অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రమాదాల గాయాల నివారణ

ప్రమాదాల / గాయాల నివారణ

గాయాల నివారణ గురించిన సమాచారాన్ని అందరూ పంచుకొని, ఆచరించటం ఎందుకు ముఖ్యమంటే.... గాయాల కారణంగా ప్రతి ఏటా సుమారు 75 వేల మంది పిల్లలు మరణిస్తున్నారు. మరో 40 కోట్ల మంది తీవ్రంగా బాధపడుతున్నారు.... అనేక గాయాలు శాశ్వతమైన అంగవైకల్యానికి, మెదడు దెబ్బ తినడానికి దారి తీస్తాయి. చిన్న పిల్ల మరణానికి, అంగవైకల్యానికి గాయాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. సాధారణంగా గాయాలు ఎక్కువగా కింద పడటం, కాలటం, నీటిలో మునగటం ఇంకా రోడ్డు ప్రమాదాల వల్ల అవుతాయి. వీటిలో ఎక్కువగా ఇంట్లోగానీ, ఇంటికి దగ్గర గానీ సంభవిస్తాయి. దాదాపు వీటన్నింటినీ నిరోధించవచ్చు. గాయం అయిన వెంటనే ఏం చేయాలి అనేది తల్లిదండ్రులకు తెలిస్తే, అనేక గాయాల తీవ్రతను తగ్గించవచ్చు.

ముఖ్య సందేశాలుః:

గాయాల నివారణ గురుంచి తెలుసుకోవటానికి ప్రతి కుటుంబం / సమాజం ఏయే హక్కులు కలిగి ఉన్నాయి.

  1. తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ, పరికరాలను సురక్షితంగా ఉంచినట్లయితే, అనేక తీవ్రమైన గాయాలను నివారించవచ్చు.
  2. మంట, వంటింటి స్టౌ, దీపాలు, అగ్గి పెట్టెలు, విద్యుత్ పరికరాల నుంచి చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి.
  3. చిన్నపిల్లలు ఎక్కటానికి ఇష్టపడతారు. కనుక, మెట్లు, బాల్కనీలు, రూఫ్ (పైకప్పు), కిటికీలు, ఆట ప్రదేశాలను చిన్న పిల్లలు కింద పడకుండా సురక్షితంగా తీర్చిదిద్దాలి.
  4. చాకులు, కత్తెరలు, పదునైన లేదా వాడియైన వస్తువులు, పగిలిన గాజు ముక్కలు గాయాలు చేయగలవు. ఇలాంటి వస్తువులను చిన్న పిల్లలకు అందకుండా, వారికి దూరంగా ఉంచాలి.
  5. చిన్న పిల్లలు వస్తువులను నోట్లో పెట్టుకోవటానికి ఇష్టపడతారు. కనుక, చిన్న సైజు వస్తువులను పిల్లలు మింగకుండా నిరోధించటానికి వాటిని దూరంగా పెట్టాలి.
  6. విషము, బ్లీచ్ ద్రవం, ఔషధాలు, యాసిడ్, కిరోసిన్ లాంటి ఇంధనాలను నీటి బాటిళ్లల్లో నిల్వ చేయరాదు. ఇలాంటి ద్రవాలను, విషపదార్థాలను సూచిస్తూ స్పష్టంగా ముద్రించి వున్న కంటెయినర్లలోనే ఉంచి, వాటిని చిన్న పిల్లలకు అందకుండా వారి దృష్టిలో పడకుండా పెట్టాలి.
  7. చిన్నపిల్లలు రెండు నిముషాల వ్యవధిలోనే అతి కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుటికీ మునిగిపోగలరు. వారు నీటిలో లేదా నీటికి దగ్గరగా ఉన్నప్పుడు ఒంటరిగా వదలరాదు.
  8. చిన్నపిల్లలు ముఖ్యంగా ఐదేళ్ల లోపు వారికి రోడ్డుపైన ఉంటే తీవ్ర అపాయం పొంచి ఉంటుంది. రోడ్డుపైన వారికి తోడుగా ఎల్లవేళలా ఒకరు ఉండాలి. చిన్నపిల్లలు నడవటం నేర్చుకున్న వెంటనే రోడ్డుపై సురక్షితంగా ఎలా నడవాలో బోధించాలి.

ముఖ్య సందేశం - 1

తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్నపిల్లలను జాగ్రత్రగా గమనిస్తూ, పరిసరాలను సురక్షితంగా ఉంచినట్లయితే, అనేక తీవ్రమైన గాయాలను నివారించవచ్చు. ఒకటిన్నర ఏడాది నుంచి నాలుగేళ్ల మధ్య వయస్సుగల పిల్లలు తీవ్రగాయాలకు మృత్యువు పాలవటానికి ఎక్కువ అపాయం కలిగి ఉంటారు. ఈ గాయాల్లో అనేకం ఇంటి వద్దనే సంభవిస్తాయి. వీటన్నిటినీ కూడా నిరోధించవచ్చు. ఇంట్లో సంభవించే గాయాలకు ప్రధాన కారణాలుః

  • మంట, స్టౌ, ఓవెన్ వేడి వంటపాత్రలు, వేడి ఆహారం, మరిగే నీళ్లు ఆవిరి, కిరోసిన్ దీపాలు, ఇనుము, విద్యుత్ పరికరాల కారణంగా కాలటం.
  • విరిగిన గాజు ముక్కలు, చాకులు, కత్తెరలు లేదా గొడ్డళ్ల కారణంగా కోసుకుపోవటం.
  • మంచం, కిటికీలు, టేబుళ్లు, మెట్ల పైనుండి కిందపడటం
  • నాణెములు, గుండీలు లేదా నట్లు మింగటం
  • కిరోసిన్, పురుగుల మందు, బ్లీచ్ ఇంకా డిటర్జెంట్లు లోని విషపూరిత పదార్థాలు
  • విరిగిన లేదా పగిలిన విద్యుత్ వైరు, పరికరాలను ముట్టుకోవటం, కర్రలేదా పుల్లలు, చాకు లాంటి వీటిని విద్యుత్ ప్లగ్ లలో పెట్టటం.

చిన్న పిల్లలకు ప్రమాదకరం అనిపించిన ఎలాంటి వస్తువునైనా వారికి అందకుండా, దూరంగా, సురక్షితంగా పెట్టాలి. చిన్న పిల్లల చేత సుదీర్ఘ గంటల పాటు పని చేయించరాదు. వారికి హాని కలిగించేవి లేదా వారు పాఠశాలకు వెళ్లటానికి ఆటంకం కలిగించే పనులను కూడా చేయించరాదు. భారీ శ్రమ కలిగించే పనులు, ప్రమాదకరమైన పనిముట్లు, విషపూరితమైన రసాయనాల నుంచి చిన్నపిల్లలను పరిరక్షించాలి.

ముఖ్య సందేశం - 2

మంట/నిప్పు , వంటింటి స్టౌ, దీపాలు, అగ్గిపెట్టెలు, విద్యుత్ పరికరాల నుంచి చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి. చిన్న పిల్లలు తీవ్రంగా గాయపడటానికి గల కారణాల్లో మంటలు, వేడినీటి బొబ్బలు ప్రధానమైనవి. వెలుగుతున్న స్టౌ, మరిగే నీరు, వేడి ఆహార పదార్థాలు, కాలిన ఇనుమును ముట్టుకోకుండా పిల్లలను నివారించాలి. మంటలు తీవ్రమైన గాయం చేయటమే గాక శాశ్వతమైన మచ్చల (మరక) ను ఏర్పరుస్తాయి. కొన్ని సార్లు ప్రాణం కూడా పోతుంది. ఈ గాయాల్లో అత్యధికం నివారించ దగినవే. కాలిన గాయాలను ఈ క్రింది విధంగా నివారించవచ్చు.

  • మంటలు, అగ్గిపెట్టె, సిగరెట్టుల నుంచి పిల్లలను దూరంగా ఉంచటం.
  • పిల్లలకు అందనంత ఎత్తులో ప్లాట్ ఫారం పైన స్టౌలను పెట్టాలి. కట్టెల పొయ్యి లాంటివి అయితే, మట్టితో ఎత్తుగా నిర్మించిన దిబ్బపైన పెట్టాలి.
  • కుక్కర్, బానలి లాంటి వంట పాత్రల హ్యాండిళ్లను పిల్లలకు అందని విధంగా పెట్టాలి.
  • పెట్రోల్, అగ్గిపెట్టెలు, దీపాలు, క్యాండిల్స్, లైటర్లు, కాలే ఇనుము, విద్యుత్ పరికరాలను చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి.
  • విద్యుతే సాకెట్ (ఫ్లగ్) లలో చిన్నపిల్లలు వేలు పెడితే, తీవ్రంగా గాయపడగలరు. ఇలాంటి విద్యుత్ సాకెట్లను పిల్లలు తాకకుండా వాటిపై కవర్ పెట్టాలి.
  • చిన్న పిల్లలకు ఏ మాత్రం అందకుండా విద్యుత్ వైర్లను దూరంగా ఉంచాలి. తెరచి వున్న వైర్లు ముఖ్యంగా చాలా ప్రమాదకరం.

ముఖ్య సందేశం - 3

చిన్న పిల్లలు ఎక్కటానికి ఇష్టపడతారు. కనుక, మెట్లు, బాల్కనీలు, రూఫ్/ పై కప్పులు , కిటికీలు, ఆట ప్రదేశాలను చిన్న పిల్లలు కింద పడకుండా సురక్షితంగా తీర్చిదిద్దాలి. చర్మం నలగటానికి, ఎముకలు విరగటానికి, తలకు తీవ్రమైన గాయాలు కావటానికి ప్రధాన కారణం పైనుంచి కింద పడటమే. ఈ ప్రమాదాలను క్రింది విధంగా నివారించవచ్చు.

  • అపాయకరం / అసురక్షితమైన ప్రదేశాల పైకి ఎక్కకుండా చిన్న పిల్లలను నిరుత్సాహ పరచాలి.
  • మెట్లు, బాల్కనీ, కిటికీలకు రెయిలింగ్ నిర్మించాలి.
  • ఇంటిని పరిశుభ్రంగా, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి.

ముఖ్య సందేశం - 4

చాకులు, కత్తెరల, పదునైన లేదా వాడియైన వస్తువుల, పగిలిన గాజు ముక్కలు గాయాలు చేయగలవు. ఇలాంటి వస్తువులను చిన్నపిల్లలకు అందకుండా, వారికి దూరంగా ఉంచాలి. పగిలిన గాజు ముక్క తీవ్రంగా చర్మాన్ని కోస్తుంది. దీంతో రక్తం పోయి, గాయాలకు ఇన్ ఫెక్షన్ కలుగజేస్తుంది. గాజు సీసాలను పిల్లలకు అందకుండా దూరంగా పెట్టాలి. వారి ఆడుకునే ప్రదేశాల్లో పగిలిన గాజు ముక్కలు లేకుండా చూడాలి. గాజు ముక్కలను తాకరాదని చిన్న పిల్లలకు చెప్పాలి. పగిలిన గాజు ముక్కలను వెంటనే సురక్షితంగా పారేయాలనీ పెద్ద పిల్లలకు నేర్పించాలి. పదునైన లోహపు వస్తువులు. యంత్రాలకు చెందిన తుప్పు పట్టిన పరికరాలు గాయాలకు ఇన్ ఫెక్షన్ కలుగజేస్తాయి. ఇలాంటి వస్తువులేవీ పిల్లల ఆట ప్రదేశంలో లేకుండా చూడాలి. ఇంట్లోని వ్యర్థపదార్థాలు, పగిలిన సీసాలు, పాత క్యాన్లను సురక్షితంగా బయట పారేయాలి. ఇంటి దగ్గర సంభవించగల ఇతర గాయాలను నివారించటానికి పిల్లలకు వాటి గురించి వివరించాలి. రాళ్లు, పదునైన వస్తువులను విసరటం, చాకులు, కత్తెరలతో ఆడుకోవటం వల్ల పొంచి వున్న అపాయం గురించి చిన్నపిల్లల మనస్సులో నాటుకొనేలా బోధించాలి.

ముఖ్య సందేశం - 5

చిన్నపిల్లలు వస్తువులను నోట్లో పెట్టుకోవటానికి ఇష్టపడతారు. కనుక, చిన్నసైజు వస్తువులను పిల్లలు మింగకుండా నిరోధించటానికి వాటిని దూరంగా పెట్టాలి. బటన్లు (గుండీలు), నాణెములు, పూసలు, విత్తనాలు, కాయదాన్యాలను పిల్లలు ఆడుకునే /పడుకునే ప్రదేశంలో లేకుండా చూడాలి. పసి వయస్సు పిల్లలకు పల్లీలు (వేరు శనగకాయలు), గట్టిగా ఉండే స్వీటు లేదా ఎముకలు, విత్తనాలతో కూడిన ఆహారం ఇవ్వరాదు. చిన్న పిల్లలు భోజనం చేస్తున్న ప్రతిసారి పెద్దలు పర్యవేక్షించాలి. చిన్నపిల్లల ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందించాలి. దగ్గటం, ముద్దుగా మాట్లాడటం లేదా అసలే శబ్దంచేయలేకపోవటం, శబ్దంతో శ్వాస తీసుకోవటం ఇవన్నీ కష్టంగా శ్వాస తీసుకోవటాన్ని, ఊపిరాడనీయని పరిస్థితిని సూచిస్తాయి. ఇది ప్రాణానికి ముప్పు తేగలదు. చిన్నపిల్లలు నోట్లో ఏదో వస్తువు పెట్టుకొంటుండగా ఎవ్వరూ చూడకపోయినా సరే, శ్వాస తీసుకోవటంలో ఆకస్మికంగా ఇబ్బందికి గురయితే, ఆ బాలుడు / బాలిక శ్వాసకు ఏదో అడ్డు పడుతున్నట్లుగా పెద్దలు అనుమానించాలి.

ముఖ్య సందేశం - 6

విషము, బ్లీచ్ ద్రవం, ఔషదాలు, యాసిడ్, కిరోసిన్ లాంటి ఇంధనాలను నీటి బాటిళ్లల్లో నిల్వ చేయరాదు. ఇలాంటి ద్రవాలను, విషపదార్థాలను సూచిస్తూ స్పష్టంగా ముద్రించి వున్న కంటెయినర్ల లోనే ఉంచి, చిన్నపిల్లల దృష్టి లో పడకుండా, వారికి అందకుండా పెట్టాలి. చిన్నపిల్లలకు విషం చాలా ప్రమాదకరం. బ్లీచ్, పురుగుల / ఎలుకల మందు, కిరోసిన్, డిటర్జెంట్ లు పిల్లలను చంపగలవు లేదా శాశ్వతంగా గాయపరచగలవు. చాలా రకాల విషాలు ప్రమాదకరం కావటానికి వాటిని మింగనవసరం లేదు. ఈ క్రింది రకాలుగా చేసినా అవి ప్రాణాలు తీయగలవు, మెదడును ధ్వంసం చేయగలవు, అంధత్వాన్ని లేదా శాశ్వతంగా గాయాలు చేయగలవు.

  • వాసన పీలిస్తే,
  • చర్మానికి తగిలినా, కంట్లోకి పోయినా,
  • బటల్లోకి దూరినా

విషాలను ఒకవేళ, కూల్ డ్రింక్ లేదా బీరు సీసాల్లో గానీ, జాడీ లేదా కప్పులో గానీ నిల్వ చేస్తే, పిల్లలు దాన్ని పొరపాటున త్రేగే ప్రమాదం ఉంది. కనుక, ఔషధాలను, రసాయనాలను, విషాలను అన్నింటికీ వాటి అసలైన డబ్బాల్లోనే ఉంచి, గట్టిగా మూత (సీల్) పెట్టాలి. డిటర్జెంట్, బ్లీచ్, రసాయనాల, ఇతర ఔషధాలను పిల్లలు అందుకొనే విధంగా వదిలేయరాదు. వాటికి గట్టిగా సీల్ వేసి, లేబుల్ అతికించాలి. వాటిని కప్ బోర్టు (అర) లో గానీ, పెట్టెలోగానీ పెట్టి తాళం వేయాలి లేదా పిల్లలు చేరుకోలేనంత లేదా చూడలేనంత ఎత్తుగా వున్న అరలో పెట్టాలి. పెద్దల కోసం నిర్దేశించిన ఔషధాలను, పొరపాటున పిల్లలు మింగితే చనిపోగలరు. ఒక పిల్లవాడికి నిర్దేశించిన ఔషధాన్ని ఆ పిల్లవాడికే వాడాలి. పెద్దలకు లేదా ఇతర పిల్లలకు రాసిచ్చిన మందులను ఇంకో పిల్లవాడికి అస్సలు ఇవ్వరాదు. యాంటీ - బయోటిక్ మందులు పిల్లలకు అతిగా వాడినా లేదా దుర్వినియోగం చేసినా బధిరత్వాన్ని (చెవుడు) కలుగు జేయగలదు. ఆరోగ్య కార్యకర్త సూచించిన ప్రకారమే ఔషధాలను పిల్లలకు వాడిలి. ప్రమాదవశాత్తు విషానికి గురవడానికి ప్రధాన కారణం ఆస్పిరిన్. దీన్ని పిల్లల కంట్లో పడకుండా, వారికి అందకుండా పెట్టాలి.

ముఖ్య సందేశం - 7

చిన్నపిల్లలు రెండు నిముషాల వ్యవధిలోనే అతికొద్దిగా నీళ్ళు ఉన్నప్పటికీ మునిగి పోగలరు. వారు నీటిలో లేదా నీటికి దగ్గరగా ఉన్నప్పుడు ఒంటరిగా వదలరాదు. బావులను, నీటితో ఉన్న టబ్బులను, బక్కెట్లను మూత పెట్టి ఉంచాలి. పిల్లలు పసి వయస్సు లో ఉన్నప్పుడే ఈత నేర్పించాలి. ఆ వయస్సులో వారు మునిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వేగమైన నీటి ప్రవాహంలో గానీ ఒంటరిగా గానీ ఈత కొట్టరాదని వారికి నూరిపోయాలి.

ముఖ్య సందేశం - 8

చిన్నపిల్లలు, ముఖ్యంగా ఐదేళ్ల లోపు వారికి రోడ్డుపైకి వస్తే తీవ్రమైన అపాయం పొంచి ఉంటుంది. రోడ్డుపైన వారికి తోడుగా ఎల్లవేళలా ఒకరు ఉండాలి. చిన్నపిల్లలు నడవటం నేర్చుకున్న వెంటనే రోడ్డు పై సురక్షితంగా ఎలా మెలగాలో బోధించాలి. చిన్నపిల్లలు వెనుకా ముందు చూడకుండా రోడ్డు పైకి పరుగెత్తుతారు. కనుక, కుటుంబ సభ్యులు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. చిన్నపిల్లలు రోడ్డు సమీపంలో ఆడరాదు. ముఖ్యంగా బంతితో రోడ్డు సమీపంలో ఆడుకోరాదు. రోడ్డు పక్కనుంచి, ట్రాఫిక్ కు అభి ముఖంగా నడవటాన్ని చిన్నపిల్లలకు బోధించాలి. రోడ్డు దాటేటప్పుడు, చిన్నపిల్లలకు ఈ క్రింది విషయాలను నేర్పించాలి.

  • రోడ్డు పక్కన ఆగాలి
  • రెండు వైపులా చూడాలి
  • కార్లు, ఇతర వాహనాలను రోడ్డు దాటటానికి ముందే గమనించాలి.
  • తన పక్కనున్న వ్యక్తి చేతిని పట్టుకోవాలి.
  • నడుచుకుంటూ రోడ్డు దాటాలి. పరుగెత్తరాదు.

చిన్నపిల్లలను గమనించవలసిందిగా పెద్ద పిల్లలను ప్రోత్సహించాలి. రోడ్డు దాటడంలో వీరు పసివారికి చక్కని ఉదాగరణగా నిలవాలి. పెద్ద పిల్లలకు అయ్యేగాయాలు, మరణానికి ఎక్కువ కారణం సైకిల్ ప్రమాదాలే. సైకిల్ నడిపే పిల్లలకు రోడ్డు సేఫ్టీ గురించి తల్లి దండ్రులు శిక్షణ ఇచ్చినట్లయితే, ఈ సైకిల్ ప్రమాదాలను నివారింవచ్చు. సైకిల్ నడిపే టపుడు పిల్లలు హెల్మట్, హెడ్ గేర్ లాంటి రక్షణ కవచం ధరించాలి. కారు ముందు వరుస సీటులో కూర్చొని ప్రయాణించే పిల్లలు తీవ్రమైన గాయాలకు గురికావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ట్రక్కు బెడ్ పై పర్యవేక్షణ లేకుండా పిల్లలు ప్రయోగించినా అపాయానికి దగ్గరగా ఉంటారు. ప్రథమ చికిత్స బోధన వైద్య సహాయం వెంటనే అందుబాటులో లేకపోతే, ఆరోగ్య పరిస్థితి విషమించకుండా ఉండటానికి ఈ క్రింది పేర్కొన్న ప్రథమ చికిత్స చర్యలు తీసుకోవాలి.

కాలిన గాయాలకు ప్రథమ చికిత్సః

  • పిల్లల ఒంటిపై బట్టలకు మంటలు అంటుకుంటే, వెనువెంటనే ఆ అబ్బాయిని / అమ్మాయిని దుప్పటితో చుట్టి అగ్ని ఆరే దాకా నేలపై పొర్లించాలి.
  • ఒంటిపై కాలిన ప్రదేశాన్ని వెనువెంటనే చల్లబర్చాలి. ఇందుకు శుభ్రమైన, చల్లని నీటిని సమృద్ధిగా వాడాలి. ఒకవేళ కాలిన గాయాలు ఎక్కువగా ఉంటే, ఆ పిల్లవాణ్ణి చల్లని నీటితో నిండిన తొట్టిలో చల్లబడటానికి సుమారు అరగంట పట్టవచ్చు.
  • కాలిన ప్రదేశాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి. వదులైన బ్యాండేజీ తో కట్టి ఉంచండి. కాలిన గాయం నాణెం సైజ్ కన్నా పెద్దగా ఉంటే లేదా పొక్కులు వస్తే, ఆ పిల్లవాణ్ణి ఆరోగ్య కార్యకర్త వద్దకు తీసుకెళ్లండి. గాయాలపై ఏర్పడిన పొక్కులను పగలగొట్టవద్దు. అవి గాయాలకు రక్షణగా ఉంటాయి.
  • కాలిన గాయాలకు ఏదైనా అతుక్కొని ఉంటే, దాన్ని తొలగించరాదు. గాయంపై చల్లటి నీరు తప్ప ఏమీ పెట్టరాదు.
  • గాయాలైన పిల్లలకు పండ్లరసం, చక్కెర, ఉప్పు కలిపిన మంచి నీరు లాంటి ద్రవ పదార్థాలను ఇవ్వాలి.

విద్యుత్ షాక్ కొడితే ప్రథమ చికిత్స

  • పిల్లలు విద్యుత్ షాక్ కు గురైన లేదా కాలిన గాయాలైతే వెనువెంటనే మెయిన్ స్విచ్ ను ఆఫ్ చేసి మాత్రమే వారిని తాకాలి. తర్వాత, ఆ షాక్ తో పిల్లవాడు స్పృహ కోల్పోతే అతణ్ణి వెచ్చగా ఉంచి, వెంటనే వైద్య సహాయం పొందాలి.
  • బాధిత పిల్లవాడు శ్వాస తీసుకోవటం కష్టమైతే లేదా శ్వాస తీసుకోక పోతే, అతణ్ణి వెల్లకిలా పడుకోబెట్టి తలను కొద్దిగా వెనక్కివంచాలి. అతని ముక్కుపుటలను మూసి, మన నోటితో అతని నోటిలోకి గాలి ఊదాలి. గాలి ఎంత గట్టిగా ఊదాలంటే, ఆ పిల్లవాడి ఛాతీ గాలితో నిండి పాకి ఎదగాలి. మూడు అంకెలు లెక్కపెట్టి మళ్లీ ఇదే విధంగా గాలి ఊదాలి. పిల్లవాడు శ్వాస తీసుకోవటం మొదలు పెట్టే దాకా ఈ ప్రక్రియను కొనసాగిస్తునే ఉండాలి.

కింద పడటం లేదా రోడ్డుపైన కలిగే గాయాలకు ప్రధమ చికిత్స

తల, వెన్నుముక్కకు ముఖ్యంగా మెడకు తగిలే గాయాలు చాలా అపాయం తెస్తాయి. ఎందుకంటే, ఈ గాయాలు జీవితాంతం పక్షవాతం కలిగిస్తాయి లేదా ప్రాణాలకు ముప్పు తెస్తాయి. తల, వెన్నుముక్క, కదలికలను తగ్గించండి. తద్వారా వెన్నుముక్క మెలి తిరగకుండా, గాయం తీవ్రం కాకుండా నివారించవచ్చు.

  • కదలలేని లేదా భరించలేని తీవ్రమైన నొప్పి కలిగిన పిల్లవాడికి ఎముక విరిగి ఉండవచ్చు. గాయపడిన ఆ ప్రదేశాన్ని కదపకండి. దానికి ఆధారం ఇచ్చి వెనువెంటనే వైద్య సహాయం పొందండి.
  • బాబు / పాప ఒకవేళ స్పృహకోల్పోతే, వారిని వెచ్చగా ఉంచి, వెనువెంటనే వైద్య సహాయం తీసుకోండి.
  • నలిగిన లేదా బెణికిన వాటిపై మంచు ముక్కలు పెట్టండి లేదా గాయలపై భాగాన్ని చల్లని నీటితో ముంచండి.

ఇలా 15 నిముషాలు చేయండి. అయితే మంచు ముక్కను నేరుగా చర్మంపైన పెట్టరాదు. చర్మానికి - మంచు ముక్కకు మధ్య ఒక పొర బట్ట ఉండేలా చూడండి., మంచు ముక్కను లేదా నీటిని తొలగించి ఓ పావుగంట సేపు వేచి చూడండి. అవసరమనిపిస్తే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి. ఈ చల్ల దనం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది.

తెగిన గాయాలకు, పుండ్లకు ప్రధమ చికిత్స

  • తెగిన గాయం లేదా పుండ్లు చిన్న వాటికి అయితే
  • గాయం లేదా పుండును శుభ్రమైన నీరు, సబ్బుతో కడగండి.
  • గాయం పుండు చుట్టు పక్కల చర్మాన్ని ఆరనీయాలి.
  • పుండు గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి, బ్యాండేజీ కట్టాలి. తెగిన గాయం పుండ్లు పెద్దవి తీవ్రమైనవి అయితే గాజు ముక్క లేదా ఇతర ముక్క లేవైనా గాయానికి అతుక్కొని ఉంటే దాన్ని తొలిగించరాదు. అలా అతుక్కొని ఉన్న ముక్క గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుపడి ఉండవచ్చు. ఆ ముక్కను తొలిగిస్తే, గాయం తీవ్రంగా మారవచ్చు.
  • గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే, గాయపడిన ప్రదేశాన్ని ఛాతీకన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచాలి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. ఒకవేళ గాయంలో ఏదైనా తట్టుకొని ఉంటే, దాని పక్కన మడతల బట్టను పెట్టి నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయే దాకా ఇలా చేస్తూనే ఉండండి.
  • ఏదైనా మొక్కను గానీ, జంతుసంబంధ వస్తువులను గానీ గాయం పెట్టరాదు. వాటివల్ల ఇన్ ఫెక్షన్ కలుగుతుంది.
  • గాయం పైన బ్యాండేజీ కట్టండి. అయితే గట్టిగా కట్టరాదు. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాడేజీని కొంచెం వదులుగానే కట్టాలి.
  • బిడ్డకు వెంటనే వైద్య సహాయం అందించాలి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి. బిడ్డకు టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ ఇప్పించాలా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి.

గొంతులో అడ్డుకుంటే ప్రధమ చికిత్స

  • శిశువు, చిన్న పిల్లవాడు ఒకవేళ దగ్గుతుంటే మీరు జోక్యం చేసుకోరాదు. వారంతట వారే గొంతులోని వస్తువును ఒయటికి కక్కేలా చూడండి. ఒకవేళ ఆ వస్తువును వెంటనే కక్కలేకపోతే, వారి నోటిలో నుంచి మీరే వేలుపెట్టి తొలిగించండి.
  • ఒకవేళ ఆ వస్తువు ఇంకా బిడ్డ గొంతులోనే తట్టుకొని ఉంటే

శిశువులు, చిన్న పిల్లలకైతే, తల, మెడకు ఆధారమివ్వండి. బిడ్డ ముఖాన్నినేలపైపు పెట్టి, తలను పాదాల కన్నా కిందకు వంచండి. వెనుకనుంచి రెండు భుజస్కంధాల మధ్య ఐదుసార్లు గుద్దండి. తర్వాత బిడ్డ ముఖాన్ని పైకి ఎత్తి, రెండు రొమ్ముల మధ్య ఉండే ఛాతీ ఎముకను గట్టిగా ఐదుసార్లు నొక్కండి. ఇలా గొంతులొ వున్న వస్తువు వెలికివచ్చే దాకా చేస్తూనే ఉండండి. మీరు దాన్ని వెలికి తీయ లేకపోతే, బిడ్డను సమీపంలోని ఆరోగ్య కార్యకర్త వద్దకు వెంటనే తీసుకెళ్లండి. పెద్ద పిల్లల కైతేః బిడ్డ వెనుక మీరు నిలబడి అతని నడము చుట్టూ చేయి వేయండి. పిడికిలి బిగించి బొటన వేలును బిడ్డ బొడ్డు పై భాగంలో ఛాతీ ఎముక కింద నొక్కి పెట్టండి. మీ ఇంకోచేతిని మరోవైపు నుంచి చుట్టి, పిడికిలి బిగించిన చేతిపై ఉంచి కడుపు లోపలికి, బయటికి వత్తుతూ ఉండండి. వస్తువు వెలికి వచ్చేదాకా దీన్ని పదే పదే చేయండి. మీరు వెలికితీయలేకపోతే బాబు / పాపను దగ్గరలోని ఆరోగ్య కార్యకర్త వద్దకు తీసుకెళ్లండి.

నీటిలో మునిగినపుడు లేదా శ్వాస సమస్యకు ప్రధమ చికిత్స

  • తల లేదా మెడకు గాయమైన దాఖలాలు ఉంటే, బిడ్డ తలను కదిలించకుండా ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించండి.
  • పిల్లవాడు శ్వాస తీసుకోలేకపోతే లేదా శ్వాస కష్టమనిపిస్తే, అతణ్ణి వెల్లికిలా పడుకోబెట్టి తలను స్వల్పంగా వెనక్కి వంచండి. బిడ్డ ముక్కుపుటలను మూసి, నోటిలోకి గాలి ఊదండి. బిడ్డ ఛాతీ పైకి ఉంబికే దాకా గట్టిగా గాలి ఊదుతూనే ఉండండి. . మూడు అంకెలు లెక్కపెట్టి, మళ్లీ ఇదే ప్రక్రియను నిర్వహించండి. బాబు / పాప శ్వాస తీసుకోవటం ప్రారంభించేదాకా దీన్ని కొనసాగించండి.
  • బాబు / పాప శ్వాస తీసుకుంటుంన్నప్పుటికీ స్పృహ కోల్పోయి ఉంటే, వారిని ఇరువైపులకు దొర్లిస్తూ కదపండి. తద్వారా వారి శ్వాసకు నాలుక అడ్డు పడకుండా ఉంటుంది.

విషాన్ని స్వీకరిస్తే ప్రథమ చికిత్స

  • పిల్లలు ఒకవేళ విషం సేవిస్తే, వారిని వాంతి చేయించడానికి ప్రయత్నించరాదు. ఇది వారికి మరింత అస్వస్థత కలిగిస్తుంది.
  • విషం, ఒకవేళ పిల్లల చర్మానికి లేదా దుస్తుల పైన పడితే, వారి బట్టలను తొలగించి, ఒంటిపై బాగా నీళ్లు కుమ్మరించండి. చర్మాన్ని సబ్బుతో రుద్దుతూ పలుసార్లు కడగండి.
  • ఒకవేళ బిడ్డ కళ్లపై విషం పడి ఉంటే, శుభ్రమైన నీటిని, ఆ కళ్లపై పదినిముషాల పాటు వెదజల్లండి.
  • బిడ్డను వెంటనే ఆరోగ్య కేంద్రం లేదా ఆస్పత్రీకి తీసుకెళ్లండి. వీలైతే, వారు సేవించిన విషం, ఔషధం శాంపిల్ ను లేదా కంటెయినర్ ను తీసుకెళ్లండి పిల్లలను వీలైనంత స్థిరంగా, ప్రశాతంగా ఉంచండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate