విద్యార్థుల పుస్తకాల సంచి బరువుకు కళ్లెం
భారం తగ్గింపునకు మార్గదర్శకాలపై జీఓ జారీ
తరగతుల వారీగా నిర్దేశించిన తెలంగాణ విద్యాశాఖ
5వ తరగతి వరకు హోంవర్క్ ఇవ్వరాదని స్పష్టం
పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల
పాఠశాల విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువును తగ్గించడానికి అవసరమైన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం నాడు జీవో నెం.22 ద్వారా విడుదల చేశారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత, పాఠశాలల విద్యార్థులు 6 నుంచి 12 కిలోల బరువైన సంచులు ప్రతిరోజు వీపులపై మోసుకువెళ్లడం, కొన్ని పాఠశాలలు బహుళ అంతస్తులతో ఉండడం వల్ల అంత బరువైన సంచులు మోసుకెళ్లడం వలన పిల్లల వెన్ను, మోకాలు సంబంధిత వ్యాధులకు లోనవుతున్నారు. వారి ఎదుగుదలపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతున్నది.
ప్రతిరోజూ పిల్లలందరూ అన్ని రకాల పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, చిత్తు వ్రాత పుస్తకాలు గైడ్లు తదితర అన్ని పుస్తకాలు స్కూల్ బ్యాగులో మోసుకుని రావడం వల్ల అధిక భారం అవుతున్నది. వివిధ జిల్లాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా పుస్తకాల సంచి బరువును నియంత్రించటానికి విద్యాశాఖ ఈక్రింది మార్గదర్శకాలను రూపొందించింది.
సాధారణ మార్గదర్శకాలు
- రాష్ట్ర పాఠ్య ప్రణాళిక (స్టేట్ సిలబస్)ను పాటించే అన్ని పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వ ఎస్‌సిఇఆర్‌టి నిర్ణయించిన పాఠ్య పుస్తకాలనే వినియోగించాలి. వివిధ తరగతులకు పాఠ్య పుస్తకాల సంఖ్య ఎస్‌సిఇఆర్‌టి నిర్ణయించిన పుస్తకాల సంఖ్యకు మించకూడదు.
- విద్యార్థులు విషయ భావనలను గుర్తుంచుకోవడం కన్నా, భావనలను అర్థం చేసుకునే విధంగా పాఠశాలలు విద్యాబోధనపై కేంద్రీకరించాలి. పిల్లలకు చదవడం, గ్రహించడం, భావ వ్యక్తీకరణలో తగిన స్వేచ్ఛనివ్వాలి.
- పాఠశాలల్లోనూ, ఇంటివద్ద విద్యార్థులచేత పుస్తకాలు, గైడ్‌లలో ఉన్న విషయాలనే పదే పదే రాయించడాన్ని పాఠశాలలు నివారించాలి.
- లైబ్రరీ పుస్తకాలు చదవడం, క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం సృజనాత్మక, సహపాఠ్య కార్యక్రమాలు, తదితర విద్యార్థి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలలో పాల్గొనే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.
- విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి నిరంతరం విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ ఉండాలి.
- గైడ్లు, గైడ్లను పోలిన స్టడీ మెటీరియల్ వినియోగాన్ని నిరోధించాలి.
- బాలలు స్వీయ ఆలోచన ద్వారా ఊహాశక్తితో స్వంతంగా సమాధానాలు రూపొందించుకునే విధంగా తయారుచేయాలి.
- విద్యార్థి యొక్క పునాది నైపుణ్యాలైన చదవడం, వ్రాయడం, అంకగణిత సామర్థ్యాల అభివృద్ధిపై కేంద్రీకరించాలి. ప్రతి పాఠశాల సాధారణ పాఠ్య బోధన ప్రారంభించే ముందుగా ఈ పునాది నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి.
- సిలబస్ పూర్తి చేయడం కోసం యాంత్రికంగా పాఠాలు బోధించడం కాకుండా తరగతి గదిలో పరస్పర ప్రతి స్పందనలను ప్రోత్సహించాలి.
- చర్చ, భాషణలతో పాటు ప్రాజెక్టులు, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, పుస్తక సమీక్షలు, వర్తమాన సామాజిక సమస్యలపై చర్చలు వంటి కీలకమైన అభ్యసనా ప్రక్రియలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనే విధంగా వారిని ప్రోత్సహించాలి.
- సబ్జెక్టువారీగా గైడ్లు కానీ, స్టడీ మెటీరియల్ గానీ వాడరాదని జీవో నెం. 17, తేదీ: 14.05.2014 ద్వారా ఇచ్చిన ఆదేశాలను విధిగా పాటించాలి. పిల్లలు స్వంతగానే ఆలోచించి ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి. ఉపాధ్యాయులు వాటిని సరిచేయాలి
- పాఠశాలల పనివేళలు, పరీక్షలు, మూల్యాంకన పద్ధతులు, సిసిఈ విధానం తదితర అంశాలన్ని తప్పనిసరిగా పాఠశాల విద్యా క్యాలెండర్‌ను అనుసరించి పాటించాలి. (ఈ సంవత్సరం ఇంత వరకు క్యాలెండర్‌ను విడుదల చేయనేలేదు)
- సాయంత్రం వేళల్లో పిల్లలను ట్యూషన్లు, హౌం వర్కులకు పరిమితం చేయకుండా ఆటలు, క్రీడలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలి. వినోదం మరియు శారీరక కార్యక్రమాలు పిల్లల ఎదుగుదలకు అవసరము మరియు అవి పిల్లల హక్కు కూడా.
ప్రాథమిక పాఠశాలలకు మార్గదర్శకాలు
- 1, 2 తరగతులకు మాతృభాష, ఇంగ్లిష్, గణితం అనే 3 పాఠ్యపుస్తకాలు, 3, 4, 5 తరగతులకు పై వాటితో సహా పరిసరాల విజ్ఞానం అనే 4 పుస్తకాలు మాత్రమే వినియోగించాలి.
- రాష్ట్ర విద్యా పరిశోధనా మండలి రూపొందించిన పుస్తకాలను మాత్రమే వినియోగించాలి.
- ప్రాజెక్టులున, క్లిప్‌టెస్టులు, ఎక్సర్‌సైజ్‌ల నమోదు కొరకు ప్రతి సబ్జెక్టుకు 100 పేజీలకు మించని నోట్ పుస్తకం మాత్రమే వినియోగించాలి. అది కూడా ప్రతిరోజూ బడికి తేవలసిన అవసరం లేదు. ఒక్కో సబ్జెక్టు 3 రోజులు చొప్పున వారానికి 2 సబ్జెక్టులు. ఇంకా చేతివ్రాత మెరుగుదల కోసం రెండు 100 పేజీల డబుల్ రూల్ నోట్ పుస్తకాలు మాత్రమే తీసుకురావాలి.
- పిల్లలు ఇంటి నుంచి బాటిల్స్‌లో తాగునీరు తెచ్చుకోవడాన్ని నిరోధించడం కోసం పాఠవాలల్లోనే సురక్షితమైన తాగునీటిని ఏర్పాటు చేయాలి.
- ప్రాథమిక పాఠశాలల పిల్లలకు (హౌం వర్కు) ఇంటి పని ఇవ్వకూడదు.
- పాఠ్యాంశాల చివరగల ఎక్సర్‌సైజులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే చేయించాలి. వీటికోసం ప్రత్యేక పరీ పీరియడ్లను, ప్రత్యేక పీరియడ్లను టైంటేబుల్‌లో కేటాయించాలి.
పై మార్గదర్శకాల ప్రకారం పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగుతో సహా 1, 2, తరగతుల పిల్లల బ్యాగు బరువు 1.5 కిలోలు మించూకూడదు.
3, 4, 5 తరగతుల పిల్లల బ్యాగు బరువు 2 నుంచి 3 కిలోలకు మించరాదు.
ప్రాథమికొన్నత పాఠశాలలు మరియు ఉన్నత పాఠశాలల్లోని 6, 7, మరియు 8, 9 10 తరగతులకు
- రాష్ట్ర పాఠ్య ప్రణాళిక ప్రకారం 6, 7 తరగతులకు 3 భాషలు మరియు గణితం, సైన్స్, సాంఘీక శాస్త్రం మొత్తం 6 పాఠ్య పుస్తకాలు మాత్రమే నిర్దేశించబడినాయి.
- 8, 9, 10 తరగతులకు 3 భాషలు, గణితం, సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ మొత్తం 7 పాఠ్యపుస్తకాలు మాత్రమే ఉండాలి. ప్రతి సబ్జెక్టుకు 200 పేజీల నోట్‌బుక్ ఉండాలి. ఫార్మేటివ్ అసెస్‌మెంట్, ప్రాజెక్టులు, స్లిప్‌టెస్టులకు వినియోగించాలి. ఇవి కూడా ప్రతి రోజు తీసుకురానవసరం లేదు. ఒక చిత్తు నోట్స్‌ను ప్రతిరోజూ తీసుకురావాలి. దానినే అన్ని సబ్జెక్టుల క్లాస్‌వర్క్‌కు ఉపయోగించుకోవాలి.
- పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశం చివరన గల ఎక్సర్‌సైజ్‌లను ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే పూర్తి చేయించాలి. ఇందుకోసం ప్రత్యేక పిరీయడ్‌లను టైంటేబుల్‌లో కేటాయించాలి.
- పిల్లలు సొంతంగా ఆలోచించి ఎక్సర్‌సైజులను, సమస్యలను సాధించే విధంగా ప్రోత్సహించాలి. అవసరమైన సందర్భంలో ఉ పాధ్యాయులు సహకరించాలి.
- 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఇంటిపని కొరకు వారం లేదా నెలలో ఒక్కో సబ్జెక్టును ఒక్కో రోజును ప్రత్యేకంగా కేటాయించే విధంగా పాఠశాల ప్రణాళిక ఉండాలి.
- ఏ సబ్జెక్టు, ఏ రోజు అనే అంశం ఉపాధ్యాయుల సమావేశంలో చర్చించి నిర్ణయించాలి. ఉదాహరణకు 6, 7, 8 తరగతులకు సోమవారం నుంచి బుధవారం వరకు భాషలు, గురువారం నుంచి శనివారం వరకు భాషేతర అంశాలు అదే విధంగా 9, 10 తరగతులకు సోమ నుంచి బుధవారం వరకు భాషేతర అంశాలు, గురు, శుక్ర, శనివారాల్లో భాషలకు సంబంధించిన ఇంటిపని ఇవ్వాలి.
- 6, 7 తరగతుల పిల్లల పాఠ్య పుస్తకాలు, బ్యాగుతో సహా మొత్తం బరువు 4 కిలోలు మించకూడదు. 8, 9, 10 తరగతుల పిల్లల బ్యాగు బరువు 4.5 నుంచి 5 కిలోల కంటే తక్కువ ఉండాలి.
ప్రతి పాథమిక, పాథమికోన్నత, ఉన్నత పాఠాశాలలు స్కూలు బ్యాగుల బరువు తగ్గించటానికి ఈక్రింది చర్యలు తీసుకోవాలి.
- విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారమివ్వాలి. ఈ జాగ్రత్తలు అమలు చేసే విధంగా పర్యవేక్షించాలి.
- ఏ రోజు, ఏ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు తీసుకురావాలో ముందుగానే చెప్పాలి.
- బ్యాగు బరువును సమానంగా పంచే విధంగా వెడల్పాటి పట్టీలు గల బ్యాగులను ఎంపిక చేసేకోవాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెప్పాలి.
- విద్యార్థులు స్కూలు బ్యాగు రెండు పట్టీలను ఉపయోగించాలి. ఒకే భుజంపై మొత్తం బరువు ఉండేట్లు చూడకూడదు.
- విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు వాహనం కొసము ఎదురుచూసేప్పుడు గాని, పాఠశాల అసెంబ్లీలో ఉన్నప్పుడు గాని బ్యాగును కిందపెట్టాలి. టైంటేబుల్ ప్రకారమే పుస్తకాలు మోసేటట్లుగా పాఠశాల జాగ్రత్త వహించాలి.
- బరువైన స్కూలు బ్యాగులు మోయించడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలను గురించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పాఠశాల హెడ్మాస్టర్లు కౌన్సెలింగ్ ఇవ్వాలి.
- ఎస్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాలు కాకుండా ఇతర, అదనపు, బరువైన, ఖరీదైన బోధనకు పనికిరాని పాఠ్య పుస్తకాలను పాఠశాలలు సూచించరాదు. ఏ రోజుకారోజు తమకు అవసరంలేని వస్తువులు, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ తొలగించి అవసరం మేరకే తీసుకెళ్లేట్లు విద్యార్థులను ప్రోత్సహించాలి. పాఠశాలలు విద్యార్థులు తమకు అవసరం లేని మెటీరియల్ మోసుకువస్తున్నారేమోనని తరుచుగా తనిఖీ చేయాలి.
ఆధారం : mana teachers