অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అధ్యాపక వృత్తికి సెట్ అవుదాం!

విద్యా జీవితంలో సంపాదించే ప్రతి అర్హతా కెరీర్‌లో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు వెలుగు దీపమవుతుంది. ఆకర్షణీయ జీతభత్యాలు, ఆహ్లాదకరమైన పని సంస్కృతికి నెలవైన డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను పొందాలంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)లో ఉత్తీర్ణత తప్పనిసరి. పీహెచ్‌డీ చేసేందుకు, జూనియర్ లెక్చరర్ల పదోన్నతులకు ఇలా పలు ప్రయోజనాలకు ప్రగతి బాటగా నిలుస్తున్న సెట్‌కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో స్పెషల్ ఫోకస్.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఉద్యోగాలను పొందాలనుకునే వారికి ప్రత్యేక అర్హత పరీక్షగా ఏపీ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్)ను నిర్వహించే వారు. ఆంధ్రప్రదేశ్ కాలేజ్ సర్వీస్ కమిషన్ (ఏపీసీఎస్‌సీ) 1997 ఫిబ్రవరి-1998 ఫిబ్రవరి మధ్యకాలంలో మూడుసార్లు ఈ పరీక్షను నిర్వహించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్‌ను తొలగించగా, యూజీసీ దాని అక్రిడిటేషన్‌ను రద్దు చేసింది. తర్వాత రాష్ట్రంలో స్లెట్ అనేది లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర విద్యార్థులు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్ నెట్ రాయాల్సి వచ్చేది. వీటిని ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో నిర్వహించడం వల్ల తెలుగు విద్యార్థులు ఇబ్బందిపడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ అనుమతితో 2012, 2013లో ఏపీ సెట్ పేరిట పరీక్ష నిర్వహించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ బాధ్యత తీసుకుంది. 2014లోనూ రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ (సెట్-టీఎస్, ఏపీ)ను నిర్వహించేందుకు ఉస్మానియా వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం సబ్జెక్టులు 27:

సెట్‌ను 27 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్టులకు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. జాగ్రఫీ, కెమికల్ సెన్సైస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎర్త్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, లా, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, సైకాలజీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టులకు ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం సబ్జెక్టులకు కూడా పరీక్ష నిర్వహిస్తున్నారు.

అర్హత:

అభ్యర్థి ఏ సబ్జెక్టు పరీక్ష రాయాలనుకుంటున్నాడో సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణుడై ఉండాలి. ఓసీ, బీసీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్/వీహెచ్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పరీక్ష రాసేందుకు అర్హులే. అయితే వీరు సెట్ జరిగిన తేదీ నుంచి ఏడాదిలోపు నిర్దేశ కనీస మార్కులతో పీజీలో ఉత్తీర్ణత సాధించి, మార్కుల జాబితా పొందాల్సి ఉంటుంది. సెట్ రాసేందుకు వయో పరిమితి లేదు.

ఫలితాల వెల్లడి:

ప్రతి సబ్జెక్టులో మూడు పేపర్లలో కనీస అర్హత మార్కులు సాధించిన వారితో జాబితా రూపొందిస్తారు. మూడు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగా సబ్జెక్టు, కేటగిరీల వారీగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. వీరిలో నుంచి ప్రతి సబ్జెక్టులో.. ప్రతి కేటగిరీ నుంచి టాప్ 15 శాతం మంది అభ్యర్థులను సెట్‌లో అర్హులుగా ప్రకటిస్తారు. ఫలితాలను ఉమ్మడిగానే విడుదల చేస్తారు.

పరీక్ష విధానం:

ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. రెండు, మూడు పేపర్లు సబ్జెక్టుకు సంబంధించినవి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. నెగిటివ్ మార్కులుండవు. మూడు పేపర్లకు ఒకే రోజు రెండు దశల్లో పరీక్ష జరుగుతుంది.

పీజీ పాఠ్యాంశాలపై పట్టుతో విజయం

ప్రొఫెసర్ బి.రాజేశ్వరరెడ్డి, సెట్ (టీఎస్ అండ్ ఏపీ) సభ్య కార్యదర్శి. మార్పులు లేవు:సెట్ (టీఎస్ అండ్ ఏపీ)ను గతంలో మాదిరిగానే నిర్వహించనున్నాం. గత రెండుసార్లు నిర్వహించిన తరహాలోనే ఇప్పుడుకూడా పారదర్శకతకు ప్రాధాన్యమిస్తాం.

ముచ్చటగా మూడోసారి:

14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సెట్‌ను 2012లో తొలిసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించింది. 2013లోనూ పరీక్ష నిర్వహణను పూర్తిచేసింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విశ్వవిద్యాలయం రెండుసార్లు సెట్‌ను విజయవంతంగా నిర్వహించినందువల్లే మూడోసారి కూడా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సెట్‌ను నిర్వహించే అవకాశం లభించింది. అంతే కాదు 2015 వరకు సెట్‌ను ఉస్మానియా వర్సిటీ నిర్వహించేందుకు యూజీసీ అనుమతి లభించింది. ఓయూ పని తీరును గుర్తించిన యూజీసీ ప్రశంసాపత్రాన్ని అందజేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాం.

సబ్జెక్టులు, అర్హతలు:

ఈసారి కూడా 27 సబ్జెక్టులకు సెట్ నిర్వహిస్తాం. లింగ్విస్టిక్స్, ఆంత్రోపాలజీ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించేందుకు అనుమతి కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పీజీ ఉంటే సెట్ రాయొచ్చు. దూరవిద్యలో పీజీ చేసిన అభ్యర్థులు సైతం సెట్‌కు అర్హులు.

ప్రయోజనాలు:

సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. వీరు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కాలేజీల లెక్చరర్ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. జూనియర్ లెక్చరర్లు పదోన్నతులు పొందేందుకు ఉపయోగపడుతుంది. ఉద్యోగాలు చేసే లెక్చరర్లకు పేస్కేల్ పెరగడమే కాకుండా కళాశాల ప్రిన్సిపల్‌గా పదోన్నతి లభిస్తుంది. పీహెచ్‌డీలో ప్రవేశాలు, ఫెలోషిప్ పొందడం వంటి వివిధ అంశాల్లో అదనపు అర్హతగా ఉంటుంది.

స్పందన ఎలా ఉంది?

గత రెండు సార్లు నిర్వహించిన సెట్లకు అనూహ్య స్పందన లభించింది. ఏపీ సెట్-2012కు 1,17,795 మంది దరఖాస్తు చేయగా, 11,073 మంది అర్హత సాధించారు. 2013 సెట్‌కు 1,27,650 మంది దరఖాస్తు చేసుకోగా 6,267 మాత్రమే అర్హత సాధించారు.

ప్రిపరేషన్ ప్రణాళిక:

సెట్‌లో ప్రశ్నలను సంబంధిత సబ్జెక్టు పుస్తకాల నుంచి ఎంపిక చేస్తారు. పోస్టు గ్రాడ్యుయేషన్ అకాడెమీ పాఠ్యపుస్తకాల్లోని అంశాలను విశ్లేషణాత్మకంగా చదివి, సబ్జెక్టుపై పట్టు సాధించాలి. ప్రణాళిక ప్రకారం వీటిని చదివితే విజయం తథ్యం. సబ్జెక్టు పరిజ్ఞాన సముపార్జనతో పాటు జనరల్ స్టడీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే మూడు పేపర్లలో ఏ ఒక్కదాంట్లోనైనా నిర్ణీత మార్కులు రాకుంటే శ్రమ అంతా వృథా అవుతుంది. సెట్ ప్రిపరేషన్‌లో భాగంగా సంపాదించిన పరిజ్ఞానం వివిధ పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.

ప్రిపరేషన్

సెట్‌లో మూడు పేపర్లలో అందరికీ కామన్‌గా ఉండేది మొదటి పేపర్. ఇది అభ్యర్థుల రీజనింగ్ సామర్థ్యాన్ని, గ్రహించే శక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని, సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. బోధన పద్ధతులు, విద్యా మనో విజ్ఞాన శాస్త్రం, డేటా అనాలిసిస్, రీజనింగ్, పరిశోధన ఆప్టిట్యూడ్ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల్లో చాలా వరకు అభ్యర్థి సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటున్నాయి. బీఈడీ చదివిన విద్యార్థులకు ఇవి చాలా సులువుగా ఉంటాయని చెప్పొచ్చు. యూజీసీ నెట్; సెట్ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే, ప్రశ్నల సరళి అర్థమవుతుంది.

సిలబస్ యూజీసీ-సీఎస్‌ఐఆర్‌నెట్ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నప్పటికీ గత ప్రశ్నపత్రాలు ఆ స్థాయిలో లేవని సబ్జెక్టు నిపుణుల అభిప్రాయం.యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్ నెట్‌కు సిద్ధమయ్యేవారు సెట్‌లో సులువుగా అర్హత సాధించవచ్చు. టీచింగ్ మెథడాలజీ, రీసెర్చ్ మెథడాలజీ, రీజనింగ్‌లకు సంబంధించి ప్రాక్టీస్ తప్పనిసరిగా ఉండాలి. మొదటి పేపర్‌కు ఏదైనా ప్రామాణిక మెటీరియల్‌ను చదవడంతోపాటు మిగిలిన రెండు పేపర్లకు సంబంధిత సబ్జెక్టుల అకాడెమీ పాఠ్యపుస్తకాలతోపాటు సబ్జెక్ట్ నిపుణులు రాసిన పుస్తకాలను చదవాలి.ఆయా సబ్జెక్టుల మూల భావనలను అర్థం చేసుకుంటూ అప్లికేషన్ ఓరియెంటెడ్ (అనువర్తిత) పద్ధతిలో లోతైన విశ్లేషణ చేస్తూ చదివితే సెట్‌లో విజయం సాధించొచ్చు. ఈ క్రమంలో యూజీసీ, సీఎస్‌ఐఆర్ నెట్ సిలబస్‌ను, పాత ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో, ఏఏ అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయో గమనించాలి.

ముఖ్య అంశాలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014
రూ.100 ఆలస్య రుసుంతో: నవంబర్ 8, 2014
రూ.200 ఆలస్య రుసుంతో: నవంబర్ 15, 2014
దరఖాస్తు ప్రింటవుట్, అవసరమై పత్రాలు పంపడానికి గడువు: నవంబర్ 18, 2014
పరీక్ష తేదీ: జనవరి 4, 2015
వెబ్‌సైట్లు: www.settsap.org, www.osmania.ac.in

ఆధారము: సాక్షి

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate