অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కంది

కంది

కంది తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మహబుబ్ నగర్, ఆదిలాబాద్, రంగారెడి, మెదేక్, నల్గొండ, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు.

నేలలు

ఎర్ర చల్కా మరియు నల్లరేగడి నేలలు, మురుగు నీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలం. చౌడు నేలలు మరియు నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు.

పంటకాలం :

కంది పంటను ఖరిఫ్ మరియు రబీలో పండించవచ్చును. ఖరీఫ్ లో రకాన్ని బట్టి 150-180 రోజులు, రబీలో 130-140 రోజులు పంట కాలం కలిగి ఉంటుంది.

అనుకూలమైన సమయం

ఖరీఫ్ : జూన్ 15 నుండి జూలై 15 వరకు (ఆగస్టు 15 వరకు మొక్కల సంఖ్య పెంచి దగర అచ్చులో వేసుకోవచ్చు).

రబీ : 15 సెప్టెంబర్ నుండి 15 అక్టోబర్ వరకు.

రకం ఋతువు / పంటకాలం (రోజుల్లో) దిగుబడి (క్వి / ఎ) గుణగణాలు
ఎల్.ఆర్.జి 41 ఖరీఫ్ 180 రబీ 130-140 8-10 పైరు ఒకేసారి పూతకు రావడం వలన కొమ్మలు వంగుతాయి. శనగపచ్చ పురుగును బాగా తట్టుంటుంది. నల్ల రేగడి భూములు అనుకూలం. నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా పండించవచ్చు. ఎండు తెగులును తట్టుకోదు.
లక్ష్మి (ఐ.సి.పి.ఎల్ 85063) ఖరీఫ్ 160-170 రబీ 130-140 7-8 చెట్లు గుబురుగా ఉంది ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి. ఎండు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. రబీలో విత్తినప్పుడు , ప్రధానమైన కొమ్మలు విడిగా ఎక్కువగా ఉంటాయి. గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి.
ఆశ (ఐ.సి.పి.ఎల్ 87119) ఖరీఫ్ 170-180 7-8 మొక్క నిటారుగా, గుబురుగా పేరుగుతుంది. వ్యుజేరియమ్ ఎండు మరియు వెర్రి తెగుళ్ళను తట్టుకుంటుంది. గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి.
మారుతి (ఐ.సి.పి 8863) ఖరీఫ్ 155-160 7-8 మొక్క నిటారుగా పెరుగుతుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. వరి మాగాణి గట్ల మీద పెంచటానికి కూడా అనువైనది.
డబ్ల్యు.ఆర్.జి 27 ఖరీఫ్ 180 రబీ 120-130 7-8 మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. పువ్వులు ఎరుపుగా ఉంటాయి. కాయలు అకుపచ్చగా ముదురు గోధుమ రంగు చారలు కలిగి ఉంటాయి. గింజలు గోధుమ వక్ణంలో ఉంటాయి. శనగపచ్చ పురుగు కొంత మేరకు తట్టుకోనును.
పాలెం కంది (పి.ఆర్.జి. 158) ఖరీఫ్ 150-155 రబీ 120 -130 6-7 దక్షిణ తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలకు అనువైనది. ప్యుజేరియమ్ ఎండు తెగులును తట్టుకోనును.
సూర్య (యం.ఆర్.జి. 1004) ఖరిఫ్ 165-180 రబీ 120-130 8-9 మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. గింజలు లావుగా గోధుమ రంగులో ఉంటాయి. ఎండు తెగులు (మాక్రోఫోమినా) ను కొంత వరకు తట్టుకొనును.
వరంగల్ కంది 53 (డబ్ల్యు.ఆర్.జి. 53) ఖరిఫ్ 160-180 రబీ 120-130 6-8 కాయతొలుచు పురుగును కొంత వరకు తట్టుకొనును.
ఆర్.జి.టి. – 1 (తాండూరు తెల్ల కంది) ఖరిఫ్ 145-155 రబీ 120-130 5-6 ఫ్యుజేరియమ్ ఎండు తెగులు తట్టుకొనును. తేలిక పాటి మరియు నల్ల భూములకు అనువైనది. అంతర పంటలకు అనుకూలము.
డబ్ల్యు.ఆర్.జి. – 65 (రుద్రేశ్వర) ఖరిఫ్ 160-180 రబీ 120-130 8-10 ఫ్యుజేరియమ్ ఎండు తెగులును పూర్తిగా తట్టుకొనును. వెర్రి తెగులు మరియు శనగపచ్చ పురుగును కొంతవరకు తటుకొని, నల్లరేగడి భూములకు అనువైనది.
టి.డి.ఆర్.జి. – 4 (హనుమ) ఖరిఫ్ 160-180 రబీ 120-130 8-10 ఫ్యుజేరియమ్ ఎండు తెగులును పూర్తిగా తట్టుకొనును. వెర్రి తెగులు మరియు శనగపచ్చ పురుగును కొంత మేరకు తట్టుకొనును.
పి.ఆర్.జి. – 176 (ఉజ్వల) ఖరిఫ్ 130-135 6-8 తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలకు మరియు ఎర్ర చల్కా నేలలకు అనువైనది.
ఐ.సి.పి.హెచ్ – 2740 (మన్నెంకొండ కంది) ఖరిఫ్ 170-190 రబీ 120-140 8-10 ఫ్యుజేరియమ్ ఎండు తెగులు మరియు వెర్రి తెగులును పూర్తిగా తట్టుకొనును. నల్లరేగడి భూములకు నీటి పారుదలకు అనువైన సంకర రకం.

వితన మోతాదు : 2-3 కిలోలు ఎకరాకు; రబీ: 6-8 కిలోలు ఎకరాకు.

విత్తనశుద్ధి : మొదటగా విత్తనాలకు థైరామ్ లేదా కాప్ఠాన్ ఒక కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున పట్టించాలి. ఆ తర్వాత విత్తుకొనే ముందు, 200 నుండి 400 గ్రాముల రైజోబియంను ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి.

విత్తే దూరం : ఖరీఫ్ లో నల్లరేగడి భూమిలో సాలుకు సాలుకు మధ్య 150 లేదా 180 సెం.మీ. ఎర్ర చల్కా భూమిలో సాలుకు మద్య 90 లేదా 120 సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి. రబీలో నల్లరేగడి భూముల్లో సాలుకు సాలుకు మద్య 75 లేదా 90 సెం.మీ. మధ్యస్థ మరియు ఎర్ర చల్కా భూముల్లో సాలుకు సాలుకు మధ్య 45 లేదా 60 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి.

మొక్కల సాంద్రత/ఎకరాకు

ఖరీఫ్ లో : నల్లరేగడి నేలలు : 11,111 – 13,333

ఎర్రచల్కా నేలలు : 16,666 – 22,222

రబీలో : నల్లరేగడి నేలలు : 44,444 – 53,333

ఎర్రచేలా నేలలు : 66,666 – 88,888

విత్తు పద్ధతి : నేలను నాగలి లేదా కల్టివెటర్ తో ఒకసారి దున్ని తర్వాత రెండు సార్లు గోర్రుతోలి చదను చేసి విత్తుకోవాలి. సాళ్ళ పద్ధతిలో నాగలి లేదా గొర్రుతో విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్ లేదా సీడ్ డ్రిల్ కమ్ ఫర్టిలైజర్ తో బోదె కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. అచ్చు పద్ధతిలో బోదెలు తోలి నేరుగా గింజలు బోదె గడ్డపై నాటినచో విత్తనం కూడా తక్కువగా అవసరముండును. నాగలితో విత్తుకున్నప్పుడు జంట గింజలు పడకుండా విత్తనం సమంగా పడేలా విత్తాలి.

అంతర పంటలు

  • కంది + జొన్న, మొక్కజొన్న/సజ్జ (1:2 లేదా 1:4)
  • కంది + పెసర/మినుము/సోయాచిక్కుడు (1:7)
  • (ఒక వరుస కంది 7 వరుసల అంతర పంటలు)
  • కంది + ప్రత్తి (1:4 లేదా 1:6)
  • కంది + పసుపు (1:4 లేదా 1:6)
  • రబీ కంది + రబీ వేరుశనగ (1:4)

పంటల సరళి

  • పెసర – కంది
  • మొక్కజొన్న – కంది
  • ఎడగారు వరి – కంది

సమగ్ర ఎరువుల యాజమాన్యం

సేంద్రియ ఎరువులు : చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మొదళ్ళను రోటవేటర్ తో భూమిలో కలియదున్నాలి.

జీవన ఎరువులు : రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను. 100 మీ.లీ నీటిలో 10 గ్రా. ల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిపి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ ప్రక్రియను పాలిథీన్ సంచులను ఉపయోగించి చేసుకోవలెను. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

ఎకరాకు 2 కిలోల ఫాస్పోబాక్టీరియా 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తనం విత్తేటప్పుడు గాని సాళ్ళల్లో పడేటట్లు వేసుకోనలేను. ఈ ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరమును లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తెచ్చును.

రాసాయనికి ఎరవులు : తొలకరి కందికి ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చే ఎరవులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి, అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగల్ సూపర్ ఫాస్పెట్ లేదా 50 కిలోల డి.ఎ.పి.ని. వాడాలి. రబీ కందికి 16 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులు వేయాలి. భుసార పరీక్షా ఆధారంగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి.

కంది మొక్కకు తొలి రోజులలో ఎక్కువ పోషకాలు ఆవశ్యకత వుంటుంది. కావున పూర్తి నత్రజని మరియు భాస్వరం ఏరవులను తప్పనిసరిగా విత్తనంతో పాటు గాని లేదా ఆఖరి దుక్కిలో గాని వేసుకోవాలి.

పోషక లోపాలు – యాజమాన్యం : మన రాష్ట్రంలో కందిని వైవిధ్యమైన నేలలు, సారవంతమైన రేగడి, ఎర్ర చల్కా, ఇసుక, గుళిక మరియు ఎతైన/పల్లపు ప్రాంతాలలో అలాగే చౌడు, క్షార భూముల్లో కూడా పండిస్తారు. పంట యాజమాన్యం పై ఎక్కువ శ్రద్ధ చూపక పోవడం, సమగ్రపోషక యాజమాన్య పద్దతులు పాటించకపోవడం వలన పలు పోషకాలు లోపాలు గమనించండం జరుగుతుంది.

పోషకధాతు లోపాలు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతావరణం/పరిస్థితులు లోపు సవరణ చర్యలు
నత్రజని ముదురు ఆకులు లేత పసుపు పచ్చరంగుకు మారి పాలిపోయి వడలి రాలిపోవును. తక్కువ సారం కలిగిన నేలలు, మురుగు నీరు పోవు సౌకార్యం లేని నేలలు, ఇసుక నేలలు ఎకరానికి 8 కిలోల నత్రజని ఆఖరి దుక్కిలో వేయాలి. 20 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి పంట పై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
పోటాష్ ఈనెల మధ్య హరితాన్ని కోల్పోయి ఆకుల అంచులు వాడిపోయి లోపలికి ముడుచుకు పోవును. తక్కువ సారం కలిగిన నేలలు, మురుగు నీరు పోవు సౌకార్యం లేని నేలలు భూసారి పరీక్షననుసరించి అవసరమైతే ఎకరానికి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఆఖరి దుక్కిలో వేయాలి.
జింకు లేత ఆకుల ఈనెల మద్య పసుపు వర్ణం దాల్చి మచ్చలు ఏర్పడి ఎర్ర బారి రాలిపోవును. ఎదుగుదల లోపిస్తుంది. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఉదజని సూచిక 8.0 కంటే ఎక్కువ వున్న నేలల్లో కనపడును. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. పైరుపై లోప లక్షణాలు కనబడినప్పుడు వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
ఇనుము లేత ఆకుల ఈనెల మద్య హరిత వర్ణం కోల్పోయి వుండి పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. సున్నపు నిల్వలు ఎక్కువ ఉదజని సూచిక (>8.5) ఉన్న నేలల్లో లోపం కనిపిస్తుంది. లీటరు నీటికి 5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ (అన్నభేధి) ఒక గ్రాము నిమ్మఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

సమగ్ర కలుపు యాజమాన్యం

విత్తే ముందు: ప్లూక్లోరాలెన్ 45% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి, భూమిలో కలుయదున్నాలి.

మొలకెత్తక ముందు: పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేయాలి.

మొలకెత్తిన తరువాత : పైరు 20 రోజుల వయస్సులో వేడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ (వర్సుట్) ౩౦౦ మి.లీ. ఎకరాకు పిచికారి చేయాలి. గడ్డిజాతి కలువు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజాలోఫాప్-పి-ఇథైల్ 5% ఇ.సి. 400 మి.లీ. లేదా ప్రోపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250 మి.లీ. లేదా ఫినాక్సాప్రాప్ ఇథైల్ 9.3% 250 మి.లీ. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు భూమిలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి.

అంతరకృషి : విత్తిన 30 మరియు 60 రోజులకు గుంటకతో గాని, గొర్రుతో గాని, దంతె తోలి గాని అంతరకృషి చేయాలి. విత్తిన 60వ రోజు వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.

యాంత్రీకరణ : బాగా ఎండగా విత్తిన కందిలో ట్రాక్టరు కల్టివేటర్ తో లేదా మినీ ట్రాక్టర్ (కుబోటో) ట్రాక్టర్ రోటావేటర్ తో అంతరకృషి చేసి కలుపును నివారించి నేలలో తేమను కూడా సంరక్షించవచ్చును.

నీటి యాజమాన్యం : ఖరీఫ్ లో వర్షాధారంగా పండిస్తారు. ఆవకాశమున్నచోట పూత, కాయ తయారయ్యే దశలో ఒకటి లేదా రెండు తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి.

రబీలో కందికి సుమారు 250-300 మి.మీ. నీరు అవసరమౌతుంది. 4 లేదా 5 తడులు ఇవ్వాలి. మొగ్గ రాబోయే ముందు, కాయలు ఏర్పడే దశలో తప్పకుండా నీరు ఇవ్వాలి. మడుల పద్ధతి, బోదేలుకాలువల పద్దతిలో నీరు అందించవచ్చు. బెట్టకు గురైనప్పుడు యూరియా 20 గ్రా. లేదా 10 గ్రా. మల్టి-కె లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పూత, కాత రాలిపోకుండా కాపాడవచ్చు మరియు బెట్ట నుండి కొంత ఉపశమనం పొందవచ్చు.

కీలక దశలు : మొగ్గ దశ మరియు కాయలు ఏర్పడే దశలో నీరు ఎక్కువైన లేదా బెట్టకు గురైనా పూత , కాత రాలిపోతుంది.

పంటకోత : కంది రకాన్ని బట్టి పూత దశనుండి 45-60 రోజులలో పంట పరిపక్వతకు వస్తుంది. కాయులు పచ్చ రంగు నుండి పసుపు రంగుకు ఆ తర్వాత పూర్తిగా తయారయిన తర్వాత నలుపు ఛాయకు మారును. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ ఫాస్ 25 ఇసి 2.0 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత పంట కోయవలెను. పంట కోసిన తర్వాత కూడా ఆలస్యంగా తయారైన కాయలు పరిపక్వత చెందును. సాధారణంగా కాయలు త్వరగా చిట్లి పోయే గుణము లేనప్పటికి సకాలంలో కోయని యెడల ముందుగా పక్వత చెందిన కాయలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. కావున సకాలంలో పంట కోసి నష్టాన్ని అరికట్టవలెను. పంటను కొడవలితో మొక్క మొదలు వరకు కోయాలి రాలిపొయిన తర్వాత యంత్ర సహాయం (కంబైన్డ్ హర్వేస్టర్) తో కూడా కోయవచ్చును.

కోతానంతర జాగ్రత్తలు : కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. ఈ సమయంలో కాయలు గింజలలోని తేమ బాగా తగ్గి కాండం ఎండిపోయి అకులన్నీ రాలిపోయి నూర్పిడి సులువుగా జరిగేందుకు దోహదపడును. గూళ్ళు శుభ్రపరిచిన కల్లంలో గాని, టార్పాలిన్ పైనగాని ఏర్పరిచినచో చిట్లిన కాయల వలన నష్టం జరుగుకుండా ఉంటుంది. నూరిడి యంత్రంలో గానీ, టారాలిన్ పైనగానీ ఏర్పరిచినచో చిట్టిన కాయల వలన నష్టం జరుగకుండా ఉంటుంది. నూర్పిడి యంత్రంతో గానీ, మనుషుల ద్వారా గానీ నూర్పిడి చేయవచ్చును. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టడం లేదా చెక్క బల్లల పై కొట్టి గింజలను వేరు చేయవచ్చును. పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్ తో తొక్కించి కూడా నూర్పిడి చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రం (ఆల్ క్రాప్ త్రేషర్) లో జోప్పించి నూర్పిడి చేయవచ్చు.

సస్యరక్షణ

పురుగులు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతావరణ పరిస్దితులు/ఉధృతిగా ఉండు కాలం పురుగు మందులు (మోతాదు లీటరు నీటికి) జీవ రసాయనాలు
పచ్చదోమ ఇవి ఆకు పచ్చ రంగులో ఉండి, త్రికోణంగా ఉంటాయి. పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పిలుస్తాయి. ఇవి ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి ఆకులు ముడుచుకోని దోనెల లాగా కనిపిస్తాయి. ఉధృతి ఎక్కువైతే ఆకులు ఎరబ్రడి రాలిపోతాయి. దీని వల్ల మొక్కల ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఉధృతి ఎక్కువగా వుండును. డైమిధోయేట్ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాన్ 1.6 మి.లీ.
పేనుబంక పిల్ల పేలు ఊదా రంగులో, తలి పేలు నల్లగా ఉండి గుంపులుగా చేరి కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయల నుండి రసం పిలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ముడుతలు పడుతాయి. పువ్వులు, కాయల మీద పేలు ఆశిస్తే గింజ సరిగ్గా తయారవ్వదు. ఇవి విసర్జించిన తేనె వంటి జిగట పదార్ధము మీద మసి తెగులు బూజు ఆశ్రయించి ఆకులు, కాయలు నల్లగా మారుతాయి. తేమతో కూడిన చల్లటి మేఘృవతమై ఉన్న పరిస్దితులు అనుకూలం, అధిక వర్షపాతం వలన పేనుబంక ఉధృతి తగ్గుతుంది. డైమిధోయేట్ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాన్ 1.6 మి.లీ.
ఆకు గూడు పురుగు ఈ పురుగు పైరు ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను తింటాయి. ఒక్కోసారి పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. అధిక వర్షపాతం నమోదు అయినప్పుడు పంట ఎదుగుదల దశల్లో ఎక్కువగా వచ్చును. మోనోక్రోటోఫాన్ 1.6 మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 2.0 మి. లీ.
పూత పెంకు పురుగు ఎర్రటి లేదా నారింజ రంగు మచ్చలు, గీతలున్న నల్లటి పూత పెంకు పురుగులు కందిని పూత దశలో ఆశించి, మొగ్గలను తినడం వలన కాత శాతం తగ్గిపోతుంది. పూత సమయంలో, మేఘావృతమైన వాతావరణ పరిస్దితులలో వచ్చును ఉదయం పూట పురుగులను ఏరి నాశనం చేయాలి.
మారుకా మచ్చల పురుగు తల్లి రెక్కల పురుగు కోడి గుడ్డు ఆకారం గల పసుపు పచ్చని గుడ్లని పువ్వు మొగ్గల పై, లేత ఆకుల పై, పిందలపై పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన లార్వాలు ఆకులను, పువ్వులను, కాయలను కలిపి గూళ్ళుగా చేసి మొగ్గలని, పిందేలని, కాయలని తొలిచి తింటాయి. తొలిచిన కాయ రంధ్రము దగ్గర లార్వా విసర్జితములు కనిపిస్తాయి. పూత దశలో మేఘావృతమైనప్పుడు పొగమంచు మరియు అడపాదడపా చిరు జల్లులు కురిసినప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మీ.లీ + డైక్లోరోవాస్ 1.0 మి.లీ. లేదా ప్రొఫెనొఫాస్ 2.0 మి.లీ. లేదా + నొవాల్యురాన్ 0.75 మి.లీ. + డైక్లోరోవాస్ 1.0 మి. లీ. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు : స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా ప్లుబెండమైడ్ 39.35 యేస్.సి 0.2 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 యేస్.సి 0.3 మి.లీ.
శనగ పచ్చ పురుగు తల్లి పురుగు లేత చిగుళ్ళపై, పూ మొగ్గల పై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లని పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన నార పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తరువాత దశలో మొగ్గల్ని తొలిచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శారిరాని బయట ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. పురుగు తిన్న కాయకి గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటించాలి. వర్షం లేదా చిరు జల్లులు పడినప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పెరిగినప్పుడు, మొగ్గ, పూత, కాయ దశల్లో. ఎసిఫేట్ 75% యస్.పి 1.5 గ్రా. లేదా క్వినోల్ ఫాస్ 2.0 మి.లీ. ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు : ఇండాక్సాకార్బ్ 1.0 మి.లీ. లేదా సైనోశాడ్ 0.3 మి. లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 యస్.సి 0.3 మి.లీ. లేదా ప్లూబెండమైడ్ 0.2 మి.లీ./లీ లేదా లామ్డాసైహాలోత్రిన్ 1 మి.లీ./లీ. బ్యాసిలస్ తురింజెన్సిస్ 75 కిలోలు/హెక్టారుకు హెలికోవేర్పా ఎన్.పి.వి.ద్రావణం 250-500 మి. లీ./హెక్టారుకు బెవేరియా బాసియానా 3 కిలోలు/హెక్టారుకు
ఈక రెక్క పురుగు ఇవి ఎండు గడ్డి రంగులో సన్నని, పొడవైన ఈక రేకలతో ఉంటాయి. ముందు రెక్కలు రెండుగా, వెనుక రెక్కలు మూడుగా చీలి ఉంటాయి. ఈ పురుగు పచ్చటి గుడ్లను పూ మొగ్గపై పెడుతుంది. లార్వా ముదురు ఆకు పచ్చ రంగులో కండె మాదిరిగా, చిన్న, చిన్న ముళ్లు కలిగి, కాస్త పొడవు వెంట్రుకలతో ఉంటుంది. లార్వాలు పూ మొగ్గలను, పువ్వులను తిని, కాయలను తొలిచి నష్టపరుస్తాయి. ఇవి కాయ లోపల తల వుంచి మిగతా శరీరాన్ని బయటే ఉంచి లోపల గింజలను తింటాయి. రంధ్రాలు చిన్నవిగా ఉంటాయి. లార్వాలు ఎదిగిన తరువాత గోధుమ రంగు కోశస్ఠ దశ ప్యుపాలుగా మారి కాయల మీదే ఉంటాయి. వర్షాలు తగుముఖం పట్టిన తరువాత ఎక్కువగా ఆశిస్తుంది ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్వినల్ ఫాస్ 2.0 మి.లీ.
కాయతొలిచే ఆకు పచ్చ పురుగు ఈ పురుగు కంది చివరి దశలో ఎకువగా ఆశిస్తుంది. రెక్కల పురుగు ముందు రెక్కలు లేత గోధుమ రంగులో ఉండి పై అంచును తెల్లని చార కలిగి ఉంటుంది. ఇవి పెరిగే పిందేలపై తెల్లటి గుడ్లను గుంపుగా పెడతాయి. చిన్న లార్వాలు ఆకు పచ్చగా ఉండి పెరిగే కొద్ది గులాబి ఎరుపుగా మారుతాయి. తలమీద నల్లటి మచ్చలుంటాయి. ముదిరిన కాయలను తొలచి గింజలను తింటాయి. లార్వా విసర్జించిన మలినాలు కాయ లోపల ఉంటాయి. ఎసిఫెట్ 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్వినోల్ ఫాస్ 2.0 మి. లీ.
కయతొలిచే ఈగ ఈ పురుగు దీర్ఘ కాలిక రకాలలో ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి ఈగ తెల్ల గుడ్లను అభివృద్ధి చెందుతున్న పిందెలలో చొప్పిస్తుంది. గుడ్ల నుండి వచ్చే కాళ్లు లేని తెల్లపిల్లలు పురుగులు వృధి చెందుతున్న గింజలను చారలు గూళ్ళు చేసి తింటాయి. ఒక్కో పురుగు జీవిత కాలంలో కొద్ది పాటి గింజలను మాత్రమే తింటుంది. పురుగు తిన్న గింజ పనికి రాదు. కయలోనే నిద్రావస్థలోకి వెళ్ళి కాయ నుండి పిల్ల పురుగు చేసిన ఆవగింజంత రంధ్రము ద్వారా తల్లి పురుగు బయటకి వస్తుంది. పంటకాలం ఏదైనా కారణం చేత పొడిగిస్తే వచ్చే దశలో బెట్ట వాతారణం పరిస్దితులంటే ఎక్కువగా వస్తుంది. పూత , పిందే దశలలో ఆశిస్తుంది. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 యస్.పి 1.5 గ్రా.
కాయ రసం పిల్చేపురుగులు బగ్స్ జాతికి చెందిన మూడు రకాల పురుగులు కాయల నుండి రసాన్ని పిల్చి నష్టపరుస్తాయి. ఒక రకం గోధుమ రంగు, భుజాల మీద రెండు ముళ్ళతో ఉంటాయి. రెండో రకం ముదురు గోధుమ రంగు, గుండ్రటి భుజాలతో ఉంటాయి. మూడో రకం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పురుగులు గుడ్లను గుంపులుగా ఆకులు మీద, కాయల మీద పెడతాయి. పిల్ల, తల్లి పురుగులు కాయలోని గింజలు నుండి రసం పీల్చడం వలన గింజలు నొక్కులుగా మారి, ఎండిపోయి మొలకెత్తవు. పిందే, కాయ అభివృది చెందే దశలలో (నవంబర్ - డిసెంబర్), బెట్ట వాతావరణ వరిస్దితులు నేలకొన్నప్పుడు డైమిధోయేట్ 2.0 మి.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ.
ఎండు తెగులు ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని, మొక్కలో కొంత భాగం కాని వాడి ఎండి పొతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. భూమిలో ఉండే శిలీంద్రం ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయడం, పంట మర్పిడి పద్ధతిని పాటించక పోవడం వల్ల ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు నివారణకు మందులు లేవు కాబట్టి ఐ.సి.పి.యల్ 87119 మరియు ఐ.సి.పి. 8863, డబ్ల్యూ.ఆర్.జి 65, టి.డి.ఆర్.జి. 4, ఐసి.పి.హచ్. 2740 రకాలను సాగు చేయాలి. పొగాకు లేదా జొన్నతో పంట మార్పిడి చేయాలి. ట్రైకోడెర్మా మిశ్రమం 10 గ్రాములు ఒక కిలో విత్తనాలకు కలిపి విత్తుకోవడం వలన కొంత వరకు ఎండు తెగులును నివారించవచ్చు.
గొడ్డు మోతు తెగులు (స్టెరిలిటీ మొజాయిక్) తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది, పూత పూయదు. ఈ తెగులు నల్ల (మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. బెట్ట వాతావరణ పరిస్దితులు అనుకూలం. 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 4 మి. లీ. డైకోఫాల్ మందులను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదా తెగులు తట్టుకునే ఐ.సి.పి.యల్ 87119, ఐ.సి.పి.యల్ 8506, బి.యస్.యం. ఆర్. 853 మరియు బి.యస్.యం. ఆర్. 736 వంటి రకాలను సాగు చేయాలి.
ఫైటోఫ్తోరా ఎండు తెగులు ఆకులు, కొమ్మలు, కాండం పై నీటి చుక్కల మాదిరిగా ఏర్పడి తరువాత గోధుమ రంగుకు మారుతాయి. తెగులు తీవ్రమైనచో కొమ్మలు, కాండము విరిగిపోతాయి. తొలి దశలో వచ్చినప్పుడు గుంపులు, గుంపులుగా మొక్కలు ఎండిపోతాయి ఈ తెగులు అధిక వర్షపాతము, నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా వస్తుంది. పైరు ఎదుగుదల దశల అధిక వర్షపాతము నమోదై, మురుగు నీరు పోయే వసతి సరిగ్గా లేని ప్రాంతాలలో ఎక్కువగా వస్తుంది. మాంకోజెబ్ 3 గ్రా. లేక మొటలక్సిల్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మాక్రోఫోమినా ఎండు తెగులు ముదురు మొక్కలు కాండం పైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టు గోధుమ వర్ణంలోనూ మధ్య బాగం తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండి పొతాయి. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయరాదు ఈ తెగులు నివారణకు మందులు లేవు కాబట్టి యం.ఆర్.జి. 66 మరియు యం.ఆర్.జి. 1004 రకాలను సాగు చేయాలి. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి.

ఎండబెట్టుట : నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్తా చెదారం, మట్టి తదితరవి లేకుండా చేసి 3-4 రోజులు ఎండబెట్టాలి. నూర్పిడి చేసినప్పుడు సాధారణంగా 13-14 శాతం తేమ కలిగి ఉంటుండి. ఆ స్ధాయిలో నిల్వ చేసినచో నిల్వలో కీటకాలు ఆశించి నష్టం జరుగుతుంది. కావున 9-10 శాతం తేమ ఉండేలా చూసుకొని నిల్వ చేసుకోవాలి.

నాణ్యతా ప్రమాణాలు : పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య (నఫేడ్) ద్వారా కందిలో నిర్ధారించిన నాణ్యతా ప్రమాణాలు.

ఉత్పత్తులు నిల్వ, మెళకువలు మరియు సస్యరక్షణ

  • కందులను అటు విత్తని అవసరాలు మరియు పప్పు అవసరాలు తీర్చడానికై ధీర్ఘకాలిక నిల్వచేయడం జరుగుతుంది. కావున నిల్వలో కీటకాలు, శిలీంధ్రాలు మరియు ఎలుకలు ఆశించి తద్వారా నాణ్యత దెబ్బతినకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాలి.
  • కంది నిల్వలో సుమారు 10-15 శాతం వరకు నష్టం జరుగుతుందని అంచనా. అన్ని పప్పు దినుసులు కంటే కందిలో నష్టం ఎక్కువ జరుగుతుంది. కంది నిల్వలో బ్రూచిడ్స్ అత్యధికంగా నష్టపరుస్తుంది. మామూలుగా కాయ పరిపక్వత దశలోనే పంట పొలంలో బూచిడ్స్ ఆశించి గింజల ద్వారా నిల్వ చేసే గోదాంలోకి ప్రవేశించి తగు మోతాదులో నష్టం కలిగిస్తాయి. కావున కోత మొదలుకొని నూర్పిడి మరియు నిల్వలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఉత్పత్తి నిల్వ చేసే పద్ధతి ద్వారా భౌతిక అంశాలైన పరిసరాల ఉష్ణోగ్రత, గాలిలో తేమ మరియు గింజలలోని తేమ శాతం ఎప్పటికప్పుడు గమనించి తగు చర్యలు తీసుకున్నట్లయితే జీవ అంశాలైన కీటకాలు, బూజు, బాక్టీరియా తదితర వాటి వల్ల జరిగే నష్టాన్ని చాల వరకు తగ్గించవచ్చు.
క్ర.సం నిర్ధారిత అంశాలు అత్యధిక శాతం ప్రతి క్వింటాలు తూకానికి
1. దుమ్ము, ధూళి, చెత్త, పుల్లలు రాల్లు, మట్టి మరియు ఇతర పంటల గింజలు. 2.0
2. ఇతర పప్పుదినుసుల గింజలు 3.0
3. బాగా రంగు మారినవి/అంతర్గతంగా దెబ్బతిని నాణ్యతను ప్రభావితం చేసేవి. 3.0
4. పాక్షికంగా రంగు మారినవి/పైపైన దెబ్బతిని నాణ్యత ప్రభావితం కానివి. 4.0
5. పరిపక్వత చెందని మరియు ముడుత గింజలు 3.0
6. పుచ్చులు 4.0
7. తేమ 12.0
  • కందిని బిన్స్ లో గానీ లేదా గొనె సంచులలో గానీ లేదా పాలీథీన్ బ్యాగులతో గాని నిల్వ చేయవచ్చు.
  • సంచులలో నిల్వచేసినప్పుడు ముందు జాగ్రతగా నిల్వ చేసే సాధనాలను (గోనె సంచులు) శుభ్రపరుచుకోవాలి. గోనె సంచులను 10 శాతం వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులను వాడాలి లేదా సచులపై మలాధియాన్ 10 మి.లీ. లేదా డెల్టామెత్రిన్ 2 మి.లీ. లేదా డైక్లోరోవాస్ (0.05%) ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తరువాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి.
  • బస్తాలు నిల్వ చేసే గది గోడల పైన, క్రింద 20 మి.లీ. మలాధియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లల పై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత వహించాలి.
  • గృహ అవసరాలకై కొద్ది మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వంటనూనేలు లేదా ఆముదం నూనె లేదా వేప నూనె ప్రతి కిలో గింజలకు 5.0 మి.లీ. చొప్పున కలిపి నిల్వ చేసినచో నిల్వలో పురుగులు వలన నష్టం జరగకుండా నివారించవచ్చును. గ్రుడ్లు పోదగకుండా నివారించబడి, లార్వా గింజలలోకి చొరబడకముందే చనిపోవడానికి దోహదపడును.

ముఖ్య సూచనలు

  • తక్కువ వర్షపాతం కలిగి మధ్యస్ద తేలిక నేలల్లో వర్షాధారంగా పండించినప్పుడు పూత సమయంలో బెట్ట పరిస్దితులను అధిగమించడానికి మధ్య స్వల్పకాలిక (140 – 160 రోజులు) రకాలైన పి.ఆర్.జి.158, ఐ.సు.పి. 8863, పి.ఆర్.జి. 176 మరియు విడుదలకు సిద్దంగా ఉన్న డబ్యు.ఆర్.జి.ఇ. 97 సాగు చేయాలి.
  • అధిక వర్షపాతం కలిగి, నల్ల రేగడి, మధ్యస్థ నేలలలో కీలక దశలలో 1-2 నీటి తడులు ఇచ్చే వసతి కల్గినప్పుడు ఎండు తెగులును తట్టుకునే పధ్యకాలిక రకాలైన ఐ.సి.పి.ఎల్.87119, డబ్యు.ఆర్.జి.65, టి.డి.ఆర్.జి.4, ఆర్.జి.టి.1, ఐ.సి.పి.హెచ్.2740, మాక్రోఫోమినా ఎండుతెగులు తట్టుకునే యం.ఆర్.జి. 1004 మరియు శనగపచ్చ పురుగును తట్టుకునే డబ్యు.ఆర్.జి.27, యల్.ఆర్.జి. 41 సాగు చేయాలి.
  • ఎండు తెగులు సంక్రమించే సమస్యాత్మక భూములో విధిగా ట్రైకోడెర్మా విరిడి ప్రతీ కిలో విత్తనానికి 8 గ్రా.లు పట్టించి విత్తుకోవాలి.
  • విత్తిన తొలి 60 రోజుల వరకు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కావున స్వల్పకాలిక పంటలైన పెసర లేదా మినుమును అంతర పంటగా వేసుకోనవచ్చును.
  • విత్తిన 50-60 రోజుల వరకు కలుపు లేకుండా చుసుకోనవలెను.
  • ఎత్తైన బోదె కొలువల పద్దతిలో విత్తుకోవాలి.
  • ఎప్పటికప్పుడు అంతరకృషి చేసి మరియు అంతర పంట కోసిన తర్వాత మోళ్ళను భూమిలో కలియ దున్ని బోదెల ద్వారా వర్షాధారపు నీటిని సంరక్షించుకోవాలి.
  • శనగపచ్చ పురుగు మరియు మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
  • కీలక దశలలో తేలిక పాటి నీరు (డ్రిప్ లేదా బోదెల ద్వారా) అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చును. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. ఎట్టి పరిస్దితులలో పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
  • విత్తడం నుండి కోత వరకు యాంత్రిక పద్దతులు అవలంభించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగును.

విత్తనోత్పత్తి

  • విత్తనోత్పత్తి ఖరీఫ్ మరియు రబీలో చేసుకోవచ్చు. వితనోత్పత్తికై పండంచేటప్పుడు అంతర పంటలు వేయకూడదు.
  • కందిలో స్వతహాగా కొంత పరపరాగ సంపర్కం జరుగుతుంది. కావున తగు జగ్రతలతో విత్తనోత్పత్తి చేపట్టాలి. లేని యెడల ఆధికోత్పత్తినిచ్చే రకాలు జన్యు పరంగా క్షీణించి వాటి శక్తిని కోల్పోయే అవకాశం ఉంది.
  • వివిధ రకాల కంది పంట మరియు విత్తనోత్పత్తికి పొలం మధ్య మూల విత్తనోత్పత్తికి కనీసం 100 మీ. వేర్పాటు దురాన్ని పాటించాలి.
  • నాణ్యమైన బ్రీడర్ విత్తనాన్ని పరిశోధనా స్దానం నుండి సేకరించి తదుపరి విత్తనోత్పత్తికి వాడుకోవాలి.
  • ప్రధాన పొలం బాగా తయారు చేసి సిఫారసు మేరకు సేంద్రియ మరియు రసాయనికి ఎరువులు వేయవలెను.
  • తమ ప్రాంతానికి అనువైన, చీడపిడలు/రోగ నిరోధక శక్తి కలిగిన అధిక దిగుబడి నిచ్చు రకాలు ఎన్నుకోవాలి.
  • కంది విత్తనోత్పత్తికి ఎనుకున్న పొలం ఇంతకు ముందు కంది వేసిన పొలం కాకుండా చూసుకోవాలి.
  • విత్తనపు పంటకు అంతరకషి సకాలంలో చేసి, కీలక దశలైన మొగ్గ, పిందే, కాయ తయారగు దశలలో నీరు పారించవలెను.
  • కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి.
  • పైరు మొలక దశ నుండి కోత సమయం వరకు బెరకు మొక్కలను ఎత్తు, రంగు మరే విధంగానైనా తేడాగా ఉన్న కనిపిస్తే పీకి వేయాలి. అదే విధంగా తెగులు సోకిన మొక్కల్ని తీసివేయాలి.
  • అవసరమైన సస్యరక్షణ చర్యలను సకాలములో తీసుకోవాలి.
  • కంది పూత దశ నుండి 45-60 రోజులలో పరిపక్వత చెంది కోతకు వచ్చును. కాయలు సహజ పచ్చ రంగు నుండి ఛాయ నలుపు లేదా గోధుమ రంగుకు మారిన తర్వాత పరిపక్వత చెందినట్లుగా గుర్తించి 80 శాతం పైగా మొక్కలు పరిపక్వతకు వచ్చిన యెడల పంటను మొక్కలతో సహా కోసి గూళ్ళుగా పెట్టి 10-12 రోజులు ఎండనిచ్చి తర్వాత నూర్పిడి చేయాలి.
  • విత్తనాన్ని 9 శాతం తేమ వచ్చే వరకు ఎండబెట్టి, శుద్ధి చేసి కొత్త పాలిధీన్ సంచులలో నిల్వ చేసుకోవాలి.

విత్తన నాణ్యతా ప్రమాణాలు

క్ర.సం ప్రమాణాలు మూల విత్తనం సర్టిఫైడ్ విత్తనం
1. వేర్పాటు దూరం 250 100
2. కేళీలు (అత్యధిక శాతం) 0.10 0.20
3. జన్యు స్వచ్ఛత (అత్యధిక శాతం) 99.5 98
4. బౌతిక స్వచ్ఛత (అత్యధిక శాతం) 98 98
5. ఇతర పదార్దాలు (అత్యధిక శాతం) 2 2
6. ఇతర పంటలు విత్తనాలు (అత్యధికంగా) 5/కిలో విత్తనానికి 10 / కిలో విత్తనానికి
7. ఇతర నిర్ధారిత కంది రకాలు (అత్యధిక శాతం) 10/కిలో విత్తనానికి 20/కిలో విత్తనానికి
8. ఇతర కలుపు విత్తనాలు (అత్యధిక శాతం) 5/కిలో విత్తనానికి 10/కిలో విత్తనానికి
9. మొలక శాతం (అత్యల్పంగా) 75% 75%
10. తేమ శాతం (అత్యధికంగా) 9 9

తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే పప్పదినుసుల పంటల్లో కంది ప్రధానమైనది. కందిని సాంప్రదాయకంగా ఖరీఫ్ పంట కాలంలో వరాధార పంటగా అన్ని రకాల నేలల్లో సాగు చేస్తారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులను సాధించ లేకపోతున్నారు. ఖరీఫ్ పంట కాలంలో అతివృష్టి మరియు చీడపీడల తాకిడి తదితర కారణాల వలన పంట దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కందిని రబీ పంటగా మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోను సాగు చేయడానికి అపారమైన అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం వర్షపాత సరళిని గనుక పరిగణలోకి తీసుకుంటే, జూన్ మాసం తప్పిస్తే, జులై నుండి సెప్టెంబరు మొదటి పక్షం వరకు వరాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల ఖరీఫ్ కంది అంత ఆశాజనకంగా లేదు, ముఖ్యంగా తేలికపాటి నేలల్లో కంది తీవ్రమైన బెట్టకు గురవుతూ వుంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటగా రబీ కందిని విత్తుకునే అవకాశం ఉంది. అలాగే ఇతరత్ర కారణాల వల్ల తొలకరిలో ఏ పంటనూ వేసుకునే అవకాశం లేని ప్రాంతాల్లో రబీ కందిని వితుకోవచ్చు. ఖరీఫ్లో సమయానుసారంగా విత్తిన స్వల్పకాలిక అపరాలను కోసిన తర్వాత కూడా రబీ కందిని రెండవ పంటగా సాగు చేసుకోవచ్చు. అదే విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తొందరగా కోతకొచ్చే సోయాబిన్ పంట తర్వాత కూడా రబీ కందిని ఆరుతడి వంటగా ప్రోత్సహించడం వలన, ఖరీఫ్ కందికి జరిగిన నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో కందిని ”నష్టపరిచే శనగపచ్చ పురుగు ఉధృతి రబీలో కనిష్ట స్థాయిలో ఉంటుంది. తద్వారా రైతులకు సస్యరక్షణకయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. రబీలో కందిని సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో విత్తిన్నప్పటికీ పంట త్వరగా (120-130 రోజులు) కాపుకు వచ్చి తక్కువ వ్యవధిలోనే ට්‍රිෂ්ණජ්‍ය ප්‍රශීටඩ්ර ఆదాయానిస్తుంది. సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతుల్లో ਹੇ ವೆಸ್ಲಿ, రబీ కంది ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది.

రబీ కంది దిగుబడులు పూర్తిగా యాజమాన్య పద్ధతుల పైనే ఆధారపడి ఉంటాయి. రబీ కందిలో యాజమాన్య పద్ధతులు ఖరీఫ్ పంటకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఖరీఫ్లో సాగు చేసినపుడు 160 నుండి 180 రోజులకు కాపుకొచ్చే రకాలు, రబీలో కేవలం 120 నుండి 130 రోజుల్లో కోతకొస్తాయి. రబీలో పంట నిడివి తక్కువగా ఉండడం వల్ల తక్కువ ఎత్తు పెరిగి, తక్కువ కొమ్మలను వేస్తుంది. కాబట్టి రబీలో కందిని విత్తినపుడు సాళ్ళ మధ్య ఎడం తగ్గించి మొక్కల సాంద్రతను పెంచుకోవడం ద్వారా అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం కలుగుతుంది.

రబీ కంది సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు

రకాలు

రబీ కంటూ ప్రత్యేకమైన రకాలు లేవు. ఖరీఫ్లో 6 నెలలకు కాపుకు వచ్చే మధ్యకాలిక రకాలు మాత్రమే రబీ సాగుకు అనువైనవి. ఖరీఫ్లో 170-180 రోజులకు పంటకు వచ్చే మధ్యకాలిక రకాలు 6 నుండి 7 అడుగుల వరకు పెరుగుతాయి. అవే రకాలు రబీలో 4 నుండి 4 1/2 అడుగుల ఎత్తు పెరిగి 120 నుండి 130 రోజులకు పంటకు వస్తాయి. రబీ సాగుకు లక్ష్మీ (ఐ.సి.పి. యల్ 85063), ఆశ (ఐ.సి.పి.యల్ 87119), ఎమ్.ఆర్.జి 66, అభయ (ఐ.సి.పి.యల్ 332), ఎల్.ఆర్.జి. 41, పాలెం కంది (పి.ఆర్.జి. 158) డబ్ల్యు.ఆర్.జి. 27, ఎల్.ఆర్.జి. 30, ఎల్.ఆర్.జి. 38 రకాలు అనుకూలము.

విత్తన మోతాదు మరియు విత్తేదూరం

విత్తన మోతాదు ఎకరానికి

విత్తే దూరం

నేల స్వభావం

10  కిలోలు

45 సెం.మీ*10 సెం.మీ

తేలిక పాటి నేలలు/చల్కా నేలలు

7.5 కిలోలు

60 సెం.మీ*10 సెం.మీ

మధ్యస్ధ నేలలు

5.5 కిలోలు

90 సెం.మీ*10 సెం.మీ

లోతైన నల్లరేగడి నేలలు

ఎరువులు : చివరి దుక్కిలో ఎకరానికి రెండు టన్నుల పశువుల ఎరువును వేయాలి. 16 కిలోల నజ్రతని, 20 కిలోల భాస్వరానిచ్చే ఎరువులను ఒక ఎకరానికి వేయాలి. 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువులను దుక్కిలో వేయాలి. మిగతా 8 కిలోల నత్రజనిని పై పాటుగా 40-45 రోజులప్పడు వేయాలి.

నీటి యాజమాన్యం : నేల స్వభావాన్ని బట్టి రబీ కాలంలో కందికి 2 నుండి 8 తేలికపాటి తడులు ఇవ్వాలి. ఈ తడులు మొగ్గ దశలో ఒకసారి, కాయ దశలో మరోసారి ఇవ్వాలి.

అంతరకృషి : కంది పైరును 30 నుండి 40 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. మొదటి రెండు నెలల వరకు తరచుగా గొలు/దంతి ద్వారా అంతరకృషి చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిధాలిన్ 30 శాతం మందును ఎకరానికి 1.0-1.5 లీటర్లు పిచికారి చేయాలి.

సస్యరక్షణ

పురుగులు

శనగ పచ్చ పురుగు : శనగపచ్చ పరుగు ఉధృతి సాధారణంగా అక్టోబర్ మరియు నవంబరు మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే ఖరీఫ్ కంది అదే సమయంలో పూత మరియు కాయ దశల్లో ఉండడం వలన, ఈ పురుగు పంటను అధికంగా నష్టపరుస్తుంది. కాకపోతే రబీ కందిని సెప్టెంబరు చివరి వారం నుండి అక్టోబరు వరకు విత్తుకోవచ్చును. కాబట్టి అక్టోబరు మొదటి వారంలో విత్తిన కంది పైరు డిశంబరు చివరి నుండి జనవరి మొదటి పక్షములో పూతకు వస్తుంది. డిశంబరు, జనవరి మాసాలలో శనగ పచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖరీఫ్ పంటతో పోలిస్తే, రబీ కంది పంట కొంత మేరకు శనగ పచ్చ పురుగు బారి నుండి తప్పించుకుంటుంది. అయితే, పూత దశలో పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లయితే క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రాII ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అయినప్పటికి శనగపచ్చ పురుగును నివారించలేకపోతే ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా లే ఇండాక్సాకార్చ్ 1.0 మి.లీ లేదా స్పైనోశాద్ 0.3 మి.లీను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

మరుకా మచ్చల పురుగు : ఈ పరుగు పూత, పిందెలను ఒక దానితో మరొకటి గూడు కట్టి లోపలే ఉండి వాటిని తినడం వలన తీవ్ర నష్టం జరుగుతుంది. రెక్కల పురుగు మొగ్గల దగ్గర కాని, మొగ్గలపైన గాని గ్రుడు పెడుతుంది. అందుచేత పూత ప్రారంభ దశలో వేప నూనె/వేపగింజల కషాయం (5%) పిచికారి చేస్తే రెక్కల పురుగు గ్రుడు పెట్టుట నివారించబడి పరుగు ఆశించదు.

పురుగు ఆశించిన వెంటనే ఆలస్యము చేయకుండా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ/ధయోడికార్చ్ 1 గ్రా/నొవాల్యురాన్ 0.75 మి.లీ/స్పైనోసాద్ 0.3 మి.లీ/ఫూబెండిమైడ్ 0.3 మి.లీ తో పాటు డైక్లోరోవాస్ 1.మి.లీ / లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారము రోజులకొకసారి పిచికారి చేయాలి.

కాయ ఈగ : కాయ ఈగ తల్లి ఈగ మాములు ఈగ కంటే చిన్నదిగా ఉంటుంది. తల్లి పురుగు లేత పింద దశలో కాయ కవచంలోకి చొప్పించి తెల్లని గ్రుడు పెడుతుంది. తెల్లని కాళ్ళు లేని పిల్ల పురుగులు వృద్ధి చెందుతున్న గింజలను సారలు, గాళ్ళు చేసి తినడం వలన అవి పనికిరాకుండా పోతాయి. కాయలోనే నిద్రావస్థలోకి వెళ్ళి, కాయలనుంచి పిల్ల పరుగు చేసిన ఆవగింజంత పొర కిటికీ ద్వారా రంధ్రం చేసి తల్లి పురుగు బయటకు వస్తుంది. కావున అభివృద్ధి చెందుతున్న కాయుల్లో పురుగులు గమనించినప్పడు డైమిధోయేట్ 2.0 మి.లీ లేక ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ/ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయ రసం పీల్చే పురుగు : ఈ పురుగు ముదురు బూడిద రంగున్న గుడు గుంపులుగా ఆకులు, కాయలమీద పెడతాయి. పిల్ల, తల్లి పరుగులు కాయలోని గింజల నుంచి రసం పీల్చడం వల్ల గింజలు నొక్కులుగా మారి, ఎండిపోయి మొలకెత్తవు. దీని నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు

ఎండు తెగులు : ఎండు తెగులు వలన పంట పూత, కాయ లేర్పడు దశలో మొక్కలు చేలో గుంపులు, గుంపులుగా చనిపోతాయి. మొక్కలు పూర్తిగా లేదా కొంత భాగం వాడి ఎండిపోతాయి. ప్రస్తుతానికి దీని నివారణకు మందులు ఏవి లేవు. తెగులు తట్టుకొనే లక్ష్మీ (ఐ.సి.పి.యల్ 85063) మరియు ఆశ (ఐ.సి.పి.యల్ 87119) రకాలను సాగు చేయటం వలన ఈ తెగులు బారి నుండి పంటను రక్షించవచ్చు.

వెర్రి తెగులు : ఈ తెగులు సోకిన మొక్కలు లేత ఆకుపచ్చ రంగుగల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది, పూత కూడా రాదు. కాబట్టి దీనిని గొడ్డు తెగులు అని అంటారు. దీని నివారణకు ఈ తెగులును తట్టుకొనే రకాలైన లక్ష్మీ మరియు ఆశ రకాలను సాగు చేయాలి. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రా|| నీటిలో కరిగే గంధకం పొడి లేదా 4 మి.లీ డైకోఫాల్ లేదా 2 మి.లీ ప్రాపార్గైట్ను కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

కంది పంటను ఆశించే కీటకాలు , సమగ్ర సస్యరక్షణ పద్ధతులు

కంది, కజానస్ కజాన్ ఫ్యాబేసి కుంటుంబానికి చెందిన ద్వివార్షిక మొక్క మన రాష్ట్రాలలో ప్రధానంగా పండించే పంటలలోpp10.png కంది ఒకటి. ఈ పంటను సాగు చేయడం వల్ల రైతులు అధిక లాభాలను పొందుతున్నారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణం ఈ పంటలో కీటకాల ఉధృతి అధికమై పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. అంతే కాకుండా రైతులు సరైన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అవలంబించకపోవడం వల్ల, పంట దిగుబడి తగ్గుతోంది. అదే విధంగా, రైతులు కీటకాలను గుర్తించడంలో, అవి గాయపర్చే విధానం, గాయం లక్షణాలను గుర్తించడంలో సరైన అవగాహన లేకపోవడంవల్ల, కీటకాలు ఆశించే సమయాలు క్షేత్ర స్థాయిలో గుర్తించకపోవడం వంటి మొదలగు కారణాల వల్ల పంట దిగుబడి అనూహ్యరీతిలో తగ్గి పంట నష్టానికి గురి అవుతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతు సోదరులు కంది పంటను సాగు చేసే క్రమంలో ఈ కింద పేర్కొన్న పురుగులు గుర్తించి, వాటి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి.

శనగ పచ్చ పురుగు (హెలికొవరా ఆర్మిజర)

గుర్తింపు చిహ్నాలు : గుడ్లు పసుపు రంగులో ఉండి, వలయాకారంలో పెడుతుంది. శనగ పచ్చ పురుగు లద్దె పురుగు వివిధ రకాల రంగులలో ఉంటుంది. సాధారణంగా లద్దె పురుగు ఆకుపచ్చ రంగులో ఉండి, బూడిద రంగు చారలను లద్దె పురుగు దేహం పార్శ భాగాల్లో ఉంటుంది.

గాయ పరిచే విధానం, గాయ లక్షణాలు : లద్దె పురుగు మొక్కఅన్ని భాగాలను గాయపరుస్తుంది. సాధారణంగా ఆకులు, కాయలను అధికంగా గాయపరుస్తుంది. లద్దె పురుగు కాయదశలో కాపై గుండ్రని రంధ్రాన్ని చేసి దానిలో తలనుంచి సగభాగాన్ని చొప్పించి వెనుక భాగాన్ని బయటకు పెట్టి కాయలోగల గింజలను మొత్తం తినివేస్తుంది.

ఈక రెక్కల పురుగు (ఎక్సలాస్టిన్ అట్ మోసా):

గుర్తింపు చిహ్నాలు : గుడ్లు ఆకుపచ్చ రంగులో ఉండి పూత, మొగ్గలు, కాయల మీద పెడుతుంది. లద్దె పురుగు లేత పసుపు రంగు నుండి గోధుమ రంగులో ఉండి శరీరం మొత్తం సన్నటి వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. కోశస్థ దశను కాయ ఉపరితలంపై గమనించవచ్చు. ప్రొధ జీవి ఎండిన గడ్డి రంగులో సన్నటి ఈగ రెక్కలు కలిగి ఉంటుంది.

గాయ పరిచే విధానం, గాయం లక్షణాలు : లద్దె పురుగు పూత దశలో ఆశించినట్లయితే పూత రాలిపోతుంది. లద్దె పురుగు పూల మొగ్గలను తింటుంది. కాయలపై గోకి రంధ్రం చేసి కాయలో గల గింజలను తింటుంది. లద్దె పురుగు శరీరం మాత్రం బయటవైపు ఉంటుంది.

కంది కాయ తొలిచే ఈగ (మెలనోగ్రామైజ ఒబోటుసా)

గుర్తింపు చిహ్నాలు : గుడ్లు సన్నవిగా ఉండి కాయమీద పెడుతుంది. లద్దె పురుగు పాల తెలుపు రంగులో ఉండి కాళ్ళు లేకుండా ఉంటుంది. దీన్నే మాగ్గట్ అంటారు. కోశస్థ దశ కాయలోపల జరుగుతుంది. రెక్కల పురుగు ఈగలాగా చిన్నగా ఉంటుంది. దీనికి పొడవైన కాళ్ళుంటాయి. రెక్కలు మెరుస్తూ పారదర్శకంగా ఉంటాయి. ఉరం, ఉదరం నల్లగా ఉంటాయి.

గాయపరిచే విధానం, గాయం లక్షణాలు : గాయ పరిచేటప్పుడు దీని లక్షణాలు ఏమీ బయటకు కనిపించవు. లద్దె పురుగు గుడ్ల నుంచి బయటకు రాగానే కాయ పైపొర పై కొంత సేపు తిని తర్వాత విత్తనాల్లోకి ప్రవేశిస్తాయి. విత్తనం కొంత భాగం మాత్రమే తింటాయి. ఈ పురుగు ఆశించిన గింజలు నల్లగా మారి తినడానికి పనికిరావు.

మారుకా మచ్చల కాయ తొలిచే పురుగు (మారుకా విటైటా)

గుర్తింపు చిహ్నాలు : రెక్కల పురుగు గుడ్డును జంటగా కాయమీద పెడుతుంది. లద్దె పురుగు లేత ఆకుపచ్చ రంగులో ఉండి ప్రతి శరీర ఖండితంలో ఒక జత నల్లటి మచ్చలుంటాయి. ప్రతి మచ్చ పైన ఒక సన్నని వెంట్రుక ఉంటుంది. చివరి దశలో ఉండి లద్దె పురుగు గులాబి రంగులోకి మారుతుంది. కోశస్థ దశ భూమిలో ఉంటుంది. రెక్కల పురుగు ముందుజత రెక్కలు గోధుమ రంగులో తెల్లటి పట్టి కలిగి ఉంటుంది. వెనక జత రెక్కలు తెల్లగా నల్లటి పట్టీని కలిగి ఉంటుంది.

గాయ పరిచే విధానం, గాయం లక్షణాలు : లద్దె పురుగు మొగ్గలను గూడుగా ఏర్పరచి వీటిలోపల భాగాలు ఉంటుంది. తరువాత కాయలోకి ప్రవేశించి - పెరుగుతున్న గింజలను తింటుంది. కాయమీద ఉన్న రంధ్రం చిన్నగా ఉండి, పురుగు విసర్జించిన మలంతో కప్పబడి ఉంటుంది.

కంది కాయ తొలిచే పురుగు (ఇటియెల్లో జిన్జినెల్లా)

గుర్తింపు చిహ్నాలు : రెక్కల పురుగు గుడ్లను ఒంటరిగా - పెడుతుంది. గుడ్డు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. లద్దె పురుగు ఆకుపచ్చగా ఉండి క్రమేపీ లేత ఎరుపు రంగులోకి మారుతుంది. లద్దె పురుగు ప్రాగాక్షం పైన నల్లటి మచ్చలుంటాయి. రెక్కల పురుగు బూడిద రంగులో లేదా బూడిద గోధుమ రంగులో ఉంటుంది. ముందు జత రెక్కల చివర్లు తెల్లగా చార లిగి ఉంటుంది.

గాయ పరిచే విధానం, గాయం లక్షణాలు : లద్దె పురుగు తొలిదశలో మొగ్గలను ఆశించి తర్వాత కాయలను తొలుచుకుంటూ లోపలికి ప్రవేశించి విత్తనాలు తింటాయి.

నీలి సీతాకోక చిలుక (లాంపాడియస్ బోయిటికస్)

గుర్తింపు చిహ్నాలు : సీతాకోక చిలుక గుడ్లను ఒంటరిగా - మొగలపై పెడుతుంది. లద్దె పురుగు లేత ఆకుపచ్చ - లేదా పసుపు రంగులో ఉండి శరీరంపై ఎర్రటి చారలు, చిన్నటి నల్లని వెంట్రుకలను కలిగి ఉంటుంది. కోశస్థ దశ కాండం, భూమిని తాకే దగ్గర ఉంటుంది.

తల్లి పురుగు సున్నితమైన రెక్కలు కలిగి వాటి చివరి భాగాలు మచ్చలుంటాయి. రెండవ జత రెక్క మధ్య భాగంలో ఒక సన్నని వెంట్రుక వంటి భాగం ఉంటుంది.

గాయపరిచే విధానం, గాయం లక్షణాలు : లద్దె పురుగు పూతలోనికి, కాయలోనికి ప్రవేశించి కాయలను - తింటుంది.

పాడ్బగ్ (ఐపార్టస్ పెడిసైటిస్)

గుర్తింపు చిహ్నాలు : శోభకాలు, తల్లి పురుగు గోధుమ రంగులో ఉండి, చివర జత కాళ్ళు ఫియర్ (కాళ్ళు మొక్ మూడవ ఖండితం) వెడల్పుగా ఉంటుంది.

గాయ పరిచే విధానం : శోభకాలు, తల్లి పురుగులు మొగ్గలు, కొమ్మలు, కాయల నుంచి రసం పీల్చుకొని జీవిస్తాయి.

చిక్కుడు కాయ తొలిచే పురుగు (అదిమరస్ అంటికింసాధి) లద్దె పురుగు ఆకుపచ్చగా గోధుమ రంగుతో పార్శ్వ గుర్తులు కలిగి ఉంటుంది. రెక్కల పురుగు పసుపు పచ్చగా ఉండి గోధుమ రంగు, ముందు జత రెక్కలు వి ఆకారపు మచ్చను కలిగి ఉంటాయి. లద్దె పురుగు చిక్కుడు, కంది కాయలలోకి ప్రవేశించి విత్తనాలను తింటాయి.

కంది పంటలో సమగ్ర సస్యరక్షణ

  • కీటకాలను తట్టుకునే నూతన రకాలైన పల్నాడు, (ఎల్. ఆర్.జి.-30), మారుతి, అభయ, ఎల్. ఆర్.జి.-41, ఎల్.ఆర్.జి. -35 మొదలగు రకాలను సాగుచేయాలి.
  • లోతుగా దుక్కి చేయడం, దీనివల్ల భూమిలోపల దాగి ఉన్న సుప్తావస్థ దశలో ఉన్న కీటకాలను నాశనం చేయవచ్చు.
  • ఈ పంటను పురుగులు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మెట్ట వరి మొదలగు పంటలతో పంట మార్పిడి చేయాలి.
  • ఖరీఫ్ లో అంతర పంటగా 7 సాళ్ళు, రబీలో 3 సాళ్ళు పెసర లేదా మినుము వేసుకోవాలి.
  • కంది పంట చుట్టూ జొన్న పంటను రక్షణ పంటగా విత్తుకోవాలి.
  • పైరు విత్తిన 90-100 రోజులలో చిగుళ్ళను ఒక అడుగు మేరకు కత్తిరించాలి.
  • పంటలో కనిపించే గుడ్లు, తొలి దశ లద్దె పురుగులను గుర్తించి చేతితో ఏరివేసి, వాటి పొలం గట్లలో నాశనం చేయాలి.
  • ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగుల ఉనికి గమనిస్తూ ఉండాలి.
  • ఎకరానికి 4-5 పసుపు రంగు ఎరలను ఉపయోగించాలి.
  • ఎకరానికి 1 దీపపు ఎరను సాయంకాలం 6-10 గంటల సమయంలో ఉపయోగించాలి.
  • పురుగు తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి.
  • బాసిల్లస్ తురింజిన్సిస్ పెరా దార్ కుర్స్టాకి (3ఎ, 3బి, 3) 5 శాతం డబ్ల్యూ . పి. 400-500 గ్రా. ఎకరాకు 400 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
  • ఎన్. పి . వి. హెలికావర్స్. ఆరిజర (ఎన్.వి.పి. ఎచ్.ఎ) 2 శాతం ఎ.ఎస్. 100-200 మి.లీ. ఎకరానికి 200-300 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
  • అజాడ్రక్టిన్ 0.3 శాతం (3 పి.పి.ఎం) వేప గింజల నూనెను 1000-2000 గ్రా. 200-300 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలానికి పిచికారీ చేయాలి.
  • బాగా ఎదిగిన లద్దె పురుగులను చెట్లను బాగా కుదిపి కిందకు రాలిన లద్దె పురుగులను సేకరించి నిప్పు పెట్టి కాల్చివేయాలి.
  • పై యాజమాన్య పద్ధతులను పాటిస్తూ పురుగుల ఉధృతి అధికంగా ఉంటే చివరి అస్త్రంగా రసాయన మందులను సిఫారుసు చేసిన మేరకు పిచికారీ చేయాలి.

రసాయనిక పురుగు మందులు

  • పైరు మొగ్గ లేదా లేత పూత దశలో క్వినాల్ ఫాస్ 25 శాతం ఇసి. 560 మి.లీ. 200-400 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలానికి పిచికారీ చేయాలి.

ఇతర పురుగులకు శాస్త్రవేత్తల సూచన మేరకు మందులు వాడాలి.

తొగరి (కంది)లో చీడల నివారణ

కందిని అదిలాబాద్ పట్టెలో తొగరి అని కూడా అంటారు. ఖరీఫ్లో విత్తిన తొగరి ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఈ సమయంలో కాయలను తినే ఆకు చుట్టు పురుగులు వృద్ధి చెందుతూ పంట నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల లక్షణాలు గుర్తించి ముందుగా తెలుసుకుందాం.

ఆకుచుట్టు పురుగు

తొగరి పెరిగే దశల ఆకుచుట్టు పురుగు ఆశించి ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి పత్రహరితాన్ని గీకి తింటుంది.

శనగ పచ్చ పురుగు

మొగ్గ, పూత, పిందెల గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన లార్వా మొగ్గ, పూత, పిందెలను తింటూ పంట నష్టం కలిగిస్తుంది.

వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు

  • వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలో కోశస్థ దశలు బయటపడతాయి. వాటిని కొంగలు, పక్షులు ఏరుకొని తింటాయి.
  • ఈ పురుగులు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, నువ్వులు, మినుము పంటలతో పంట మార్పిడి చేయాలి.
  • పొలం చుట్టూ 4 సాళ్లు జొన్న పంటను ఎర పంటగా విత్తాలి.
  • పచ్చ పురుగులను తట్టుకునే ఐ.సి.పి. ఎల్-332 ఎల్.ఆర్.జి-41, 30, 38 రకాలు సాగు చేయాలి.
  • విత్తిన 90-100 రోజుల దశలో కొమ్మల కొనలు చిదిమేయాలి.
  • పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరానికి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి,
  • పురుగు గుడ్లను, తొలి దశ పురుగులను గమనించిన వెంటనే 5 శాతం వేప నూనె పిచికారీ చేయాలి.
  • ఎకరానికి 200 లార్వాలకు సమానమైన ఎస్.పి.వి. ద్రావణాన్ని లేదా ఎకరానికి 400 గ్రా. బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి,
  • ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా మొగ్గ తొలి పూత దశలో క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. పూత లేదా కాయ దశలో అసి ఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • ఈ పురుగులను అదుపు చేసేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి.

భారతదేశం అపరాల సాగులో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నప్పటికి దేశంలో అపరాల వినియోగం ఎక్కువ కావడంతో ఇతర దేశాల నుండి అపరాలు దిగుమతి చేసుకోక తప్పడం లేదు. 2015-16లో మన దేశం సుమారు 25,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 58 లక్షల టన్నుల అపరాలు దిగుమతి చేసుకొంది. ఈ విధంగా దిగుమతి చేసుకోబడుతున్న అపరాలలో కంది కూడా ఒకటి. 2015-16లో మన దేశంలో 37.54 లక్షల హెక్టార్లలో సగటున హెక్టారుకు 656 కిలోల చొప్పున 24. 6 లక్షల టన్నుల కంది ఉత్పత్తి అయ్యింది. అదే సంవత్సరంలో 4.63 లక్షల టన్నుల కంది మయన్మార్, టాబ్దానియా తదితర దేశాల నుండి దిగుమతి అయ్యింది. దీనిని బట్టి దేశంలో సంవత్సరానికి 30-35 లక్షల టన్నుల కంది అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. 2015-16లో తెలంగాణలో 2.5 లక్షల హెక్టార్లలో సగటున హెక్టారుకు 419 కిలోల చొప్పున 1 లక్ష టన్నుల కంది ఉత్పత్తి అయ్యింది. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కంది దిగుబడి తక్కువగా ఉండడం ప్రత్యేకించి తెలంగాణలో కంది దిగుబడి దేశ సగటు కన్నా కూడా చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలోను దేశంలోను విస్తృతంగా వినియోగించబడుతున్న కంది విస్తీర్ణం, దిగుబడి పెంచవలసిన అవసరం ఉంది.

కంది బహుళ ప్రయోజనాలు కలిగిన పంట. ప్రథమంగా ఇది కాయ జాతికి చెందిన మొక్కకావడంతో వేరు బుడిపెలలో నత్రజనిని స్థిరీకరించగల సామర్థ్యం కలిగిన పంట. మట్టి నుండి ఇతర పంటలకు లభ్యంకాని భాస్వరం సంగ్రహించే సామర్థ్యం కూడా కందికి ఉంది.

ఈ కారణంగా కందికి నత్రజని, భాస్వరం ఎరువుల ఆవశ్యకత తక్కువ. దీని పటిష్టమైన, లోతైన వేరు వ్యవస్థ భూమి లోతులో నుండి నీటిని, పోషక ధాతువులను గ్రహిస్తుంది. దీని బలమైన వేర్లు భూమిలోని గట్టి పొరలను (హార్డ్ పాన్) చీల్చుకొని లోతుగా చొచ్చుకుపోగలవు. అందుకే కందిని జీవనాగలిగా పరిగణిస్తారు. ఇతర పంటలతో పోలిస్తే కందికి బెట్టను తట్టుకునే శక్తి అధికం. భూమి లోతుకి చొచ్చుకుపోయే వేర్లు సాధారణ పంటలకు లభ్యం కాని నీటిని సైతం సంగ్రహించి బెట్ట పరిస్థితుల్లో మొక్కలను సజీవంగా ఉంచుతాయి. మట్టిలో తేమ బాగా తగ్గినప్పుడు కంది ఆకులను, పూలను రాల్చి సజీవంగా నిలిచి తిరిగి తేమ లభ్యమైనప్పుడు కొత్త ఆకులు, పూవులు తొడగగలదు. మొక్కనుండి రాలిన ఆకులు మట్టిలో కలిసి నేలను సారవంతం చేస్తాయి.

అంతర పంటగా పండించడానికి కంది అత్యంత అనువైన పంట. ప్రారంభ దశలో కంది పెరుగుదల నెమ్మదిగా ఉండడంతో తోటి అంతర పంటకు వెలుతురు, గాలి, నీరు, పోషకాలు లాంటి వనరులకు ఆడి ఎటువంటి పోటీ లేకుండా పెరగడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాక గాలిలోని నత్రజనిని వేర్లలో స్థిరీకరించి అందులో కొంత భాగాన్ని తోటి అంతర పంటలకు సరఫరా చేస్తుంది. అదే విధంగా భూమి లోతు నుండి నీటిని సంగ్రహించి తోటి అంతర పంటకు కూడా తేమను అందించగలదు. లోతుగా, విస్తృతంగా పెరిగే కంది వేర్లు నేలను గుల్లబరచి తోటి అంతర పంటల వేర్లకు సునాయాసంగా పెరగడానికి సహకరిస్తాయి. జొన్న, పత్తి, వేరుశనగ, శనగ, మిరప, నువ్వు, మినుము, పెసర - లాంటి పంటలలో అంతర పంటగా కందిని - సాగుచేసుకోవచ్చు. కందిని అంతర పంటగా వేసుకొన్నప్పుడు కందిని, తోటి అంతర పంటను రెండింటినీ ఆశించే చీడ పీడల ఉధృతి కూడా తక్కువ అవుతుంది. ఇలా అత్యంత సౌలభ్యకరమైన అంతర పంట కావడంతో, కంది విస్తృతంగా అంతర పంటగా - సాగవుతోంది.

కందికి నేలను మలుపరచే పలు లక్షణాలు ఉండడం వలన దీనిని సాగుకు పనికిరాని నేలలను బాగుచేయడానికి ఉపయోగిస్తారు. అదే విధంగా పోలం గట్లను స్థిరపరచడానికి కూడా కందిని గట్లపై పెంచుతారు. బలమైన, లోతైన వేరు వ్యవస్ధ, విస్తృతంగా వ్యాపించి నేలను వర్షపు తాకిడి నుండి రక్షించే కొమ్ములు, అకులు, నీటి ప్రవాహాన్ని నిరోధించగల ధృడమైన కాండం కలిగిన కందిమట్టి కోతను నివారించి నేల, నీరు పరిరక్షణకు తోడ్పడుతుంది.

కంది మొక్కలోని ప్రతి ఒక్క భాగం ఏదో ఒక విధంగా ఉపయోగపడేదే. కంది మొక్కలు నాటి ఉపయోగాలు చూద్దాం.

  • వేర్లు: గాలిలోని నత్రజనిని వేరు బుడిపెలలో స్థిరీకరించి మట్టి సారాన్ని పెంపొందిస్తాయి. సాధారణ పంటలతో పోలిస్తే ఎంతో పెద్దదైన వేరు వ్యవస్థ నేలను బాగు చేయడమే కాక సుట్టిలోని సేంద్రియ కర్బన శాతం పెరగడానికి దోహదం చేస్తుంది. అంతే కాక నేల లోతైన అడుగు పొరల్లో కర్బనాన్ని బంధించడం ద్వారా వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు గాఢత్వం తగ్గించడానికి తోడ్పడుతుంది. నత్రజని శాతం కూడా ఎక్కువ కావడంతో మట్టిలో నత్రజని లభ్యతను పెంచుతుంది.
  • కాండం, పెద్ద కొమ్మలు: వంట చెరకుగా ఉపయోగించబడుతుంది. కంచెగా, ఇంటి కప్పుగా ఉపయోగించబడుతోంది. లక్క పురుగులకు ఆవాసంగా పనిచేసి తద్వారా లక్క తూరీకి ఉపయోగించబడుతోంది (అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాలలో). కర్ర గుజ్జును ప్లయ్ వుడ్, కాగితం తయారీకి కూడా వాడవచ్చు.
  • చిన్న కొమ్మలు, ఆకులు (పచ్చి): మంచి పోషక విలువలున్న పశువుల మేతగా పనికొస్తుంది. 20 శాతం పైగా మాంసకృత్తులు కలిగి ఉండడంతో గడ్డితో కలిసి మేపితే పశువుల్లో పాలు బాగా పడతాయి. రొట్టను సైలేజ్ గా చేసి నిలువ ఉంచి అవసరానికి వాడుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో బహువార్షిక కందిని పూర్తిగా మేత పంటగా సాగుచేస్తారు. కొన్ని ప్రాంతాలలో లేత ఆకులను ఆకు కూరగా వాడతారు. కంది ఆకులకు ఔషధ విలువలు కలవు. ఆకులు, అకులతో చేసిన లేపనాలు దెబ్బలు,  పుండ్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు, అకుల రసం, కషాయం మధుమేహం, డయోరియా, పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి తదితర సమస్యలకు వాడతారు.
  • పువ్వులు: పువ్వులలోని మకరందం కోసం తేనెటీగలు విరివిగా సస్తాయి. తేనె తయారీ యూనిట్లను కంది పొలంలో, పొలం దగ్గరలో పెట్టుకోవచ్చు. కంది పూల నుండి సేకరించిన మకరందంతో తయారైన తేనె తుట్లలో లేత పచ్చ రంగు కనిపిస్తుంది. పప్పుల కషాయాన్ని సుమోనియు, బ్రాంకైటిస్, తదితర ద్వాసకోశ సంబంధిత రోగాల నుండి ఉపశమనం కలిగించడానికి వాడతారు.
  • పచ్చికాయలు: కూరగాయలా పంటలో ఉపయోగించవచ్చు. ఉడకబెట్టి గింజలను తినవచ్చు. కాయలు తొక్కులను పశువులకు మేపవచ్చు.
  • పచ్చి గింజలు: పచ్చి బఠాణి లాగ ప్యాకెట్లలో, డబ్బాలలో నిలువ చేసుకోని వాడుకోవచ్చు. కరేబియన్ దేశాలలో కందిని పచ్చిగింజల కోసమే సాగుచేస్తారు.
  • ఎండు కాయల తొక్కలు, పోట్టు: పశువుల దాణాలో కలిపి వాడుకోవచ్చు. వంట చెరకుగా కూడా వాడుకోవచ్చు.
  • గింజలు: మరపట్టించి కంది పప్పుచేసుకోవడం పంట ప్రధాన ఉపయోగం. పొట్టును పశువుల దాణాలో కలిపి వాడుకోవచ్చు.

కంది పప్పులో పోషక విలువలు విరివిగా ఉన్నాయి. కంది పప్పులోని మాంసకృత్తులు శ్రేష్టమైనవి. అంతే కాక కంది పప్పులో ఎ, సి, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. పప్పులో ఆరోగ్యానికి హాని కలిగించే ఏ రకమైన పదార్థాలు ఉండవు. ఈ కారణాల వలన కంది పప్పు శాకాహార ప్రధానమైన భారత దేశ ప్రజల పోషకాహార భద్రతలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఉడకబెట్టి వండిన కంది పప్పును పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే కొట్టెలు, అన్నం వంటి వాటితో 70:30 నిష్పత్తిలో (70) పాళ్ళు రొట్టెలు లేదా అన్నం 30 పాళ్ళు పప్పు కలిపి తింటే సమతుల్యమైన పోషణ లభిస్తుంది.

కంది పంట దిగుబడి మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు పూర్తిగా వర్షాధార పంటగా సాగు కావడం, సారం తక్కువగా ఉన్న నేలలో సాగు కావడం. అధిక దిగుబడినిచ్చే వంగడాలు లేకపోవడం, కీటకాలు, రోగాల తాకిడి ఇతర కారణాలు. ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన ఉజ్వల - పి.ఆర్.జి-176, హనుమ(టి.డి.ఆర్.జి-4) వంగడాలు, ఇక్రిశాట్ వారు ప్రపంచంలోనే మొదటి సారిగా విడుదల చేసిన నున్నెంకొండ కంది' (ఐ.సి.పి. ఎచ్-2740), ఐ.సి.పి. ఎచ్-2671 తదితర హైబ్రీడ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన 'అమరావతి' (ఎల్.ఆర్.జి-52), ఎల్.ఆర్.జి.-41 రకాలు, భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, ఢిల్లీ వారు ఇటీవల విడుదల చేసిన స్వల్పకాలిక ఒకేసారి పూతకొచ్చే పి.ఎ.డి.టి-16 వంటి వంగడాలతో అధిక దిగుబడినిచ్చే, రోగాలను తట్టుకునే వంగడాల లేమి కొంత వరకు అధిగమించినట్లుగా భావించవచ్చు. ఐతే కీటకాల తాకిడి సమర్థంగా తట్టుకునే వంగడాలు ప్రస్తుతం లేవనే చెప్పాలి. ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఆహార పంటలలో జన్యు మార్పిడి వంగడాల అభివృద్ధిపై ఉన్న నిషేధం కారణంగా ఈ సమస్యకి పూర్తిస్థాయి పరిష్కారం ఇంకా దొరకలేదు. ఐతే కందిలో పురుగులు, రోగాల యాజమాన్యం కొరకై సమర్థవంతమైన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు పాటించి చీడపీడల వలన కలిగే నష్టాలను చాలా వరకు నివారించవచ్చు.

కంది పంట దాదాపు పూర్తిగా వర్షాధార పంటగా సాగుచేయబడుతున్నా నీటి వసతి కనుక కలిపించినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. బిందు సేద్యం వంటి నీటి యాజమాన్య పద్ధతులతో హెక్టారుకు 3 టన్నులకు మించి దిగుబడి సాధ్యమని పరిశోధనలు తెలుపుతున్నాయి. వర్షాధార ప్రాంతాలలో తీవ్రమైన బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు, అలాగే కీలకమైన పూత - పిందె దశలో కొద్దిపాటి నీరు అందించగలిగితే దిగుబడిని  గణనీయంగా పెంచుకోవచ్చు.

నీరు మట్టిలోని పోషకాలవంటి సహజ వనరులను ఆతి తక్కువ మోతాదులో గ్రహించి గరిష్టంగా రొట్ట, ధాన్యం ఇచ్చే పంటలలో కంది ముందు వరుసలో ఉంటుంది. ఈ కారణంగా ఇది ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేయడానికి అత్యంత అనుకూలమైన పంట. చీడపిడల నివారణకు ప్రత్నామ్నాయ రసాయనికేతర పద్ధతులను సమర్ధవంతంగా పాటిస్తే కంది పంటను ఎటువంటి రసాయన పదార్ధాలు వాడకుండా పండించవచ్చు. అలా పండించిన కందిని 20 శాతం దాకా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ఈ క్రమంలో రసాయనాల వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకుని సజీవంగ ఉంది దిగుబడినివ్వగలిగే పంటల్లో కందిని విశేషంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో రాబోయే వాతావరణ - మార్పుల వలన అధిక ఉష్ణోగ్రతలు, బెట్ట పరిస్థితులు " ఎక్కువ కానున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా - తట్టుకోగల పంట అయిన కందిన భవిష్యత్తు పంటగా, వాతావరణ మార్పులకు సిద్ధవైన పంటగా పరిగణించవచ్చు. ఇటీవల కాలం కొంత ఆటుపోట్లకు గురైనా మొత్తానికి కందులు మార్కెట్లో మంచి ధర - పలుకుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను - ప్రతి సంవత్సరం పెంచుతూ 2017-18 ఆర్థిక - సంపత్సరానికి గాను టన్నుకు రూ. 5450/- కి (రూ. 200/- బోనస్ తో కలిపి)గా నిర్ధారించింది. అంతేకాక జాతీయ ఆహార భద్రతా పథకం (ఎన్.ఎఫ్. ఎస్. ఎం) అపరాల సాగుకై పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది.

సహజ వనరులను పరిరక్షిస్తూ, నేలను సారవంతం చేస్తూ, వాతావరణ మార్పులను తట్టుకుంటూ, బహుళ ప్రయోజనాలు కలిగిన కంది పంటను సుస్థిర వ్యవసాయానికి పునాదిగా పరిగణించవచ్చు. అందుబాటులో ఉన్న సాంకేతిక పద్ధతులు పాటిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో కంది సాగుచేసి, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచగలిగితే రైతులకు ఆదాయం, దేశానికి పోషకాహార భద్రత సమకూరుతుంది.

కంది సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త(అపరాలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోదోన స్థానం, వరంగల్, ఫోన్ నెం. 9704222742, 9849133493

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate