కుసుమ మన రాష్ట్రంలో సుమారు 15,000-20,000 ఎకరాల్లో నల్లరేగడి నేలలందు వర్షాధారపు యాసంగి పంటగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, అదిలాబాద్ జిల్లాల్లో సాగు చేయబడుతున్నది. వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిని నష్టపోతే, కుసుమ మంచి ప్రత్యూమ్నాయ పంట. కొద్దిపాటి క్షారత్వం గల సమస్యాత్మక భూముల్లో కుసుమను లాభదాయకంగా పండించవచ్చు. అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుసుమను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు.
కుసుమ పంటను యాసంగిలో అక్టోబర్ రెండవ పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.
పంటకాలంలో వాతావరణంలో తక్కువ తేమ మరియు అల్ప ఉష్ణోగ్రతలు పంట ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో ఈ పంట ప్రాచూర్యం పొందింది.
కుసుమను ఏక పంటగా పండించేటప్పుడు ప్రతీసారి ఒకేపొలంలో పండించేకంటే ప్రత్తి లేదా కంది వంటి పంటలతో మార్పిడి చేయడం వల్ల కుసుమను ఆశించే ఎండు తెగులును రాకుండా నివారించుకోవచ్చు. పెసర లాంటి స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల తరువాత కుసుమ వేసుకోవడం లాభదాయకమే. అలాగే కుసుమను శనగ లేదా ధనియాలతో 1:2 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేస్తే అధిక నికర ఆదాయాన్ని పొందవచ్చు.
రకం | పంటకాలం(రోజుల్లో) | దిగుబడి(క్వి/ఎ) | గుణగణాలు |
టి.ఎస్.ఎఫ్.-1 | 125-130 | 6.0-7.0 | తెల్ల పూల రకము. అధిక దిగుబడినిచ్చి ఎండు తెగులును పూర్తిగా మరియు పేనుబంకను కొంత వరకు తట్టుకుంటుంది. |
మంజీర | 115-120 | 4.0-5.0 | పూలు మొదట పసుపుగా ఉండి తరువాత నారంజి రంగుకు మారుతాయి. గింజ తెల్లగా ఉండి 27-30% నూనెను కలిగి వుంటుంది. |
నారి-6 | 130-135 | 5.0-6.0 | ఇది ముళ్ళులేని రకం కావడం వల్ల పంటకోత మరియు నూర్పిడి సులభతరమౌతుంది. పూతను సేకరించుకోవడానికి అనుకూలమైన రకం. |
పి.బి.ఎన్.ఎస్.12 | 130 | 7.0 | నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం |
జె.యస్.ఎఫ్.414 (పూలే కుసుమ) | 135 | 8.0 | నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం |
డి.యస్.హెచ్.-185 | 130 | 7.0-8.0 | ఎండు తెగులును తట్టుకునే సంకర రకం |
నీరు నిలువని, బరువైన తేమను నిల్పుకునే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు మిక్కిలి అనుకూలం. ప్యూజేరియం ఎండుతెగులు ఎక్కువగా ఆశించే అవకాశం వున్నందున ఆమ్లత్వం గల భూములు పనికిరావు. అయితే కొద్దిపాటి క్షారత్వాన్ని కుసుమ పంట తట్టుకుంటుంది.
యాసంగిలో ఏక పంటగా వేసుకునేటప్పుడు నాగలితోగాని, ట్రాక్టరుతో గాని లోతుగా దున్నుకొని, ఆ తురువాత రెండు మూడు సార్లు గుంటకను తోలుకున్నట్లయితే కలుపును నివారించడమే కాకుండా, భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. కుసుమను స్వల్పకాలిక ఖరీఫ్ అవరాల తరువాత వేసుకునేటప్పుడు, ఖరీఫ్ పంటను కోసిన తరువాత పైపైన రెండు సార్లు గుంటకను తొలి కలుపు లేకుండా చూసుకోవాలి.
ఎకరానికి 4 కిలోలు (పూర్తి పంటకు), 1.5 కిలోలు (అంతర పంట) విత్తనాన్ని గొర్రుతో గాని, నాగటి సాళ్ళలో గాని విత్తుకోవచ్చు. విత్తనాన్ని 5 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. నేలలో తేమను బట్టి, విత్తిన లోతును బట్టి 4 నుండి 7 రోజులలో విత్తనం మొలుస్తుంది.
విత్తనం ద్వారా సంక్రమించే అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు భూమిలోని శీలింధ్రాల ద్వారా సంక్రమించే ఎండు తెగులును అరికట్టడానికి విత్తనశుద్ధి అత్యంత అవశ్యకం. 2 గ్రా. కాప్టాన్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ 4 కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి.
వరసల మధ్య 45 సెం.మీలు మరియు వరసలలో మొక్కల మధ్య 20 సెం.మీలు.
వర్షాధారంగా సాగు చేసినప్పుడు కుసుమ పంటకు ఎకరానికి 16 కిలోల నత్రజని మరియు 10 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు అందజేయాలి. నీటి వసతి క్రింద సాగు చేసినప్పుడు, సిఫార్సు చేసిన పోషకాలలో 50% నత్రజని (10-12 కిలోల యూరియా) మరియు మొత్తం భాస్వరంను దుక్కిలో వేతుకోవాలి. మిగితా 50% నత్రజనిని (మరో 10-12 కిలోల యూరియా), 5 వారాల తరువాత మొదటి తడికట్టేప్పుడు పై పాటుగా వేయాలి. భాస్వరాన్ని సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే దానిలోని గంధకం వలన నూనె దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. జీవన ఎరువైన అజోస్పైరిల్లమ్ 25 గ్రా. తో కిలో విత్తనాన్ని శుద్ధి చేసినట్లయితే, ఎకరానికి 8 కిలోల నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. గంధక మూలకాన్ని సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే ఆధిక గింజ దిగుబడి మరియు నూనె శాతాన్ని పొందవచ్చును.
బరువైన నేలల్లో పంటకు నీటి తడి ఇవ్వాల్సిన అవసరం లేదు. తేలిక నేలల్లో ఒకటి, రెండు తడులు అవసరం. రకాన్ని బట్టి మరియు నేలల్లో తేమను బట్టి కుసుమలో పూత 65 నుండి 75 రోజులకు వస్తుంది. వర్షాభావ పరిస్థితులలో కీలక దశలయినటువంటి కాండం సాగే దశ (30-35 రోజుల్లో) లేక పూత దశ (60 నుండి 75 రోజులకు) లలో ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు 40-60% పెరిగే అవకాశం వుంటుంది.
విత్తిన 20-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25 రోజులకు మరియు 40-50 రోజులకు దంతులు తోలి అంతరకృషి చేసుకోవాలి. దీని వలన కలుపును నివారించడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 30% ఎకరాకు నీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి.
కాండం తొలిచే ఈగ: ఈ ఈగ కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి లోపలి భాగాన్ని తినివేయడం వలన మొక్క పై భాగం వడలి ఎండిపోతుంది.
నివారణ: డైమిథోయేట్ 2.0 మి.లీ. నీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
పేనుబంక: కుసుమ పంటకు పోను తాకిడి చాలా ప్రమాదకరమైనది. ఆలస్యంగా విత్తిన పంటలపై ఎక్కువగా ఉంటుంది. ఇది విత్తిన 40-45 రోజుల నుండి పంటను ఆశించి ఒక వారం రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా సంతిని పెంచుకుంటుంది. ఇది ఎక్కువగా లేతగా ఉండే మొవ్వు, చిగుళ్ళు మరియు ఆకు ఆడుగు భాగాలను ఆశించి రసం పీల్చడం వలన మొక్కలు వడలి ఎండిపోతాయి. ముళ్ళులేని కుసుమ రకాలలో పేను తాకిడి ఎక్కువ.
నివారణ: డైమిథోయేట్ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు కుసుమ సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి, ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతాయి.
నివారణ: మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి, మచ్చలు కనిపించగానే ఒకసారి 7 నుండి 10 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారి చేయాలి.
ప్యూజేరియం ఎండుతెగులు: ఒకే పొలంలో ప్రతీసారి కుసుమ వేస్తూ పోతే ఎండు తెగులును కలుగజేసే ప్యూజేరియం అనే శిలీంధ్రం యొక్క ఉధృతి పెరుగుతూపోతుంది. అది కలుగజేసే ఎండుతెగులు వల్ల పాక్షికంగా ఆకులు పసుపు బారి వఢలిపోయి చివరకు మొక్కలు ఎండిపోతాయి.
నివారణ:
చిన్న కమతాలలో సాగు చేసిన కుసుమను రామచిలుకలు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తాయి. ఇవి పంట గింజకట్టే ధశ నుండి ఆశిస్తాయి.
నివారణ: గింజ పక్వమయ్యే 3 వారాలు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో పక్షులను తరిమివేయాలి.
రకాలను బట్టి విత్తిన 115-135 రోజులకు పంట కోతకు వస్తుంది. ఉదయం వేళ్ళల్లో కోయడం వల్ల గింజ రాలడం తక్కువగా ఉండడమే కాకుందా ముళ్ళు మెత్తగా వుంటాయి. మొక్కలను నేల మట్టం వరకు కోసి కట్టలు కట్టి, ఆరబెట్టి కట్టెలతో కెట్టి గాని, ట్రాక్టరుతో తొక్కించి గాని గింజలను వేరు చేసుకోవాలి. తేమ 5-8% వుండేటట్లు చూసుకొని నిల్వ చేసుకేవాలి.
కుసుమ పూతలో ఔషధ గుణాలపై పెరుగుతున్న అవగాహన వల్ల రాబోయే రోజుల్లో పూతకు కూడా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశాలున్నాయి. కుసుమలో పూత విచ్చుకున్న దగ్గర నుండి 15-30 రోజుల తరువాత వడలి ఎండిపోయిన పూతను కోయడం వల్ల ఎకరాకు సుమారు 25 నుండి 45 కిలోల పూత దిగుబడిని సాధించవచ్చును. పంట పక్వానికి వచ్చిన తరువాత పూతను కోయడం వలన గింజ దిగుబడి పై ఎటువంటి ప్రభావం ఉండదు.
కునువు సాగు పరిణామక్రమంలో ఎన్ని అవాంతరాలను ఎదుర్కొన్నా దానికున్న కొన్ని ప్రత్యేకతల వల్ల అనాదిగా వరాధార నల్ల భూముల రైతుల జీవనశైలిలో మమేకమైపోయింది. మన రాష్ట్రంలో కుసుమను రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ మరియు అదిలాబాదు జిల్లాల్లో రబీ పంటగా వరాధార నల్లరేగడి నేలల్లో నిల్వవున్న తేమ ఆధారంగా సాగు చేస్తారు. ఇటీవలి కాలంలో ఆకర్షనీయమైన మార్మెటు రేటు వల్ల కుసుమ సాగుకు సాంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా అపారమైన అవకాశాలున్నాయి. కుసుమ నూనెలో 75-80% వరకు లినోలిక్ ఆమ్లం ఉండటం వల్ల వంట నూనెలన్నింటిలోకి శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. ఊపందుకుంటున్న వంటనూనెల మార్కెట్ దృష్ట్యా, అలాగే కుసుమ పంట ఇతర ఉపయోగాల గురించి పెరుగుతున్న అవగాహన వల్ల మన రాష్ట్రంలో విస్తీర్ణం మరియు ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ఈ ఖరీఫ్ పంటకాలంలో అతివృష్టికి గురైన చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడం సంభవించింది. ఇలాంటి పరిస్థితులలో దెబ్బతిన్న ఖరీఫ్ పంటలను చెరిపివేసి రబీ పంటలను వేసుకునే దిశగా రైతులు యోచిస్తున్నారు. వర్బాధార నల్లరేగడి భూముల్లో నిల్వ ఉన్న తేమ ఆధారంగా సాగు చేసుకోవడానికి కుసుమ ఒక మంచి ప్రత్యా మ్నాయం, కొద్దిపాటి క్షారత్వం గల భూముల్లో కుసుమును లాభదాయకంగా పండించుకోవచ్చు. అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా కుసుమను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు.
కొన్ని కీలకమైన సాగు పద్ధతులను ఆచరించడం ద్వారా కుసుమను లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు. అనువైన అధిక దిగుబడులను ఇచ్చే రకాలను సూచించిన యాజమాన్య పద్దతులనుసరించి సాగు చేయడం ద్వారా కుసుమ దిగుబడులను పెంచే అవకాశం ఉన్నది. వ్యవసాయ పరిశోధనా స్థానం, తాండూరులో 7వ ప్రణాళికా కాలంలో (1989) కుసుమ పంటపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అఖిల భారత నూనెగింజల సమన్వయ పరిశోధనా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మంజీర, సాగర ముత్యాలు మరియు టి.ఎస్.ఎఫ్-1 అనే అధిక దిగుబడుల నిచ్చే రకాలు మన రాష్ట్రంలో సాగుకు విడుదల చేయబడ్డాయి. 2010 సంవత్సరం వ్యవసాయ పరిశోధనా స్థానం, తాండూరుచే విడుదల చేయబడ్డ టి.ఎస్.ఎఫ్-1 రకం అధిక నూనె శాతాన్ని (29%) కలిగి వుండి ఎండుతెగులును నమర్థవంతంగా తట్మకుంటుంది. అలాగే అధిక దిగుబడులను పేనుతాకిడిని తట్టుకునే టి.ఎస్.ఎఫ్-2 రకం చిరుసంచుల పరీక్షలో ఉంది.
టి.ఎస్.ఎఫ్-1, మంజీర, సాగరముత్యాలు (ఎ.పి.ఆర్.ఆర్-3), నారి-6, పి.బి.ఎన్.ఎస్. -12, జె.ఎస్, ఎఫ్-414 (పూలె కుసుమ), డి.ఎస్.హెచ్-185, నారి ఎన్.హెచ్-1 అన్నెగిరి-1.
కుసుమ యాజమాన్యం : కుసుమను సెప్టెంబరు రెండవ పక్షం నుండి అక్టోబరు మొదటి పక్షం వరకు విత్తుకోవాలి. పంటకాలంలో వాతావరణంలో తక్కువ తేమ మరియు అల్ప ఉష్ణోగ్రతలు పంట ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఇలాంటి అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో ఈ పంట ప్రాచుర్యం పొందింది.
కుసుమను ఏక పంటగా పండించేటప్పడు ప్రతిసారీ ఒకే పొలంలో పండించే కంటే ప్రత్తి లేదా కందిలాంటి పంటలతో మార్పిడి చేయడం వల్ల కుసుమను ఆశించే ఎండుతెగులు రాకుండా నివారించుకోవచ్చును. పెసర లాంటి స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల తర్వాత కుసుమ వేసుకోవడం లాభదాయకం. అలాగే కుసుమను శనగ లేదా ధనియాలలో 1:2 నిష్పత్తిలో అంతరపంటగా సాగు చేస్తే అధిక నికరాదాయాన్ని పొందవచ్చును.
కుసుమను రెండు రకాల పంటల ప్రణాళికలో పండించుకోవచ్చును. ఏక పంటగా రబీలో వేసుకునేటప్పడు, ఖరీఫ్ కాలంలో పొలాలను బీడు పెట్టకుండా వేసవి దుక్కిచేసి మద్యలో 2 నుండి 3 సార్లు గుంటకలను తోలుకున్నట్లయితే కలుపును నివారించుకోవడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చును. కుసుమను స్వల్పకాలిక ఖరీఫ్ అపరాలు (ఉదా|| పెసలు) తర్వాత వేసుకోవాలను కున్నట్లయితే ఖరీఫ్ పంటను కోసిన తర్వాత పైపైన రెండుసార్లు గుంటక తోలి కలుపు లేకుండా చేసుకొని కుసుమను విత్తుకోవాలి.
ఎకరానికి 4 కిలోలు (పూర్తి పంటకు), 1.5 కిలోలు (అంతర పంటకు) గొర్రుతోగాని, నాగటి సాళ్ళలో గాని వితుకోవచ్చును. విత్తనాన్ని 5 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. విత్తనం ఎక్కువ లోతులో పడితే మొలక శాతం తగ్గుతుంది. నేలలో తేమను బట్టి అలాగే విత్తిన లోతునుబట్టి 4 నుండి 7 రోజులలో విత్తనం మొలకెత్తుతుంది.
విత్తనం ద్వారా సంక్రమించే ఆల్టర్నేరియూ ఆకుమచ్చ తెగులు, తుప్ప తెగులు మరియు భూమిలోని శిలీంద్రముల ద్వారా సంక్రమించే ఎండు తెగుళ్ళను ఆరికట్టడానికి విత్తనశుద్ధి అత్యంత అవశ్యకము. 3 గ్రా, దైరామ్ లేదా కాప్లాన్ లేదా 1 గ్రా. కార్బెండాజిమ్ కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి.
వరుసల మద్య 45 సెం.మీ.లు మరియు వరుసలలో మొక్కల మద్య 20 సెం.మీ.లు ఉండునట్లుగా విత్తుకోవాలి.
వర్బాధారపు పంటకు ఎకరానికి 16 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, విత్తనంతోపాటు దుక్కిలో వేసుకోవాలి. నీటి వసతి క్రింద కుసుమను సాగు చేసుకున్నట్లయితే, సిఫారసు చేసిన నత్రజనిలో 50% నత్రజనిని మరియు పూర్తి భాస్వరమును దుక్మిలో వేసుకోవాలి. మిగతా 50 శాతం నత్రజనిని 5 వారాల తర్వాత మొదటి తడి కట్టేటప్పడు పైపాటుగా వేసుకోవాలి.
భాస్వరము సింగిల్ సూపర్ పాస్పేటు రూపంలో వేసినట్లయితే దానిలోని గంధకము వలన నూనె దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. జీవన ఎరువైన అజోస్పైరిల్లమ్ 25 గ్రా. తో ఒక కిలో విత్తనాన్ని శుద్ధి చేసినట్లయితే, ఎకరాకు 8 కిలోల నత్రజనిని ఆదా చేసుకోవచ్చును. బరువైన నేలల్లో పంటకు నీటి తడి ఇవ్వవలసిన అవసరం లేదు. తేలిక నేలల్లో ఒకటి, రెండు నీటి తడులు అవసరం. రకాన్ని బట్టి మరియు నేలలో తేమను బట్టి కుసుమలో పూత 65 నుండి 75 రోజులలో వస్తుంది. వరాభావ పరిస్థితులలో కీలక దశలయినటువంటి కాండం సాగేదశ (30 నుండి 35 రోజులకు) లేక పూత దశ (65 నుండి 75 రోజులకు) లలో ఒక తడి కట్టెనట్లయితే దిగుబడులు 40 నుండి 60 శాతం పెరిగే అవకాశం ఉంటుంది. విత్తనం వేయకముందు పూక్టోరాలిన్ 1 కిలో మూల పదార్థంగా గల మందును 1 పెూ, భూమిలో కలియబెట్టడం వలన ముందుగా వచ్చే కలుపు ఉదృతిని తగ్గించుకోవచ్చును. విత్తిన 20 నుండి 85 రోజుల వరకు కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
కుసుమ విత్తిన 25 రోజులకు ఒకసారి మరియు 45 నుండి 50 రోజులకు మరియొక సారి దంతెలు తోలి అంతరకృషి చేసుకోవాలి. దీని వలన కలుపును నివారించడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చును. రకాలను బట్టి విత్తిన 115 నుండి 135 రోజులకు పంట కోతకు వస్తుంది. ఉదయం వేళల్లో కోయడం వల్ల గింజ రాలడం తక్కువగా ఉండడమే కాకుండా ముళ్ళు మెత్తగా వుంటాయి. మొక్కలను మొదటి వరకు కోళ్లి కట్టలు కట్టె, ఆరబెట్టి కట్టెలతో కొట్టిగాని, ట్రాక్టరుతో తోక్కించిగాని గింజలను వేరు చేసుకోవాలి. తేమ 5 నుండి 8 శాతం ఉండేటట్లు చూసుకొని నిల్వ చేసుకోవాలి.
కుసుమ పంట నూర్పిడి ఇలా సాధారణ పద్దతిలోనే కాకుండా, యంత్రాల ద్వారా కూడా సుళువుగా చేసుకోవచ్చు. సాదారణంగా వరి కోతకు ఉపయోగించే యాంత్రాల (కంబైన్స్ హర్వేస్టర్) తో కుసుమ కోత, నూర్పిడి ఏక కాలంలో చేయవచ్చు. ఇందుకు గాను వరికోత యంత్రంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు. దీని వల్ల పెట్టుబడి ఖర్చులు, సమయం ఆదా అవుతాయి.
కుసుమ పంట తక్కువ నీటి లభ్యత లాంటి ప్రతికూల పరిస్థితులలో ఇతర రబీ పంటలతో పోలిస్తే అత్యంత లాభదాయకమైన పంట. ఊరికి దూరంగా అటవి భూముల పరిసరాల్లో అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కుసుమ అత్యుతమమైన పంట. కుసుమ పంట తక్కువ పెట్టుబడితో తేలికగా సాగు చేసుకోదగ్గ నమ్మకమైన దిగుబడులనిచ్చే పంట. గరిష్టంగా ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ళ దిగుబడినిచ్చే అవకాశం వున్నప్పటికి నేలస్వభావం, సాగులో వున్న రకం/హైబ్రిడ్, సాగునీటి లభ్యత, రైతు (ඊසූ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఎకరాకు దాదాపు 4 నుండి 8 క్వి వరకు దిగుబడిని సాధించవచ్చు. ఎకరాకు దాదాపు రూ. 5000 పెట్టుబడితో సాంద్ర యాజమాన్య పద్దతులను ఆచరించడం ద్వారా దాదాపు 5 క్వింటాళ్ళ కనీస దిగుబడులను సాధించి ఎకరాకు సుమారు రూ. 10,000 వరకు నికరాదాయాన్ని కుసుమ పంట ద్వారా రైతులు పొందే అవకాశం ఉంది. (క్వి మార్కెటు రేటు సుమారు రూ. 3000).
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021