অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఎవర్ గ్రీన్ సబ్జెక్టు కామర్స్

ఎవర్ గ్రీన్ సబ్జెక్టు కామర్స్

భారతదేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం సేవారంగం. స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగం వాటా 57 శాతం. ఈ రంగం వృద్ధి రేటు 9 శాతం. సేవారంగం అంటే ఐటీ, బీపీవో, బీఐటీఈఎస్, బిజినెస్ ప్రాసెసింగ్ రీ ఇంజినీరింగ్ ఎక్కువగా ఉన్నది. జీడీపీలో వ్యవసాయరంగం వాటా తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడిన జనాభా మాత్రం 50 శాతం. సేవారంగంలో ప్రధానంగా వచ్చేవి ఫైనాన్స్ సర్వీసెస్& సాఫ్ట్‌వేర్ సర్వీసులు. అంటే అకౌంటింగ్ సర్వీసులు, బ్యాకింగ్, బీమా, టూరిజం, హోటల్స్, మీడియా వంటి రంగాల్లో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో లభించే అవకాశం ఉంది.

కామర్స్ చేయాలనుకునే విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌కు దారి ఏమిటి ? టెన్+2, డిగ్రీ, పీజీతో ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి. కామర్స్‌బేస్డ్ ఉద్యోగాలు ఏవి ? జీతాలు ఎలా ఉంటాయి తదితర అంశాలు.. ఈ వారం నిపుణ మీ ముందుకు తెస్తోంది.

పైవేట్ జాబ్స్: బీకామ్ విద్యార్థులకు అకౌంటెన్సీలో మంచి పట్టు ఉంటే డిగ్రీ, ఆ తర్వాత కూడా అకౌంటెంట్ (Accountant) గా పనిచేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు BPO, KPO, LPO, IT, ఇన్సూరెన్స్, స్టాక్‌మార్కెట్లలో SAP capital iq, GE capital వంటి మేనేజ్‌మెంట్ కంపెనీల్లో, Stock broking office commerce (finance)లో ఉద్యోగ అవకాశాలు ప్రారంభం నుంచే రూ. 15,000 జీతాలు పొందే అవకాశం ఉంటుంది.

- కోర్సు పూర్తయిన తర్వాత లభించే ఉద్యోగాలు బీపీవో, కేపీవో, ఎల్‌పీవో ఐటీఎస్‌ల్లో కింది విధంగా ఉంటాయి.

  1. ఫైనాన్స్ ఫండమెంటల్స్
  2. బిజినెస్ సంబంధించిన కంపెనీల్లో
  3. వేతనాలు (Compensation, Payrolls)
  4. కార్పొరేట్ గవర్నెన్స్
  5. కార్పొరేట్ విధులు
  6. డాక్యుమెంట్ అక్వజేషన్స్
  7. సంయోగం, సంలీనం
  8. ముగింపు లెక్కల తయారీ వర్తకపు లాభనష్టాల A/C ఆస్తి అప్పుల పట్టికలు

ఫైనాన్స్ టీమ్ ఎక్కువగా ...

  • ఆస్తి అప్పుల పట్టీ టీమ్ బృందం (బ్యాలెన్స్ షీట్)
  • లాభనష్టాల ఖాతా (ప్రాఫిట్ లాస్ అకౌంట్స్)
  • నగదు ప్రవాహ నివేదిక (క్యాష్ ఫ్లో)
  • ఆదాయ, వ్యయాల ఖాతాలు
  • జీతాలు, చెల్లింపు విధానాలు
  • ట్యాక్స్‌టీన్ పన్ను విధింపునకు సంబంధించిన విధుల్లో
  • కామర్స్ రిలేటెడ్‌కు అకౌంట్స్ పార్ట్‌టైంగా చేయడంలో టాలీ, వింగ్స్, ఫోకస్, ఎక్స్ -నెక్ట్స్ జెనరేషన్ వంటి అకౌంటింగ్ ప్యాకేజీ నేర్చుకొని ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.

Cost and Works Accountancy (CWA)

- ప్రతి సంస్థకు సీడబ్ల్యూఏ అవసరం ఉంటుంది. వ్యాపారాల్లో ఖర్చుచేసే ప్రతి పైసా ఏయే అంశాలపై ఏ విధంగా ఖర్చు చేయాలి. ఒక ఆస్తి కొనుగోలు విషయంలో ఆస్తిని కొంటే లాభదాయకంగా ఉంటుందా లేదా దానిని కౌలుకు తీసుకుంటే బాగుంటుందా అనే నిర్ణయంలో ఒక కాస్ట్ అకౌంటెంట్ మాత్రమే ఆర్గనైజేషన్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

- ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక ఒత్తిడులు, ధర నిర్ణయం, నిర్వహణ, విశ్లేషణ, సేకరణ, ఆర్థిక పెట్టుబడుల సేకరణ బాధ్యత కాస్ట్ అకౌంటెన్సీపై ఉంటుంది. 8 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా కాస్ట్ అకౌంటెంట్స్‌ని తయారుచేస్తుంది. ఈ సీడబ్ల్యూఏను వివిధ రంగాల్లో ఇండియా, విదేశాల్లో ఐసీడబ్ల్యూఏలో ఉన్న సభ్యులే వివిధ పోస్టుల్లో బాధ్యతలు కన్సల్టెన్సీ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆడిటర్స్ ప్రత్యేక బాధ్యతలు. వ్యాపార నిర్వహణలో పాలుపంచుకొనే ఒక ముఖ్య వ్యక్తి.

సీడబ్ల్యూఏ చేసే విధానం - అర్హతలు

ఈ కోర్సు మూడు దశలుగా ఉంటుంది.

1. ఫండమెంటల్స్
2. ఇంటర్మీడియట్
3. ఫైనల్

ఈ మూడు దశలు విడివిడిగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐసీడబ్ల్యూఏఐ అండ్ ఇట్ కోర్సెస్ అని క్లిక్ చేస్తే వివరాలు వస్తాయి.

కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ - వృత్తి

- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా మెంబర్‌గాను, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌గా, డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్, జనరల్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్‌గా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ సంస్థల్లో పనిచేయవచ్చు.

సొంతంగా ప్రాక్టీస్

-కాస్ట్ ఆడిటర్స్‌గా, ఎగుమతి, దిగుమతుల విధాన నిర్ధారణ, ఎక్సైజ్ ఆడిట్, స్పెషల్ ఆడిట్ సర్టిఫికేషన్, నిర్మాణ పరిశ్రమలు, వస్తు తయారీ పరిశ్రమలకు సూచనలు, సలహాలు.

కంపెనీ సెక్రటరీ

- కంపెనీ సెక్రటరీ అవసరం ప్రతి ఒక్క సంస్థకు ఉంటుంది. ఇతను సమర్థవంతమైన నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ కంపెనీకి, డైరెక్టర్ల బోర్డుకు, వాటాదారులకు మధ్య ఒక నిర్వహకుడిగా కంపెనీకి సమర్ధవంతమైన నిర్వహణ బాధ్యతలు నిర్వహించే ఒక ముఖ్య మూలకారకుడు.

ప్రవేశాలు - అర్హతలు

- సీఏ, సీడబ్ల్యూఏ మాదిరిగానే సీఎస్‌లో ఇంటర్ తర్వాత చేరే అవకాశం ఉంటుంది.

1. ఫౌండేషన్ ప్రోగ్రామ్

2. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్

3. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్

- డిగ్రీ తర్వాత చేరే విద్యార్థులకు ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్‌లో చేరే అవకాశం ఉంటుంది.

బీకామ్ @ కెరీర్

సాధారణంగా ఇంటర్ తర్వాత ఏ గ్రూప్‌లో (డిగ్రీలో) చేరాలో విద్యార్థులకు సరైన అవగాహన ఉండదు. ఏదో ఒక గ్రూప్ ఎంచుకునే ముందు సీనియర్స్‌ను, విద్యావంతులను, అనుభవజ్ఞుల సలహా తీసుకుని ఏ కోర్సు అయితే భవిష్యత్ బాగుంటుందని అంచనావేసుకుని ఎంపికచేసుకోవాలి. -సాధారణంగా గ్రామీణ విద్యార్థులు ఇంటర్‌లో తనకు వచ్చిన మార్కులకు ఏ గ్రూప్‌లో సీటు వస్తే దానిలో చేరాలని అనుకుంటారు. అలా కాకుండా విద్యార్థులు తమకు తామే ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేయాలి. -ఇంటర్ తర్వాత బీకామ్ గ్రూప్‌లో CEC, MEC విద్యార్థులు మాత్రమే చేరే అవకాశం ఉందని అనుకుంటారు. కానీ కామర్స్ విద్యార్థులతోపాటు Non Commerce విద్యార్థులు కూడా B.comలో చేరవచ్చు. -బీకామ్ జనరల్/కంప్యూటర్ అప్లికేషన్స్ గ్రూపులు ప్రస్తుతం అన్ని కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి. కామర్స్ విద్యార్థులు ఉద్యోగావకాశాలకు అనుగుణంగా గ్రూపులు ఎంచుకోవాలి. కంప్యూటర్స్ (ఇంగ్లీష్ మీడియం)లో చేరినట్లయితే కంప్యూటర్ అవగాహన ద్వారా Accountsను చేసే విధానాన్ని Theory and Practical పద్ధతుల ద్వారా నేర్చుకోవచ్చు. వీటితోపాటు టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకుని అకౌంటింగ్ సబ్జెక్టుపై మంచి పట్టు సాధించినట్లయితే డిగ్రీ సెకండియర్‌లోనే పార్ట్ టైం జాబ్స్, బుక్ కీపింగ్, Tax Consultant వద్ద chartered accountants వద్ద commerceపై అవగాహన ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

- B.com జనరల్ (తెలుగు మీడియం)లో చేరినట్లయితే విద్యార్థులు తప్పనిసరిగా కంప్యూటర్‌పై నాలేడ్జ్ కలిగి ఉండాలి. దీంతోపాటు Typing Skills, ఇంగ్లీష్‌పై పట్టు సాధించడానికి వాటిని ప్రత్యేక కోర్సులుగా నేర్చుకోవాలసిన అవసరం ఉంటుంది. -ఇంటర్‌లో సీఈసీ, ఎంఈసీ, ఇతర గ్రూపుల విద్యార్థులు తెలుగు మీడియంలో చదివినప్పటికీ ఇంగ్లీష్ మీడియంలో డిగ్రీలో బీకామ్ జనరల్/కంప్యూటర్స్ గ్రూపును తీసుకున్నట్లయితే ప్రైవేట్ ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది.-కామర్స్‌కు తోడుగా Accounting Packages Wings, Tally, Focus Ex-Next Generation, Software Accounting Packages Fico వంటి ప్రోగాంలు, BPOలలో Information Technology, Insurance, Stock Market వంటి ప్రముఖ Malti national Companiesలో ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి.

B.com General/computersతో ఉద్యోగాలు

- ఈ కోర్సులో మంచి మార్కులు సాధించి కంప్యూటర్ అవగాహన, కమ్యూనికేషన్ ద్వారా అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ప్రారంభ జీతం రూ.10,000 నుంచి 15,000లవరకు ఉంటుంది.-STP Capital IQ: ఈ అంతర్జాతీయ కంపెనీ హైటెక్ సిటీలో ఉంది. ఇందులో కామర్స్ విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. B.com, M.com, CA, CWA, CS, Final Greeps, CA Inter పూర్తయినవారికి Written Test, Interview ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. -వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, జీఈ క్యాపిటల్, జీఈ మనీ, క్యాప్ జెమినీ, డెలాయిట్, యాక్సెంచర్, మహీంద్రా వంటి ప్రముఖ సంస్థల్లో కూడా ప్రవేశాలు ఉంటాయి.- నేటి అకౌంటింగ్ పద్ధతి కంప్యూటీకరణ వలన అన్ని రంగాల్లో (వ్యాపారాల్లో) అకౌంటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. దీనిపై ఒక కామర్స్ విద్యార్థికి మాత్రమే అనుభవం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కామర్స్ (బీకామ్) విద్యార్థికి ఆడిట్ అసిస్టెంట్, అకౌంటెంట్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశాలున్నాయి. వీటిని పొందడానికి ప్రథమంగా విషయ పరిజ్ఞానం, నైపుణ్యతపై ఆధారపడుతుంది. సీఏ, సీఎస్, సీడబ్ల్యూఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేయడం ద్వారా కంపెనీ భవితవ్యాన్ని, దిశానిర్దేశం చేసే ముఖ్య అధికారం గల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చైర్మన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, కంపెనీలకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా, ఆడిటర్స్‌గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు

- బీకామ్ ద్వారా ప్రైవేట్ రంగంతోపాటు, ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

వాటిని పరిశీలిస్తే...

- అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్‌వో), ఆడిట్ అసిస్టెంట్, విద్యుత్ సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా, సెక్షన్లలో అకౌంట్స్ అసిస్టెంట్లుగా, సివిల్ సప్లయ్‌లో జేఏవోలుగా పనిచేయవ చ్చు.- ప్రతి కంపెనీలో సీఈవో, సీఎఫ్‌వో, చైర్మన్‌లకు అర్హత గల వ్యక్తి కామర్స్ (బీకామ్)తోపాటు సీఏ, సీఎస్, సీడబ్ల్యూఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివినవారికే ఉంటాయి. ముఖ్యంగా బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్స్, వివిధ కంపెనీల్లో కామర్స్ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.- ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ఎల్‌ఐసీ, జీఐసీ తదితరాల్లో, షిప్పింగ్ కంపెనీలు, బ్యాంకింగ్ సెక్టార్, ఎయిర్‌ఫోర్స్, నేవీ వంటి ప్రముఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.- ఎంకామ్ అర్హతలుగా బీఎస్‌ఎన్‌ఎల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుంది. అనుభవం ద్వారా పలు కంపెనీల్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వంటి అత్యున్నత ఉద్యోగాలను పొందవచ్చు. ఎంకామ్, ఎం.ఫైనాన్స్ వంటి పీజీ కోర్సులు చదివిన వారికి మాత్రమే పై ఉద్యోగాల్లో అవకాశం ఉంటుంది.

డిప్లొమా కోర్సులు

- పీజీ డిప్లొమా ఇన్ టాక్సేషన్

- పీజీ డిప్లొమా ఇన్ రిటైలింగ్- పీజీడీ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్- పీజీడీ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ 8 పీజీడీ ఇన్ ఐఎఫ్‌ఆర్‌ఐ-పీజీ ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు ప్రవేశపరీక్షలు, క్యాట్, జీమ్యాట్, ఐసెట్ ద్వారా ఐఐఎంఎస్ యూనివర్సిటీలు, బిజినెస్ స్కూల్స్‌లో చేరడానికి కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశపరీక్షలు రాసి ఎంబీఏ (ఫైనాన్స్, మార్కెటింగ్ హెచ్‌ఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టూరిజం మేనేజ్‌మెంట్, టెక్నాలజీ మేనేజ్‌మెంట్, రిటైల్ మేనేజ్‌మెంట్) వంటి కోర్సులను చదవచ్చు.-కామర్స్ విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులు చేసి మంచి ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది.

ఇంటర్‌తో మొదలు...

- కామర్స్ ఎడ్యూకేషన్ అనేది ఇంటర్‌తో మొదలు పెట్టవచ్చు. సీఈసీ, ఎంఈసీలో ఒక సబ్జెక్ట్‌గా కామర్స్ ఉంటుంది. కామర్స్‌పై ఆసక్తి ఉన్న వాళ్లు ఈ కోర్సులో చేరవచ్చు. దీని ద్వారా కామర్స్‌లో బేసిక్స్‌పై పట్టు సాధించవచ్చు. వాణిజ్య శాస్త్రంలో భాగంగా చిట్టాలు, అకౌంటింగ్, సూత్రాలు సాంప్రదాయాలు, అకౌంటింగ్ చక్రం, న్యూమరికల్ డేటాను విశ్లేషించడం తదితర అంశాలు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇంటర్‌తోపాటు కామర్స్‌బేస్డ్ కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ తోడైతే 10+2తో ఉద్యోగాలు పొందవచ్చు.

హయ్యర్ ఎడ్యుకేషన్:

- డిగ్రీలో కామర్స్ అంటే బీకామ్ చదివిన తర్వాత పీజీలో కింది పీజీ, డిప్లొమా కోర్సులు చేసే అవకాశం ఉంటుంది.- డిగ్రీ తర్వాత విద్యార్థులు యూనివర్సిటీ నిర్వహించే పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా పీజీలో చేరే అవకాశం ఉంటుంది. కింది కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. ఎంకామ్, ఎంకామ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మాస్టర్ ఇన్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఆపరేషనల్ రీసెర్చ్ స్టాటిస్టిక్స్, లా (ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బీ), ఎంసీఏ, ఎంసీజే వంటి కోర్సులను చేయవచ్చు. ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఉస్మానియా, కేయూ తదితర యూనివర్సిటీలు ప్రతీ సంవత్సరం జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తాయి.- ఎంట్రెన్స్ టెస్ట్‌లకు సంబంధించి సిలబస్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంక్ వస్తే యూనివర్సిటీ హాస్టల్ సీటు లభిస్తుంది. పీజీలో ఎంకామ్ చేయడం ద్వారా విద్యార్థికి అనేక అవకాశాలు లభిస్తాయి. టీచింగ్‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. దీని కోసం ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఎంకామ్ తదితర పీజీ పరీక్షల్లో ప్రవేశం పొందడానికి తీవ్రంగా కృషి చేయాలి. పీజీ అనేది జీవితానికి దారిచూపుతుందనడంలో సందేహం లేదు.

కలర్‌ఫుల్ కెరీర్‌కు సీఏ కోర్సు

ప్రపంచంలో ఆర్థిక పరంగా, వ్యాపార వ్యాణిజ్య రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సీఏల అవసరం పెరిగింది. కానీ డిమాండుకు తగ్గట్టుగా ఈ కోర్సును పూర్తి చేసిన వారు లేరు. ఇప్పటి వరకు ఎక్కువ మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులపై ఆసక్తి చూపారు. దీంతో ఆయా రంగాల్లో అవసరానికి మించిన అభ్యర్థులు ఉండటంతో నిరుద్యోగులుగా మిగులుతున్నారు. మెడిసిన్ లాంటి కోర్సులకు డిమాండ్ ఉన్నప్పటికీ ఆ కోర్సులు పూర్తి చేయడానికి లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయిన తరువాత స్థిరపడటానికి చాలా కాలం పడుతుంది. దానికి ప్రత్యామ్నాయం కామర్స్ కోర్సులు. ఇవి ఎప్పుడైనా ఎవర్‌గ్రీన్. కామర్స్ కోర్సులు చదివి నిరుద్యోగులుగా ఉన్నవారు ఎక్కడా కనబడరేమో..! దీనికి కారణం కామర్స్, అకౌంటింగ్ రంగాల్లో డిమాండ్ పెరుగుతూ ఉండటమే. ఇటువంటి కామర్స్ కోర్సుల్లో సీఏ ప్రముఖమైనది. కాసు, క్లాసు కోరుకునే వారికి ఇది ఒక చక్కని వేదిక.

జాబ్ గ్యారెంటీ..

ప్రపంచంలో ఆర్థిక పరంగా, వ్యాపార, వాణిజ్య రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయా రంగాల్లో చార్టెడ్ అకౌంటెంట్ల అవసరం లక్షల్లో ఉంది. అందువల్ల సీఏ కోర్సు చేసినవారికి ఉద్యోగాలు తప్పసరిగా లభిస్తాయి. కోటి రూపాయల టర్నోవర్ కలిగిన ప్రతి సంస్థ తమ లెక్కలను Income Tax Act ప్రకారం తప్పని సరిగా సీఏలతో ఆడిట్ చేయించాలి. కాబట్టి ఈ కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ పరిశ్రమలు, కంపెనీలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. దీంతోపాటు సొంతంగా ప్రాక్టీసు పెట్టుకునే అవకాశం కూడా ఉంది.

కోర్స్ విధానం

సీఏలో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ అనే మూడు దశలు ఉంటాయి. ఈ కోర్సు మొత్తం పూర్తవడానికి ఇంటర్ తరువాత అయితే 4 సంవత్సరాలు, పదవ తరగతి తరువాత అయితే ఆరేండ్లు పడుతుంది. ఈ కోర్సు అభ్యసించే వారికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇంటర్మీడియట్ అర్హతతో సీపీటీకి రూ. 6,000లు, ఐపిసీసీ కోసం రూ. 9,000లు, ఆర్టికల్‌షిప్ కోసం మరో రూ. 2,000లు, సీఏ ఫైనల్‌కు రూ. 10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి.

టెన్త్ తర్వాత అయితే..

ఒక విద్యార్థి తాను అనుకున్నది సాధించాలంటే ఇంటర్మీడియట్ ప్రధానమైనది. తన లక్ష్యానికి అనుగుణంగా ఇంటర్‌లో గ్రూపును ఎంచుకోవాలి. అలాగే సీఏ కావలనుకునేవారు ఎంఈసీ గ్రూప్ తీసుకుంటే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. అయితే ఇంటర్ తర్వాత సీపీటీ పరీక్ష రాయాలి. అందులో మాథమెటిక్స్, ఎకనామిక్స్, అకౌంట్స్‌తోపాటు లా సబ్జెక్టు ఉంటుంది. ఇందులో లా మినహా మిగతా సబ్జెక్టులన్నింటిని ఇంటర్‌లో ఎంఈసీ తీసుకుంటే అవి వారి పాఠ్యాంశాల్లో భాగంగా ఉంటాయి.

కామన్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (సీపీటీ)

సీపీటీ ఉమ్మడి ప్రవేశపరీక్షను ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అకౌంట్స్‌కు 60 మార్కులు, మర్కంటైల్ లాకు 40, ఎకనామిక్స్‌కు 50, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కలిపి 50 మార్కులు ఉంటాయి. ప్రతీ సబ్జెక్టులో కనీసం 30 శాతం మార్కులు సాధిస్తూ నాలుగు సబ్జెక్టులు కలిపి 50 శాతానికి పైగా మార్కులు అంటే 100కి పైగా మార్కులు సాధించాలి. సీపీటీ పూర్తిచేసిన 9 నెలల తరువాత ఐపీసీసీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఇంటిగ్రేటెడ్ ప్రొఫీషియన్సీ కాంపిటెన్సీ కోర్సు (ఐపీసీసీ)

ప్రతి ఏడాది మే, నవంబర్ నెలల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది రెండు గ్రూపులుగా ఉంటుంది. గ్రూప్-1లో.. అకౌంట్స్, లా-ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌కమ్ టాక్స్-సర్వీస్ టాక్స్-వ్యాట్, కాస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. గ్రూప్-2లో.. అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి-స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కుల చొప్పున ఉంటుంది. ప్రతి గ్రుప్‌లో కనీసం ప్రతి సబ్జెక్ట్‌లో 40 మార్కులు సాధించాలి. అలాగే గ్రూప్ మొత్తం మీద 50 శాతం మార్కులు (సుమారు 150 మార్కులు) సాధించాలి. ఆ తరువాత ఓరియంటేషన్ కోర్సులో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్‌లో నిర్వహించే 100 గంటల కోర్సులోనూ ఉత్తీర్ణత సాధించాలి.

సీఏ ఫైనల్..

ఇది కూడా గ్రూప్-1, గ్రూప్-2లుగా ఉంటుంది. ప్రతి ఏడాది మే, నవంబర్ నెలల్లో సీఏ ఫైనల్‌కు పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, కార్పొరేట్ అండ్ ఎలైడ్ లాస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతీ సబ్జెక్టులో 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. గ్రూప్-2లో.. నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. అవి అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్, డైరెక్ట్ టాక్స్, ఇన్‌డైరెక్ ్టటాక్స్. ప్రతి పేపర్‌కు 100 మార్కులు. సబ్జెక్ట్‌లో కనీసం 40 మార్కులు, ప్రతీ గ్రూప్‌లో లేదా రెండు గ్రుపులు కలిపి 50 శాతం మార్కులు సాధించాలి.

సీఏ పూర్తి చేయలేనివారికోసం..

సీఏ గట్టెక్కలేని వారి కోసం అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సును ప్రవేశపెట్టారు. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేనని అనుకున్నప్పుడు ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తిచేసి ఏడాది పాటు చార్టెర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నిషియన్ సర్టిఫికేట్ లభిస్తుంది. దీనికి ప్రత్యేకమైన గుర్తింపు, అంతర్జాతీయ డిమాండ్ కూడా ఉంది. ఈ సర్టిఫికేట్‌తో ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో అకౌంటెంట్‌గా నెలకు సుమారు రూ. 30 వేల జీతం పొందొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ గ్రూప్-2లో కూడా ఉత్తీర్ణత సాధించి ఫైనల్ రాసినట్లయితే చార్టెర్డ్ అకౌంటెంట్ అవ్వొచ్చు.

హోదాలు.. ఉద్యోగాలు..

కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్లుగా, ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటర్స్, టెక్నో ఫంక్షనిష్టులుగా అవకాశాలు పొందవచ్చు. వాటితోపాటు అడ్మినిస్ట్రేటర్‌గా, వ్యాల్యూయర్‌గా, మేనేజ్‌మెంట్ అండ్ ట్యాక్స్ కన్సల్టెంట్లుగా ఉద్యోగాలు లభిస్తాయి. చార్టెడ్ అకౌంటెంట్‌గా జీవితం ఆరంభించిన వారికి ప్రారంభంలోనే నెలకు కనీసం రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు, 6 నెలల అనుభవంతో నెలకు లక్షల్లోనే జీతాలు పొందవచ్చు.

పోటీ పరీక్షలు

- బీకామ్/బీకామ్ కంప్యూటర్ వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షలు రాసే అవకాశం కింది పోస్టులు రాసి ప్రభుత్వ ఉద్యోగాలను పొందవచ్చు.

- బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అంటే ఐబీపీఎస్ ద్వారా పీవోలు, క్లర్క్‌లు

- ఎస్‌ఎస్‌బీ/ఎయిర్‌ఫోర్స్ అకౌంటెంట్స్

- సివిల్ సర్వీసెస్

- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో

- సీడీఎస్ (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్)

- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఇన్ బీఎస్‌ఎన్‌ఎల్, జెన్‌కో, ట్రాన్స్‌కో..

- టీఎస్‌పీఎస్‌స్సీ నిర్వహించబోయే గ్రూప్ -1, గ్రూప్ -2, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, డీఏవో, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.

- యూపీఎస్సీ ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహిస్తుంది. అలాగే ఇటీవల ఏర్పడిన టీఎస్‌పీఎస్సీ కూడా గ్రూప్-1, గ్రూప్-2 లాంటి పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. అర్హతలను బట్టి రెండు, మూడు రంగాలను ఎంచుకొని పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధంకావాలి. అంటే ప్రతి పరీక్షకు సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ఏమిటి? దానికి సరిపడే మెటీరియల్ ఏమిటి? నాణ్యమైన మెటీరియల్‌ను ఎలా సంపాదించాలి. ప్రిపరేషన్ గైడెన్స్ ఇవ్వగలుగుతారా? ఇంతకుముందు వచ్చిన ప్రశ్న పత్రాల సరళి ఎలా ఉంది. అన్న విషయాలను బేరీజు వేసుకోవాలి. వీటిలో మొదటి స్టెప్ సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం. రెండో స్టెప్ సిలబస్‌లో ఉన్న అంశాలను ఏ పుస్తకంలో అందుబాటులో ఉన్నాయి.? తరువాత సిలబస్‌లో ఉన్న విషయాలు స్టాండర్డ్ బుక్స్ చదివితే మంచి ఫలితాలు వస్తాయి.

వ్యవస్థాపన

- డిగ్రీ తర్వాత పై రంగాల్లో ఇష్టం లేనివారు చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ప్రారంభించి సమర్థవంతంగా ఇతర వ్యక్తుల కన్నా ఎక్కువగా కామర్స్ అనుభవం ద్వారా వ్యాపార మెళకువలు తెలిసి ఉండి లాభార్జన దిశగా పయనించే అవకాశం ఉంది. సొంత వ్యాపారం, కంపెనీ స్థాపనకు అవకాశం ఉంటుంది.

ఆధారము: నమస్తే తెలంగాణా

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate