অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గుండె జబ్బులు

డిస్‌లిపిడిమియ కారణంగా గుండె జబ్బులు

శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత వల్ల వచ్చే సమస్యను డిస్‌లిపిడిమియా అంటారు. దీని గురించి తెలుసుకుందాం.

ధమనుల్లో కొవ్వు (కొలెస్ట్రాల్‌) పెరిగిపోతే గుండెకు హానికరం అని తెలుసు. కానీ కొవ్వు శరీరంలో ఎక్కడైనా పెరగడంవల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయని, గుండెపోటు, పక్షవాతం వస్తాయని, కాలి దిగువ భాగంలో గ్యాంగ్రీన్‌ ఏర్పడుతుందని మనలో చాలా మందికి తెలియదు. ఇవన్నీ గుండె రక్త నాళాల జబ్బుకు దారి తీస్తాయని వైద్యులు చెబుతు న్నారు. గుండె రక్తనాళాల జబ్బులకు చాలా కారణా లున్నాయి. వీటిలో ముఖ్యమైనవి మధు మేహం, అధిక రక్తపోటు, ధూమపానం, కొవ్వు అసాధారణ స్థాయిలో ఉండటం (డిస్‌లిపిడిమియ) వంటివి.

శరీరంలో ఉండే రకరకాల కొవ్వులను లిపిడ్స్‌ అంటారు. కానీ ప్రధానమైన కొవ్వు రూపాల్లో ఒకటి కొలెస్ట్రాల్‌, రెండోది ట్రై గ్లిజరాయిడ్స్‌. ఇవీ రెండు లైపోప్రోటీన్‌ రూపంలో రక్తంలో ప్రవహిస్తుంటాయి. లైపో ప్రోటీన్లు మూడు రకాలులో డెన్సిటీ లైపో ప్రోటీన్‌ (ఎల్‌డిఎల్‌) మొత్తం కొలెస్ట్రాల్‌లో ఇది 10 నుంచి 15% ఉంటుంది. వీటిలో అసమతుల్యత ఏర్పడినప్పుడు కలిగే పరిస్థితిని డిస్‌లిపిడిమియ అంటారు.

డిస్‌లిపిడిమియ జన్యుపరమైన కారణాలవల్ల రావచ్చు. జీవనశైలి కారణాలు… మధుమేహం, ధూమపానం, కదలికలేని జీవన విధానం (సెడెంటరీ లైఫ్‌ స్టయిల్‌), స్థూలకాయంవల్ల డిస్‌లిపిడిమియ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. అంతేగాక కొన్ని ప్రత్యేక మందులు (స్టెరాయిడ్లు, హార్మోన్లు), వ్యాధులు (థైరాయిడ్‌ సమస్యలు) కూడా డిస్‌లిపిడిమియాకు కారణం కావచ్చు .

ఎల్‌డిఎల్‌: ఎల్‌డిఎల్‌ను చెడ్డ కొలెస్ట్రాల్‌ అంటారు. శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతీ ఒక మిల్లీ గ్రాము/డిఎల్‌ ఎల్‌డిఎల్‌ పెరిగితే పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒక శాతం పెరుగుతుంది. అయితే ఎల్‌డిఎల్‌కు ‘సాధారణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్‌డిఎల్‌ స్థాయి 100 మిల్లీగ్రాము/డిఎల్‌కు పెరిగి నప్పుడు గుండెపోటు ప్రమాదం అధికం అవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము /డిఎల్‌ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

యుక్త వయసు నుంచే ఎల్‌డిఎల్‌ను తగ్గించుకోవడాన్ని ప్రారంభిం చాలి. ఎల్‌డిఎల్‌ స్థాయిని 10 మిల్లీ గ్రాము/డిఎల్‌కు తగ్గించుకుంటే, 40 ఏళ్ళు వచ్చేసరికి, జీవితకాలంలో వచ్చే గుండెపోటు ప్రమాదం 50 శాతం తగ్గుతుంది. ఇదే స్థాయిని కొనసాగిస్తే, 70 ఏళ్ల వయసులో గుండెపోటు వచ్చే ప్రమాదం 20 శాతం తగ్గుతుంది. ఎల్‌డిఎల్‌ స్థాయి 40 మిల్లీ గ్రాము/డిఎల్‌ ఉంటే సురక్షితమైన స్థితిలో ఉన్నామని అర్థం. కుటుంబంలో ఇంతకు ముందు తాతయ్య, నానమ్మలు, తల్లితండ్రు లకు గుండెజబ్బు ఉన్న చరిత్ర ఉండే వారు తమ ఎల్‌డిఎల్‌ స్థాయిని 40 మిల్లీ గ్రాము/డిఎల్‌ ఉంచు కోవడం ఎంతో సురక్షితం, ఆరోగ్యకరం కూడా.

హెచ్‌డిఎల్‌: దీన్ని మంచి కొలెస్ట్రాల్‌ అని అంటారు. హెచ్‌డిఎల్‌ రక్త నాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్‌ విచ్ఛిన్నం అవుతుంది. అథిరొస్ల్కెరొసిస్‌ అనే సమస్య ఉత్పన్నం గాకుండా హెచ్‌డిఎల్‌ రక్షణగా ఉంటుంది. హెచ్‌డిఎల్‌ స్థాయి తక్కువ ఉందంటే, గుండె రక్త నాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండెపోటుకు బలమైన కారణం ఎల్‌డిఎల్‌ పెరగడం కన్నా హెచ్‌డిఎల్‌ తగ్గడమే. హెచ్‌డిఎల్‌ పురుషుల్లో 40 ఎంజి/డిఎల్‌, మహిళల్లో 50 ఎంజి/డిఎల్‌ ఉండేలా చూసుకోవాలి.

ట్రైగ్లిజరైడ్స్‌: ఇవి పెరుగుతున్నాయంటే, గుండె రక్తనాళాల వ్యాధి అధికమవుతున్న సంకే తాలు వెలువడతాయి. ట్రైగ్లిజరైడ్‌ స్తాయి పెరిగితే, గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుందని కొత్త ఆధారాలు వెల్లడించాయి. ట్రైగ్లిజరైడ్‌ స్థాయి 150 ఎంజి/డిఎల్‌ కంటే తక్కువ ఉండాలి.

డిస్‌లిపిడిమియాను సులభంగా నిర్వహిం చొచ్చు. స్తబ్దుగా ఉండకుండా ఏదైనా క్రియాశీల చర్యలు చేపట్టడం అవసరం. ఇష్టమైన వ్యాయామం చేయాలి. ఉదయం పూట కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడవాలి. నడకేగాక, జాగింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ చేయవచ్చు.

మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. లావుగా ఉన్నవారు బరువు తగ్గాలి.

ధూమపానం అలవాటు ఉంటే మానుకోవాలి. మధుమేహం ఉంటే, నియంత్రణలో ఉంచుకోవాలి.

మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదిస్తే మీకు మరిన్ని సూచనలు, సలహాలు ఇస్తారు.

డాక్టర్‌ ఉషశ్రీ,
కేర్‌ హాస్పిటల్‌,
బంజారాహిల్స్‌,
హైదరాబాద్‌.

గుండెనొప్పి – ఇసిజి

గుండె జబ్బుల విషయంలో నొప్పి స్థాయి ప్రధానాంశం కాదు. నొప్పి కలుగుతున్న విధానమే ప్రధానం. నొప్పి తక్కువగానే ఉన్నప్పటికీ లోపల గుండె తీవ్రస్థాయిలోనే దెబ్బతిని ఉండవచ్చు. దీనినే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌గా వ్యవహరిస్తుంటారు. అందుకే గుండెనొప్పి లక్షణాలన్న అనుమానం కలిగిన వెంటనే కనీసం ఇ.సి.జి. అయినా తీయించడం మంచి పద్ధతి.

విద్యుత్‌ తరంగాల ద్వారా గుండె దెబ్బ తిన్నదా? లేదా? అన్న ప్రాథమిక సమాచారం అందించే ఇ.సి.జి. కొన్ని వేల ప్రాణాల రక్షణతో సమర్ధవంతంగా తనదైన పాత్ర నిర్వహిస్తోంది మరి! అయితే – ఎన్నో వేల ప్రాణాలను కాపాడు తున్న ఇ.సి.జి. గుండె జబ్బులకు సంబం ధించి కలిగే మరికొన్ని సందేహాలకు సరైన సమాధానం చెప్పలేదు. గుండె ఎంత భాగం దెబ్బతిన్నది? గుండె రక్తనాళాలలో కొవ్వు ఎంతశాతం చేరింది? మళ్ళీ గుండెపోటు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? వంటి ప్రశ్నలకు ఇ.సి.జి. సమా ధానం ఇవ్వలేదు. అందుకే ఇ.సి.జి.లో పైకి గుండెపోటు లక్షణాలు ఉన్నట్లు ప్రతిబింబిం చినా లోపల జబ్బేమీ ఉండకపోవచ్చు. ఇ.సి.జి. ఫలితాలు మాత్రమే కొలమానంగా భావించే అనేక మంది అనవ సరంగా సంవత్సరాల తరబడి మందులు ఉపయోగించడం కూడా కద్దు! ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు -గుండెవ్యాధుల నిర్ధారణలో మరిన్ని పరీక్షలు అంటే గుండె స్కానింగ్‌, ట్రేడ్‌మిల్‌, స్ట్రెస్‌ థాలియమ్‌ వంటి పరీక్షలు అవసరమౌతున్నాయి. ఈ పరీక్షలన్నీ ఒక ఎత్తు అయితే – గుండె పనితీరు గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తూ గుండె జబ్బుల ప్రమాదస్థాయిని, రాబోయే గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే తెలియజేసి హెచ్చరించే అత్యాధునిక వ్యాధి నిర్ధారణా పరికరం యాంజియోగ్రాం ఇటీవలకాలంలో సామాన్య మానవునికి లభించిన అత్యద్భుతం!

గుండె గదులలోని రక్తపీడనం ఖచ్చితంగా తెలుసుకోవడంతోబాటు 0.56 శాతం రక్తనాళంతో రక్తప్రసరణకు విఘాతం ఏర్పడుతున్న ప్రమాదాన్ని కూడా ఈ పరికరం ద్వారా ఖచ్చితంగా తెలుసు కోవచ్చు. గుండెజబ్బు ప్రమాదాన్ని నిర్ధిష్టంగా తెలుసుకోవడంతో బాటు అత్యాధునిక వైద్య చికిత్సలైన ఆధునిక ఇంజక్షన్స్‌, బెలూన్‌ యాంజియోప్లాస్టీ, స్టెంట్స్‌, బైపాస్‌ సర్జరీ వంటి చికిత్సలు ఏ రోగికి ఎంతవరకూ అవసరం అన్నది కూడా ఈ పరికరం ద్వారా నిర్ధారించవచ్చు! గుండె జబ్బుల వైద్య విధానం ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ అనేక మంది గుండెపోటు ప్రమాదంతో మరణి స్తూండటం గుండెజబ్బుల పట్ల ప్రజలలో ఉన్న అవగాహనాలేమికి నిదర్శనం!

రాబోయే గుండెజబ్బు ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోగల అత్యాధునిక వైద్య పరీక్షా విధానాలు ప్రస్తుతం మనకు అందుబాటులోనే వున్నాయి. 40 సంవత్స రాలు దాటిన వ్యక్తి కనీసం ఏడాదికోసారి జనరల్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకోవడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. గుండె పనితీరును మెరుగు పరచుకోవచ్చు!

- మల్లాది కామేశ్వరరావు

విటమిన్‌ బితో పక్షవాతం, గుండెజబ్బులు దూరం

ఆరోగ్యానికి ‘బి విటమిన్లు చేసే మేలు గురించి అందరికీ తెలిసిందే అయితే మరోసారి ఈ ‘బి విటమిన్లలోని ఫోలేట్‌, బి6 ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పక్షవాతం, గుండెజబ్బుల వల్ల కలిగే మరణాల ముప్పు తగ్గుతుందని జపాన్‌ పరిశోధ కుల అధ్యయనంలో తేలింది.

జపాన్‌ కొలాబరేటివ్‌ కోహార్ట్‌ స్టడీలో భాగంగా 40-79 ఏళ్ళ మధ్యగల 23, 119 మంది పురుషులు, 35, 611 మంది మహిళల మీద అధ్యయనం చేశారు. వారి ఆహార అలవాట్లను నమోదు చేసుకుని, 14 సంవత్సరాల పాటు గమనించారు.

అనంతరం చనిపోయిన వారి వివరాలను సునిశితంగా పరిశీలించారు. వీరిలో ఫోలేట్‌, బి6 ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో గుండె వైఫల్యం కారణంగా వచ్చే మరణాలు తక్కువ సంఖ్యలో నమోదైనట్టు గుర్తించారు. అదే మహిళల్లో గుండెజబ్బులు, పక్షవాతం వల్ల కలిగే మరణాలు తక్కువగా ఉన్నాయి.

మనం తినే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, బీన్స్‌, ఆకుకూరల్లో ఫొలేట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక బి6 చేపలు, కాలేయం, ముడిధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇవేకాక నూనెలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పక్షవాతం, గుండె జబ్బులకు చెక్‌ చెప్పడమే కాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. అంతేకాదు ఈ ఆహారాన్ని తీసుకోవడం శరీరానికి పీచుపదార్థం (ఫైబర్‌) ఎక్కువగా అందుతాయి. స్థూలకాయులు కూడా ఈ ఆహారాన్ని మితంగా తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు.

ఆధారము: వైద్యం

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate