కొర్ర పులిహోర
కావలసిన పదార్థాలు
కొర్ర బియ్యం - 1 కప్పు
నీరు (ఎసరు కోసం)- 2 కప్పులు
నిమ్మరసం - తగినంత
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు , జీలకర్ర, మినపప్పు, పల్లీలు - తాళింపు చేసుకోవడానికి తగినంత
విధానం: కొర్రబియ్యం లో ఎసరు పోసి కుక్కర్ లో అన్నంలాగా వండుకోవాలి. ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు నూనెలో వేసి తాళింపు చేసుకోవాలి. నిమ్మరసం, ఉప్పు ఉడకబెట్టిన అన్నానికి కలుపుకొని తాళింపులో వేసి పులిహోర లాగా కలుపుకోవాలి.
కొర్ర పెసరట్టు
కావలసిన పదార్థాలు
కొర్ర బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1 కప్పు
ఉప్పు - తగినంత
విధానం: కొర్ర బియ్యం, పెసరపప్పు ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. వాటిని కలిపి మెత్తగా రుబ్బుకొని, కొంచెం ఉప్పు కలిపి గరిట జారుగా చేసుకొని పెసరట్లు వేసుకోవాలి.
కొర్ర ఇడ్లీలు
కావలసిన పదార్థాలు
కొర్ర బియ్యం - 3 కప్పులు
మినపప్పు - 1 కప్పు
మెంతులు - 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
విధానం: కొర్ర బియ్యం, మినప పప్పును వేరు వేరుగా 8-10 గంటలు నానబెట్టుకోవాలి. మెంతులు చేర్చి వాటిని విడి విడిగా రుబ్బుకోవాలి. ఉప్పు చేర్చి రెండిటిని ఇడ్లీ పిండిలాగా బాగా కలుపుకోవాలి . 6-8 గంటలపాటు పులియబెట్టిన తర్వాత ఇడ్లీ వేసుకోవాలి.
కొర్ర దోసె
కావలసిన పదార్థాలు
కొర్రలు - 2 కప్పులు
మినపప్పు - 1 కప్పు
శనగపప్పు - 2 టీ స్పూన్
మెంతులు – అర టీ స్పూను
ఉప్పు - తగినంత
విధానం: కొర్రలు, మినపప్పు, శనగపప్పును కడిగి వేరు వేరుగా 4 గంటల సేపు నానబెట్టాలి. ఈ పప్పును కొర్రలను వేరు వేరుగా మిక్సిలో వేసి రుబ్బుకోవాలి. కొంచెం ఉప్పును వేసి రుబ్బుకున్న వాటిని బాగా కలిపి ఒక రాత్రంతా పులియబెట్టాలి. అవసరమైతే కొంచెం నీరు కలిపి దోసె పిండిలాగా తయారుచేసుకొని దోసెలు వేసుకోవాలి.
కొర్ర బియ్యం పొంగలి
కావలసిన పదార్థాలు
కొర్రలు - 1/4 కప్పు
పెసర పప్పు - 1/4 కప్పు
బియ్యం - 2 టేబుల్ స్పూన్
నీరు - 1/2 కప్పు
జీడిపప్పు - కొన్ని
ఉప్పు- తగినంత
జీలకర్ర - 1/4 టీ స్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
అల్లం తురుము - 1 టీ స్పూన్
పసుపు - కొంచెం
నూనె లేదా నెయ్యి - 2 టీ స్పూన్లు
పచ్చిమిరపకాయలు: 2-3
విధానం: బియ్యాన్ని, పెసరపప్పును బాగా కడగాలి. కడిగిన తర్వాత 2 గంటల సేపు నాన బెట్టాలి. వీటిని కుక్కర్ లో ఉడకబెట్టాలి. ప్యాన్ తీసుకుని అందులో నూనె గాని నెయ్యి గాని వేసుకుని జీడిపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, పసుపు వేసి తాళింపు చేసుకొని , ఉడకబెట్టుకున్న అన్నాన్ని కలపాలి.
కొర్ర మురుకులు
కావలసిన పదార్థాలు
కొర్ర పిండి - 1/2 కేజీ
శనగ పిండి - 1/4 కేజీ
జీలకర్ర - 10 గ్రా.
కారం - 25 గ్రా.
నువ్వులు - 25 గ్రా.
నూనె - 1/2 కేజీ
విధానం: శనగ పిండిని కొర్ర పిండిని కలిపి జల్లెడ పట్టుకోవాలి. ఆ మిశ్రమానికి జీలకర్ర, కారం, నువ్వులు కలపాలి. 50 గ్రా. వేడి నూనె తీసుకొని ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. వేడీ నీరు పోస్తూ మురుకుల పిండిలా కలుపూకోవాలి. ప్యాన్ లో నూనె పోసి కలిపి పెట్టుకున్న పిండిని మురుకులులాగా వేయించుకోవాలి.
కొర్ర బజ్జి
కావలసిన పదార్థాలు
కొర్ర పిండి - 1/2 కేజీ
శనగ పిండి - 1/4 కేజీ
బజ్జి వేసుకోవాలనుకున్న కూరగాయ: 250 గ్రా
జీలకర్ర - 10 గ్రా.
కారం - 23 గ్రా.
బేకింగ్ పౌడర్ - తగినంత
ఉప్పు - తగినంత
నూనె - 1/2 కేజీ
విధానం: శనగ పిండి, కొర్ర పిండి లను కలిపి జల్లడ పట్టుకోవాలి. ఆ మిశ్రమానికి జీలకర్ర, కారం, ఉప్పు కలపాలి. బజ్జీల పిండిలా కలుపుకుని కూరగాయముక్కలను ముంచి వేడి నూనెలో వేయించుకోవాలి.
ఆధారం: కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/010.
చివరిసారిగా మార్పు చేయబడిన : 9/8/2023