অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తులసి ఆకుల ప్రయోజనాలు

తులసి ఆకుల ప్రయోజనాలు

మీ పిల్లలు అన్నం తినకుండామారాం చేస్తున్నారా..? 4 తులసి ఆకులు తినిపించండి..

హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు తులసి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.

అయితే పూజనీయమైనదే కాక తులసిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ.. మన పెరట్లోని తులసి చెట్టు ఇచ్చే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.

ముఖ్యంగా కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు నాలుగు చొప్పున ప్రతి గంటగంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.

జీర్ణ శక్తికి తులసి చాలా మంచి మందు. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది.

ముఖ్యంగా 7, 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటారు. ఆకలి లేదంటుంటారు. అలాంటివారికి రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.

ప్రధానంగా తులసి జ్వరహారిణి. సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. పైగా టైఫాయిడ్ జ్వరంలో తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతిపూటా తాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుంది.

ఉబ్బసాన్ని నివారించడంలో తులసి కీలకమైన ఔషధం. ఉబ్బస నివారణ ఆయుర్వేద మందులన్నింటిలోనూ తులసి తప్పకుండా ఉంటుంది. తరచుగా ఉబ్బసానికి గురయ్యేవారు తులసి కషాయం తీసుకుంటూ ఉంటే కొన్నాళ్లకు ఉబ్బసం రాదు.

అవసాన దశలో ఉన్న మనిషికి తులసి తీర్థం పోయడంలో అర్థం ఏమిటంటే వారి గొంతులో కఫం ఏమైనా అడ్డుపడకుండా శ్వాస సరిగా తీసుకుంటారని ఆవిధంగా చేస్తారు. ఇదీ తులసి మహాత్మ్యం

ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం

పళ్ళు తెల్లగా.. ఆరోగ్యంగా.. మెరవాలంటే.. తులసి టూత్ పౌడర్...

మనిషికి నవ్వు అందం. ఆ నవ్వుకి పళ్ళవరస అందం. పళ్ళవరస చక్కగా అమరినప్పటికీ, పళ్ళు పసుపు పచ్చ రంగులో ఉంటే నలుగురిలో నవ్వుకోడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి. కనుక మీ దంతాలు ఆరోగ్యంగా తెల్లగా మెరిసిపోవాలంటే తులసి టూత్ పౌడర్‌ను ట్రై చేసి చూడండి.

తులసి టూత్ పౌడర్ తయారీ :

తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత, ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్‌చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా, మీ రెగ్యులర్ పేస్ట్‌కు తులసి పౌడర్‌ను జతచేసి, బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా, ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

ఆధారము: : తెలుగు.వెబ్ దునియా.కం

తులసి ఆకులు నానబెట్టిన నీళ్లతో పళ్లు తోముకుంటే...?

తులసి" ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం. మహాభారత కాలంలో ఘటోత్కచుడు సైతం మోయలేని శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి. భారత దేశంలో చాలా మంది తులసి మొక్కను దైవంగా భావించి పూజిస్తారు. పురాణాల్లో ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మన పెరట్లో దొరికే దివ్యౌషధం. తులసి ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. సరే.. ఇదంతా తులసి మొక్కకు ఉన్న ప్రాధన్యత ఇక ఇందులో ఉన్న ఔషధ గుణాలేంటో... దీన్ని ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం...!

 • కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
 • ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
 • తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
 • జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.
 • కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి).
 • తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
 • తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
 • తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
 • తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.
 • తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
 • నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

ఆధారము: : తెలుగు.వెబ్ దునియా.కం

భక్తికి.. శక్తికి నిర్వచనం లవంగ తులసి

దైవ భక్తికి... ఆరోగ్యవంతమైన శక్తికి నిర్వచనంగా బాసిల్లుతోంది లవంగ తులసి. ఇందులో ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. లవంగ తులసిని దేవుని పూజకు మాత్రమే కాదు.. ఆహారపానీయాలలోనూ, ఔషధంగానూ ఈ మొక్కను ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కలో ప్రతీ భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

లవంగ తులసి ఆకులను కషాయంగా చేసుకుని తాగితే దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తిని పెంచడానికి, శరీరంలో శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. కీళ్ల సమస్యలను, రక్త స్రావాలను నిరోధించటానికి ఉపకరిస్తుంది.

తలనొప్పి, పంటి నొప్పి, చెవిపోటు బాధలకు నివారిణిగా కూడా లవంగ తులసి పని చేస్తుంది. చిన్న పిల్లల ఉదర సమస్యలకు దివ్యౌషధం. దీని విత్తన ఔషధం విరేచనాలు, నరాల బలహీనతలు, మూత్ర సమస్యలు, చంటి పిల్లల్లో వాంతుల నివారణకు పని చేస్తుంది. లవంగ తులసి ఆకుల రసం వీర్యవృద్ధికి, ఎర్రరక్తకణాల పెంపుకు తోడ్పడుతుంది.

కాలేయ వ్యాధుల నివారణకు, కాలేయ పనితనాన్ని మెరుగుపరుచుటకు ఉపయోగపడుతుంది. దోమలను వికర్షించు శక్తి అధికంగా ఉండటం వల్ల రకరకాల ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా వాడుతున్నారు. షుగర్ వ్యాధికి తీసుకును ఔషధాల పనితనాన్ని మెరుగుపరచడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది.

ఈ మొక్క నుంచి సుగంధ పరిమళభరితమైన వాసన వస్తుంటుంది. ఇందుకు కారణం దీనికి కారణం యూజెనాల్, మిథైల్ యూజెనాల్, కారియోఫిల్లీన్, సిట్రాల్, కేంఫర్, థైమాల్ వంటి ఎస్సెన్షియల్ ఆయిల్స్ ఉండటమే. ఇటువంటి ఆరోమాటిక్ తైలాల మిశ్రమాలు యాంటిసెప్టిక్‌గా పని చేస్తాయి.

ఆధారము: : తెలుగు.వెబ్ దునియా.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate