాలు, కల్తీ పదార్థాలు ఉండకూడదు. ఆ తర్వాత ప్యాశ్చరైజేషన్‌ చేస్తారు.
  • శుద్ధి తర్వాత, ప్యాకింగ్‌కు ముందు కూడా రుచి మామూలుగానే ఉండాలి. ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెంటీగ్రేడ్‌లోనే ఉండాలి. ఆమ్ల శాతం 0.13 నుండి 0.14 శాతం మధ్య ఉండాలి. ఉష్ణ స్థిరత్వం 0.5 మి.లీ. నెగటివ్‌ ఉండాలి. ఫాస్ఫేటిక్‌ పరీక్ష నెగటివ్‌గా ఉండాలి. మిథిలిన్‌ బ్లూ రిడక్షన్‌ టెస్ట్‌ (ఎంబిఆర్‌టి) కనీసం ఐదుగంటల వరకూ రంగు కోల్పోకూడదు. గ్రేడ్‌ ప్రకారం కొవ్వు, కొవ్వుకాని కరిగిన ఘనపదార్థాలు (చక్కెరలాంటివి) ఉండాలి. బ్యాక్టీరియా ఉండకూడదు. పరీక్ష చేస్తారు. ‘ప్లేటు’ గణింపు (ప్లేట్‌ కౌంట్‌) లో ఒక మిల్లీలీటరు పాలకు 30 వేలకు మించకూడదు. అదేవిధంగా వీటిలో కోలీఫార్మ్‌ మిల్లీలీటర్‌కు పదికి మించకూడదు.

ఆధారము: తెలుగుదనం బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate