ఫిబ్రవరి నెలాఖరు వచ్చిందంటే పరీక్షల తేదీలు కళ్లముందు మెదులుతుంటాయి విద్యార్థులకి. దాంతో వాళ్లలో తెలియకుండానే ఒత్తిడి పెరిగిపోతుంది. ఏడాది పాటు చదివింది ఒక ఎత్తయితే పరీక్షలప్పుడు చదివేది మరో ఎత్తు కదా. ‘‘పరీక్షలు వస్తున్నాయి కదాని పుస్తకాలు ముందు వేసుకుని రాత్రిపగలు చదివితే లాభంలేదు. అందుకు పరిశోధనాత్మకంగా నిరూపితమైన కొన్ని శాస్ర్తీయ పద్ధతులు ఉన్నాయి’’ అంటున్నారు ఎడ్యుకేషనిస్టులు.
ఉన్న కొద్ది సమయంలో సిలబస్ అంతటినీ చదవాలనుకోవద్దు. అలాకాకుండా సమయాన్ని విభజించుకోవాలి. అంటే ఇరవై నిమిషాలు ఏక బిగిన చదివాక ఐదు లేదా పది నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఈ పద్ధతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఇరవై నిమిషాలు కార్డియో వ్యాయామాలు చేస్తే జ్ఞాపకశక్తి పెరగడం ఖాయం అంటుంది సైన్స్. డ్యాన్స్, జాగింగ్, వేగంగా నడవడం వంటి కార్డియో వ్యాయామాలు చేయండి. ఇవి చేయడం వల్ల శక్తిస్థాయి పెరగడమే కాకుండా, ఒత్తిడి వల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా తగ్గిపోతాయి.
అధిక కార్బోహైడ్రేట్, పీచు పదార్థాలు కలిగి, నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఓట్‌మీల్ లాంటివన్నమాట. బాదం పప్పు, పళ్లు, పెరుగు వంటి హెల్తీ స్నాక్స్ తినాలి.
ఒకే దగ్గర కూర్చొని కాకుండా వేరు వేరు ప్రదేశాల్లో చదవాలి. ఒకసారి స్టడీరూమ్‌లో, ఒకసారి లైబ్రరీలో చదవాలి.
కూర్చున్న దగ్గర్నించి లేవకుండా అదేపనిగా చదివితే ఆందోళన పెరుగుతుంది. దాంతో అప్పటివరకు చదివిన విషయాల్ని గుర్తుపెట్టుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకని స్టడీ ప్లాన్, షెడ్యూల్ బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఎక్కువమంది పిల్లలు రాత్రంతా మేల్కొని చదువుతుంటారు. కాని ఇలా చదవడమనేది చాలా చాలా చెత్త ఆలోచన అంటున్నారు నిపుణులు. ఇలా చదవడం కనుపాపల కదలికల మీద ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం జ్ఞాపకశక్తి మీద కూడా పడుతుంది. అందుకని రాత్రిళ్లు శుభ్రంగా నిద్రపోవాలి. అప్పుడే చదివింది బాగా గుర్తుంటుంది. పరీక్షల్లో బాగా రాయగలుగుతారు. నిద్రపోయే ముందు కష్టం అనుకున్న అంశాన్ని మరోసారి చదువుకోండి. ఇలా చేయడం వల్ల తరువాతి రోజు రాసే పరీక్షలో ఆ కష్టమైన అంశం ఎంతో సులభంగా గుర్తుంటుంది.
ఈ మధ్య టెక్నాలజీ ప్రభావం కూడా చదువు మీద పడుతోంది. మ్యూజిక్ వింటూ, స్నేహితులతో చాటింగ్ చేస్తూ, టీవీ చూస్తూ చదివే వాళ్ల సంఖ్య ఎక్కువైపోయింది. చదువుమీద ధ్యాస పక్కదారి పట్టించకుండా ఉంటే పర్వాలేదు. అయితే ఇలా చదివేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి మ్యూజిక్ వింటూ చదివే అలవాటు ఉంటే ఇనుస్ర్టుమెంట్ మ్యూజిక్ వినాలన్నమాట.
ఎన్నిసార్లు చదివినప్పటికీ, చదివిన దానిని మననం చేసుకున్నప్పటికీ రాస్తేనే బాగా గుర్తుంటుంది. అందుకే ఇంట్లో ఎగ్జామ్ ప్రాక్టీసు చేస్తే పరీక్షలు బాగా రాయగలరు.
ఆధారము: ఆంధ్రజ్యోతి
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/3/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి