మేమీమధ్య మిర్యాలగుడకు కార్లో వెళ్తుంటే నకిరేకల్ దగ్గర విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారికి కలుస్తాము. నకిరేకల్ మరికొన్ని కిలోమీటర్లు ఉందనగా అటు ఇటు చిన్నా చితకా కొండలు ఉన్నాయి. కానీ కొండల మధ్య అడవులు లేవు. మేము అదే దారిలో సుమారు 20 సంవత్సరాల క్రిందట వెళ్ళాము. అటూ యిటు రోడ్డుకిరువైపులా దట్టమైన అడవులు ఉండేవి. దాదాపు 10 కి.మీ మేర అడవి గుండా మా వాహనం వెళ్లేది. కానీ నేడు అలాంటి అడవుల ఛాయలు లేవు. ఏమయ్యాయి ఆ అడవులు?
HCU లో నేను Ph.D చేసేపుడు తరచూ కర్నూలుకు వెళ్లేవాణ్ని. జడ్చర్ల దాటిన తర్వాత సుమారు 20 కిలోమీటర్ల దూరం పోయాక ఒక అడవి ఉండేది. నిర్మానుష్యంగా దట్టమైన పెద్ద పెద్ద చెట్ల మధ్య బస్సువెళ్లేది. రాత్రుళ్ల భయమేసేది. మళ్లీ ఈ మధ్యన తరచూ కర్నూలుకు వెళ్తూ వస్తూ ఉన్నామే కాని యిప్పడు జడచర్ల దగ్గర అపుడున్న అడవులు లేవు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు కడప పట్టణంలో జరుపుతుంటే అక్కడికి అతిథిగా కార్లో వెళ్ళాను. సభలు ముగిశాక మావూరు అన్నమాచార్య తాళ్లపాకకు వెల్లాను. ఒంటిమిట్టకు కడపకు మధ్య చిమ్మచీకటి తలపించేలా భౌకరాపేట ప్రాంతంలో అడవుల్ని ఊహించాను ఎందుకంటే నేను తాళ్ళపాకలో పాఠశాలలో చదివే సమయంలో అడపా దడపా కొత్త సినిమాలు చూడడానికి కడప పట్టణానికి వెళ్ళేవాళ్ళం. చాల దట్టమైన అడవులు నందలూరు నుండి కడపకు షుమారు 40 కి.మీ మేరా అడవులు విస్తరించి ఉండేవి అందులో క్రాంత భాగమైన ఉంటుందని ఆశించాను. కానీ దారి మొత్తం సాధారణ రోడ్లలాగా ఉంది కానీ యినుమంతైనా అడవుల జాదకానరాలేదు. ఇదే అనుభవం పాటకులయిన మీకు కలిగి ఉంటుంది. ఎక్కడికి పోయాయి ఆ అడవులు? అడవులు అంటే ఏమిటి? అవి ఉంటే ఎంత ఉండకపోతే ఎంత, అనుకుందామా?
అడవుల గురించి వివిధ ప్రాంతాల్లో వివిధ చారిత్రక దశల్లో వివిధ రకాల నిర్వచనాలున్నాయి. తమంత తాముగా దట్టంగా ఏపుగా వేలాదిగా కొన్ని చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వృక సముదాయాన్ని(అడవులుForests) అంటారు. జనావాసాలు, నాగరికత చిహ్నాలు లేకుండా సహజ సిద్ధంగా జంతు వృక్ష వైవిధ్యానికి ఆలవాలమైన పచ్చని వృక్ష జాతి పరంపరను అడవులు అంటాము. 2006 సంవత్సరంలో భూమిమీద, నేల ప్రాంతాలలో సుమారు మూడవవంతు మేర అడవులు ఉండేవని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కానీ ఆ విలువ 30 శాతానికి కింద నేడు ఉంటుంది. అన్నివిధాలయిన జీవావరణంలో నాలుగింట మూడు వంతుల భాగం (75శాతం) అడవులలోనే ఉందనీ మొత్తం వృక్షజీవావరణంలో 80 శాతం మేరకు అడవులలోనే ఉందని కూడా గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ధృవాల దగ్గర దగ్గర, పర్వత శ్రేణుల దగ్గర అడవులున్నాయి. వేర్వేరు ఉష్ణోగ్రత, వర్షపాతాల కనుగుణంగా వేర్వేరు అంశాలు, లక్షణాలతో అడవులు విస్తరించి ఉన్నాయి. అడవులు ప్రకృతి సహజ వనరులు. మానవుని ఆదిమ నాగరికత, సామాజిక విస్తరణ అడవులతోనే ప్రారంభమయింది. నేటికీ అడవులలో ఎన్నో ఆదిమ జాతులు, తెగలు నివసిస్తున్నాయి. ఆటవిక ప్రజాజీవితం నేటికీ వుంది. అడవులు మానవ నాగరికతతో విడదీయరాని సంబంధాన్ని కలిగివున్నాయి. ఎన్నో ఆటవిక ఉత్పత్తులు వర్తమాన జీవితంలో అంతర్భాగం అయ్యాయి. అడవులు పచ్చగా ఉండటంవల్ల ప్రపంచంలో ఉన్న ఆక్సిజన్ కు ప్రధాన వనరులుగా ఉన్నాయి. ఔషధ మొక్కలు, పండ్లు కలప, వంట చెరుకు, బంక (జిగురు), సుగ్రంధ ద్రవ్యాలు, గనులు, నారపీచు, విస్తరాకులు, బీడి ఆకులు, తేయాకు, కాఫీ, వెదుర్లు ఇంటి పైకప్పుకు ఉపకరించే పెద్ద పెద్ద ఆకులు తేనె వంటి ఉత్పత్తులకు అడవులు నెలవులుగా ఉన్నాయి.
ప్రపంచం మొత్తంలో షుమారు 4 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర అడవులు వుండగా అందులో షుమారు మూడవ వంతు (13 మిలియన్ చ. కి. మీ) రష్యా, బ్రెజిల్ దేశాల్లోనే ఉన్నాయి. రష్యాలో 8 మిలియన్ చ.కి.మీ, బ్రెజిల్లో 5 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర అడవులున్నాయి. ఆ తర్వాత స్థానం అమెరికా, కెనడాలలో (సుమారు 3 మిలియన్ కిలోమీటర్లు) ఉన్నాయి. మన దేశంలో ఉన్న అడవుల వైశాల్యం 4 లక్షల చదరపు కిలోమీటర్లు, కాగా చైనాలో 2 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర అడవులున్నాయి. ఎన్నో లక్షల జీవజాతులకు అత్యంత అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆవాసాన్ని కల్పించడమే కాకుండా పర్యాటక స్థలాలుగా కూడా అడవులు ఉపకరిస్తున్నాయి. సరైన వరాల రాకడకు అడవులు సహకరిస్తాయి. కానీ కాలక్రమేణ అడవుల వైశాల్యం తగ్గిపోతోంది! ఎవరు అందుకు కారణం? పర్యవసానం ఏమిటి? (ముగింపు వచ్చే సంచికలో)
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/30/2020