రోగ సంబంధమైన సమస్యలు
ఇందులో 1వ భాగం అన్ని మానసిక వ్యాధులకు, చికిత్సలకు సంబంధించిన సాధారణ అంశాలను చర్చించింది. 2వ భాగం మానసిక వ్యాధులకు తరచుగా ఉండే వివిధ రకాల రోగ సంబంధిత సమస్యలగురించి అవగాహన కలిగిస్తుంది. సమస్యను పరిష్కరించే పద్ధతిని అనుసరించడం జరిగింది. దీని అర్థం ఒక ప్రత్యేక సమస్యతో వచ్చే వ్యక్తికి చికిత్స చెయ్యడానికి మీరెలాంటి పద్దతిని అనుసరించాలి అనే దానిని సూచిస్తూ మానసిక సమస్యల్ని చర్చించడం జరిగింది. వ్యాధి నిర్ధారణను ప్రారంభ బిందువుగా ఉపయోగించలేదు. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ అంటే అర్థం వ్యాధి ఏమిటో మీకు ముందే తెలిసి పోయిందని. దానికి బదులు మీరు సాధారణంగా చూచే రోగసంబంధమైన సమస్యలతో ప్రారంభించాము, అప్పుడు సమస్యఉన్న వ్యక్తికి మీరెలా సహాయపడగలరో ఆ మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాము. 2వ విభాగం లో ఉపయోగించిన సమస్య-పరిష్కార పద్ధతిని మీరు ఉపయోగించే ముందు 1వ విభాగం గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండడం ముఖ్యం.
మానసిక ఆరోగ్యంతో ముడి పడి ఉన్న రోగ సంబంధిత సమస్యల్ని 5 ప్రధాన గ్రూపులు లేక సమూహంగా విభజించడం జరిగింది. ప్రతి గ్రూప సమస్యల్ని మీరే విధంగా పరిష్కరించాలి అనేదాన్ని వివరిస్తూ ఫ్లోఛాక్ట్స్ ని అనుబంధంలో ఇవ్వడం జరిగింది.
4వ అధ్యాయంలో మీరు ఎదుర్కొనే అత్యంత కల్లోలభరితమూ, బాధాకరమూ అయిన రోగసంబంధ సమస్యల్ని వివరించడం జరిగింది. అంత తీవ్రమైన ప్రవర్తన సంబంధ సమస్యలకు అతిసాధారణ కారణాలు సైకోసెస్.
అలసట, నెప్పలు, పీకులు, తలతిరగడం మొదలైన శారీరక లక్షణాలు సామాన్య ఆరోగ్య సంరక్షణలో అనేక ఆరోగ్య సమస్యలకు ఉండేవే. వాటిని 5వ అధ్యాయంలో వివరించడం జరిగింది. తరచుగా ఈ లక్షణాలకు మెడికల్ లేక భౌతిక వివరణను ఇవ్వడం కుదరదు. ఇలాంటి లక్షణాలకు సాధారణ కారణాలు డిప్రెషన్ మరియు ఏంగ్జయిటీకి సంబంధించినవి.
ఏకమ్యూనిటీ నైనా ప్రభావితం చేసే సామాన్య సమస్యలు మద్యం, మత్తు మందుల వ్యసనం. నిద్ర మాత్రలు, పొగాకు, జూదమాడడంతో బాటు వీటిని 6వ అధ్యాయంలో చర్చించడం జరిగింది.
7వ అధ్యాయం ఆత్మీయుల్ని కోల్పోవడం, హింస వలన వచ్చే సమస్యలను చర్చిస్తుంది. హింస మానసిక ఆరోగ్యానికి ఎంతో హానిని చేస్తుంది. సన్నిహితులైన వ్యక్తులు మరణించినప్పుడు వారిని కోల్పోవడం, ముఖ్యంగా అది అకస్మాత్తుగా, ఊహించకుండా జరిగినప్పుడు అది కోలుకోలేని దెబ్బ. ఇలాంటి సందర్భాల్లో వచ్చే సాధారణ మానసిక సమస్యలు డిప్రెషన్, ఏంగ్టయిటీ మరియు పోస్ట్ ట్రమాటిక్ సైస్ డిజార్జర్ బాలల చదువును పూర్తి చేసే సామర్థ్యాన్ని దెబ్బ తియ్యగల, కుటుంబ సభ్యులతో కలవనివ్వకుండా చెయ్యగల ముఖ్యమైన మానసిక సమస్యలనేకం చిన్నతనంలో వస్తాయి. బాల్యంలో వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలు వారు పెద్దయాక సర్దుబాటు సమస్యలకు దారితీస్తాయి. ఈ అంశాలు 8వ అధ్యాయంలో చర్చించబడినాయి.
పోట్లాడే లేక హి౦సి౦చే వ్యక్తి
కొట్లాడడం, హింసించడం అవతలి వ్యక్తిని గాయపరుస్తాయి. ఈపదాలలో అనేక రకాల ప్రవర్తనలు చేరతాయి. పెద్దగా అరవడం, తిట్టడం, చెడ్డ భాషను ఉపయోగించడం లాంటి మాటల పోట్లాట చాలా గాయపరుస్తుంది. భౌతికమైన కొట్లాటలో గిచ్చడం, దెబ్బ కొట్టడం, అరచేతో చరచడం, కాలితో తన్నడం, పిడికిలితో గుద్దడం ఉంటాయి. ఇంకా తీవ్రమైన కొట్లాటలో కర్ర, కత్తి, తుపాకి లాంటి ఆయుధాల్ని ఉపయోగిస్తారు.
మానసిక వ్యాధులు ఉన్నవారు ఎందుకు కొట్లాడుతారు ?
మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా కొట్లాడతారు కాబట్టి వారు ప్రమాదకారులని జనంలో ఉన్న సాధారణ విశ్వాసం. కాని వాస్తవంలో ఇతరులకంటే వారు ప్రమాదకారులేమీ కాదు. కొన్ని సార్లు మానసిక వ్యాధి లక్షణాలు కొట్లాడే ప్రవర్తనకు దారి తియ్యడం నిజమే, కాని ఇది అరుదు. మానసిక వ్యాధి కొట్లాటకు ఎలా దారి తీస్తుందో, కొన్ని ఉదాహరణల్ని చూద్దాం.
- కంఠ స్వరాల్ని వినడం : కోపం రావడం మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ, మిమ్మల్ని చంపడానికి పధకం వేస్తున్న ఇతరుల కంఠ స్వరాలు మీకు వినిపించినట్లు ఊహించుకోండి. మీరు భయపడిపోయి మీకు హాని చెయ్యడానికి ప్రయత్నిస్తున్న వారిపై దాడి చేస్తారు. మానసిక వ్యాధి ఉన్న వారిలో కొన్ని సార్లు ఇదే జరుగుతుంది.
- మీ పథకాలు, కలల ప్రకారం ముందుకు వెళ్ళకుండా ఆపడం : మీ జీవితాన్నే మార్చ గల గొప్ప ప్లాన్స్ లేక పథకాలు, కలలు మీకు ఉన్నాయని ఊహించుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తే, లేక మీకు జబ్బు చేసిందని అంటే, మీకు కోపం రావచ్చు. మానియా ఉన్న వారికి కొన్నిసార్లు ఇదే జరగొచ్చు.
- సమయానికి తాగడానికి మద్యం దొరకకపోతే : మీకు తాగుడు (లేక మత్తుమందు) వ్యసనంగా మారిందని, తాగాలనే కోరిక వలన శారీరక బాధలు వచ్చాయని ఊహించుకోండి. మిమ్మల్నెవరైనా తాగొద్దని ఆపితే మీరు కొట్లాటకు దిగుతారు.
- గందరగోళపడడం : మీకు విషయాల్ని గుర్తుంచుకోవడం కష్టమవుతూందని ఊహించుకోండి. మీరెక్కడున్నారో మీకు తెలియదు, టైము ఎంతయిందో తెలియదు, ఎవరు మీతో మాట్లాడుతున్నారో తెలియదు. మీరు భయబ్రాంతులవుతూ అపరిచితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటారు. విపరీతంగా తాగడం వలన, రక్తంలో చక్కెర శాతం తగ్గడం వలన, మెదడుకు ఇన్ఫెక్షన్ వచ్చి మెదడు దెబ్బతినడం వలన ఇలాంటి గందరగోళ పరిస్థితి కలగొచ్చు.
ఇతరులకు లాగానే మానసిక వ్యాధి ఉన్నవారికి కూడా కొట్లాటకు దిగడానికి కారణముంటుంది. ఆ వ్యక్తి ఎందుకు కోపంగా ఉన్నాడో మీరు తెలుసుకోగలిగితే, సహాయపడడానికి మార్గాలను కనుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు ?
కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని అడిగే ప్రశ్నలు :
- ఏం జరిగింది? హింస గురించి ఒక వ్యక్తి వర్ణనకు మరొక వ్యక్తి వర్ణనకు పోలికే ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఏమి జరిగిందో తెలుసుకోండి.
- ఇది ఎలా ప్రారంభమయింది? ఆ వ్యక్తి కొన్ని రోజులుగా చిరాగ్గా ఉన్నాడా లేక ఇది అకస్మాత్తుగా బయట పడిందా? అకస్మాత్తుగా కొట్లాటకు దిగడానికి తాగడం ఆపడం లాంటి ప్రత్యేకంగా ప్రేరేపించినదేదో ఉంటుంది. హెచ్చరిక లేకుండా కొట్లాటకు దిగడం చాలా అరుదు, కాని తీవ్రమైన మానసిక వ్యాధి ఉన్నవారికి ఇలా జరగొచ్చు.
- ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? జరిగుంటే మరింత హింస జరిగే అవకాశం ఉంది.
- గతంలో ఎప్పుడైనా ఈ వ్యక్తి మానసిక వ్యాధితో బాధపడ్డాడా? ఏవైనా మందుల్ని వాడుతున్నాడా? చికిత్సకు చాలా ముఖ్యమైన కిటుకుల్ని అందించే వీలుంది కనుక ఇది చాలా ముఖఱ్యం.
- అతను ఎవరిని నమ్ముతాడు? అతను ఈ వ్యక్తిని శాంత పరచగలిగే ముఖ్యమైన హితుడై ఉంటాడు.
- అతనికి మత్తుమందులు, మత్తుమందు అలవాటు ఉందా?
కొట్లాడే వ్యక్తిని అడగాల్సిన ప్రశ్నలు :
- ఏం జరిగింది? కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి వచ్చిన దానికి భిన్నమైన కోణం తెలియొచ్చు. అతను హింసాత్మకంగా మారడానికి కారణాలేమైనా ఉన్నాయా?
- మీకింకా కోపంగా ఉందా? జవాబు అవును అయితే మీరామెను ప్రశ్నలు అడిగే లోగా ఆమె కొంతసేపు ఒంటరిగా ఉండాలని కోరుకుంటూందేమో అడగండి.
- మీరు ఒత్తిడిలో ఉన్నట్లు భావిస్తున్నారా? మీ చుట్టూ ఉన్నవారు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు మీరు భావిస్తున్నారా? వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నారని మీకు అనిపిస్తోందా? మిమ్మల్ని గాయపరచే పనులు చేస్తున్నారని అనిపిస్తోందా? ఈ ప్రశ్నలు ఆమెకు సైకోసిస్ ఉందా లేదా అనేది అంచనా వెయ్యడానికి సహాయపడతాయి.
- మీ గురించి ఇతరులు మాట్లాడుకుంటున్నట్లు మీకు వినపడుతూందా? చుట్టూ ఎవరూ లేక పోయినప్పటికీ మీరు స్వరాల్ని వినగలుగుతున్నారా? భ్రమలు సైకోసిస్ కి ముఖ్యమైన చిహ్నం.
- మీరు ఇటీవల మద్యాన్ని (లేక, ఇంకా సరిగ్గా అడగాలంటే, మత్తుమందులు) తాగుతున్నారా? ఎంత? చివరిసారి ఎప్పడు తాగారు?
ఇంటర్వ్యూకు సూచనలు :
హింస జరగబోతూందని తెలిపే సూచనల గురించి అవగాహన కలిగి ఉండండి :
- బిగ్గరగా మాట్లాడడం లేక తిట్టడం లేక బెదిరించడం.
- పిడికిళ్ళు బిగిసూ, తెరుసూ ఉండడం.
- వేగంగా ఊపిరి తీసుకోవడం.
- ఒక చోట నిలవకుండా చంచలంగా తిరగడం.
- బల్ల మీద, గోడల మీద, నేలమీద తట్టడం, గుద్దడం, అరచేతో కొట్టడం - ఇది తాగుడు, మత్తు మందుల వ్యసనం లేక సైకోసిస్ చిహ్నం.
- మద్యం వాసన లేక మత్తు ఇంజక్షన్ చేసుకున్న గుర్తులు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
- ఆ వ్యక్తి మద్యం, మత్తుమందుల మత్తులో ఉన్నాడని సూచించే చిహ్నాలు, తూలుడు లేక ముద్ద మాటలు ఉన్నాయేమో గమనించండి.
- మీభావోద్వేగాల పట్ల స్పందన కలిగి ఉండండి. మీకు భయంగా అనిపిస్తే ఇంటర్వ్యూను ఆపండి.
- క్లినిక్ కి ప్రవేశ ద్వారం మీకు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి సులభంగా వెళ్ళేలాగా వుందో లేదో నిర్ధారణ చేసుకోండి.
- స్పష్టమైన, ప్రశాంతమెన స్వరంతో మాట్లాడండి, ఆ వ్యక్తిని శాంత పరచడానికి అతని మీద అరవకండి.
- ఎప్పడూ అతన్ని బెదిరించకండి. ఇది పరిస్థితిని ఇంకా దిగజారుస్తుంది.
- ఇంటర్వ్యూ చేసేటప్పుడు మరొక ఆరోగ్య కార్యకర్త కూడా ఉండేలా చూసుకోండి. అది సాధ్యం కాక పోయినప్పుడు నమ్మదగిన స్నేహితుడు లేక బంధువును దగ్గర ఉంచుకోండి.
- ఆ వ్యక్తి దగ్గర ఆయుధం ఉన్నట్లయితే అతనితో మీరు ఆరోగ్య కార్యకర్త అని, ఆ ఆయుధంతో క్లినిక్ లో పని లేదని చెప్పండి. అతను ఆయుధాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు బయలు వెళ్ళి భద్రతా సిబ్బందిని పిలిచి అతని దగ్గరున్న ఆయుధాన్ని తీసుకోమని చెప్పండి.
- ఆ వ్యక్తి హింసాత్మకంగా మారితే, ముందు బలమైన నమ్మకం కలిగించి శాంత పడమని చెప్పండి. ఇది సాధ్యం కాకపోతే అతన్ని వారించడానికి ప్రయత్నించండి.
మానసిక వ్యాధి అంటే ఏమిటి ?
మానసిక వ్యాధికి హింస తోడయితే గుర్తుంచుకోవలసిన మూడు కారణాలు ఉన్నాయి.
- వ్యక్తులు మత్తులో ఉన్నప్పుడు లేక మత్తులోనుండి బయటకు వస్తున్నప్పుడు హింసాత్మకంగా మారతారు.
- సైకోసిస్ ఉన్నవారు, అది షిజోఫ్రినియా లేక మానిక్ జబ్బు ఏదైనప్పటికీ, చాలా కల్లోలస్థితిలో లేక హింసాత్మకంగా ఉంటారు.
- చాలా ఎక్కువ గందరగోళ్ల స్థితిలో ఉన్నవారు, ఉదా. మూర్చ ఫిట్స్ తరువాత చాలా హింసాత్మకంగా మారొచ్చు.
వెంటనే ఏమి చెయ్యాలి ?
మొదట మాట్లాడడం, నమ్మకాన్ని కలిగించడం, ఆమె చెప్పేది వినడం ద్వారా ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించాలి. పరిస్థితిని మీ స్వాధీనం లోకి తెచ్చుకోవడానికి తొందర పడకండి. ఆ వ్యక్తి నిద్ర మందును తీసుకుని శాంతించేలాగా ప్రోత్సహించడం లక్ష్యం కావాలి. ఆమె ఒప్పుకుంటే, ఆందోళనను తగ్గించే మందు (ఉదా. లోరాజిపామ్, 1 - 2 మి.గ్రా. లేక డయాజిపామ్ 5 - 10 మి.గ్రా. మాత్ర) ను లేక ఏంటీ సైకాటిక్ మందు (ఉదా. హాలో పెరిడాల్ 5 మి.గ్రా. లేక క్లోర్ప్రోమజిన్, 50 - 100 మి.గ్రా. మాత్ర) ను ఇవ్వాలి. ఒక వేళ ఆమె మాత్రల్ని వేసుకోవడానికి నిరాకరించి, ఇంకా ఎక్కువ స్థిమితం లేకుండా ఉంటే, (తరువాత పేజీలో బొమ్మ) ఆమెను అదుపు చెయ్యడానికి ఇంజక్షన్ ఇవ్వండి. ఎప్పడైనా సరే, ఈ ప్రయత్నానికి ముందే ఇంజక్షన్ ని సిరంజి లోకి తీసుకుని సిద్ధంగా ఉంచుకోండి. ఇవ్వాల్సిన మందులు: డయాజిపామ్ 5 - 10 మి.గ్రా., ఇంజక్షన్ ని కండరం లోకి లేక వెయిన్ లోకి నెమ్మదిగా ఇవ్వండి; హాలో పెరిడాల్ 5 - 10 మి.గ్రా. ఇంజక్షన్ ని కండరం లోకి, క్లోర్ప్రోమజిన్ ఇంజక్షన్ ని, 25 - 50 మి.గ్రా. కండరం లోకి ఇవ్వండి.
ఎప్పుడు వేరే దగ్గరకు పంపాలి ?
హింసతో పాటు గందరగోళం ఉందని మీరు అనుమానిస్తున్నట్లయితే, అది మెదడుకు దెబ్బ తగలడం మూలాన లేక మెదడుకు సంబంధించిన వ్యాధివలన అయితే, అరోగ్య కార్యకర్తను తోడిచ్చి సామాన్య ఆసుపత్రికి పంపండి.
రోగిని అదుపు చెయ్యడమెలా ?
రోగిని కదలకుండడా గట్టిగా చేతులు పట్టుకోవడానికి చాలినంత మంది మనుషులు ఉండేలాగా చూచుకోండి. ఎప్పుడూ కూడా ముందే ఇంజక్షన్ మందును సిరంజీ లోకి తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి.
తరువాత ఏమి చెయ్యాలి ?
- మత్తుమందు ఇచ్చాక కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఏమి జరిగిందో చెప్పండి.
- అతనికి మెలకువ వచ్చేటప్పటికి, మళ్ళీ స్థిమితం లేకుండా ప్రవర్తించే అవకాశం ఉంది కనుక అతనికి బాగా పరిచయం ఉన్న ఎవరినైనా అతని దగ్గర ఉండమనండి.
- అతనికి మెలకువ వచ్చాక ఏమి జరిగిందో చెప్పి మాత్రల్ని తూసుకోవలసిన అవసరం గురించి వివరించండి.
- తినడానికి లేక తాగడానికి ఏదన్నా ఇవ్వండి.
- తరువాత సలహా, చికిత్స కోసం, ముఖ్యంగా నైకోసిస్ ఉన్నప్పుడు, మానసిక వైద్య నిపుణుడి దగ్గరకు పంపండి.
4.1. బాగా ఉద్రేకంగా ఉన్న వ్యక్తితో వ్యవహరించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు:
- మానసిక వ్యాధి ఉన్నవారు ‘సహజంగా’ హింసాత్మకంగా ఉండరు, అనేక విభిన్న కారణాలు మానసిక వ్యాధి ఉన్నవారు హింసాత్మకంగా మారడానికి దారితీస్తాయి.
- నైకోసిస్, మద్యం, మత్తు మందుల వ్యసనం, హింస ఉండే ముఖ్యమైన మానసిక వ్యాధులు.
- హింస దాదాపుగా అన్ని సారూ కుటుంబసభ్యులు, స్నేహితుల మీద ప్రభావం చూపుతుంది. కుటుంబసభ్యులకు, స్నేహితులకు కౌన్సిలింగ్ చెయ్యడాన్ని గుర్తుంచుకోండి, మీరు ఎందుకు, ఏమి చేస్తున్నారో వివరించండి.
- ఇతరుల భద్రత గురించి జాగ్రత్త వహిసూనే, మీ మొదటి ప్రాధాన్యం ఆ వ్యక్తిని రక్షించడం, అర్థం చేసుకోవడం, సహాయ పడడం అనాలి.
- ఉద్రేకంగా ఉన్న మానసిక వ్యాధిగ్రస్తుల్ని శాంత పరచడానికి, మందులు, అదుపు చేసే పద్ధతులు అవసరం.
గ౦దరగోళ౦లో ఉన్న లేక ఉద్రేక౦లో ఉన్న వ్యక్తి
గందరగోళంలో ఉన్న లేక ఉద్రేకంలో ఉన్న వ్యక్తులకు తమపరిసరాల గురించి తెలియదు. వారు వివేకంతో మాట్లాడరు, మీరు చెప్పేదాన్ని అర్థం చేసుకునే తెలివి ఉండదు. గందరగోళాన్ని సంధి అనికూడా అంటారు. గందరగోళంలో ఉన్న వ్యక్తి లక్షణాలు:
- మీరు ఆశించినంతగా ఆమెకు తన పరిసరాల గురించి ఎరిక ఉండదు.
- ఇటీవల జరిగిన విషయాలను ఆమె గుర్తుంచుకోలేక పోతుంది.
- ఆమెకు ఈరోజు ఏతేదీయో, ఏవారమో లేక తనెక్కడుందో తెలియదు.
- రాత్రి పూట ఆమె సరిగ్గా నిద్ర పోదు, పగలు మగతగా ఉంటుంది
- ఆమే దేనికి సహకరించదు లేక భయపడుతూ ఉంటుంది.
- ఆమే హాలుసినేషన్స్ లేక బ్రాంతులు ఉండొచ్చు, లేక అనుమానిస్తూ ఉండొచ్చు.
- ఆమే అస్థికరంగా లేక ఉద్రేకంగా ఉండొచ్చు.
గందరగోళం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం లేక సంబంధం లేని విషయాలు మాట్లాడడం ఒకటి కాదు. అస్పష్టత లేక అసంగత్వం ఉన్న వ్యక్తికి తన పరిసరాల స్పృహ ఉంటుంది. చుట్టూ ఏమి జరుగుతూందో తెలుస్తుంది. అస్పష్టత లేక అసంగత్వంకి ఉదాహరణలు తరువాత అధ్యాయాల్లో చర్చించబడినాయి. కాని ఒకొక్కసారి ఈ విభజన కష్టమవుతుంది. జాగ్రత్తగా ప్రశ్నించి, గమనించడం గందరగోళ స్థితిని గుర్తించడానికి కీలకం.
గందరగోళానికి, ఉద్రేకానికి కారణాలేమిటి ?
గందరగోళం, ఉద్రేకం అత్యవసర లేక కాజువాలిటీ మెడికల్, సర్టికల్ వార్డుల్లో కనపడే చాలా సామాన్యమైన సమస్యలు. వాటికి అతి సాధారణ కారణాలు:
- కొన్ని మందులకు, ముఖ్యంగా పెద్ద వయసు వారికి, కలిగే ఇబ్బందులు.
- మద్యం వ్యసనం ఉన్నవారికి దానిని మానే ప్రయత్నం చేస్తున్నప్పుడు.
- మెదడు వ్యాధి, ముఖ్యంగా స్ట్రోక్స్ లేక మెదడు రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం, తలకు దెబ్బ తగలడం, మూర్ఛవ్యాధి లేక ఇన్ఫెక్షన్స్.
- బాగా తీవ్రమైన జ్వరం, తీవ్రమైప ఇన్ఫెక్షన్స్, డీహైడ్రేషన్ లేక శరీరంలోని నీటిని కోల్పోవడం, ఎయిడ్స్ వ్యాధి, శ్వాస సంబంధమైన సమస్యలు మూత్ర పిండాలు, లివర్ లేక కాలేయ వ్యాధులు.
- మద్యం, మత్తుమందుల ప్రభావం.
- అకస్మాత్తుగా జరిగిన దుర్ఘటన తరువాత కలిగే అతి ఆందోళన లేక ఒత్తిడి,
ఈ సమస్యనెలా పరిష్కరించడం ?
కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని అడగ వలసిన ప్రశ్నలు :
- ఇది ఎలా ప్రారంభమయింది? గందరగోళం అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. కుటుంబం కలవర పడుతుంది కనుక రోగిని వెంటనే క్లినిక్ కి తీసుకొస్తారు.
- ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా? ఒకవేళ అలా వచ్చి ఉంటే బహుశా అది అనేక సార్లు వచ్చే స్ట్రోక్ లేక మద్యం వ్యసనం వల్ల అయుంటుంది
- ఇటీవల అతను కొత్త మందుల్ని వాడాడా? వాడి వుంటే ఏమి మందులు వాడాడు?
- ఈ మధ్య అతను శారీరక వ్యాధులతో బాధ పడుతున్నాడా? అతనికి స్ట్రోక్ లేక ఇతర గుండె వ్యాధి ఏమన్నా వచ్చిందా? ఈ మధ్య తలకు దెబ్బ తగిలిందా లేక ఫిట్ వచ్చిందా?
- అతనికి మద్యం లేక మత్తుమందుల వ్యసనం ఉందా? ఉంటే ఆఖరుసారి వాటిని ఎప్పుడు తీసుకున్నాడు?
- అతనీమధ్య బాగా నిద్రపోతున్నాడా? గందరగోళంతో పాటు సామాన్యంగా నిద్ర సమస్య కూడా ఉంటుంది.
గందరగోళం లేక ఉద్రేకంలో ఉన్న వ్యక్తిని అడిగే ప్రశ్నలు :
- మిమ్మల్ని పరిచయం చేసుకోవటంతో ప్రారంభించండి. మీరెక్కడున్నారో స్పష్టంగా చెప్పండి. (ఉదా. నా పేరు మరీనా, నేను నర్సుని. ఇది మీ గ్రామం ........ లో ఉన్న క్లినిక్)
- ఈ మధ్య మీకేమైనా సమస్యలు వచ్చాయా? అతని జవాబు ఈ మధ్య జరుగుతున్నవాటి గురించి అతనికి తెలుసో లేదో గ్రహించడానికి సూచననిస్తుంది.
- ఈరోజేమిటో చెప్పగలరా? నా పేరేమిటో చెప్పగలరా? ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పగలరా? ఈ ప్రశ్నలు ఆ వ్యక్తి తెలివిలో ఉన్నాడో, లేదో పరీక్షిస్తాయి.
- మీరీమధ్య మద్యాన్ని తాగుతున్నారా? తాగుతూంటే ఆఖరు సారి ఎప్పుడు తాగారు?
- మీ శరీరంలో ఎక్కడైనా నెప్పి ఉందా? ఎక్కడుంది? నెప్పి మెడికల్ వ్యాధికి చిహ్నమవొచ్చు.
- మీ భద్రత గురించి మీకు ఆందోళనగా ఉందా? ఇతరులు చూడ లేనివి మీరు చూడడం, ఇతరులు వినలేనివి మీరు వినడం జరుగుతూందా? అనుమానపు ఆలోచనలు, భ్రమలు ప్రత్యేకంగా గందరగోళానికి చిహ్నాలు.
ఇంటర్వ్యూ లో గమనించవలసిన విషయాలు :
- ఆ వ్యక్తి దృష్టి చంచలంగా అటూ ఇటూ పరిగెత్తుతూ వుంటుంది. ఉదాహరణకు, ఆమె మీ ప్రశ్నల మీద దృష్టి పెట్టదు, అడిగిన ప్రశ్నలకు వివేకంతో జవాబివ్వదు.
- ఆమెకు అవగాహనా లోపం ఉంటుంది. అది ఏ సమయం, మీరు ఎక్కడవున్నారు, మీపేరేమిటి మొదలైన వాటిగురించి తప్పులు చెప్తుంది.
- ఆమె మాట్లాడేది అర్థం చేసుకోవడం కష్టమవుతుంది, మాట్లడేదాన్లో అర్థం పర్థం వుండదు.
- ఆమెకు అసహజమైన లేక అనుమానాస్పదమైన నమ్మకాలు ఉంటాయి. (డెల్యూజన్స్).
- ఆమె తనతో తాను లేక ఒక ఊహాజనిత వ్యక్తితో మాట్లాడుతుంది.
- ఆమె ఊహాజనిత వస్తువుల్ని చూస్తున్నదని సూచించేలాగా ఆమె కదలికలు ఉండొచ్చు.
- ఆమె అస్థిరంగా లేక చంచలంగా ఉండొచ్చు.
- ఆమె భావోద్వేగాలు చాలా వేగంగా మారొచ్చు, కారణం లేకుండా అకస్మాత్తుగా నవ్వడం నుంచి ఏదవడం వరకు.
ఎప్పుడూ తప్పనిసరిగా ప్రాథమిక శారీరక పరీక్షలు చెయ్యండి. అవి:
- నాడి
- ఉష్ణోగ్రత
- రక్తపోటు
- మద్యం వాసన ఉందేమో చూడడానికి అతని శ్వాసను పరీక్షించండి.
- శారీరక అనారోగ్యాలు ఉన్నాయేమో, మఖ్యంగా పక్షవాతం (స్తోక్స్ వల్ల), గాయాలు, ముఖ్యంగా తలకి, కాళ్ళవాపులు, పచ్చకామెర్లు ఉన్నాయేమో చూడండి.
వెంటనే ఏమి చెయ్యాలి :
- వెంటనే మెడికల్ గా వైద్యం చెయ్యాల్సిన అత్యవసర పరిస్థితి ఏమీ లేదని నిర్ధారించుకోండి. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, స్ట్రోక్స్, తలకు దెబ్బలు, మద్యాన్ని మానే ప్రయత్నంలో వచ్చే ఫిట్స్ లాంటి బాధలు ఉన్నప్పుడు వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించాలి.
- సాధ్యమయితే, రోగిని వేరే గదిలో ఉంచండి. ఆరోగ్య కార్యకర్తను లేక బంధువునెవరినైనా రోగిని కనిపెట్టుకుని ఉండడానికి తోడుగా పెట్టండి. గదిలో మరీ ఎక్కువ చీకటి లేక మరీ ఎక్కువ వెలుగు ఉండగూడదు.
- ఏమి జరుగుతూందో కుటుంబానికి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి.
- ఆ వ్యక్తి ద్రవ పదార్ధాల్ని తగినంతగా తాగేలా చూడండి. ఒక వేళ డీహైడ్రేషన్ ఉన్నట్లయితే, వెయిన్ లేక సిర ద్వారా ద్రవాల్ని ఎక్కించడానికి సూదిని పెట్టండి. దీని ద్వారా అవసరమైనప్పుడు మందుల్ని కూడా ఇవ్వొచ్చు.
- రోగికి అతను ఎక్కడున్నాడో, ఇవాళ ఏరోజో, ఇప్పుడు టైమెంతో గుర్తు చేస్తూ ఉండండి.
- గందరగోళ పరిస్థితిలో ఉన్న కొంతమంది చాలా ఉద్రేకంతో వ్యవహరిస్తారు, తమను గాయపరచుకుంటారు, సెలైన్ వెళ్తున్న ఇంట్రావీనస్ ట్యూబును పీకేసుకుంటారు. అప్పుడు వారిని క్లినిక్ మంచం మీద బలవంతంగానైనా పడుకో బెట్టి అవసరమైతే మందులు ఇచ్చి శాంతపరచాలి. - డయాజిపామ్ 5 - 10 మి.గ్రా, కండరంలోకి ఇవ్వండి, రోజుకు 3 - 4 సార్లు ఈ ఇంజక్షన్ ని ఇచ్చి, కొంచెం సర్దుకున్నాక మాత్రల రూపంలో ఇవ్వొచ్చు. దీనికి బదులు హాలో పెరిడాల్, 2.5 - 5 మి.గ్రా. ఇంజక్షన్ ని కండరంలోకి రోజుకు 3 - 4 సార్లు ఇచ్చి కొంచెం మెరుగు పడ్డాక మాత్రలు ఇవ్వొచ్చు.
ఎప్పుడు పెద్ద ఆసుపత్రికి పంపాలి ?
గందరగోళ పరిస్థితి మెడికల్ ఎమర్జన్సీ లేక అత్యవసర పరిస్థితికి చిహ్నం, ముఖ్యంగా వృద్దులకు, చిన్నపిల్లలకు. త్వరగా ఆసుపత్రికి తరలించే వీలుంటే ఈ లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని వెంటనే అక్కడకు పంపాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, పైన వివరించినట్లుగా అనుసరించి, కొంచెం పరిస్థితి అదుపులోకి వచ్చాక అప్పుడు ఆసుపత్రికి తరలించాలి.
తరువాత ఏమి చెయ్యాలి?
- ఒకవేళ ఆ వ్యక్తి చాలా రకాల మందులు తీసుకుంటూ వుంటే భవిష్యత్తులో మందుల కారణంగా వచ్చే గందరగోళ పరిస్థితిని నివారించడానికి కొన్ని మందులు తగ్గించండి.
- ఆ వ్యక్తికి తాగుడు సమస్య వుంటే 6.1 విభాగంలో ఉన్న సూచనల్ని అనుసరించండి.
- ఒకవేళ ఆ వ్యక్తి వృద్ధుడయి గందరగోళం తగ్గాక కూడా అతనికి జ్ఞాపకశక్తి సమస్య ఉన్నట్లు మీరు గమనిస్తే 4. 7 విభాగంలో ఇచ్చిన సూచనల్ని అనుసరించండి.
4.2. గందరగోళ పరిస్థితిలో లేక ఉద్రేకంలో ఉన్న వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ర్తుంచుకోవలసిన విషయాలు
- గందరగోళ్ల పరిస్థితి లేక కన్ఫ్యూజన్ అంటే పరిసరాల స్పృహ లేకపోవడం.
- గందరగోళ పరిస్థితికి తరచుగా వుండే కారణాలు స్ట్రోక్స్, మెడికల్ వ్యాధులు, మెదడు ఇన్ఫెక్షన్లు, మందుల ప్రభావం వలన వచ్చే ఇబ్బందులు, మద్యం వ్యసనం ప్రభావం.
- గందరగోళ పరిస్థితి మెడికల్ ఎమర్జన్సీ లేక అత్యవసర పరిస్థితి కావొచ్చు, ఆసుపత్రిలో చేర్చవలసిన అవసరం ఉండొచ్చు.
- పెద్ద వయసువారికి గందరగోళ పరిస్థితి వచ్చే ప్రమాదం ఎక్కువ.
- గందరగోళ పరిస్థితికి కారణాన్ని గుర్తించి ఆకారణానికి చికిత్స చెయ్యడం, ఆవ్యక్తిని శాంతపరచి శ్రద్ధగా నర్సింగ్ సంరక్షణని ఇవ్వడం కీలకం. ఒకవేళ నర్సులు దొరకకపోతే బంధువునెవరినైనా సంరక్షించమనండి.
అనుమాన౦ ఉన్న వ్యక్తికి చాలా చుత్రమైన సమ్మకాలు ఉ౦టాయి, క౦ఠస్వరాల్ని వి౦టారు
కొన్నిసార్లు వ్యక్తులు ఇతరులు తమ గురించి మాట్లాడుకుంటున్నారని, తమకు హాని చెయ్యడానికి పధకం వేస్తున్నారని అనుకుంటారు. కొన్నిసార్లు ఈ ఆలోచన కొంచెంసేపు, ముఖ్యంగా వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఉంటుంది, ఇతర సమయాల్లో ఈ ఆలోచన చాలాసేపు ఉంటుంది, ఒక గట్టి నమ్మకంగా అయిపోతుంది. భయపడ నవసరంలేదని ఎంతనమ్మకంగా చెప్పినప్పటికి ఆమె చెడ మనిషి ఆమె పాపాలకు ఆ అనుమానపు ఆలోచనలు పోవు. ఆ ఆలోచనల్ని డెల్యూజన్స్ అని ఆమెకొక పాఠం నేర్పబడుతుంది. అంటారు. ఊహాజనితమైన వ్యక్తులు చెయ్యబోయే హానినుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది మీకు, వారి బంధువులకు కూడా అర్థం లేనివని అనిపించే ఇతర రకాల వింత విషయాల్ని నమ్ముతారు. ఉదాహరణకు, ఎవరో గ్రహాంతర వ్యక్తి తన ఆలోచనలకు అడ్డపడుతున్నాడని, లేక రేడియో, టెలివిజన్ తన గురించి వ్యాఖ్యలు చేస్తున్నాయని, తనకు మానవాతీత లేక ప్రత్యేక శక్తులు ఉన్నాయని నమ్ముతారు.
"స్వరాల్ని వినడం" అంటే ఏమిటి?
చుట్టు ప్రక్కల ఎవరూ లేనప్పుడు కూడా ఎవరో మాట్లాడుకుంటున్నట్లు వినపడడం. ఈ అనుభవాన్ని హాలుసినేషన్ అని అంటారు.
ఒకోసారి ఈ స్వరాలు చికాకు కలిగిస్తాయి. ఉదాహరణకు ఈ స్వరాలు ఆ వ్యక్తి గురించి చాలా అసహ్యమైన మాటలు మాట్లాడతాయి. ఒకోసారి ఈ స్వరాలు ప్రత్యక్షంగా ఆ వ్యక్తితో మాట్లాడతాయి, కొన్ని పనులు చెయ్యమంటాయి, తనకు తాను గాయం చేసుకోమని లేక ఇతరుల్ని గాయ పరచమని అంటాయి.
కొంతమందికి ఎందుకీ అనుభవాలు వుంటాయి?
ఈ అనుభవాలు సాధారణంకాదు. ఇవి తీవ్రమైన మానసిక వ్యాధులతో కలిసి వుంటాయి.
- షిజోఫ్రినియా, చాలాకాలంగా, 6 నెలల కంటే ఎక్కువ కాలం వ్యాధి ఉంటుంది.
- మానిక్ డిప్రెసివ్ వ్యాధి. అకస్మాత్తుగా వస్తుంది. ఇంతకు ముందు కూడా ఇలా వచ్చివుంటుంది.
- డ్రగ్ సైకోసెస్. కొన్ని మత్తుమందులను, ప్రేరణ కలిగించే మాత్రలు, కొకైన్ను అతిగా తీసుకోవడం వలన ఇవి వస్తాయి.
- గందరగోళస్థితులు, స్వల్పకాల సైకోసెస్. గందరగోళంగా, ఉద్రేకంగా ఉన్న వ్యక్తులు స్వరాల్ని కూడా వింటారు, అనుమానిస్తారు.
మామూలు వ్యక్తులకు ఇలాంటి అనుభవాలు కలుగుతాయా?
అవును. కొన్ని కమ్యూనిటీలలో కొంతమంది వ్యక్తులు తమకు అస్వాభావికమైన శక్తులు లేక ఆత్మలతో మాట్లాడగలిగే శక్తి ఉందని వాదిస్తారు. వీరు స్వరాల్ని ముఖ్యంగా దేవుడి లేక ఆత్మల స్వరాల్ని వింటారు. వారికి వింత నమ్మకాలు కూడా వుంటాయి, ఉదాహరణకు ఆత్మలు లేక దయ్యాలు ఒక ప్రత్యేక వ్యక్తి మీద కోపంతో ఉన్నాయని చెప్తారు. ఇవి ఆ ప్రత్యేక కమ్యూనిటీకి సహజమైన విషయాలే అవొచ్చు. అలాంటి వ్యక్తులకు ఉదాహరణలు కొన్ని సమాజాలలో ఉండే సంప్రదాయ వైద్యులు, కొన్ని చర్చిలలో ఆకర్షక శక్తిగల క్రీస్తు మతబోధకులు. కాని వీరు తమ ఆనుభవాల్ని తమ స్వంత ఆరోగ్యానికి లాభంచేకూర్చడానికి, వేదనలో ఉన్నవారికి సహాయ పడడానికి ఉపయోగిస్తారు తప్ప ఆరోగ్య కార్యకర్తలకు సహాయ పడడానికి వెళ్ళరు. ఈ అనుభవాల్ని వ్యాధిగా భ్రమపడ గూడదు. వ్యాధి అయితే అది ఆ వ్యక్తి జీవితం లేక అతని కుటుంబంపై ప్రభావాన్ని కలగ జేస్తుంది.
ఈ సమస్య నెలా సంబాళించడం?
కుటుంబాన్ని, స్నేహితుల్ని అడగవలసిన ప్రశ్నలు :
- ఇది ఎప్పుడు ప్రారంభమయింది? ఇది వ్యాధి అకస్మాత్తుగా ప్రారంభమయిందా అనేది తెలుపుతుంది, అకస్మాత్తుగా వస్తే అది మేనియా లేక స్వల్పకాల సైకోసెస్, దీర్ఘకాలం నుండి ఉంటే షిజోఫ్రినియాని సూచిస్తుంది.
- ఏమైనా వింత ప్రవర్తనల్ని గమనించారా? ఉదాహరణకు ఆ వ్యక్తి తనతో తాను మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నాడా?
- ఆ వ్యక్తి వింతగా మాట్లాడుతున్నాడా? ఉదాహరణకు మీరు అతనికి హాని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నాడా?
- అతను ఇటీవల మద్యం లేక మత్తు మందుల్ని ఉపయోగిస్తున్నాడా?
- అతను హింసాత్మకంగా ఉన్నాడా?
- కుటుంబంలో ఇంకెవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? షిజోఫ్రినియా, మానిక్ డిప్రెసివ్ వ్యాధి వంశపారంపర్యంగా రావచ్చు.
అనుమానిస్తున్న లేక వింత నమ్మకాలు ఉన్న వ్యక్తిని ప్రశ్నించడం :
- ఇటీవల మీరు ఒత్తిడికి గురవుతున్నారా? ఒకేసారి సూటిగా డెల్యూజన్స్ లేక హాలుసినేషన్స్ గురించి అడిగే బదులు ముందు ఏదో ఒక సాధారణ ప్రశ్నతో ప్రారంభించండి.
- మీ చుట్టూ ఏదో వింత జరుగుతూందని మీకు అనిపిస్తూందా? ఇతరులు మీ గురించి మాట్లాడుకుంటున్నట్లు మీకు అనిపిస్తూందా?
- ఎవరైనా మిమ్మల్ని గాయ పరచడానికి ప్రయత్నిస్తున్నారని మీకు అనిపిస్తూందా? ఈ ప్రశ్నలు డెల్యూజన్సీ ని గుర్తించడానికి సహాయపడతాయి.
- మిమ్మల్ని మీరు చంపు కోవాలనే ఆలోచనలు వస్తున్నాయా? సైకాటిక్ వ్యాధి ఉన్న వ్యక్తికి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఎక్కువ.
- మీరీమధ్య మద్యం లేక మత్తుమందుల్ని తీసుకుంటున్నారా?
ఇంటర్వ్యూలో చూడవలసిన విషయాలు :
- ఆ వ్యక్తి ఆకారం అతని స్వీయ సంరక్షణ గురించి తెలుపుతుంది.
- ఆమె తన చేతులు లేక శరీరాన్ని వింతగా కదిలిస్తుంది.
- ఆమె స్వరాల్ని వింటూందని సూచించే పనుల్ని చేస్తుంది. ఉదాహరణకు, ఎవరో తనతో అక్కడ నుండి మాట్లాడుతున్నట్లు అకస్మాత్తుగా భిన్నమైన ఆ దిశవైపు చూడడం.
- ఆమె మాటలు మీకు అర్థవంతంగా అనిపించకపోవచ్చు, మీ ప్రశ్నలకు జవాబులు సంబంధం లేనివిగా ఉండొచ్చు.
- ఆమె ఆపలేకుండా మాట్లాడుతూ ఉండొచ్చు లేక అసలే మాట్లాడక పోవచ్చు.
- కారణం లేకుండా ఆమె నవ్వుతుంది, ఏడుస్తుంది, తనతో తాను మాట్లాడుతుంది.
ప్రత్యేక ఇంటర్వ్యూకు సూచనలు :
- అసలే అనుమానంతో ఉన్న వ్యక్తితో చాలా సున్నితంగా వ్యవహరించాలి. మొదట సాధారణ ప్రశ్నల్ని అడగడం ద్వారా అతని నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నించడం లక్ష్యం కావాలి.
- అతని నమ్మకాలకు వ్యతిరేకంగా ఎప్పడూ వాదించవద్దు. ఉదాహరణకు, "హాస్యాస్పదంగా ప్రవర్తించకు. ఎవరూ నీతో మాట్లాడడం లేదు" అనకండి. మీకు హాస్యాస్పదంగా అనిపించిన అనుభవాలు అతనికి చాలా వాస్తవమనిపిస్తాయి.
- అతని విశ్వాసాల సారాన్ని అంగీకరించకండి, అతనిని వ్యతిరేకిస్తూ వాదించకండి, కాని అసంగతంగా ఉన్నవాటిని అంగీకరించనూ వద్దు.
ఏమి చెయ్యాలి?
- ఆ వ్యక్తి లక్షణాలు మెదడు లోని వ్యాధి ఫలితంగా వచ్చిన వని కుటుంబానికి వివరించండి.
- సరైన మందుల్ని వాడమని ఆ వ్యక్తిని ప్రోత్సహించండి. అతను తన నమ్మకాలు నిజమని నమ్ముతాడు కనుక ‘నీకు మానసిక వ్యాధి ఉంది కనుక నువ్వు మందులు వేసుకోవాలి' అని చెప్పడం వలన ప్రయోజనం లేదు. దానికి బదులు, అతని నమ్మకాల వలన అతను ఒత్తిడికి గురవుతున్నాడని, మందులు వేసుకోవడం వలన అతనికి ఆ ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుందని నమ్మకం కలిగించాలి.
- ఏంటీ సైకాటిక్ మందులు బాగా సహాయ పదతాయి, వీటిలో ఏవైనా ప్రయత్నించండి:
- హాలోపెరిడాల్, 5 - 10 మి.గ్రా. మాత్రలు రోజుకు రెండుసార్లు, నోటి ద్వారా.
- టైఫ్లోపిరజిన్, 5 - 10 మి.గ్రా. మాత్రలు రోజుకు రెండుసార్లు, నోటి ద్వారా.
- క్లోర్ప్రోమజిన్, 100 - 200 మి.గ్రా. మాత్రలు రోజుకు మూడు సార్లు, నోటి ద్వారా.
- చిన్న మోతాదుతో ప్రారంభంచండి, ఉదా. హాలోపెరిడాల్, 5 మి.గ్రా. మాత్ర రోజుకు ఒకటితో ప్రారంభంచండి.
- ఆ వ్యక్తి కుటుంబానికి మందుల వల్ల రాగల ఇబ్బందుల గురించి అవగాహన కలిగించండి, ఈ మందుల వలన
- వచ్చే ఇబ్బందులు, అకస్మాత్తుగా మెడ కండరాలు బిగిసిపోవడాన్ని లేక వణుకుల్ని తగ్గించడానికి ప్రోసైక్లిడిన్ లేక అలాంటి మరేదైనా మందును ఇవ్వండి.
ఎప్పుడు ఆసుపత్రికి పంపాలి ?
- ఆ వ్యక్తి గందరగోళ స్థితిలో ఉన్నాడని మీరు అనుమానిస్తున్నప్పుడు.
- ఆ వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్నప్పుడు; అనుమానంతో పాటు ఆత్మహత్య గురించి ఆలోచనలు ఉన్న వ్యక్తి తనకు తాను హాని కలిగించుకునే ప్రమాదం ఎక్కువ.
- ఆ వ్యక్తి హింసాత్మకంగా ఉంటే ముందు అతని ప్రవర్తనను అదుపు చేసాక పంపాలి.
- ఆ వ్యక్తికి బాగా తీవ్రమైన జ్వరం లేక తీవ్రమైన ఇబ్బందులు వస్తే.
తరువాత ఏమి చెయ్యాలి ?
- ఒక వారం తరువాత తిరిగి అతని పరిస్థితిని సమీక్షించడానికి అతనిని క్లినిక్ కి పిలవాలి. లక్షణాలు అదుపులోకి రాకపోతే మందు మోతాదును పెంచాలి.
- వీలయితే అతనిని ఒక నిపుణుల బృందం దగ్గరకు పంపాలి. సైకోసిస్ ఉన్నవారికి దీర్ఘకాలిక చికిత్స అవసరపడుతుంది.
- ఒకవేళ నిపుణుల బృందం అందుబాటులో లేకపోతే కుటుంబానికి, వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తికి వ్యాధిని అదుపు చేసుకోవడానికి సహాయ పడేందుకు దీర్ఘకాల ప్రణాళికను రూపొందించండి.
షిజోఫ్రినియా, ఇతర సైకాటిక్ వ్యాధులు కొన్ని సంవత్సరాలపాటు ఉండొచ్చు, కొంత అశక్తత, వైకల్యం ఉండొచ్చు. వారి సంరక్షణకు కొన్ని సూత్రాలు :
- సాధ్యమయితే ఆ వ్యక్తి సంరక్షణ కోసం ఒక ఆరోగ్య కార్యకర్తను కేటాయించండి. సైకోసిస్ అరుదుగా వచ్చే వ్యాధి కనుక కొన్ని కేసులకు మాత్రమే ఎక్కువ కాలం సంరక్షణ అవసరమవుతుంది.
- ఆ వ్యక్తిని ప్రతి రెండు నెలలకొకసారి కలవండి, లేక అతనినే క్లినిక్ కి రమ్మనండి. ప్రతిసారి కలిసినప్పుడు అతను మందులు సరిగ్గా వేసుకుంటున్నాడో, లేదో నిర్ధారించుకోండి.
- వ్యాధి గురించి, మందుల్ని విడవకుండా వేసుకోవలసిన అవసరం గురించి కుటుంబానికి అవగాహన కలిగించండి.
- దీర్ఘకాలిక సంరక్షణలో మందులు తప్పనిసరి భాగం. ప్రతిసారి అతనిని కలిసినప్పుడు మందుల్ని సరిగ్గా వేసుకుంటున్నాడో, లేదో నిర్ధారణగా తెలుసుకోండి.
- రీహాబిలిటేషన్, అతనికి ఉద్యోగం రావడానికి సహాయపడడం అతను బాగా ఉండడానికి తోడ్పడే కీలకమైన విషయం. అతని చదువు, ఇదివరకటి పని అనుభవం, వ్యాధి తీవ్రత మీద అతనికి ఏ ఉద్యోగం తగినదో ఆధారపడుతుంది.
- ఇంటి బయట పని చెయ్యడం సాధ్య పడకపోతే, ఇంటిపని, తోట పనిలో సహాయపడడం, అలయం లేదా చర్చి పనుల్లో పాల్గొనడం మొదలైన ఇతర వ్యాపకాల్ని కల్పించుకోవడానికి ప్రోత్సహించండి.
- మానసిక వ్యాధులు లేక వైకల్యాలు ఉన్న వారి సంరక్షణకోసం పనిచేసే సంస్థల దగ్గరకు పంపండి. కొన్ని ప్రదేశాల్లో సంస్థలు ఆ వ్యక్తి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ఇతరుల్ని కలుసుకోవడానికి వీలయేలాగా ఏర్పాట్ల చేస్తున్నాయి.
అనుమానిస్తున్న లేక వింత ఆలోచనలు ఉన్న వ్యక్తుల్ని సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు :
- అనుమానించడం, స్వరాల్ని వినడం తీవ్రమైన మానసిక వ్యాధి లక్షణాలు.
- అతి సాధారణ మానసిక వ్యాధులు, ష్కిజోఫ్రినియా, మానిక్ డిప్రెసివ్ డిజార్జర్ తీవ్రమైన సైకోసెస్ కూడా ఈ లక్షణాల్ని కలగజేస్తాయి.
- అటువంటి వారు కమ్యూనిటీలో వివక్షకు, నిందలకు గురవుతారు.
- ఏంటీ సైకాటిక్ మందులు ఈ వ్యాధులకు అత్యుత్తమ చికిత్స.
- ఒకవేళ కుటుంబం ఆ వ్యక్తిని సంప్రదాయంగా స్వస్థతపరచే వ్యక్తి దగరకు తీసుకు వెళ్ళాలనుకుంటే దానిని ప్రోత్సహించండి, కాని మీరు ఇచ్చే మందుల్ని కూడా వేసుకోమనండి.
- సాధ్యమయితే, మానసిక ఆరోగ్య బృందం దగ్గరకు ఈలక్షణాలు ఉన్న వ్యక్తుల్ని పంపండి.
ఆత్మహత్య గురి౦చి ఆలోచిస్తున్న లేక ఆత్మహత్యా ప్రయత్న౦ చేసిన వ్యక్తి
ఆత్మహత్య అంటే తన ప్రాణాన్ని తానే తీసుకోవడం. ఇలా ప్రయత్నం చేసిన వారిలో కొంత శాతం మంది మాత్రమే విజయాన్ని సాధిస్తారు. ఈ విభాగం ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్న లేక ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వారికి సహాయ పడేందుకు ఉద్దేశించినది. ఆమె తన ప్రాణాన్నెందుకు తీసుకోవాలనుకుంది అనేది తెలుసుకుని ఆమెకు సహాయ పడడం ఆరోగ్య కార్యకర్త కర్తవ్యం.
కొంతమంది ఎందుకు తమ ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటారు ?
మనలో చాలామందికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ‘చాలా కాలం బ్రతికాము, ఇంకచాలు.’ అనిపిస్తుంది. మీరు ఇంక బ్రతకొద్దని అనుకున్న కష్టమైన సందర్భాల గురించి ఆలోచిస్తే, ఈ బాధలతో మీ దగ్గరకు వచ్చే ఆ వ్యక్తి మనః స్థితికి కూడా ఇదే కారణాలున్నాయని బోధపడుతుంది. ఐతే ఒక పెద్ద తేడా ఉంది. మనలో చాలా మందికి ఆత్మహత్య గురించి ఆలోచనలు చాలా త్వరగా ఆగిపోతాయి, సామాన్యంగా ఇవి ఇటీవలే జరిగిన ఒక చెడు సంఘటనకు ప్రతిస్పందన మాత్రమే.
చాలా మందిమి స్నేహితులతో, లేక బంధువులతో మాట్లాడి, మన సమస్యలకు పరిష్కారాల్ని వెదికే ప్రయత్నంలో మన ప్రతికూల ఆలోచనలు ఆగిపోతాయి. కాని, కొంత మందికి, ఆత్మహత్య గురించిన ఆలోచనలు, ప్రయత్నాలు కొంత ఎక్కువ కాలం కొనసాగి మానసిక వ్యాధులు, బ్రతుకులో తీవ్రమైన కష్టాలతో కలిసి ఉంటాయి.
ఈ క్రింది మానసిక వ్యాధులు ఆత్మహత్యతో సంబంధం కలిగి ఉంటాయి :
వివాహబంధం సరిగ్గా లేనప్పుడు ఆమె తన బ్రతుకులో ఇంక ఏ ఆశా లేదని భావిస్తూ చనిపోతే మెరుగని అనుకుంటుంది
- డిప్రెషన్ :ఇది ఆత్మహత్యకు చాలా ముఖ్యమైన కారణం. డిప్రెషన్ వ్యక్తికి తీవ్రమైన దుఃఖాన్ని కలగజేస్తుంది, బ్రతుకు మీద ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది, భవిష్యత్తు మీద ఆశను చంపేస్తుంది.
- మద్యం, మత్తుమందుల దుర్వినియోగం : చాలామంది మద్యాన్ని మత్తుమందుల్ని హాయిగా ఉండడం కోసం తీసుకుంటారు, కాని అవి నిజానికి మెదడు మీద డిప్రెసెంట్స్ గా పనిచేస్తాయి. వ్యసనాన్ని మానలేక పోవడంతో కలిగే నిస్సహాయత, శారీరక వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, అతన్ని ఆత్మహత్యకు పురికొల్పుతాయి.
- దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు : చాలా నెప్పి ఉన్నప్పుడు, లేక అంతిమ దశలో బాధలు వచ్చినప్పుడు, రోగి ఎక్కువగా ఆత్మహత్య గురించి ఆలోచిస్తాడు.
- తీవ్రమైన మానసిక వ్యాధులు : సైకోసిస్ ఉన్న వ్యక్తులు ఆత్మహత్య ద్వారా తమ బ్రతుకును ముగించే ప్రమాదం ఉంటుంది. సాంఘిక, వ్యక్తిగత అంశాలు మానసిక వ్యాధిని కలగజేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఒక వ్యక్తి విచారానికి లోనయి, ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యడానికి కారణమైన ముఖ్య సాంఘిక అంశాలు:
- ఇతరులతో సంబంధాలలో, ముఖ్యంగా వివాహబంధంలో సంతోషం లేకపోవడం.
- దారిద్ర్యం, ఆర్థిక ఇబ్బందులు, ప్రత్యేకంగా, ఆ వ్యక్తి ఉద్యోగం పోవడం లాంటివి, అకస్మాత్తుగా జరిగినప్పుడు.
- ఆత్మీయులైన వ్యక్తులు మరణించినప్పుడు .
- తమ సమస్యలను, భావోద్వేగాలను పంచుకోవడానికి స్నేహితులెవరూ లేనప్పుడు.
- కౌమార బాలలు పరీక్ష తప్పినప్పుడు, ఇంటి దగ్గర తల్లిదండ్రులతో పోట్లాట జరిగినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడతారు.
జెండర్, ఆత్మహత్య
స్త్రీలు డిప్రెషన్, విచారాన్ని కలిగించే సాంఘిక ఒత్తిడులతో ఎక్కువ బాధపడతారు. ఆ విధంగా వారు ఆత్మహత్యా ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. కాని పురుషులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యల కారణంగా మరణిస్తారు. ఇది ముఖ్యంగా వృద్ధ పురుషులు, తాగుడు అలవాటు ఉన్నవారు, ఒంటరిగా జీవిస్తున్నవారు లేక సంతోషంగా లేని వివాహ బంధంలో ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. పురుషులు ఎక్కువ ప్రమాదకరమైన ఆత్మహత్యా పద్ధతుల్ని ఎంపిక చేసుకోవడం వారు తమ ప్రయత్నంలో సఫలమవడానికి కారణం. కాని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన స్త్రీలను వివక్షాపూరితంగా, చులకనగా చూస్తారు. పురుషులైనా, ఫ్రీలైనా ఆత్మహత్యా ప్రయత్నాలను తేలికగా తీసుకోవద్దు.
ఆ వ్యక్తిని సంబాళించడమెలా?
కుటుంబసభ్యుల్ని స్నేహితుల్ని అడగవలసిన ప్రశ్నలు :
- ఏమి జరిగింది? అది చాలా ప్రమాదకరమైన ప్రయత్నమా? ఎవరైనా ఉరి వేసుకుంటే లేక కీటక సంహారక మందుల్ని తాగితే, దానిని చాలా ప్రమాదకరమైన ప్రయత్నంగా పరిగణించాలి; అలాకాక తనచేతిమీద పెన్నుతో గీసుకుంటే, దానిని చాలా తేలిక ప్రయత్నంగా భావించాలి.
- ఇంతకు ముందు ఇలా జరిగిందా? ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నం చేసినవారు మళ్ళీ ప్రయత్నించే ప్రమాదం ఎక్కువ. అనేకసార్లు ఇలా ప్రయత్నించడం దీర్ఘకాలిక కష్టం లేక మానసిక వ్యాధి లక్షణం.
- ఇంతకు మునుపు మానసిక వ్యాధి లేక శారీరక వ్యాధి వచ్చిందా?
- ఈ మధ్య జీవిత భాగస్వామి నుండి విడిపోవడం లాంటి విచారకరమైన సంఘటన జరిగిందా?
ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని అడగవలసిన ప్రశ్నలు :
- ఏమి జరిగింది? మీ బ్రతుకును అంతం చేసుకోవాలనుకున్నారా? ఎందుకు?
- మీకొక పథకం ఉందా? ఎంతకాలం నుండి ఆ పథకాన్ని వేసుకున్నారు? మీ పథకం గురించి వేరే ఎవరితోనైనా చెప్పారా? జాగ్రత్తగా, రహస్యంగా పథకం వేసి చేసిన ప్రయత్నాలు ఎక్కువ ప్రమాదకరమైనవి.
- ఇప్పుడు మీకెలా ఉంది? చాలా మందికి తమ ప్రయత్నం మరణానికి దారితియ్యనందుకు ఉపశమనం కలుగుతుంది. అలా ఉపశమనం కలగని వారు మళ్ళీ ప్రయత్నించే ప్రమాదం ఉంది.
- ఈ మధ్య మీకు డిప్రెషన్ లేక కుంగుబాటు ఉంటూందా? మీకు బ్రతుకు మీద ఆసక్తి పోయిందా? డిప్రెషన్ని కనిపెట్టడానికి ఈ ప్రశ్నల్ని అడగండి.
- మీరు మరీ ఎక్కువ మద్యాన్ని తాగుతున్నానని (లేక మత్తుమందుల్ని తీసుకుంటున్నానని) అనుకుంటున్నారా ? తాగడం వల్ల వస్తున్న సమస్యల గురించి అడగండి.
- మీరు బ్రతకాలనుకోవటానికి కారణాలేమిటి? ఇది ఆ వ్యక్తి తన బ్రతుకులోని మంచి విషయాల గురించి ఆలోచించడానికి ప్రేరేపించే ముఖ్యమైన మార్గం. కొంతమంది తమ జీవితంలో ఏ ఒక్క సానుకూల అంశాన్నీ చూడలేనంత డిప్రెషన్ లో ఉంటారు. ఇది వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తుంది. దీని అర్థం ఇంక ఏ ఆశా లేదనికాదు!
మళ్ళీ ఆ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నాలు చేసే అవకాశాల్ని అంచనా వెయ్యడం :
మళ్ళీ ఆ వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడా, లేదా అనేది అంచనా వెయ్యడం చాలా కష్టం. మళ్ళీ ప్రయత్నాలు జరిగే ప్రమాదం ఉందని సూచించే అంశాలు:
- చాలా తీవ్రమైన, పథకం ప్రకారం, ఇతరులకు తెలియకుండా రహస్యంగా చేసే ప్రయత్నం, ఉరి వేసుకోవడంలాంటి ప్రమాదకర పద్ధతిని ఉపయోగించడం.
- ఆత్మహత్య తాలూకు ఆలోచనలు కొనసాగడం.
- భవిష్యత్తు గురించి ఆశ లేకపోవడం.
- తీవ్రమైన డిప్రెషన్ ఉందనే ఆధారం.
- బ్రతుకులో అనేక తీవ్రమైన కష్టాలు, ఆత్మీయుల్ని కోల్పోవడాలు.
- సాంఘిక ఆసరా లేకపోవడం.
- మద్యం దుర్వినియోగం లేక తీవ్రమైన శారీరక అనారోగ్యం.
- గతంలో జరిపిన ఆత్మహత్యా ప్రయత్నాలు.
- ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి పెద్ద వయసు ఉండడం.
ప్రత్యేక ఇంటర్వ్యూకు సూచనలు :
- ఆత్మహత్య చాలా సున్నితమైన, వ్యక్తిగతమైన విషయం. ఆ వ్యక్తితో ఏకాంతంగా మాట్లాడండి. ఆమె సౌకర్యంగా భావించడానికి, స్వేచ్చగా తన కారణాల్ని చెప్పడానికి కొంత సమయమివ్వండి.
- ఆమె శీలం గురించి తీర్పులు ఇవ్వకండి.
- ఆమే పరిస్థితి గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా ఓదార్పునిచ్చే వ్యాఖ్యలు చెయ్యకండి, ఎందుకంటే అది ఆమెనింకా నిరాశ కు గురి చెయ్యొచ్చు.
- ఆమె ఇటీవలి జీవిత స్థితి గురించి, ఆరోగ్యం గురించి ఆమె బంధువులు, స్నేహితులు ఏమి చెప్తారో తెలుసుకోవడానికి వారితో మాట్లాడండి. ఆమెకు ఇంటి దగ్గర సహాయ పడడానికి ఒక వ్యక్తితో మీరు నమ్మకమైన సంబంధాన్నేర్పరచుకోవలసిన అవసరం ఉంది.
వెంటనే ఏమి చెయ్యాలి ?
- ఆ వ్యక్తి తక్షణ ప్రమాదంలో లేకుండా చర్య తీసుకోవాలి. అతను ఎక్కువ మోతాదులో మాత్రల్ని లేక విషాన్ని తీసుకుంటే లేక తీవ్రమైన గాయాలు తగిలితే, మొదట అత్యవసర మెడికల్ చికిత్సను చెయ్యాలి. (కింద చూడండి).
- ఆత్మహత్యా ప్రయత్నం తరువాత కొన్ని గంటల వరకు ఆ వ్యక్తితో కూడా బంధువు, స్నేహితుడు లాంటి ఎవరో ఒకరు తోడు ఉండాలి.
- అతను మళ్ళీ తనకు హాని చేసుకునే ప్రమాదం ఉంటే బంధువుల్ని అతనితో సమయాన్ని గడపమని, అతనిని ఒంటరిగా ఒదలొద్దని చెప్పండి.
- విషాలు, కత్తి లాంటి ప్రమాదకర వస్తువులేవీ అతనికి అందుబాటులో లేకుండా చూడండి.
- ఇంటికి పంపేలోగా అతను తిరిగి ప్రశాంతంగా అవడానికి సమయమివ్వండి.
- అతనిని కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని కలవడానికి తప్పనిసరిగా క్లినిక్కి రమ్మని చెప్పండి, లేక మీరు అతని ఇంటికి వెళ్ళి కలవడానికి ఏర్పాటు చెయ్యండి.
తరువాత ఏమి చెయ్యాలి ?
- ఆమె పరిస్థితి మెరుగు పడేదాక, ఆమె సమస్యలను అదుపు చేసుకోగలిగేంతవరకు, ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని కౌన్సిలింగ్లో పాల్గొనేలాగా చెయ్యండి.
- ఆమె డిప్రెషన్ కి లోనయేలా చేస్తున్న సాంఘిక అంశాలను గుర్తించండి.
- ఆమెకు డిప్రెషన్ ఉన్నా లేక మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటున్నా దానికనుగుణంగా చికిత్స చెయ్యండి
- డిప్రెషన్ మందులతో చికిత్స ఫలితం కనబడడానికి 3 - 4 వారాలు పడుతుంది. ఈలోపు కౌన్సిలింగ్, కుటుంబ ఆసరా అవసరం.
- ఆత్మహత్యా ప్రయత్నం చేసే చాలా మంది తమ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు, వాటి గురించి ఆలోచించాలి. సమస్యా పరిష్కారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- డిప్రెషన్ ఉన్న వ్యక్తులు జీవితాన్ని వ్యతిరేక భావంతో చూస్తారు. అదే పరిస్థితిని సానుకూలంగా చూసే మార్గాల్ని సూచించండి.
ఎప్పుడు వేరే వారి దగ్గరకు పంపాలి ?
ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని ఈ క్రింది పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు మానసిక వైద్య నిపుణుడి దగ్గరకు పంపాలి:
- ఆత్మహత్యా ప్రయత్నం తీవ్రమైనది, ప్రాణాపాయం కలిగించేది అయినప్పుడు.
- కౌన్సిలింగ్ చేసాక కూడా ఆత్మహత్య గురించిన ఆలోచనలు విడవకపోతే.
- సైకోసిస్ లాంటి తీవ్రమైన మానసిక వ్యాధి ఉన్నప్పుడు.
- మళ్మీ మళ్ళీ ఆత్మహత్యాప్రయత్నం జరిగినప్పుడు.
ఆత్మహత్యా ప్రయత్నాలకు మెడికల్ చికిత్స
సాధారణ నిబంధన ఏమిటంటే దగ్గరలో ఆసుపత్రి ఉన్నప్పుడు తరువాత వైద్య సహాయం ఆవసరమవుతుంది కనుక సమయం వృథా కాకుండా ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని ఆసపత్రికి తరలించాలి.
ఉరేసుకోవడం, కత్తితో పొడుచుకోవడం, తుపాకి గాయాలు, లోతుగా చీలికలు లేక కాలిన గాయాలు.
ఇవి తీవ్రమైన వైద్య పరమైన అత్యవసర పరిస్థితులు. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి నిరీక్షిస్తూండగా అతని శ్వాస, రక్తపోటు, నాడిని గమనించండి. రక్తపోటు తక్కువగా ఉంటే, వెయిన్ ద్వారా నార్మల్ సెలైన్ ఎక్కించండి. అక్సిజన్ పెట్టండి. గాయం తెరుచుకుని ఉంటే దానిని శుభ్రపరచి రక్తస్రావాన్ని ఆపడానికి గట్టిగా ఒత్తే బాండేజిని కట్టండి.
క్రిమిసంహారక మందు లేక ఇతర పదార్థాల అధిక మోతాదు
ఇది తనకు తాను హాని కలిగించు కోవడానికి చేసే సాధారణ పద్ధతి. ఆ వ్యక్తి మెలకువగా ఉంటే వాంతి చేయించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా వాంతి వచ్చేలా చెయ్యొచ్చు :
- బాగా ఉప్పు నీటిని తాగించడం.
- ఇపెకాకువానా అనే వాంతి వచ్చేలా చేసే చూర్ణం సిరప్ ని ఒక టేబిల్ స్పూన్ తాగించడం.
- చార్కోల్ లేక బొగ్గు పొడిని ఇవ్వండి, అది విషాన్ని పీలుస్తుంది.
- విషాన్ని తీసుకున్న చిహ్నాలు, పక్షవాతం, స్పృహ లేకపోవడం, ఫిట్స్ లేక శ్వాస తీసుకోవడానికి కష్టపడడం, బాగా ఎక్కువగా ఉంటే, వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించండి.
ఆత్మహత్య నేరమైనప్పుడు
కొన్ని సమాజాల్లో ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యడం నేరం, ఆత్మహత్య చట్టపరంగా పోలీస్ కేస్ అవుతుంది. మీరు మొదట శ్రద్ధ చూపవలసింది ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి మీద, ఒకవేళ అతనికి బాగా ఆసరానిచ్చే కుటుంబం వుండి, చిన్న ఒత్తిడిని కలిగించే సంఘటన కారణంగా ఇలాంటి ప్రయత్నం జరిగితే పోలీసులకు చెప్పకుండా వుండే నిర్ణయం తీసుకోవచ్చు. కాని, ఆత్మహత్యా ప్రయత్నం ఇంటి దగ్గర జరుగుతున్న తీవ్ర వేధింపులు లేక సమస్యలకు చిహ్నం కావొచ్చు. భర్త చావగొట్టడం, అత్తమామలు విపరీతంగా తిట్టి వేధించడం వలన ఆమె ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చు. మొదట ఆమెతో మాట్లాడి, అప్పుడు పోలీస్ కి తెలపడం సహాయకారిగా ఉంటుంది. బాగా తీవ్రమైన కేసుల్లో, శరీరాన్ని తగల బెట్టుకోవడం ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించడాన్ని కొంచెం లోతుగా పరిశోధిస్తే అది హత్యగా తేలడం కొత్తేమీ కాదు. ఇవి కష్టమైన సందర్భాలు, వీటి గురించి మీ సహోద్యోగులతో చర్చించాలి. మీకు పోలీస్ తో సాదర పరిచయాలు గనక వుంటే పద్ధతి ప్రకారం కేసు రిజిష్టర్ చెయ్యకుండా, కేవలం సమాచారాన్ని వారికి తెలపొచ్చు.
కుటుంబానికి ఆసక్తి లేకపోతే ఏమి చెయ్యాలి?
అతనికి ఆసరా కోసం, ముఖ్యంగా, ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వెంటనే మొదటి కొద్ది రోజులు, మీరు అతని కుటుంబం మీద ఆధార పడవలసి ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో సంఘర్షణ లేక హింస వంటే లేక కుటుంబానికి ఆసక్తి లేకపోతే, మీరు ఇతర ప్రత్యామ్నాయాల గురించి అలోచించాలి. ముందుగా ఈ ప్రత్యామ్నాయాల గురించి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తితో చర్చించాలని గుర్తుంచుకోండి. తరువాత ఈ క్రింది వాటిలో ఒకటి లేక ఎక్కువ వాటిని ఆచరించండి.
- ఒక మహిళా బృందం లేక ఇలాంటి వారికి ఆశ్రయమిచ్చే షెల్టర్ హోమ్స్ కి ఆమెను పంపండి. మహిళా బృందం లేక షెల్టర్ హోమ్స్ వారితో మాట్లాడి వారామెకు తాత్కాలికంగా ఆశ్రయాన్ని ఇవ్వగలరేమో అడగండి.
- ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఉదాహరణకు ఆమె అత్తమామలు ఆమెను వేధిసూంటే ఆమె తల్లిదండ్రులు లేక ఇతర బంధువులతో మాట్లాడండి.
- స్నేహితులు, ఇరుగు పొరుగువారు, మత సమూహ సభ్యులతో మాట్లాడండి.
- మతనాయకుల్ని కలవమని, లేక వారితో మాట్లాడమని ఆ వ్యక్తిని ప్రోత్సహించండి.
మళ్ళీ మళ్ళీ ... ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే, లేక ఆత్మహత్యా ప్రయత్నం చేసే వ్యక్తి
ఈ తరహా వ్యక్తుల్నే అత్యవసర వైద్య విభాగానికి మళ్ళీ మళ్ళీ తీసుకు వస్తారు. అలాంటి వారిని ఇష్టపడక పోవడం సులభం, ఎందుకంటే ఆత్మహత్యా ప్రయత్నాలు ప్రమాదకరమైనవి కావు, వారు కేవలం నటిస్తున్నారని, మీ సమయాన్ని వృథా చేస్తున్నారని మీకు అనిపించడం సహజం. కాని, వారు నటించడం లేదు, వారి బ్రతుకులు దుఃఖభాజనంగా ఉన్నాయి. వారికి సహాయం అవసరం. వారికి కౌన్సిలింగ్ కావాలి. ఆ కౌన్సిలింగ్ వారిని విచారకరమైన సంఘటనలకు ఆత్మహత్య కాకుండా ఇతర రకాలుగా ప్రతిస్పందించేలా చెయ్యాలి. బలాన్నిచ్చే అంశాల్ని గుర్తించడం, ఆసరానిచ్చే బంధం, వృత్తినైపుణ్యాలు ఆ వ్యక్తి బ్రతుకు తాలూకు కాంతి కోణాల్ని చూడడానికి సహాయ పడతాయి. అలాంటి వ్యక్తులు తమను తాము చంపుకునే ప్రమాదం ఎక్కువ వుంటుందని గుర్తుంచుకోండి. వారికి సహాయ పడడానికి ఉత్తమ మార్గం వారితో క్రమం తప్పకుండా తరచుగా మాట్లాడుతూ వుండడం, నమ్మకమైన బంధాన్ని ఏర్పరచుకోవడం, దానితో వారు కష్టమొచ్చినప్పుడు ప్రాణం తీసుకోవడం కాక మీతో తమ కష్టాన్ని పంచుకుని తేలిక పడతారు
ఒంటరితనం, వేరుగా ఉండడం
ఒంటరితనం సాధారణంగా డిప్రెషన్, ఆత్మహత్య కారణంగా వస్తుంది. ఇది వృద్దుల్లో మరింత ఎక్కువ. ఆ వ్యక్తికి కొన్ని పరిష్కారాలు :
- ఈ మధ్య ఆ వ్యక్తి మాట్లాడని లేక రాకపోకలు లేని బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని పలకరించడం, కలవడం.
- బంధువులు, స్నేహితుల్ని భోజనానికి లేక ఏదైనా సాంఘిక వేడుకకు ఆహ్వానించడం.
- క్లబ్బులు లాంటి కమ్యూనిటీ వనరుల్ని ఉపయోగించడం.
- ఒంటరిగా ఉన్నప్పుడు తోటపని, నడవడం లాంటి ఉత్తేజాన్నిచ్చే లేక సంతోషం కలిగించే పనులకు సమయాన్ని వెచ్చించడం.
ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని సంబాళించే సమయంలో గుర్తుంచుకోవలసినవి
- ఆత్మహత్యకు కారణం డిప్రెషన్ లేక మద్యం వ్యసనం లాంటి మానసిక వ్యాధులు.
- ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తులకు జీవితంలో వైవాహిక లేక ఆర్థిక కష్టమేదో ఉంటుంది.
- ఆత్మహత్య సంబంధ ఆలోచనలు దీర్ఘకాలిక లేక తీవ్రమైన శారీరక వ్యాధి కారణంగా కూడా వస్తాయి.
- ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా తేలిగ్గా తీసుకోవద్దు.
- ఎవరినైనా ఆత్మహత్య తాలూకు ఆలోచనల గురించి అడిగితే ఆది వారు ప్రాణం తీసుకునే ప్రమాదాన్ని ఎక్కువ చెయ్యదు. అందుకు విరుద్ధంగా చాలా మంది ఎవరికో ఒకరికి చెప్పుకోవడం వలన మనసు తేలిక పడినట్లు భావిస్తారు.
- ఆత్మహత్యా ప్రయత్నానికి అత్యవసర చికిత్స మొదటి ప్రాధాన్యం. ఆ వ్యక్తి కుదుట పడి మెడికల్గా నిలకడగా ఉన్నాక, అప్పుడు ఏ మానసిక వ్యాధికైనా చికిత్స చెయ్యండి. అతనికి ఆసరానివ్వగల బంధువుల్ని స్నేహితుల్ని గుర్తించండి.
ఫిట్స్ వస్తున్న వ్యక్తి
ఫిట్స్ వస్తే ఒక వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది లేక కొన్ని నిమిషాల పాటు స్పృహను కోల్పోతాడు. కొన్ని ఫిట్స్ లో శరీరమంతా అటూ ఇటూ కదిలి మెలి తిరిగి పోతుంది, స్పృహతప్పి పోతారు. కొన్ని ఫిట్స్ లో పూర్తిగా లేక పాక్షికంగా మెలకువలో ఉంటారు. ఒకేఒక్క మార్పు చాలా కొద్ది సేపు వాస్తవ ప్రపంచం తెలియక పోవడం, లేక పెదాల్ని కొరుక్కోవడం లాంటి పనుల్ని పదే పదే చెయ్యడం. మూర్చ వ్యాధిలో ఫిట్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి. నెలలో కనీసం రెండు సార్లు ఫిట్స్ వస్తే అది మూర్చ వ్యాధి అని నిర్ధారణ చెయ్యొచ్చు.
ఏ రకాల ఫిట్స్ ఉన్నాయి?
పెద్దవాళ్ళకు వచ్చే ఫిట్స్ చిన్నపిల్లలకు వచ్చే ఫిట్స్కి భిన్నంగా ఉంటాయి. చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్ గురించి వేరే దగ్గర వర్ణించబడింది. (డి వి సి). పెద్దవాళ్ళలో మూడు రకాల ఫిట్స్ గుర్తించబడినాయి.
- సాధారణ ఫిట్స్ : ఈ ఫిట్స్ లో (గ్రాండ్మాల్ లేక మేజర్ ఎపిలెప్సీ అని కూడా అంటారు) కొన్ని నిమిషాల పాటు ఆ వ్యక్తి స్పృహను కోల్పోతాడు. అతని శరీరం బిగిసిపోయి మధ్య మధ్యలో అకస్మాత్తుగా కుదుపు లతో శరీరం కదిలిపోతుంది. ఈ ఫిట్స్ తో పాటు నాలిక కొరుక్కోవడం, తెలియకుండా మూత్రం పోసుకోవడం, అకస్మాత్తుగా పడిపోవడం లేక కుదుపుల వల్ల గాయాలవడం ఉంటాయి. అతను పడిపోయే ముందు ఏడవడాన్నిలేక పెద్దగా అరవడాన్ని కళ్ళు పైకి తిరగడాన్ని నోటి నుండి నురగ రావడాన్ని శరీరం నీలంగా అవడాన్ని లేక పాలిపోవడాన్ని అతన్ని చూచిన వాళ్ళు గమనిస్తారు. ఫిట్స్ వస్తున్నప్పుడు అతనికి పూర్తిగా స్పృహ ఉండదు, ఎవరేమి చెప్పినా స్పందన ఉండదు. ఫిట్ తగ్గాక మత్తుగా ఉండడమో, నిద్ర పోవడమో జరుగుతుంది. కొంతమందికి తాత్కాలికంగా కాళ్ళల్లో బలముండదు.
- పాక్షిక ఫిట్స్ : ఇవి మెలకువగా ఉన్న లేక గందరగోళంలో ఉన్న, లేక చుట్టు ప్రక్కల ఏమి జరుగుతూందో తెలియని వ్యక్తి కి వస్తాయి. ఫిట్స్ చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని శరీరంలో ఏదో ఒక భాగంలో వస్తాయి, ఉదాహరణకు, ఒక చేతిలో కుదుపుల్లాంటి కదలికలు. ఇతర రకాలలో పెదాలు కొరుక్కోవడం, చొక్కా గుండీలు పెట్టుకోవడం, విప్పడం లాంటి చిత్రమైన ప్రవర్తనలు ఉంటాయి. చాలా మందికి ఫిట్ రాబోతూందనే ఒక హెచ్చరిక లేక 'ఆరా’ అనుభవంలోకి వస్తుంది. ఆరా కు ఉదాహరణలు, పొట్టమీద ఏదో అసహజంగా ఉన్నట్లు భావన, అసహజమైన వాటిని చూడడం, వినడం, వాసన చూడడం. కొంతమందికి ముందు పాక్షిక ఫిట్ వచ్చి తరువాత పూర్తి స్థాయిలో ఫిట్ వస్తుంది.
- 'హిస్టిరికల్’ లేక 'కన్వర్షన్’ ఫిట్స్ : ఇవి చిన్న వయసు స్త్రీలలో ఎక్కువగా వస్తాయి, మానసిక ఒత్తిడి వల్ల వస్తాయి. పైన చెప్పిన ఏ నమూనా ఫిట్స్ లోనూ ఇవి ఇమడక పోవడం వీటి ప్రత్యేకత.
మూర్ఛ మానసిక వ్యాధా?
మూర్చ మానసిక వ్యాధి కాదు. మెదడులోని విద్యుత్ తరంగాల్లోని మార్పుల వలన ఇది వస్తుంది. కాని చాలా సంస్కృతుల్లో మూర్చ అతిప్రకృతికమైన లేక అస్వాభావికమైన శక్తులు లేక మంత్రగాడి మూలాన వచ్చిందని, ఇది కొన్ని రకాల మానసిక వ్యాధుల లాంటిదేనని నమ్ముతారు. పాక్షిక ఫిట్స్ లో వింత ప్రవర్తనలను గమనించవచ్చు. మూర్ఛ వ్యక్తి మీద చాలా ఒత్తిడిని కలగజేస్తుంది. చాలామంది మూర్ఛ రోగులకు భావోద్వేగ సమస్యలు వస్తాయి. వీరికి డిప్రెషన్, సైక్రోసెస్, ఆత్మహత్యకు సంబంధించిన ప్రవర్తనలు సాధారణం. పెద్దవాళ్ళకు వచ్చే కన్వర్షన్ ఫిట్ అనే ఒక రకం సైకలాజికల్ లేక మానసికమైనది. మూర్చ వ్యాధి ఉన్న వారి మానసిక ఆరోగ్య అవసరాలను నిర్లక్ష్యం చెయ్యగూడదు
ఫిట్స్ కి ముఖ్యమైన మెడికల్ కారణాలు
కొంతమందిలో ఏదో ఒక మెడికల్ సమస్య వలన మూర్చ వస్తుంది. అవి :
- తలకు దెబ్బలు తగిలి లోపల రక్తస్రావం జరిగితే;
- మద్యం అలవాటు నుండి బయట పడే ప్రయత్నంలో.
- మెదడుకు ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్, టేప్ వార్మ్, మలేరియా, క్షయ, స్లీపింగ్ సిక్ నెస్.
- ఎయిడ్స్, వైరస్ ప్రత్యక్ష ఇన్ఫెక్షన్ లేక పరోక్షంగా ఫంగస్ ఇన్ఫెక్షన్ లేక ట్యూమర్లు లేక కణితులు.
- మెదడులో కణితులు.
- రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం.
- తీవ్రమైన లివర్, మూత్ర పిండాల వ్యాధులు.
ఈ సమస్య ఉన్నవారిని సంబాళించడమెలా?
చాలా పరిస్థితులు ఫిట్స్ లాగా కనపడతాయి కనుక అసలేమి జరిగిందో స్పష్టంగా తెలియడం చాలా ముఖ్యం. ఫిట్ వచ్చినప్పుడు చూచిన వారు ఫిట్ ఏ విధంగా వుందో చేసిన వర్ణన, ఫిట్ వచ్చిన వ్యక్తి చెప్పిన తన అనుభవంకు సంబంధించిన సమాచారం మీకు వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించడానికి అవసరమవుతుంది.
ఫిట్స్ కి శోష రావడానికిడానికి తేడా:
- ఫిట్స్ అకస్మాత్తుగా వస్తుంది, శోషరావడం క్రమేపీ జరుగుతుంది.
- శోష రావడంలో తెలివి తప్పడం లేక స్పృహను కోల్పోవడం కొద్ది సెకన్ల మాత్రమే, ఫిట్లో కనీసం కొన్ని నిమిషాలపాటు ఉంటుంది.
- మెలి తిరిగిపోవడం (కుదుపులతో కదలడం) శోషలో చాలా అరుదు, కాని ఫిట్స్ లో సర్వసాధారణం.
- నాలుకను కొరుక్కోవడం, నోటి దగ్గర చొంగ కారడం, తెలియకుండా మూత్రం పోసుకోవడం, శరీరం నీలంగా అవడం ఫిట్స్ లో మాత్రమే ఉంటుంది.
- శోష తరువాత వ్యక్తి త్వరగా కోలుకుంటాడు, కాని ఫిట్స్ తరువాత మగతగా వుంటాడు, తలనెప్పి గందరగోళం వుంటాయి.
హిస్టీరికల్ ఫిట్స్ కి, మూర్చ ఫిట్స్ కి మధ్య తేడా:
- మూర్చ ఫిట్ ఇంతకు ముందు వర్ణించిన వాటిలో ఏదో ఒక పద్ధతిలో వస్తుంది, కాని హిస్టీరికల్ ఫిట్కి ఒక పద్దతి లేదు, ఎలాబడితే అలా వస్తుంది, చాలా భిన్నమైన రకాలుగా ఉంటుంది
- శరీరం నీలంగా అవడం, నాలుకను కొరుక్కోవడం, నోటి దగ్గర చొంగ కారడం, తనకు తాను గాయాల్ని చేసుకోవడం, తెలియకుండా మూత్రం పోసుకోవడం, మూర్ఛ వ్యాధికి మాత్రమే ఉండే లక్షణాలు, ఇవి హిస్టీరికల్ ఫిట్స్ కి ఉండవు.
- హిస్టీరికల్ ఫిట్ వచ్చినవారు ఎప్పుడూ స్పృహను కోల్పోరు. ఒకవేళ స్పృహ లేనట్లనిపించినా, వారిని సౌకర్యంగా వుంచేందుకు చేసే ప్రయత్నాల్ని అడ్డు కుంటారు, ఇది వారు మెలకువలోనే వున్నారని సూచిస్తుంది.
- కొన్నిసార్లు అదే వ్యక్తికి రెండు రకాల ఫిట్స్ రావచ్చు. అలాంటి సందర్భాలలో అది ఏరకం ఫిట్ అనేది నిర్ణయించడంలో చాలా జాగ్రత్త వహించాలి.
ఫిట్ వచ్చిన వారిని సంరక్షించడంలో ఈ క్రిందివి పాటించండి :
- ముందు నిర్ణయించ వలసింది అది శోష అవునా, కాదా.
- తరువాత, అది కన్వర్షన్ ఫిట్ అవునా, కాదా.
- ఒకవేళ అది మూర్ఛ ఫిట్ ఐతే, అది మొదటిసారా అనేది తెలుసుకోవాలి. ఒకే ఒక్కసారి రావడం అరుదేమీకాదు. ఉదాహరణకు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వ్యక్తికి ఫిట్ వచ్చి, మళ్ళీ ఎప్పుడూ రాకపోవచ్చు.
- ఫిట్ వచ్చినప్పుడు గమనించిన వ్యక్తిని, ఫిట్ వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి ఏరకం మూర్చ వ్యాధి వచ్చిందో నిర్ధారణ చెయ్యాలి.
- వ్యక్తి వయసును తెలుసుకోండి. చాలా మంది మూర్చ రోగులకు మొదటి ఫిట్ 30 సంవత్సరాల వయసులోపు వస్తుంది. తరచుగా మూర్చ వ్యాధికి కారణం తెలుసుకోవడం కష్టం (ముఖ్యంగా 40 ఏళ్ళ వయసు తరువాత), మెడికల్ సమస్య వలన ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో చాలా వ్యాధులకు జ్వరం, తలనెప్పి లాంటి ఇతర లక్షణాలు ఉంటాయి, కాని కొన్నిసార్లు ఫిట్ ఒక్కటే ఏకైక లక్షణం కావచ్చు.
వెంటనే ఏమి చెయ్యాలి ?
అత్యధిక ఫిట్స్ వాటంతటవే ఆగిపోతాయి. అందుచేత మీరేమీ చెయ్యనప్పటికీ ఫిట్స్ తరువాత వ్యక్తి పూర్తిగా కోలుకుంటాడు. ఫిట్ వచ్చినప్పుడు మీ లక్ష్యం అతనికి లేక ఆమెకు గాయాలవకుండా కాపాడడం. ఇవి చెయ్యండి:
- సాధ్యమైతే, ఆమెను ఒక ప్రక్కకు తిప్పండి.
- ఆమె నోట్లోకి బలవంతంగా ఏ వస్తువునూ దోపకండి.
- ఆమెను పట్టుకోవడానికి, ఆపడానికి ప్రయత్నించకండి.
- మందులు తీసుకోమని, మంచి నీటిని తాగమని బలవంత పెట్టకండి.
- ఫిట్ 5 నిమిషాలకంటే ఎక్కువ సేపు ఉంటే, డయాజిపామ్ లేక ఫినొబార్బిటోన్ ఇంజక్షన్ ఇవ్వండి.
- ఫిట్ వచ్చి తగ్గాక ఆమెకు నిద్ర రావచ్చు. మెలకువ వచ్చాక ఆమెను ఓదార్చండి
- ఆమె పూర్తిగా స్పృహలోకి వచ్చాక చెయ్య వలసిన అతి ముఖ్యమైన విషయం ముందు వర్ణించినట్లుగా ఆమెను జాగ్రత్తగా అంచనా వెయ్యడం.
ఎప్పుడు వేరే చోటుకు పంపాలి ?
పద్ధతి ప్రకారం ఫిట్స్ వచ్చిన ప్రతి ఒక్కరినీ కనీసం ఒక్కసారి మానసిక వైద్యపరంగా అరుదైన వ్యక్తి పరీక్షించాలి, న్యురాలజిస్ట్ లేక సైకియాట్రిస్ట్ అయితే మేలు. 30 సంవత్సరాల వయసు తరువాత మొదటి ఫిట్ వచ్చిన వారికి ఇది మరీ ముఖ్యం. మూర్ఛ వ్యాధిని కలగజేసే వ్యాధి ఏదీ ఆ వ్యక్తికి లేదని నిర్ధారించడానికే వారు పరీక్ష చెయ్యడం. మూర్ఛ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే, అతను చాలా కాలం మందులు వాడాలి, కొన్ని పనులు చెయ్యగూడదు గనుక వ్యాధి నిర్ధారణ సవ్యంగా జరిగిందని మీకు నమ్మకం ఉండాలి. నిపుణులైన వైద్యులు ఇ ఇ జి (మెదడులోని విద్యుత్ తరంగాలు సక్రమంగా ఉన్నదీ, లేనిదీ తెలిపేది), లేక సి.టి. లేక ఎమ్.ఆర్.ఐ. స్కాన్స్ (మెదడుకు తీసే ప్రత్యేక ఎక్స్రేలు) లాంటి పరీక్షల్ని చెయ్యగలరు. వ్యాధి గురించి అవగాహన కలిగించడం, జీవన శైలిలో మార్పులు , మందుల్ని వాడడం మూర్ఛవ్యాధి చికిత్సలో కీలకమైన విషయాలు.
ఫిట్స్ ఆగనప్పుడు: స్టేటస్ ఎపిలిప్టికస్
ఇది శిక్షణ పొందిన వ్యక్తులు చికిత్స చెయ్య వలసిన తీవ్రమైన మెడికల్ ఎమర్జన్సీ ఈ పరిస్థితిలో నిరంతరాయంగా, దాదాపుగా అసలు విడుపే లేకుండా, మధ్యలో స్పృహ రాకుండానే ఒకదాని తరువాత మరొకటి ఫిట్స్ వస్తూనే ఉంటాయి. చికిత్స చెయ్యకుండా వదిలేస్తే, కొంతమంది చనిపోయే ప్రమాదం వుంది, లేకపోతే తీవ్రంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎమర్జన్సీ వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే, మరణాన్ని తీవ్రమైన బాధల్ని ఈ క్రింది విధంగా నివారించగలరు:
- కృత్రిమ పళ్ళను తొలగించి ప్లాస్టిక్ ఎయిర్వే ను పెట్టి శ్వాసకు ఆటంకం లేకుండా చూడాలి.
- 100 మి.గ్రా. థయమిన్ ని, తరువాత 50 శాతం గ్లూకోజ్ (డెక్స్ట్రోజ్)ని వేగంగా వెయిన్ లోకి ఇవ్వాలి.
- 10 మి.గ్రా, డయాజిపామ్ ని నెమ్మదిగా, ఇంట్రావీనన్ గా ఇవ్వాలి. (రెండు నిమిషాలకు పైగా)
- సుమారుగా 5 నిమిషాలు ఆగండి.
- ఫిట్స్ రావడం కొనసాగుతూ ఉంటే ఇంట్రావీనస్ డ్రిప్ పెట్టండి.
- డయాజిపామ్ ని నిమిషానికి 5 మి.గ్రా, చొప్పున మొత్తం 20 మి.గ్రా. కు మించ కుండా ఫిట్స్ ఆగేవరకు ఇవ్వాలి.
- శ్వాస వేగాన్ని జాగ్రత్తగా గమనించండి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏమైనా కలిగితే డయాజిపామ్ ని ఇవ్వడం ఆపండి.
- అప్పటికీ ఆగకుండా ఫిట్స్ వసూంటే ఫినిటాయిన్ ని ఇంట్రావీనస్ గా, నిమిషానికి 50 మి.గ్రా, చొప్పున మొత్తం 1000 మి.గ్రా. లకు మించకుండా ఇవ్వండి.
- ఫిట్స్ తగ్గగానే స్పెషలిస్ట్ సహాయం తీసుకోండి.
మూర్ఛ వ్యాధి రోగికి, అతని కుటుంబానికి సలహా
- మూర్ఛ వ్యాధి దీర్ఘకాలం వుండే వ్యాధి, చాలా సంవత్సరాలు మందులు అవసరమవుతాయి,
- మూర్ఛ వ్యాధి మంత్రగత్తెల వలన, అసాధారణ శక్తుల వల్ల వచ్చే వ్యాధి కాదు.
- మూర్ఛ వ్యాధి చికిత్సలో మందుల్ని విడవకుండా శ్రద్ధగా వేసుకోవడం కీలకం.
- కొన్ని సర్దుబాట్లు చేపకోవడం ద్వారా మామూలుగా జీవించవచ్చు. వారు వివాహం చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు. చాలా రకాల ఉద్యోగాల్ని మామూలుగా చెయ్యొచ్చు.
- మూర్ఛ వ్యాధి ఉన్నవారు వాహనాల్ని నడపగూడదు (కనీసం ఫిట్స్ ఒక సంవత్సరం పాటు లేకుండా ఉండేవరకు, మందుల్ని వాడుతూనే ఉంటూ). ఒంటరిగా ఈత కొట్టగూడదు, బరువు యంత్రాలతో, లేక వాటి దగ్గర పని చెయ్యరాదు.
- మూర్ఛ వ్యాధి ఉన్నవారు తమ జీవన శైలిని ఈ క్రింది విధంగా మార్చుకోగలరు
- సక్రమంగా నిద్ర
- సక్రమంగా ఆహారం
- మద్యం తాగడం మీద ఖచ్చితమైన పరిమితులు
- మరీ ఎక్కువ వ్యాయామం చెయ్యకుండా వుండడం
- ఒత్తిడి, అకస్మాత్తుగా ఉద్రేకం, ఆందోళనని కలిగించే పరిస్థితుల్ని నివారించడం
మూర్ఛ వ్యాధికి మందుల్ని ఎలా వాడడం ?
- మందు ధర, మూర్ఛ వ్యాధి రకాన్ని బట్టి సరైన మందును ఎంపిక చేసుకోండి.
- మందును తక్కువ మోతాదుతో మొదలు పెట్టండి. మందు మొదలు పెట్టాక ఎన్ని సార్లు ఫిట్స్ వచ్చాయి అనేది లెక్కించండి.
- మందుల వల్ల ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా అనేది తెలుసుకోవడం ద్వారా మందు ఎలా పని చేస్తున్నదీ తెలుసుకోవచ్చు. దానికనుగుణంగా మోతాదును మార్చండి
- ఒక వేళ ఫలితం కనబడకపోతే, మోతాదును వాడగలిగినంత అత్యధిక స్థాయికి పెంచండి.
- అప్పటికీ ఫలితం కనపడకపోలే, మరొక మందును కూడా వాడండి లేక నిపుణుల దగ్గరకు పంపండి.
మూర్ఛ వ్యాధి ఉన్నవారికి మందును ఇవ్వడం
- మూర్ఛ వ్యాధి రకాన్ని బట్టి తగిన మందును ఎంపిక చెయ్యాలి. పెద్దవారిలో రెండు రకాల మూర్ఛ వ్యాధులకు సాధారణంగా సురక్షితం గానూ, ప్రభావశీలంగానూ పని చేసే క్లోర్ప్రోమజిన్ ని ఇవ్వండి. సోడియం వాట్ర్పోయేట్ మరొక సురక్షితమైన మందు. సామాన్య మూర్ఛ వ్యాధికి ఫినిటాయిన్, ఫినోబార్బిటోన్ బాగా ఉపయోగపడతాయి.
- మందును చాలా కాలం వాడాలి కనుక దాని వెల, దానివల్ల రాగల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని మందును ఎంపిక చెయ్యాలి. వెల పెద్ద అడ్డంకి కాకపోతే క్లోర్ప్రోమజిన్ ని, సోడియం వాట్ర్పోయేట్ ని ఇవ్వండి. వెల అడ్డంకి ఐతే ఫినోబార్బిటోన్ ని ఇవ్వొచ్చు.
- ఒక సమయంలో ఒకే ఒక్క మందును వాడండి. చిన్న మోతాదుతో మొదలు పెట్టండి, రోజుకు వాడవలసిన సగటు మోతాదుకు చేరే వరకు క్రమేపీ మోతాదును పెంచండి.
- ఒకవేళ ఫలితం లేకుండా ఫిట్స్ వస్తూనే వుంటే, వాడగలిగిన అత్యధిక స్థాయి వరకు మోతాదును పెంచండి. ఒకవేళ ఇబ్బందులు వస్తూంటే ఇంక అంతకు మించిన మోతాదులో మందును ఇవ్వకండి.
- చికిత్సను అజమాయిషీ చెయ్యడానికి, సాధ్యమయితే రక్తంలో మందు స్థాయిని పరీక్షించండి.
- మందు మోతాదును పెంచేలోగా జీవన శైలిలో మార్పుల గురించి అవగాహన కలిగించండి.
- ఒకవేళ ఫిట్స్ మరీ ఎక్కువ తరచుగా, లేక ఆగకుండా వసూంటే, తక్కువ మోతాదులో మరొక మందును కూడా మొదలు పెట్టి అవసరమైతే తరువాత మోతాదును పెంచండి.
- కనీసం రెండేళ్ళ పాటు ఫిట్స్ రాకుండా వుంటే తప్ప మందుల్ని మానకండి; మందుల్ని అకస్మాత్తుగా ఎప్పుడూ మానకండి; క్రమేపీ మోతాదును తగ్గిస్తూ, ఉదాహరణకు మొత్తం మోతాదులో నెలకు ఒక పావు వంతున తగ్గిస్తూ నెమ్మదిగా ఆపండి.
- డిప్రెషన్, సైకోసెస్ లాంటి మానసిక వ్యాధులకు ఇతర వ్యాధులకు చికిత్స చేసినట్లే చెయ్యండి.
4.7. ఫిట్ వచ్చిన వ్యక్తిని సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు :
- ప్రవర్తనలో మార్పు లేక స్పృహ తప్పడం అకస్మాత్తుగా వచ్చి, స్వల్పకాలం వుండడాన్ని ఫిట్ అని అంటారు.
- మూర్ఛ వ్యాధి సామాన్యంగా 30 ఏళ్ళ వయసు లోపు వస్తుంది; 30 ఏళ్ళ దాటాక మొదటిసారి ఫిట్ వస్తే అతనికి తీవ్రమైన మెదడు వ్యాధి, లేక మరేదైనా మెడికల్ వ్యాధి వుందని గ్రహించి వెంటనే నిపుణులదగ్గరకు పంపాలి.
- ఫిట్ వస్తున్న వ్యక్తిని ఎప్పుడూ కూడా పట్టుకుని బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకండి.
- క్రమం తప్పకుండా మందును వాడవలసిన అవసరం గురించి చెప్పండి, వాహనాలు నడప గూడదని, బరువు యంత్రాలతో పని చెయ్యగూడదని, మద్యాన్ని త్రాగ గూడదని ఆ వ్యక్తికి అవగాహన కలిగించండి.
- మూర్చ వ్యాధి ఉన్నవారికి డిప్రెషన్, చివరకు సైకోసెస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
- ఫిట్స్ తగ్గడానికి వాడే మందును మొదలు పెట్టే ముందు నిపుణుడికి చూపించండి. ఒకవేళ ఇది సాధ్య పడకపోతే, మూర్ఛవ్యాధిని నిర్ధారించే విధానం, మందులతో చికిత్సా విధానం గురించి ఈమాన్యువల్లో ఇచ్చిన మార్గదర్శక సూచనల్ని పాటించండి.
ప్రసవ౦ తరువాత మానసిక౦గా విచలితురాలయ్యే తల్లి
చాలామంది తల్లలకు బిడ్డను కనడం సంతోషదాయకమైన సానుకూల అనుభూతి. చాలా సంతోషంతో, ఉత్సాహంతో నవ జాత శిశువును ఆహ్వానిస్తారు. కాని కొంతమంది తల్లలు మానసికంగా విచలితులవుతారు. ప్రసవం తరువాత మూడు రకాల మానసిక సమస్యలు రావచ్చు.
- 'బూస్' : ఇది సాధారణంగా బిడ్డ పుట్టాక వారం లోపు వచ్చే మానసిక సమస్య తల్లి చాలా దుఃఖ పడుతూ, కన్నీళ్ళు పెట్టుకుంటూ వుంటుంది. హానిలేని ఈ పరిస్థితి కొద్ది రోజుల పాటు వుండి, తరువాత తగ్గిపోతుంది.
- డిప్రెషన్ : ఇది ఏ ఇతర పరిస్థితుల్లోనైనా వచ్చే డిప్రెషన్ ని పోలి వుంటుంది. ఇది బిడ్డ పుట్టాక నెల రోజులు దాటాక బయట పడుతుంది. తల్లికి అలసటగా అనిపిస్తుంది, నిద్రా సమస్యలు వస్తాయి, కారణం లేకుండా కన్నీళ్ళ కారుస్తుంది, తనమీద, తన బిడ్డ మీద ఆసక్తిని కోల్పోతుంది. చికిత్స చెయ్యక పోతే 12 నెలలకు మించి వుంటుంది.
- సైకోసిస్ : ఇది చాలా తీవ్రమైన మానసిక వ్యాధి. ఇది గందరగోళ పరిస్థితిని పోలి వుంటుంది. అదృష్టవ శాత్తు ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. ప్రసవమయాక రెండు వారాల్లోపు లక్షణాలు బయటపడతాయి. చాలా త్వరగా పరిస్థితి దిగజారుతుంది, ఆమెకు వాస్తవ ప్రపంచ స్పృహ ఉండదు, చాలా అస్తవ్యస్తమైన ఆలోచనలు వస్తాయి, భ్రమలు కలుగుతాయి. చికిత్స చెయ్యకపోతే ఆమే చాలా నెలల పాటు అనారోగ్యంగా ఉంటుంది.
ప్రసవం తరువాత కొంతమంది తల్లలు ఎందుకు విచలితులవుతారు?
ప్రసవం తరువాత కొంతమంది తల్లులు విచలితులవడానికి చాలా కారణాలుంటాయి :
- అదనపు పని, ఉదా. పాపాయిని సాకడం.
- గాఢమైన భావోద్వేగ ప్రాధాన్యత ఉన్న ఘట్టం బిడ్డను కనడం, అలాంటివి డిప్రెషన్ ని ప్రేరేపించవచ్చు.
- తల్లి స్వేచ్చను కోల్పోవడం.
- తల్లిదండ్రుల మధ్య బంధం మారొచ్చు.
- సంస్కృతి పరమైన అంశాలు, ఉదా. ఆడ పిల్ల పట్టడం లాంటి నిరాశకు గురిచేసే విషయాలు.
- ప్రసవంలో తల్లి శరీరంలో అనేక శారీరక, హార్మోన్ పరమైన మార్పులు కలుగుతాయి. ఇవి మానసిక అస్థిరతకు దారితీస్తాయి.
- సంతోషం లేని వైవాహిక జీవితం వున్న స్త్రీలకు లేక కష్టపు కాన్పులయిన వారికి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. ప్రసవం మానసిక సమస్యను కలగజేసినట్లుగానే మానసిక సమస్యవున్న స్త్రీలు గర్భవతులవవచ్చు.
4.8. మానసిక సమస్య ఉన్న ఫ్రీ గర్భవతి అయినప్పుడు :
మానసిక సమస్య ఉన్న ప్రీలు గర్భవతులయినప్పుడు గర్భంలో ఉన్న బిడ్డ మీద వ్యాధి ప్రభావం పడుతుందేమోనని కుటుంబ సభ్యులు కలవరపడతారు. మానసిక వ్యాధులు "ఇన్ఫెక్షన్స్" కాదని, బిడ్డ మీద వాటి ప్రభావం ఉండదని నమ్మకంగా చెప్పాలి. కొంతమంది వ్యాధి జెనెటిక్ గా బిడ్డలకు సంక్రమంచే ప్రమాదం ఉందా అని అడుగుతారు. బాగా తీవ్రమైన సైకోసెస్ తప్ప మిగతా వ్యాధులకు ఆ ప్రమాదం ఉండదు. తీవ్రమైన మానసిక వ్యాధులు ఉన్న తల్లి, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండక పోవడం కంటే ఆరోగ్యంగా ఉండే అవకాశమే ఎక్కువ. మానసిక ఎదుగుదల సక్రమంగా లేని తల్లలకు కొంచెం ఎక్కువ సమయాన్ని వెచ్చించి వారి శరీరాలకు ఏమవుతూందో తెలియ జెప్పాలి.
మరొక ముఖ్యమైన అంశం బిడ్డపై మానసిక వ్యాధి గ్రస్తురాలు వాడుతున్న మందుల ప్రభావం. ఒక సామాన్య నిబంధనగా మొదటి మూడు నెలల గర్భం సమయంలో సైకియాట్రిక్ మందుల్ని ముఖ్యంగా సైకోసిస్ ని, ఆందోళన తగ్గించే మందుల్ని వాడగూడదు. డిప్రెషన్ ని తగ్గించే మందులు కొంత వరకు సురక్షితమే. బిడ్డకు పాలిచ్చే సమయంలో అనవసరంగా మందుల్ని వాడగూడదు. వాస్తవంగా ఈ మందులు తల్లిపాల ద్వారా బిడ్డకు చేరడం అరుదు. తల్లి వికలంగా, లేక డిప్రెషన్ లో ఉంటే, మందులు ఆమె మూడ్ ని మెరుగు పరుస్తాయని గుర్తుంచుకోండి. ఇది మళ్ళీ బిడ్డతో ఆమె బంధాన్ని పటిష్టం చేస్తుంది, అది ఆమెకు, ఆమె బిడ్డకు కూడా మంచిది.
తల్లి మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యం?
బిడ్డలు పుట్టాక తల్లలకు భావోద్వేగ పరమైన ఆసరా తక్కువగా ఉంటుంది. అందరి శ్రద్ద, ముఖ్యంగా కుటుంబం శ్రద్ధ బిడ్డ అవసరాలు, ఆరోగ్యం మీదే ఉంటుంది. ఇతరులు ఏమనుకుంటారో ననే బిడియంతో తల్లి తను విచారంగా ఉన్నట్లు చెప్పదు. అందుచేత మీరు తల్లి భావోద్వేగాలు, మూడ్ పట్ల ప్రత్యేమైన స్పందన కలిగివుండాలి. ప్రసవం తరువాత వచ్చే మానసిక వ్యాధి ఒక సంవత్సరంపాటు ఉండొచ్చు. ఇది తల్లిని, బిడ్డను కూడా ప్రభావితం చెయ్యొచ్చు. బిడ్డ ఎదుగుదల, అభివృద్ధిలో లోపాలు రావొచ్చు.
ఈ సమస్యను పరిష్కరించడమెలా?
భర్తను, బంధువుల్ని అడగవలసిన ప్రశ్నలు :
- మీరు ఎప్పుడు సమస్యను గుర్తించారు? ప్రసవం తరువాత వచ్చే భిన్నమైన మానసిక సమస్యలు బిడ్డ పుట్టాక భిన్నమైన సమయాల్లో వస్తాయి.
- మీరు ఆశించిన విధంగా ఆమె బిడ్డను సాకుతూందా? తీవ్రమైన వ్యాధుల్లో తల్లి బిడ్డమీద ఆసక్తిని కోల్పోతుంది.
- ఆమె చాలా ఎక్కువగా ఏడుస్తూందా? ఇది ప్రసవానంతర డిప్రెషన్ కి ఆనవాలు.
- ఆమె వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోయినట్లనిపిస్తూందా? ఆమె తనతో తాను లేక ఊహాజనిత స్వరాలతో మాట్లాడుతూందా? అలా గనక ఉంటే అది సైకోసిస్ అయే ప్రమాదం ఉంది.
- ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా? ఇంతకు మునుపు ఇతర సమయాల్లో వచ్చిన వారికి తీవ్రమైన ప్రసవానంతర డిప్రెషన్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
- అమె ఆత్మహత్య గురించి మాట్లాడుతోందా? బిడ్డను గాయ పరచడం గురించి మాట్లాడుతోందా? ఇవి వ్యాధి చాలా తీవ్రంగా వుందని సూచించే చిహ్నాలు.
తల్లిని అడిగే ప్రశ్నలు :
ప్రసవానంతరకాలంలో తల్లి రాత్రిలో ఎప్పుడు పడితే అప్పుడు బిడ్డకు పాలివ్వడానికి, పక్క బట్టలు మార్చడానికి లేవవలసి వస్తుంది, ఇది తల్లికి నిద్ర సరిగ్గా లేకుండా చేస్తుంది, అలసటకు గురయేలా చేస్తుంది. డిప్రెషన్ కి ఉండే శారీరక లక్షణాలు, అలసట, నిద్రా సమస్యలు డిప్రెషన్ లేని వారికి కూడా వుండొచ్చు. అందువల్ల భావ, ఆలోచన పరమైన లక్షణాలు తరచుగా డిప్రెషన్ ని గుర్తించడానికి ముఖ్యంగా సహాయ పడతాయి. డిప్రెషన్ ని కనుగొనడానికి ఇలాంటి ప్రశ్నల్ని అడగండి :
- మీకు విచారంగా లేక సంతోషమే లేనట్లుగా వుందా?
- మీకు భవిష్యత్తుపై ఆశ వుందా?
- మీకు మీరు హాని చేసుకోవాలనిపిస్తుందా?
- బిడ్డను చూచి మీకు సంతోషం కలుగుతూందా?
ఆమెకు సైకోసిస్ వుందని మీరు అనుమానిస్తూంటే ఈ ప్రశ్నల్ని అడగండి :
- మీ ఆలోచనల్ని నియంత్రించుకోవడం కష్టంగా వుందా?
- ఇతరులు మీ గురించి మాట్లాడుకుంటున్నారని, మీకు హాని చెయ్యబోతున్నారని మీకు అనిపిస్తూందా?
- మీకు అసాధారణమైన శక్తులు ఉన్నాయి లాంటి అసామాన్యమైన ఆలోచనలు వస్తున్నాయా?
- మీ పాపాయికి హాని చెయ్యాలనే ఆలోచన వస్తూందా?
- ఎవరూ చుట్టూ లేనప్పుడు కూడా మీకు స్వరాలు వినిపిస్తున్నాయా?
“బూస్" కి ఏమి చెయ్యాలి ?
- ప్రసవం తరువాత భావోద్వేగ కలవరం మామూలేనని, తాత్కాలిక మేననీ తల్లితోనూ, ఆమె బంధువులతోనూ చెప్పండి.
- ఆ కొద్ది రోజుల పాటు పాపాయిని సాకడానికి తల్లికి సహాయ పడమనండి.
- తల్లికి సరిపడా విశ్రాంతి అవసరం.
- తల్లితో మాట్లాడండి, ఆమె కలవరాల్ని బాధల్ని మీతో పంచుకోనివ్వండి.
- ఒక వారం రోజుల్లో ఆమె పరిస్థితి మెరుగు పడకపోతే, ఆమెను దగ్గరగా గమనించండి, ఎందుకంటే అది మరింత తీవ్రమైన మానసిక వ్యాధిగా పరిణమిస్తూ ఉండొచ్చు.
ప్రసవానంతర డిప్రెషన్ కి ఏమి చెయ్యాలి ?
- సాధారణ భావోద్వేగ వ్యాధికి ఉండే లక్షణాలే ఆమెకు ఉన్నాయని తల్లికి, ఆమె బంధువులకు నమ్మకం కలిగించాలి. దీనిని చికిత్సతో తగ్గించవచ్చు, తల్లి మీద, బిడ్డ మీద దీర్ఘకాలిక దుష్ప్రభావమేమీ ఉండదు.
- ఆమె పిచ్చిదయి పోవడం లేదని ఆమెకు నమ్మకం కలిగించాలి.
- బిడ్డను సాకడంలో ఆమెకు సహాయపడమని ఆమె భర్తకు, బంధువులకు చెప్పాలి.
- ఆమె లక్షణాల గురించి, కలవరాల గురించి తల్లితో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండాలి.
- ఆమెకు శ్వాస వ్యాయామాల్ని నేర్చండి, రోజుకు రెండుసార్లు వాటిని చెయ్యమని చెప్పండి.
- ఆమెకు సరిపడా ఆహారం, విశ్రాంతి లభించేలా చూడండి.
- ఆమె బిడ్డతో ఆడుకోవడానికి, బిడ్డకు తన పాలను ఇవ్వడానికి ప్రోత్సహించండి.
- ఆమెకు నిద్ర సమస్య తీవ్రంగా ఉంటే, లోరజిపామ్, లేక నైట్రజిపామ్ లాంటి నిద్ర మాత్రను ఇవ్వండి.
- ఒక వారంలో డిప్రెషన్ తగ్గకపోతే, లేక ఆత్మహత్యా భావాలు కలుగుతూ ఉంటే డిప్రెషన్ ని తగ్గించే మందుల్ని వాడవచ్చు. ప్రసవం తరువాత ఫ్లోక్సటిన్ 20 మి.గ్రా. మాత్రను రోజుకొకటి చొప్పున 6 నెలల పాటు సురక్షితంగా ఇవొచ్చు.
ప్రసవానంతర సైకోసిన్ కి ఏమి ఎయ్యాలి ?
- తల్లిని కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచవలసి రావచ్చు. ఆమెను మానసిక వైద్య నిపుణుడి దగ్గరకు లేక సమీపంలో ఉన్న మానసిక వ్యాధుల చికిత్సకు అవకాశం ఉండే ఏ ఆసుపత్రికైనా పంపండి.
- వ్యాధిని నియంత్రించడానికి ఏంటీ సైకాటిక్ మందుల్ని ఇవ్వండి హాలో పెరిడాల్, రోజుకు 5 - 10 మి.గ్రా. లేక ఇతర మందులను ఇవ్వండి. (అధ్యాయం 11) రాత్రి నిద్ర మందును ఇస్తే ఆమెకు సరిపడా విశ్రాంతి దొరుకుతుంది.
- తల్లి ఏంటీసైకాటిక్ మందుల్ని తీసుకుంటూంటే బిడ్డకు పాలివ్వగూడదని కుటుంబానికి సలహా ఇవ్వండి. తల్లికి నెమ్మదించేదాకా బంధువు ఎవరైనా బిడ్డను జాగ్రత్తగా సంరక్షించాలి.
- తల్లి తనబిడ్డతో ఎంత సమయం గడపాలనుకుంటే అంత సమయాన్ని అనుమతించండి. ఆమె కోలుకునే కొద్దీ క్రమేపీ ఆమె తన విధుల్ని తాను నిర్వర్తించేలాగా ప్రోత్సహించండి.
- మందుల్ని కనీసం 6 వారాల పాటు వాడండి.
ఎప్పుడు వేరే దగ్గరకు పంపాలి?
మానసిక వైద్యనిపుణుడి దగ్గరకు రోగిని ఈక్రింది సందర్భాలలో పంపాలి:
- ఆమెకు సైకోసిస్ లక్షణాలు కనపడితే.
- ఆమెకు కుటుంబ ఆసరా లేకపోతే.
- ఆమె బిడ్డకు హాని చెయ్యబోతే.
తరువాత ఏమి చెయ్యాలి?
- ఆమె పరిస్థితి మెరుగు పడేదాకా తల్లిని క్రమం తప్పకుండా చూడండి. ఆమె మందుల్ని తీసకుంటూంటే, మందుల్ని ఆపేదాకా కనీసం రెండు వారాలకొకసారి చూడండి.
- ఆమెకు మరొక బిడ్డ ఉన్నట్లయితే ఆస్త్రీ మానసిక ఆరోగ్యాన్ని శ్రద్ధగా గమనించండి. ప్రసవానంతర మానసిక ఆరోగ్య సమస్యలు తరువాత ప్రసవాలలో మళ్ళీ రావచ్చు.
4.9. ప్రసవం తరువాత వచ్చే మానసిక సమస్యలు ఉన్న తల్లల్ని సంరక్షించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు :
- ప్రసవం తరువాత తల్లలకు డిప్రెషన్, సైకోసిస్ రావచ్చు.
- ప్రసవం తరువాత డిప్రెషన్ రావడం సాధారణం. వైవాహిక జీవితం లేని లేక కష్టపు కానుపులయిన తల్లలకు ఇదింకా సాధారణం.
- తల్లలు సంతోషంగా వుండాలని, బిడ్డల సంరక్షణను చెయ్యాలని అందరూ ఆశిస్తారు కనుక వారు తమ ప్రతికూల భావాల్ని భావోద్వేగాల్ని వేరెవరితోనూ పంచుకోరు.
- చాలామంది తల్లలకు కౌన్సిలింగ్, ఏంటీ డిప్రెసెంట్ మందులతో సహాయం చెయ్యొచ్చు.
- ప్రసవం తరువాత వచ్చే సైకోసిస్కి నిపుణుల క్లినిక్ లో మంచి వైద్యం లభిస్తుంది. అది దొరకక పోతే తల్లికి ఏంటీసైకాటిక్ మందులతో చికిత్స చెయ్యండి, బంధువులు బిడ్డను సంరక్షించడంలో ఆమెకు సహాయ పడేలా చెయ్యండి.
అలజడి ప్రవస్తనలు గల పెద్దవయసు వ్యక్తి
కొన్నిసార్లు పెద్దవయసు వారు కొట్లాటకు దిగడం లేక గందరగోళంలో పడడం జరుగుతుంది. కొంత అరుదుగా బంధువులు పెద్దాయన లైంగిక ప్రవర్తన సరిగ్గా లేదని, లేక గందరగోళ స్థితిలో ఉన్నప్పటికి ఎప్పుడూ బయటికి వెళ్తానని గొడవ చేస్తున్నాడని ఫిర్యాదు చేస్తారు. ఇంకోరకం వ్యక్తులు రోజువారీ జీవితానికి దూరంగా తమలో తాము ముడుచుకుని ఏ విషయం మీదా ఆసక్తి లేనట్లు ఉంటారు. ఇది అంతగా అలజడి ప్రవర్తన కాకపోవచ్చు, కాని మానసిక వ్యాధికి చిహ్నం.
పెద్ద వయసు వ్యక్తులు ఇలా ప్రవర్తించడానికి కారణాలేమిటి?
పెద్ద వయసు వ్యక్తులు ఇలా అసహజంగా ప్రవర్తించడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి :
- డిప్రెషన్ : పెద్దవారిలో డిప్రెషన్ ప్రధాన లక్షణం రోజువారీ జీవితానికి దూరంగా ఉండడం, ఆకలి లేక పోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, శారీరక బాధలు. కొంతమంది స్థిమితం లేకుండా వుంటారు లేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో వుంటారు.
- సన్నిపాతం లేక గందరగోళస్థితి : దీని ప్రత్యేక చిహ్నం తీక్షత, అలజడి ప్రవర్తన గత కొద్ది రోజుల్లో ప్రారంభమయి ఉంటుంది. ఆ వ్యక్తి చిత్త భ్రమతో లేక కలవరంతో ఉండొచ్చు.
- సైకోసిస్ : తీవ్రమైన మానసిక వ్యాధి అనుమానపు ఆలోచనల్ని భ్రమల్ని కలగజేయొచ్చు. మతిమరపుతో బాధపడుతున్న వ్యక్తికి సైకోసిస్ కూడా రావచ్చు.
- మతిమరుపు : ఇది ముఖ్యంగా పెద్ద వయసు వారికి, ముఖ్యంగా 65 సంవత్సరాల వయసు పైబడిన వారికి వస్తుంది. వ్యాధి మొట్ట మొదటి చిహ్నం జ్ఞాపక శక్తి సమస్యలు. అసహజమైన ప్రవర్తన కారణంగా వ్యాధి ఆరోగ్య కార్యకర్త దృష్టికి వస్తుంది. మెదడు క్రమేపీ క్షీణించడం వలన మతిమరుపు వస్తుంది. ప్రస్తుతం దీనికి చికిత్స లేదు, చాలామంది పరిస్థితి నానాటికీ దిగజారి కొద్ది సంవత్సరాల లోనే చనిపోతారు. మతిమరుపుకు అతి సాధారణ కారణాలు, ఆల్టిమీర్స్ డిసీజ్, స్తోక్స్ లేక పక్షవాతం.
కారణమేమిటో తెలుసుకోవడం
వ్యాధిని నిర్ధారించడానికి మీకు రెండు అంశాలలో స్పష్టత వుండాలి.
మొదటిది, అలజడిని కలిగించే నాలుగు పరిస్థితుల మధ్య తేడా ఏమిటో మీకు తెలియాలి. ఒకోసారి రెండు రకాల పరిస్థితులు కలిసి ఉంటాయి. చిత్త వైకల్యం మరియు సన్నిపాతం (గందరగోళం); చిత్త వైకల్యం మరియు సైకోసిస్ విషయంలో జరుగుతుంది. మీ మొదటి ప్రాధాన్యం వ్యక్తి గందరగోళ స్థితిలో లేకుండా చూడడం, ఎందుకంటే సన్నిపాతం ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం వుంది, దీనికి చికిత్స చెయ్యొచ్చు. ఒకసారి ఇది లేదని నిర్ధారించాక, మీకు సందేహం వుంటే, డిప్రెషన్ కి చేసే చికిత్సను చెయ్యొచ్చు. సామాన్యంగా నయమవుతుంది, కాకపోయినా, హాని ఏమీ జరగదు. ఆ వ్యక్తికి డిప్రెషన్ లేక గందరగోళ స్థితి లేనప్పుడు మాత్రమే మతిమరపు అయివుండొచ్చనుకోవాలి. కొన్ని సార్లు సరిగా వ్యాధి నిర్ధారణ చెయ్యడానికి మానసిక వైద్య నిపుణుడితో చూపించుకోవలసిన అవసరం వుంటుంది. మతిమరుపుని నిర్ధారించడానికి ఒకోసారి మెదడుకు స్కానింగ్ సహాయ పడుతుంది.
రెండవది, ఒకవేళ చిత్తవైకల్యం అని అనుకుంటే, చికిత్స చెయ్యగల మెడికల్ వ్యాధి లేదని నిర్ధారించుకోవాలి. చికిత్స చెయ్యగల వ్యాధులు :
- థైరాయిడ్ వ్యాధి
- తలకు దెబ్బలు తగిలి నెమ్మదిగా మెదడులో రక్తస్రావమవడం
- చిన్న వయసు వారిలో ఎయిడ్స్ వ్యాధి
- విటమిన్ బి 12 లోపం
- దీర్ఘకాలిక మూత్ర పిండాల లేక కాలేయ వ్యాధి
- మెదడు కేన్సర్
వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి సమస్యలు: ఎప్పుడు ఇది అసహజం?
వయసు పెరగడం అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడంగా భావించడం పరిపాటయింది, నిజంగానే మన మెదడు సామర్ధ్యాలు వయసు పైబడిన కొద్దీ తగ్గిపోతాయి. కాని దీని అర్ధం మన బంధువులెవరో, మనమెక్కడ నివసిస్తున్నామో లేక ఇతర ముఖ్యమైన విషయాల్ని మరిచిపోతామని కాదు. మతిమరుపులో వచ్చే జ్ఞాపక శక్తి లోపం మామూలుగా వయసు పైబడడం వల్ల వచ్చేదానికి మించినది. చిత్తవైకల్యం వచ్చిన వ్యక్తికి ముందు రోజు తనేమి చేసాడో, లేక తన దగ్గరి బంధువుల పేర్లేమిటో, లేక తన ఇంటి చిరునామా ఏమిటో గుర్తుండదు, వ్యాధి ముదిరిన కొద్దీ ఆ రోజు తేదీ ఏమిటో, టైమ్ ఎంతయిందో, ఇంతకు ముందే తనేమి చెప్పాడో (చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూవుండడం), చివరకు తన భార్య, కొడుకు పేర్లు కూడా గుర్తుండవు.
చిత్తవైకల్యం క్రమేపీ పెరిగే వ్యాధి, పెట్టె 4.10.లో దాని స్థాయిల జాబితా ఉంది. పెట్టె 4.11. లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొత్తం జనాభాలో వృద్దులశాతం తక్కువ ఉన్నప్పటికీ చిత్తవైకల్యం ప్రాధాన్యత గురించి చర్చించడం జరిగింది.
4.10. చిత్తవైకల్యం స్థాయిలు :
- తొలి దశ: ఆ వ్యక్తి గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తాడు, ఇప్పుడే జరిగిన విషయాల్ని కూడా మరిచి పోతాడు. ఏకాగ్రత నిలపడం, నిర్ణయాలు చెయ్యడం కష్టమవుతుంది. తన రోజువారీ పనులమీద అతనికి ఆసక్తి తగ్గిపోతుంది. చాలా కుటుంబాలు, (ఆరోగ్య కార్యకర్తలు) ఇది మామూలుగా వయసు పైబడడం వలన వచ్చే మార్పు అనే తలుస్తారు.
- మధ్యస్థితి : గందరగోళం, మరిచిపోవడం, మూడ్ మార్పులు తీవ్రమవుతాయి. కొట్లాటకు దిగడం, లైంగిక సమస్యలు మొదలైన ప్రవర్తనా పరమైన సమస్యలు వస్తాయి. ఆ వృదుడు ఇంటి బయట ఊళ్ళో తిరుగుతూ వుంటాడు, నిద్ర పెద్ద సమస్యగా మారుతుంది, తనను తాను సంరక్షించుకోలేని స్థితి వస్తుంది. దుస్తులు ధరించడం లాంటి అతి చిన్న పనుల్ని కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. మాట్లడడం కూడా కష్టమవుతుంది, రోజూ మాట్లాడుకునే మాటలు కూడా అర్థమవవు.
- చివరి స్థితి : తన బంధువుల్ని లేక స్నేహితుల్ని గుర్తించ లేడు. బరువు తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, మూత్రం, మల విసర్జన నియంత్రణను కోల్పోవడం ఉంటుంది. అతను అర్థవంతంగా మాట్లాడడమే అసాధ్యమవుతుంది. ఎల్లప్పుడూ అతను గందరగోళ స్థితిలోనే ఉంటాడు. త్వరలోనే న్యుమోనియా లేక ఇతర ఇన్ఫెక్షన్స్తో అతను మరణిస్తాడు.
4.11. అభివృద్ధి చెందుతున్న దేశాలలో చిత్త వైకల్యం ఎందుకని ముఖ్యమైనది ?
ఆల్టిమీర్స్ వ్యాధి చిత్త వైకల్యానికి ముఖ్య కారణం. యూరప్, ఉత్తర అమెరికా, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో దీని ముద్రను బాగా గుర్తిస్తున్నారు. ఎందుకు? ఈదేశాల్లో చాలా ఎక్కువ శాతంలో వృద్దులు ఉన్నారు కనుక, మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలలో వృద్దుల శాతం తక్కువ, బాలలు, యువత శాతం ఎక్కువ. జననాల శాతం తగ్గి, వ్యక్తుల ఆయుః ప్రమాణం పెరగడంతో ఈ సంతులనం మారుతోంది. దీని అర్థం ఎక్కువ శాతం మంది వ్యక్తులు దీర్ఘకాలం జీవించడం వలన చిత్తవైకల్యం వ్యాధి రాబోయే సంవత్సరాలలో ఇంకా ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుందని. అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలం అతి కష్టంగా గడిచే లక్షణంగల ఈ వ్యాధి వచ్చినప్పుడు వృద్దుల్ని వారి కుటుంబాల్ని ఆదుకోవడానికి, ఆసరానివ్వడానికి చాలా చక్కగా ఏర్పాటు చెయ్యబడిన ఆరోగ్య సామాజిక వ్యవస్థలు ఉన్నాయి. కాని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పరిస్థితి లేదు. ఫలితంగా తగినంత అవగాహన, లేక సేవలు లేని స్థితిలో ఎక్కువ సంఖ్యలో మతిమరుపుతో బాధపడుతున్న వ్యక్తుల సమస్యను సమాజాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కారణం చేత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య కార్యకర్తలకు మతిమరుపు ముఖ్యమైన సమస్యగా వుంది.
చిత్త వైకల్యం అని ఎప్పుడు అనుమానించాలి?
ఒక పెద్ద వయసు వ్యక్తి పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు చిత్తవైకల్యం అని అనుమానించాలి:
- అలజడి ప్రవర్తనతో ఆ వ్యక్తిని తీసుకు వచ్చినప్పుడు.
- మామూలు కంటే ఎక్కువగా మరిచి పోతున్నప్పుడు.
- గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు లేక అలజడిగా లేక ఉద్రేకంగా ఉన్నప్పుడు.
చిత్తవైకల్యం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
చాలా కుటుంబాల్లో పెద్దవారిని గౌరవంగా, ప్రేమగా చూస్తారు. ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి మామూలుకు భిన్నంగా ప్రవర్తిస్తూంటే ఆ కుటుంబానికి అది చాలా దుఃఖ హేతువు అవుతుంది. ఆ వ్యక్తి తన దగ్గరి బంధువులను కూడా మరిచిపోవచ్చు. కొట్లాడుతున్నట్లు ప్రవర్తించడం, అలజడి, గందరగోళం, లైంగికంగా అసంగత ప్రవర్తన సంరక్షణ చేసేవారికి చాలా కష్టం కలిగిస్తుంది. వ్యాధి ముదిరిన కొద్దీ అతను తనను తాను సంరక్షించుకునే శక్తిని కోల్పోతాడు. అతి త్వరలోనే తినడం, స్నానం చెయ్యడం, బట్టలు వేసుకోవడం, టాయిలెట్ కి వెళ్ళడం లాంటి రోజు వారీ కార్యక్రమాలకు కూడా సంరక్షకుల సహాయం అవసరమవుతుంది. వ్యాధి చివరి దశలో ఆ వ్యక్తి మంచానికి అంకిత మయిపోవడం వలన నిరంతరం సంరక్షణ అవసరమౌతుంది
చిత్తవైకల్యం వ్యాధి నిర్ధారణ ఎందుకు ముఖ్యం?
తమకు ప్రియమైన బంధువు విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఇతర వ్యాధికి లాగానే కారణం తెలిస్తే సంరక్షకులకు కొంత గుండె భారం తగ్గుతుంది. సంరక్షకులకు రాబోయే సంవత్సరాల్లో అతనికి ఎలా వుండబోతుందో ముందుగా వివరిస్తే వారు భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవచ్చు. కొంతమందిలో చికిత్స చెయ్యగలిగిన థైరాయిడ్ లోపం వలన కూడా చిత్త వైకల్యం రావచ్చని గమనించడం ముఖ్యం. ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ ఆ వ్యక్తికి వృద్దాప్యంలో కనిపించే, సమర్థంగా చికిత్స చెయ్యగలిగిన డిప్రెషన్ లేదని రుజువు చేసుకోవడానికి అవసరం.
ఈ సమస్యనెలా ఎదుర్కోవడం?
చిత్త వైకల్యం నానాటికీ ఎక్కువయే, అంతిమ దశ వ్యాధి. ఖచ్చితమైన ఆధారం ఉంటేనే ఈ వ్యాధిని మతిమరపు అని నిర్ధారణ చెయ్యాలి. (క్రింద వివరించిన విధంగా).
కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని అడగవలసిన ప్రశ్నలు :
- మీరు మొదటిసారి సమస్యను ఎప్పుడు గమనించారు? తరచుగా సహాయం కోరడానికి కొన్ని నెలలు లేక సంవత్సరాల ముందు కనపడిన లక్షణాలను ఎవరైనా బంధువు గుర్తుకు తెచ్చుకోవచ్చు.
- వ్యాధి ఎలా ప్రారంభమయింది? ఈ వృద్దుడు విషయాల్ని పేర్లు, తేదీలు లాంటి వాటిని గుర్తుంచుకోవడంలో ఏమైనా సమస్య ఉందా? జ్ఞాపకశక్తి సమస్యలు మతిమరుపులో ఉండే ప్రత్యేక లక్షణాలు, కాని ఇవి డిప్రెషన్లో కూడా వుందొచ్చు.
- తినడం, స్నానం చెయ్యడం లాంటి రోజువారీ పనులు చేసుకోవడం కష్టంగా వుందా? అలా వుంటే అది మతిమరుపును సూచిస్తుంది.
- ఆమె విచిత్రంగా ప్రవర్తిస్తూందా? ఉదాహరణకు ఆమె కొట్లాటకు దిగిందా లేక అలజడిగా ఉందా? మళ్ళీ ఇవి కూడా మతిమరుపు చిహ్నాలే.
- ఆమె విచారంగా, బ్రతుకు మీద ఆసక్తి పోయినట్లు అనిపిస్తోందా? ఇవి డిప్రెషన్ లక్షణాలు, కాని మతిమరుపులో కూడా వుండొచ్చు ఆమె ఇంతకు ముందు మానసిక వ్యాధితో బాధపడిందా? గతంలో ఆమె డిప్రెషన్ తో బాధపడివుంటే, ఈసారి వ్యాధి డిప్రెషన్ అయే అవకాశం ఎక్కువ.
- ఆ వృద్దుడికి ప్రధాన సంరక్షకుడెవరు? అతను సరిగ్గా సంరక్షణ చెయ్యగలుగుతున్నాడా? సంరక్షకుడికి కొంన్సిలింగ్ అవసరం, అతని అవసరాల్ని తెలుసుకోవడానికి అతని అనుభవాల్ని అడగడం ఉపయోగకరమైన పద్ధతి.
ఆ వృద్ధ వ్యక్తిని అడగవలసిన ప్రశ్నలు :
- నా పేరు ....... మళ్ళీ నా పేరును పలకండి. ఇప్పుడు నా పేరును గుర్తుంచుకోండి. ఈ ప్రశ్నలు వ్యక్తి కొత్త సమాచారాన్ని గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి.
- ఇవాళ ఏ వారమో చెప్పగలరా? ఇది ఏ సంవత్సరం? ఇది టైమ్ కి సంబంధించి అతనికి తెలివిడి ఉందో, లేదో తెలియజేస్తుంది.
- ఇదే ప్రదేశమో చెప్పగలరా? ఉదాహరణకు ఇది క్లినిక్, ఇది ఏ ప్రదేశంలో ఉంది? ఇది ప్రదేశానికి సంబంధించి అతనికి తెలివి ఉందో, లేదో తెలియజేస్తుంది.
- మీరింతకు ముందు భోజనంలో ఏమి తిన్నారో చెప్పగలరా? ఇది ఇటీవల జరిగిన విషయాల్ని గుర్తుపెట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది.
- ఇప్పుడు నా పేరేమిటో చెప్పగలరా? ఇది మీరు మొదట చెప్పిన మీ పేరును గుర్తుంచుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది.
- ఈ ప్రశ్నలకు అతను కొంత బాగానే అర్థం చేసుకుంటూంటే, ఇప్పుడు మీరు భావాలు, భావోద్వేగాలకు సంబంధించిన ప్రశ్నల్ని అడగండి.
ప్రత్యేక ఇంటర్వ్యూకు సూచనలు :
ఆ వృద్ధ వ్యక్తికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నప్పటికి, గందరగోళ స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ మిమ్మల్ని పరిచయం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆ వ్యక్తికి తను ఎక్కడ ఉన్నదీ, ఎవరితో మాట్లాడుతున్నదీ కొంత వరకు తెలియడానికి ఉపయోగపడుతుంది. ఆమె బంధువు కూడా ఆమెతో పాటు ఉండగా ఇంటర్వ్యూ చెయ్యండి, ఆమె జవాబు చెప్పలేనప్పుడు బంధువు సహాయపడుతుంది.
వెంటనే ఏమి చెయ్యాలి ?
- ఆ వృద్ద వ్యక్తికి డిప్రెషన్, సైకోసిస్, గందరగోళం ఉంటే కొంచెం చిన్న వయసు వారికి చికిత్స చేసినట్లే చెయ్యండి. ఐతే, వృద్దులకు తక్కువ మోతాదులో మందుల్ని ఇవ్వాలని గుర్తుంచుకోండి.
- చిత్త వైకల్యం గురించి, ఏమి ఆశించవచ్చో సంరక్షకుడి కి అవగాహన కలిగించండి. వ్యాధికి చికిత్స లేనప్పటికి, ఆ వ్యక్తిని సౌకర్యంగా ఉంచడానికెంతో చెయ్యొచ్చని, సంరక్షకుడికి కలిగే ఒత్తిడిని తగ్గించవచ్చని వివరించండి.
- సంరక్షించడంలో ఎదురయే అంశాల గురించి, అలజడితో ఉన్న వ్యక్తిని సంబాళించడం గురించి సలహాలనివ్వండి.
- బాగా తీవ్రమైన అలజడితో ప్రవర్తిస్తూంటే ఆ వ్యక్తిని నెమ్మదింపజేయడానికి మందులు చాలా సహాయపడతాయి. హాలో పెరిడాల్ ఉపయోగకరమైన మందు. 0.25 మి.గ్రా., రోజుకు రెండు సార్లు తో ప్రారంభించి, అవసరమైతే, 2 మి.గ్రా. రోజుకు రెండు సార్లు వరకు మోతాదును పెంచండి.
- ఆ వృద్ధ వ్యక్తి రాత్రి నిద్రపోతే సహాయంగా ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే లోరజిపామ్, 0.5 - 1 మి.గ్రా. రాత్రిపూట ఇవ్వండి.
- కొన్ని దేశాల్లో జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడు మెరుగ్గా పని చెయ్యడానికి "బ్రెయిన్ టానిక్స్ ని అమ్ముతారు. కాని వాటివల్ల ప్రయోజనం ఉందనడానికి ఆధారంలేదు. అలాంటి టానిక్స్ ని వేటినీ వాడకండి.
4.12. మతిమరుపు ఉన్న వ్యక్తిలో అలజడి ప్రవర్తనని సంబాళించడానికి ఆచరణాత్మక లేక అభ్యాస సూచనలు :
సాధారణ సూచనలు :
- ప్రతిరోజూ చేసే పనుల్ని నిర్దిష్ట క్రమంలో పెట్టండి. మీకు ఏమి చెయ్యాలో, ఎంత వ్యవధిలో, ఎప్పుడు చెయ్యాలో మొదలైనవి తెలుస్తాయి కనుక జీవితం సులభమవుతుంది.
- సాధ్యమైనంత వరకు ఆ పెద్ద వయసు వ్యక్తిని స్వతంత్రంగా ఉండనివ్వండి. ఉదాహరణకు చాలా మంది కొంచెం నెమ్మదిగా, అస్థిరంగానైనా, తమంతట తాము తినగలరు.
- ఆ వ్యక్తికి గౌరవం ఉందని మరచిపోకండి. ఆమె ఎదుట ఆమెను తక్కువ చేసే మాటలు మాట్లాడకండి.
- స్నానం చెయ్యడం లాంటి పనులు చేస్తున్నప్పుడు ఆ పెద్ద వయసు వ్యక్తి ఏకాంతాన్ని పదిలపరచండి.
- వ్యతిరేకించడం, వాదనలకు దిగడం చెయ్యకండి.
- చెయ్యవలసిన పనుల్ని సులభంగా ఉంచండి.
- ఆ వ్యక్తితో కలిసి నవ్వండి (ఆ వ్యక్తి గురించి కాదు)
- ఆ వ్యక్తి సామర్థ్యాల్ని వినియోగించి పనిచెయ్యడానికి సహాయపడండి, ఆయన చెయ్యగలిగిన, ఆయనకు కొంత వ్యాయామాన్ని కూడా ఇచ్చే సాధారణమైన పనుల్ని గుర్తించి చెయ్యనిస్తుంది.
- ఆ వ్యక్తి కళ్ళద్దాలు సరిగ్గా ఉన్నాయో, లేదో నిర్ధారణ చేసుకోండి.
- నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడండి, ఆ వ్యక్తి అర్థం చేసుకోలేక పోతే, సులభమైన పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో విషయాల్ని చెప్పండి.
- వీలయినప్పుడల్లా ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చెయ్యండి. ఒక కౌగిలింత వంద మాత్రలతో సమానమైనది.
- జ్ఞాపకశక్తి ని పెంచే పనుల్ని రోజూ ఒక కాగితం మీద ఆ రోజు తేది, వారం రాసి తలుపు మీద అంటించడంలాంటివి చేయించండి.
- అనవసరమైన మందుల్ని వాడకండి
స్నానం, వ్యక్తిగత పరిశుభ్రత :
- స్వాతంత్ర్యం : సహాయం లేకుండా చేసుకోగలిగినంత వరకు చేసుకోనివ్వండి.
- గౌరవం : లోదుస్తులు ఉంచి స్నానం చేయించండి.
- భద్రత : స్నానం చేయించేటప్పుడు కుర్చీలో కూర్చోబెట్టడం, తడి నేల మీద జారకుండా చాప పరచడం.
టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు :
- ప్రతిరోజూ ఒక క్రమంలో టాయిలెటికి సంబంధించిన పనులు చెయ్యడం.
- సులభంగా తీసి (మళ్ళీ వేసుకోగల) వేయగల దుప్తల్ని వెయ్యాలి.
- రాత్రి పడుకునే ముందు తక్కువ ద్రవాల్ని తాగనివ్వాలి.
- రాత్రి మూత్రం పోసుకోవడానికి ఒక పాత్రను పెట్టాలి.
- మూత్రం తెలియకుండా బట్టల్లో అయిపోతూంటే ప్రత్యేకమైన పాడ్స్ ని ఉపయోగించండి.
తినిపించడం, తినడం :
- వేళ్ళతో తినగలిగిన ఆహారాన్నివ్వండి.
- ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా, ఒకసారి కొరుక్కునేంత చిన్నవి, చేసి ఇవ్వండి.
- బాగా వేడిగా ఉన్న పదార్ధాల్ని పెట్టకండి.
- ఎలా తినాలో ఆ వ్యక్తికి గుర్తు చెయ్యండి. (చేతులతో, లేక స్పూన్, ఫోర్క్ లాంటివి ఉపయోగించి)
- ఒకవేళ ఆ వ్యక్తికి ఆహారాన్ని మింగడం కష్టంగా వుంటే ప్రత్యేక వైద్య నిపుణుడికి చూపించండి.
- ఆహారాన్ని కలిపి, తినడానికి అనువుగా పెట్టండి. (ఉదా, అన్నాన్ని కూరను కలిపి)
అనుమానం, కోపం :
- తిరిగి వాదించకండి, మానంగా ఉండండి.
- ఓదార్చడానికి ప్రయత్నించండి, చేతుల్ని బలంగా పట్టుకుని మృదువుగా మాట్లాడండి.
- గదిలో ఏదైనా వస్తువును చూపిస్తూ ఆ వ్యక్తి దృష్టిని మరల్చండి.
- అతనికి కోపం తెప్పించిన అంశమేదో తెలుసుకుని భవిష్యత్తులో అది మళ్ళీ జరగకుండా చూడండి.
- హాలోపెరిడాల్ లాంటి మందును ఉపయోగించడం గురించి ఆలోచించండి.
ఇంటికి దూరంగా దారి తప్పి తిరగడం :
- గుర్తించడానికి ఉపయోగపడే బ్రేస్లెట్ లేక నెక్లెస్ ని ఉపయోగించండి.
- ఇంటి తలుపులకు తాళాలు వెయ్యండి.
- ఆ వ్యక్తి కనపడినప్పుడు కోపం చూపకండి.
- మతిమరుపు వున్న వృద్ధ వ్యక్తిని సంరక్షించడం చాలా ఒత్తిడితో కూడిన అనుభవం. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సంరక్షకులకు మీరివ్వగలిగిన సలహాలు విభాగం 9.10లో వివరించబడినాయి.
- ఆల్టిమీర్స్ వ్యాధి బారిన పడిన వారిని సంరక్షించే బృంద సభ్యుల దగ్గరకు సంరక్షకుడిని పంపండి. చాలా దేశాలలో అలాంటి బృందాలు నానాటికీ ఎక్కువ సంఖ్యలో ఏర్పడుతున్నాయి.
ఎప్పుడు వేరే దగ్గరకు పంపాలి?
- సమస్యకు కారణం విషయంలో ఏదైనా సందేహం వున్నప్పుడు.
- సంరక్షకుడు తనంతట తాను ఒంటరిగా సంరక్షించలేనప్పుడు.
- శారీరక వ్యాధులు తీవ్రరూపందాల్చినప్పుడు
తరువాత ఏమి చెయ్యాలి ?
ఇంటి దగ్గర కుటుంబాన్ని కలవడానికి ఏర్పాటు చెయ్యండి. ఈ విధంగా మీరు వారి అవసరాల్ని మరింత మెరుగా అర్ధం చేసుకోగలుగుతారు. మందుల్ని ఇస్తూంటే, వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఎంత వరకు పరిస్థితి మెరుగు పడింది అనేవి తెలుసుకోవడానికి వీలవుతుంది. అవసరమైతే మందు మోతాదును పెంచండి, కాని ఏవైనా ఇబ్బందులు వస్తే, వృద్దులు వాటికి ఎక్కువగా ప్రతిస్పందిస్తారని గుర్తుపెట్టుకోండి. మతిమరపు ఎక్కువయిన కొద్దీ ఇంకా ఎక్కువ శ్రద్ధగా సంరక్షించడానికి మీరు ఆసరా, మార్గదర్శకత్వం ఇవ్వాలి.
4.13. అలజడి ప్రవర్తన ఉన్న వృద్దుల్ని సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు :
- మతిమరుపు, సైకోసిస్, గందరగోళం లేక డిప్రెషన్ వృద్ధుల్లో అలజడి ప్రవర్తనకు కారణాలు. డిప్రెషన్, సైకోసిస్, గందరగోళంను గుర్తించడానికి ప్రయత్నించడం, వాటికి ముందుగా చికిత్స చెయ్యడం ముఖ్యం.
- ఆల్టిమీర్స్ వ్యాధి మతిమరుపుకి సాధారణ కారణం. ప్రస్తుతం దానికి చికిత్స లేదు.
- ఆచరణాత్మకమైన సలహా, భావోద్వేగ ఆసరా, ప్రవర్తనా పరమైన సమస్యలకు మందులు సంరక్షణ భారాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గాలు.
- వృద్దులకు వాడే మందుల మోతాదు తక్కువ వయసు వారికి వాడే మోతాదులో మూడవ లేక రెండవ వంతు ఉంటుంది.