অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వేసవిలో జాగ్రత్తలు

వేసవిలో జాగ్రత్తలు

ఎండాకాలం ప్రారంభం నుండే ఎండ ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం కనపడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు, వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. లేదంటే తలనొప్పి, ఒళ్లుమంట, డీ హైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు

  • ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.
  • ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.
  • పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
  • రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.
  • ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
  • ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి.
  • తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.
  • ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.
  • ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి.
  • పలుచని బట్టలు వేయాలి.
  • ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు సన్‌వూస్కీన్‌లోషన్లు వాడాలి.
  • చిన్న పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి.

సాధారణంగా వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని సమయాల్లో ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రాణాలను కూడా కోల్పోతుంటారు. కాబట్టి వృద్ధులు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఆహార నియమాలనుంచి నిద్ర వరకు వైద్యుల సలహాలు పాటించాలి.

వేసవిలో చర్మ సంరక్షణ!!

వేసవికాలంలో చర్మాన్ని చాలా పదిలంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో వేడి అధికంగా ఉండడం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. మండే ఎండలోనూ చాలా మందికి బయటకు వెళ్లకుండా ఉండలేరు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

  • రోజంతా చర్మం పై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది.
  • చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.
  • అన్నింటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలాల్లో మీరు తీసుకుంటున్న నీటి కంటే రెండింతలు అధికంగా తీసుకోవాలి.
  • సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది.
  • ఎండలో బయటకు వెళ్లడం తప్పదనుకుంటే ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను శరీరంపై ఎండ పడే భాగాల్లో రాసుకోండి.
  • అలాగే పల్చటి కాటన్ వస్త్రాలు, ముఖ్యంగా లైట్‌కలర్స్ ధరించడం మేలు. చేతులను కప్పివేసే షర్టులను ధరించండి. తలకు టోపి పెట్టుకోవడం లేదా గొడుగు వాడడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.
  • తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.
  • అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను కూడా తినవచ్చు.
  • వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి.
  • ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది.
  • స్క్రబ్బర్‌లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది.
  • టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్ కూడా తగ్గిపోతాయి. ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు.
  • వేసవిలో కేశ సంరక్షణ కూడా చాలా ముఖ్యం. జుట్టును మరీ పొడవుగా ఉంచుకోకుండా వీలయినంత తక్కువగా ఉంచుకుంటే మంచిది. ఎండకు శిరోజాలు దెబ్బతినకుండా ఉండడానికి కండీషనర్ క్రీమును రాసుకోవడం తప్పనిసరి. హెన్నాచాలా చక్కని కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.
  • వేసవిలో ఎక్కువగా స్విమ్మింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే స్విమ్మింగ్ ఎక్కువ సమయం చేయడంవల్ల నీళ్లలో ఉండే క్లోరిన్ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. కనుక స్విమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్ ధరించడం మరచిపోవద్దు.

ఆధారము : ఈనాడు మరియు వన్ ఇండియా

వేసవి కాలంలో వడదెబ్బను నివారించేందుకు మార్గాలు

  • వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.
  • ఎండలో భయటకి వెళ్ళినపుడు చల్లటి ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి.
  • వేసవికాలంలో ఆల్కహాల్, సిగరెట్, కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండండి.
  • డోకులు, వాంతులు, అలసట, తలనొప్పి వంటివి రాకుండా చూసుకోవాలి.

వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవటం వలన వడ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ వడదెబ్బల వలన భౌతికంగా మాత్రమె కాకుండా, శరీరంలో వివిధ రకాల అవయవాలు మరియు అవయవ వ్యవస్థలు, వాటి విధులు, ముఖ్యంగా నాడీ వ్యవస్థ ప్రమాదానికి గురవుతుంది. ఇతర ఉష్ణ అనారోగ్యం (హైపెర్థెర్మియా రూపాలు) వేడి తిమ్మిరి మరియు వేడి అలసటలు కలుగుతాయి. చిన్న పిల్లలో మాత్రమె కాకుండా వయసు మీరిన వాళ్ళలో గుండెపోటు వంటి వాటిని కుడా కలిగిస్తుంది.

ఇలాంటి సమయాల్లో వెంటనే వైద్యులను సంప్రదించటం చాలా మంచిది. కావున ఎక్కువ సమయం ఎండకు బహిర్గతం అవటం వలన శరీర విధులలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అందువలన ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకుండా జాగ్రత్త పడండి. శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లేదా అంత కన్నా ఎక్కువ అవటాన్ని వడదెబ్బ గురవటం అంటారు. ఈ సమయంలో అలసట, శరీరం నుండి వేడి భయటకి రావటం మాత్రమె కాకుండా ఎక్కువగా మీ శరీరం డీ-హైడ్రేషన్'కు గురవుతుంది. ఈ సమయంలో డోకులు, వాంతులు, అలసట, బలహీనంగా అవటం, తలనొప్పి, కండరాల తిమ్మిరులు మరియు కళ్ళు తిరగటం (మైకం) వంటివి బహిర్గత లక్షణాలుగా కనపడతాయి.

వడదెబ్బ చాలా ప్రమాదకరమైనదిగా చెప్పవచ్చు మరియు దీనికి వెంటనే చికిత్స అందించాలి. ఇది మాత్రమె కాకుండా వేడి సంబంధిత వ్యాధులు కలుగుటకు అసంఖ్యక మార్గాలు ఉన్నాయి. దీని నివారణ కోసం, వడదెబ్బ కలగకుండా ఉండుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వీటి పైన పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

వడదెబ్బ నివారణ:

  • వేసవికాలంలో భయటకి వెళ్ళటానికి ముందు మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. వేసవి కాలంలో డీ-హైడ్రేషన్ అధికంగా ఉంటుంది కావున వాటర్ బాటిల్'ను మీతో తీసుకెళ్ళండి. వేసవికాలంలో నీరు శరీరాన్ని చల్లగా మారుస్తుంది.
  • వేసవి కాలంలో ఎక్కువ సమయం అతడు/ ఆమె చల్లటి ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి.
  • ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
  • ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
  • వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.
  • వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి
  • వేసవికాలంలో భయటకి వెళ్ళే అవసరం ఉంటె ఉదయనా లేదా సాయంత్రం సమయాల్లో వెళ్ళటానికి ప్రణాలికలను రూపొందించుకొంది.
  • వేసవికాలంలో మీ శరీర ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గమనించినట్లయితే వెంటనే ఆరోగ్య నిపుణులను సందర్శించి సరైన జాగ్రత్తలను తీసుకోండి.
  • వేడి వాతవరణంలో భౌతిక కార్యకలాపాలు చేయటం అంత మంచిది కాదు. ఒకవేళ మీరు ఎండలో భౌతిక కార్యకలాపాలను చేసినట్లయితే ఎక్కువ నీటిని లేదా శక్తిని అందించే ద్రావనాలను త్రాగండి.
  • సూర్యరశ్మికి బహిర్గతమైనపుడు సోడియం వంటి ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను త్రాగటం చాలా మంచిది.
  • వేసవికాలంలో డోకులు, వాంతులు, అలసట, బలహీనంగా కనిపించటం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు బహిర్గతమైన వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేపించుకోవటం చాలా మంచిది.

ఆధారము: ఓన్లీ మై హెల్త్.కం

ఎండాకాలం పిల్ల‌లు జ‌ర భ‌ద్రం!

ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే వుండాలి. కానీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం.. అధిక ఉష్ణోగ్రత వల్ల, కలుషితమైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలంలో జబ్బుపడుతూ వుంటారు. అలా కాకుండా వేసవి సెలవులు ఆనందంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అయితే, ఎండాకాలం పిల్లల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ముందు చూడాలి.

వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే

  • బయట వాతావరణం చాలా వేడిగా వుంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా వుటుంది. అందుకని వడదెబ్బ తగిలే అవకాశం వారిలో ఎక్కువ.
  • పిల్లల చర్మం వైశాల్యం ఎక్కువగా వుండటం వల్ల వారి వంట్లో నీరు వేగంగా ఆవిరై పోవచ్చు. అలా కూడా వారికి వడదెబ్బ తగలవచ్చు.
  • నీళ్ళు, ఇతర ద్రవాలు తాగకుండా మొరాయించే పిల్లలు ఎండల్లో తొందరగా నీరసించిపోతారు. ఆరుబయట ఎండలో ఎక్కువసేపు తిరిగినా, ఆడినా చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసించిపోతారు. తలనొప్పి కూడా రావచ్చు.
  • ముఖ్యంగా ఆరేళ్ళ లోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, శరీర ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే వారికి ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ.

పరిశుభ్రత లోపిస్తే...

  • చెమటతో చెమట గ్రంథులు మూసుకుపోతే వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. అంతేకాక, చెమట వల్ల శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతిని వడదెబ్బ తగలవచ్చు.
  • చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు రావచ్చు.
  • ఆ పొక్కులు ఇన్‌ఫెక్షన్‌తో సెగగడ్డలుగా మారవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ చీము నెత్తురు గడ్డల వల్ల నొప్పి, జ్వరం తీవ్రతరం కావచ్చు.
  • ఒకోసారి ముక్కు నుంచి రక్తం కారవచ్చు (ఎపిస్టాక్సిస్‌) ముక్కులో వేళ్ళు పెట్టే అలవాటు వుంటే ఇది ఎక్కువ అయ్యే ప్రమాదం వుంది.

నీరు ఆహారం కలుషితమైతే...

  • వండిన పదార్థాలు ఎండాకాలం త్వరగా చెడిపోతాయి. అజాగ్రత్తగా వుంటే, నిలవ ఆహారం తింటే వాంతులు, విరేచనాలు కావచ్చు. ఇంట్లో కానీ బయట తింటే ఈ లక్షణాలు మరింతగా కనిపిస్తాయి.
  • దాహం వేసి ఎక్కడపడితే అక్కడ ఏదో ఒక నీరు తాగితే కూడా జబ్బుపడవచ్చు.
  • అలా వంట్లో నీరు హరించుకుపోయి ' డీహ్రైడేషన్‌' సంభవిస్తే, ఒకోసారి మూత్రం బందైపోయి, రీనల్‌ ఫెయిల్యూర్‌ వల్ల ప్రాణహాని కూడా జరగవచ్చు.
  • కలరా, టైఫాయిడ్‌, కామెర్ల వంటి వ్యాధులు కలుషిత ఆహారం వల్ల వ్యాపించవచ్చు. శీల పానియాల్లో వాడే మంచుముక్కలు ఏ నీటితో తయారయ్యాయో నియంత్రణ లేనప్పుడు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు సంభవించవచ్చు.
  • ఎండాకాలంలో మాంసాహారం త్వరగా చెడిపోతుంది. నిలువ పదార్థాలతో చాలా సీరియస్‌ వ్యాధులు వేధించవచ్చు. ఈ వ్యాధులు ఈగల వల్ల మరింత వేగంగా వ్యాపిస్తాయి.

కళ్ళపై ప్రభావం...

  • ఎండాకాలం కళ్ళ కలక వేగంగా వ్యాపిస్తుంది.
  • దుమ్మూధూళి వల్ల, వేడి వల్ల కంటి ఇన్‌ఫెక్షన్‌ త్వరగా పాకిపోతుంది. ఒకోసారి చూపు మందగించి, రెటినాపై కూడా ప్రభావం చూపవచ్చు.

వేసవిలో వచ్చే ఇన్‌ఫెక్షన్లు...

  • చలి తగ్గి ఎండలు ముదరక ముందే ఆటలమ్మ ఆడాపాడే పిల్లల మీమద దాడి చేస్తోంది. అది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది.
  • గవద బిళ్ళలు, టైఫాయిడ్‌, పొంగు, హైపటైటిస్‌ 'ఎ' కామెర్లు కూడా ఎండాకాలం బాగా వ్యాపిస్తాయి.
  • ఇవన్నీ టీకాలతో నిరోధించే ఇన్‌ఫెక్షన్లే. గతంలో మనం తెలుసుకున్న టీకాల వల్ల వీటిని నివారించవచ్చు. ఆటలమ్మ (చికెన్‌ ఫాక్స్‌) టీకా ఒకటిన్నర సంవత్సరాలు నిండిన పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. 4-6 సంవత్సరాలకి రెండవ మోతాదు ఇవ్వాలి. లేకపోతే పెద్దయాక వారికి సర్పి అనే అతి బాధాకరమైన వ్యాధి (హెర్పిస్‌ జోస్టర) సం భవిం చవచ్చు.
  • మూత్రం ఇన్‌ ఫెక్షన్‌ ఎం డాకాలం లో సర్వసాధా రణం.

వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు...

  • ఎండ తీవ్రంగా సమయాల్లో పిల్లలని ఇళ్ళలోనే వుంచి కథలు చెప్తూ, పాటలు పాడిస్తూ, పుస్తకాలు చదివిస్తూ, బొమ్మలు వేయిస్తూ, పిల్లల సినిమాలు చూపిస్తూ కాలక్షేపం చేయాలి.
  • రోజూ రకరకాల ద్రవాలు తాగించాలి. రెండేసి గంటలకి ఒకసారి మూత్రం సాఫీగా పోసేలా చూడాలి.
  • గది చుట్టూ చల్లటి గుడ్డలు వేలాడదీయాలి. రెండు పూటల స్నానం చేయించాలి.
  • పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినిపించాలి. మసాలాలు తగ్గించాలి.
  • పలుచటి, మెత్తటి కాటన్‌ బట్టలు తొడగాలి. బయటికి వెళ్తే గొడుగు, టోపీ వాడాలి.
  • దోమలు కుట్టకుండా రాత్రి పూట పైజామా లాల్చీ లాంటి బట్టలు తొడగాలి.
  • బయటి ఆహారం తినిపించకూడదు. తాజా ఆహారం మాత్రమే పెట్టాలి.
  • బయటకి వెళ్ళాలంటే సరైన సమయాలు ఎంచుకోవాలి. ఆటలు, ఈత నేర్పించాలంటే తెల్లవారుజామునే వెళ్లి ఎండ ముదరక ముందే ఇంటికి చేరుకోవాలి.
  • టీకాలన్నీ సకాలంలో వేయించి, టీకాలతో నివారించగల వ్యాధులన్నిటినీ నిరోధించాలి.
  • తాతలు, అవ్వలతో గడపడానికి పల్లెలకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

డా|| టి.నళిని,
పిల్లల వైద్యనిపుణురాలు,
ఎం.వి.ఎన్‌.ఆర్‌
ప్రజావైద్యశాల,
హైదరాబాద్‌.

ఆధారము: నవ తెలంగాణా

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate