“డయేరియా ” గురించిన సమాచారాన్ని తెలుసుకొని, దాన్ని ఆచరించటం ఎందుకు ముఖ్యమంటే డీహైడ్రేషన్ (శరీరంలోని నీరు తొలగిపోవటం) మరియు కుపోషణ కలిగించే డయేరియా ప్రతి ఏడాది పది లక్షల కన్నా ఎక్కువ మంది పిల్లలను చంపివేస్తోంది. డయేరియా తో పెద్దల కన్నా పిల్లలు తొందరగా మరణించే అవకాశం ఉంది. ఎందుకంటే, వారు తొందరగా డీహైడ్రేట్ అవుతారు. డయేరియా కు గురైన ప్రతి 200 మంది పిల్లల్లో ఒకరు మరణిస్తారు. కీటకాలను, ముఖ్యంగా మలం నుంచి వచ్చే కీటకాలను మింగటం వల్ల డయేరియా కు గురవుతారు. విసర్జించిన మలాన్ని సురక్షితంగా తొలగించకపోవటం వల్ల, అపరిశుభ్రమైన అలవాట్లతో, పరిశుద్ధమైన మంచినీరు లేకపోవటం లేదా శిశువులకు రొమ్ముపాలు ఇవ్వకపోవటం వల్ల ఎక్కువగా (తరచూ) డయేరియా వస్తుంది. కేవలం రొమ్ముపాలు మాత్రమే తాగే పిల్లలకు చాలా అరుదుగా డయేరియా వస్తుంది. ప్రభుత్వ సహాయంతో సంఘము - ప్రతి కుటుంబమూ స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయటం ద్వారా డయేరియా కలిగించే పరిస్థితులను నివారించవచ్చు.
డయేరియా (నీళ్ల విరేచనాలు) గురించి ప్రతి కుటుంబం, సమాజం ఏమేం తెలుసుకోవలసిన హక్కు కలిగి ఉంది.
డయేరియా పిల్లల శరీరంలోని నీటినంతా తోడివేసి, వారిని చంపుతుంది. విరేచనాలు మొదలైన వెంటనే పిల్లలకు అదనంగా ద్రవ పదార్థాలు ఇవ్వటం తప్పనిసరి. రోజూ ఇచ్చే ఆహార, పానీయాలకు అదనంగా వీలైనంత ఎక్కువ ద్రవ పదార్థాలను పిల్లలకు ఇవ్వాలి. రోజుకు మూడు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు విరేచనాలు నీళ్లలాగా పోతే ఆ బాలుడు / బాలికకు డయేరియా ఉన్నట్లు. నీళ్ల విరేచనాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, డయేరియా ప్రమాదం అంత అధికంగా ఉంటుంది. ద్రవ పదార్థాలు తీసుకోవటం వల్ల డయేరియా తీవ్రత పెరుగుతుందని కొందరు అనుకుంటారు. కాని అది తప్పు. నీళ్ల విరేచనాలు వున్న పిల్లలకు వీలైనన్ని ఎక్కువ సార్లు ద్రవ పదార్థాలు తాగిస్తూనే ఉండాలి. డయేరియా పూర్తిగా తగ్గే వరకు ఇలా చేస్తూనే ఉండాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగటం వల్ల డయేరియా లో కోల్పోయిన నీటిని శరీరంలో తిరిగి భర్తీ చేసినట్లు అవుతుంది.
డయేరియా తో వున్న పిల్లలకు సిఫార్సు చేసిన ద్రవ పదార్థాలు :రొమ్ముపాలు (మామూలు కన్నా ఎక్కువ సార్లు తల్లి పాలివ్వాలి)
పానీయాలన్నీ పూర్తిగా పరిశుభ్రంగా కప్పుతోనే ఇవ్వాలి. పాల సీసాలతో ఈ ద్రవాలను ఎప్పుడూ ఇవ్వరాదు. ఈ బాటిళ్లను పూర్తి శుభ్రంగా కడగటం కష్టం. అపరిశుభ్రమైమ కప్పు వల్ల డయేరియా కలుగుతుంది. పిల్లలు వాంతి చేసుకుంటే, సంరక్షకులు ఓ 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత తిరిగి ద్రవ పదార్థాలను పిల్లకు మెల్లిగా ఇవ్వాలి. చిన్నచిన్న గుక్కలుగా తాగించాలి. డయేరియా పూర్తిగా తగ్గేవరకూ పిల్లలకు అదనపు పానీయాలు ఇస్తూనే ఉండాలి. సాధారణంగా డయేరియా మూడు-నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ, ఇది వారం రోజుల కన్నా ఎక్కువ ఉంటే, సంరక్షకులు శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త సహాయం తీసుకోవాలి.
గంట వ్యవధిలోనే పలుసార్లు నీళ్ల విరేచనాలు కలిగితే లేదా మలంలో రక్తం పడితే, పిల్లల ప్రాణాలకు ముప్పు ఉన్నట్లే. వెంటనే పొందిన ఆరోగ్య కార్యకర్త సహాయం అవసరం.
తల్లిదండ్రులు ఈ క్రింద పేర్కొన్న సందర్భాల్లో వెంటనే శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త సహాయం పొందాలి.
గంట, రెండు గంటల వ్యవధిలోనే పిల్లలు పలుసార్లు నీళ్లతో కూడిన విరేచనాలు, వాంతులు చేసుకుంటే అపాయం ముంచుకొస్తుందన్న హెచ్చరికగా భావించాలి. ఎందుకంటే, అది కలరా ప్రబలిన సంకేతం కావచ్చు. కలరా పిల్లలను కొన్ని గంటల వ్యవధిలోనే చంపేస్తుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందండి.
కలుషితమైన నీరు, ఆహారం, కారణంగా కలరా వ్యాది వాడవాడలా అతివేగంగా విస్తరిస్తుంది. అతిగా ఉన్న జన సమూహాలు, పారిశుధ్య లోపం లాంటి పరిస్థితుల్లోనే సాధారణంగా కలరా వ్యాధి తలెత్తుతుంది. కలరా లేదా డయేరియా వ్యాది విస్తరణకు అడ్డుకట్టు వేయటానికి నాలుగు దశలు ఉన్నాయి.
శిశువుకు రొమ్ముపాలు మాత్రమే ఇస్తున్నట్లైతే, డయేరియా తీవ్రతను తగ్గించవచ్చు. పదేపదే రాకుండా చూడొచ్చు. డయేరియా కు గురైన శిశువుకు రొమ్ముపాలు అతి చక్కని ద్రవ పదార్థం, ఆహారం. తల్లిపాలు పుష్టికరమే కాకుండా అవి పరిశుభ్రంగా ఉండి, వ్యాధులు, ఇన్ ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. కేవలం రొమ్ముపాలు మాత్రమే త్రాగే శిశువు డయేరియా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రొమ్ముపాలు డీ - హైడ్రేషన్ ను, కుపోషణను నిరోధిస్తుంది. శరీరం కోల్పోయిన ద్రవాలను భర్తీ చేస్తుంది. పిల్లలు డయేరియా తో ఉన్నపుడు రొమ్ముపాలు తక్కువగా ఇవ్వాలని కొందరు తల్లులకు సలహా ఇస్తారు. ఈ సలహా చాలా తప్పు. మామూలు కన్నా కూడా ఎక్కువగా డయేరియా గల పిల్లలకు ఈ సమయంలో రొమ్ముపాలు అధికంగా, తరచుగా ఇవ్వాలి.
డయేరియా కు గురైన పిల్లలు క్రమం తప్పకుండా ఆహారం తినటం చాలా అవసరం. నీళ్ల విరేచనాల నుంచి కోలుకుంటున్నపుడు, పిల్లలకు రెండు వారాల వరకైనా ప్రతిరోజు కనీసం ఒక్కపూట భోజనం అదనంగా (ఎక్కువగా) తినిపించాలి. డయేరియా తో ఉన్న పిల్లలు బరువు కోల్పోయి త్వరితంగా కుపోషణకు గురవుతారు. డయేరియా గల పిల్లలు ఎప్పటిలాగే వారు తీసుకోగలిగే ఆహార పానీయాలు తీసుకోవటం అవసరం. డయేరియా ను తగ్గించటానికి ఆహారం తోడ్పడుతుంది. మరియు పిల్లలు త్వరితంగా కోలుకోగలరు. డయేరియా తో ఉన్న పిల్లలకు తినబుద్ది కాదు లేదా వాంతులు చేసుకుంటుంటారు. కనుక, వారికి తినిపించటం కష్టసాధ్యం అవుతుంది. ఒకవేళ శిశువుకు 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉంటే, వారు తరచూ తినటానికి తల్లిదండ్రులు, సంరక్షకులు ప్రోత్సహిస్తుండాలి. మెత్తగా, గుజ్జుగా చేసిన ఆహారాన్ని లేదా పిల్లలకు ఇష్టమైన పదార్థాలను చిన్నచిన్న మొత్తాల్లో వారికి తినిపిస్తుండాలి. ఈ ఆహారపదార్థాలన్నింటిలో కూడా చిటికెడు ఉప్పు ఉండేలా చూడాలి. గట్టి పదార్థాల కన్నా మెత్తని ఆహార పదార్థాలు తినడానికి సులభంగా ఉండటమే గాక, ద్రవాలు కలిగి ఉంటాయి. నీళ్ల విరేచనాలు చేసే పిల్లలకు పప్పులు, బీన్స్ గానీ చేపలు, బాగా ఉడకబెట్టిన మాంసం గానీ పెరుగు, పండ్లు లాంటి వాటిని బాగా గుజ్జుగా చేసి, అంటే జావలాగా చేసి తినిపించటం శ్రేయస్కరం. పప్పుధ్యాన్యాలు, కూరగాయలకైతే, ఒకటి, రెండు స్పూన్ల నూనెను కలపవచ్చు. ఈ ఆహార పదార్థాలన్నింటిని కూడా తాజాగా తయారు చేసి, అంటే ఎప్పుటికప్పుడు వండి రోజుకు కనీసం ఐదు -ఆరుసార్లు పిల్లలకు తినిపించాలి. నీళ్ల విరేచనాలు తగ్గిన తర్వాత, పిల్లలు కోలుకోవటానికి అదనపు ఆహారం చాలా ముఖ్యం. ఈ దశలో, పిల్లలు రోజూ ఒకపూట అదనంగా భోజనం చేయాలి. లేదా తల్లి రొమ్ముపాలు ఎక్కువగా ఇవ్వాలి. కనీసం రెండు వారాల పాటు ఈ అదనపు ఆహారం కొనసాగించాలి. తద్వారా డయేరియా తో కోల్పోయిన శక్తిని, పోషకాలను పిల్లలు తిరిగి భర్తీ చేసుకోవటానికి సహాయపడుతుంది. డయేరియా రాకముందు పిల్లలు ఎంత బరువు ఉన్నారో తిరిగి శరీరం ఆ బరువు తూగేదాకా పిల్లలు నీళ్ల విరేచనాల నుంచి పూర్తిగా కోలుకోనట్లే లెక్క. విటమిన్ -ఎ క్యాప్సూల్, విటమిన్ - ఎ కలిగిన ఆహార పదార్థాలు పిల్లలు డయేరియా నుంచి కోలుకోవటానికి సహాయపడతాయి. విటమిన్ -ఎ కలిగిన పదార్థాల్లో రొమ్ముపాలు, లివర్ (కార్జము/కలేజా) , చేపలు, పాల ఉత్పత్తులు, నారింజ లేదా పసుపురంగు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయి.
డయేరియా తో పిల్లలు ఒకవేళ తీవ్రంగా లేదా నిరంతరంగా డీ -హైడ్రేట్ అయినట్లైతే, కేవలం నోటి ద్వారా ఇచ్చే రీ - హైడ్రేషన్ ద్రవాన్ని గానీ, ఆరోగ్య కార్యకర్త సూచించిన ఔషధాలను గానీ ఇవ్వాలి. డయేరియా కు సంబంధించి ఇతర మందులు సాధారణంగా ప్రభావం చూపవు. పైగా పిల్లలకు హానీ చేస్తాయి. సాధారణంగా డయేరియా దానంతట అదే కొద్దిరోజుల్లోనే తగ్గిపోతుంది. అయితే, పిల్లలు, తమ శరీరంలో ద్రవాలను, పోషకాలను కోల్పోవటమే అసలైన ప్రమాదం కలిగిస్తుంది. ఇది డీ - హైడ్రేషన్, కుపోషణకు దారి తీస్తుంది. ఆరోగ్య కార్యకర్త చెబితే తప్ప, డయేరియా కు గురైన పిల్లలకు ఎలాంటి మాత్రలు గానీ, యాంటీ - బయోటిక్స్ గానీ ఇతర మందులు గానీ ఇవ్వరాదు. డయేరియా కు అత్యుత్తమమైన చికిత్స ఏమిటంటే, విరివిగా ద్రవ పదార్థాలు, పానీయాలు త్రాగటం మరియు తగినన్ని కలిపిన ఓ.ఆర్.ఎస్. ద్రవాన్ని తీసుకోవటం. ఒకవేళ ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో లేకపోతే, నాలుగు టీ స్పూన్ల చక్కెర, సగం టీ స్పూన్ ఉప్పును ఒక లీటరు పరిశుభ్రమైన నీటిలో కరిగేలా కలిపి, డీ - హైడ్రేషన్ కు చికిత్సగా ఇవ్వవచ్చు. చక్కెర, ఉప్పును కలిపే టపుడు చాలా అప్రమత్తంగా ఉండండి. చక్కెర ఎక్కువైతే, డయేరియా ఇంకా ముదురుతుంది. అలాగే, ఉప్పు కూడా మితిమీరితే, పిల్లలకు హానీ చేస్తుంది. ఒకవేళ, చక్కెర ఉప్పు కలిపిన నీటి మిశ్రమం కొంచెం పలుచగా మారితే ఎలాంటి హాని కలుగదు. చికిత్సలో దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుంది. మీజిల్స్ కారణంగా తరచూ డయేరియా వస్తుంది. మీజిల్స్ రాకుండా పిల్లలకు టీకా మందు ఇప్పించినట్లయితే, మీజిల్స్ కారణంగా వచ్చే డయేరియా ను నివారించవచ్చు.
ఓ.ఆర్.ఎస్. ద్రవం - డయేరియా కు ప్రత్యేక పానీయం. ఓ.ఆర్.ఎస్. అంటే ఏమిటి ? ఓ.ఆర్.ఎస్. (ఓరల్ రీ - హైడ్రైషన్ సాల్ట్స్) అంటే నోటి ద్వారా ఇచ్చే ప్రత్యేకమైన మిశ్రమ పొడి ఉప్పు పదార్థం. సురక్షితమైన నీటిలో కలిపిన ఈ పొడి పదార్థం శరీరం కోల్పోయిన ద్రవ పదార్థాలను భర్తీ చేయటానికి సహాయపడుతుంది. అంటే, డయేరియా వల్ల శరీరం నష్టపోయే విపరీతమైన ద్రవ పదార్థాలు, ఈ పొడిని కలిపిన నీటిని తాగితే తిరిగి కూడగట్టుకోగలదు.
ఓ.ఆర్.ఎస్. ఎక్కడ పొందవచ్చు ? చాలా దేశాల్లో ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు ఆరోగ్య కేంద్రాలు, ఔషధశాలలు, మార్కెట్లు, షాపుల్లో లభిస్తాయి. ఓ.ఆర్.ఎస్. పానీయం ఎలా చేయాలి.
ఓ.ఆర్.ఎస్. పానీయం ఎంత ఇవ్వాలి ? పిల్లలు ఎంత వీలైతే అంత త్రాగేలా ప్రోత్సహించాలి. రెండేళ్ల లోపు వయస్సు పిల్లలు పెద్దసైజు గ్లాసుల్లో పావు నుంచి అరగ్లాసు ఓ.ఆర్.ఎస్. ద్రవాన్ని ప్రతి నీళ్ల విరేచనం తర్వాత త్రాగాలి. రెండేళ్ల పై వయస్సు పిల్లలు నీళ్ల విరేచనం చేసిన ప్రతిసారి అరగ్లాసు నుంచి పూర్తి గ్లాసు నిండా ఓ.ఆర్.ఎస్. ద్రవాన్ని త్రాగాలి.
సాధారణంగా మూడు - నాలుగు రోజుల్లో డయేరియా ఆగిపోతుంది. ఒకవేళ, వారం రోజుల తర్వాత కూడా తగ్గకపోతే, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి.
డయేరియా నివారించాలంటే మల పదార్థాలను మరుగుదొడ్డి (లెట్రిన్ / టాయిలెట్) ద్వారా తొలగించాలి లేదా పూడ్చి పెట్టాలి. ఇంట్లో త్రాగే నీటిని, ఆహారాన్ని, చేతులను, వంట పాత్రలను లేదా వంట తయారీ ప్రదేశాన్ని ఒకవేళ మలం తాకితే, పిల్లలు, పెద్దలు డయేరియా కలిగించే కీటకాలను మింగే అవకాశం ఉంటుంది. మలంపై కూర్చున్న ఈగలు తర్వాత ఆహారంపై వాలితే వాటితో పాటు డయేరియా కలిగించే క్రిములు కూడా బదిలీ అవుతాయి. కనుక, ఆహారం, మంచినీటిపైన మూతలు పెడితే, ఈగల నుంచి రక్షణ లభిస్తుంది. మలం శిశువులదైనా పిల్లలదైనా వాటిల్లో క్రిములు, కీటకాలు ఉంటాయి. కనుక ప్రమాదకరం. పిల్లలు మరుగుదొడ్డి ఉపయోగించకుండా మలం విసర్జిస్తే, దాన్ని వెంటనే మరుగుదొడ్డి లోకి ఎత్తిపోసి, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి లేదా మలాన్ని పూడ్చిపెట్టాలి. ల్యాట్రిన్ / టాయిలెట్ (మరుగు దొడ్డి ) లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచటం ద్వారా, డయేరియా కలిగించే క్రిమికీటకాలు విస్తరించ కుండా నివారించవచ్చు. టాయిలెట్ /ల్యాట్రిన్ సౌకర్యం లేని వారు పెద్దలైనా, పిల్లలైనా మల విసర్జనకు ఇళ్ల నుంచి దూరంగా వెళ్లాలి. కాలిబాట, నీటి సరఫరా మార్గాలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలకు దూరంగా మల విసర్జన చేయాలి. తర్వాత మలంపై ఒక పొర మట్టిని కప్పాలి. ల్యాట్రిన్ టాయిలెట్ లేని ఊరు, వాడల్లో ప్రజలంతా కలిసి ఆ సౌకర్యం ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలి. నీటి ఆధారాలను మానవ, జంతు మలాలకు దూరంగా చాలా పరిశుభ్రంగా ఉంచాలి.
చక్కని పరిశుభ్రమైన అలవాట్లు డయేరియా నుంచి కాపాడతాయి. మల విసర్జన తర్వాత లేదా వాటిని తాకిన తర్వాత చేతులను సబ్బు లేదా బూడిదను ఉపయోగించి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆహార పదార్థాలను ముట్టుకునే ముందు లేదా పిల్లలకు తినిపించే ముందు కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
డయేరియా నివారణకు సహాయపడే ఇతర పరిశుభ్రతా చర్యలు :
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/29/2020
కాన్పులకు వ్యవధి అనే సమాచారాన్ని అందరూ తెలుసుకొని ...
సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శ...