ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.
తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్ళు తోడటం చాలా కష్టం అయిపోయింది. నీళ్ళు త్రాగటానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్ళు తోడుకోసాగారు. కానీ వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్ళు పెట్టేదెలా?
తోటకి ఎట్లా నీళ్ళు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి. బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుగుకి ఉన్నాయి. తోటంతా నీళ్ళు పెట్టాలంటే బోలెడు నీళ్ళు కావాలి. అందుకోసం చాలా మంది కూలీలను పెట్టాలి. వాళ్ళకి బోలెడంత ధనం ఇవ్వాలి. ఇట్లా అలోచించుకుంటూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కంపించింది.
ఎవరు వాళ్ళు? అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ళవంక చూడసాగాడు రామలింగడు వాళ్ళ ముగ్గురూ రామలింగడి ఇంటివైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా రామలింగడు గమనించాడు.'వాళ్ళను చూస్తే దొంగల్లా ఉన్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలా ఉన్నారు. అని అనుకున్నాడు. వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు "అబ్బాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆవిధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువయ్యింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేద్దాం. అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు. పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్ళకి మన ఇంట్లో వస్తువులేమి కంపించవు" అన్నాడు.
తెనాలి రామలింగడు ఈ మాటలు కావాలనే గట్టీగా అన్నాడు. తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు.
రామలింగడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. తెనాలి రామలింగడు చెప్పేదంతా దొంగలు విన్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు, బంగారు నాణాలు వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏవైన ఉంటే అవి అన్నీ తీసుకుని వచ్చి ఓ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేసారు.
చాటునుంచి దొంగలు ఇదంతా చూసారు. అంతే ఆ రాత్రికి తెనాలి రామలింగడు ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్టుగానే రాత్రికి ఊరు సద్దుమణిగాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామలింగడు ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోకి దిగారు.
బావిలోకి దిగగానే పెట్టె కనిపిస్తున్నది. దానిని తీసుకుని ఎంచక్కా వెళ్ళిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు.
కానీ బావిలో అంతా చెత్త, చెదారం నిండి ఉంది. పిచ్చి మొక్కలు, రాళ్ళతో నిండి ఉంది. అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది. బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి, చిన్నచిన్న రాళ్ళు అన్నీ తొలగించేసారు. అప్పటికి కూడా వాళ్ళకు నగలు ఉన్న పెట్టె కంపించలేదు."ఇప్పుడేం చేధ్ధాం ?" మిగిలిన ఇద్దరినీ అడిగాడు ఒకదొంగ."అసలు నిజంగా వాళ్ళు పెట్టె పడేసారంటావా?" తన సందేహాన్ని వెలిబుచ్చాడు మరొక దొంగ,"ఒరేయ్! మీవన్నీ పిచ్చి అనుమానాలు. వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేయడం మనం చూసాం కదా!"అవును" అని మిగిలిన ఇద్దరూ అంగీకరించారు."మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది కదా!""నిజమే" అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు."అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం. తప్పకుండా మనకు నగలపెట్టి దొరుకుతుంది. మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లారిపోతుంది. మనందొరికిపోతాం.." అన్నాడు."సరే..ఇప్పుడేం చేద్దాం" అడిగాడు ఒక దొంగ."పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఇంక బావిలోపల ఉండి చేసేదేం లేదు. పైకి వెళ్ళి నీళ్ళన్నీ తోడి పోద్దాం. నీళ్ళు అన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తున్నది. అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది" అని సలహా ఇచ్చాడు ఒకదొంగ.మిగిలిన దొంగలు ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు.
ముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్ళు తోడటం మొదలు పెట్టారు. వాళ్ళలా నీళ్ళు తోడి పోస్తుంటే తెనాలి రామలింగడు, ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేసారు.ఈవిధంగా దొంగలు చాలాసేపు నీళ్ళు తోడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళ శ్రమఫలించింది. బావిలో అట్టడుగున ఉన్న నగలపెట్టె దొంగలకు కంపించింది.దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగలపెట్టెకు తాడు కట్టాడు. మిగిలిన దొంగలు ఇద్దరూ పెట్టెను జాగ్రత్తగా పైకి లాగారు. వాళ్ళు నగలపెట్టెను బావిలోంచి పైకి తీయాలన్న ఆ ఖంగారులో, ఆ హడావిడిలో తెల్లారిపోయిన సంగతిని కూడా గమనించలేదు. ఈ లోగా తెనాలి రామలింగడు భటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు. అంతే! వాళ్ళు దొంగలను పట్టుకున్నారు.
చూసారా పిల్లలూ! తెనాలి రామలింగడు ఎంత తెలివి కలవాడో...!?
ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగడికి అర్థం అయ్యిందో అప్పుడే రామలింగడు ఓ పథకం వేసుకున్నాడు. ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్ళు పెట్టించాలనుకున్నాడు కదా! ఆ పనేదో ఈ దొంగలచేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అంపించింది.వెంటనే లోపలికి వెళ్ళి...కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఆ బెడద తగ్గాక బావిలోంచి నగల పెట్టెను తీసుకుందాం అని చెప్పాడు.నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు. తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం చూసారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కానీ తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు. చిన్న చిన్న రాళ్ళు పెట్టాడు. కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు. అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రంచేసారు.
బావిలో ఉన్న నీళ్ళని తోడిపోసారు. ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీసారు. ఆ సమయానికల్లా తెల్లారిపోయింది. భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఇదీ జరిగింది...ఈ సంగతంతా తెనాలి రామలింగడు రాజుగారికి చెప్పాడు.రాజుగారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వేసాడు. "నిజంగా నీ తెలివి తేటలు అమోఘం. నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళతో నువ్వు చెట్లకి నీళ్ళు పెట్టించావా?" అంటూ నవ్వాడు.తెనాలి రామలింగడు "అవును మహారాజా!" అన్నాడు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే. అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా? వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేసాను." అని చెప్పాడు
ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభలో ఉండగా కొందరు నగరశివారు ప్రాంతపు గ్రామీణప్రజలు విచ్చేసి "అడవిజంతువుల బాధ పడలేకున్నామని, దేవరవారు తగురక్షణ కల్పించకపోతే జీవించలేమని పాదాలపైపడి వేడుకున్నారు. వారిబాధలు విన్న రాయలు వారు, వారికి అభయం ఇచ్చి పంపేశాడు. నరమాంసం చిమరిగిన పెద్దపులి రాత్రులయందు ఆరుబయట నిద్రించేవారిపై దాడిచేసి దొరికినవారిని నోటకరుచుకుపోతుంది. దాన్ని గ్రామీణులం ఏం చేయలేకనే ఏలినవారికి మొరపెట్టుకుంటున్నాం అని ప్రజలు చెప్పిన మాటలు రాయలువారి చెవులలో గింగురుమంటూ ఆరోజు సభలో ఆయన అన్యమనస్కుడై ఉండగా, సభలో ఉన్న తెనాలి రామలింగకవి రాయలవారిని గమనించి "ప్రభూ! తమరెందుకో ఏదో ఆలోచనలో సభాకార్యక్రమాలపై మనస్సు నిలపలేకపోతున్నారు. ఆ పులిని వధించేందుకు ఎవరిని పంపించాలని ఆలోచిస్తున్నారు కదూ!" అని అన్నాడు.
పాపం పల్లెవాసులు ప్రాణాలమీద పెనుగండంగా పెద్దపులి దాపురించింది. పులివేట అంటే ఎవరూ అంతగా ముందుకురారు. మేమే స్వయంగావెళ్ళాలి. ఇప్పటి ఉన్న నా పరిస్థితిలో నేను పులివేటపై ఆసక్తిగాలేను. ఎవరిని పంపాలని ఆలోచిస్తున్నాను, ఇంతలో నీవు నన్ను బాగా పసిగట్టావు. కొలువులో అతిరధమహారధులున్నారు, అందులో నాగమనాయకుడు జగజ్జెట్టి, కానీ వృద్ధాప్యంలో ఉన్నాడు, వారి పుత్రుడు చిరుప్రాయపువాడు. అదే అర్దం కావటంలేదు. కొంతమంది సైన్యాన్ని పంపితే సరిపోతుంది, కొంత ప్రాణనష్టం ఉంటుంది" అన్న రాయల మాటలు సభలో ఖంగుమన్నాయి. ఏలినవారు అంతగా ఆలోచించాల్సినపని లేదు. ఈ రోజు నావద్దకు పెనుగొండ పాలెగాపు వీరరుద్రసింహారెడ్డి విచ్చేసారు. ఆయనకు సాహసం, యుద్ధం అంటే చెవికోసుకునేంత పిచ్చి. మహారాజు తనను కేవలం కొన్ని పల్లెలవరకే పాలెగాపుగా నియమించి వదిలేసారు. ఎ,ఏమాత్రం అవకాశం ఇచ్చినా నాపోరాటపటిమను చూపేవాడిని అని ఈరోజే నాతో అన్నాడా వీరసింహం. అతని సేవలు వాడుకోండి ప్రభూ!" అని రామలింగడు విన్నవించాడు. అక్కడే ఉన్న రాజోద్యోగులు, మహామంత్రి తిమ్మరుసు, తాతాచార్యులవారు "ఇంకేం మనరామలింగకవి చెప్పిన ఆసాహసినే ఈ పులివేటకు పంపుదాం" అని అంతా ఏకకంఠంతో రాయలవారితో చెప్పారు. రాయలవారు తలపంకించి "రామలింగా! నీకు ఆ రుద్రసింహుడు దైర్యసాహసాలపై నమ్మకం ఉందా? అతడు నీకెలా తెలుసు?" అని అడిగాడు.
రాళ్లసీమ పల్లెల్లో తిరుగుబాటులను అణచడానికి, శత్రువుల జొరబాటులను కట్టించడానికి తమరేకదా కొన్నిప్రాంతాల్లో ఈ పాలెగాపులను నియమించారు. వారు ఎ సామంతుల్లా ఆ గ్రామాల్లో క్రూరపాలనతో చెలరేగిపోతున్నారు. ఈ వీరరుద్రసింహుడు ఆబాపతే. ఇక అతనికి నాకున్న పరిచయం అతడు ఎంతటి క్రూరస్వభావో, అంతటి సాహిత్యపిపాసి. నాచే ఏదైనా గ్రంథం రాయించి అంకితం పుచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు. అతని మాటలలో తను యుద్ధపిపాసి అని పదేపదే చెప్పటంతో ఇంతకంటే సమయంరాదుకదా అని తమచెవిలో వేసాను" అని చెప్పాడు రామలింగడు. రాయలు రాజభటులను పంపించి, వీరరుద్రసింహుడు బసచేసే చోటనుంచి క్షణాలలో రప్పించాడు. పేరుకు తగ్గట్టుగానే భారీవిగ్రహంతో, చేతులుకట్టుకొని విధేయతతో నిలబడ్డాడు. "రుద్రమసింహా! నీవు నగరానికి వచ్చి నన్నెందుకు కలవలేదు? ఇప్పుడు రామలింగకవి చెప్పగా నిన్ను పిలిపించాను. నీతో ఒక ముఖ్యమైన పనిపడింది. అది నీవు సాధించి తీరాలి. పెద్దపులి ఒకటి నరమాంసం రుచిమరిగి పల్లెల మీదపడి నానాభీభత్సం చేయుచున్నది. దాన్ని నీవు వధించాలి. ఇట్టి పనులను మాచే నియమింపబడే ఏ పాలెగాపులతో చేయించలేదు, నీకే తొలి అవకాశం ఇస్తున్నాను, ఏమంటావు?" అని తీక్షణమైన చూపులతో అడిగాడు.వీరరుద్రసింహుడు గుటకలు మింగుతూ చూసి "తమ ఆజ్ఞ మహారాజా, మీ కోసం ప్రాణాలైనా సమర్పించటానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని తలవంచి నమస్కరించాడు. మీతో జెగజ్జెట్టీలవంటి సైనికులు వందమందిని వెంటపంపుతాను. ఆ పులివధ జరిగితీరాలి. ఆ పల్లెలకు దానిపీడ వదిలిపోవాలి, అదే నాకోరిక" అని చెప్పి రాయలు సింహాసనం దిగి కిందికివచ్చి వీరసింహుడి భుజం తట్టాడు.
తెనాలిరామలింగడిని కొరకొరా తినేసేట్టు చూసాడు రుద్రసింహుడు. ఎరక్కపోయి ఈ బాపనితో వెర్రిమొర్రి మాటలు చెప్పి మీదకు తెచ్చుకున్నాను అని లోలోపల బాధపడ్తూ "ధన్యుడిని మహారాజా, స్వామికార్యం పూర్తిచేసి విజయుడనై వచ్చెదను" అని యుద్ధానికి బయలుదేరాడు. ప్రభూ! అనుగ్రహిస్తే నేనూ వెళ్తాను" అని రామలింగడు కోరాడు. సభలోని వారంతా అయోమయంగా చూసారు. పులివేటకు వెళ్ళేందుకు ఈ రామలింగడికి ఉన్న ధైర్యం ఏమిటి? ఇదేమి చాదస్తం అని నోళ్ళు వెళ్ళబెట్టారు. రాయలు కూడా వింతగా చూసాడు. ఏదో విశేషం లేకుండా రామలింగడు ఇలాంటి నిర్ణయం తీసుకోడు అని లోలోపల అనుకుని సరే నీవుకూడా వెళ్ళవచ్చు అని అన్నాడు. రుద్రసింహా! రామలింగకవి ముచ్చటపడి నీతో వస్తామంటున్నారు. ఆయన వీరత్వం ప్రదర్శించేందుకు రావడంలేదు. ఆయన రక్షణ బాధ్యత మీదే. ఆయనకు ఏం కాకూడదు. జాగ్రత్తసుమా!" అని చెప్పి పంపాడు. వీరరుద్రసింహుడు నాయకత్వంలో పులివేట ప్రారంభమయింది. అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పులిజాడ వారికి కనిపించలేదు. దాని అడుగుల ముద్రలు కొంతవరకే కనిపించాయి. వారితో ఉన్న రామలింగడు రుద్రసింహున్నే గమనించసాగాడు. అతడు ప్రత్యర్థులను అంతమొందించడంలో పాషాణహృదయుడు. కానీ పులి అంటే భయపడుతున్నాడు. అది పసిగట్టిన రామలింగడు "అయ్యా! మీ వ్యూహం ఏమీ అర్థం కావడం లేదు. తప్పదని వచ్చినట్టున్నారు" లోగొంతుతో అడిగాడు.
"రామలింగా! ఎంతపని చేశావయ్యా! అనవసరంగా నాగురించి రాజుగారికి చెప్పి ఈ అడవుల్లో తెచ్చిపడేశావు. ఆ పులి ఎప్పుడు మనకెదురుపడుతుందో? ఏమో?" అందులో నరమాంసం రుచి మరిగింది. ఒకవిధంగా పిచ్చిపట్టినట్టు పెట్రేగిపోతుంది" అని విసుగుతో అన్నాడు.
ఇంతలో ఒక చిన్న గుడారం వేసారు సైనికులు. అంతా విశ్రమించారు. చీకట్లు ఆవరించాయి. రామలింగడు ఉదయం అంతా అడవిలో తిరుగాడడం వలన బాగా అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు అప్పుడు వీరరుద్రసింహుడు సైనికుల్లో ఉన్న తుళు, కబ్బలి, మొరస జాతివారి గురించి ఆరాతీసాడు. రాయలవారి సైన్యంలో ఈ ముడుజాతుల వారే ఎక్కువ ఉండేవారు. కారణం ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. ఒక్క కబ్బలి జాతివారు మాత్రమే ఈ వందమందిలో పదిమంది వరకూ ఉన్నారు. వారిని సైన్యం నుంచి వేరుచేసి రహస్యమంతనాలు చేసాడు. పులిని తెల్లారేసరికి చంపి తీసుకురమ్మన్నాడు. అందుకు బహుమానంగా రాయలవారు తనకు ఏమిచ్చినా మీకే ఇస్తాను అని వారికి ఆశ చూపాడు. వారు ఇంకనూ పలు గొంతెమ్మ కోరికలు కోరారు. వాటికీ ఒప్పేసుకున్నాడు. అపుడు సైనికులు అదెంతపని అని ఆ రాత్రే అడవుల్లోకి వెళ్ళారు. రుద్రసింహుడు గుడారంలో హాయిగా నిద్రపోయాడు. ఉదయానికి పులిని చంపి గుడారం ముందు పడేశారు. కబ్బలిజాతి సైనికులు.
కళ్ళునులుముకుంటూ లేచిన రుద్రసింహునికి భయానకంగా కనిపిస్తున్న పులిశవం కనిపించింది. ఇంతపెద్ద పులిని తనెప్పుడు చంపగలడు, దాని పంజాదెబ్బకు చచ్చేవాడిని అని అనుకొన్నాడు. పులివధ రహస్యం అక్కడ పులిని చంపిన పదిమంది సైనికులకి, రుద్రమసింహునికి మాత్రమే తెలుసు. మిగిలినవారికి అసలు పులి చంపబడినట్లు తెలియదు. ఒక్కసారిగా గుడారం కలకలం రేగింది, "రుద్రసింహునికి జై, రాయలసీమ సింహానికి జై, పులిని వధించిన వీరునికి జై" అని నినాదాలు చేసారు. తుళ్ళిపడి లేచాడు రామలింగకవి. కొంపదీసి పులి లోపలి వచ్చిందా అని భయపడి "రక్షించండీ, రక్షించండి" అంటూ అరవసాగాడు. సైనికులు లోపలికి వచ్చి "ఏమైంది కవిగారూ?" అని అడిగారు. ఏందయ్యా ఆ కేకలు, పులి గుడారంలోకి జొరబడిందేమోనని భయపడి అరిచాను" అని అన్నాడు. ఆ సైనికులు విపరీతంగానవ్వారు . "అయ్యా! మన రుద్రమసింహుల వారు ఆ పులిని తెల్లవార్లు వెదికి వేటాడి మరీ చంపేశారు. ఆ ఆనందంతో నర్తిస్తున్నాం, రండి చచ్చిన పులిని చూడండి. ఇంతటి పులిని అతనొక్కడే ఎలా చంపాడో అర్థం అవుతుంది, ఆ పులి పంజాదెబ్బ ఒక్కటి కూడా అతనిపై పడలేదు. అంతటి వీరుడు ఇతను" అని ఒక సైనికుడు చెప్పాడు.
అతడో సింహం, అతడికి పులిని చంపటం ఏమీకాదన్నమాట. భలేవేట, ఏమో అనుకున్నాడు. రాయలవారు నన్ను తెగమెచ్చుకుంటారు" రామలింగడు ఆనందంతో బయటికి వచ్చాడు. పులి వికృతంగా ఉంది. కనీసం పదిమంది యోధులు కలిసి కానీ నిర్జించలేరు. "ఒకేఒక్కడు ఎలా ఎదుర్కొన్నాడు, వీరరుద్రమ ఏమని పొగడను నిన్ను. ఈ పులిని రాయలవారికి చూపించాలి. నాకు తెలిసి ఎవరూ ఇంత పెద్దపులిని చంపి ఉండరు" అని తెగ మెచ్చుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం రాజదర్భారుకు పులిశవంతో వెళ్ళారు. డప్పులు, భేరీలు మ్రోగాయి. పులిని చూసి నగరవాసులు భయభ్రాంతులైనారు. సైనికుల భుజాలపై కూర్చున్న వీరరుద్రసింహుడు సభాసదులకు చేతులు ఉపుతూ అట్టహాసంగా కనిపించాడు. రాయలు ఉప్పొంగిపోయాడు. లేచినిలబడి చంపబడ్డ పులిని చూసి ఒకవిధంగా నిర్ఘాంతపోయాడు. సైనికులు పదిమంది ముందుకువచ్చి "జయము, జయము మహారాజా! ఈ పులికోసం మేము పదిమంది, మాతో శ్రీశ్రీశ్రీ వీరరుద్రసింహులవారు అర్థరాత్రివేళ అడవంతా గాలించాము. ఇది నరమాంసరుచి మరిగినందున మమ్మల్ని చూడగానే మాపై దుమికింది. నిజానికి ఈ మాహావీరుడు రుద్రసింహులవారు అడ్డుపడకుండా ఉంటే ఈ పాటికి మా ప్రాణాలు పోయేవి. ఈయన కత్తిదూసి ఇంతపులిని క్షణాలలో మట్టికరిపించారు" అని చెప్పారు.
సభలో ఉన్నవారంతా ఉత్కంఠభరితంగా విన్నారు. "ఇట్టి వీరుని మనకు పరిచయం చేసిన రామలింగడు ఎక్కడ?" అని ఆరాతీశాడు తిమ్మరుసు. రాయల కళ్ళు వెతకసాగాయి. "మీతో వచ్చిన రామలింగకవి ఎక్కడ?" అని తిమ్మరుసు అడిగాడు. సైనికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతవరకూ మనతోనే ఉన్నాడు, ఇంతలోనే ఎటు వెళ్ళాడు అని వెతకసాగారు. అంతలో మళ్ళీ భేరీలు, డప్పులు మ్రోగాయి. అంతా అటువైపు చూసారు. మరో ఊరేగింపు సభలోకి ప్రవేశించింది. "కవితిలక, సాహస విక్రమార్క, క్రూరమృగ నాశక, అరివీరభయంకర, రామలింగా" అని నినాదాలహోరుతో ఇరవైమంది సైనికులు రామలింగని భుజాలపై మోసుకుంటూ వచ్చారు. రామలింగడు సభలోని వారందరినీ చూస్తూ చేతులు ఊపుతూ, తన కండల్ని పొంగిస్తూ హడావిడిగా కనిపించాడు. కవులు నోళ్ళు తెరిచారు. తిమ్మరుసు, తాతాచార్యులు, ఉన్నత రాజోద్యోగులు రామలింగని ఎగాదిగా చూసారు. ఈ బాపడా పులిని చంపాడంటున్నారు సైనికులు. వారికి పిచ్చిపట్టలేదు కదా! అని ఎవరికివారే అనుకున్నారు. వీరరుద్రసింహుడికి చెమటలు పట్టాయి. రామలింగడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, తన వ్యవహారం బయటపడితే ఎంత ప్రమాదం? అందులో రాయలవారు క్షమించనే క్షమించరు అని లోలోపల చాలా భయపడ్డాడు.
"రామలింగా నువ్వా పులిని చంపింది. మరి రుద్రసింహుడంటున్నారు ఆ సైనికులు ? ఏమిటిదంతా? నిజం చెప్పండి. పులిని చంపింది ఎవరు?" అని రాయలు కోపంగా ప్రశ్నించాడు. అప్పుడు రామలింగడు "రుద్రమసింహుడు వెనుక పదిమంది ఉన్నారు. నా వెంట ఇరవైమంది ఉన్నారు, అడగండి నిజానిజాలు తెలియగలవు ప్రభూ" అని అన్నాడు. సైనికులారా! ఏమిటిదంతా? ప్రజలను భీతావహులను చేసే పులి చచ్చింది అంటే ఆ ఆనందం అనుభవించకుండానే మీరు చేస్తున్నది సభను తప్పుతోవ పట్టించటమే, ఇట్టి తప్పిదము క్షమించరానిది" అని రాయలు కోపాన్ని ప్రదర్శించాడు.మన్నించండిమహారాజా! తమరాదేశించినట్లు పులి చంపబడింది. మాలో ఎవరు చంపినా ఒకటే, తెనాలి రామలింగకవికే ఆ ఫలాలు ఇప్పించండి, ఆయనకే తమరిచ్చే కానుకలను ఇచ్చి ఆనందింపచేయండి" తెలివిగా వీరరుద్రసింహుడు తన అవఅభిమతాన్ని తెలియజేశాడు. ఆ మాటలకు సభ అంతా నివ్వెరపోయింది. ఒకవిధంగా రామలింగనిపై కోపాద్రిక్తులయ్యారు. రాయలు కూడా అదోలా చూసాడు. "రామలింగా, నువ్వే పులిని చంపావా?" మరోసారి అడిగాడు రాయలు.
రామలింగడు "ప్రశాంతంగా వినండి ప్రభూ! పులిని చంపినందుకు నాకేమి ఇస్తారో ముందు తెలియజేయండి. ఆ తరువాత నేను నా వెనుక ఉన్న సైనికులు ఓ నిర్ణయానికి రాగలము" అని అన్నాడు. నేను ఒకటి అడుగుతుంటే నువ్వు మరొకటి చెపుతున్నావు. సరే ఆ క్రూరజంతువుని చంపినందుకు వెయ్యి వరహాలు ఇవ్వగలను, దానితోపాటు వీరులకు ఇచ్చే బిరుదును ఇవ్వగలను. ఇదే విధానం మాతత, తండ్రుల నుంచి వస్తున్నది. ఇప్పుడు చెప్పు పులిని చంపింది ఎవరు?".
"వెయ్యి వరహాలు అయితే మాకు అభ్యంతరం లేదు. కానీ బిరుదు దగ్గరే పేచీ ఉంది. ప్రభూ మరోమాట చెప్పలేరా?". రాయలవారికి ఏమీ అర్థంకాలేదు. సభ క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారిపోతుంది. ఊపిరిబిగపట్టి వింటున్నారు సభికులు. ఏలినవారు అనుజ్ఞ ఇస్తే నేను సభ నుంచి నిష్క్రమించగలను" అని చేతులు జోడించాడు వీరరుద్రసింహుడు. అతడి వెనుక ఉన్న పదిమంది సైనికులు అతన్ని కొరకొరా చూడసాగారు. అతడికి వినపడేట్టుగా గొణగసాగారు. "ఎంతో కష్టపడి పులిని చంపితే మాకు ఇస్తామన్న బహుమతుల్ని రామలింగడి పరం చేయడానికి నీ మనస్సు ఎలా ఒప్పుకుందయ్యా! ప్రాణాలకు తెగించినందుకు ఇదా నీవు మాకు ఇచ్చేది".
"దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీకు ఇవ్వవలసింది నేను తప్పక ఇస్తాను, నన్ను నమ్మండి" అని వారికి మాత్రమే వినపడేట్టు చెప్పాడు వీరరుద్రసింహుడు.
రామలింగడు ఆ సైనికుల మాటలను చెవులను రిక్కించి విని, రాజా! వీరరుద్రసింహుడు పూర్తిగా ఓ మంచి నిర్ణయానికి వచ్చేశాడు. అతడి వెనుకున్న సైనికులకు స్వంతంగా ముందు అనుకున్న లంచం ఇచ్చుకుంటాడు. ఇక తేలాల్సిందే తమవద్ద నా బిరుదులు. నాకు దయచేసి ఓ ఇరవై బిరుదులు ఇప్పిస్తే మాలో ఎలాంటి పేచీలుండవు" రాయలు వైపు. ఆ మాటల్లో రాయలకు ఇందులో ఏదో మతలబు ఉందనిపించింది. "నువ్వు ఒకపులిని చంపినందుకు ఒకబిరుదు ఇవ్వగలను కానీ ఇరవై కుదరదు. అయినా అన్ని బిరుదులతో నీకేం పనయ్యా! నువ్వు పులిని చంపటమే సభలో వారంతా నమ్మలేకపోతున్నారు. కనీసం నీ ఒంటినిండా చిన్నగాయం కూడా లేదు, పులిని చూస్తే భయోత్పాతంగా ఉంది. నువ్వు నిజంగా పులిని వేటాడావా?" నేనడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం రాకుండా ఉంది" రామలింగడిని నిలదీసినట్లు అడిగాడు. "నిజమే ప్రభూ, తమరు సెలవిచ్చారు, అంత పెద్దపులిని నావంటి బ్రాహ్మణుడు చంపటమనేది ఎవరూనమ్మరు. పైగా నాఒంటిమీద చిన్నపాటి గాయం లేదు. ఇదే ప్రశ్న నాపక్కన నిలుచున్న రుద్రసింహుడిని ఎందుకు అడగలేదు. అతని పేరులో రౌద్రం ఉంది. తమరు నియమించిన సరిహద్దు పాలెగాళ్ళ పదవిలో ఉన్నాడు. అతడి ఒంటిమీద గాయాలేవీ లేవే. నా వెనుక ఉన్న సైనికులకూ, చిన్నపాటి గాయంకూడా కాలేదు. అంతోఇంతో గాయపడినది మనందరికీ కనిపిస్తోంది రుద్రసింహుని వెనుకున్న పదుగురు సైనికుల శరీరాలపై మాత్రమే. వాళ్ళంతా ఆ పులివలన చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిలో గాయపడ్డారు".
"అంటే......." రాయలు రెట్టించాడు.
"ప్రభూ! తమకు అరటిపండు ఒలిచినట్టుగా వివరించాను. లోగుట్టు అర్థం కాలేదా?" రామలింగడు నవ్వుతూ అడిగాడు.
"పులిని చంపింది రామలింగడు కాదు, వీరరుద్రసింహుడు కాదు. మన వీర సైనికులే. రామలింగకవి నిజం చెప్పినందుకు ఈ సభ రుణపడి ఉంటుంది" అని సభలోని వారంతా ఎలుగెత్తి అరచి మరీ చెప్పారు. రాయలు నవ్వుతూ "రామలింగా నీవు కవివే కాదు, దేశాభిమానివి. నీలాంటి దేశభక్తులు అందరికీ మార్గదర్శకులు" అని మెచ్చుకున్నాడు. రుద్రమసింహా! నీవు పాలెగాడివి. నీకు ఇలాంటి అక్రమపద్ధతుల్లో లభించిన వీరత్వం వలన నీకు ఒరుగునది ఏమిటి?" రాయల ప్రశ్నకు రుద్రసింహుడు తలవంచుకుని నిలబడ్డాడు. "క్షమించండి ప్రభూ! నేను వచ్చింది తెనాలి రామలింగకవి వద్ద ఓ కావ్యం అంకితం స్వీకరించాలనే ఆశతో వచ్చాను. నాకు సాహిత్యాభిలాష ఆ కోరిక తెలిపాను. అందుకు రామలింగకవి ఒప్పుకున్నారు. ఈలోగా తమరు పిలిపించారు. ఈ పులిని వేటాడమని ఆదేశించారు. నేను తీర్ధయాత్ర చేయుచున్నాను. అందుకే సైనికులకు లంచం ఎరగా చూపి ఈ వక్రమార్గంలో తమముందు ఈ రోజు ఘోరమైన తప్పుతో నిలుచున్నాను" అని తన నేరాన్ని ఏదీ దాచకుండా ఒప్పుకున్నాడు. రామలింగడు వెంటనే అందుకుని తన గొంతు విప్పాడు. "ఏలిన వారికి నేను చెప్పుకోవల్సింది ఉంది. ఈ రుద్రసింహుడు పాలెగాపు పదవిలో ఉంటూ అక్కడ ప్రజలను నానా బాధలు పెడుతున్నాడు. తలకు మించిన భారమైన పన్నులతో వేదిస్తున్నాడు. అక్కడ నా బంధువులు బతకలేక దేశాంతరం పోయారంటే అక్కడ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. వీళ్ళక్కడ సామంతుల్లా ఏలుతున్నారు. ఏదిఏమైనా ప్రజలకు కంటగింపు పాలన రుచిచూపడం ఏమేరకు న్యాయం? అందుకే ఈతనికి నేను కావ్యం అంకితం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఎలాగైనా రుద్రసింహునికి బుద్ధి చెప్పాలని ఈ వేటలోకి రప్పించాను. అతడే థప్పతి అడుగులు వేసి తమ ముందు దోషిగా నిలబడ్డాడు.
అతడు తమవలె సాహిత్యం పట్ల అభిరుచి ఎందుకు చూపుతున్నాడో తెలుసా ప్రభూ! అతనికి అతనే తానో శ్రీకృష్ణదేవరాయలు అనుకుంటున్నాడు. అందుకే వక్రమార్గంలో సాహసాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేశాడు. ఇదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు లేదా?" సభలో ఉన్నవారి నవ్వుల మధ్య రామలింగకవి చెప్పాడు. "రామలింగా నువ్వు ఈతనికి అంకితమీయనున్నది ఏ కావ్యం? ఎప్పటిలోగా అతనికి అందజేయనున్నావు? మరి కావ్యం రచించిఇవ్వకుండా ఈ పులివేటలో అతన్నెందుకు లాగావు?" అని అడిగాడు."ప్రభూ! నేను రాసిచ్చేవాడిని. కానీ ఈతడికి అసలు చదువురాదు. ఏదో కూనిరాగాలతో శుద్ధ తప్పులతో కొన్ని పద్యాలు చెప్పగలడు. ఇట్టివానికి ఇచ్చిన కావ్యంనకుఏ మేరకు ప్రచారం జరుగును. అదియునుగాక, ఈతడు వచ్చినది నగరానికి, తమదర్శనం చేసుకోకుండా, వారం దినాలుగా ఇక్కడే సంచరించడం, కావ్యమన్నచో ఈతనికి ఏదో వృత్తిపని వలె ఉన్నది. పగలు, రాత్రి ఏం కవీశ్వరా! నాపని ఇంకనూ కాలేదా? నీవు మనస్సు పెట్టినా అదెంతపని అని విసుగు చెందటం భరించలేకపోయాను. ఒకసారి ఏకంగా ఏదో రాసి నా ముఖాన కొట్టవయ్యా పంతులయ్యా! నీకు నేను ఇవ్వజూపినది చాలనట్టుంది. అందుకే రాయకుండా ఎప్పుడూ రాజసభకు పోతున్నావు. అని నిష్టూరంగా నావైపు చూసిన చూపులను తట్టుకోలేక ఈతనికి తగు బుద్ధి చెప్పాలనుకున్నాను. ఇంతలో తాటాకులను గుత్తులు గుత్తులు నావద్దకు తెచ్చి నువైనా రాయి లేదా నేనైనా రాసుకుంటాను అని ఏకంగా ఘంటం పట్టుకున్నాడు. నగరంలో ఉండే కవినే ఇంతగా మానసికంగా హింసిస్తుంటే ఇక ఈతని ఏలుబడిలో పాపం ఆ ప్రజలు ఎలా బతుకుతున్నారో!" అని రామలింగడు చెప్తుంటే, సభలో ఉన్న దూర్జటి "ఎలా భరించావయ్యా?" అని నవ్వుతూ ప్రశ్నించాడు.
"ఈ అనుభవాలు తమకు అలవాటు. నాకు కొత్తకదా! ఈ అంకిత తతంగాలు. తమరు నేర్పిందే నీరజాక్ష. ధనకనక వస్తువాహనాలుఇవ్వాలేగాని తమరు ఎవరికైనా ఎన్నికావ్యాలైనా ఈయగలరు. తమవద్దకే రావలసిన రుద్రసింహులు మతితప్పి నావద్దకు వచ్చి పడరానిపాట్లు పడ్డారు. పాపం దోషిగా నిలబడ్డారు" సూటిగా చురక తొలిసారిగా దూర్జటి అంటించాడు. ఒక్కసారి సభాప్రాంగణం అంతా ఉలిక్కిపడింది. దూర్జటివంటి కవి తొలిసారిగా మరొక కవితో మాటపడటం విన్నవారు అవాక్కయిపోయారు. రాయలవారు విన్నారు తప్ప వారించనేలేదు.
తిమ్మరుసు మీసాలు సరిచేసుకుంటూ విన్నారు. తాతాచార్యులు ఉత్సాహంగా వింటూనే రాయలువైపు చూశాడు. "రామలింగా ఏమిటి నీ అదుపు ఆజ్ఞలేని మాటలు. నీకు పెద్దలయందు వీసమెత్తు గౌరవం లేదు. ఏమి చూసుకొని నీకు అంత అహంకారం? నిన్నకాక మొన్న సాక్షాత్తు రాయలవారిని విమర్శించావు. నేడు నీకంటే అన్నివిధాలుగా ఆధిక్యతలో ఉన్నందుకైనా నన్ను గౌరవించావా? లేదు. నీవేమైనా అలవోకగా ఘంటాన్ని తాళపత్రాలపై రాసే ప్రజ్ఞాసంపద కలిగినవాడివా? పలు రాజ్యాల్లో నీ పండితపటిమ చూపి కవులను ఓడించే చరిత్రగల పండిత జెగజ్జెట్టివా? పండితులన్నా క్షమించే గుణం మన రాయలవారికి ఉన్నందున నీవు బతికిపోయావు. లేకుంటే ఈ పాటికి నీవు జీవచ్చవమై ఉండే వాడివి. పండితులను దూషిస్తావు, మహారాజును గేలిచేస్తావు. ఒక విప్రుడికి ఉండవలసిన వినయవిధేయతలు వీసమైనా లేవే. నీవంటివాడు ఉన్న ఈ సభలో ఒక్క ఘడియ కూడా ఉండలేను" అంటూ చివాలున లేచాడు దూర్జటి. ఆగండి మహాకవీ! ఎందుకంత ఉలుకు. ఏమన్నాను? నిజం కుండబద్దలు కొట్టాను. ఇప్పుడు మీరీ సభలో నాపై చిర్రెత్తిన ప్రతీదానికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ప్రభూ! నన్ను మాట్లాడానికి ఆజ్ఞ ఇవ్వండి. రాయలు కళ్ళతో సరేననడంతో గొంతు సవరించుకొని "ఓ కవితిలకమా! నేను పండితులను, మన ఏలికను అవమానించాను అని పెద్ద అభియోగం చేసారు. ఈరోజే మొదటిసారి మీవంటి పెద్దలను తమతప్పులతో నిలదీసే పరిస్థితిని మీరే కల్పించారు, ఇక మన ఏలిక రాయలవారిని ఆయన రాసే కావ్యాన్ని నేను ఎప్పుడూ మనసావాచా గౌరవిస్తాను. ఆయన రాస్తున్న ఆముక్తమాల్యద కావ్యం గురించి అలాఇలా విన్నాను అందులో తేనేలూరించే తియ్యదనాన్ని మన ఏలిక రాయలవారు గుప్పించారు, దట్టించారు. అందులో ఒకపద్యాన్ని విని సంభ్రమాశ్చర్యాలతో ఏనాడైనా రాయలవారిని కనులారా దగ్గరనుంచి చూడాలనుకున్నాను. కానీ ఆ సర్వేశ్వరుడు నా మొరనాలకించి ఆయనవద్దకే చేర్పించాడు. ఇక ఆ తేనెలూరే పద్యం గురించి చెప్తాను వినండి కవిశేఖరా!
తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ తెలుగొకండ!
ఎల్ల నృపుల గూడి ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స!
ఇట్టిపద్యాన్ని ఆయన రాసినందుకే నేను ఎంతో ఆనందిస్తున్నాను. మనం తెలుగు కవులం. ఆయన మనతోపాటు కన్నడ, తమిళ, ఉర్దూ భాషల కవులను మనవలే చేరదీసి ఆదరిస్తున్నారు. ఆయనకు మనమెంతో ఇతర భాషాకవులు అంతే! ఇతరభాషలపై పట్టున్న రాయలవారింట మాట్లాడింది కన్నడమే, కానీ ఆయన తెలుగుభాషపై చూపిన మమకారం అత్యంతగొప్పది రామలింగని మాటలు వింటున్నవారు నోళ్ళు తెరిచారు. దూర్జటి నొసలు చిట్లించి "ఏమయ్యా రామలింగా, నేను అడిగిందేమిటి? నీవు చెప్తున్నదేమిటి? భువనవిజయంలో ప్రభువులను ధిక్కరించితివని గుర్తుచేసినందుకా? ఈ ముఖస్తుతి కీర్తనలు, చక్రవర్తి మన్ననలు పొందాలని అవకాశం కోసం కాచుకుని కూర్చున్నట్లు ఏమేమో నీ మాటకారితనంతో గతంలో చేసిన ఘోరతప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటున్నావు. ఈ సభలో ఉన్నవారు నిన్ను మించినవారు అని మరువకు. అంతెందుకు నీభార్య నన్ను బతిమాలుకున్నది. నా భర్త దుందుడుకు మనిషి. సభలో ఏదైనా తప్పుగా వాగి రాయలవారి ఆగ్రహానికి గురవకుండా కాపాడమని పదేపదే కోరింది. ఆమెకు అభయం ఇచ్చి ఉన్నాను" అంటూ నవ్వాడు దూర్జటి.
ఓ ఆడుదాని అర్థింపు ఆవేదనను ఇలా బయటపెట్టినందుకు మీగొప్పతనం, మీబోళాతనం మొత్తం బయటపడ్డాయి.సరే, నేనెపుడైనా రాయలవారి ఆగ్రహానికి గురయినపుడు మీరెలాగు రక్షించగలనని ఈ సభాముఖంగా సెలవిచ్చారు, ఆనందించతగ్గ విషయం. ఇక మీదట విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీశ్రీశ్రీ కృష్ణదేవరాయల వారి వాళ్ళ నను భయపడనక్కర్లేదు. ప్రపంచాధినేత కవిశేఖరులు దూర్జటివారి అభయం మరియు వారి కొండంత అండదండలు నాకు అతి పెద్దరక్ష".ఆ మాటలకు సభంతా గొల్లుమన్నది. రాయలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. దిగ్గజకవులందరూ నవ్వాపుకోలేకపోయారు. అర్థంకాకపోయినా తమిళ, ఉర్దూ, కన్నడ కవులు ఏకొంచమో అర్థమయినందున పడిపడి నవ్వారు. తట్టుకోలేని దూర్జటి నేరుగా రాయలవారి వద్దకు వెళ్ళి "ఏమిటి ప్రభూ! అతని నోటికి అడ్డుకట్ట వేయరా? మీ సమక్షంలోనే నావంటివాడికి ఇటువంటి మాటలుపడే శిక్ష తప్పదా? నేనేం పాపం చేశాను?". అదేమిటి దూర్జటి కవిసామ్రాట్! నన్ను ఆపదసమయంలో రక్షించమని కదా నా భార్య తమకు అర్దించింది. అక్కడ ఆమెకు మాటిచ్చి ఇక్కడ శిక్షింపజేసే పన్నాగమా! మనం కవులమా లేక పాలెగాల్లమా? ఈపాటి అన్యాయం తమవద్ద పుష్కలంగా లభిస్తున్నదా? కటకటా". మరోసారి గొల్లుమన్నారు. తాతాచార్యులు కలుగచేసుకొని "నాయనా! రామలింగా! శాంతించు, నీ ఆవేదన నాకు అర్థం అయింది. ఇంతటితో నీ ప్రసంగం ఆపి కూర్చో" అని చెప్పాడు.
"క్షమించండి తాతాచార్యులవారు, ఆముక్తమాల్యద వంటి దైవసంకల్పితమైన కావ్యరచన చేయుచున్న రాయలవారు తన జాంబవతీ కళ్యాణకావ్యం కూడా ఎంతో మనోహరంగా రచించారు. తనకు జంతువుల భాష వచ్చని పదేపదే చెప్పినందున నా ప్రాణాలను లెక్కచేయకుండా సాక్షాత్తు రాయలవారిలోగల కవిని మాత్రమే నిలదీసాను. అంతేకానీ ఇందులో ప్రభువులను వీసమెత్తు కించపరచలేదు. దీనిపై రాయలవారు నొచ్చుకొని ఉండవచ్చు. ఆనాడు భువనవిజయంలో నుంచి బయటకి వచ్చిన వెంటనే ఈ దూర్జటి నన్ను గాఢంగా కౌగలించుకుని "భళీ రామలింగా! మేమెవ్వరం చేయని పని నీవు చేశావు, ఉన్మత్తరాజసేవలు నరకప్రాయం. మన ఏలికకు గట్టిగా బుద్ధిచెప్పితివి. చూసావా! నీయందు దోషం ఇసుమంతైనా లేనందున ఏమీ చేయలేకపోయారు. నీవాదనలో అర్థం ఉంది అని నన్ను కీర్తించాడు, రామలింగడు నాటి నిజం బయటపెట్టాడు. సభంతా నివ్వెరపోయింది. దూర్జటి సిగ్గుతో తలవంచుకున్నాడు. మిగిలిన కవులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. "ప్రభూ! దూర్జటివారిని మన్నించప్రార్థిస్తున్నాను. అలాగే నా పక్కన నిలబడున్న ఈ పాలెగాపు వీరరుద్రసింహున్ని కూడా క్షమించకోరుతున్నాను" అని రామలింగడు వినయంగా ఇద్దరి గురించి అర్ధించాడు. రాయలవారు దీర్ఘంగా ఆలోచించాక సరే అన్నారు. సభ అంతా హర్షధ్వానాల మధ్య ముగిసింది.
ఆధారము: తెలుగు పెన్నిధి.కం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/29/2024
చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడ...
అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్...
ఈ పేజి లో మరికొన్ని నీతి కథలు అందుబాటులో ఉంటాయి...
ఈ పేజి లో పంచతంత్ర కథలు అందుబాటులో ఉంటాయి...