మీ పాప లావవుతోందా?
ఎందుకో అర్థం కావడం లేదా?
దీనికొక చిట్కా ఉందంటున్నారు అధ్యయనకారులు. అన్నాన్ని నెమ్మదిగా నమిలి తింటే పిల్లలు లావు కారని చెపుతున్నారు. ప్రతి ముద్దను 30 సెకన్లపాటు బాగా నమలాలంటున్నారు.
దీనివల్ల పిల్లలకు కడుపు నిండినట్టు ఉంటుందిట. దీంతో పిల్లలు అతిగా తినరట. అలాగే ఊబకాయం రాదు. సర్వసాధారణంగా చాలామంది బరువు తగ్గాలంటే తినడం తగ్గించాలని అనుకుంటారు. కానీ అ పని చేయడం అనుకున్నంత సులభం కాదు.
అందుకే అధ్యయనకారులు అన్నాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల ఎలాంటి లాభాలున్నాయన్న అంశంపై అధ్యయనానికి పూనుకున్నారు. ఈ స్టడీలో భాగంగా ఆరేళ్ల నుంచి 17 ఏళ్ల వయసున్న 54 మంది పిల్లలపై అధ్యయనం నిర్వహించారు. వీరంతా మెక్సికోలోని డ్యురాంగోకు చెందినవాళ్లు.
కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఈ అధ్యయనకారులు సంవత్సరం పాటు ఆ పిల్లల ఆహారపు అలవాట్లను గమనించారు. పిల్లల్ని రెండు గ్రూపులుగా చేశారు. వాటిలో అధ్యయనకారులు ఆదేశించినట్టు మెల్లగా నములుతూ తిన్న పిల్లల గ్రూపు ఒకటి. దీనికి ‘కంప్లయిట్ గ్రూపు’ అని పేరు పెట్టారు. అలా మెల్లగా అన్నం నమిలి తినని విద్యార్థుల గ్రూపుకు ‘నాన్-కంప్లయింట్ గ్రూపు’ అని పేరు పెట్టారు. వీరితోపాటు అదే ప్రాంతానికి చెందిన ఇంకో గ్రూపు పిల్లల్ని కూడా పరీక్షించారు. దీనికి ‘కంట్రోల్ గ్రూపు’ అని పేరు పెట్టారు.
ఈ రెండు గ్రూపులను కంట్రోల్ గ్రూపుతో పోల్చి ఫలితాలు అంచనాగట్టారు. కంప్లయింట్ గ్రూపు (అన్నాన్ని బాగా నమిలి తినే స్టూడెంట్స్)లోని పిల్లలు ఆరు నెలల తర్వాత రెండు నుంచి 5.7 శాతం బరువు తగ్గడాన్ని గమనించారు. మరో ఆరు నెలల తర్వాత అంటే సంవత్సరానికి 3.4 నుంచి 4.8 శాతం బరువు తగ్గారు. కానీ నాన్‌కంప్లయింట్ గ్రూపులోని విద్యార్థుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆరు నెలల తర్వాత వీరు 4.4 నుంచి 5.8 శాతం బరువు పెరిగారు. మరో ఆరు నెలల తర్వాత అంటే సంవత్సరం తర్వాత 8.3 నుంచి 12.6 శాతం బరువు పెరిగారు.
కంట్రోల్ గ్రూపులోని వారి బరువు సంవత్సరం తర్వాత 6.5 నుంచి 8.2 శాతం పెరిగింది. అందుకే అన్నాన్ని మెల్లగా నమిలి తినడాన్ని పిల్లలు అలవాటు చేసుకుంటే ఊబకాయం రాదు. మరి మీ పిల్లలకు కూడా దీన్ని అలవాటు చేయండి.
ఆధారము: ఆంధ్రజ్యోతి
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020