ఇవి చూడడానికి ముచ్చటగ ఉంటాయి గానీ... అమ్మల గుండెల్లో గాభరా పట్టిస్తాయి.
పువ్వో, పూలసజ్జో... ఓ అందమైన ఆకారం తయారయ్యిందంటే దాని వెనుకే కాగితం ముక్కల కుప్పలు, గుడ్డ పీలికలు, రంగుల మరకలు... చెత్త తయ్యారు.
కత్తులు, బ్లేడ్లు, కత్తెరలు. అమ్మో! చెయ్యి తెగుతుందేమో!
అంతంత సేపు వాటితో గడిపితే ఇక చదువెప్పుడు?
ఇవన్నీ అమ్మల సమస్యలు.
“నీ చేతిపని కాదుగానీ... నా చేతి నిండా పని!
నువ్వు చెయ్యావద్దు – ఇంటి నిండా చెత్త పొయ్యావద్దు" అంటారంటే అనరూ...?
కానీ అమ్మకీ మనసులో సంబరమే.
'ఎంత బాగా చేసింది నా తల్లి!" అని సంబర పడిపోతుంది.
ఎంత చెత్త పోసినా, "కాదేదీ క్రాఫ్టుకనర్హం" అన్నట్టు చిన్నారుల చిట్టి బుర్రలు, చిన్ని చేతులు చెత్త నుండి కళా ఖండాలు సృష్టిస్తాయి మరి.
ఆది నుంచి మనిషి పరిణామక్రమంలో, నాగరికత పెంపొందే దిశలో శాస్త్ర విజ్ఞానం శాఖోపశాఖలుగా విస్తరించడంలో - చేతిపనులు, దాని వెనుక సృజనాత్మకమైన ఆలోచన ముఖ్య పాత్ర వహించాయని చెప్పొచ్చు. తన సొంత ఆలోచననుండి, మేధస్సునుండి ఊహలోంచి ఒక వస్తువును లేదా ఆకృతిని సృష్టించడాన్ని క్రాఫ్టువర్కు /హస్తకళ/ చేతిపని అంటున్నాము.
రాళ్ళను ఆయుధాలుగా చెక్కడం నుంచి రాకెట్టు తయారీ వరకు...
జట్టును రకరకాల కొప్పులుగా మలచడం నుంచి శరీరంలో భాగాలలోకి సైతం చొచ్చుకుపోగల ఆంజియోస్కోపు పరికరం తయారీ వరకు...
తాటాకు బొమ్మ నుంచి రోబోల వరకు...
అన్నీ మనిషి సృజనకు చేతిపని జోడై పుట్టినవే.
సృజనాత్మకత ఊహల్లో రూపాన్ని పుట్టిస్తే... నైపుణ్యం దానికి నిజరూపాన్నిస్తుంది.
నృత్యం, సంగీతం, నటన వంటి కళా రూపాలకు క్రార్క్ భిన్నమైంది. తన ఊహల్లో రూపుదిద్దుకున్న వస్తువు సృశించగల నిజరూపం దాల్చడం పిల్లలకు అద్భుతంగా అనిపిస్తుంది. ఒక పరిపూర్ణమైన వస్తువును తాను సృష్టించానన్న వెలకట్టలేని ఆనందాన్నిస్తుంది.
పారాలు, పరీక్షలు, మార్ములు - ఈ మూడు విషయాల చుటూనే తిరిగే చక్రంలో చాలామంది పిల్లలు ఇమడలేరు. సహజసిద్ధమైన తెలివితేటలు ఉన్న పిల్లలు కూడా యాంత్రికంగా హడావుడిగా సాగిపోయే పాఠ్యకార్యక్రమాలలో ఎక్కువ ఆసక్తి చూపరు. క్రాఫ్ట్వర్క్లో మాత్రం అన్నిరకాల పిల్లలు, అన్ని స్థాయిల పిల్లలు ఇష్టంగా పాల్గొనడం చూసాం.
ఆలోచనలలో, నైపుణ్యంలో, వేగంలో పిల్లల మధ్య ఉండే వ్యత్యాసాలకు తగినంత స్థానముండడం.
సొంతపద్ధతిని కనిపెట్టే అవకాశం, తన ఆలోచనా పరిధిని ఎంతైనా విస్తరించుకునే అవకాశం ఉండడం పరీక్ష పోటీ లేకపోవడం తనలో నిగూఢమై ఉన్న శక్తులను సంపూర్ణంగా ఆవిష్కరించుకునే అవకాశం ఉండడం అంచెలంచెలుగా నిర్మించుకుంటూ జరిగే ప్రక్రియ కాబట్టి ఎప్పటికప్పుడు తన పనిని గమనించుకుంటూ మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశముండడం మొదలు పెట్టిన పనిని మధ్యలో ఆపి, ఇష్టమైనప్పడు తిరిగి కొనసాగించే వీలుండడం.
కత్తిరించడం, అంటించడం, మడులు వెయ్యడం, మడవడం వంటి పనులు చేయడం వల్ల సూక్ష్మకండరాల అభివృద్ధితోపాటు కంటి-చేతి సమన్వయం పెరుగుతుంది.
తన మనసులోని ఆలోచన చివరికి ఏ ఆకారాన్ని దాల్చబోతోందో ఇంచుమించుగా ఊహల్లో ఉంటుంది కాబట్టి దానిని తయారుచేయడానికి ఏ రకమైన వస్తువులు, పదార్థాలు, పరికరాలు కావాలో, ఏ ఆకారంలో, ఎంత పరిమాణంలో దాని భాగాలు చెయ్యాలో, దేని తర్వాత ఏది చెయ్యాలో అనే విస్తృతమైన ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరిగా చేస్తారు.
బృందంలో భాగంగా క్రాఫ్టువర్కు చేసినప్పడు పరస్పరం ఆలోచనలను పంచుకోవడం, సహకరించుకోవడం, ఒకరి పనిని ఇంకొకరు గుర్తించి మెచ్చుకోవడం లాంటి సాంఘిక నైపుణ్యాలు అలవడతాయి. ప్రక్కవారినుండి పిల్లలు అత్యంత తొందరగా నేర్చుకుంటారు.
ఎవరికివారు తీవ్రమైన ఏకాగ్రతతో ఒక్కరే పనిచేసేటప్పడు తమ శక్తులపైన, నైపుణ్యాలపైన ఖచ్చితమైన అవగాహన, అంచనా కలుగుతాయి.
సాధారణంగా పోల్చిచూసే, పోటీపెట్టే వాతావరణం లేని చోట పిల్లలు వాళ్ళు పనిని మనస్పూర్తిగా చేసి చివరకు తాము తయారుచేసిన వస్తువును చూసుకొని సంతృప్తి చెందుతారు. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందడంలో ఇది కీలకమైన విషయం.
రకరకాల వస్తువులను తయారుచేసే క్రమంలో పరిమాణాలు, జామెతీ ఆకారాలు, రంగుల కలయిక, బ్యాలెన్సు (గరిమనాభి ఆధారంగా) వంటి భావనలపై తెలియకుండానే పట్టు సాధిస్తారు.
ఆసక్తి పుట్టించని, అర్థవంతంగా అనిపించని, సంతోషాన్నివ్వని పాఠ్యాంశాల మూలంగాను, విద్యనేర్పబడుతున్న తీరువల్లను, స్వతహాగా నేర్చుకునే నేర్పు, తెలివితేటలు ఉన్నా గానీ కొందరు పిల్లలు చదువులో వెనుబడుతుంటారు. తెలివి తక్కువ వారిగా, చేతకాని వారిగా ముద్ర వేయబడుతుండడం కూడా జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళు తమకు నిజంగానే ఏమీ చేతకాదనే భావనలోకి వెళ్ళిపోయి మరింత వెనుకబడే అవకాశం ఉంది.
క్రాఫ్టువర్కుపిల్లలకు తమలోని మేధోశక్తిని, నైపుణ్యాలను ఆవిష్కరించుకునే అవకాశం ఇస్తుంది. అది ఇచ్చే ప్రోత్సాహం, సంతృప్తి వల్ల పిల్లలు తమని తాము నమ్మడం ప్రారంభిస్తారు. పార్యాంశాలు నేర్చుకోవడంలో కూడా నైపుణ్యాలు సాధించేందుకు ఖచ్చితంగా దోహద పడుతుంది.
అంచనా, తర్కం, జామెతి, లెక్కలు గట్టడం వంటివి అంతర్లీనంగా ఉండడం వల్ల పిల్లలకు ఆ నైపుణ్యాలు తెలియకుండానే పెరుగుతాయి. అందువల్ల గణితం, సైన్సు వంటి అంశాలలో వెనుకబడిన కొందరు పిల్లలలో క్రాఫ్టువర్కు ద్వారా అద్భుతమైన మార్పులు రావడం గమనించవచ్చు.
తాను తయారుచేసిన వస్తువు ఆమోదయోగ్యం గానూ, కంటికి ఇంపుగానూ ఉండాలన్నది ప్రధాన విషయంగా ఉంటుంది. తమకి నచ్చేంత అందంగా తయారుచేద్దామని ప్రయత్నిస్తారు. ఇతరుల పనిని కూడా అదే దృష్టితో చూసి ఆనందిస్తారు.
ఇన్ని సంగతులు తెలుసుకున్నాక మనకి అర్థం కావాల్సిందేమిటంటే...
చేతి పని కేవలం అందమైన ఆకృతుల్ని తయారుచేసే ప్రక్రియకాదు.
ఇది వృధా కాలక్షేపం కాదు.దీనికి ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టాలన్న నిబంధన లేదు.
చురుకైన పిల్లలకు, నెమ్మదస్తులకు, చదువులో ముందున్నా వెనకున్నా. అందరికీ చేతిపనుల వల్ల ఎంతో లాభం.
పిల్లల సమగ్ర వికాసంలో దానికెంతో విశిష్టమైన పాత్ర ఉంది. బడులలో దీనికిక పెద్దపీట వేయాలనీ, ప్రత్యేక సమయం కేటాయించాలనే నిబంధన ఉంది. నిబంధనలకు నీళ్ళు వదిలేయడం ఎలానూ ఉంది కాబట్టి. అమ్మానాన్నలుగా ఆ అవకాశాన్ని మీరైనా ఇవ్వగలరేమో తప్పక ప్రయత్నించండి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/15/2020