- అంతర్గత రక్త స్రావము - పుర్రె, ఛాతి, కడుపు లోపల రక్త స్రావము కూడ అంతర్గతంగా జరుగును. గాయం కంటికి కనపడదు.
- బాహ్య రక్త స్రావము - చేతులు, కాళ్లపై గాయము కనిపిస్తుంది.
అంతర్గత రక్త స్రావము
లక్షణములు
- కళ్ళు తిరుగుట
- పాలిపోయిన ముఖము
- చల్ల బడిన శరీరము
- శ్వాస తొందరగ ఆడును.
- నాడి బలహీనంగా మరియు వేగంగా ఉండును
- చెమట పట్టును.
- దప్పిక వేయును
- స్రృహ కోల్పోవచ్చును.
ప్రధమ చికిత్స
అంతర్గత రక్త స్రావముంటే అనగా దెబ్బతగిలి ఛాతిలోపల, కడుపులోపల రక్త స్రావముంటే
- అతనిని వెల్లకిలపరుండబెట్టి కాళ్లు ఎత్తులో ఉంచాలి. కాళ్ల క్రింద దిండులేక మడత బెట్టిన దుప్పటి ఉంచవచ్చును.
- అతని మీద రగ్గు లేక దుప్పటి కప్పాలి.
- అతనికి తినడానికి త్రాగడానికి ఏదీ ఇవ్వకూడదు.
- వెంటనే ఆస్పత్రికి తరలించాలి. పుర్రెలు రక్త స్రావం ఉందనిపిస్తే కాళ్లు పైకి పెట్టరాదు. కొంచం వెనకకు వాలునట్లు పడుకోపెట్టాలి.
బాహ్య రక్త స్రావము
ప్రధమ చికిత్స
ప్రత్యక్షపు ఒత్తిడి పద్దతి
- గాయములో అన్య పదార్థము లేకుంటే
- గాయపు చివరులు దగ్గరకు చేర్చుము.
- గాయముపై కట్టుగుడ్డ గాజు లేక శుభ్రమైన గుడ్డ కప్పివుంచుము
- చేతితో ఆ భాగముపై 10-15 నిమిషాలు నొక్కిపడుతూ ఉంచాలి.
- ఆ భాగాన్ని గుండె కన్నా ఎత్తులో ఉంచాలి.
- రక్త స్రావము ఆగని తర్వాత గాయముపై నీవు ముందుగా ఉంచిన గుడ్డను తొలిగించకుండా గాయముపై వేరొక కట్టుగుడ్డలో ఏదైనా శుభ్రమైన గుడ్డ నుంచి కట్టు కట్టాలి.
కొన్ని సందర్భాలలో ప్రత్యక్ష ఒత్తిడిని పాటించలేము అవేమనగా
- గాయములో అన్య పదార్ధము (ఉదా. గాజు పెంకు) గట్టిగా గుచ్చుకొని ఉన్నప్పుడు గుచ్చుకొన్న అన్య పదార్ధములను బయటకు తీయకూడదు. అన్య పదార్ధము తీయకుండా దానిపై ఒత్తిడి ఏర్పరిస్తే ఆ పదార్ధం యింకా లోతుకు వెళ్ళే అవకాశముంటుంది.
- గాయములో ఎముక విరిగినప్పుడు
- చాలా వెడల్పైన గాయమున్నప్పుడు.
పై సందర్భాలలో ప్రథమ చికిత్స తప్పని సరైతేనే వాడాలి.:-
- అదిమి పట్టు స్థలములో చేతితో కాక తాడు, రబ్బరు కట్టును బిగించి రక్త స్రావమునాపవచ్చును.
అదిమి పట్టు కట్టును ప్రతి 15 నిమిషాలకొక సారి ½ నిమిషము తప్పని సరిగ వదులు చేయాలి. ½ నిమిషము వదులు చేసిన తర్వాత అవసరమైతే తిరిగి బిగించవచ్చును.
- ఈ విధంగా ½ నిమిషము వదలు చేయకుంటే ఆభాగమునకు రక్త ప్రసారము ఏ మాత్రము లేక అతను ఆస్పత్రి చేరే లోగా ఆ భాగము మొద్దు బారును. అందువలన ఈ జాగ్రత్త పాటించవలెను.
పరోక్షపు ఒత్తిడి ద్వారా రక్త స్రావము ఆపిన తర్వాత
- గాయములో అన్యపదార్థమున్నందువలన గాయముపై ఉంగరపు మొత్త మధ్యలోకిఅన్యపదార్థమువచ్చు నట్లుండాలి.
- గాయములో కట్టు గుడ్డ వుంచి కట్టు కట్టాలి.
ప్రత్యేక స్థలము నుండి రక్తస్రావము
- చెవి నుండిరక్తస్రావము:-
తలకు దెబ్బ తగిలినతర్వాత చెవి నుండి రక్తస్రావముండవచ్చును.
ప్రధమ చికిత్స
ఏ వైపు చెవి నుండి రక్తస్రావముంటే అతనిని ఆ వైపు పడుకోబెట్టాలి. ఉదా,, తలకు దెబ్బ తగిలి కుడిచెవి నుండి రక్త స్రావముంటే అతనిని కుడివైపుకు పడుకోబెట్టాలి.
- ముక్కు నుండి రక్తస్రావము:-
ఎండలో తిరిగినప్పుడు లేక వేడి గాలులు పీల్చుట వలన ముక్కు నుండి రక్తము కారవచ్చును.
ప్రధమ చికిత్స
- ఆ వ్యక్తిని ఒక బల్లవద్ద కూర్చోబెట్టి, అతనిముందు ఒక చిన్న పాత్రనుంచాలి.
- ముక్కు పుటాలు (ముక్కు భాగము) గట్టిగా 10ని,,ల పాటు మూయాలి.
- తల ముందుకు వంచాలి. ఒక వేళ అతనికి స్పృహ లేకుంటే రికవరీ పద్దతిలోపరుండ బెట్టాలి.
- ముక్కుపై తడిగుడ్డ లేక ఐస్ నుంచవచ్చును.
- అతని ముక్కు ద్వారా నోటిలోనికి కారిన రక్తమును ఆ పాత్రలోనికి ఉమ్మివేయని చెప్పాలి.
తలకు దెబ్బ తగిలి ముక్క నుండి రక్తస్రావముంటే ప్రధమ చికిత్స
- అతని తలను ముందుకు వంచి కూర్చండబెట్టాలి.
- స్పృహ లేకుండే రికవరీ పద్దతిలో పరుండబెట్టాలి.
- ఆస్పత్రికి తరలించాలి.
రక్తప్రసారణ మార్గం నుంచి రక్తం కారిపోవడాన్నే రక్తస్రావం అంటారు. రక్తస్రావం - శరీరంలోపల, అంతర్గతంగా రక్తనాళాలకు చిల్లులు పడి జరగవచ్చు...లేదా శరీరం బయటి భాగంలోని యోని, నోరు, ముక్కు వంటి శరీర ద్వారాల నుంచి గానీ, గాయంద్వారా చర్మంతెగిగానీ జరగవచ్చు.
శరీరంలో గాయమైనపుడు
ఉదాహరణకు... ఏదయినా వస్తువు, ఒక గాజుముక్కగానీ, చెక్క ముక్కగానీ, లోహపుముక్కగానీ అయిఉండొచ్చు.
గాయానికి కారణమై, శరీరం లోపల ఇరుక్కున్న వస్తువును తాకకుండా గాయం చుట్టూతా వేళ్ళతో అదిమిపట్టుకుని ఉంచండి. ఆ ముక్కను మాత్రం తొలగించకండి.
లోపలున్న వస్తువును తాకకుండానే గాయానికి చుట్టూతా గాజుగుడ్డతో గట్టిగా కట్టి డ్రెస్సింగ్ చేయండి.
గాయం మోచేతిమీదగానీ, కాలిమీదగానీ జరిగి రక్తం బాగా కారుతున్నట్లయితే, బాధితుడిని పడుకోబెట్టి గాయంతగిలిన శరీరభాగాన్ని పైకి ఎత్తి పట్టుకునేట్లు చూడండి.
అంబులెన్స్ దొరికితే దానిలోగానీ, లేకపోతే వేరే...ఏదయినా కారువంటి వాహనంలోగానీ బాధితుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయండి.
నోటినుంచి రక్తం పడటం
నోటినుంచి రక్తం పడటం(ఒక చిన్న కప్పు, కప్పున్నర) సాధారణ విషయమేమీ కాదు. అలా నోటినుంచి రక్తం పడినపుడు రోగి, కుటుంబసభ్యులు భయపడటం కూడా సహజం. సాధారణంగా ఊపిరితిత్తులకు క్షయ. క్యాన్సర్ వంటి ఏదయినా జబ్బు చేస్తేనో లేదా ఊపిరితిత్తులకు చిల్లులు పడటం వంటి గాయాల వలనగానీ ఇలా రక్తం పడుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- బాధితుడిని పడుకోబెట్టాలి. తల, భుజాలు మాత్రం కొద్దిగా పైకి లేచి ఉండేటట్లు చూడాలి. గాయం తగిలినవైపు రోగి వంగి ఉండాలి.
- నోటిద్వారా ఏ విధమైన ఘన, ద్రవ ఆహారాన్ని ఇవ్వకుండా చూడండి.
రక్తస్రావం ఛాతీకి తగిలిన గాయం వల్ల అయిన సందర్భంలో...ఛాతీగుండా ఆ గాయంలోనికి గాలి వెళితే మరిన్ని సమస్యలు వస్తాయి కాబట్టి గాయాన్ని పాలిథీన్ పదార్ధంతో గాలి చొరబడడానికి వీలులేని విధంగా కప్పి గట్టిగా డ్రెస్సింగ్ చేసి కట్టుకట్టాలి.
మీ వ్యక్తిగత వైద్యుడు ఉంటే వెంటనే పిలిపించండి లేదా బాధితుడిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ రప్పించండి.
రక్తం కక్కుకోవడం
సాధారణంగా కడుపులో ఉన్న పుండునుంచి రక్తం కారడం వలన రక్తం కక్కుకుంటారు. పొట్టలో ఆ రక్తమంతా నిండిపోయి అది అకస్మాత్తుగా సంకోచించడంతో బాధితుడు దానిని వాంతి చేసుకుంటాడు. బయటకొచ్చే రక్తం ఒక్కోసారి ఎక్కువకూడా ఉంటుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- బాధితుడిని పడుకోబెట్టాలి. పాదాలు, కాళ్ళు కొద్దిగా పైకి లేచి ఉండేటట్లుగా చూడాలి.
- బాధితుడిని కొద్దిగా వెచ్చగా ఉండేటట్లు చూడాలి. అయితే బాగా దుప్పట్లు కప్పి, వేడినీళ్ళు ఇచ్చి మరీ ఎక్కువ వేడిగా కూడా చేయవద్దు. బాధితుడు కొద్దిగా వెచ్చగా ఉంటే సరిపోతుంది....చలితో వణకకుండా మాత్రం చూడాలి.
- నోటిద్వారా ఏ విధమైన ఘన, ద్రవ ఆహారాన్ని ఇవ్వవద్దు.
- నోటిని నీటితో కడగవచ్చు. కానీ బాధితుడు నీటిని మాత్రం మింగకూడదు
- మీ వ్యక్తిగత వైద్యుడు ఉంటే వెంటనే పిలిపించండి లేదా బాధితుడిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ రప్పించండి.
- బాధితుడు స్పృహ కోల్పోతే అతనిని వెంటనే పక్కకు, రికవరీ భంగిమలోకి తిప్పండి. అయితే పాదాలు, కాళ్ళు మాత్రం ఇంకా పైకి లేచే ఉండాలి.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు