অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మామిడి

మామిడి

 1. నేలలు
 2. రకాలు
 3. మొక్కల వ్యాప్తి లేదా ప్రవర్థనం
 4. మామిడి అంట్ల ఎంపిక
 5. మామిడి కొమ్మంటు (వెనీర్ గ్రాఫ్టింగ్) పద్ధతిలో ప్రమాణాలు:
 6. నేలను తయారు చేయడం
 7. మొక్కలు నాటడానికి అనువైన కాలం
 8. మొక్కలు నాటటం
 9. నాటిన తరువాత తీసుకోవల్సిన జాగ్రత్తలు
 10. ఎరువుల వాడకం
 11. నీటి యాజమాన్యం
 12. అంతరకృషి
 13. అంతర పంటలు
 14. కత్తిరింపులు
 15. మామిడి పూత, కాత
 16. పక్వ దశకు వచ్చిన కాయల లక్షణాలు
 17. పండ్ల నిల్వ
 18. దిగుబడి
 19. సస్యరక్షణ
  1. పురుగులు
  2. తెగుళ్ళు
 20. మామిడిలో సమగ్ర సస్యరక్షణ
 21. మామిడి కాయలను మగ్గ వేసే పద్ధతులు
  1. సాంప్రదాయ పద్ధతులు
  2. ప్రస్తుత పద్ధతులు
  3. కాల్షియం కార్బైడ్ తో మామిడి కాయలను మగ్గవేయటం
  4. ఇథిలీన్ వాయువుతో పండ్లను మాగబెట్టే పద్ధతి - వివరణ

మామిడి సాగులో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. మామిడి పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇది మన జాతీయ ఫలం. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, అదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మామిడిలో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. మామిడి పండ్లు కాయలుగా ఉన్నప్పుడు పచ్చళ్ళ తయారీకి వాడుతారు. పండిన పిదప పండ్లుగా వాడుతారు. మామిడి పండ్ల నుండి రసం తీసి నిల్వ చేయవచ్చును.

నేలలు

అన్ని నేలలు అనుకూలం. కాని లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్లు బాగా అభివృద్ధి చెంది చాలా కాలం ఫలిస్తాయి. నీరు నిల్వ ఉండే బరువైన నల్లరేగడి నేలలు, చౌడు భూములు అనుకూలమైనవి కావు. ఉదజని సూచిక 7.5-8.0 ఉన్న నేలలు అనుకూలం.

రకాలు

మామిడిలో రకాలను వాటి ఉపయోగా ఉపయోగానుసారంగా వర్గీకరించి సాగు చేస్తారు.

 • కోత రకాలు : బంగినపల్లి, తోతాపురి, దశేరి, కేసర్, హిమాయత్, సువర్ణరేఖ.
 • రసం రకాలు : చిన్నరసం, పెద్ద రసం, చెఱకు రసం, నవనీతం.
 • పచ్చడి రకాలు : జలాల్, హైదర్ సాహెబ్, ఆమిని, తెల్లగులాబి.
 • పునాసా రకాలు : చిరుత పుడిగోవా (రాయల్ స్పెషల్), బొబ్బిలి పునాసా, బారామసి.

మొక్కల వ్యాప్తి లేదా ప్రవర్థనం

మామిడిలో పరపరాగ సంపర్కము జరుగుట వలన విత్తనం లేదా టెంకె ద్వారా వచ్చిన మొక్కలు అన్ని ఒకే రకంగా ఉండవు కావున కావల్సిన రకం మొక్కలను, అంటు కట్టడం ద్వారా వ్యాప్తి చేసుకోవచ్చును. తెలంగాణా రాష్ట్రంలో మామిడి మొక్కలు ప్రవర్థనం వెనీర్ గ్రాఫ్టింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఈ పద్ధతి అత్యంత అనుకూలమైన, వీలైన మరియు సులువైన పద్ధతి. ఈ పద్ధతిలో మొదటిగా పండ్ల నుండి తీసిన టెంకెలను వెంటనే నారుమడులలో నాటాలి. లేదంటే రొజులు గడిచిన కొద్ది, టెంకెలలో మొలక శాతం తగ్గుతుంది. టెంకెలను నారుమడులలో 40 X 25 సెం.మీ. దూరంలో నాటాలి. మొక్కలు శాఖీయంగా బాగా పెరిగి కాండం సుమారు పెన్సిల్ మందం వచ్చిన తరువాత అంటుకట్టడానికి ఉపయోగించాలి. కావల్సిన రకం నుండి పెన్సిల్ మందం కలిగిన సయాన్ కొమ్మను ఎంచుకోవాలి. సయాన్ కొమ్మను తల్లి చెట్టు నుండి వేరు చేయుటకు 10-15 రోజులు ముందుగా ఆకులను ఆకలను తొలిగించినచో, అంటు కట్టిన తరువాత త్వరగా మొగ్గ తొడుగుతుంది. తరువాత సయాన్ కొమ్మను నారు మొక్క మీద అంటుకట్టాలి. అంటుకట్టిన 3-4 నెలలు తరువాత అంటు బాగా అతుక్కొని పెరుగుతుంది.

మామిడి అంట్ల ఎంపిక

చీడపీడలు ఆశించిన వెనీర్ గ్రాఫ్టింగ్ అంట్లు మాత్రమే నాటుకోవాలి. వేరు మూలం మరియు సయాన్ భాగం బాగా అతికి ఉంచాలి. వేరు మూలంపై కొత్త చిగుర్లు లేకుండా ఉండాలి. అంట్లు ఒకటి నుండి ఎనిమిది నెలల నుండి ఒక సంవత్సరం వయస్సు కలిగి ఉండాలి.

మామిడి కొమ్మంటు (వెనీర్ గ్రాఫ్టింగ్) పద్ధతిలో ప్రమాణాలు:

యోగ్యత లేదా స్వభావము ప్రమాణాలు
వేరు మూలము బలమైన నిట్టనిలువుగా ఉన్న మొక్క
పాలిధీన్ సంచి పరిమాణము (9” x 6”) / (10” x 8”)
వేరు మూలము వయస్సు ఒక సంవత్సరం లోపు
వేరు మూలము మందము 0.5 – 0.7 సెం.మీ.
సయాను కొమ్మ వయస్సు 3 నుడి 4 నెలలు
సయాను కొమ్మ పరిమాణము 0.5 – 0.7 సెం.మీ. మందము
సయాను కొమ్మ పొడవు 15 నుండి 18 సెం.మీ.
నాటుకొనుటకు అనువైన మొక్క వయస్సు 8 నుండి 12 నెలలు

నేలను తయారు చేయడం

వడగాల్పులు, పెనుగాలులు వీచే ప్రాంతాలలో సరుగుడు, యూక్లిప్టస్ మరియు ఎర్రచందనం మొదలైనవి గాలులు వీచే దిశలో రెండు వరుసల్లో, రెండు మీటర్ల దూరంలో నాటాలి.

నేలను 2 లేక 3 సార్లు బాగా దున్ని, చదును చేసి 1 x 1 x 1 మీటర్ల గుంతలు త్రవ్వాలి. ఈ గుంతలను 50 కిలోలు పశువుల ఎరువు, 2 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు చెదలు రాకుండటకు గాను 2 కిలోలు వేపపిండి కలిపి నింపుకోవాలి. గుంతలను 5-7 మీ. దూరాన తీయాలి.

మొక్కలు నాటడానికి అనువైన కాలం

మామిడి మొకలను జూన్ నుండి డిసెంబర్ వరకు నాటుకోవచ్చును. తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో జూన్-జూలై లోను, ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో అక్టోబర్-నవంబర్ మాసాలలో నాటుకోవాలి.

మొక్కలు నాటటం

అంటు మొక్కను, మట్టితో సహ తీసి, వేర్లు కదలకుండా, గుంత మధ్యలో నాటి, మట్టితో గట్టిగా నొక్కి, గాలికి పడిపోకుండా చిన్న కర్ర పాతి కదలకుండా కట్టాలి. నాటిన వెంటనే 1.5 అడుగుల వెడల్పు పాదులు చేసి నీరు ఇవ్వాలి. అంట్లు నాటేటప్పుడు, అంటు కట్టిన భాగం భూమిపై నుండి 10 సెం.మీ ఉండాలి.

నాటిన తరువాత తీసుకోవల్సిన జాగ్రత్తలు

నేల రకాన్ని బట్టి క్రమ పద్దతిలో మొక్క చుట్టూ పాదులు చేసుకొని నీరు ఇవ్వాలి. అంటుభాగం క్రింద అనగా వేరు మూలంపై చిగుర్లు వస్తే వాటిని తొలిగించాలి. అంట్లు కుదురుకోని చోట మరల అంట్లు నాటుకోవాలి. అంట్లు సుమారు 1 మీ. ఎత్తు పెరిగినప్పుడు కొనను గిల్లివేస్తే మొక్క శాఖీయంగా బాగా పెరుగుతుంది. అంటు కట్టిన మొక్కలు ఒక సంవత్సరం తరువాత పుష్పించడం ప్రారంభిస్తాయి. వీటిని కాపు కాయనిస్తే మొక్క పెరుగుదల దెబ్బతింటుంది. కనుక మొదటి 3-4 సంవత్సరాల వరకు పువ్వులను త్రుంచి వేయాలి. ప్రధాన కాండం మీద 50 సెం.మీ. ఎత్తు వరకు ప్రక్క కొమ్మలు పెరగకుండా చూసుకోవాలి. ఇది చెట్టు సరియైన ఆకారం రూపొందటానికి దోహదపడుతుంది.

ఎరువుల వాడకం

మామిడి చాలా లోతైన వేరు వ్యవస్థ కలిగిన చెట్టు అందువలన భూమి లోపలి పొరల నుండి పోషకాలను, నీటిని గ్రహించి మనగలదు. కానీ ప్రతి ఏడాది నిలకడగా, మంచి నాణ్యత కలిగిన కాపు నివ్వటానికి, కాయల ద్వారా పొగెట్టుకున్న పోషకాలను తిరిగి పొందడానికి, వాణిజ్య సరళిలో సాగు చేయుటకు ప్రతి సంవత్సరం ఎరువులను వేయటం తప్పనిసరి. చెట్ల వయస్సును బట్టి ఎరువులు వేయటం జరుగుతుంది. భూసార పరీక్ష, పత్ర విశ్లేషణను అనుసరించి ఎరువుల వాడకం మంచిది. రసాయనిక ఎరువుల కంటే, సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడాలి. అందువలన నేల భైతిక లక్షణాలు, నీటిని నిల్వ ఉంచే శక్తి, సేంద్రీయ పదార్దం, సూక్ష్మజీవుల చైతన్యం పెరుగుతాయి. ముఖ్యంగా కాయల నాణ్యత పెరుగుతుంది. సేంద్రీయ ఎరువులను ఒకే దఫాగా మొత్తం కాయ కోత మరియు కత్తిరింపుల తరువాత జూలై/ఆగష్ట్ మాసాల్లో వేయాలి. రసాయనిక ఎరువులను 2 లేదా 3 దఫాలుగా వేయాలి. నీటి పారుదల కింద సాగు అయ్యే తోటలకు నీటి లభ్యతను బట్టి 2 లేదా 3 దఫాలుగా ఎరువులు వేయాలి. మొదటిసారి జులై/ఆగష్ట్ మాసాల్లో సేంద్రీయ ఎరువులతో పాటు సగం నత్రజని, భాస్వరం మరియు పోటాష్ పూర్తి మొతాదులో వేయాలి. రెండో దఫా సెప్టెంబర్/అక్టోబర్ మాసాల్లో వర్షాన్ని బట్టి మిగిలిన సగ భాగం నత్రజనిని వేయాలి. మూడు దఫాలుగా ఎరువులు వేయాల్సి వచ్చినప్పుడు నత్రజని మోతాదును 3 భాగాలుగా, పోటాష్ ను రెండు భాగాలు వేయాలి. చివరి దఫా నత్రజని, పొటాష్ ఎరువులను మామిడి కాయలు గోళీ సైజులో ఉన్నప్పుడు వేసుకోవాలి.

ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఒక్కొక్క చెట్టుకు 100 గ్రా. నత్రజని, 100 గ్రా. భాస్వరం, 100 గ్రా. పొటాష్ ఇచ్చే ఎరువుల మోతాదును 100 గ్రా. చొప్పున పెంచుకుంటూ 10వ సంవత్సరానికి కిలో నత్రజని, కిలో భాస్వరం, కిలో ఫొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి.

ఎరువులను చెట్టు చుట్టూ 100-150 సెం.మీ. దూరంలో, 10-15 సెం.మీ. వెడల్పు, లోతుగా గాడి చేసి పీచు వేర్లకు దగ్గరగా వేయాలి.

మామిడి చెట్లు పెరుగుదల, పూత, కాత ముఖ్యంగా రాయల నాణ్యత మెరుగుగా ఉండటానికి స్థూల పోషకాలతో పాటు, సూక్ష్మపోషకాలు (జింకు, బోరాన్, మాంగనీస్, ఇనుము వగైరా) కూడా సిఫారసు చేయబడుతున్నాయి. సూక్ష్మపోషకాలను ముఖ్యంగా ద్రవ రూపంలో ఈ క్రింది విధంగా పిచికారి చేసుకోవాలి.

 • జింక్ సల్ఫేట్ (5 గ్రా. లీటరు నీటికి), ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో.
 • బోరాక్స్ (2 గ్రా. లీటరు నీటికి) పిందెలు ఏర్పడిన తరువాత నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు.
 • మాంగనీస్ సల్ఫేట్ (3 గ్రా. లీటరు నీటికి) పూత తరువాత ఒకసారి.
 • మెగ్నీషియం సల్ఫేట్ (3 గ్రా. లీటరి నీటికి) ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో.
 • ఫెర్రస్ సల్ఫేట్ (2.5 గ్రా. లీటరు నీటికి) ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో.

మామిడి కాయల కోత తరువాత నీటి తడులు ఇచ్చి 0.5 శాతం జింక్ సల్ఫేట్ (5 గ్రా. లీటరు నీటికి) + 1 శాతం యూరియా (10 గ్రా. లీటరు నీటికి) కలిపి పిచికారి చేయటం వలన క్రొత్త చిగుర్లు రావడానికి దోహదపడుతాయి.

నీటి యాజమాన్యం

మామిడి తోట మొదటి దశలో అనగా కాపు చిన్న చెట్లను 1 నుండి 2 సం.లు వయస్సు వచ్చే వరకు సక్రమంగా నీరు పెట్టి సంరక్షించుకోవాలి. డ్రిప్ పద్దతిలో మామిడి చెట్లకు నాటిన రెండేళ్ళ వరకు 9 నుండి 12 లీటర్ల నీటిని రోజుకు ప్రతి మొక్కకి ఇవ్వాలి. పది సంవత్సరాల వయస్సు పైబడిన పెద్ద చెట్లకు రోజుకు 50-80 లీటర్ల నీటిని వాతావరణానికి అనుగుణంగా ఇవ్వాలి. ఈ వయస్సు చెట్లకు నాలుగు డ్రిప్పర్లు ఉంటే మంచిది. పిందె కాయ దశలో 80 లీటర్ల నీటిని డ్రిప్ ద్వారా రోజు ఇవ్వాలి.

 • మామిడి తోటల్లో పూత బాగా రావాలంటే 3 నెలలు బెట్ట అవసరం (అక్టోబర్-డిసెంబర్ వరకు).
 • డిసెంబర్ రెండవ పక్షంలో పువ్వు మొగ్గ దశలో ఒకసారి తేలికపాటి నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి.
 • పిందె ఏర్పడిన తరువాత ప్రతి 20-25 రోజులకొకసారి కాయలు బఠాణి గింజ లేదా గచ్చకాయ సైజులో ఉన్నప్పుడు పెట్టవలెను.
 • కాయ కోతకు 20-25 రోజులకు ముందు నీరు పెట్టడం ఆరు వెయాలి.కాయ కోతకు 20-25 రోజులకు ముందు నీరు పెట్టడం ఆరు వెయాలి.
 • కాయలు కోసిన తరువాత ఒకసారి నీరు పెట్టవచ్చు. దీని వలన కొత్త చిగుర్లు వస్తాయి.
పోషక ధాతు లోపం లక్షణాలు నివారణ చర్యలు
పొటాషియం ఆకుల అంచులు మాడిపోవడం పొటాషియం ధాతు లోపం ముఖ్య లక్షణం. ఆకు అంచు మాడటం ఆకుకొన నుండి ఆరంభమై క్రిందికి వ్యాపిస్తుంది. కాయ నాణ్యత తగ్గుతుంది. ఈ ధాతు లోపం వలన చెట్లు చూడపీడలకు సులువుగా లోనవుతాయి. ప్రతియేటా చెట్టుకు 1 కిలో మ్యూరేట్ ఆఫ్ సల్ఫేట్ (లేదా) మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను జులై, ఆగష్ట్ మాసాల్లో, చెట్టు క్రింద రాలిన ఆకులను, చెట్టు పాదులోని భూమిలోనే పడేలా కలియదున్నటం లేదా కలియ తిప్పడం చేయటం మంచిది. దీని ద్వారా పోషకాలన్ని చెట్టుకు లభ్యమవుతాయి.
జింకు ఆకులు చిన్నవై, అంచులు లోపలికి లేదా క్రిందకు ముడుచుకొని పోయి వుంటాయి. ఈనెల మధ్య భాగం పాలిపోయి, ఈనె పచ్చగా వుంటుంది. ఈ లోపం వలన మొక్కలు సరిగా ఎదగవు, కాపు, కాయ సైజు, నాణ్యత తగ్గుతుంది. చిన్న చెట్లలో లోపం తీవ్రంగా వుంటే చనిపోతాయి. చౌడు, ఉప్పు నేలల్లో జింకు ధాతు లోపం ఎక్కువగా ఉంటుంది. ఈ ధాతు లోప నివారణకు 5 గ్రా. జింకు సల్ఫేట్ మరియు 10 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి సనరించవచ్చు.
ఇనుము ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి తెల్లగా మారుతాయి. దీన్ని బ్లీచింగ్ అని అంటారు. ఆకుల సైజు తగ్గుతుంది. లోప తీవ్రత ఎక్కువైతే కొనలు నుండి ఆకులు ఎండుకుంటూ వస్తాయి. సున్నం శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో పెంచిన తోటల్లో ఈ పోషక లోపం ఎక్కువగా ఉంటుంది. అఁదుకే దీనిని సున్నం ప్రేరేపించిన ఇనుము లోపం అంటారు. ప్రతి లీటరు నీటికి 2.5 – 5.0 గ్రా. ఫెరస్ సల్ఫేట్ మరియు 1 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి 15 రోజుల వ్యవధిలో పెండు సార్లు చెట్టు మొత్తం తడిసేలా పిచికారి చేయాలి.
బోరాన్ కాయ పగలటము బోరాన్ ధాతు లోప ముఖ్య లక్షణం. ఆకుల ఈదెలు మందమెక్కడం, ఆకులు జీవము కోల్పోయి నట్లుండడం కూడ గమనించవచ్చు. పండు లోపల కండలో గోధుమ వర్ణపు ప్రాంతాన్ని గమనించవచ్చును. ధీని నివారణకుఝులై-ఆగష్ట్ నెలల్లో ఎరువులు వేయనప్పుడు సిఫార్సు చేసిన ఎరువులతో పాటుగా ఒక్కొక్క చెట్టుకు 50 గ్రా. బోరాక్స్ లేదా బోరిక్ ఆసిడ్ రసాయనం వేయాలి. ప్రత్యుమ్నాయంగా, ప్రతి లీటరు నీటికి 2 గ్రా. బోరాక్స్ లేదా బోరిక్ ఆసిడ్ ను కలిపి చెట్టు మొత్తం మీద పిచికారి చేసి బోరాన్ లోపాన్ని సవరించవచ్చును.
లవణాల దెబ్బ నేలలో లేదా పారించే నీటిలో లవణాలు ఎక్కువగా ఉన్న యడల ఆకులు మాడిపోవడం సంభవిస్తుంది. అంతేకాక ఆకులు వాటి ప్రకృతి సిద్ధమైన రంగును కోల్పోయి కంచు రంగుకు మారుతాయి. ఒక్కొక్కప్పుడు ఆకుల చివర్లు ఎండిపోతాయి. చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో వర్షాకాలం ఆరంభంలో జూలుగా చల్లి అది పూతకు రాగానే నేలలో కలియదున్నాలి. పశువుల ఎరువు లేదా కంపోస్టును ప్రతి సంవత్సరం వాడుతూ ఉండాలి. సాగు నీటిలో చవిటి లక్షణాలు ఉంటే, ఒకే జనవనార మూటలో జిప్సమ్ నింపి పెట్టాలి. అధిక లవణాలు కలిగియున్న నీటిని సాగుకు ఉపయోగించరాదు.

మామిడి పంటకు వయస్సును బట్టి క్రీంది విధంగా ద్రిప్పర్లు అమర్చవలసి ఉంటుంది.

సిఫారసు చేసిన నీటి పరిమాణము ప్రతి చెట్టుకి ప్రతి రోజు

చెట్టు వయస్సు

నీతిపరిమాణం (మొక్కకు)

డ్రిప్పర్ సంఖ్య / సాధనం

2  సంవత్సరాలు

5  లీ

1 డ్రిప్పర్ కాండానికి 15 సెం. మీ దూరంలో

2-4  సంవత్సరాలు

25  లీ

2   డ్రిప్పర్లు కాండానికి 45  సెం. మీ దూరంలో

5-10  సంవత్సరాలు

90  లీ

4   డ్రిప్పర్లు కాండానికి 45-60  సెం. మీ దూరంలో

10  సంవత్సరాలుపైన

120  లీ

6   డ్రిప్పర్లు కాండానికి 1 సెం. మీ దూరంలో

 

అంతరకృషి

మామిడి తోటల యాజమాన్యంలో అంతరకృషి చాలా ముఖ్యమైనది. తోటలో ఎప్పుడు కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. ఏడాదిలో కనీసం రెండుసార్లు పొలాన్ని దున్నుకోవాలి. మొదటిసారి తొలకరి వర్షాలు పడగానే, నేలలో పదును చూసుకొని వరుసల మధ్య దున్నాలి. ఇందువలన కలుపు నివారణ, నేలలౌని పురుగుల గుడ్లు, నిద్రావస్థలో ఉన్న పురగులు, హాని చేసే శీలింధ్రాలు బహిర్గతమై నశిస్తాయి. భూమి గుల్లబారటం వలన నీరు ఎక్కువగా ఇంకుతుంది. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడ్డాయి. రెండోసారి వర్షాకాలం చివరిలో (సెప్టెంబర్) పొలాన్ని దున్నుకోవాలి.

పచ్చిరొట్ట ఎరువులు (పిల్లిపెసర మరియు జనుము ఎకరానికి 15 నుండి 20 కిలోలు చొప్పున) జులై మాసంలో విత్తుకోవాలి. వీటిని నాటిన 45 రోజులకు పూతకు రాక ముందే భూమిలో కలియదున్నాలి. ఈ అంతరకృషి వలన తోటలో గడ్డి/గరిక పెరగదు. దీని వలన నీటిని నిల్వ చేసుకొనే గుణం పెరగడం ద్వారా అతి వేడి సమయంలో అంటే ఎండాకాలంలో కూడా చెట్లు చనిపోకుండా ఉంటాయి. రసాయన పద్దతిలో కలుపు నివారణకు, భూమిలో తేమ ఉన్నప్పుడు లీటరు నీటికి 10 మి.లీ. గ్లైఫోసేట్ + 10 గ్రా. అమ్మోనియం సల్ఫేట్ లేదా యూరియా కలిపి నాజిల్ కు డోమ్ లేదా గరాటు వంటిది పెట్టి మామిడి మొక్కల మీద పడకుండా పిచికారి చేయాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే లీటరు నీటికి 1 మి.లీ. ఆక్సీఫ్లోరోఫఫెన్ 23.5% ద్రావకం పిచికారి చేస్తే కలుపు మొలవకుండా నివారించవచ్చు.

అంతర పంటలు

మామిడి చెట్లు అధికంగా ఆర్థికంగా దిగుబడి ఇవ్వటానికి 5-6 సంవత్సరములు పడుతుంది. కావున ఈ మధ్య కాలంలో తక్కువ కాల పరిమితి గల అంతరపంటలు వేసుకోవచ్చును. పొడవుగా మరీ ఎక్కువ శాఖీయ పెరుగుదల కలిగిన మొక్కలను వేసుకోరాదు. అంతరపంటలు పోషకాలను, తేమను ఎక్కువగా తీసుకొనేవిగా ఉండరాదు. పెరుగుతున్న మామిడి చెట్ల కాండం నుండి 120 సెం.మీ. వ్యాసార్ధం వదిలిపెట్టాలి. లేత తోటల్లో కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే ఫాల్సా, సీతాఫలం, బొప్పాయి లాంటి పండ్లను అంతర పంటగా సాగు చేసుకోవచ్చును. అంటు మొక్కులు పెరిగే వరకు కూరగాయలు, పెసలు, ఆలసందలు వంటివి వేసుకోవచ్చును. పెద్ద తోటల్లో నీడలో పెరిగే అల్లం, పసుపు పైర్లను వేసుకోవచ్చును. నేలను త్వరగా నిస్సారం చేసే మొక్కజొన్న, చెఱుకు, పిండి పురుగు ఎక్కువగా ఆశించే కందిని, జింకు మరియు పొటాష్ లోపాలు పెంచే నేపియర్ గడ్డిని అంతరపంటగా వేయరాదు.

కత్తిరింపులు

ప్రధాన కాండం మీద భూమి నుండి, 50-75 సెం.మీ. వరకు ఎటువంటి కొమ్మలను ఉంచరాదు. ప్రధాన కాండం మీద 2 లేదా 3 బలమైన కొమ్మలను ఎంచుకొని మిగిలిన వాటిని తొలిగించాలి. ప్రక్క కొమ్మల పొడువు 60-80 సెం.మీ. ఉండేలా కత్తిరించుకోవాలి. ఈ విధంగా నిర్థాతించిన ఆకారం వచ్చే వరకు చేయాలి.

పెద్ద చెట్లలో కాయల కోత తరువాత 20-25 రోజులు చెట్లకు విశ్రాంతినివ్వాలి. ఆ తరువాత కొమ్మల కత్తిరింపు చేయాలి. ఈ లోగా తోటలో చెట్ల కింద రాలిన కాయలను, ఎండిన కొమ్మలను, ఆకులను ఏరి తోటలకు దూరంగా కాల్చేయాలి. ఇలా చేయడం వలన కాయల్లోనూ, కొమ్మల్లోనూ, ఆకుల్లోనూ గల పురుగుల వివిధ దశలు. తెగుళ్ళు నశించి తరువాత కాలంలో చెట్లను, కాయలను ఆశించే అవకాశం లేకుండా పోతుంది.

చెట్లపై ఎండిన కొమ్మలను, తెగుళ్ళు, పురుగులు ఆశించిన కొమ్మలు, కాయ కాడలను, లోపల అడ్డదిఢ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించి తీసివేయాలి. లోపలికి వెలుతురు, గాలి ప్రసరించడానికి అడ్డుగా ఉన్న గొడుగు కొమ్మలను తొలిగించాలి. దీని వలన సూర్యపశ్మి, గాలి చెట్ల లోపలికి బాగా ప్రసరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాయ వదిలేసిన తొడిమెలను 10-15 సెం.మీ వెనుకకు కత్తిరించాలి. కత్తిరింపులు చేసిన తరువాత ప్రతి ఒక్క రెమ్మ చివరి నుండి 3-5 చిగుర్లు వస్తే రెండిటిని నిలుపుకొని మిగితా వాటిని తీసివేయాలి.

చెట్ల నుండి క్రిందకు వ్రేలాడుతున్న కొమ్మలను భూమి నుండి 75-100 సెం.మీ. ఎత్తు వరకు తొలిగించాలి. అందువలన కింద నుండి కూడ చెట్ల లోపలికి గాలి ప్రసరిస్తుంది. కత్తిరింపులు తరువాత సిఫారసు మేరకు ఎరువులు. నీటి తడులు ఇవ్వాలి.

ఈ కత్తిరింపులు జూన్ నుండి ఆగష్టు మాసాల్లో పూర్తి చేయాలి. ఆలస్యం చేయడం వలన ఈ కత్తిరింపుల ప్రభావం పూత రావడంపై ప్రతికూలంగా ఉంటుంది.

మామిడి పూత, కాత

మామిడిలో పూత సాధారణంగా డిసెంబర్ నెల ఆఖరి వారంలో వస్తుంది. డిసెంబర్ నెల ఆఖరున పూమొగ్గలు బయటకి వచ్చి, పూత అంతా కూడ రావటానికి జనవరి నెల ఆఖరి వరకు సమయం పడుతుంది. మామిడిలో పూత వయస్సు సమయం ఒక నెల కాలం పడుతుంది (డిసెంబర్ నెల ఆఖరి నుండి జనవరి నెల ఆఖరి వరకు), ఒక పూకొమ్మలో సుమారు 2 నుండి 3 వేల పుష్పాలు ఉంటాయి. ఈ పద్దతిలో 99 శాతం మగ పుష్పాలు ఉంటాయి. ఒక పూరెమ్మకు 5 నుండి 6 పిందెలు కడతాయి. ఈ 5 నుండి 6 పిందెలలో చివరికి ఒకటి నుండి పెండు పిందెలు మాత్రమే ఎదిగి కాయలుగా మారుతాయి. కావున పిందె దశలో ఎక్కువ పిందెలు రాలకుండా తగు జాగ్రత్తలు వహించాలి.

 • మామిడిలో పూత రాలటం సహజం. మగ పుష్పాలు, ఫలదీకరణ చెందని పుష్పాలు రాలిపోతాయి.
 • అధిక ఇష్ణోగ్రత, బూడిద తెగుళ్ళు, తేనేమంచు పురుగు, నీటి ఎద్దడి, అధిక తేమ, హార్మోన్ల లోపం వలన పిందె, కాయ రాలిపోతాయి.
 • చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
 • మామిడి పిందెలు బఠాణి మరియు నిమ్మ కాయ సైజుల మధ్య ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి.(25-30 రోజులకొకసారి).
 • 1 శాతం యూరియాను (10 గ్రా. యూరియా లీటరు నీటిలో కలిపి) నిమ్మ కాయ సైజులో ఒకసారి, 20 రోజుల తరువాత రెండవ సారి పిచికారి చేసి పిందె రాలటాన్ని నివారించుకోవచ్చును (లేదా) పొటాషియం నైట్రేట్ (13-0-45) 10 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • పిందె రాలటం తగ్గించడానికి 20 పి.పి.ఎమ్ నాఫ్తలిన్ ఎసిటిక్ ఆసిడ్ (20 మి.గ్రా. లీటరు నీటికి) లేదా 10 పి.పి.ఎమ్ 2,4-డి (10 మి.గ్రా. లీటరు నీటికి) పిచికారి చేయవలెను.

పక్వ దశకు వచ్చిన కాయల లక్షణాలు

 • కాయల భూజాలు పెరిగి తొడిమ దగ్గర గుంట ఏర్పడి ఉంటుంది.
 • కాయలు గాఢమైన ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చ రంగులోకి మారుతూ ఉంటాయి.
 • కొన్ని రకాల్లో కాయలపై తెల్లని పొడి ఏర్పడి ఉంటుంది. మరికొన్ని రకాల్లో కాయలపై తెల్లని, పలుచని మైనపు పొర ఏర్పడి ఉంటుంది.
 • రంగు కాయలైన ఆల్ఫాన్సో, సువర్ణరేఖ, కలెక్టరు కాయల భుజాలపై ఎరువు రంగు సంతరించి ఉండాలి.
 • కాయల స్పెసిఫిక్ గ్రావిటీ 1 కంటే ఎక్కువగా ఉండాలి, అనగా కాయలు నీటిలో మునగాలి.
 • కాయల తొక్క మీద స్వేద గ్రంధులు ప్రస్ఫుటంగా కనిపించాలి. బంగినపల్లి కాయల మీద తెల్లని చుక్కలు కనిపించాలి.
 • కాయల్లోని కండ ఆకుపచ్చ తెలుపు నుండి లేత పసుపుపచ్చ రంగులోకి మారి ఉండాలి.

పై లక్షణాలతో పాటు పిందె దశ నుండి రోజులు లెక్కించి, చక్కెర శాతాన్ని బట్టి వివిధ మార్కెట్లకు కావలిసిన పక్వతకు గుర్తించి బంగినపల్లి కాయలను కోయాలి.

పండ్ల నిల్వ

మాములు పరిస్థితులలో, మామిడి పండ్ల నిల్వ కాలం చాలా తక్కువ. వీటిని 12-13o సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత, 90-95% సాపేక్ష ఆర్ర్దత (R.H) వద్ద 4 వారాల వరకు నిల్వ ఉంచుకోవచ్చు.

దిగుబడి

8-10 టన్నులు/హెక్టారుకు – రకాలు

15-25 టన్నులు/హెక్టారుకు – హైబ్రిడ్స్

సస్యరక్షణ

పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రీంది సస్యరక్షణ చర్యలు మరియు సూచించడమైనది.

పురుగులు

తామర పురుగులు: ఇవి 2 మి.మీ. పొడవుండి, కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి గోకి రసాన్ని పీల్చివేస్తాయి. దీని వలన చిగురు ఆకులు చిన్నవిగా ఉండి ఆ తరువాత రాలిపోతాయి. ఈ తామర పురుగులు పుష్పగుచ్చములపై పిందెలపై చర్మం గీకి రసం పీల్చడం వలన వక్క రంగులో చర్మం బీటలు వారి రాతి మంగు ఏర్పడి, కాయ నాణ్యత పడిపోతుంది.

తేనెమంచు పురుగు: తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పుష్పగుచ్ఛాలు, పూలు మరియు పిందెల నుండి రసాన్ని పీలుస్తాయి. దీని వలన పూత, పిందె వాడి రాలిపోతాయి. అంతే కాకుండా ఈ పురుగులు విసర్జించిన తేనె లాంటి తియ్యని పదార్థంపై మసి కారణమైన శీలింధ్రాలు పెరుగుతాయి. దీని వలన ఆకులపై, పూత మరియు కాయలపై నల్లని మసి మంగు ఏర్పడుతుంది. జనవరి నుండి మార్చి వరకు ఇవి లేత ఆకులపై, పూరెమ్మలపై 4 నుండి 5 జీవిత చక్రములను పూర్తి చేసుకుంటాయి. ఈ పురుగులు కాయ లేని సమయంలో చెట్ల కాండం మరియు కొమ్మల బెరడులోని పగుళ్ళలో దాక్కొని ఉంటాయి. తోటలలో కలుపు ఎక్కువగాను, వాతావరణఁ మబ్బుగా ఉండి, గాలిలో తేమ శాతం ఎక్కువగాను, ఉష్ణోగ్రత తక్కువగాను ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగుల వలన 20 నుండి 100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది.

పిండినల్లి: భూమిలో పొదగబడిన గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు చెట్ల పైకి ప్రాకి లేదా చీమల ద్వారా లేత కాయలపై చేరుతాయి. ఈ పురుగులు లేత రెమ్మలు, కాయలు, తొడిమెలపై గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఇవి విసర్జించిన తియ్యని పదార్థంపై నల్లని మసి రంగు ఏర్పడటానికి కారణమైన శీలింధ్రాలు పెరుగుతాయి. వీటి తీవ్రత ఫిబ్రవరి, మార్చి నెలల్లో అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఆశించినచో కాయలు సరిగ్గా ఎదగక రాలిపోతాయి.

పొలుసు పురుగు: ఇవి ముదురు ఆకులను మరియు వక్వదశలో ఉన్న కాయలను ఆశించి రసం పీల్చి నష్ట పరుస్తాయి. వీటి తీవ్రత ఏప్రిల్ – మే నెలల్లో అధికంగా ఉండి, కాయలు సరిగ్గా ఎదగక రాలిపోతాయి.

కాయతొలుచు పురుగు: ఈ పురుగు పిందె దశ నుండి కాయ పెరిగే దశ వరకు. కాయను ఆశించి విపరీతంగా నష్టపరుస్తాయి. కాయ కొన భాగంలో రంధ్రం చేసుకొని కాయ లోపలి జీడిలో పెరుగుతాయి. కాయలు రాలిపోతాయి.

నివారణ: రాలిన కాయలను ఏరి తగులబెట్టాలి. క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా డైక్లోరోవాస్ 1.5 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా.+ వేపనూనె (1500 పిపిఎమ్) 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

తెగుళ్ళు

మసి మంగు: ఆకులు, పూత, పిందెలు మరియు కాయల మీద రసం పీల్చే తేనేమందు పురుగు, పిండినల్లి, తామర పురగులు ఆశించిన్నప్పుడు అవి విసర్జించిన లేనె లాంటి జిగురు పదార్ధంపై శీలీంధ్రాలు వరాన్న భక్కులుగా పెరిగి నల్లని మసి తెగులు వస్తుంది. ఆకులపై మసి తెగులు సోకడం వలన, కిరణజన్య సెయోగ క్రియకు అంతరాయం కలిగి, తద్వారా కాయల పరిమాణం తగ్గడమే కాకుండా, కాయలు రాలిపోతాయి. కాయలు పెరిగే దశలో వచ్చే అకాల వర్షాల వలన, అధికమైన మంచు వలన ఆకులపైనున్న మసి తెగులు వర్షపు నీటి ద్వారా కాయలకు పోకి, మసి తెగులు వర్షపు నీటి ద్వారా కాయలకు పోకి, మసి మంగుగా మారితుంది. తెగులు పోకిన కాయలపై నల్లని మచ్చలు ఏర్పడి అవి అన్నకానికి పనికి రాకుండా పోతాయి. ఫిబ్రవరి – మార్చి నెలల్లో వచ్చే అకాల వర్షాల వలన ఆకులపైనున్న జిగరు కారి కాయల మీద పడటమే కాకుండా, కాయ మీద ఉన్న జిగురు బాగా విస్తరించడం వలన మసి తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. కొమ్మలు కత్తిరింపులు చేయకపోవడం వలన, చెట్లు గుబురుగా పెరగడం, అకాల వర్షాలు మరియు అధిక తేమ వంటి అనుకూల వాతావరణ పరిస్థితులు ఈ శీలీంధ్రాల పెరుగుదలకు మరింత దోహదం చేస్తాయి. మసి తెగులు ఆశించిన తరువాత ఏ మందులు పనిచేయవు. కావున మసి మంగుకు పరోక్షంగా కారణమైన తేనె మంచు పురుగు, పిండినల్లి మరియు తామర పురుగులను సకాలంలో నివారించుటకు తగు చర్యలు తీసుకొనవలెను.

మంగు నివారణ

 • నవంబర్: ఆకులపై మసి తెగులు ఉన్న 2 శాతం గంజి ద్రావణం పిచికారి చేయాలి. తేనెమంచు పురుగు, పిండినల్లి, పోలుసు పురుగు అధికంగా ఉన్న తోటలలో కార్బరిల్ 3 గ్రా. లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ + వేపనూనె 2.5 మి.లీ. మరియు కార్బండాజిమ్ 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పాదులు చేసి, చెట్ల మొదలు చుట్టూ పాలిధీన్ పేపర్ అడుగు ఎత్తు వరకు కట్టి దానికి జిగురు పూసిన పిండినల్లి పిల్ల పురుగులు పైకి పాకకుండా ఆపవచ్చును.
 • డిసెంబర్: చెట్టు పూమొగ్గ దశలో ఇమిడాక్లోప్రిడ్ 0.33 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. మరియు శీలింధ్ర నాశనులు అయిన డైఫెన్కొనజోల్ 1 మి.లీ. లేదా థయోఫానేట్ మిధైల్ లేదా కార్బండాజిమ్ 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • జనవరి: పూత దశలో థయోమిథాక్సమ్ 0.33 గ్రా. లేదా డైమిథోయేట్ లేదా మిధైల్ డెమటాన్ 2 మి.లీ. మరియు నీటిలో కరిగే గంధకము 3 గ్రా. లేక ట్రైడిమార్ఫ్ లేదా డినోకాప్ 1 మి.లీ. లేదా హెక్సకొనజోల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • ఫిబ్రవరి: తావర పురుగు, తేనెమంచు పురుగు అధికంగా ఉన్న యెడల ఫిప్రోనిల్ లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఫిబ్రవరి చివరి వారంలో లేక మార్చి నెలలో అకాల వర్షాల వలన వచ్చే తెగుళ్ళు కాపర్ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి పిచికారి చేసి అరికట్టవచ్చును.

బూడిద తెగులు (పౌడరీ మిల్డ్యూ): చల్లని రాత్రులు మరియు వేడి పగటి వాతావరణంలో పూత మరియు పిందెపై తెల్లని పొడిలాంటి బూజు ఏర్పడుతుంది. ఈ శీలీంధ్రము ఆశించుట వలన పూలు, పిందెలు రాలుతాయి.

నివారణ: నీటిలో కరిగే గంధకము 3 గ్రా. లేక ట్రైడిమార్ఫ్ లేదా డినోకాప్ 1 మి.లీ. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కొమ్మల కత్తిరింపులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం. నీటి యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం, సిఫారసుల మేరకు సకాలంలో పాటించిన అధిక మరియు నాణ్యమైన దిగుబడి పొందవచ్చును.

చెదలు: నీటి వసతి సరిగా లేని తేలికపాటి ఎర్ర చల్కా నేలల్లో ఈ చెద పురుగుల ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. చెద పురుగులు చెట్టు పాదుల నుండి మొదలై కాండంనుండి పైకి చెద పుట్టలను కడుతూ ఎగబ్రాకుతాయి. ఈ పుట్టలలో ఉంటూ బెరుడు మరియు కాండాన్ని తింటాయి. చెద పురుగులు ఉధృతి ఎక్కువైన్పపుడు చెట్టు మొత్తం ఎండిపోయే ప్రమాదముంది.

నివారణ చర్యలు:

 • చెద పురుగుల సమర్థ నివారణకు తోటంతా శుభ్రంగా ఉండాలి. ఎండిపోయిన కొమ్మలు, తెగుళ్ళు ఆశించిన కొమ్మలు లేకుండా జాగ్రత్తపడాలి.
 • చెద పుట్టలను గుర్తించి, కాండం, కొమ్మలపై చెద పుట్టలను గోనె సంచిలో రుద్దుతూ ఏరి వేయాలి.
 • కాండం మీద, మొదలు చుట్టూ నేల తడిచేలా క్లోరిఫైరిఫాస్ (టి.సి) 5 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • ఒక లీటరు బోర్డో పేస్టుకు + 5 మి.లీ. క్లోపిఫైరిఫాస్ + 5 మి.లీ. వేపనూనె కలిపి కాండం మీద రాయాలి.

మామిడిలో సమగ్ర సస్యరక్షణ

మామిడిపై అతిగా దాడి చేసే తేనెమంచు పురుగులు, పూత, పిందె, గూడు పురుగులు, కాయతొల్చే పురుగులు, టెంకె పురుగులును దృష్టిలో వుంచుకుని నిఘా కార్యక్రమం చేపట్టాలి. తేనేమంచు పురుగుల్ని బనేషాన్ కొంతవరకు తట్టుకోగలదని గుర్తించబడింది.

 • తోటలో ముఖ్యంగా ఎండు పుల్లలున్న కొమ్మల్ని విరిచి, చెట్ల పరిసరాలను శుభ్రంగా వుంచి, నిద్ర దశలో వుండే పురుగుల్ని బహిర్గతం చేయాలి. గాలి వెలుతురు చోరబడగలిగిన చెట్లపై పురుగుల పెరుగుదల తక్కువగా ఉంటుంది.
 • చెట్ల మొదళ్లో చెద పురుగులు, వృద్ధి కాకుండా చెట్లకు 4-6 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టు సంవత్సరానికి రెండుసార్లు పూయాలి.
 • మామిడి పూత సమయంలో మొదలయ్యే తేనెమంచు, తామర పురుగుల అదుపు కొరకు ఇమిడాక్లోప్రిడ్, ఫిప్రోనిల్, ఎసిటామిప్రిడ్ వంటి కొత్త తరం మందులను వాడాలి. అజాడిరాక్టిన్ (వేపస్భందిత) మందులు కూడ వీటిపై పనిచేస్తాయి.
 • ముట్టి పురుగల ఉధృతిని గుర్తించే నిమిత్తం, చెట్ల పరిసరాల్లో, మొదులు పగుళ్ళలో వెతికి వాటి అదుపు కొరకు కాయ పెరిగే సమయంలో ఫెంతియాన్ అనే మందును పిచికారి చేసుకోవాలి.
 • ముట్టి పురుగల ఉధృతిని గుర్తించే నిమిత్తం, చెట్ల పరిసరాల్లో, మొదులు పగుళ్ళలో వెతికి వాటి అదుపు కొరకు కాయ పెరిగే సమయంలో ఫెంతియాన్ అనే మందును పిచికారి చేసుకోవాలి.
 • మామిడి పండు ఈగల్ని తగ్గించే నిమిత్తం మిధైల్ యుజినాల్ ఎరల్ని వాడాలి.

మామిడి కాయలను మగ్గ వేసే పద్ధతులు

మామిడి కాయలు చెట్ల మీద మగ్గుతాయి, కానీ అలా మగ్గనివ్వరాదు. ఎందుకంటే చెట్లపై కాయలు సమానంగా పండవు. రంగు కూడా పీలవంగా ఉంటుంది. నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది మరియు వలుమార్లు కోతలు కోయాల్సి ఉంటుంది. పై కారణాల వలన మామిడి కాయలను ఆకుపచ్చగా, గట్టిగ పక్వానికి రాగానే అవి మగ్గకముందే కోసి కృత్రిమ పద్ఝతుల ద్వారా పండిస్తారు.

సాంప్రదాయ పద్ధతులు

వరి లేదా బోద గడ్డి ఉపయోగించి మామిడి కాయలను మాగవేస్తారు. బయటి ప్రదేశాల్లో కోసిన కాయలను గుట్టలుగా పోసి వాటిని వరిగట్టి లేదా బోదగడ్డితో కప్పుతారు లేదా గాలి చొరబడని గదుల్లో నేలపై పరిచిన వరి లేదా బోద గడ్డి మీద మామిడి కాయలను వరసలుగా అమర్చి మగ్గనిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాలలో స్థానిక మార్కెట్ల కోసం ఈ పద్ధతిని ఇంకా ఉపయోగిస్తున్నారు. కర్ణాటక, మరికొన్ని దక్షిణ ప్రాంతాల్లో మామిడి కాయలను గదుల్లో ఉంచి పొగ బెట్టడం ద్వారా కూడ మాగనిస్తారు. ఈ సాంప్రదాయ పద్ధతుల వలన కాయలు మగ్గటానికి చాలా రోజులు పడుతుంది.

ప్రస్తుత పద్ధతులు

సాంప్రదాయ పద్ధతిలో కొసిన కాయలు వివిధ పక్వ దశల్లో ఉండటం వలన, అన్ని కాయలు సమంగా మగ్గవు మరియు నిద్రావస్థలో ఉన్న నల్లమచ్చ, తొడిమ కుళ్ళు ఎక్కువై అపార నష్టాన్ని కలుగజేస్తాయి. అందువలన వాణిజ్య సపళిలో చేసే వర్తకంలో మామిడిని కృత్రిమంగా రసాయనాల ద్వారా మాగనిస్తారు. ఈ పద్దతిలో తొలి నుంచి కాల్షియం కార్బైడ్, ఆ తరువాత ఎథిలిన్ ను ఉపయోగించి మామిడి కాయలను మగ్గనిస్తారు.

కాల్షియం కార్బైడ్ తో మామిడి కాయలను మగ్గవేయటం

కాల్షియం కార్బైడ్ తో పండిన పండ్లు, ఆరోగ్యానికి హానికరం. వినియోగదారునికి విషంలా పనిచేస్తాయి. వాటిని తినడం వలన మానవ శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. జీవన క్రియలు మందగిస్తాయి. శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఒక్కోసారి ఆరోగ్యం కోలుకోని విధంగా దెబ్బతింటుంది.

కాల్షియం కార్బైడ్ తో పండిన పండ్లు, ఆరోగ్యానికి హానికరం. వినియోగదారునికి విషంలా పనిచేస్తాయి. వాటిని తినడం వలన మానవ శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. జీవన క్రియలు మందగిస్తాయి. శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఒక్కోసారి ఆరోగ్యం కోలుకోని విధంగా దెబ్బతింటుంది.

ఇథిలీన్ వాయువుతో పండ్లను మాగబెట్టే పద్ధతి - వివరణ

 • ఇథిలీన్ వాయువును ఉపయోగించి పండ్లను మాగబెట్టుటకు ముఖ్యంగా మామిడి, అరటి మరియు సపోటా కాయలు పక్వానికి (3 వంతులు తయారైన) వచ్చి ఉఁడాలి.
 • ఇథిలీన్ వాయువును ఉపయోగించుటకు, ఇథలీన్ రైపనింగ్ ఛాంబర్స్ ఏర్పాటు, వాణిజ్యపరంగా ఇథిలీన్ వాయువు లభ్యత గురించి రైతులకు, వ్యాపారస్తులకు పూర్తిస్థాయి అవగాహన కలిపించాలి.
 • మామిడి కాయలను రైపనింగ్ ఛాంబర్ లో ఉంచి 100-150 పిపియం ఇథిలీన్ వాయువును ప్రవేశ పెట్టి, 12-24 గంటల ఛాంబర్ తలుపులు తెరవకుండా ఉంచవలెను. తరువాత కాయలు 4-5 రోజులలో మంచి రంగు సంతరించుకొని వక్వానికి వస్తాయి.

మామిడి సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామ

ప్రొఫెసర్ & యూనివర్సిటీ హెడ్, ఉద్యాన విభాగము, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఫోన్ నెం. ౯౩౯౧౨౪౮౪౬౨

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate