অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చిని మరియు నిమ్మ

చిని మరియు నిమ్మ

తెలంగాణలో చినీ, బత్తాయి, నిమ్మ పండ్ల విస్థీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. ఈ పండ్లు మంచి పోషక విలువలు కలిగి ఉండడమే కాకుండా, ఔషధ లక్షణాలు గుర్తించిన తరువాత సాగు నిస్థీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ చెట్ల పూలు, ఆకులు, పండ్ల నుండి తీసి సుగంధ తైలాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ కూడా ఉంది.

మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత నిమ్మజాతి పంటలు మూడవ స్థానాన్ని ఆక్రమిస్తాయి. చినీ, నిమ్మలో విటమిన్ సి, భాస్వరం అధికంగా వుంటుంది. వీటి నుండి చల్లని పానీయాలు, పచ్చళ్ళు, పెక్టిన్, నిమ్మ ఉప్పు మొదలైన ఉత్పత్తులు తయారవుతాయి.

వాతావరణం

గాలిలో తేమ తక్కువగా ఉండి, పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలం. అధిక వర్షపాతం, అధిక తేమ గల ప్రాతాల్లో మొక్క ఒక పద్దతిలో పూతకు రాదు. వివిధ సమయాల్లో పూతకు రావడం వలన పండ్లు సరైన రంగు లేకుండా, పక్వానికి రాకుండా వుండటం జరుగుతుంది. 750 మి.మీ. వర్షపాతం మరియు నీటి ఆధారం కలిగిన గట్టి ఈదురు గాలులు లేని ప్రాంతాలు సాగుకు అనుకూలం. సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తు వరకు వీటిని సాగు చేయవచ్చును.

నేలలు

ఎర్రనేలలు, నీరు నిలువని లేతైన ఎర్ర నేలలు శ్రేష్ఠం. ఏ కాలంలోనైనా నేలలోని నీటి మట్టం 2 మీటర్ల క్రింద వుండాలి. నేలలోని ఉదజని సూచిక 6.5 – 7.5 వరకు ఉండాలి. నీరు త్వరగా ఇంకిపోని తక్కువ లోతు గల రాతి పొరలు గల నేలలు పనికిరావు. అధికంగా సున్నపు రాళ్లు ఉంటే చెట్లకు పల్లాకు తెగులు వ్యాపించి చెట్లు త్వరగా క్షీణిస్తాయి.

చినీ రకాలు

సాత్ గుడి: దక్షిణ భారతదేశంలో పేరొంది, చెట్టుకి 1000-2000 పండ్లనిస్తుంది. బాగా తయారైన పండు, కొంచెం ఎరుపుతో కూడీన పసుపు రంగు కలిగి ఉంటుంది. పండు బరువు 150-240 గ్రాములు, రసం 44-54 శాతం, పులుపుదనం 0.63-0.67 శాతం మరియు 100 గ్రా. రసానికి 44-0 మి.గ్రా. విటమిన్ “సి” కలిగి యుండును.

బటావియన్: సాత్ గుడి రకాన్ని పోలి ఉంటుంది. బత్తాయి పండ్లను దోమ కాటు నుండి తప్పించటానికి తాటాకు బుట్టలతో రక్షణ కల్పించడం వలన పండు ఆకుపచ్చ, పసుపు రంగు మచ్చలు కలిగి ఉండును.

మోసంబి: ఈ రకాన్ని తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పండిస్తారు. పండ్లపై గురుకుగా నిలువు చారలు ఉంటాయి. కొనవైపు ఒక వర్తువాకార వలయం ఉంటుంది. దీనిలో రసం తక్కువగా ఉండి, తియ్యగా ఉండదు.

ఇవిగాక పైనాపిల్, జాపా, బ్లడ్ రెడ్, వాషింగ్టన్ పొవెల్ అనే రకాలు సాగు చేస్తున్నారు.

నిమ్మ

నిమ్మ రకాలలో కాగ్జి నిమ్మ శ్రేష్టమైనది. ఒక్కొక్క చెట్టు 3000-5000 కాయలనిస్తుంది. పండు బరువు 40-45 గ్రా. ఉంటుంది. బాలాజీ నిమ్మ, పెల్టూరు సెలక్షన్ రకాలు గజ్జి తెగులును తట్టుకొంటాయి. 42-50% రసం, 6.8-7% పులుపు మరియు 100 గ్రా. రసానికి 25-27 మి.గ్రా. విటమిన్ “సి” కలిగి ఉంటుంది. 10-15% మొక్కలు 3వ సంవత్సరం నుండి కాపుకి వస్తాయు. కానీ 4వ సంవత్సరం నుండి కాపు తీసుకోవాలి.

పెర్నియాకులమ్, కూర్గోలైమ్, రంగపూర్ లైమ్ లు సాగులో ఉన్న ఇతర నిమ్మ రకాలు.

మొక్కల వ్యాప్తి / ప్రవర్థనం

నారింజను బడ్డింగ్ ద్వారా ప్రవర్థనం చేస్తారు. సయాన్ బడ్ ను ఆరోగ్యవంతమైన, ఏవుగా ఉన్న, తెగుళ్ళు లేని చెట్ల నుండి సేకరించాలి. రూట్ స్టాక్ గా రంగపూర్ నిమ్మకు చెందిన గింజలను నారు మొక్కలుగా పెంచి, నారు మొక్కలు 25-30 సెం.మీ. ఎత్తు పెరిగినప్పుడు బడ్డింగ్ చేస్తారు.

అంట్ల ఎంపికలో మెళకువలు

వేరు మూలంపై 15 సెం.మీ. ఎత్తులో కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. 12-18 నెలలు వయస్సుగల అంట్లను ఎన్నుకోవాలి. మొజాయిక్, గ్రీనింగ్, ట్రిస్టిజా మొదలైన వెర్రి తెగుళ్ళు లేని అంట్లను ఎన్నుకోవాలి. కణువుల మధ్య దూరం తక్కువగా ఉండి, ఆకుల పరిమానం మధ్యస్థంగా ఉండి ముదురు ఆకు దశలో ఉన్న అంట్లను ఎన్నుకోవాలి.

అంట్లు నాటే సమయంలో జాగ్రత్తలు

అంట్లు నాటేటప్పుడు, అంటు భాగం నేల మట్టం నుండి 15 సెం.మీ. ఎత్తులో ఉండాలి. వేళల్లో అంట్లు నాటాలి. నాటిన అంట్లకు ప్రక్కన కర్రలను నాటి ఊతం ఇవ్వాలి.

నాటటం

చినీ, నిమ్మ మొక్కలను 6 x 6 మీటర్ల దూరంలో నాటుకోవచ్చును. మొక్కలు నాటడానికి ఒక నెల రోజుల ముందే 1 x 1 x 1 మీటర్ల సైజు గుంతలను త్రవ్వి ఆరబెట్టాలి. ప్రతి గుంతలోను పైపొర మట్టితో పాటు, 20 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సింగల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో వేపపిండి వేసి కలిపి నింపాలి. మొక్కలు నాటిన వెంటనే నీరు ఇవ్వాలి.

ఎరువుల యాజమాన్యం

చినీ, నిమ్మ తోటల్లో ఎరువుల యాజమాన్యం కీలకమైనది. పోషణ సరిగా లేనిచో చీడపీడలు అధికంగా ఆకర్షించబడతాయి. సాధారణంగా 30 – 40 సంవత్సరాలు మంచి దిగుబడిని ఇవ్వాల్సిన చెట్లు సరైన పోషణ లేకపోతే 10 సంవత్సరాలు లోపే క్షీణించి పోతాయి. నత్రజని ఎరువును 25 శాతం పశువుల ఎరువు రూపంలోనూ, 25 శాతం పిండి ఎరువు (వేపపిండి / ఆముదం) రూపంలోను, మిగిలిన 50 % రసాయనిక ఎరువు రూపంలో రెండుసార్లు అనగా మొదటిసారి డిసెంబర్ – జనవరి మాసాల్లో, రెండవసారి జూన్ – జూలై మాసాల్లో వేయాలి.

భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో రెండు దఫాలుగా సమపాళ్ళలో వేయాలి. ఎకరానికి 25 కిలోల జనుము మొక్కల మధ్య అంతర పాటగా వేసుకొని 45 - 48 రోజుల తరువాత దాదాపు 50 శాతం పూత దశలో కత్తిరించి పదుల్లో వేయాలి. వర్మీకంపోస్టు వాడితే పశువుల ఎరువు మేతదు తగ్గించవచ్చును.

మొక్క వయస్సుసాత్ గుడి, బత్తాయినిమ్మ
నత్రజని భాస్వరం పొటాష్ నత్రజని భాస్వరం పొటాష్
1వ సంవత్సరం 300 70 80 375 150 200
2వ సంవత్సరం 600 140 160 750 300 400
3వ సంవత్సరం 900 210 240 1125 450 600
4వ సంవత్సరం 1200 280 320 1500 600 800
5వ సంవత్సరం ఆపైన 1500 350 400 1500 600 800
పోషక ధాతు లోపంముఖ్య గుర్తింపు లక్షణాలులోప సవరణ చర్యలు
నత్రజని నత్రజని లోపిస్తే ఆకులు పసుపు రంగుకు మారడం, మొక్క ఎదగకపోవడం వంటివి జరుగుతాయి. సిఫారసు చేసిన మొతాదులో ఎరువులను వాడుకోవాలి.
భాస్వరం భాస్వరం వేర్ల అభివృద్ధికి పని చేస్తుంది. భాస్వరం లోపిస్తే ఆకులు ఎరుపు, ఊదా రంగులోకి మారుతాయి.
పొటాష్ ఆకుల అంచులు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతాయి.
జింక్ ఆకులు లేత పసుపు రంగులోకి మారి ఈనెలు మందంగా, పెళుసుగా తయరై చిన్నవిగా ఉంటాయి. కాయ దిగుబడి, నాణ్యత తక్కువగా ఉంటుంది. కొమ్మలు చివరి నుండి ఎండుతూ వస్తాయి. దీన్నే పల్లాకు తెగులు అంటారు. 5 గ్రా. జింక్ సల్ఫెట్ లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
ఇనుము లేత ఆకుల్లో ఈనెలు మాత్రం అకుపచ్చగా ఉండి, మిగిలిన భాగమంతా పసుపుగా మారుతుంది. ఆకంతా క్రమేణా పాలిపోయి తెలుపు రంగులోకి మారుతుంది. కాయలు రాలిపోతాయి. సున్నపు పొరలు ఎక్కువగా ఉన్న భూముల్లో ఇనుము ధాతు లోపం కనిపిస్తుంది. 10 లీటర్ల నీటికి 20 గ్రా. అన్నభేది, 2 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు పిచికారి చేయాలి.
బోరాన్ కొత్తగా పెరిగే చివరి మొగ్గ ఆకులు దెబ్బతింటాయి. కొమ్మ చివర పెరుగుదల ఆగిపోయి పక్క కొమ్మలు పెరగడం వలన గుబురుగా కనిపిస్తాయి. లేత ఆకులు ఈనెలు దళసరిగా ఉబ్బి వంకర తిరిగి ఉంటాయి. పిందెలు రాలిపోతాయి. కాయలు పగుళ్ళిచ్చి, నీరు పట్టి ఉంటాయి. కుళ్ళినట్లు కనిపిస్తాయి. 0.1 శాతం అంటే లీటరు నీటికి 1 గ్రా. బోరిక్ ఆసిడ్ వారం రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు పిచికారి చేయాలి.
మాంగనీస్ ఆకుల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడి క్రమేణా అని తెల్లగా మారి ఆకులు రాలి పోతాయు. ఆకులు క్రిందకు ముడుచుకొని బోర్లించిన గిన్నె లాగ కనిపిస్తాయి. 2 – 3 గ్రా. మాంగనీస్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
రాగి ఆకులు, కాయల మీద ఇటుక రంగు మచ్చలు ఏర్పడుతాయి. కాయ పరిమాణం తగ్గుతుంది. మచ్చలు ఏర్పడిన భాగం నుండి బంక కారుతూ ఉంటుంది. 0.25% కాపర్ సల్ఫేట్ (2.5 గ్రా./లీ.), బ్లూకాపర్ (బ్లైటాక్స్) 3 – 4 (30 – 40 గ్రా./లీ.) ద్రావణాలను పిచికారి చేయాలి.

పూతకు వదిలే ముందు, చెట్లను ఎండబెట్టి, ఎరువులు వేసి, పుష్కలంగా నీరు పెట్టలి.

సేంద్రీయ ఎరువులు వాడటం వలన భూమిలో సత్తువ, తేమను నిల్వ వుంచుకొనే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి.

ఎరువులను చెట్ల పాదులలో ట్రెంచ్ పద్ధతిలో వేయాలి. చెట్టు చుట్టూ ఒక మీటరు దూరంలో 15 – 20 సెం.మీ. వెడల్పు, 15 సెం.మీ. లోతులో కందకం త్రవ్వి ఎరువులు వేసి కప్పాలి,

లేత మొక్కలు సంవత్సరానికి 4-5 సార్లు చిగురిస్తాయి. కావున ఈ సమయంలో పల్లాకు వ్యాధి నివారణకు లీటరు నీటికి జింకు సల్ఫేట్ 5 గ్రా. + మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రా. + మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా. + ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రా. + బోరాక్స్ 1 గ్రా. + కాల్షియం / సున్నం 6 గ్రా. + యూరియా 10 గ్రా. మిశ్రమాన్ని సంవత్సరానికి 4 సార్లు ( జూన్, జులై, జనవరి, ఫిబ్రవరి) పిచికారి చేయాలి. నిప్పారిన లేత ఆకుల మీద, పిందె బఠాణీ పరిమాణంలో ఉన్నప్పుడు పిచికారి చేయాలి.

సున్నపు నెలల్లోని నిమ్మ తోటల్లో ఇనుప ధాతు లోపం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి 20 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ మరియు 2 గ్రా. నిమ్మఉప్పు 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 దఫాలుగా పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం

సకాలంలో సాగునీటి సరఫరా లేకుంటే, చెట్లు పెరగక, కాపు తక్కువగా ఉంటుంది. నీటి పారుదల సరిగా లేకుంటే పండు పరిమాణం, నాణ్యత తగ్గి, పండు రాలిపోతుంది. కావున ప్రత్యేకించి కాపు దశలోను, పొడి కాలంలో తగినంత నీటి సరఫరా అవసరం.

  • చిన్న మొక్కలను ఎండాకాలంలో తరచుగా నీరు కట్టాలి.
  • చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల, వాతావరణం, చెట్టు వయస్సు, దిగుబడులపైన ఆధారపడి ఉంటుంది.
  • చెట్టు పూత, పిందంలపై ఉన్నప్పుడు క్రమం తప్పక నీరు పెట్టాలి.
  • నీటి ఎద్దడి ప్రాంతాల్లోని చెట్ల పాదుల్లో, ఎండాకులు, వరిపొట్టు, వేరుశనగ పొట్టు 8 సెం.మీ. మందంలో వేసి తేమ ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చును.
  • ఎరువులు వేసిన వెంటనే సమృద్ధిగా నీరు పెట్టాలి.
  • డబుల్ రింగ్ పద్దతిలో నీరు కట్టడం మంచిది.

సుమారుగా ఉదజని సూచిక 6-8 ఉన్న నేలల్లో 0.75 డెసిసైమస్ / మీ. కన్నా తక్కువ విద్యూత్ ప్రవాహం గల సాగు నీటిని వాడి తోటలను లాభదాయకంగా పెంచవచ్చును. డ్రిప్ పద్ధతిలో నీరు కట్టడం వలన నీటి ఆదాయే కాక మొక్కల పెరుగుదల, కాయ నాణ్యత కూడా పెరుగుతుంది. మరియు కలుపు మొక్కలు తగ్గుతాయి. డ్రిప్ పద్ధతిలో నీరు కట్టేటప్పుడు అన్ని చెట్లకు సమృద్ధిగా నీరు అందుతుంది.

అంతరకృషి, అంతర పంటలు

కాపు రాక ముందు 2-3 సంవత్సరాల వరకు అంతర పంటలుగ వేరుశనగ, అపరాలు, బంతి, దోస, ఉల్లి, పుచ్చ వెయవచ్చును. మినప, టమాట, వంగ, పోగాకు పైర్లను వేయరాదు. ఈ పైర్లను వేయడం వలన నులి పురుగుల బెడద ఎక్కువవుతుంది. వర్షాకాలంలో జనుము, అలసంద, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి, పూత సమయంలో పాదు భూమిలో వేసి కలియదున్నాలి. పాదులు గట్టిపడకుండా అప్పుడప్పుడు త్రవ్వాలి. పాదుల త్రవ్వేటప్పుడు, ఎరువులు వేసేటప్పుడు వేర్లు ఎక్కువగా తెగకుండా తేలికపాటి సేద్యం చేయీలి. చెట్ల కొమ్మలపై పడకుండా, మొదలుకు అడుగు దూరంలో కలుపు మందులు పిచికారి చేయాలి

సస్యరక్షణ – తెగుళ్ళు మరియు పురుగులు

తెగుల పేరులక్షణాలునివారణ చర్యలు
బంక తెగులు ఫైటోఫ్తోరా బంక తెగులు వలన ధారాళంగా బంక కారడం, బెరుడు కుళ్ళడం జరిగి, ఈ తెగులు చెట్టు వేర్లకు, మొదలు క్రింద భాగానికి పరిమిసమై ఉంటుంది.డిఫ్లోడియా భంక తెగులు వలన చెట్టు మొదలుపై భాగాన, ముఖ్యంగా కొమ్మల వంగల్లో బంక కారడం, బెరుడు కుళ్ళడం జరుగుతుంది. నీరు త్వరగా ఇంకని భూముల్లోను, చెట్టు మొదళ్ళకు నీరు పదే పదే తగలడం వలన బంక తెగులు, కాండంను ఆశిస్తుంది. బంక తెగులు వలన కొమ్మలు ఎండటం, చెట్లు క్షీణించడం జరుగుతుంది. నీరు త్వరగా ఇంకిపోగల భూముల్లో మొక్కలు నాటాలి. చెట్టు చుట్టు చిన్న పాదులు కట్టి నీరు మెదలుకు తగలకుండా చూడాలి. చిన్న పాదులు చెట్టు మొదలు నుండి 1.5 అడుగు దూరంలో ఉండాలి. బంక కారి కుళ్ళిన బెరుడును పూర్తిగా గోకి బోర్డోపేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టు లేదా మెటలాక్సిల్ పేస్టు చెట్లకు పూయాలి. క్రమం తప్పక ముందు జాగ్రత్తగా బోర్డోపేస్టు మొదళ్ళకు పట్టించాలి. కొమ్మలపై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండాజిమ్ 1 గ్రా. కలిపి చెట్టుపై 15 రోజుల వ్యవధిలో దెండు సార్లు పిచికారి చేయాలి. మెటలాక్సిల్ 2 గ్రా. నీటికి కలిపిన మందు ద్రావణం చెట్టు పాదులో పోయాలి.
వేరుకుళ్ళు తెగులు దీని వలన వేర్లు కుళ్ళి, పోషక పదార్ధాలు, నీరు చెట్టుకు అందకుండా చెట్టు ఎండిపోతాయి. వేర్లు పరిక్షీస్తే కుళ్ళిన వాసన గమణించవచ్చును. తెగులు సోకిన చెట్టు వాడిపోతాయి. ఇది ఆశించిన నిమ్మ చెట్టు ఒకేసారి చనిపోతుంది. దీని నివారణకు రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టిన మొక్కలను నాటటం శ్రేయస్కరం. వ్యాధి సోకిన తొలిదశలోనే గమనించి చెట్టుకు నీరి కట్టి మరుసటి రోజు కార్బండాజిమ్ 2 గ్రా. లేదా మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి లేదా 1% బోర్డో మిశ్రమాన్ని చెట్ల పాదుల్లో నేల తడిచేటట్లు పోయాలి. సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు ఎక్కువగా వాడాలి. 1 కిలో ట్రైకోడర్మా కల్చరును 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వపపిండితో కలిపి, 15 రోజులు మాగబెట్టి, చెట్టుకు 10 కిలోల చొప్పున పాదులో వేసి కలియబెట్టాలి. ఒక కిలో యూరియా 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
గానోడెర్మా (పుట్టగొడుగులు) తెగులు శీలీంధ్రం చెట్టు వేర్లపై పృద్ధి చెంది, బెరుడు మీద అల్లుకొని తెల్లగా ఉంటుంది. తెగులు సోకిన వేర్లు బెండుగా పిప్పిగా తయారవుతాయి. వర్షాకాలంలో చెట్టు మొదలుపై భూమి నానుకొని పుట్టగొడుగులు కనిపిస్తాయి. బాగా అశ్రద్ధ చేసిన తోటల్లో ఎక్కువగా కనబడుతాయి. దీని నివారణకు పుట్టగొడుగులను ఏరి కాల్చాలి. తెగులు సోకిన చెట్టు మొదలును గోకి బోర్డోపేస్టు పూయాలి. లీటరు నీటికి 2.5 మి.లీ. ట్రైడిమార్ఫ్ కలిపి, చదరపు మీటరుకు లీటరు మందు నీరు చొప్పున పీచువేర్లు తడిచేటట్లు పాదుల్లో పోయాలి.
బూడిద తెగులు చలికాలంలో, లేత ఆకులపై బూడిద చల్లినట్లుటుంది. తెగులు సోకిన ఆకులు వంకర తిరిగి రాలిపోతాయి. ఈ తెగులు సోకినప్పుడు పిందెలు కూడా రాలిపోతాయి. దీని నివారణకు 1 మి.లీ. డైనోకీప్ లేక 3 గ్రా. నీటిలో కరిగే గంధకము లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చెయాలి.
ఫెల్టు (రబ్బరు) తెగులు అధిక వర్షాలు ఉన్న సంవత్సరాలలో, వర్షాలు ఆగిన వెంటనే కొమ్మల చుట్టూ మెత్తగా, తోలులాగా శీలీంధ్రం చుట్టుకొని ఉంటుంది. తెగులు సోకిన కొమ్మలి ఎండిపోతాయి. ఈ సమస్య చీని నిమ్మ కన్నా నిమ్మలో ఎక్కువ. దీని నివారణకు పొలుసు పురుగులు ఆశించకుండా ఎండినట్లు కనిపిస్తే వాటిని 2 – 3 అంగుళాల క్రింద వరకు కత్తిరించి బోర్డోపేస్టు పూయాలి. కత్తిరించి కొమ్మలు కాల్చి వేయాలి.
పింకు తెగులు పింకు తెగులు వర్షాకాలం అయిన వెంటనే, తెగులు సోకిన కొమ్మలు ఎండినట్లు కనిపిస్తే వాటిని 2 – 3 అంగుళాల క్రింద వరకు కత్తరించి బోర్డోపేస్టు పూయాలి. కత్తిరించిన కొమ్మలు కాల్చివేయాలి.
చీనికాయ తొడిమ కుళ్ళు తెగులు కాయ తొడిమపై శిలీంధ్రం ఆశించి కాయలకు తొడిమకు కుళ్ళును కలుగజేస్తుంది. కాయపై గోధుమ రంగు వలయాకారపు మచ్చ ఏర్పడుతుంది. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో కోతకు వచ్చే పండ్లపై ఊ తెగులు ఆశిస్తుంది. చెట్టులోనే కుళ్ళి ఎండిన కాయల్ిు తొడిమెతో కత్తిరించి పోగుచేసి నాశనం చేయాలి. కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి జూన్, జులై మరియు ఆగష్టు మాసాలలో పిచికారి చేయాలి.
చెట్టు బెరుడుపై నిలువు పగుళ్ళు నిమ్మలో మాత్రమే ఈ తెగులు గమనించవచ్చును. కాండం, కొమ్మలపైన నిలువు చారలు ఏర్పడుతాయి. క్రమేణా పగిలి, కొమ్మలు ఎండిపోతాయి. ఉధృతంగా ఉంటే చెట్టు పూర్తిగా ఎండిపోతుంది. కొమ్మలపై చారలు గమనించిన వెంటనే కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి 2 సార్లు పిచికారి చేయాలి. చెట్ల పాదులో నీరు కట్టిన మరుసటి రోజు ఒక చదరపు మీటరుకి లీటరు వంతున 1 శాతం బోర్డో మిశ్రమాన్ని పోయాలి.
బాక్టీరియా తెగుళ్ళు
గడ్డి తెగులు (కాంకర్ మచ్చ తెగులు) నిమ్మపై ఎక్కువగా గమనించవచ్చును. లేత ఆకులు, చిన్న కొమ్మలు, కాయలపై, ముళ్ళ మీద, పెద్ద కొమ్మల మీద, కాండం మీద చివరకు ఒక్కోపారి వేరుపైన ఈ మచ్చలు సోకి నష్టం కలిగిస్తాయి, తెగులు ముదిరిన దశలో చెట్లు ఎండిపోతాయి. తెగులు సోకిన చెట్లపై ఎండు పుల్ల ఎక్కువగా కనిపిస్తుంది. గజ్జిని తట్టుకొనే బాలాజి నిమ్మరకం నాటుకోవాలి. తెగులు సోకిన కొమ్మలు కత్తిరంచి, స్ట్రెప్టోసైక్లిక్ 1 గ్రా, మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా. 10 లీటర్లు నీరు కలిపి 20 రోజుల వ్యవధిలో వర్షాకాలంలో 2 – 3 సార్లు పిచికారి చేయాలి. చెట్ల మొదళ్ళ పైనా, పెద్ద కొమ్మల పైనా గజ్జి తెగులు ఉంటే తెగులు ఉన్న బెరుడును కత్తితో గోకి బోర్డోపేస్టు పూయాలి.
గ్రీనింగ్ తెగులు (శంఖు) చినీ, నిమ్మ చెట్లపై ఈ తెగులు ఆశిస్తుంది. ఆకులు పసుపు రంగుకు మారి వాటిపైన చిన్న ఆకుపచ్చని గుండ్రటి మచ్చలు ఏర్పడుతాయి. పండ్లలో విత్తనాలు తక్కువగా ఉండి, పీచుగా మారుతుంది. శంఖు తెగులు సోకిన చెట్ల కొమ్మలను వాడి అంట్లు తయారు చేయరాదు. తెగులు వ్యాప్తి చేసే సిల్లిడ్స్ అనే పురుగులను డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవాలి.
వెర్రి తెగుళ్ళు
ట్రిస్టిజా తెగులు ఈ తెగులు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. లేత ఆకులను, సూర్యుడి వెలుగుకు ఎదురుగా పెట్టి చూస్తే ఈనెల మీద పాలిపోయినట్లు కనబడుతుంది. తెగులు సోకిన చెట్టు మొదలుపై కొద్దిపాటి బెరుడు తీసి చూస్తే స్టెమ్పిట్స్ (బుడిపెలు) కనిపిస్తాయి. తెగులు సోకిన చెట్ల నుండు తీసిన కొమ్మలు వాడి అంట్లు కట్టరాదు. పేనుబంక పురగును డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవాలి.
మొజాయిక్ తెగులు ఆకులపై పసుపు ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి మొజాయిక్ లాగా కనిపిస్తుంది. ముఖ్యంగా చినీ నిమ్మలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వ్యాధిపోకిన చెట్ల నుండి తయారైన అంట్లను నాటరాదు.
బడ్యూనియన్ క్రీజ్ తెగులు తెగులు సోకిన చెట్లలో అంటు కట్టిన చోట కాండం ఉబ్బినట్లు కనిపిస్తుంది. రంగపూర్ నిమ్మపైన అంటుకట్టిన మొక్కలు వాడాలి.
యల్లో కార్కిబీన్ తెగులు చినీ మరియు నిమ్మలో వస్తుంది. ఆకులోని ఈనెలు పసుపు పచ్చగా మారి మందంగా బెండులాగా తయారవుతాయి. వ్యాధి సోకిన చెట్ల నుండి అంటు మొగ్గలు ఉపయోగించరాదు. వాటినుండి తయరైన అంట్లను నాటరాదు.
ఆకుముడత పురుగు (మజ్జిగ తెగులు/గజ్జి తెగులు) (ఆకుముడత పురుగు జూన్-జులై, సెప్టెంబర్-అక్టోబర్ మరియు డిసెంబర్-జనవరి నెలల్లో ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. తెల్లని చిన్న రెక్కల పురుగు లేత ఆకులపై పెట్టిన గుడ్ల నుండి అతి చిన్న పురగులు బయటపడి చిగురాకులలోకి తొలుచుకొని కింద పొరలకి పోయి మొత్తటి పదార్ధాన్ని తింటాయి. ఆకులపై ఎండ పడినప్పుడు వంకర టింకర చారలు తళ తళ మెరుస్తూ వెండి రంగులో కనిపిస్తాయి. పురగులు ఆశించిన ఆకులు ముడత పడి ఎక్కువ గజ్జి తెగులు సోకి త్వరగా రాలిపోతాయి. ఆకుముడత పురుగుల ఆకులు తొలిచే దాని వలన బాక్టీరియా, గజ్జి తెగులు సులభంగా పురుగు ఆశించిన ప్రాంతమంతా ఆశించడానికి ఆస్కారమవుతుంది. ప్రోఫెనోఫాస్ 2.0 మి.లీ. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రా. లీటరు నీటికి లేత చిగుర్ల దశలో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. ఈ పురుగు ఆశించే నెలల్లో పురుగు మందులను పిచికారి చేసుకోవాలి.
గొంగళి పురుగు (జులై-ఫిబ్రవరి వరకు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.) నారింజ పురుగు, పచ్చ గొంగళి పురగులు, గుడ్ల నుండి వెలుబడిన వెంటనే లేత చిగుర్లపై ఆశించి వష్టం కలిగిస్తాయి. ఈ పురగులు ప్రాఱంభ దశలో నల్లగా ఉండి, తెల్లని చారలు కలిగి ఉండి, పక్షుల రెట్ట మాదిరిగా కనిపిస్తాయి. లేత ఆకులను బాగా తింటూ, గొంగళి పురుగులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి, 4 సెం.మీ. పొడవు ఉండి, ఆ తర్వాత నిద్రావస్థకు చేరి కొన్ని రోజులకు వీటి నుండి సీతాకోక చిలుకలు వెలువడుతాయి. లేత ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు ఉన్నప్పుడు ఈ గొంగళి పురుగులు ఆశించినవని తెలుసుకోవచ్చు. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా జైక్లోరోవాస్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడే పిచికారి చేయాలి.
తెల్లపోలుసు పురుగులు ఎక్కువగా నిమ్మ చెట్ల కాండంపై వేల సంఖ్యలో ఆశించి సున్నం పూసినట్లుగా కనబడతాయి. రసాన్ని పీల్చి, కొమ్మలు ఎండి, ఎక్కువగా ఉన్నప్పుడు చెట్లు ఎండిపోతాయి. కాండాన్ని/కొమ్మను గోనె పట్టతో రుద్ది మిధైల్ డెమాటాన్/డైమిధోయేట్ 2 మి.లీ. లేదా ప్రోఫెనోఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి కాండం కొన్నలపై పిచికారి చేయాలి.
నల్ల పురుగులు వీటిలో ఆకుపచ్చ నల్లి మరియు మంగునల్లి ముఖ్యమైనవి. ఆకుపచ్చ నల్లి ఆకులపైన, కాయలపైనా రసాన్ని పీల్చడం వలన చిన్న చిన్న తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. మంగు నల్లి కాయలపై రసం పీల్చడం వలన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. కాయలు చిన్నవిగా ఉండి, తోలు గట్టిగాను, పెళుసుగాను ఉండి ధర తగ్గిపోతుంది. లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా డైకోఫాల్ ను 3 మి.లీ. లేదా 1 మి.లీ. ప్రోపర్గైట్ కలిపి సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో నెలకొకసారి పిచికారి చేయాలి.
నల్లదోమ (ఆగష్టు నుండి మార్చి వరకు అనగా చిగుర్లు వచ్చే దశలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. నల్లరంగులో ఉన్న పిల్ల పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ముడుచుకు పోతాయి. నల్లిదోమ విసర్జన నుండి వెలువడే తేన లాంటి పదార్దం ఆకులపై పడి శీలీంధ్రాలు పెరగడం వలన నల్లటి బూజు ఏర్పడి, కిరణ జన్యు సంయోగక్రియ జరగక చెట్లు క్షీణిస్తాయి. ఆకులు ముదరక ముందే రాలిపోతాయి. నల్లదోమ ఆశించిన చెట్లలో పూత, కాయల పరిమాణం మరియు నాణ్యత తగ్గిపోయి కాయలకు మార్కెట్లో ధర ఉండదు. తొలకరి వానలు పడక ముందే చెట్లలోని ఎండు కొమ్మలను, నీటి కొమ్మలను కత్తిరించి మొక్కలను బాగా గాలి తగిలేటట్లు చేయాలి. ప్రోఫెనోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగం, పైభాగం, బాగా తడిచేటట్లు చిగుర్లు వచ్చే దశలో (జులై-ఆగష్ట్, అక్టోబర్-డిసెంబర్ నెలల్లో) పిచికారి చేయాలి.
పేనుబంక మరియు ఎగిరే పేను లేత ఆకులు, పూతపై ఆశించి రసాన్ని పీల్చడం జరుగుతుంది. పేనుబంక ట్రిస్టిజా అనే వెర్రి తెగులును, ఎగిరేపేను (సిల్లిడ్స్) శంఖు తెగులును వ్యాప్తి చేస్తాయి. డైమిధోయేట్ 2 మి.లీ. లేదా మిధైల్ డెమటాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగుల రెక్కల పురుగులు పండ్లపై రంధ్రాన్ని చేసి రసాన్ని పీల్చుతాయి. రంధ్రాలలో శీలీంధ్రాలు, బాక్టీరియాలు చేరి పండ్లు కుళ్ళి రాలిపోతాయి. దీనినే డాగు అంటారు. రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. రాత్రి వేళల్లో లైట్ల కాంతికి పురుగు ఆకర్షింపబడుతుంది. హెక్టారుకు ఒక ఫ్లోరోసెంట్ బల్బును కాయలు పక్వానికి రాక ముందే అనగా ఒక నెల ముందు ప్రతి రోజు రాత్రి 7:00 – ఉదయం 6:00 గంటల వరకు పెట్టాలి. సాధారణంగా కాపుకు వచ్చే సెప్టెంబర్-నవంబర్ మరియు మార్చి-మే నెలల్లో దీపపు ఎరలను పెట్టుకోవాలి. లైట్ల క్రింద మలాధియాన్ 1 మి.లీ. మందు మరియు 1 శాతం పంచదారను పండ్ల రసంలో కలిపిన మిశ్రమాన్ని ఉంచి పురుగులను అరికట్టాలి. కాయలుగా ఉన్నప్పుడు బుట్టను కట్టడం వలన పురగు నుండి రక్షణ కలుగుతుంది. తోట చుట్టూ ఉన్న పాదలను, తిప్ప తీగలను తీసివేసి పురుగు బెడద తగ్గించవచ్చును.
పిండి పురుగు ఈ పురుగు తెల్లని మైనపు పదార్దంతో ఉండి లేత కొమ్మల మీద, కాయల మీద, తోడిమల మీద రసాన్ని పీలుస్తాయి. పురుగు విసర్జించే తేనే వంటి ద్రవం మీద బూజు ఏర్పడి, కిరణజన్యు సంయోగ క్రియ జరగక ఆకులు నల్లగా మారిపోతాయి. ప్రోఫెనోఫాస్ 2.5 మి.లీ. లేదా మిధైల్ పారాధియాన్ 2 మి.లీ.+ జౌక్లోరోవాస్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి 15 రోజులకొకసారి చొప్పున ఆగష్టు-డిసెంబర్ నెలల్లో కాయలు కోసిన తరువాత రెండు సార్లు పిచికారి చేయాలి.
చెదలు చెట్ల మొదళ్ళపై బెరుడును గోకడం వలన చెట్లు ఎండిపోతాయి. చెదలు పెట్టిన మట్టిని దులిపి వేసి చెట్టు మొదలు చుట్టూ పొడి మందును చల్లి మట్టిలో కలిసేటట్లు తిరగత్రవ్వాలి. చెదలు ఆశించిన కొమ్మపై క్లోరిఫైరిఫాస్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నులి పురగులు ఈ పురుగులు బెరడును గాయపరచి, వేర్ల నుండి పోషక పదార్ధాలు పీల్చి వేస్తాయి. నులి పురుగులు ఆశించిన చెట్ల వేర్లపై బుడిపెలు ఏర్పడుతాయి. విషపూరిత పదార్ధాలు నులి పురుగులు విడుదల చేయడం వల్లనూ, సూక్ష్మపోషక పదార్ధాలు లోపించడం వల్లనూ చెట్లు పెరుగుదల లేకుండా క్రమేపి క్షీణిస్తాయి. ఆరేగ్యకరమైన నారుమళ్ళ నుండి మొక్కలను ఎంచుకోవాలి. చెట్టుకు 50 గ్రా. కార్బోప్యూరాన్ గుళికలు చెట్టు పాదులోని మట్టితో కలిపి నీరు పారించాలి. నులి పురుగుల తాకిడికి లోనయ్యే వంగ, టమాట, పోగాకు పంటలను చినీ, నిమ్మ తోటల్లో అంతర పంటలుగా వేయరాదు. చెట్టుకి 15 కిలోల వేపపిండి లేదా ఆముదపు పిండి జూలై-ఆగష్టు మరియు డిసెంబర్-జనవరి నెలల్లో పాదుల్లో వేసి కలియబెట్టి నీరు పెట్టాలి.

పూత కాలము మరియు నియంత్రించుట

మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశ ప్రాంతాల్లో చినీ, నిమ్మలకు సంవత్సరం పొడువునా పూత పూసే అలవాటుంది. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా 3 సీజన్లలో పూత ఎక్కువగా పూస్తుంది. జనవరి – ఫిబ్రవరి మాసాల్లో వచ్చే పూతను అంబే బహర్ గాను, జూన్ – జులై మాసాల్లో వచ్చే పూతను మ్రిగ్ బహర్ అని, అలాగే సెప్టెంబర్ – అక్టోబర్ మాసాల్లో వచ్చే పూతను హస్త బహర్ అని అంటారు. ఏ బహర్ పంటను తీసుకోవాలి, మార్కెట్లో ఏ సమయంలో పండ్లకు అధిక రేటు లభిస్తుందో, నీటి సదుపాయం, వాతావరణ పరిస్థితులు, క్రమి కీటకాల వలన కలిగే నష్టం, మొదలగు వానిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవాలి. ఏ సీజన్ లో పూత కావాలో నిర్ణయించుకొని బహర్ ట్రీట్మెంట్ ఇచ్చి పూత తెప్పించుకొవచ్చును.

బహార్ ట్రీట్ మెంట్

పూత తెప్పించుకోవడానికి వేర్ల కత్తిరింపులు, వేర్లను బయటపడేలా చేయటం, నీటి తడులు మానివేయడం లాంటి ప్రక్రియలను చేపట్టి ఆకులు రాలేంత వరకు పెరుగుదలను ఒకటి లేదా ఒకటిన్నర నెలలు ముందుగా భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులని బట్టి నియంత్రింస్తారు. ఈ ప్రక్రియ వలన చెట్టు నిద్రావస్థలోకి వెళ్ళి, ఆ తరువాత అనుకూల పరిస్థితులు కల్పించినప్పుడు మనం ఎన్నుకొన్న సీజన్ లో పిందెలు వస్తాయి. అంతేకాక ఈ బహర్ ట్రీట్మెంట్ ద్వారా చెట్లన్ని ఒకేసారి పుష్పించి నాణ్యమైన పండ్లు ఏర్పడి దిగుబడులు బాగా పెరుగుతాయి.

అంబే బహర్ సీజన్ కొరకు, నవంబర్ మొదటి నుండి ఆఖరు నీటి తడులు క్రమంగా ఆపేయ్యాలి. భూమిని తేలికగా దున్నాలి. ఎప్పుడైతే చెట్టు ఆకులన్ని రాలుపోవుట ప్రారంభించునో (2-4 వారాలు) అప్పుడు చెట్టు మొదలు నుండి 120 సెం.మీ. దూరంలో 10 సెం.మీ. లోపలికి త్రవ్వి సిఫారసు చేసిన ఎరువులను వేసి నీరు పెట్టాలి. (డిసెంబర్-జనవరి) నీరు పెట్టిన నెల రోజుల తరువాత చెట్టు మీద పూతను గమనించవచ్చును. ఈ తోటల్లో సెప్టెంబర్ – అక్టోబర్ మాసాల్లో పండ్లు కోతకు వస్తాయి.

కొమ్మల కత్తిరింపు

  • వేరు మూలాన్నుండి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి.
  • కాండం మీద రెండు అడుగులు ఎత్తు వరకు ప్రక్క కొమ్మలు పెరగకుండా తీసివేయాలి.
  • చెట్టులో నీడన ఉన్న అనవసరమైన కొమ్మలు, ఎండుపుల్లలు కత్తిరించాలి.
  • నిటారుగా పెరిగే నీటి కొమ్మలు కత్తిరించాలి.
  • కత్తిరించిన కొమ్మ చివర్లకు తెగుళ్ళు ఆశించకుండా బోర్డోపేస్టును పూయాలి.

పిందె రాలుట: చినీ, నిమ్మలో పూత, పిందె మరియు కోతకు వచ్చిన పండ్లు రాలుట సహజం. దీనికి కారణాలను పరిశీలించినట్టైతే నీటి ఎద్దడి, పోషకాహార లోపాలు, వేగంగా వీచే గాలులు, ఇతర వాతావరణ వైపరీత్యాల వలన పూత, పిందె రాలటం జరుగును.

సీజన్పూత కాలంకోత కాలం
అంబే బహర్ జనవరి – ఫిబ్రవరి సెప్టెంబర్ – అక్టోబర్
మ్రిగ్ బహర్ జూన్ – జులై మార్చి – ఏప్రిల్
హస్త బహర్ సెప్టెంబర్ – అక్టోబర్ మే - జూన్

చెట్లలో జరిగే వివధ పసాయనిక మార్పులు మరియు హార్మోన్ల లోపాలు వలన పిందె రాలుట జరుగును. నిమ్మలో పిందెలు ఏర్పడే సమయంలో ఒకసారి, కాయలు పక్వానికి వచ్చే ముందు ఒకసారి రాలుట ఎక్కువగా ఉంటుంది.

నివారణ

  • చెట్టు పూత, పిందె దశలో ఉన్నప్పుడు దున్నటం చేయరాదు.
  • ఎండలు ముదిరే కొద్దీ చెట్లకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి.
  • 2,4-డి 10 పిపిఎమ్, (1 గ్రా. 100 లీటర్ల నీటిలో) మందును, పూత సమయంలో, పిందె సమయంలో, పిందె బట్టిన నెల రోజుల ముందు పిచికారి చేయాలి.

ఈ మందును మొదట కొద్దిపాటి స్పిరిట్ లేదా ఆల్కహాల్ లో కరిగించి తరువాత నీటిలో కలుపుకోవాలి. 2,4-డి మందుకు బదులుగా నాఫ్తలీన్ అసిటిక్ ఆమ్లము 20 పిపిఎమ్ (2గ్రా. 100 లీ. నీటిలో) ద్రావణం కూడ వాడవచ్చును.

కాయ నిల్వకు, కాయ కోసే 14 రోజుల ముందు 2 శాతం కాల్షియం నైట్రేట్ (20 గ్రా. లీటరు నీటికి) పిచికారీ చేయాలి. కాయ సైజు పెరగటానికి, కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ (13-0-45) లీటరు నీటికి 10 గ్రా. చొప్పున కలిపి 20-25 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. కాయ పసుపుతనం పెరగటానికి కాయలు కోసే నెల రోజుల ముందు 5 గ్రా. సల్పేట్ అఫ్ పోటాష్ ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పండ్ల కోత

సాధారణంగా బత్తాయి 5వ సంవత్సరం నుండి, నిమ్మ 3వ సంవత్సరం నుండి కోతకు వచ్చును. పూత పూసిన 8 – 9 నెలల్లో బత్తాయి కాయలు కోతకు వస్తాయి. అదే నిమ్మలో 5 – 6 నెలల్లో కోతకు వస్తాయి.

దిగుబడి

ఇది నేల స్వభావం, పెంచే రకం, ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉండును. బత్తాయిలో 500 – 600 పండ్లు ఒక చెట్టుకు, నిమ్మ 1000 – 1200 పండ్లు ఒక చెట్టుకు కాస్తుంది. నిమ్మకాయలను సంవత్సరం పొడవునా కోస్తారు. కానీ ముఖ్యంగా 80% వరకు మే – ఆగష్టు మాసాలలో కోస్తారు. కాయను వర్షంలో గానీ, వర్షం తరువాత గానీ వెంటనే కోయరాదు. కోసిన కాయలను ఎండలో ఉంచకూడదు.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate