অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విజ్ఞానశాస్త్రం - బోధన లక్ష్యాలు

విద్యాబోధనలో ప్రతి ఉపాధ్యాయుడికి విద్యాలక్ష్యాల వర్గీకరణ గురించి; గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు అనే పదాల గురించి అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. ఎందుకంటే విద్య అనే త్రిధ్రువ ప్రక్రియలో మొదటి సోపానం బోధనా లక్ష్యాలను రూపొందించడం. రెండో సోపానం అభ్యసనానుభవాలను కల్పించడం, మూడోది ప్రవర్తనా మార్పులను మూల్యాంకనం చేయడం.

  • సాధారణంగా అంతిమ గమ్యాలనే 'ఉద్దేశాలు' అంటారు.
    ఉదా: విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్ర జ్ఞానాన్ని కలిగించడం
  • నిర్దిష్టమైన త్వరితగతిన సాధించగల గమ్యాలనే 'లక్ష్యాలు' అంటారు. లేదా గమ్యాన్ని చేరడానికి ఉపయోగకరమైన   సాధనాలు లేదా మార్గాలను 'లక్ష్యాలు' అంటారు.
  • నిర్దిష్ట కాలంలో ఒక పాఠ్యబోధన వల్లగానీ, ఒక ప్రామాణిక అంశాన్ని బోధించడం వల్ల గానీ లభించే అంత్య ఉత్పాదనను 'బోధనా లక్ష్యం' అంటారు.
    ఉదా: విద్యార్థి కిరణజన్య సంయోగక్రియ భావనను అవగాహన చేసుకోవడం.
  • విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పులను సూచించేవి - స్పష్టీకరణలు.
  • విద్యార్థి గడించిన సామర్థ్యాన్ని సూచించేవి, నిర్దిష్ట  అభ్యసన ఫలితాలుగా పిలిచేవి - స్పష్టీకరణలు. 
    ఉదా: విద్యార్థి వృక్షకణం, జంతుకణాలకు మధ్య భేదాలను గుర్తిస్తాడు.
  • ఉద్దేశాలు స్థూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులు, విద్యావేత్తలు నిర్ణయిస్తారు.
  • ఉద్దేశాలకు విశాల పరిధి ఉంటుంది. సామాజిక అవసరాలకు అనుగుణంగా మానవుడిని తీర్చిదిద్దేట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో సాధించడానికి వీలుగా ఉంటాయి.
  • లక్ష్యాలు నిర్దిష్టంగా ఉండి స్వల్పకాలంలో సాధించ డానికి వీలుగా ఉంటాయి.
  • లక్ష్యాలను అధ్యాపకులు విద్యార్థి కేంద్రంగా నిర్ణ యిస్తారు.
  • ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఉద్భవిస్తాయి (గమ్యాలుస ఉద్దేశాలు స లక్ష్యాలు).
  • స ఆర్.సి. రాస్ ప్రకారం విజ్ఞానశాస్త్ర బోధనోద్దేశం విద్యార్థిలో సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడి పూర్తి మూర్తి మత్వాన్ని అభివృద్ధి చేసేదిగా ఉండాలి. ప్రస్తుత శాస్త్ర, సాంకేతిక ఆధునిక సమాజంలో మనుగడ సాధించగల వాడిగా విద్యార్థిని తీర్చిదిద్దాలి.
  • సి.పి.ఎస్.నాయర్ ప్రకారం ఉద్దేశాలు, లక్ష్యాలు విషయ బోధన ద్వారా విద్యార్థి పెరుగుదలకు దోహదం చేసేవిగా ఉండాలి. ఉద్దేశాలను, లక్ష్యాలను నిర్దేశించేటప్పుడు, అభ్యసనకు సంబంధించిన మానసిక అంశాలనూ, బోధనా పద్ధతులకు చెందిన సూత్రాలనూ, అభ్యాసకుడి దశను గుర్తుంచుకొని, మూల్యాంకనం చేయడానికి వీలైన లక్ష్యాలనే ఎన్నుకోవాలి.
  • నేషనల్ సొసైటి ఫర్ సైన్స్ 59వ వార్షిక పుస్తకం ప్రకారం ప్రతి ఒక్కరికి శాస్త్రపరిజ్ఞానం అవసరం. తద్వారా శాస్త్రమంటే ఏమిటో సరైన అవగాహన ఏర్పడుతుంది.
  • నేషనల్ సొసైటి ఫర్ ది స్ట్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను ఎంపిక చేసుకోవడానికి సూచనలు చేసింది.
  1. తరగతి గదిలో ఉపాధ్యాయుడు అమలుపరచడానికి వీలుగా ఉండాలి.
  2. తార్కికంగా ఒక దశ నుంచి మరొక దశకు వృద్ధి చెందేట్లు ఉండాలి.
  3. పరమ లక్ష్యసాధనకు తోడ్పడేట్లు ఉండాలి.
  4. విద్యార్థి ప్రవర్తన రూపంలో చెప్పాలి.
  5. మానసికంగా సరైనవిగా ఉండాలి.
  6. సాధారణ పరిస్థితుల్లో లక్ష్యాలు సాధించేట్లుగా ఉండాలి.
  7. ప్రజాస్వామ్యయుత సంఘంలో లక్ష్యాలకు సార్వజనీనత ఉండాలి.
  8. తరగతిలో విద్యార్థి చేయవలసిన కృత్యాలు స్పష్టంగా నిర్దేశించేట్లు ఉండాలి.

థర్బర్, కోలెట్టె సూచనలు

  1. ఉపయోగత్వం: కోరదగిన అభ్యాసనాలు నిజ జీవితంలో ఉపయోగపడేవిగా ఉండాలి.
  2. సమకాలీనత: లక్ష్యాలు వర్తమానానికి సంబంధించినవై ఉండాలి.
  3. అనువు: ప్రధాన లక్ష్యాన్ని చేరడానికి అనువైన రీతిలో లక్ష్యాలు తోడ్పడాలి.
  4. అనుగుణ్యత: విద్యార్థుల స్థాయికి, వారి పూర్వ జ్ఞానానికి తగినట్లు ఉండాలి.
  5. ఆచరణయోగ్యత: విద్యార్థి అభివృద్ధికి తగిన అనుభవాలను కలగజేయడానికి వీలుగా ఉండాలి.
1948లో బోస్టన్‌లో జరిగిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల సమావేశంలో విద్యాలక్ష్యాలను విభజించాలనే ఆలోచన ఏర్పడింది.
లక్ష్యాలను విభజించడంలో విద్యావిషయక, తార్కిక, మానసిక ఆధారాలుండాలని నిర్ణయించడమైంది.

బి.ఎస్.బ్లూమ్స్ లక్ష్యాలు

1956లో విద్యావిషయక లక్ష్యాలను మూడు ప్రధాన రంగాలుగా విభజించారు. అవి:

జ్ఞానరంగం తలకు సంబంధించింది. ఇందులోని లక్ష్యాలను బి.ఎస్. బ్లూమ్స్ వివరించారు.

  • ప్రజ్ఞ సామర్థ్యాలు, సమస్యల పరిష్కారాలకు, ఆలోచనలకు సంబంధించిన రంగం జ్ఞానరంగం.
  • జ్ఞానరంగంలో జ్ఞానానికి సంబంధించి జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, జ్ఞానసామర్థ్యాన్ని పెంచు కోవడం అనే లక్ష్యాలను చేర్చారు.
  • జ్ఞానం అనేది జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం.

జ్ఞానం అంటే

  • నిర్దిష్టమైన, అసంయుక్తాత్మకం అయిన సత్యాలు, సమాచారం.
  • శాస్త్రీయ పారిభాషిక పదజాలం
    ఉదా: బలం అంటే ఏమిటి?
  • సంఘటనలు, తారీఖులు, వ్యక్తులు- విషయ సేకరణ ఆధారాలు.
    ఉదా: విద్యాలక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు జరిగింది?
  • పద్ధతులు, క్రమానుగతాలు
  • వ్యవస్థీకరణకు మార్గాలు
  • వర్గీకరణలు - వర్గాలు
  • సత్యాలు, భావనలు, సూత్రాలు పరీక్షించి నిర్ణయించడానికి ఉపయోగపడే లక్షణాలు.

బోధనా పద్ధతులు

  • విశ్వజనీనమైన అంశాలు – విషయతత్వాలు
  • సూత్రాలు- సాధారణీకరణాలు వాటి మధ్య పరస్పర సంబంధాలు జ్ఞప్తికి తెచ్చుకోవడం జ్ఞానం అనవచ్చు.

అవగాహన

విద్యార్థి తాను సేకరించిన సమాచారాన్ని తనకు బాగా అర్థవంతమయ్యేవిధంగా మార్చుకుంటాడు. విషయాన్ని వివరించడం లేదా కుదించడం చేయవచ్చు. అవగాహనలో మూడు ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణలు ఉంటాయి. అవి..

  • అనువాదం: ఒక పరిష్కారం నుంచి మరొక పరిష్కారానికి.
  • అర్థ వివరణ: వర్ణించడం, అన్వయం చేయడం, పోల్చడం, తేడాలు తెలపడం మొదలైనవి ఇందులో ఉంటాయి.
  • ఎక్ట్స్రాపొలేషన్ (బహిర్షీశనం): తెలిసిన సమాచారం నుంచి కార్యకారణ సంబంధం తెలపడం, సమాచారాన్ని విస్తరించి నిశ్చయంగా తెలపడం.
  • వినియోగం: సేకరించిన సమాచారాన్ని సరైన సూత్రాలుగా, సాధారణీకరణాలుగా రూపొందించడం, సమస్యలను పరిష్కరించడం ఉంటాయి.

విశ్లేషణ

విషయ - ప్రాతిపదికలను విడగొట్టి వాటి అంశాలను వ్యవస్థీకరించే విధానానికి ప్రాధాన్యం ఉంటుంది.

విశ్లేషణలో ముఖ్యాంశాలు

  • మూలతత్వాల విశ్లేషణ
  • పరస్పర సంబంధాల విశ్లేషణ
  • వ్యవస్థీకరణకు సంబంధించిన సూత్రాల విశ్లేషణ

సంశ్లేషణ

విడి భాగాలను మూలతత్వాలను ఒకే భాగంగా కూర్చుతారు లేదా స్థిరపరుస్తారు. 
సంశ్లేషణలో ముఖ్యాంశాలు:

  • శ్రేష్టమైన విషయ ప్రసార విధానాన్ని ఏర్పరచడం.
  • కార్యచరణ సముదాయాన్ని/ సంబంధిత ప్రణాళికను సిద్ధ పరచడం.
  • భావాత్మక సంబంధాల సముదాయాన్ని నిర్మించు కోవడం.

మూల్యాంకనం

  • విలువలు, భావనలు, అభిప్రాయాలు, సమస్యలకు పరిష్కారాలు, పద్ధతులు, సామగ్రి మొదలైనవాటి గురించి నిశ్చితాభిప్రాయాలు, నిర్ణయాలు చేయడం, బేరీజు వేయడం.

భావావేశ రంగం

ఈ రంగం అనేది ఆసక్తులు, వైఖరులు, విలువలు, అభినందనలు మొదలైన వాటికి సంబంధించింది. వీటిని మదింపు చేయడం, నిర్వచించడం లేదా మూల్యాంకనం చేయడం సులభం కాదు. దీనిలోని వివిధ అంశాలను క్రాత్‌వాల్ వర్గీకరించారు. అవి:

  • గ్రహించడం: విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన వివిధ రకాల అంశాలు, సమాచారాలను తెలుసుకోవడం అవసరమైనప్పుడు వాటి ప్రాప్తి స్థానాన్ని గుర్తించడం అనే అంశాలుంటాయి. భావావేశ రంగంలో మొట్ట మొదటిది
  • ప్రతిస్పందన: చర్యకు ప్రతిచర్యను చూపడమే కాకుండా శాస్త్ర విషయాలను పఠించడం శాస్త్ర పరమైన పాఠ్యేతర కార్యక్రమాల్లో, ప్రాజెక్టుల్లో పాల్గొనడం.
  • విలువ కట్టడం: శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం దీని లక్ష్యాల్లో ఒకటి. ఆదర్శాలనూ విలువలనూ అంతర్లీనం చేసుకుని వాటికి కట్టుబడి ఉండటం.
  • వ్యవస్థీకరణ: దీనిలో భావనలు, అభిప్రాయాలకు విలువ కట్టిన తర్వాత మదింపు చేసి, కొన్ని విలువలను స్థిరీకరిస్తారు. విలువలకు మధ్య పరస్పర సంబంధాలను ఏర్పరచడం, అమూర్త భావనలకూ మూర్త రూపం ఇవ్వడం జరుగుతుంది. జ్ఞాన రంగంలోని సంశ్లేషణ, విశ్లేషణలు దీనిలో కూడా వాడతారు.
  • శీల స్థాపనం: భావావేశరంగంలో అత్యున్నత స్థాయి. ఒక వ్యక్తి కొన్ని విలువలు, ఆలోచనలు, నమ్మకాలను అధీనం చేసుకుని విలువలను సమన్వయపరుచుకుని, వైఖరులను ఏర్పరచుకుని, జీవనతత్వంలోకి తన ప్రవర్తనను రూపొందించుకుంటాడు.

మానసిక చలనాత్మక రంగం

ఈ రంగంలో లక్ష్యాలను కచ్చితంగా, స్పష్టంగా పేర్కొనడం జరగలేదు. గిర్‌బెరిచ్ వర్గీకరణ విధానంలో వాటిని తెలుపవచ్చు.

గిర్ బెరిచ్ లక్ష్యాలు

  • నైపుణ్యాలు
  • జ్ఞానం
  • భావనలు
  • అవగాహన
  • వినియోగం
  • ఆచరణ
  • అభినందన
  • వైఖరులు
  • ఆసక్తులు
  • సర్దుబాట

విజ్ఞానశాస్త్రంలో లక్ష్యాలను ఏర్పరచడానికి తాత్విక, మానసిక, సామాజిక, శాస్త్రీయమైన ఆధారాలుండాలి.

లక్ష్యాలను ఏర్పరచడానికి ప్రధానమైన అంశాలు

  • అభ్యాసకుడి అవసరాలు, సామర్థ్యాలు
  • సమాజ అవసరాలు
  • విషయ పరిజ్ఞాన స్వభావం
  • విద్యావ్యవస్థ స్వభావం
  • భవిష్యత్తు ప్రణాళిక

ఈ అంశాల మధ్య సంబంధం నక్షత్రాకారంలో ఉంటుంది.

ఆధారము: భౌతిక, రసాయన శాస్త్ర బోధనా పద్దతులు... తెలుగు అకాడమి, ఆంధ్రప్రదేశ్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate